వయ్యారి వాలు జడ
- Jamunarani B
- 5 hours ago
- 7 min read
వయ్యారి వాలు జడ, తెలుగు కథ, హాస్య కథ, కుటుంబ కథ, మహిళల జుట్టు, పొడవాటి జడ, తెలుగు సాహిత్యం, సరదా కథ, తెలుగు వినోదం, కుటుంబ అనుబంధాలు, మన తెలుగు కథలు

Vayyari Valu Jada - Telugu Comedy Story | Sritha
వయ్యారి వాలు జడ - తెలుగు హాస్య కథ | శ్రిత
Published in manatelugukathalu.com on 14/07/2026
ఆడపిల్ల అందంలో జుట్టుకు ఉన్న ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్ననాటి నుంచి పెద్దయ్యే వరకు ఒక అమ్మాయి జడతో ఎన్నో జ్ఞాపకాలు, సరదా సంఘటనలు, కుటుంబ అనుబంధాలు ముడిపడి ఉంటాయి. "వయ్యారి వాలు జడ" కథలో వల్లి జీవితంలోని ప్రతి దశలో ఆమె పొడవాటి జడ ఎలా నవ్వులు పంచిందో, ఎలా ప్రత్యేక గుర్తింపుగా మారిందో హాస్యభరితంగా, హృద్యంగా చెప్పబడింది. కుటుంబమంతా కలిసి చదివి ఆనందించే కథ ఇది.
🌺 1. పరిచయం:
ప్రతి మహిళకు తన జడంటే ప్రత్యేకమైన మమకారం. ఆ కేశాలే ఆమెకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఆభరణం. ఆ కేశసంపద కోసం ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. శీకాకాయ, కుంకుడుకాయతో తలస్నానం చేయడం నుంచి ఆధునిక షాంపూలు, నూనెల వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే అందమైన, పొడవైన, నల్లని జడ అంటే ప్రతి అమ్మాయి కల.
అయితే ఈ కథ ఆ ప్రయత్నాలతో మొదలుకాదు...
ఈ కథ మొదలయ్యేది ఒక పసిపాప పుట్టిన క్షణం నుంచే.
"తలకు శీకాకాయ పెడితే జుట్టు నల్లగా పెరుగుతుంది...", "కుంకుడుకాయతో కడిగితే మెత్తగా ఉంటుంది...", "పొడవాటి జడ వేసుకుని పూలజడ కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో!"
అంటూ అమ్మమ్మలు, బామ్మలు, అమ్మలు, తాతలు, మామలు, బాబాయిలు ప్రేమగా చెప్పే మాటలు ఆ చిన్నారి చెవుల్లో నాటుకుపోతాయి. ఆ మాటలతోనే ఆమె పెరుగుతుంది.
జుట్టు అనేది కేవలం వెంట్రుకలు కావని, అవి ఒక ఆడపిల్ల అందానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని తెలియకుండానే నేర్చుకుంటుంది.
అలా... ఒక జడతో మొదలైన అనుబంధం, ఒక జీవిత ప్రయాణంగా మారుతుంది.
ఇప్పుడు మన కథానాయిక వల్లి జీవితంలోకి అడుగుపెడదాం.
వల్లి... పేరు ఎంత అందమో, ఆమె జడ కూడా అంతే అందం. నల్లని మేఘంలా నడుము దాటి జారిపడే ఆ వయ్యారి జడ వెనుక దాగి ఉన్న కథ ఏమిటి? ఆ జడ వల్ల వల్లి జీవితంలో జరిగిన మలుపులు ఏమిటి?
రండి... "వయ్యారి జడ" కథను కలిసి చదువుదాం.
🌺 2. ఎంత ఒత్తైన జుట్టు!
వల్లి పుట్టిన రోజే ఇంట్లో వాళ్లందరూ ఒకటే మాట అన్నారు.
"అయ్యో! ఈ పాపకి ఎంత ఒత్తైన జుట్టు!", "ఎంత నల్లగా ఉందో!", "పెద్దయ్యాక ఎంత అందమైన జడ వేస్తుందో చూడాలి!"
అమ్మమ్మలు, బామ్మలు, పిన్నులు, అత్తలు... అందరూ ఆమె జుట్టు మీదే మురిసిపోయేవారు. శీకాకాయతో తలంటించడం, కుంకుడుకాయతో తలస్నానం చేయించడం, సాంబ్రాణి పొగలో జుట్టు ఆరబెట్టడం... ఇలా ప్రేమగా కేశ సంరక్షణ చేసేవారు. ఆ చిన్నారి ముసిముసి నవ్వులు చూస్తూ అందరూ మురిసిపోయేవారు.
కాలం గడిచింది. వల్లి స్కూల్‌లో అడుగుపెట్టింది.
స్కూల్ అంటే ఆటలు, పరిగెత్తులు, గెంతులు. కానీ వల్లి జడ మాత్రం ఎప్పుడూ అందరి చూపును ఆకర్షించేది. అమ్మ జడ వేసినా, అమ్మమ్మ వేసినా, బామ్మ వేసినా, పిన్ని వేసినా, అత్త వేసినా, పెద్దమ్మ వేసినా... ఎవరు వేసినా ఆమె జడ ముద్దుగానే ఉండేది.
రెండు పొడవాటి జడలు వేసుకుని, వాటికి రిబ్బన్లు కట్టి, జడలు ఊపుకుంటూ చకచకా స్కూల్‌కు వెళ్లేది.
ఒక రోజు స్కూల్‌లో వార్షికోత్సవం కోసం ఆడిషన్లు జరుగుతున్నాయి.
"రాణి పాత్రకు ఎవరి జడ పొడవుగా ఉంటే వారినే ఎంపిక చేస్తాం," అని టీచర్ చెప్పారు.
వల్లి కూడా వరుసలో నిలబడింది. ఆమె జడను చూసిన వెంటనే టీచర్లు ఒకరినొకరు చూసుకుని...
"ఇదే మన రాణి!" అని ప్రకటించారు.
వల్లి ఆనందానికి అవధులే లేకపోయాయి.
వార్షికోత్సవం రోజు తెల్లవారుజామునే ఇంట్లో హడావిడి మొదలైంది. తలకు కుంకుడుకాయతో స్నానం చేయించి, సాంబ్రాణి పొగలో జుట్టు ఆరబెట్టి, నూనె రాసి, చక్కగా దువ్వి అందమైన పొడవాటి జడ వేశారు.
ఇక చివరగా జడకు కుచ్చులు కట్టాలి.
అదే అసలు పరీక్ష!
వల్లి ఒక్కచోట కుదురుగా కూర్చుంటే కదా! కాసేపు ఇటు... కాసేపు అటు... నవ్వుతూ, మాట్లాడుకుంటూ కదులుతూనే ఉంది. ఎలాగోలా కుచ్చులు బిగించి స్టేజ్‌కి పంపించారు.
స్టేజ్‌పైకి వెళ్లిన తర్వాత వల్లి తన పాత్రలో పూర్తిగా లీనమైంది. ధైర్యంగా డైలాగులు చెప్పింది. నృత్యం చేస్తూ, వయ్యారంగా జడను పట్టుకుని తిరుగుతోంది.
అంతలో...
ధడాక్!
జడకు కట్టిన కుచ్చులు ఊడిపోయాయి.
ఒక్క క్షణం అందరూ ఉలిక్కిపడ్డారు.
కానీ వల్లి మాత్రం ఏమాత్రం తడబడలేదు. క్షణంలో పరిస్థితిని అర్థం చేసుకుంది. ఊడిపోయిన కుచ్చులను చాకచక్యంగా వడ్డాణం దగ్గర దాచేసి, జడను ఒక చేత్తో అందంగా పట్టుకుని, ఏమీ జరగనట్టే చిరునవ్వుతో తన నటనను కొనసాగించింది.
ప్రేక్షకులకు అసలు విషయం తెలియనే తెలియలేదు.
నాటకం ముగిసిన తర్వాత ఆమె స్నేహితులు పరుగెత్తుకుంటూ వచ్చి...
"అమ్మో వల్లి! నీ తెలివి మామూలు కాదు. కుచ్చులు ఊడిపోయినా ఏమాత్రం బెదరకుండా జడను చేతిలో పట్టుకుని నటించావు. కుచ్చులు వడ్డాణం దగ్గర దాచేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? నీ తెలివికి నిజంగా జోహార్లు!" అని నవ్వుకుంటూ మెచ్చుకున్నారు.
వల్లి మాత్రం అమాయకంగా నవ్వుతూ,
"స్టేజ్ మీద ఏడవడం కంటే... జడను కాపాడుకోవడం మంచిదనిపించింది!" అంది.
ఆ మాట విన్న వాళ్లందరూ పగలబడి నవ్వేశారు.
🌺 3. పెళ్లి తర్వాత మొదటి రోజు
కాలం ఎవరినీ ఆపదు కదా! రెండు జడలు వేసుకుని స్కూల్‌కు వెళ్లిన వల్లి... చూసేలోపే పెద్దదైపోయింది. చదువు పూర్తయింది. ఉద్యోగం వచ్చింది. చివరికి ఇంట్లో పెద్దలు మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేశారు.
పెళ్లి మండపంలో కూడా అందరి చూపు వల్లి నగల మీద కాదు... ఆమె జడ మీదే!
"అమ్మో! ఈ జడ నిజమా? లేక ఎక్స్‌టెన్షన్ పెట్టారా?" అని ఒక పిన్ని అడిగింది.
"అయ్యో! ఇది చిన్నప్పటి నుంచే ఇంతే. దేవుడు ఇచ్చిన వరం!" అని అమ్మ గర్వంగా చెప్పింది.
పెళ్లికూతురి జడకు మల్లెపూలు, కనకాంబరాలు, జడగంటలు, జడకుచ్చులు... ఏమి తక్కువలేదు. జడ బరువా? నగల బరువా? అనేది వల్లికే అర్థం కాలేదు.
పెళ్లి అయిపోయింది. ఇక అత్తారింటికి వెళ్లే సమయం వచ్చింది.
కారు ఎక్కబోతుంటే ఇంకో కొత్త సమస్య!
వల్లి జడ అంత పొడవుగా ఉంది... కారు డోర్ మూసేలోపే జడ సగం బయటే ఉంది.
"ఆగండి... ఆగండి... ముందుగా పెళ్లికూతురిని కాదు, జడను లోపల పెట్టండి!" అని ఒక బాబాయి అరిచాడు.
డ్రైవర్ నవ్వుకుంటూ, "సార్... ఫ్యామిలీ మొత్తం ఎక్కిపోయింది... ఇంకా ఒక 'జడ ప్యాసింజర్' మిగిలిపోయింది!" అన్నాడు.
అందరూ పగలబడి నవ్వేశారు.
వల్లి సిగ్గుతో నవ్వుకుంటూ తన జడను ఒడిలో పెట్టుకుంది.
"అమ్మా... మా ఇంట్లో నీకు ఒక అల్మరా, నీ జడకు ఇంకో అల్మరా ఏర్పాటు చేయాలి అనుకుంటున్నా!" అని అత్తగారు నవ్వుతూ అన్నారు.
"అత్తయ్య... నాకు ఒక్క గది చాలు... కానీ నా జడకు మాత్రం ప్రత్యేక గౌరవం ఇవ్వాలి!" అని వెంటనే వల్లి అంది.
ఆ మాటకు మళ్లీ అందరూ నవ్వులతో మునిగిపోయారు. అలా... వల్లి మాత్రమే కాదు, ఆమె వయ్యారి జడ కూడా ఘనంగా అత్తారింట్లో అడుగుపెట్టింది.
🌺 4. విగ్నేశ్‌కు మొదటి షాక్!
పెళ్లి అయి వల్లి అత్తారింట్లో అడుగుపెట్టింది.
అయితే మీకు ఇంకో విషయం తెలియదు...
వల్లికి భర్తగా వచ్చిన విగ్నేశ్ చాలా మంచివాడు, బంగారం లాంటి మనసు. కానీ... ఖర్చుల విషయానికి వస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా లెక్క తప్పనివ్వడు. కరెంట్ బిల్లు నుంచి కొత్తిమీర కట్ట వరకు అన్నీ ఖాతాలో ఉండాలి!
పెళ్లయి నెల రోజులు అయింది.
ఒక ఆదివారం ఉదయం విగ్నేశ్ చేతిలో ఇంటి ఖర్చుల డైరీ, కరెంట్ బిల్లు, సూపర్ మార్కెట్ బిల్లులు పట్టుకుని కూర్చున్నాడు.
"ఏదో లెక్క తేడాగా ఉంది..." అని మెల్లగా గొణుక్కున్నాడు.
వల్లి కిచెన్‌లో నుంచి, "ఏమండీ... ఏమైనా పోయిందా?" అంది.
"పోవడం కాదు... డబ్బులు పారిపోతున్నాయి!"
"ఎక్కడికి?"
"నీ జడ దగ్గరికి!" అని విగ్నేశ్ అన్నాడు.
వల్లి ఆశ్చర్యంగా, "అదేంటి?" అని అడిగింది.
విగ్నేశ్ బిల్లులు చూపిస్తూ, "చూడూ... గత నెల కొబ్బరి నూనె ఒక బాటిల్ తెచ్చేవాళ్లం. ఈ నెల మూడు బాటిళ్లు! షాంపూ ఒకటి తెచ్చేవాళ్లం... ఇప్పుడు రెండు పెద్ద బాటిళ్లు! కండీషనర్ వేరే! సాంబ్రాణి వేరే! అన్నిటికన్నా ఈ కరెంట్ బిల్లు... ఇంత ఎందుకు వచ్చింది?"
అంతలో అత్తగారు నవ్వు ఆపుకోలేక, "అబ్బాయ్... నీకు ఇప్పుడు అసలు విషయం తెలిసింది" అంది.
"ఏంటమ్మా?"
"నువ్వు ఒక్క కోడల్ని చేసుకోలేదు... ఒక వయ్యారి జడని కూడా ఇంటికి తెచ్చుకున్నావు!"
అంతే…
ఇంట్లో అందరూ నవ్వేశారు. విగ్నేశ్ ఇంకా లెక్కలు వేస్తూనే ఉన్నాడు.
"అంటే... ఈ కొబ్బరి నూనె అంతా...?"
"జడకే."
"షాంపూ?"
"జడకే."
"సామ్బ్రాణి?"
"జడకే."
"గీజర్?"
"ఆ జడ ఆరాలంటే వేడి నీళ్లు కావాలి కదా!"
"అంటే... ఈ ఇంట్లో నేనొక్కడినే కాదు... ఇంకో VIP కూడా ఉన్నాడన్నమాట!" అని విగ్నేశ్ రెండు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని అన్నాడు.
"VIP కాదు... VHP... Very Hairy Person!" అని వల్లి నవ్వుతూ అంది.
అంతే...
"అయ్యో దేవుడా! నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా... లేక ఒక హెయిర్ ప్రాజెక్ట్‌ని పెళ్లి చేసుకున్నానా?" అని విగ్నేశ్ తల పట్టుకున్నాడు.
ఆ రోజు నుంచి ఇంట్లో నెలాఖరు వస్తే విగ్నేశ్ ముందుగా బ్యాంక్ బ్యాలెన్స్ చూడడు…
"కొబ్బరి నూనె ఎంత మిగిలింది?" అని అడగడం మాత్రం మర్చిపోడు!
🌺 5. బ్యూటీ పార్లర్‌లో సంచలనం
కాలం గడుస్తూనే ఉంది. వల్లి తన వయ్యారి జడను అలాగే ప్రేమగా చూసుకుంటూ ఉద్యోగానికి వెళ్లేది. ఆఫీసులో ఆమె పని కంటే ముందుగా వచ్చేది ఆమె జడ!
లిఫ్ట్‌లో ఎక్కినా...
క్యాంటీన్‌కి వెళ్లినా...
మీటింగ్‌లో కూర్చున్నా...
అందరి చూపూ ఆమె జడ మీదే.
ఒక రోజు సహోద్యోగిని అడిగింది, "వల్లీ... ఈ రోజుల్లో ఇంత పొడవాటి జడ ఎవరు పెట్టుకుంటారు? ఫెదర్ కట్ చేసుకో."
ఇంకో అమ్మాయి వెంటనే,
"అయ్యో! ఫెదర్ కట్ కాదు... లేయర్ కట్ చేస్తే సూపర్‌గా ఉంటుంది" అంది.
మూడో అమ్మాయి,
"U కట్... V కట్... స్టెప్ కట్... ఏదో ఒకటి చేయించు. లుక్ మొత్తం మారిపోతుంది" అని చెప్పింది.
"నా జడను చూస్తే మీ అందరికీ సెలూన్ ఐడియాలే వస్తున్నాయా?" అని వల్లి నవ్వుతూ అంది.
చివరికి ఫ్రెండ్స్ బలవంతం చేయడంతో ఒక రోజు బ్యూటీ పార్లర్‌కి వెళ్లింది. వల్లి లోపల అడుగు పెట్టగానే అక్కడ ఉన్న స్టైలిస్టులంతా ఒక్కసారిగా ఆమె వైపు తిరిగి చూశారు.
"అది... నిజమైన జుట్టేనా?" అని ఒకరు నెమ్మదిగా అడిగారు.
ఇంకొకరు,
"ఎక్స్‌టెన్షన్స్ అనుకుంటా..." అన్నారు.
మూడో వ్యక్తి దగ్గరకు వచ్చి మెల్లగా జడను చూసి, "అయ్యో! నిజంగానే ఆమె జుట్టే!" అని ఆశ్చర్యపోయాడు.
ఐదు నిమిషాలు వాళ్లంతా వల్లి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఒక స్టైలిస్ట్ ధైర్యం చేసి అడిగింది, "మేడమ్... ఏ కట్ చేయాలి?"
"అందుకే మీ దగ్గరకు వచ్చాను. మీరే చెప్పండి" అని వల్లి నవ్వుతూ అంది.
వెంటనే పార్లర్ అంతా నిశ్శబ్దం. ఒకరు మరొకరి ముఖం చూసుకున్నారు.
"ఇంత అందమైన జడను కట్ చేసే పాపం ఎవరు చేసుకుంటారు?"
"నా చేత కాదు!"
"నా కత్తెరకు ఆ ధైర్యం లేదు."
"నేను రాజీనామా చేస్తాను... కానీ ఈ జడను కట్ చేయను!"
అని ఒక్కొక్కరు వెనక్కి తగ్గారు. చివరికి పార్లర్ ఓనర్ వచ్చి నవ్వుతూ అన్నారు.
"మేడమ్... మీకు హెయిర్ కట్ అవసరం లేదు. మీ జడను చూసి మేమే రెండు నిమిషాలు స్ఫూర్తి పొందాం. కావాలంటే హెయిర్ స్పా చేస్తాం... కానీ ఒక్క వెంట్రుక కూడా కట్ చేయమని మాత్రం చెప్పొద్దు!"
"అంటే... నా జడకి సెలూన్‌లో కూడా VIP ట్రీట్‌మెంట్ అన్నమాట!" అని వల్లి పెద్దగా నవ్వేసింది.
"VIP కాదు మేడమ్... 'డూ నాట్ టచ్' కేటగిరీ!" అని పార్లర్ వాళ్లు కూడా నవ్వుతూ అన్నారు.
ఆ రోజు వల్లి ఒక్క వెంట్రుక కూడా కత్తిరించకుండా, మరింత గర్వంగా తన వయ్యారి జడను ఊపుకుంటూ బయటకు వచ్చింది. ఈ సంఘటన తర్వాత వల్లి జడకు ఊర్లో ఒక కొత్త పేరు వచ్చింది... "కట్ చేయడానికి కూడా భయపడే జడ!" 😊
🌺 7. కాలం పరిగెడుతోంది…
కాలం కన్నా కాలమే వేగంగా పరిగెడుతోంది. చివరికి వల్లికి సీమంతం జరిగింది. ఆమె కలలు నిజమయ్యాయి. ముద్దుల బాబు పుట్టాడు. రోజులు గడుస్తున్నాయి, బాబు కూడా పెద్దవాడవుతున్నాడు. "దేవుడికి తలనీలాలు ఇవ్వాలి… తిరుపతికి వెళ్లాలి" అని ఇంట్లో అందరూ నిర్ణయించుకున్నారు.
తిరుపతి ప్రయాణం అంటే టికెట్లు, ట్రైన్ బుకింగ్, బ్యాగులు సర్దుకోవడం… అన్నీ పూర్తయ్యాయి. చివరికి ప్రయాణం మొదలైంది.
ట్రైన్‌లో బెర్త్ మీద కూర్చుంది వల్లి. అంతే… ఆమె పొడవాటి జడ కిందికి వేలాడిపోయింది! జడను కిందికి వదిలితే దారిలో వెళ్లేవాళ్లు "అయ్యో!" అంటూ తొక్కుకుంటూ వెళ్తున్నారు. జడను పైకి వేసుకుంటే, ముద్దుల బాబు దాన్ని బొమ్మ అనుకుని గట్టిగా లాగేస్తున్నాడు.
చుట్టూ ఉన్నవాళ్లు ఆ సీన్ చూసి నవ్వుకుంటున్నారు. వల్లికి మాత్రం నవ్వు రాలేదు. "ఈ జడను పట్టుకోవాలా… బాబుని పట్టుకోవాలా?" అని తల పట్టుకుంది.
ఒక చేతిలో బాబు… మరో చేతిలో జడ… మధ్యలో బ్యాగులు. ఇలా ఆమె పరిస్థితి చూస్తే సర్కస్‌లో జగ్గ్లింగ్ చేస్తున్నట్టే ఉంది! ఇంకా వాష్‌రూమ్‌కి వెళ్లడం అయితే ఇంకో పెద్ద సాహసం. ముందు జడను చుట్టుకోవాలి… తర్వాత చున్నీని సర్దుకోవాలి… లోపలికి వెళ్లాక "ఈ జడ కింద ఎక్కడ పడుతుందో!" అని మరో టెన్షన్.
జడ మాత్రం రోజురోజుకీ పొడవవుతోంది. కానీ దాన్ని మేనేజ్ చేస్తూ ప్రతి పని చేయడం వల్లికి పెద్ద పరీక్షగానే మారింది. ఇదంతా చూస్తున్న ఆకాశవాణి, ఆ జడ ఇద్దరూ మనసులో నవ్వుకుంటున్నారు.
"ఏమ్మా వల్లి! జడ పెంచడం ఈజీ… కానీ దాన్ని మేనేజ్ చేయడం ఒక ఫుల్‌టైమ్ జాబ్ అని ఇప్పుడైనా అర్థమైందా?" అని ఆకాశవాణి చిలిపిగా అనుకుంది.
🌺 7. దర్శనం
తిరుపతి చేరేసరికి దర్శనానికి ఉన్న క్యూ చూసి వల్లి ఒక్కసారి తన జడను, ఇంకోసారి క్యూను చూసింది.
"గోవిందా... నిన్ను చూడాలా? లేక నా జడను కాపాడాలా?" అనుకుంది.
దర్శనంలో తోపులాట మొదలైంది. ఒకరు జడ మీద కాలు వేస్తే, ఇంకొకరు "సారీ అక్కా" అంటున్నారు.
ఇంకొకరు జడను తాడు అనుకుని పట్టుకుని ముందుకు వెళ్లబోతున్నారు. వల్లి మాత్రం అనుభవజ్ఞురాలిలా జడను ఒక చేత్తో చుట్టుకుంటూ, మరో చేత్తో బాబును పట్టుకుని, మధ్య మధ్యలో భర్త విఘ్నేశ్‌ను కూడా వెతుక్కుంటూ దర్శనం పూర్తి చేసింది.
చుట్టుపక్కల వాళ్లు మాత్రం జడనే చూస్తున్నారు. "అమ్మా... ఈ జడ అసలేనా?" అని ఒకరు, "విగ్గా?" అని ఇంకొకరు అడిగారు.
"ఇంత జడను ఎలా మేనేజ్ చేస్తుందో!" అని ఆడవాళ్లు ఆశ్చర్యపోతే, కొందరు మగవాళ్లు రెండుసార్లు తిరిగి చూసి, వాళ్ల భార్యల చేత మొట్టికాయలు కూడా తిన్నారు!
దర్శనం అయిపోయింది. బయటకు వచ్చి లడ్డూలు, ప్రసాదాలు తింటున్నారు. చిన్న వరుణ్ అమ్మ జడను పట్టుకుని బొమ్మలా ఆడుకుంటున్నాడు. వచ్చినవాళ్లు వెళ్లినవాళ్లు అందరూ జడతోనే సెల్ఫీలు తీయాలని చూస్తున్నారు. అంతా అయిపోయాక క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి బయల్దేరారు.
క్యాబ్ దగ్గరకు వచ్చి సామాన్లు ఎక్కిస్తున్నారు. వల్లి జడ కూడా వచ్చింది... కానీ జడతో ఆడుకుంటున్న వరుణ్ మాత్రం కనిపించలేదు!
"అయ్యో! వరుణ్... వరుణ్..." అంటూ అందరూ గాబరా పడ్డారు.
🌺 8. ముగింపు
పిల్లాడు వరుణ్ కనిపించగానే, "ఇప్పుడు వల్లి ఏమి మొక్కుకుంటుందో చూద్దాం!" అని శ్రీ వెంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవి ఇద్దరూ ఆసక్తిగా చూస్తున్నారట.
ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వల్లి చేతులు జోడించి, "దేవుడా! నా కొడుకును క్షేమంగా నాకు అప్పగించావు. నేను కొండకు నడిచి వస్తాను అని మొక్కింది, ఇక నా భర్త తలనీలాలను నీకు సమర్పిస్తాను!" అని మొక్కేసింది.
అది విన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, "అమ్మో! ఇదేంటి కొత్త మొక్కు?" అన్నట్లు లక్ష్మీదేవి వైపు చూశారట.
లక్ష్మీదేవి నవ్వుతూ, "ఏమండీ! జడంటే ఆడవాళ్ల ప్రాణం. కురులంటే వారి గర్వం. నా భక్తురాలు తన జడను కాపాడుకోవాలనుకుంది. మాతృత్వాన్ని నిలబెట్టుకుంది. భర్త తలనీలాలతో మొక్కు తీర్చుకుంటానని చెప్పింది. ఆమె కోరికను మన్నించండి," అంది.
వెంకటేశ్వరస్వామి చిరునవ్వు నవ్వి, "నిజమే లక్ష్మీ! మీ భార్యలు మామూలు వాళ్లు కారు. జడ కోసం ఏమైనా చేస్తారు, మొక్కు కూడా మారుస్తారు, ఎక్కడైనా సరే, చివరికి భర్తలనే బలి చేస్తుంటారు!" అని సరదాగా అన్నారట.
అంతే... అందరూ నవ్వేశారు. వల్లి మాత్రం తన వరుణ్‌ను గట్టిగా హత్తుకుని ఆనందంతో కళ్లలో నీళ్లు పెట్టుకుంది. మొక్కు కూడా తీరింది... జడ కూడా నిలిచింది...
భర్త తలనీలాలు మాత్రం తిరుమలకొండపైకి వెళ్లే వరుసలో చేరిపోయాయి!
శుభం.
***
శ్రిత గారి కొన్ని ఇతర రచనలు:
శ్రిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: శ్రిత
శ్రిత అనే కలం పేరుతో రచనలు చేస్తున్న జమున, సాధారణ జీవితంలోని అనుభూతులు, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, మహిళల మనోభావాలను కథల రూపంలో ఆవిష్కరించడాన్ని ఇష్టపడతారు.
ఆమె రచనల్లో ఆప్యాయత, మానవత్వం, కుటుంబ విలువలు సహజంగా ప్రతిబింబిస్తాయి. రోజువారీ జీవితంలో కనిపించే చిన్న చిన్న సంఘటనల్లోని గొప్ప భావాలను పాఠకుల హృదయాలకు చేరేలా చెప్పడం ఆమె రచనల ప్రత్యేకత.








Comments