ఉన్నదున్నట్లుగా.. కళ్ళకు కట్టినట్లుగా..
- Pandranki Subramani
- Jun 13
- 4 min read
#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #UnnadunnatlugaKallakuKattinatluga, #ఉన్నదున్నట్లుగాకళ్ళకుకట్టినట్లుగా, #TeluguMoralStories, #నీతికథలు

Unnadunnatluga Kallaku Kattinatluga - New Telugu Story Written By Pandranki Subramani
Published In manatelugukathalu.com On 13/06/2025
ఉన్నదున్నట్లుగా కళ్ళకు కట్టినట్లుగా - తెలుగు కథ
రచన: పాండ్రంకి సుబ్రమణి
ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అన్ని సందర్భాలలో కాకపోయినా కొన్ని సమయాలలో మానవ నైజం యెంత విచిత్రంగా యెంత విడ్డూరంగా పరిణమిస్తుందంటే— దారి తప్పిన వాహనంలా లయ తప్పిన సంగీత స్వరంలా తనకు తానుగా తల క్రిందులయిపో తుంటుంది. నిన్న మొన్నటి వరకూ మనతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన స్నేహితుల్నే పోల్చుకోలేకుండా కళ్ళు మిటకరిస్తూ నిల్చుండిపో తుంటాం. చెట్టు రెమ్మల్ని దులిపినట్లు మనల్ని అటూ యిటూ ఆడిస్తే గాని తాడిస్తే గాని ఆనవాలు గుర్తు పెట్టలేకపోతుంటాం.
కాదనలేని ముఖం దాచుకోలేని హైలీ యంబర్రాసింగ్ సిట్వేషనే-- అటువంటి ఇబ్బందికర పరిస్థితిలో మనల్ని మనం యెలా సమర్థించు కోవాలో తెలియక నీళ్ళు నములుతాం. ఏదో మాటలకందని అపరాధ భావానికి లోనవుతుంటాం. ముందే నుడివినట్లు, ఇటువంటి క్లిష్ట పరిస్థితి అందరి విషయంలో కాకపోయినా కొందరి విషయంలో అడపాతడపా జరుగుతూనే ఉంటుంది. నా విషయంలో జరిగింది. రెండు మూడు సార్లు జరిగింది-
అదెలాగంటే— ఒకసారి బల్కం పేట నడి రోడ్డు సందున నిల్చున్నప్పుడు; మా ఆవిడ తమలపాకులూ వక్కపొడీ కొనుక్కోవడానికి రోడ్డు మలుపు వద్ద ఆగిపోయినప్పుడు నేను ముందుకు కదలకుండా ఉన్నచోటి ఉన్నట్లు నిల్చుండి పోయాను. అప్పుడు నా కళ్లబడింది మిలమిల మెరుస్తూన్న ఏదో వస్తువు. అది చాక్లెట్ రేపరా లేక లోహపు వస్తువా తేల్చుకోలేక కళ్ళు మిటకరిస్తూ నిల్చున్నాను. అప్పుడు కొనుగోలు వ్యవహారం ముగించుకుని నా వద్దకు చేరిన మా ఆవిడ- నా వాలకం గమనించి అడిగింది- “అదేమిటి అంతలావు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నారు పాము తోకను గమనిస్తున్నట్లు? చెప్పండి— నేనూ చూస్తాను”
ఆ మాటకు నేను తేరుకుంటూ బదులిచ్చాను-- “అబ్బే— మరేమీ కాదోయ్! అక్కడ బంగారు రంగులో మెరుస్తుంటేను— అదేమిటో చూస్తున్నాను. చాక్లెట్ రేపరేమో అనుకుంటున్నాను”
ఆమె వెంటనే అడిగింది అదేదో చూపించమని. నేను చూపుడు వ్రేలుతో చూపించాను. ఆమె మరు పలుక్కి తావులేకుండా అటు దూసుకు వెళ్ళి – “ఇది రేపర్ కాదండీ— గోల్డ్ చైన్— ఏది కాదో ఏది ఔనో తెలుసుకోవాలంటే దగ్గరకు వెళితే కదా తెలిసేది! అలా దూరం నుంచి ఫోకస్ చేస్తూ నిల్చుంటే యెలా--”
నేను అమితాశ్చర్యంతో - “బంగారు గొలుసా!” అని నోరు తెరిచేలోపల అక్కడకు బల్కంపేట స్త్రీల గుంపొకటి పొలోమని దూసుకు వచ్చి ఆతృతగా అడిగింది- “ఇక్కడ పిల్లలతో ఆడుకుంటూ మా పాప గొలుసు పారేసుకుంది. చూసారా!”
దానికి ప్రత్యుత్తరంగా మా ఆవిడ అడిగింది— “వెండి గొలుసా? ” అని.
వాళ్ళు కాదంటూ బంగారు గొలుసని బదులిచ్చారు. తక్షణం మా ఆవిడ వాళ్ళ చేతుల్లో మాకు కనిపించిన బంగారు గొలుసుని పెట్టింది. దానితో బంగారు గొలుసు కథ సుఖాంతం--
ఇక రెండవది- నన్ను మాత్రమే కాక- ఎదుటి వారిని సహితం అమితంగా తికమక పెట్టిన ఉదంతం..
నేను నా బ్యాంక్ పాస్ బుక్కుని క్రమబధ్ధంగా వారానికొకసారి అప్డేట్ చేసుకునే అలవాటు నాకు ఆదినుంచీ ఉంది. ఆ తీరున నేను ఆ రోజు ఉదయం వెళ్ళి బ్యాంకు ప్రింటింగ్ మిషన్ ద్వారా పాస్ బుక్కుని తాజా ఎంట్రీలతో నవ్యీకరించుకున్నాను. లావాదేవీలతో పూర్తయిన పాస్ బుక్కుని ఓసారి పరీక్షగా చూస్తే— గుండె కాదు- కళ్లు గుభేలుమన్నాయి. నా ప్రమేయం లేకుండానే ఒక ఎంట్రీ కనిపించింది- రూ—849- మరింతలోతుగా చూస్తే తెలిసింది ఆ సొమ్ముకి యెదురుగా తిరుమల తిరుపతి దేవస్థానం అని ప్రింటయి ఉంది.
అది చూసి ఒక్క క్షణం ఆగలేకపోయాను. వెంటనే దూసుకు వెళ్ళాను బ్రాంచ్ మేనేజర్(ఆపరేషన్స్)వద్దకు— ఆయన వేపు సూటిగా చూపులు సారిస్తూ అడిగాను- “చూడండి సార్! నా అకౌంటు నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళం వెళ్ళడంలో నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే— అలాగ్గాని విరాళం తితి దేవస్థానం వారికి చేరివుంటే నావరకది పుణ్య ప్రదమే!
కాని— హార్ట్ ఆఫ్ ది మేటర్ యేమంటే— నేనుగా ఆ విరాళం చెక్కు రూపంలో ఇవ్వనిదే అదెలా వెళ్ళింది? నేనేమైనా స్టాండింగ్ ఇన్ స్ట్రక్షన్స్(standing instructions ) ఇచ్చి ఉన్నానా— నేను చెప్పినా చెప్పకపోయినా ప్రతి నెలా విరాళం తితి దేవస్థానం వారికి పంపుతూ ఉండవచ్చని— లేదు కదా! మరి— నాకు తెలియకుండా 849 రూపాయలు నా అకౌంట్ నుండి యెలా వెళ్ళాయి?”
ఆయన కూడా నాలాగే బిత్తరపోతూ చూసి- “నాకు కొంచెం టైమివ్వండి – చూసి చెప్తాను” అంటూ ఆసాంతమూ పరీక్షగా చూసి, సిస్టమ్ ని జల్లెడ పట్టి- చెదరని చిర్నవ్వుతో అన్నారు- “ఔను. మీరు కరెక్ట్! మీరు పంపలేదు! ” ఆ మాట విన్నంతనే నేను పుంజుకున్నాను- “నేను ముందే చెప్పాను కదండీ! నేను పంపలేదని--”
“కంగారు పడకండి. నేను ముందే చెప్పాను కదా- మీరు యెటువంటి సొమ్మూ పంపలేదని— కాని— ఇక్కడి హార్ట్ ఆఫ్ దీ మేటర్ యేమంటే అదే సొమ్మును తితి దేవస్థానం వారు మీకు పంపారు. “
ఈ సారి ఖంగుతిన్నడం నావంతయింది- “తితివారు నాకు పంపారా!” కళ్ళు మిటకరించి చూస్తూ అడిగాను.
“ఔను. తితి దేవస్థానం వారే మీకు పంపారు. పాస్ బుక్కులో ఓవర్ ప్రింటింగ్ చోటు చేసుకోవడం వలన మీకది డెబిట్ ఎంట్రీగా కనిపించి ఉంటుంది! “
నాకు నోట మాట రాక ఆశ్చర్యాంబుదిలో మునిగిపోయాను. రిటైర్ కాబోతున్న వాడికి ఈ అగ్ని పరిక్షేమిటి? వేంకటేశ్వరస్వామి వారి ధర్మస్థలం నాకు డబ్బులు పంపడం యేమిటి! కళ్ళు మిటకరిస్తూ తలపైకెత్తి చూసాను. బ్రాంచ్ మేనేజర్ వెనుక గోడపైన వేంకటేశ్వర స్వామి చిత్రపటం నవ్వుతూ పలకరిస్తూంది.
“నీకు నువ్వు గడబిడ పడ్తూ యెదుటి వారిని సహితం గడబిడ పెడ్తూ ఉండకుండా శాంతంగా ఆలోచించ వోయ్! ” అని హెచ్చరిస్తున్నట్లుంది. అప్పుడు మెదడు మూలన అసలు విషయం తళుక్కున మెరిసింది. ఆ సొమ్ము మరెవ్వరో కాదు- రెండు నెలలకు ముందు నేను వ్రాసిన శీర్షికకు పారీతోషకంగా సప్త గిరి మాస పత్రికవారు నాకు పంపిన సొమ్ము. పేమెంట్ వివరాలలో సప్తగిరి మాస పత్రిక పేరు లేకుండా తితి దేవస్థానం వారి పేరు మాత్రమే ఉండటాన తికమక పడ్డాను. సాహిత్యాభిమానులైన మిమ్మల్ని కూడా తికమక పెట్టాసేనేమో! టీ-కప్పులో పెను తుఫానంటారు ఇందుకేగా!
శుభం
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

Komentarze