top of page
Original.png

ఉత్సవం రోజు



Utsavam Roju - Telugu Moral Story | Malla Karunya Kumar

ఉత్సవం రోజు - తెలుగు నీతి కథ

Published In manatelugukathalu.com On 18/03/2026


రచన: మళ్ళ కారుణ్య కుమార్


ఇంటికి చేరుకున్న భర్త వైపు చూస్తూ, “ఇంతకీ ఏమన్నాడు ఆ సంపంగి బాబు?” సందిగ్ధంగానే అడిగింది జానకి.


సంతోషం ఇంకిపోయిన ముఖంతో భార్య వైపు చూస్తూ, సమాధానం చెప్పకుండా నిట్టూర్చుతూ మంచంపై కూలబడ్డాడు.


"ఆధారాలన్నీ వాళ్ల వైపే ఉన్నాయి అంటున్నాడు. వాడు చెప్పిన విధంగా చేయడం తప్పించి, మనకు దారేం లేదని తాటించి చెప్పాడు." భారంగా మాటలు పెదాలను దాటాయి.


"మనకున్న ఆధారం ఆ రెండెకరాలే కదయ్యా. అది పోతే మన బిడ్డల భవిష్యత్తు ఏమిటి? ఆడపిల్ల ఉంది. దాని పెళ్లికి కూడా ఆ భూమే ఆధారమని మనం ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు ఉన్నపళంగా పిడుగుపాటులా వీళ్లు వచ్చారు! అయినా మామయ్య ఆ భూమిని మీ పెద్దనాన్న దగ్గర కొన్నారు కదా. ఆ కాగితాలు కూడా ఉన్నాయి కదా." కాస్త ధైర్యంగానే పలికింది జానకి.


"నీకు తెలియంది ఏముంది? ఆ సంపంగి బాబు బమ్మిని తిమ్మిని, తిమ్మిని బమ్మిని చేసే ఊసరవెల్లి. ఆ కాగితాలు చెల్లవు అంటున్నాడు." దుఃఖం దిగమింగుకుని మాట పూర్తి చేశాడు.


"ఇన్నాళ్లుగా మనం ఆ భూమిని చదును చేస్తున్నాం కదయ్యా? సాగు హక్కు మనకు ఉంటుంది కదా!" చట్టం ఆసరాగా ఉంటుందని ఆమె భరోసా.


"ఆవేశంతో వాడి దగ్గర ఇలానే అన్నాను. కానీ వికృతంగా నవ్వి, 'నా మాట కాదని నీకు సాక్ష్యం ఎవడు చెప్తాడో చూస్తాను. కోర్టుకి కావాల్సింది సాక్ష్యం సుబ్బయ్య!' కఠోరంగా పలికాడు వాడు. అంతా దిక్కుతోచని స్థితి!" నిరాశలో చిక్కుకొని అన్నాడు సుబ్బయ్య.


ఈ మాట విని ఏం మాట్లాడాలో తెలియక మౌనం వహించింది జానకి. రాయిలా నిలబడిన భార్య వైపు చూస్తూ, "పేరు, పలుకుబడి ఉన్నవాడికి ఎదురెళ్లడం చాలా కష్టం జానకి. వాడు ఏమైనా చేయగల సమర్థుడు. ప్రాణం తీస్తాడు, వీడి భూమిని వాడికి, వాడి భూమిని వీడికి మారుస్తాడు కూడా. మనలాంటి వాళ్లు తోలుబొమ్మల్లా తలాడించడం తప్పించి చేసేది ఏముంది?" కన్నీటిపర్యంతం అయ్యాడు సుబ్బయ్య.


సుబ్బయ్య మాటలు విని, ఎదుర్కోలేని సమస్యను తలచుకుంటూ కుమిలిపోయింది, కోపంతో, "ఎప్పుడూ ఆ అమ్మవారి పూజలోనే ఉంటారు. మీకు కూడా అన్యాయం చేయాలని ఎలా చూస్తాడు ఆ సంపంగి బాబు? మన ఉసురు తగలదా? ఆ తల్లి చూస్తూ ఊరుకుంటుందా? ఇన్ని ఆగడాలు చేస్తూ, అందరినీ ఇబ్బందికి గురి చేస్తున్న వాడికి ఏ గండం రాదా? మన బ్రతుకుల్ని కూలదోయడానికి చూస్తున్న వాడికి ఏ ముప్పు రాదా?" బాధపడుతూ అక్కడే కూలబడింది.


"ఇది కలికాలం కదా జానకి. అలాంటి వాళ్లకు అడ్డు చెప్పేవారే లేరు. ఆ దేవత కూడా అలానే చూస్తూ ఉంటుంది." అంత బాధలో ఉన్నా వేదాంత ధోరణిలో పలికాడు సుబ్బయ్య.


"వాడి మాటకు ఎవరూ కూడా ఎదురు చెప్పరు. ఏ లోకంలో ఉన్నామయ్యా మనం? మనుషులంటే ఆపద సమయంలో ఒకర్నొకరు ఆదుకోవాలి కదా, అన్యాయం జరిగితే నిలదీయాలి కదా! రేపు పొద్దున్న వాళ్లకు కూడా ఇలా జరగదని నమ్మకం ఏమిటి? అప్పుడు ఎవరి కాళ్లు పట్టుకుంటారు?" దుఃఖంతో నిండిన మాటలు ఆమె గొంతు దాటాయి.


"వాళ్లవి కూడా మనలాంటి బ్రతుకులే కదా జానకి. ప్రాణం అంటే తీపి ఎవరికి ఉండదు? ఆ దుష్టుడికి భయపడి ఎవరూ ముందుకు అడుగు వేయడం లేదు. జరిగేది ఏదో జరుగుతుంది. ఆ మానవత్వం లేని వాడితో పెట్టుకుని మనం నెగ్గుకు రాలేం. ఆ భూమి వాడి మొంపరాన పెట్టి, మనం ఈ ఊరు విడిచి వెళ్ళిపోదాం. బ్రతుకు అంటావా, ఒంట్లో ఓపిక ఉంది కదా, ఎక్కడో కాయకష్టం చేసుకుందాం." బరువైన గొంతుతో పలికాడు.


భర్త మాటకు మరో మాట మాట్లాడలేక పోయింది.


ఇంతలోనే బయట నుండి ఎవరో పిలుస్తున్నట్టుగా వినిపించడంతో వేగంగా బయటకు వెళ్ళాడు సుబ్బయ్య. సుబ్బయ్య వెంట నడిచింది జానకి.


వెలిగిపోతున్న ముఖంతో పళ్లు బయటకు పెడుతూ,


"ఓ సుబ్బన్న! ఈ ఏడు కూడా అమ్మవారి ఉత్సవం చేయడానికి అందరం నిర్ణయించుకున్నాం. వచ్చే మంగళవారమే ఉత్సవం. నువ్వు వేషం కట్టడానికి రెడీ అయిపో." చెప్పాడు ధర్మారావు.


"అదేంటి రా, ఊరిలో ఇప్పటి వరకు ఈ మాటే ప్రస్తావనలో లేదు, మీటింగ్ లేదు. ఎవరు చెప్పారు రా?" ఆశ్చర్యంతో అడిగాడు సుబ్బయ్య.


"మీటింగ్ ఎందుకు సుబ్బయ్య? ప్రెసిడెంట్ మాటే కదా ఫైనల్!" ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ధర్మారావు.


"అదేంటిరా అంత మాట అనేశావు? ఊరిలో చందాలు దండడం లేదా?"


"ఎందుకు తీసుకోరు? ఇంటిని బట్టి తలో ఇంతా అని చిట్టా తయారు చేసేశారు. నేడో రేపో కలెక్షన్ కూడా అయిపోతుంది."


"అదేంటి, అంతా ప్రెసిడెంట్ ఇష్టం మీదే జరుగుతుంది. పోయిన ఏడాది వరకు మీటింగ్‌లు పెట్టి ప్రజల నిర్ణయం కూడా తీసుకున్నారు కదా!"


"ప్రతి ఏడాది జరిగే దానికి మీటింగ్ ఎందుకు సుబ్బన్న?


ప్రెసిడెంట్ మాటే కదా ఈ ఊరి మాట. సరే, కానీ నువ్వు మాత్రం ఈసారి అదరగొట్టాలి." నవ్వుతూ అన్నాడు ధర్మారావు.


"ధర్మ! ఈ ఏడాది నేను వేషం కట్టలేనురా, వేరే ఎవరినో చూసుకోండి." తన నిర్ణయం చెప్పాడు సుబ్బయ్య.


తుళ్ళిపడుతూ, "ఏంటి సుబ్బన్న అంత మాట అనేశావు? నువ్వు వేషం కట్టకపోతే అమ్మోరు కదులుతుందా? సంబరం జరుగుతుందా? పరిహాసం చేయకు సుబ్బన్న. ఎప్పటి నుండో నువ్వే కదా కడుతున్నావు. పైగా నువ్వు కడితే ఆ లెక్కే వేరు." అన్నాడు ధర్మారావు.


"అదంతా నాకు తెలియదు రా. నేను వేషం కట్టను. వేరే వాళ్లను తెచ్చుకోండి. ముందే చెప్తున్నాను." అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు సుబ్బయ్య.


అంతకు ముందు వరకు ఉత్సవం జరుగుతుందన్న ఆనందంలో ఉన్న ధర్మారావు సుబ్బయ్య నిర్ణయంతో నిరాశలో కూరుకుపోయాడు.


ఒక్క ఉదుటున సంపంగి బాబు దగ్గరకు చేరుకొని, "అయ్యా! ఉత్సవం జరిగేట్టుగా లేదయ్య. సుబ్బన్న వేషం కట్టనంటున్నాడు." అని నిట్టూర్చాడు ధర్మారావు.


సుబ్బన్న వేషం ఎందుకు కట్టను అన్నాడో సంపంగి బాబుకు బాగా అర్థమైంది.


'జరిగిందంతా మనసులో పెట్టుకొని ఇలా మొండికేస్తున్నాడు. వీడిని ఇలా విడిచిపెట్టకూడదు.' అని తనలో అనుకుంటున్నాడు.


"అయ్యా! సుబ్బన్న లేకుంటే అమ్మోరు కూడా రాదని జనాలు నమ్మకం. సుబ్బన్న లేకపోతే గోల చేస్తారు." గుండెలు బాదుకున్నాడు ధర్మారావు.


"ధర్మ! ఎందుకు అనవసరంగా గోల చేస్తున్నావు? నేను ఉన్నాను కదా. సుబ్బయ్యతో మాట్లాడి, వేషం వేయడానికి ఒప్పిస్తాను." అని చెప్పి శరవేగంగా అక్కడ నుండి కదిలి సుబ్బయ్య ఇంటి ముందు వాలాడు.


మోటారు బండి శబ్దం తన ఇంటి ముందు వినిపించడంతో వేగంగా ఇంటి బయటకు వచ్చాడు సుబ్బయ్య. వచ్చింది సంపంగి బాబు అని తెలిసి కూడా ఏం మాట్లాడకుండా నిల్చున్నాడు.


"సుబ్బయ్య! ఏంటి వేషం కట్టనన్నావు అంట? నా మాట కాదని ఈ ఊరిలో నువ్వు ఉండగలవా? గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోకు. అసలే పిల్లలు ఉన్నారు. ఇవన్నీ అవసరమా, చెప్పు!" సుతిమెత్తగా బెదిరించాడు.


అప్పటికి కూడా మౌనంగానే ఉన్నాడు సుబ్బయ్య.


సుబ్బయ్య వైపు చూస్తూ, "చూడు సుబ్బయ్య! నీ మొండితనం నీకే మంచిది కాదు. అనవసరంగా నాకు కోపం తెప్పించకు. ఇంత చెప్పినా కూడా ఇంకా వేషం కట్టను అని నీ నిర్ణయం అయితే అలాగే కానివ్వు." ఉరుముతూ అన్నాడు సంపంగి.


సంపంగి బాబు మాటలు పక్కనే ఉండి వింటున్నది జానకి. వేగంగా అక్కడికి చేరుకొని, "బాబు, అతను వేషం కడతారు. నేను చెప్తాను." అని చేతులు జోడిస్తూ అంది జానకి.


ఆమె వైపు ఎగాదిగా చూస్తూ అక్కడి నుండి నషాళానికి ఎక్కిన కోపంతో వెళ్ళిపోయాడు సంపంగి బాబు. సంపంగి బాబు వెళ్లిపోయిన తర్వాత, "అయ్యా, నువ్వు మాకు ముఖ్యం. నువ్వే చెప్పావు కదా వాడితో పెట్టుకోకూడదని. ఇప్పుడు మనకు ఎందుకు ఈ గొడవ? ఆ వేషం ఏదో కట్టేయి. తర్వాత మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం." చెమర్చిన తన కళ్లను చీర కొంగుతో ఒత్తుకుంటూ భర్తకు సర్ది చెప్పింది జానకి.

                    ******

ఉత్సవానికి ఏర్పాట్లు మొదలవుతున్నాయి. ఊరంతా విద్యుత్ అలంకరణలతో మెరిసిపోతుంది.


ప్రతి ఇంటి ముందు కోడో, మేకో తాహతుకు తగ్గట్టు అమ్మవారి మొక్కు కోసం పెంచబడుతున్నాయి.


దూర దేశంలో ఉండి కాయకష్టం చేసే యువత, అత్తింటికి వెళ్ళిన ఆడపిల్లల రాకతో ఊరు కళకళలాడుతుంది.


ఉత్సవం రోజు దగ్గర పడింది. నూతన నృత్యాలు, సంప్రదాయ నృత్యాల ప్రదర్శన మొదలైంది. భక్తితో కొందరు, ఉత్సాహంతో కొందరు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఉత్సవం చివరి రోజుకు చేరుకుంది. అన్ని రోజుల కంటే చివరి రోజే ముఖ్యం. ఎందుకంటే బారులు తీరిన కోడిపుంజులను, మేకలను మొక్కులుగా చెల్లించుకుంటారు. మిగతా రోజుల కంటే ఊరంతా కోలాహలంగా ఉంటుంది.


ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వేషం ధరించాడు సుబ్బయ్య. కానీ ఈసారి తన మనస్సు మనస్సులో లేదు. హృదయం అంతా భారంగా ఉంది.


"అన్న! ఏమైంది ఈ ఏడు? నువ్వు చాలా దిగులుగా ఉన్నావు. ఆరోగ్యం బాగుంది కదా?" సుబ్బయ్యకు సహాయకుడైన రంగడు వేషం దుస్తులు తీస్తూ అడిగాడు.


తన పరిస్థితి వివరించినా వినేవాడు, ఒకవేళ విన్నా తనకు సహాయంగా ఉండేవాడు లేడు. తనలో తన బాధని సమాధి చేయాలని నిర్ణయం తీసుకొని, "నేను బాగానే ఉన్నాను. ముందు పని చూడు." అని సుబ్బయ్య అనడంతో ఆ విషయం అక్కడితో ఆపేసి, దుస్తులు సరి చేసి సుబ్బయ్యకు ఇచ్చాడు. వాటిని అందుకొని కళ్లకు అద్దుకుని, మనసులో అమ్మవారిని తలచుకొని వాటిని తొడుక్కోవడానికి సిద్ధమయ్యాడు. ముందుగా నల్లని రంగు ప్యాంటును పోలిన వస్త్రాన్ని ధరించాడు. దానికి సరిపోలిన నల్ల రంగు జాకెట్‌ను ధరించాడు. ఇంతలో రంగయ్య కింద కూర్చుంటూ సుబ్బయ్య కాళ్లను తీసుకొని తన కుడి తొడపై పెడుతూ గజ్జలు కట్టడం పూర్తి చేశాడు. ఆపై నడుము దగ్గర నుండి మోకాళ్ల వరకు వచ్చే మూడు వరుసల కుచ్చులు కలిగిన అలంకరణ వస్త్రాన్ని ధరించాడు సుబ్బయ్య. పైకి చీర అంచులా చేసి ఒక వస్త్రాన్ని కప్పుతూ భుజంపై నుండి సన్నని అంచును జారవిడిచారు. వడ్డాణం, దండకడియాలు, వైగైరా అలంకరణ వస్తువులు ధరించి. ఆ తర్వాత మూరెడు పొడవు ఉన్న సవరాన్ని తలకు అలంకరించుకున్నాడు. తర్వాత ఒక పొడవాటి మడత పెట్టిన వస్త్రాన్ని సుబ్బయ్య నుదుటిపై నుండి తీసుకు వస్తూ తల మొత్తం చుట్టాడు రంగడు. అలంకరణ, వేషధారణ పూర్తయ్యింది. పెద్ద పెద్ద భయంకరమైన కళ్లు, చాచిన నాలుక, వివిధ రకాల అలంకరణతో తయారు చేసిన కాళికాదేవి ముఖాన్ని తీసుకువచ్చి సుబ్బయ్య ముఖానికి పెట్టి అన్నీ సరి చూసి వెనక్కి కట్లు వేశాడు. వెనుక నెమలి పించాలు కట్టిన ఒక అలంకరణ అమర్చారు.


అక్కడ సుబ్బయ్య కనిపించడం లేదు. అలంకరణతో కాళీ మాతే దర్శనం ఇస్తున్నట్టుగా ఉంది. కొత్తగా చేస్తున్నట్టు రంగయ్య రెండు చేతులు జోడించి వేగంగా పక్కనే ఉన్న రెండు పొడవాటి కత్తులను సుబ్బయ్యకు అందించాడు. ఆ రెండు కత్తులను చేబూని సుబ్బయ్య అక్కడ నుండి ముందుకు కదిలాడు. చిన్నపిల్లలు ఆ వేషాన్ని చూసి భయంతో దూరం జరిగారు. కొందరు పిల్లలు సుబ్బయ్య వెనుక తన్మయత్వంతో ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. సుబ్బయ్య రాకను చూసి సింగడు అప్రయత్నంగానే తన సన్నాయిని సరి చేసి సంగీత వరసలు పలికించాడు. పక్కనే ఉన్న ఇంకో మేళగాడు పెద్ద తుడుం కుండను వాయించడం మొదలు పెట్టాడు. దాని నుండి వెలువడే శబ్దాలకు ప్రజల పాదాలు నృత్యం చేస్తున్నాయి. దాని వెనుక చిన్న తుడుం కుండలు మ్రోగడం మొదలైంది. పారవశ్యాన్ని తట్టుకోలేక కొందరు భక్తులకు పూనకాలు కూడా వచ్చాయి. సుబ్బయ్య ముందుకు చేరుకొని వీధి మధ్య నుండి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. మిగిలిన వాళ్లు ఏర్పాట్లు చేసి, పానకం కుండలు, గజముద్దలు పట్టుకొని సిద్ధమయ్యారు.


ముందు వరుసన మేళానికి తగ్గట్టుగా నాట్యం చేస్తూ ముందుకు సాగుతున్నాడు సుబ్బయ్య. స్వయానా ఆ కాళీమాత వచ్చి నృత్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. చేతులెత్తి మొక్కుతూ ముందుకు కదులుతున్నారు జనాలు. వీధుల వెంబడి, సందులను దాటుకుంటూ, మలుపులు తిరుగుతూ ముందుకు సాగుతున్నది ఉత్సవం. సూర్యుడు వీళ్ల సంబరాలు చూసి అలసిపోయి సమయం అయిందని ఇంటికి బయలుదేరాడు. చీకట్లు మెల్లగా ఆవరిస్తున్నాయి!


అస్తమించిన సూర్యుడు మళ్ళీ పడమర ఉదయించాడా అన్నట్టుగా నింగికి ఎగిసిన బాణసంచా వెలుగులు పంచుతున్నాయి. మెల్లగా ముందుకు సాగుతున్నది ఉత్సవం. వీధి వీధి తిరుగుతూ కాస్త అలసట ఆవహించింది సుబ్బయ్యకు. మెల్లగా అడుగులు వేయడం ప్రారంభించాడు. కొంత సమయం అయిన తర్వాత ఉత్సవం అమ్మవారి ఆలయానికి చేరింది. ఆలయం చుట్టూ వేషంతో, మేళతాళాలతో, గజముద్దలతో ప్రదక్షిణ చేశారు. ప్రదక్షిణ పూర్తయిన తర్వాత సుబ్బయ్య నేరుగా ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలానికి చేరుకున్నాడు. మేళం గట్టిగా వాయించడం మొదలు పెట్టారు. సుబ్బయ్య నాట్యం చేయడం మొదలు పెట్టాడు. రెండు అడుగుల దూరంలో అమ్మవారికి మొక్కులు చెల్లించే కార్యక్రమం జరుగుతుంది. సుబ్బయ్య తన నృత్యంలో జోరు పెంచాడు.


చుట్టూ ఊరి పెద్దమనుషులు నిలబడి సుబ్బయ్య నృత్యం చూస్తున్నారు. వెనుక వరుసలో నిలబడి ఉన్న పుర ప్రజలు కేరింతలు కొడుతూ, అరుస్తూ సుబ్బయ్య నృత్యాన్ని ఉత్సాహ పరుస్తున్నారు.


ఎందుకో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు సంపంగి బాబులో ఏదో తెలియని భయం మొదలైంది. సుబ్బయ్య సుబ్బయ్యలా కనిపించడం లేదు. ఆ కాళికాదేవి అక్కడ ప్రత్యక్షం అయినట్టు, తనని హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మేళం జోరు పెంచారు. సుబ్బయ్య భంగిమలు మార్చుతూ ఒక్కసారిగా తన చుట్టూ తాను తిరగడం మొదలు పెట్టాడు. దానికి తోడు తన చేతిలో ఉన్న కత్తులను కూడా తిప్పడం మొదలు పెట్టాడు. చుట్టూ ఉన్న జనాలు ఇంకా ఉత్సాహంతో అరుస్తున్నారు.


ఒక్కసారిగా సుబ్బయ్య పాదం అదుపు తప్పింది. తాను సంపంగి బాబు వైపుకు దూసుకువచ్చాడు. ఒక్కసారిగా సుబ్బయ్య రెండు కత్తులు సంపంగి బాబుకు తగిలి గాయమై రక్తం ధారాపాతంగా బయటకు వచ్చింది. అంతవరకూ కోలాహలంగా, ఉత్సాహంతో జరిగిన ఉత్సవం ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. సంపంగి బాబు స్పృహ కోల్పోయాడు. కంగారు పడుతూ మిగిలిన వాళ్లు సంపంగి బాబును ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు.

                       ******

సుబ్బయ్యకు చెమటలు పడుతున్నాయి. మనస్సు అంతా గందరగోళంగా ఉంది. ఎదురుగా కూర్చున్న వ్యక్తి వైపు చూస్తూ సతమతం అవుతున్నాడు.


"సుబ్బయ్యా! సంపంగి బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరపడానికి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాం. మీరు అతనిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని, మీ వలన అతని ప్రాణానికి ముప్పు ఉంది అని సంపంగి బాబు దృఢంగా ఆరోపిస్తున్నారు." అని సుబ్బయ్య వైపు చూస్తూ అడిగాడు ఇన్‌స్పెక్టర్ రత్నాచలం.


"బాబు! అతని మీద కోపం అన్నమాట నిజమే. చంపాలన్న ఆలోచన లేదు." ముఖం వేలాడేస్తూ సమాధానం ఇచ్చాడు సుబ్బయ్య.


"సరే, మీ తరపున మాట్లాడడానికి ఎవరైనా ఉన్నారా? అక్కడ మీ ఊరి జనం ఉన్నారు కదా. ఒక్కరైనా ఇది మీరు ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని చెప్పగలరా?" అడిగాడు రత్నాచలం.


మౌనం దాల్చాడు సుబ్బయ్య. సుబ్బయ్య మౌనం చూసి, ఒక నిట్టూర్పు తీసి అక్కడ నుండి బయటకు వెళ్ళాడు. కొంత సమయం తర్వాత ఊరి జనాలను వెంటబెట్టుకొని లోపలికి చేరుకున్నాడు రత్నాచలం. తన సీట్లో కూర్చుంటూ, "ఇప్పుడు చెప్పండి? సంపంగి బాబు, సుబ్బయ్య మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఇది నిజమేనా?" అడిగాడు రత్నాచలం.


"లేదు సర్, ఇదంతా సుబ్బయ్య కావాలని చేసింది కాదు. నాట్యం చేస్తూ సుబ్బయ్య అదుపు తప్పడంతో జరిగింది. ఇందులో సుబ్బయ్య నేరం ఏమీ లేదు. ఇలాంటి ఉత్సవాల్లో ఇలా జరగడం మామూలే." అని ఏక కంఠంతో వాళ్లు చెప్పారు.


తన ఊరి వాళ్లు ఇలా తనకు తోడుగా వచ్చి సాక్ష్యం చెప్తారు అని సుబ్బయ్య కలలో కూడా ఊహించలేదు. ఈ మార్పు సుబ్బయ్యలో ఆలోచన కలిగించింది.


మరికొన్ని ప్రశ్నలు వేసి సుబ్బయ్యను అక్కడ నుండి పంపించేశాడు రత్నాచలం.


తర్వాత సంపంగి బాబు దగ్గరకు చేరుకొని, "ప్రెసిడెంట్ గారు! మీ ఆరోపణలు నిజం కాదు అని, అదంతా యాదృచ్ఛికంగా జరిగిందని మీ గ్రామ ప్రజలే సాక్ష్యం చెప్పారు. సుబ్బయ్య వలన మీకు ప్రాణహాని లేదు." తేటతెల్లం చేశాడు రత్నాచలం. "తమరు ఈ వ్యవహారంలో తలదూర్చినప్పుడే నాకు అర్థమైంది. ఇలాంటిది ఏదో అవుతుంది అని. కానీ ఆ సుబ్బయ్య వలన నాకు ముప్పు ఉంది!" అసహనంగా పలికాడు సంపంగి బాబు.


"చూడండి ప్రెసిడెంట్ గారు! అధికార బలం ఉంది అని, ఏది పడితే అది చేస్తే చెల్లదు. మీ గురించి నాకు పూర్తిగా తెలుసు. సుబ్బయ్యకు మీరు చేస్తున్న అన్యాయం గురించి కూడా నా దృష్టికి వచ్చింది. సుబ్బయ్య చేతిలోని కత్తి చిన్నగా గుచ్చుకుంటే మీ పరిస్థితి ఇలా మారిపోయింది. మరి సుబ్బయ్య నిజంగా మీపై పగ పడితే మీ పరిస్థితి ఏమిటి? మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. కనుక ఇకమీదట ఇలాంటి పనులు మానండి. ఉన్నన్ని రోజులు ప్రాణభయం లేకుండా బ్రతుకుతారు. ఒకసారి తిరుగుబాటు మొదలైందంటే అది అంతు చూసే వరకు ఆగదు. అనవసరంగా సుబ్బయ్య మీద పగ పెంచుకోవడం మాని, కేసు వెనక్కి తీసుకుంటున్నట్టుగా ఒక సంతకం చేయండి." అని పేపర్లు సంపంగి బాబుకు ఇచ్చాడు రత్నాచలం.


రత్నాచలం మాటలకు కొంత సమయం ఆలోచనలో పడ్డాడు సంపంగి బాబు. 'నా ముందు కానీ, నేను లేని పక్షంలో కానీ మాట్లాడడానికే భయపడే గ్రామ ప్రజలు, ఇప్పుడు నేను సుబ్బయ్య మీద ఆరోపణ చేశాను అని తెలిసి కూడా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చారంటే నా మీద తిరుగుబాటు మొదలైంది అనిపిస్తుంది. ఈ విషయం ఇక్కడితో వదిలిస్తే మంచిది అనిపిస్తుంది. తర్వాత చూసుకుందాం.' అని ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే పేపర్ల మీద సంతకం పెట్టేసి, తిరిగి వాటిని రత్నాచలంకు ఇచ్చాడు.

                       ******

రత్నాచలం సుబ్బయ్య దగ్గరకు మళ్ళీ చేరుకున్నాడు. రత్నాచలంను తన ఇంటి దగ్గర చూసి, 'మళ్ళీ ఇతను వచ్చాడు. మళ్ళీ ఏ కేసు అంటాడో?' అని కంగారు పడ్డాడు.


ఇంతలో సుబ్బయ్య దగ్గరకు చేరుకొని, "సుబ్బయ్య గారు, మీతో మాట్లాడాలని వచ్చాను." అని అన్నాడు రత్నాచలం.


కంగారు పడుతూ, "లోపలికి రండి సర్!" అని గౌరవిస్తూ లోపలికి తీసుకెళ్లాడు. నులకమంచం చూపిస్తూ కూర్చోమని చెప్పాడు.


నులకమంచంపై కూర్చుంటూ కాసేపు మౌనం దాల్చాడు.


రత్నాచలం మౌనంగా కూర్చోవడం చూసి, "బాబు! మీరు వచ్చారు? మళ్ళీ ఆ సంపంగి బాబు ఫిర్యాదు ఇచ్చాడా?" కాస్త సందిగ్ధంగానే అడిగాడు.


"ఆ విషయం తర్వాత. నేను నీ గురించి వివరాలు అన్నీ కనుక్కున్నాను సుబ్బయ్యా. సంపంగి బాబు మీద దాడి అప్రయత్నంగా జరగలేదు. అది నీ ఉద్దేశపూర్వకంగా జరిగిందని నాకు తెలిసింది. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఎప్పుడూ తీసుకువచ్చే కత్తులు కాకుండా నువ్వు ఆ రోజు వేరే కత్తులు నాట్యం కోసం తీసుకువచ్చావు."


రత్నాచలం మాట విని ఒక్కసారిగా స్తబ్దుగా ఉండిపోయాడు. కొంత సమయానికి పెదవి విప్పుతూ, "నిజం బాబు, నేను సంపంగి బాబు మీద దాడికి ప్రయత్నం చేశాను. కానీ వాడు చేసింది తమరికి తెలియదు బాబు. నా జీవితాన్ని అల్లకల్లోలం చేయాలని చూశాడు. నా ఆస్తిని లాక్కోవాలని చూశాడు. తట్టుకోలేకపోయాను బాబు. వాడికి ఎదురు తిరిగి ఒక్కడు కూడా నాకు తోడుగా నిలబడడు బాబు." కన్నీటిపర్యంతం అయ్యాడు సుబ్బయ్య.


"సుబ్బయ్య! నేరం చేసిన తర్వాత బాధపడితే లాభం ఏం ఉంటుంది? శిక్ష అనుభవించాలి కదా! చూడు, ఇప్పుడు మీకు శిక్ష పడి లోపలికి వెళితే మీ కుటుంబ పరిస్థితి ఏమిటి?"


"బాబూ! ఇవన్నీ నేను ఆలోచించుకోలేదు. నా భూమి నాకు దక్కితే చాలు అనుకున్నాను. శిక్ష మాట అంటారా, ఆ శిక్ష పడినా నేను ఆనందంగా స్వీకరిస్తాను. ఎందుకంటే సంపంగి బాబు లాంటి వాడి పీడ వదిలితే, ఇక్కడ న్యాయానికి నోరు పగులుతుంది బాబు. ఇన్నాళ్ళు సమాధి అయిన న్యాయం తిరిగి ఊపిరి పీల్చుకుంటుంది బాబు." గద్గద స్వరంతో అన్నాడు సుబ్బయ్య.


ఒక్కసారిగా తాను కూర్చున్న చోటు నుండి పైకి లేచి,


"సుబ్బయ్య గారు! మంచి మనస్సు, వ్యక్తిత్వం, నలుగురికి మంచి చేయాలనే మీ మనస్సు నాకు ఎప్పటి నుండో తెలుసు. మీలాంటి వారికి శిక్ష పడితే ఆ పరిణామాలు నాకు తెలుసు. అందుకే విశ్వప్రయత్నం చేసి ఆ సంపంగి బాబు మీద ఒత్తిడి తెచ్చి కేసు వెనక్కి తీసుకునేలా చేశాను. మీరు ఇక నిశ్చింతగా ఉండవచ్చు."


రత్నాచలం మాటలకు ఆశ్చర్యపోతూ, "బాబు! మా లాంటి వాళ్లకు న్యాయం దొరకడం ఈ రోజుల్లో కష్టం అనుకున్నాను. కానీ, మీలాంటి వ్యక్తుల్ని చూసినప్పుడు మళ్ళీ న్యాయం దొరుకుతుందని నమ్మకం కలుగుతుంది. నా గురించి ఇంతలా ఆలోచించి నాకు సహాయం చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలి బాబు?" చేతులు జోడిస్తూ అన్నాడు సుబ్బయ్య.


"అయ్యయ్యో! మీరు పెద్ద వారు. నాకు మీరు దండం పెట్టడం ఏమిటి? మీరు ఏదైతే ఇచ్చారో అదే మీకు తిరిగి వచ్చింది." సుబ్బయ్య దగ్గరకు చేరుకొని అన్నాడు రత్నాచలం.


"బాబు, ఏం అంటున్నావో అర్థం కావడం లేదు?" తెల్లముఖం వేశాడు సుబ్బయ్య.


"సుబ్బయ్య గారు, మా అమ్మగారిది పక్క ఊరు. మా అమ్మ పేరు సీతామహాలక్ష్మి. చిన్నప్పుడు చాలాసార్లు నేను నిద్రలో కలవరించేవాడిని. పైగా నాకు చీకటి అంటే భయం, మనుషులతో మాట్లాడేవాడిని కాదు, ఏ చిన్న పని చేయాలన్నా భయంతో వణికిపోయేవాడిని.


అప్పుడు మీరు అమ్మవారి పూజారిగా ఉండేవారు. చాలాసార్లు అమ్మ మీ దగ్గరకు తీసుకువచ్చింది. మీరు నాకు ఎన్నో విషయాలు చెప్పి, నాలో ధైర్యం కలిగించి చివరికి నాలో ఉన్న ఆ భయాన్ని పోగొట్టారు. మా పరిస్థితి అప్పుడు అంతంత మాత్రమే. మీరు రూపాయి డబ్బులు తీసుకోకుండా మాకు సహాయం చేశారు. పైగా మా అమ్మ అవసరం అంటే డబ్బు సహాయం కూడా చేశారు. ఆ మేలు నేను మరిచిపోలేదు. మీరు ఎప్పుడూ చెప్తుండేవారు 'అమ్మ కష్టాన్ని గుర్తించమని'. అలా గుర్తించే నేనే ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాను. నన్ను ఆశీర్వదించండి." అని సుబ్బయ్య కాళ్ల మీద పడ్డాడు రత్నాచలం.


సుబ్బయ్య మనస్సు ఉప్పొంగిపోయింది. వేగంగా రత్నాచలంను పైకి లేవదీస్తూ హత్తుకున్నాడు.


"బాబూ! సీతమ్మ నాకు బాగా తెలుసు. ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబమే. కానీ విధి వక్రించిన కారణంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నువ్వు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నావు అని తెలిసి నాకు చాలా సంతోషం కలుగుతుంది. పైగా నన్ను గుర్తుపెట్టుకున్నందుకు ఇంకా ఆనందం కలుగుతుంది." సుబ్బయ్య కళ్లు చెమర్చాయి.


"చెప్పాను కదా సుబ్బయ్య గారు, మీరు చేసిన మంచే ఈరోజు మిమ్మల్ని కాపాడింది. మీ వంటివారు ఇకమీదట ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి." అని సుబ్బయ్యతో అన్నాడు రత్నాచలం.


'మొన్నటి రోజున జరిగిన ఉత్సవం నా జీవితంలో తలమానికంగా గుర్తు ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటనే కదా ఊరిలో జనాలకి ధైర్యం పోసి, ఊరును ఏకం చేసి, మానవత్వాన్ని మేలుకొలిపింది.' అని తనలో అనుకుంటూ, ఎదురుగా ఉన్న రత్నాచలం వైపు ఆనందంగా చూశాడు.

 

 ***సమాప్తం****

మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page