top of page

వారసుడొస్తున్నాడు


'Varasudosthunnadu' New Telugu Story

Written By Yasoda Pulugurtha

'వారసుడొస్తున్నాడు' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

“ఏమండీ ఈ రోజు సాయంత్రం మన మనవడి బంగారపు గొలుసూ, మురుగులూ తయారయిపోతాయి, వచ్చి తీసుకుని వెళ్లండి అని నిన్న ఫోన్ లో మన కంసాలి లక్ష్మీకాంతం చెప్పాడు. మీరు సాయంత్రం ఎలాగూ అటువైపు వెళతారుకదా, మరచిపోకుండా తీసుకోండిడి”. “ అలాగే వెండి కంచం, గ్లాసుపైన అమ్మమ్మ, తాత అని పేర్లు వేయించి తీసుకురండి”.


అబ్బ, "ఎన్ని సార్లు చెపుతావు శారదా, ఇప్పటికి ఓ పదిసార్లేనా చెప్పి ఉంటావు.. తెస్తానులే.. సామానులన్నీ సర్దేసావా" ? “రైలు ప్రయాణం కూడానూ, అమ్మాయికి చంటాడితో కష్టంకాకుండా చూడుమరి”.


“అన్నీ అవుతున్నాయండీ. మీరు ఆ వస్తువులు తెచ్చేస్తే చాలావరకు అన్నీ రెడీ అయిపోయినట్లే.. అమ్మాయి కివ్వాల్సిన సారె కూడా సర్దేసాను”. “అవునూ, రేపు సాయంత్రం మన రైలు ప్రయాణానికి రవ్వ పులిహోర కలుపుతాను. కూడా కాస్త దధ్దోజనం కూడా కలిపేస్తాను.. చాలుకదా”? “పళ్లూ, స్వీట్లూ అవీ ఉండనే ఉంటాయి.


“చాలు, అంతకంటే ఎక్కువగా ఏమి తినగలం శారదా, మన పెద్దవాళ్లకి ఫరవాలేదు”. ‘ నీ మనమరాలు ‘శ్రీకరి’ ఏమి తింటుందో చూసుకో” అంటూ రామారావుగారు బయటకు వెళ్లిపోయాడు.


రామారావు, శారదల ప్రధమ సంతానం కూతురు సంయుక్త.. సంయుక్త పుట్టిన పది సంవత్సరాలకు వారికి అబ్బాయి కిరణ్ పుట్టాడు.. కిరణ్ ఇంటర్మీడియట్ అయిపోయింది.. ఇంజనీరింగ్ లో అడ్మిషన్ వచ్చింది.. రామారావు హైదరాబాద్ లో ఎల్ ఐ.. సీ ఆఫ్ ఇండియాలో ఎడ్మిని స్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు.. కూతురిని ఎమ్.. సి.. ఏ చదివించారు.. చదువు అవుతూనే కాకినాడ సంబంధం వచ్చింది.. జోగారావు, అన్నపూర్ణ దంపతులకు ఒక్కడే కొడుకు.. అతను శ్రీధర్.. కాకినాడ స్టేట్ బేంక్ లో పనిచేస్తున్నాడు.. సాంప్రదాయమైన కుటుంబమే కాకుండా ఆస్తిపరులు కూడా.. అమలాపురంలో తాతలనాటి పొలాలు, తోటలూ ఉన్నాయి..


మంచి సంబంధం కదా అని కూతురికి వెంటనే పెళ్లిచేసేసారు రామారావుగారు.. పెళ్లైన రెండు సంవత్సరాలకు సంయుక్త కి ‘శ్రీకరి’ పుట్టింది.. సంయుక్త మామగారి ఇద్దరన్నగార్లకూ, తమ్ముడికీ అందరూ ఆడపిల్లలే.. మళ్లీ వాళ్లకూ ఆడపిల్లలే. అన్నదమ్ముల్లో ఒక్క జోగారావుగారికి మాత్రమే ఒకే ఒక కొడుకు, అతనే శ్రీధర్.. శ్రీధర్ అంటే వల్లమాలిన ప్రేమ అతని పెదనాన్నలకు, బాబయ్యకూ.. శ్రీధర్ కి కొడుకు పుడితే తమ వంశ వృక్షం అలా విస్తరిస్తూ సాగి పోతుందని వారి భావన. ఒకవేళ శ్రీధర్ కి కొడుకు కలగక పోతే వంశాకురం లేకుండా పోతుందేమోనన్న దిగులు వారందరికీ. అందరూ శ్రీధర్ సంయుక్త దంపతుల మీదే ఆశ పెట్టుకున్నారు.. ప్రధమ సంతానంగా శ్రీధర్ సంయుక్తలకు అమ్మాయి పుట్టిందని తెలిసి నీరుకారిపోయారు.. ఎవరి ముఖంలోనూ ఆనందం కనిపించలేదు.


“పోనీలెండి బావగారూ, బంగారు బొమ్మలాంటి ఆడపిల్ల, అదీ వరలక్ష్మీ వ్రతం రోజున పుట్టింది, లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని సంతోషించండి" అని రామారావు అనేసరికి వియ్యంకుడు, " అది నిజమేకానీ, మేము మనవడు పుడ్తాడని ఆశపడ్డాం", మాకోడలికి మనసులో ఆడపిల్లే కావాలని ఉందేమో, అందుకే అలా జరిగి ఉండచ్చు. గర్భిణీ స్త్రీ మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుందని మన పూర్వీకులు అంటూ ఉండేవారు. “ ఏం చేస్తాం బావగారూ ? బాధపడినా ప్రయోజనం లేదుగా” అంటూ తేల్చేసాడు. ఆయనమాటల్లో ఒకలాంటి అసహనం దోత్యమైంది. అందరి దగ్గర తమ అసంతృప్తిని వెల్లడిస్తూ ఉండేవారు. ఇప్పటి కాలంలో కూడా ఆ వ్యత్యాసం ఏమిటోనని సంయుక్త బాధపడ్తూ ఉండేది.


నాలుగేళ్ల తరువాత రెండో పురిటికి పుట్టింటికి వచ్చింది సంయుక్త.. “ఈసారైనా బాబు పుడితే బాగుండునమ్మా“ అంటూ తల్లివైపు బేలగా చూస్తూ మాట్లాడుతున్న కూతురితో, “ఊరికే దిగులు పడకే సంయూ, ఏదీ మనచేతులో లేదు, అంతా భగవత్ సంకల్పం” అని ఊరడించిందావిడ.


“చదువుకున్న దానివి నీకు చెప్పాలిటే”? అయినా సంయూ, మీ అత్తవారు మగబిడ్డను కనలేదని నిన్ను నిందిస్తారనా? ఎందుకే అంత దిగులంటూ కేకలేసిందావిడ".. “ఛ అదేమీ లేదమ్మా, వాళ్లేమీ అలాంటి వాళ్లుకాకపోయినా, కొన్ని ఛాంధసభావాలు ఇంకా పేరుకుపోయి ఉన్నాయి మా అత్తగారింట్లో. మా వారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నా, ఆయన మనసులో కూడా నేను ఈసారి మగబిడ్జను కనాలనే ఆశ పెట్టుకుని ఉండచ్చు కదా అని”.


డాక్టర్ పల్లవీమనోహర్, యశోదా హాస్పటల్ లో ప్రముఖ గైనకాలిజిస్ట్.. పల్లవి చెల్లెలు ప్రణవి, సంయుక్తా ఇద్గరూ ఎమ్.. సి.. ఏ లో మంచి స్నేహితులు.. ప్రణవి భర్తతో అమెరికాలో ఉంటున్నా సంయుక్తతో మంచి కాంటాక్ట్ లోనే ఉంది.. సంయుక్త కూతురు 'శ్రీకరి' డెలివరీ కూడా యశోదా హాస్పటల్లో డాక్టర్ పల్లవే చేసింది.. ఈసారికూడా డాక్టర్ పల్లవి దగ్గరే చూపించుకుంటోంది.. డాక్టర్ పల్లవిని ప్రణవి పిలిచినట్లుగానే అక్కా అని పిలుస్తుంది..


ఆరోజు పెయిన్స్ వస్తున్నట్లుగా అనిపించి హాస్పటల్ కు వచ్చిన సంయుక్త ని చూస్తూ.. " ఏం సంయుక్తా కడుపులో ఉన్నబాబు తొందరపెడ్తున్నాడుకదూ, బయటకు వచ్చేయాలని" అంటూ హాస్యమాడింది పల్లవి..

“బాబే పుడ్తాడంటావా అక్కా అంటూ అమాయకంగా మాట్లాడుతున్న సంయుక్తని చూస్తూ”.. " ఏం పాప పుడితే పెంచుకోవా ఏమిటీ? పోనీ పాప పుడితే నాకిచ్చేసి మరోసారి బాబుని కందువులే అంటూ జోక్ చేసింది"..


సంయుక్తకి డెలివరీ అయింది. నర్స్ తో ఎవరూ వినకుండా “బయట విజిటర్స్ హాల్ లో సంయుక్త వాళ్ల కుటుంబ సభ్యులుంటారు, వాళ్లతో పాప పుట్టినట్లు చెప్పమని పంపించింది”. ఈలోగా సంయుక్త మెల్లిగా కళ్లు తెరుస్తూ“ ఎవరు పుట్టారక్కా” అని అడగ్గానే, నీవు కోరుకున్నట్లుగా బాబే పుట్టాడంటూ అభినందించింది.. సంయుక్త ముఖం అంత నీరసంలోనూ కలువ పువ్వులా విచ్చుకుంది. తనకి ఆరోగ్యంగా ఎవరు పుట్టినా ఆనందమే. తన భర్త శ్రీధర్ కూడా ఎప్పుడూ కొడుకే కావాలంటూ తన ముందు అనలేదు. ఎటొచ్చీ అత్త మామలూ, పెదమామగారు, చిన మామగారు మాత్రం చాలా ఆశపెట్టుకున్నారు. పోనీలే వారి కోరిక తీరిందనుకుంటూ సంతోషపడింది.


కాసేపు తరువాత డాక్టర్ పల్లవి విజిటర్స్ హాల్ లోకి వచ్చింది.. సంయుక్త అమ్మా, నాన్నా, మేనత్తా, తమ్ముడూ అందరూ ఉన్నారు.. అందరూ డల్ గా ఉన్నారు.. కిరణ్ అయితే ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు..


“ఏమిటీ ? అంకుల్, ఆంటీ ముఖాలలో మనవరాలు పుట్టిందన్న సంతోషమే కనపడడం లేదంటూ వాళ్లను పలకరించింది".


“మాకు ఆనందమేనమ్మా పల్లవీ, కానీ మా సంయుక్త అత్తవారు నిరాశపడ్తారని అనుకుంటున్నాం”.


ఈలోగా కిరణ్ అక్కడకు వస్తూ, " నాన్నా బావకి చెప్పాసాను, అక్కకు పాప పుట్టిందని".. “అవునా అన్నారు బావగారు”. "మీ అక్కఎలా ఉందని అడిగారు కానీ బావ గొంతుకలో ఎక్సైజ్ మెంట్ లాంటిది ఏమీ అనిపించలేదు నాకు” అని చెపుతుండగా..


ఉన్నట్టుండి ఫక్కుమంటూ నవ్వేసింది డాక్టర్ పల్లవి.. ఇంకావారిని అదే మూడ్ లో ఉంచడం భావ్యం కాదనుకుంది..


వెంటనే " అంకుల్, మీరందరూ ఆశించినట్లు బాబే పుట్టాడు.. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు". మీ అందరిని కాసేపు టెన్షన్ లో ఉంచాను కావాలని. మా డాక్టర్లకి ఎవరైనా ఒకటే.. పుట్టిన బిడ్డ తల్లి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటామే తప్పఆడపిల్లా, మగపిల్లాడా అన్న వివక్షత ఉండదంటూ కిరణ్ ని సంయుక్త భర్తకు ఫోన్ కనెక్ట్ చేయమంది.. తనే ఫోన్ అందుకుని “ నేను డాక్టర్ పల్లవిని శ్రీధర్ గారూ, మీకు బాబు పుట్టాడు నేనే సరదాగా మీ అందరినీ ధ్రిల్ చేయాలని పాప పుట్టిందని చెప్పమన్నాను కంగ్రాట్స్ అంటూ అభినందించింది”.


సంయుక్త అత్తవారింట సంబరాలు చోటుచేసుకున్నాయి.. ఎడతెరిపి లేని ఫోనుల వర్షంలో ఆనందంతో తడిసి ముద్ద అయిపోతున్నారందరూ.. పిల్లవాడు పుట్టిన ఘడియలు, సమయం వగైరా అన్నీ నోట్ చేసుకుంటున్నారు. జాతక చక్రాలు అవీ వేయించడానికి.


బాబుకి మూడవ నెల వచ్చింది.. బారసాల కాకినాడ లో మా ఇంట్లోనే అన్నారు వియ్యాలవారు.. బారసాలకు ముహూర్తం పెట్టించి కోడలిని, మనవరాలుని, మనవడిని తీసుకుని అందరూ రావలసిందిగా వియ్యాలవారి ఆహ్వానం వస్తే గౌతమీ ఎక్స్ ప్రెస్ కు అందరికీ టిక్కెట్లు బుక్ చేసారు రామారావుగారు..


మర్నాడు సాయంత్రం అందరూ రైల్వే స్టేషన్కు చేరుకుని వారికి రిజర్వ్ అయిన కంపార్ట్ మెంట్ లో ఎవరిసీట్లో వారు కూర్చున్నారందరూ.. అసలే అందమైన సంయుక్త బాలింతరాలి శోభతో మరింత అందంగా మెరిసిపోతోంది.. స్టేషన్ కు బయలదేరేముందు మెసేజ్ చేసింది భర్తకు.. " మీ ప్రతిరూపమైన మన వంశాంకురాన్ని చూసిన క్షణాన, మీ కళ్లల్లో వెలిగే కాంతిరేఖలను కనులారా వీక్షించాలని ఉవ్విళ్లూరుతో బయలదేరుతున్నాను శ్రీధర్ అంటూ”. దానికి సమాధానంగా “నాకు అంత చక్కని బహుమతి ఇచ్చిన నా ప్రియమైన సంయూ కోసం క్షణం ఒక యుగంగా వేచి చూస్తున్నాను అంటూ”.


ఆమె ఒడిలో బాబు.. తెల్లగా బొద్దుగా నల్లని జుట్టుతో మెరిసిపోతూ, నవ్వుతూ తల్లికి ఏవో సంకేతాలను అందిస్తున్నాడు.. కూతురికి అందరూ కోరుకున్నట్లుగా కొడుకు పుట్టాడని, వియ్యాలవారింటికి పెద్ద వారసుడు బయలదేరి వస్తున్నాడని మనవడివైపే చూస్తూ తెగ మురిసిపోతోంది శారద.. అత్తవారింట్లో తన కూతురు అందరి అభిమానాన్ని చూరగొంటూ ఆనందంగా కాపురం చేసుకోవాలని తహ తహ లాడే ఒక తల్లి శారద.


మేనల్లుడు తనతో క్రికెట్ ఆడడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అనుకుంటూ కిరణ్ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు.. నాలుగేళ్ల శ్రీకరి కి తల్లిమీద చాలా కోపంగా ఉంది.. తమ్ముడు పుట్టినప్పటినుండి అమ్మగానీ అమ్మమ్మగానీ తనను ముద్దుచేయడం మానేసారు.. నిన్న రాత్రి అమ్మదగ్గర బజ్జుందామని వెడితే అమ్మ తమ్ముడికి జోలపాట పాడుతోంది, " రామాలాలీ మేఘశ్యామాలాలీ, తామరస నయనా దశరథ తనయా లాలీ" అంటూ".. ఆపాట అమ్మ తమ్ముడు పుట్టకముందు తనను నిద్రపుచ్చుతూ పాడేపాట.. తనని చూడగానే, " బంగారూ వెళ్లి అమ్మమ్మ దగ్గర పడుకోమ్మా" అంటూ అక్కడనుండి పంపేసింది.. తనకి ఎంతో ఏడ్పు వచ్చింది..


ఇప్పుడైనా తమ్ముడిని అమ్మమ్మ ఒళ్లో బజ్జోపెట్టి నన్ను అమ్మ ఒళ్లో కూర్చోపెట్టుకొట్టుకుని కధలు చెప్పొచ్చుకదా అనుకుంటూ కోపంగా ఎవరివైపు చూడకుండా కిటికిలోనుండి కదలిపోతున్న చెట్లవైపు చూస్తోంది..


రామారావుకి వియ్యంకుడి మీద చాలా కోపంగా ఉంది.. మనవరాలు శ్రీకరి పుట్టినపుడు ఏమిటో నిర్లిప్తంగా, అంతా తన కూతురి తప్పు అన్నట్లుగా మాట్లాడినవాడు, ఇప్పుడు మనవడు పుట్టగానే వియ్యంకుడి గొంతు నిండా హుషారే.. " బావగారూ అంటూ రోజూ ఫోనులే”. సమయానుకూలంగా కొందరు మనుషులు భలే మారిపోతారుకదా అని మనసులో అనుకున్నారు.


“అవును తన బంగారుతల్లి సంయుక్తకు పుట్టింటి వైపు వారి చార వచ్చింది కాబట్టి కొడుకుపుట్టాడు”. ‘వాళ్ల చార వస్తే వియ్యంకుడి సోదరలకు మల్లే మళ్లీ ఆడపిల్లే పుట్టేది’. “అంతా తమ పూజాఫలాల గొప్పతనమే అంటూ విర్రవీగుతున్నాడు వియ్యంకుడు, హు, తన కూతురు కాబట్టి ఆ ఇంటికి వారసుడిని అందించింది”. అదే మరొకరైతే మళ్లీ ఆడపిల్లనే కనేద్దురనుకుంటూ రోషంగా ముఖం తిప్పి ఎటో చూస్తున్నాడు..


ఉన్నట్టుండి సంయుక్త మూతి ముడుచుకుని సీరియస్ గా కిటికీలోనుండి బయటకు చూస్తున్న కూతురివైపు చూసింది.. కోపంతో చిన్న సున్నాలా ముడుచుకుని ఉన్న ‘శ్రీకరి’ ఎర్రని పెదాలను చూసేసరికి భలే ముద్దొచ్చేసింది.. “నిజమే, ఈ మధ్య బాబు పుట్టాక శ్రీ ని ముద్దు చేయడంలేదు”. వెంటనే బాబుని తల్లి ఒడిలో పడుకోపెట్టి నెమ్మదిగా శ్రీకరి వైపుకి జరిగి వెనుకనుండి చంకలో కిత కితలు పెట్టేసరికి కిలకిలా నవ్వుతూ అమ్మ ఒడిలోకి వాలి పోయింది శ్రీకరి.. " మా శ్రీలూకి అలకలు కూడా తెలుసునే అంటూ”. “మా బంగారు తల్లి తరువాతే మరెవరైనా అంటూ పాలుగారే ఆ చిన్నారి శ్రీకరి అందమైన బుగ్గలను ముద్దాడింది”. “అమ్మ ఒడి నాదే సుమా అంటూ తమ్మునివైపు గర్వంగా చూసింది శ్రీకరి”.


ఎవరి భావావేశాలతో నాకు నిమిత్తం లేదు సుమా అనుకుంటూ ట్రైన్ శరవేగంతో ఒక అపురూపమైన వారసుడిని జాగ్రత్తగా తన గమ్యస్తలాన్ని చేర్చడానికి పరుగులు తీస్తోంది..***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.








63 views0 comments

Comentarios


bottom of page