top of page
Writer's pictureSairam Allu

ఉత్తమ శిష్యః

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Youtube Video link


'Utthama Sishyaha' New Telugu Story


Written By Allu Sairam


రచన: అల్లు సాయిరాం



ప్రభుత్వ హైస్కూల్లో ఉదయం ప్రార్ధన ముగిసింది. విద్యార్థులు వారివారి తరగతి గదులకు వెళ్లి కూర్చున్నారు. ఉపాధ్యాయ సిబ్బంది ఆఫీస్ రూమ్ కి వెళ్లి, టైంటేబుల్ ప్రకారం వారివారి నియామక తరగతి గదులకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. రెండేళ్లలో రిటైర్మెంట్ అవ్వబోతున్న తెలుగు మాస్టారు జనార్ధనరావు ఎప్పటిలాగే ఆఫీసురూం వెనుకున్న చెట్టుకింద నిల్చుని, నోట్లోంచి గాల్లోకి పొగ గింగిరాలు వదులుతున్నాడు. స్వతహాగా జనార్దనరావు మాష్టారు చాలా బాగా పాఠాలు నేర్పించేవారు. ఉపాధ్యాయుడిగా ముప్పై యేళ్ల అనుభవం వలనో, లేక స్కూల్లో అందరి కంటే తాను సినీయర్ అవ్వడం వలనో, లేక స్కూల్ హెడ్మాస్టర్ చిన్నంనాయుడు మాష్టారు తన బంధువు కావడం వలనో, రానురాను జనార్ధనరావు మాష్టారిలో నిర్లక్ష్య ధోరణి అక్కడక్కడ కనిపిస్తుంది. ఆనోటా ఈనోటా వినిపిస్తుంది.


ఆయన విద్యాబోధ నశైలిపై విద్యార్థులకి, ఆయన వ్యవహారశైలిపై తోటి ఉపాధ్యాయులకి అసంతృప్తిగా ఉన్నా, వారిలో వారు గుసగుసలాడుకోవడం తప్ప, బయటకు ఎవరూ చెప్పరు! చెప్పలేరు! హెడ్మాస్టారు చిన్నంనాయుడు మాష్టారు కూడా జనార్ధనరావు మాష్టారి సినీయారిటీని గౌరవించి, సందర్భానుసారంగా సలహాలు, సంపద్రింపులు చేస్తుంటారు. కాబట్టి, జనార్ధనరావు మాష్టారు తనకు నచ్చినట్లుగా వ్యవహరిస్తుంటారు.


మొదటి పీరియడ్ గంట మ్రోగి, పదినిమిషాలు అవుతుంది. అందరూ ఉపాధ్యాయులు చకచకా ఆయా తరగతి గదులకు చేరుకుని విద్యార్థుల హాజరు తీసుకుంటున్నారు.


"గుడ్ మార్నింగ్ సార్! మీదే సార్ ఫస్ట్ పీరియడ్!" అని అంటూ జనార్ధనరావు మాష్టారి దగ్గరికి వచ్చాడు తొమ్మిదోతరగతి లీడర్ నరేష్.


"ఊఁ తెలుసురా! ఆఁ హాఫ్ఇయర్లీ పరీక్షపేపర్లు దిద్దమని చెప్పానే! దిద్దడం అయిపోయిందా?" అని జనార్ధనరావు మాష్టారు అడిగితే "ఆఁ అన్ని పేపర్లు దిద్దేశాను సార్!" అని చనువుగా చెప్పాడు నరేష్.


"మరింకేం! నాకు ఊరిలో చిన్న పనుంది. చూసుకుని క్లాసుకి వస్తాను! నేను వచ్చేలోపు, నువ్వు ఆ పరీక్ష పేపర్లు పట్టుకెళ్లి, క్లాసులో అందరికి యిచ్చి, చూసుకోమని చెప్పు! నేను రావడానికి టైం పడితే, పేపర్లు తిరిగి తీసుకుని బీరువాలో పెట్టేయ్!" అని ఆలోచిస్తూ చెప్పాడు జనార్ధనరావు మాష్టారు.


"సరే సార్!" అంటూ అక్కడి నుంచి ఆఫీసురూం వైపు వచ్చాడు నరేష్.


నరేష్ ఆఫీసురూం లో జనార్ధనరావు మాష్టారి టేబుల్ మీదున్న తెలుగుపుస్తకం, తెలుగు హాఫ్ఇయర్లీ పరీక్షపేపర్లు, రెండు సుద్దముక్కలు తీసుకుని, ఆఫీసురూం పక్కనున్న తొమ్మిదో తరగతి గదిలోకి వచ్చి పరీక్ష పేపర్లు టేబుల్ మీద పెట్టాడు.


నరేష్ బెస్ట్ ఫ్రెండ్స్ శేఖర్, మురళి లు యిద్దరూ నరేష్ దగ్గరికివచ్చి "రేయ్! పేపర్లు దిద్దేసి, యిప్పుడు యిస్తావా? సార్ క్లాసుకి వస్తారా? రారా?" అని అడిగారు.


నరేష్ తన చేతిలో ఉన్న తెలుగుపుస్తకంలో పెట్టిన హాఫ్ఇయర్లీ పరీక్ష పేపర్లని చూపించాడు ఆనందంగా.


“నాకు ఎన్ని మార్కులు వచ్చాయిరా” అంటూ ఇద్దరూ గాభరాగా, కట్టేసి ఉన్న పరీక్ష పేపర్ల కట్టలో, వారి పేపర్లు చూసుకుంటున్నారు. వందకు 92 మార్కులు నరేష్ కి, 86 మార్కులు శేఖర్ కి, 88 మార్కులు మురళికి రావడంతో ఆనందంలో తేలిపోతున్నారు. చక్కగా వాళ్ళ ముగ్గురు పేపర్లు తీసి పక్కన పెట్టుకున్నారు.


తరగతిగదిలో చివరి వరుసలో కూర్చున్న అనిల్ ని చూస్తూ "అవున్రా! ఆ అనిల్ గాడికి ఎన్ని మార్కులు వచ్చాయిరా?" అని నవ్వుతూ అడిగాడు మురళి.


నరేష్ నవ్వుతూ అనిల్ పేపరు మీదున్న 74 మార్కులు చూపించాడు. మాష్టారులకి ఏవోవే కబుర్లు చెప్పి, మార్కులు తెచ్చుకుంటూ, అందరి ముందు తానే గొప్పగా ఉండాలని అనుకుంటాడు నరేష్. అనిల్ బాగా చదివి ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటాడు. అందువల్ల, నరేష్ కి అనిల్ అంటే అసూయ, ఈర్ష్య! పైగా యిప్పటికే, హాఫ్ఇయర్లీ పరీక్షల్లో మిగతా అన్ని సబ్జెక్టుల్లో, నరేష్ కంటే ఎక్కువ మార్కులతో అనిల్ ఫస్ట్ వచ్చేశాడు.


ముగ్గురు చెరో కొన్ని పేపర్లు పట్టుకుని, మార్కులు బయటికి చెప్తూ, పరీక్ష పేపర్లు యిస్తున్నారు. అనిల్ పేపరు మాత్రం మార్కులు బయటికి చెప్పకుండా, తనవైపు చూస్తూ, చిన్నసైజు వెటకారపు నవ్వు నవ్వుతూ యిచ్చారు. నరేష్ బ్యాచ్ వాళ్లు నవ్వుతూ తన పరీక్ష పేపరు యిచ్చినప్పడే, ఏదో గూడుపుఠాణి జరిగిందని అనిల్ కి అర్ధమైపోయింది. తాను పరీక్షలో రాసిందాన్ని బట్టి, కనీసం తొంభైమార్కులు దాటి వస్తాయని అనుకుంటే, తన పేపర్లో 74 మార్కులు చూసి ఆశ్చర్యపోయి, పరీక్ష పేపరంతా తిప్పితిప్పి చూసుకుంటున్నాడు అనిల్. అనిల్ పరీక్షపేపరు మీదున్న 74 మార్కులు చూసి మిగతా విద్యార్థులు ఆశ్చర్యపోయి చూస్తున్నారు.


పుండు మీద కారం చల్లినట్టు, అందరికి పేపర్లు యిచ్చాక, మురళి చివరిగా నరేష్ పేపరు చూపిస్తూ "నరేష్ కి 92 మార్కులు. క్లాస్ ఫస్ట్!" అని గొప్పగా చెప్పాడు. నరేష్ వర్గపు విద్యార్థులు ఆనందంలో, యితర వర్గపు విద్యార్థులు ఆశ్చర్యంలో తమ పేపర్లు చూసుకుంటున్నారు.


అనిల్ ఫ్రెండ్ రాజు "నాకే 85 మార్కులు వచ్చాయిరా. నీకు 74 మార్కులు ఏంట్రా? ఆ నరేష్ గాడికి 92 మార్కులా! ఎప్పుడూ వాడి పేపర్లు వాడే దిద్దుకుని, మార్కులు కుడా వాడే వేసుకుంటున్నాడు! వాడికి నచ్చినవాళ్ళకి 80 దాటి మార్కులు వేస్తాడు. నీమీద కోపంతో నీ మార్కులు తగ్గించేశాడు!" అని అన్నాడు.


అనిల్ తన పేపరులో అన్ని అరకొర మార్కులు చూసి, చిర్రెత్తుకొచ్చి, టేబుల్ దగ్గర నిల్చున్న ‌నరేష్ దగ్గరికి వచ్చాడు. అందరూ ఆత్రంగా చూస్తున్నారు.


అనిల్ నరేష్ కి షేక్ హ్యాండ్ యిస్తూ "క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు కంగ్రాట్స్!" అని అన్నాడు.

యిది ఊహించని నరేష్ ఆశ్చర్యంగా అనిల్ ని చూస్తున్నాడు.


అనిల్ కొనసాగిస్తూ "నరేష్! నీ పరీక్ష పేపరు ఒకసారి యిస్తావా?" అని అడిగాడు.

"ఆఁ.. నా పేపరు నీకెందుకు?" అని అడిగాడు నరేష్ నీళ్ళునములుతూ.


"జస్ట్ చూసి యిచ్చేస్తా! కావాలంటే, నీకు నా పేపరు యిస్తాను!" అంటూ పేపరు యిస్తున్నాడు అనిల్.


"నీ పేపరు నేనే కదా..!" అని నోటివరకు వచ్చిన మాటను మింగేస్తే, "చెప్పు! నా పేపరు నువ్వే..! ఏం చేశావు? పరీక్ష రాశావా?" అని అడిగాడు అనిల్.


"ఆఁ.. నీ పేపరు నాకెందుకు?" అని తడబడుతూ చెప్పాడు నరేష్.


"ఈసారి 74 మార్కులు వచ్చాయి. తరువాత పరీక్షలో కనీసం పాస్ మార్కులయినా వస్తాయో రావో లేదో తెలియట్లేదు. ఎంత చదివి రాసినా, మార్కులు రావట్లేదు. మరి, ఏలా రాస్తే, మార్కులు వేస్తారో, ఏ బుక్ లో చదివితే, ఫస్ట్ మార్కులు వస్తాయో తెలుసుకుందామని!" అని అనిల్ అన్నాడు.


తక్కువ మార్కులు వచ్చినవారందరూ అనిల్ వెనుక నిలబడి "నాకెందుకు మార్కులు తక్కువ వచ్చాయి?" అని నరేష్ చూట్టూ చేరి నిలదీస్తున్నారు.


నరేష్ కి ముచ్చెమటలు పట్టి "చూడండి! ఎవరికైనా మార్కులలో ఏమైనా డౌట్లు ఉంటే, సార్ యిప్పుడు వచ్చేస్తారు. సార్ వచ్చినప్పుడు అడగండి! యిప్పుడు గొడవ చెయ్యకుండా, వెళ్లి కూర్చోండి!" అని పక్కకి తప్పించుకుంటూ వస్తూ అన్నాడు నరేష్.


"ఏంటి కూర్చోనేది! ముందు, నీ పేపరు యివ్వు!" అని నరేష్ చేతిలో ఉన్న పేపరు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు అనిల్.


"నా పేపరు వదులు. నీకు మార్కులు కావాలంటే, సార్ ని అడుగు!" అని అంటూ నరేష్ కుడా గట్టిగా పేపర్లు పట్టుకోవడంతో నరేష్ పరీక్ష పేపర్లు నలిగిపోయాయి.


తరగతి గదిలో విద్యార్థుల అరుపులతో పెద్దగొడవలా వినిపించి, మిగతా ఉపాధ్యాయులు, విద్యార్థులు బయటికివచ్చి చూస్తున్నారు. సరిగ్గా అప్పుడే, మొదటికే అవసరంగా వెళ్లిన పని అవ్వలేదన్న కోపంగా వస్తున్న జనార్ధనరావు మాష్టారు దూరం నుంచి చూస్తే, తన తరగతిగది నుంచి వస్తున్న విద్యార్థుల అరుపులు విని, తరగతిగది ముందు గూమిగూడిన విద్యార్ధులని, ఉపాధ్యాయులని చూసేసరికి కోపం కట్టలు తెంచుకుంది. గబగబా బైక్ దిగి కోపంతో ఊగిపోతూ వస్తున్న జనార్ధనరావు మాష్టారుని చూసి, భయంతో అందరూ లోపలికి వెళ్ళిపోయి, ఎక్కడివాళ్ళు అక్కడ గుప్పుచప్పుడు కాకుండా, ఏం జరగనట్లు ముఖాలు పెట్టుకుని కూర్చున్నారు.


"ఏంట్రా! కాస్త లేటుగా వస్తే, చేపలబజారులా అందరూ గోలపెడుతున్నారు! ఏమిరా నరేష్? నిన్ను చూసుకోమని చెప్పాను కదరా!" అని అంటూ కోపంతో వస్తున్నాడు జనార్ధనరావు మాష్టారు.


నరేష్ తన చేతిలో ఉన్న నలిగిపోయిన పరీక్షపేపర్లని చూపిస్తూ "అంతా, యీ అనిలే సార్! తనకి తక్కువ మార్కులు వచ్చాయని, అందర్ని రెచ్చగొట్టి గొడవలు పెడుతున్నాడు సార్! నేను ఆపడానికి ప్రయత్నిస్తే, నన్ను కొడుతున్నాడు!" అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అన్నాడు.


నరేష్ చేతిలో ఉన్న నలిగిపోయిన పేపర్లు చూశాక, జనార్ధనరావు మాష్టారు మరింత కోపంతో బెత్తం పుచ్చుకుని అనిల్ దగ్గరికి వచ్చి "ఏరా! నీకు తక్కువ మార్కులు వస్తే, నీయిష్టం వచ్చినట్టు చింపేయడానికి, అవేమైనా పరీక్షపేపర్లు అనుకుంటున్నావా? చిత్తుకాగితాలు అనుకుంటున్నావా??" అని జరిగినది చెప్పడానికి ప్రయత్నిస్తున్న అనిల్ ని బెత్తం విరిగేలా కొట్టాడు.


విషయం తెలిసి హెడ్మాస్టారు చిన్నంనాయుడు మాష్టారు గబుక్కున వచ్చి, కలుగజేసుకుని ఆపడంతో, బెత్తం విసిరేసి టేబుల్ దగ్గరికివచ్చి, చెమటలు కక్కుతూ కూర్చున్నాడు జనార్ధనరావు మాష్టారు.


ఒళ్ళంతా దెబ్బలతో ఎర్రగా కందిపోయి ఏడుస్తున్న అనిల్ తో "అనిల్! నువ్వు మంచి స్టూడెంట్ వి కదా! ఏంటి యిలా చేశావు?" అని అడిగాడు చిన్నంనాయుడు మాష్టారు.


తన పరీక్ష పేపర్లు చూపిస్తూ "నాకు 74 మార్కులంట సార్!" అని అన్నాడు అనిల్.


"రాసినదాన్ని బట్టే మార్కులు వస్తాయి. ఆమాత్రానికే, పరీక్ష పేపర్లు చింపేస్తావా?" అని అనిల్ ని మళ్ళీ కొట్టడానికి చూస్తూ అడిగాడు‌ జనార్ధనరావు మాష్టారు.


పక్కనే ఉన్న చిన్నంనాయుడు మాష్టారు "మీరుండండి సార్! ఇప్పటికే, వాడి ఒళ్లు వాచిపోయింది! మీరు కొంచెం ఆ బిపి టాబ్లెట్ వేసుకోండి!" అని సర్దిచెప్తుండగా "నేను పరీక్షలో ఏం రాసానో మీకు ఏలా తెలుసు? మీరు ఎప్పుడైనా పేపర్లు దిద్దితే తెలిసేది!" అని ఒళ్ళుమండి అనేశాడు అనిల్.


అంతే! ఏం జరుగుబోతుందని అందరూ భయంగా చూస్తున్నారు.


జనార్ధనరావు మాష్టారు కోపంతో కుర్చీలోనుంచి లేచి "రేయ్ నరేష్! ఇంకో బెత్తం ఇవ్వురా? చూశారా సార్! వీడికి బాగా చదువుతాడని అందరూ అనేసరికి, ఒళ్ళు కొవ్వెక్కి ఎలా మాట్లాడుతున్నాడో!!" అని అరిచాడు.


ఈసారి చిన్నంనాయుడు మాష్టారికి కోపం వచ్చి "ఏం అనిల్! సార్ తో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా నీకు!" అని అడిగాడు.


"తెలుసు సార్! 94 మార్కులు వస్తాయనుకుంటే, కనీసం 90, 85 మార్కులు రావాలి. 74 మార్కులు వచ్చాయి. ఎప్పుడూ, నరేష్ మార్కుల కంటే, నాకు ఒకట్రెండు మార్కులు తగ్గేవి. నేను అడిగేవాడ్ని కాదు. ఈసారి 20 మార్కులు తేడా అంటే, పేపర్లు సార్ దిద్దారని ఎలా అనుకుంటాను! పైగా, నేను పరీక్ష బాగా రాయలేదంటున్నారు!


క్లాసులో నరేష్ నిల్చుని పుస్తకంలో పాఠాలు చదివితే, మాష్టారు పక్కన కుర్చీలో కూర్చొని, అనుభవంతో వాటికి అర్ధాలు చెప్తారు. నరేష్ మాకు పాఠాలుచెప్పి, క్లాసు చూసుకుని, పరీక్షలు పెట్టి, చివరికి పేపర్లు కుడా దిద్దడమంటే, స్టూడెంట్ అనుకోవాలా? టీచర్ అనుకోవాలా? నరేష్ కి ఏం అర్హత ఉందని, మాకంటే ఏం ఎక్కువ తెలుసని, మా పేపర్లు దిద్దడానికి యిచ్చారు?" అని నిలదీసినట్లు అడిగాడు అనిల్.


అందరూ జరుగుతున్నదంతా ఉఠ్కంతగా చూస్తున్నారు. అనిల్ సంధించిన ఉరుముల్లాంటి ప్రశ్నలు, జనార్ధనరావు మాష్టారి కోపంతో కూడుకున్న మేఘాలను ఢీకొట్టి నీరుగారిపోయి, మౌనంగా అక్కడినుంచి బయటకి వచ్చేశాడు.


చిన్నంనాయుడు మాష్టారు అనిల్ బాధని అర్థంచేసుకుని, కాసేపు ఓదార్చారు. అనిల్ తాగడానికి మంచినీళ్లు యిప్పించారు. మాష్టారికి తోటి విద్యార్థులు జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించారు. అనిల్ ఒంటి మీద దెబ్బలు చూసి, నరేష్ ఒళ్లంతా చెమటలు కారిపోతున్నాయి. తన వలనే యిదంతా జరిగిందని, యిప్పుడు మాష్టార్లు ఏం చేస్తారో అని వణికిపోతున్నాడు. నరేష్ వర్గం దూరం నుంచి నిల్చుని చూస్తున్నారు.


జరిగినది తెలిశాక, చిన్నంనాయుడు మాష్టారు తన వైపు ఎర్రగా చూసేసరికి, నరేష్ భయపడిపోయి "సారీ సార్! యిలా జరుగుతుందని అసలు నేను ఊహించలేదు!" అని అన్నాడు.


"సారీ చెప్పాల్సింది నాకు కాదు. మీ ఫ్రెండ్ అనిల్ కి!" అని చిన్నంనాయుడు మాష్టారు గట్టిగా చెప్పేసరికి "సారీ అనిల్! నాదే తప్పు! యింకెప్పుడు యిలా జరగదు. మా అమ్మ తోడు! నేను యిప్పట్నుంచి క్లాస్ లీడర్ గా ఉండను! నీకు ఏ ప్రాబ్లం ఉండదు" అని అంటూ తల మీద ఒట్టేసి చెప్పాడు నరేష్.


చిన్నంనాయుడు మాష్టారు అందర్ని చూస్తూ "నరేష్! ప్రాబ్లమ్స్ రావడానికి నువ్వు లీడర్ గా ఉండడం, ఉండకపోవడంతో సంబంధం లేదు. తోటి విద్యార్థులతో ఎక్కడ పోటీ పడాలి, ఎక్కడ కలిసి ఉండాలి అనే విషయాలు తెలియకపోవడం వలనే ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. విద్యార్థుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. చదువులో పోటీ పడండి. మార్కుల కోసం కాదు! జ్ఞానం సంపాదించడంలో పోటీ పడండి. ర్యాంకుల కోసం కాదు! మార్కులు, ర్యాంకులు, సర్టిఫికెట్లు చదువుకి కొలమానాలు కాదు.


చదివేటప్పుడు విషయం అర్ధం చేసుకోకుండా, బట్టీ పట్టి పరీక్షలు రాసేసి, వంద మార్కులకి తొంభై మార్కులు దాటి వచ్చినంత మాత్రాన ఏమాత్రం ఉపయోగం ఉండదు. చదువు కంఠస్థం పెట్టి చదివితే నోటి దగ్గరే నానుతూ ఉంటుంది. వేరే కారణాల వల్ల, కొన్ని రోజుల తరువాత మర్చిపోతాం. అదే మనసస్థం పెట్టి చదివితే, మనసులో స్ధిరంగా ఉంటుంది. ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటాం. అర్ధమయింది కదా, చదువులో మీ పేర్లు బాగుంటే, ఊరిలో మీ తల్లిదండ్రుల పేర్లు బాగుంటాయి. వాళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని, కాయకష్టం చేసి, సంపాదించిన నాలుగు డబ్బులు మీకోసం, మీ భవిష్యత్తు కోసమే ధారపోస్తున్నారు. వాళ్ల పస్తులే, మీకు పుస్తకాలు!


రెండింటిలో సమానమైన జ్ఞానం ఉంటుంది! మరి, యిప్పుడు అనిల్ యింటికి వెళ్ళాక, అనిల్ ఒంటి మీదున్న దెబ్బలు చూసి తల్లిదండ్రులు కచ్చితంగా ఏమైందని అడుగుతారు. వారికి విషయం తెలిసి, బిడ్డ బాధ చూసి ఉసురుమని, స్కూల్ కి వచ్చి న్యాయం అడుగుతారో, లేక నరేష్ యింటికి వచ్చి గొడవ పడతారో, లేక ఏం చేస్తారో..!" అని చెప్తుండగా "నేను మా అమ్మనాన్నలకి యిక్కడ జరిగినది ఏం చెప్పను మాష్టారు!" అని మెల్లగా దగ్గుతూ అన్నాడు అనిల్.


చిన్నంనాయుడు మాష్టారు నవ్వుతూ "మంచిది! మంచి మనసుతో నువ్వు చెప్పకపోయినా, నొప్పులకి నీ ఒంటి మీద దెబ్బలు చెప్పేస్తాయి. ఎవరొకరు చెప్తారు. నిజం ఏదో విధంగా తెలుస్తోంది. మీరు దాని గురించి ఆలోచించి భయపడకండి. నేను మీ యింటికి వచ్చి మీ అమ్మానాన్నలతో మాట్లాడతాను. అనిల్ బ్యాగ్ సర్దిపెట్టి ఉంచండి. నేను ఆఫీసులో పని చూసుకుని వస్తాను. ఇంటర్వెల్ టైంలో మీ యింటికి వెళ్దాం. ఈరోజు యింటి దగ్గర రెస్ట్ తీసుకుందువు గాని!" అని అనిల్ తల నిమురుతూ చెప్పి, పరీక్షపేపర్లు పట్టుకుని ఆఫీసురూంకి వచ్చి చూస్తే, మౌనంగా ఆత్మపరిశీలన చేసుకుంటునట్టుగా తన కుర్చీలో కూర్చున్న జనార్ధనరావు మాష్టారి పరిస్థితిని అర్ధం చేసుకుని, డిస్టర్బ్ చెయ్యకుండా జనార్ధనరావు మాష్టారి టేబుల్ మీద పరీక్ష పేపర్లు పెట్టి, తన టేబుల్ దగ్గరికి వచ్చాడు.


అనిల్ చిన్నపిల్లాడైనా మాష్టార్ని గట్టిగా నిలదీసి కడిగిపారేశాడని అని కొందరు, జనార్ధనరావు మాష్టారు కనికరం లేకుండా పిల్లాడిని చితక్కొట్టేశాడని మరికొందరు, యిద్దరికీ బాగా జరిగిందని యింకొందరు చెవులు కొరుక్కుంటున్నారు. జనార్ధనరావు మాష్టారు తనముందున్న ఆ పేపర్లలో అనిల్ పేపరుతీసి చూస్తున్నాడు. పరీక్షపేపరులో ప్రశ్నలకి అనిల్ ఎంత బాగా సమాధానాలు రాసినా, అన్నింటికీ నరేష్ అరకొర మార్కులు వేశాడు. అప్పుడు అర్ధమైంది అనిల్ అడిగింది తప్పు కాదని! పరీక్ష పేపర్లో ఒక్క పదం కూడా వదలకుండా చదివి, కొత్తగా దిద్దుతూ మార్కులు వేస్తున్నాడు జనార్ధనరావు మాష్టారు.


అదే విధంగా, అందరి పరీక్ష పేపర్లు క్షుణ్ణంగా పరిశీలించి దిద్దారు. అన్ని పేపర్లు కట్ట కట్టి పట్టుకుని మళ్ళీ తరగతిగదివైపు జనార్ధనరావు మాష్టారు వెళ్తుంటే, చిన్నంనాయుడు మాష్టారు ఆతృతగా జనార్ధనరావు మాష్టారు దగ్గరికి వెళ్లి "మాష్టారు! అనిల్ చిన్న పిల్లాడు. ఏదో తెలిసి తెలియక అనేశాడు. వాడిని ఏం చెయ్యొద్దండి! యిప్పుడు కొట్టిన దెబ్బల విషయం వాడి యింటి దగ్గర తెలిస్తే పెద్దగొడవ అవుతుందేమో! మళ్ళీ మీరు వెళ్లి ఏం చెయ్యోద్దు!" అని సర్దిచెప్పాడు.


"అదేం లేదు మాష్టారు! అనిల్ అడిగింది ముమ్మాటికీ న్యాయమే! కష్టపడినవాడికి సరైన ప్రతిఫలం కోసం ప్రశ్నించే హక్కు ఉంటుంది! పాఠాన్ని పాఠంగా చెప్పడానికి గురువు ఎందుకు? విద్యార్థులకు జ్ఞానం బోధించడానికి ఉపయోగపడనప్పుడు, నా ముఫ్ఫైయేళ్ళ అనుభవం వలన ఏం లాభం సార్? నా అనుభవాన్ని గౌరవించో, లేక భయానికో, యిన్నాళ్ళు నా బాధ్యతరాహిత్యాన్ని మీరెవరు బయటికి చెప్పలేదు!


నావైపు తప్పు పెట్టుకుని, నా మనవడి వయసున్న అనిల్ ని కొట్టడం పెద్దతప్పు! గురువు దగ్గర విద్య నేర్చుకునేవాడు శిష్యుడు! పరిస్థితుల కారణంగా, దారితప్పిన గురువుకి బాధ్యతలు గుర్తుచేసేవాడు ఉత్తమశిష్యుడు!" అని పశ్చాత్తాపంతో అంటూ బయటికి వచ్చాడు జనార్ధనరావు. చాలాకాలం తర్వాత మునుపటి జనార్ధనరావు మాష్టారిని చూస్తున్నానా అన్నట్లు చూస్తుండిపోయాడు చిన్నంనాయుడు మాష్టారు.


జనార్ధనరావు మాష్టారు మళ్ళీ తరగతిగది వైపు వెళ్తుంటే, మళ్ళీ బాదుడు మొదలుపెడతాడేమో అని భయపడుతూ చూస్తున్నారందరు. జనార్ధనరావు మాష్టారు గదిలోకి వస్తూనే అనిల్ ని చూస్తూ "అనిల్! బ్యాగు పట్టుకుని బయలుదేరు!" అని అంటే, స్కూల్ నుంచి తీసేసి పంపించేస్తున్నారా అని అనిల్ తో సహా అందరూ గతుక్కుమని చూస్తున్నారు.


జనార్ధనరావు మాష్టారు కొనసాగిస్తూ "నువ్వు చెప్పిందే నిజమే! ఏం రాశావని పేపర్లు చూస్తే కదా తెలిసేది. చూశాను. తెలుస్తోంది! ఇప్పుడు బాగా చూసి దిద్దాను!" అని అంటూ అనిల్ చేతికి యిచ్చిన పరీక్షపేపరులో 91 మార్కులు చూసి, అనిల్ ముఖంమీద చిరునవ్వు వచ్చింది.


"అలాగే, మీ అందరు కుడా మీ పేపర్లు తీసుకుని చూడండి! అనిల్! పదా.. యింటికి వెళ్దాం!" అని చెప్తున్న జనార్ధనరావు మాష్టారి మాటలకి ఆనందాశ్చర్యాలతో చూస్తున్నారందరు చిన్నంనాయుడు మాష్టారుతో సహ.


హెడ్మాస్టార్ పర్మిషన్ తీసుకుని, అనిల్ ని తన బైక్ పై అనిల్ యింటికి తీసుకువచ్చాడు జనార్ధనరావు మాష్టారు. ఏడ్చి వాడిపోయిన అనిల్ ముఖాన్ని చూసి కంగారుపడి "ఏమైంది సారు? బాబుని మీరు తీసుకొస్తున్నారు? మా బాబు ఏమైనా తప్పు చేశాడా?" అని అడిగారు అనిల్ అమ్మానాన్నలు.


"లేదమ్మా! నేనే తప్పు చేశాను. మనవడిలాంటి అనిల్ గురించి తెలిసి కుడా, అనిల్ ని అపార్ధం చేసుకుని కోపంతో నేనే కొట్టేశాను. జరిగినదాంట్లో అనిల్ తప్పు ఏంలేదని అర్ధమయ్యాక, నాకే చాలా బాధగా అనిపించి, మనసొప్పక నేనే బాబుని తీసుకొచ్చి, మీకు ఒక మాట చెప్దామని వచ్చానమ్మా! తప్పు జరిగిపోయింది. ఏమనుకోవద్దమ్మా!" అని జరిగినదంతా చెప్పాడు జనార్ధనరావు మాష్టారు.


"ఏంటి మాష్టారు! మీరు అలా మాట్లాడతారు! మీరు కొట్టింది అనిల్ ఎక్కడ తప్పు దారి పడతాడేమో అని కదా, బాబు తప్పు చేసినా, చెయ్యకపోయినా విద్య నేర్పుతున్న గురువులుగా మీకు బుధ్ధి చెప్పే హక్కు ఉంది! పైగా తాతకి మనవడు కదా, మనవడి మీద ఆమాత్రం చనువు మీకు ఉంటుంది మరి!" అని అనిల్ అమ్మానాన్నలు చెప్తుంటే, జనార్ధనరావు మాష్టారు మనసులో "మీ విలువలతో కూడిన పెంపకం వలనే బాబుకి మంచి వ్యక్తిత్వం వచ్చింది!" అని అనుకున్నాడు.


చివరిగా, వచ్చేదారిలో అనిల్ కోసం తీసుకున్న పళ్ళు అనిల్ అమ్మానాన్నల చేతికిచ్చి, మందుల సంచిలో ఉన్న మందు తీసి అనిల్ దెబ్బలకి రాయడానికి చూస్తుంటే "నేను మందు రాసుకుంటానులే మాష్టారు! యిటు యివ్వండి!" అని అనిల్ తీసుకుంటుంటే, "పర్వాలేదురా! నేనే కొట్టాను కదా! నా మనవడైతే రాయనా!" అని అంటూ ఆప్యాయంగా అనిల్ దెబ్బలకి మందు రాస్తున్నాడు.


"సారీ మాష్టారు! నేను కావాలని అలా అనలేదు. అంతా ఆ నరేష్ చేశాడు!" అని అంటే "మీ ఎవరిది తప్పు కాదు. నేను సక్రమంగా ఉంటే యిలా జరిగేది కాదు. పాఠాలు నేర్పే మాష్టారికి గుణపాఠం యిది!" అని అప్యాయంగా అనిల్ తలనిమురుతూ "సరే! నేను వస్తానమ్మా! జాగ్రత్త!" అని అంటూ పశ్చాత్తాపంతో కూడిన ఆత్మసంతృప్తిగా బాధ్యతాముఖుడై ముఖంలో చిరునవ్వుతో వెనుదిరిగాడు జనార్ధనరావు మాష్టారు.


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


128 views1 comment

1 comentario


R K Naidu • 2 days ago

Old school days gurthostunnai, nice

Me gusta
bottom of page