ఉన్న దానిలో తృప్తి
- Gadwala Somanna
- Sep 23
- 2 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #UnnadaniloTrupthi, #ఉన్నదానిలోతృప్తి, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 124
Unnadanilo Trupthi - Somanna Gari Kavithalu Part 124 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 23/09/2025
ఉన్నదానిలో తృప్తి - సోమన్న గారి కవితలు పార్ట్ 124 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
ఉన్న దానిలో తృప్తి
-------------------------------------------
లేని దాని కోసము
వద్దోయ్! ఆరాటము
కల్గిన దానిలోనే
ఉందోయ్! సంతోషము
గొప్పలకై అప్పులు
ఎప్పుడు చేయరాదు
బ్రతుకులోన తిప్పలు
కొనితెచ్చుకోరాదు
బీదలకు చేయూత
చేయాలి ఒక్కింత
కన్నోళ్ల విషయంలో
మరువవద్దు బాధ్యత
ఆనాథుల సేవలో
దీవెనలే అమితము
మహాత్ముల త్రోవలో
దొరుకును ఆదర్శము

పొత్తం చెప్పిన సత్యాలు
---------------------------------------
పెంచుకోకు ద్వేషము
అగును చివరికి విషము
ప్రేమ గుణం శ్రేష్టము
కల్గియున్న క్షేమము
శత్రుత్వమే చేటు
బంధాలపై వేటు
క్షమాగుణమే ఘనము
అక్షరాలది నిజము
లేకుంటే విలువలు
శవంతో సమానము
అవి ఉంటే బ్రతుకులు
దేదీప్యమానము
స్నేహమనే బంధము
అత్యంత పవిత్రము
మరువకు జీవితాన
గుర్తించుము సతతము

అక్షర సత్యము
--------------------------------------
భగవంతుని భక్తితో
శుద్ధమైన మనసుతో
కొలుస్తేనే దీవెన
అభివృద్ధికి వంతెన
దేవుడే ఉన్నతుడు
సృష్టి, లయ కారుడు
సర్వశక్తిమంతుడు
నిజముగా శ్రీమంతుడు
శరణన్న భక్తులకు
ఆపద్భాంధవుడు
గుండె గుడిని చేస్తే
నివసించే దేవుడు
దైవానికి నిత్యము
లోబడితే శుభములు
ఇది అక్షర సత్యము
బాగుపడును బ్రతుకులు

ఉంటుందోయ్! స్నేహం
-----------------------------------------
వెన్నంటే నీడలా
మమకారపు మేడలా
ఉంటుందోయ్! ఘన స్నేహం
ఉల్లాసపు ఓడలా
కష్టాల్లో తోడుగా
సముద్రపు ఒడ్డుగా
ఉంటుందోయ్! ఘన స్నేహం
నావ నడిపే తెడ్డుగా
ఉదయించే సూర్యునిలా
అనురాగ దీపంలా
ఉంటుందోయ్! ఘన స్నేహం
తల మీద మకుటంలా
ఆదరించే అమ్మలా
ఆనందపు కొమ్మలా
ఉంటుందోయ్! ఘన స్నేహం
బంగారపు బొమ్మలా
దరి చేర్చే నావలా
బ్రతుకులో దిక్సూచిలా
ఉంటుందోయ్! ఘన స్నేహం
కరమున దుడ్డు కర్రలా
పసిపిల్లల పలుకుల్లా
పరిమళించు పుష్పంలా
ఉంటుందోయ్! ఘన స్నేహం
ముఖంలో చిరునవ్వులా

మిఠాయి పొట్లం ఓ తీపి జ్ఞాపకం
---------------------------------
నాన్న ఇచ్చెను రూపాయి
సంతసించెను పాపాయి
కరమున ఉన్నది మిఠాయి
లాగు చున్నది మనసోయి
చిటారు కొమ్మున ఉన్నది
తీయని మిఠాయి పొట్లం
అందరికి తెలుసు అర్ధం
తేనె పట్టు అనే నిజం
మిఠాయి పొట్లం ఇష్టము
అర్రులు చాచును హృదయము
చూడంగా నోరూరు
తృప్తి తినిన ఓమారు
అమ్మ తెచ్చే పొట్లాలు
అలనాటి జ్ఞాపకాలు
నేటికీ సజీవమే
చిన్ననాటి ఆ దృశ్యం
రకరకాల పొట్లాలు
వాటి కొరకు పేచీలు
అమ్మ సర్దు విధానం
అందుంది సమన్యాయం
'మిఠాయి పొట్లం' పొత్తం
నాకెంతో ప్రియం ప్రియం
బాల్య స్మృతులకు ప్రతీక
మరుపురాని ఓ జ్ఞాపిక
-గద్వాల సోమన్న
Comments