top of page
Original.png

కలెక్టర్ గారి భార్య

2 hours ago
4 min read

కలెక్టర్ గారి భార్య తెలుగు కథలో ఉపాధ్యాయురాలు సౌగంధి, కలెక్టర్ చైతన్య – ప్రేమ, ఆత్మగౌరవం, మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచిన స్ఫూర్తిదాయక దృశ్యం.
కలెక్టర్ గారి భార్య తెలుగు కథలో ఉపాధ్యాయురాలు సౌగంధి, కలెక్టర్ చైతన్య – ప్రేమ, ఆత్మగౌరవం, మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచిన స్ఫూర్తిదాయక దృశ్యం.

Collector Gari Bharya - Telugu Love Story | Veereswara Rao Moola

కలెక్టర్ గారి భార్య - తెలుగు ప్రేమ కథ | వీరేశ్వర రావు మూల

Published In manatelugukathalu.com On 15/11/2026


ప్రేమ కోసం తన ఆశయాన్ని త్యాగం చేయకుండా, ఉపాధ్యాయురాలిగా గుర్తింపు సాధించాలనుకున్న సౌగంధి ఆత్మగౌరవానికి ప్రతీక. కలెక్టర్ చైతన్యతో ఆమె ప్రేమ ప్రయాణాన్ని ఆవిష్కరించే స్ఫూర్తిదాయక తెలుగు కథ ‘కలెక్టర్ గారి భార్య’.


అది ఆంధ్రాలో రాయవరం అనే ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో వేణుగోపాల స్వామి ఆలయానికి పూజారిగా రంగాచార్య పనిచేస్తున్నాడు.


వంశపారంపర్యంగా వచ్చిన అర్చకవృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. రాబడి పెద్దగా లేకపోయినా, ప్రభుత్వం ఇచ్చే అరకొర జీతం అవసరాలకు సరిపోవడం లేదు.

రంగాచార్యకి ఒక కూతురు. పేరు సౌగంధి. యుక్తవయసులో ఉంది. పెళ్ళి చేయవలసిన బాధ్యత గురించి దిగులుపడుతున్నాడు.


ఇంటికి వచ్చి భార్య కాత్యాయనిని అడిగాడు:

"అమ్మాయి ఎక్కడ?"


"కంప్యూటర్ పుచ్చుకుని ఆఫీస్‌కి వెళ్ళిందని చెప్పాలా? రాయుడిగారి ఇంట్లో పెళ్ళి. వంటవాడికి సహాయం చేయడానికి వెళ్ళింది" జవాబిచ్చింది వెటకారంగా.


"కలం పుచ్చుకుని ఆఫీస్‌లో కూర్చోవలసిన కూతురు గరిట పుచ్చుకుని ఎండలో తిరుగుతోందా?" బాధగా అనుకున్నాడు రంగాచార్య.


"ఆ నరసింహం ఏమన్నాడు సంబంధం గురించి?" 


"ఏదీ మళ్ళీ అడగలేదు." 


"అడక్కపోతే ఎలా? ఏం వేణుగోపాల స్వామి మీ అమ్మాయికి కలెక్టర్ సంబంధం తీసుకువస్తాడా?"


"ఏమో, ఆయన లీలలు మనకేం తెలుసు? ఆ గిరిధారి ఓ దారి చూపడా?"


"చూపుతాడు గోదారి" అని విసుక్కుని వంటింట్లోకి వెళ్ళింది కాత్యాయని.


********

స్థలం: హైదరాబాద్


"ఏమమ్మా, ఇప్పుడు మీరు పెళ్ళికి వెళ్ళి తీరాలా?" అడిగాడు చైతన్య. చైతన్య సివిల్స్ మెయిన్ పరీక్షలకి సిద్ధమవుతున్నాడు.


"అదేరా, వాళ్ళు మా చిన్ననాటి స్నేహితులు. వాళ్ళమ్మాయి పెళ్ళికి వెళ్ళకపోతే బాగుండదు. నీకు పరీక్షలు, నీకు హోటల్ తిండి పడదు. ఏం చేయాలి?" అంది చైతన్య తల్లి పార్వతి.


"ఎవరైనా వంటమనిషిని చూడు" అన్నాడు తండ్రి.


"వంటమనిషి అంటే గుర్తుకు వచ్చింది, మొన్న ఒక నంబర్ వాట్సాప్‌లో వచ్చింది."


ఆ నంబర్‌కి ఫోన్ చేసింది పార్వతి.


కాత్యాయని ఫోన్ తీసింది. "అదేనమ్మా, నేను రావడానికి కుదరదు. వేణుగోపాల స్వామి ఉత్సవాలు."


"వేరేవాళ్ళు ఎవరైనా?"


"మా అమ్మాయి ఉంది. కానీ..." నసిగింది కాత్యాయని.


"ఫర్వాలేదు పంపండి. మా ఇంట్లో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అమ్మాయితో పాటు హెల్పర్‌ని పంపండి. వంట రుచిగా ఉండాలి."


"ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు."

 

*****

"నేను వెళ్ళనమ్మా" అంది సౌగంధి.


"అదేమిటే, మంచి బేరం. పదిమందికి వండి వార్చక్కర్లేదు. నీకు తోడుగా శీను వస్తాడు. వంట నువ్వు చూసుకో, వడ్డన వాడు చూసుకుంటాడు."


"సర్లే!"


*****

చైతన్యకి మొదటిసారి సౌగంధిని చూడగానే ఎన్నో శతాబ్దాల నిరీక్షణ ఫలించి దేవలోకం నుండి అప్సరస దిగివచ్చినట్లు అనిపించింది. మంచులో తడిసిన ముగ్ధ మందారంలా భాసించింది. చైతన్యకి ఏ రోజు ఏం కావాలో మెనూ తయారుచేసి ఆ సమయానికి అది సిద్ధం చేసింది. తన పనయ్యాక తన గదిలోకి వెళ్ళిపోయేది.


చైతన్య ఏదైనా కూర బాగుంటే "ఈ రోజు బీరకాయ పప్పు బాగుంది" అని చీటీలో రాసేవాడు.


అది చూసి సౌగంధి మురిసిపోయేది. ఒక రోజు శీనుకి ఆరోగ్యం బాగులేదు. సౌగంధి అన్ని పనులూ చకాచకా చేసి చైతన్యతో మాట్లాడకుండా మెరుపులా మాయమయ్యేది. ఆ రోజు హిమానీలు నాట్యమాడే ప్రాతఃసమయాన, ఉదయమే స్నానం చేసి కురులు సవరించుకుంటూ, "ఈ రోజు గుడికి వెళ్ళి వస్తాను" అని చెప్పి వెళ్ళిపోయింది.


సౌగంధి మనస్సులో చైతన్య అందగాడే అనుకుంది. మనస్సును అటు పోనీయకుండా తన ఆశయం గురించి ఆలోచిస్తోంది.


********

వారం తర్వాత పార్వతి వచ్చింది. ఇల్లు చూసి సంతృప్తిపడింది. సౌగంధి పనికి కొంచెం ఎక్కువే ముట్టజెప్పింది. "ఏం పెట్టావు? మా వాడు లావెక్కాడు!"


సౌగంధి సిగ్గుతో నవ్వింది. అప్పుడు చూసింది చైతన్యని. చూపులు కలిసాయి. కలల భారం కనురెప్పలపై పడింది. చైతన్య చూపులు గిలిగింతలు పెట్టాయి. సౌగంధి వెళ్ళిపోయింది.


********

రెండేళ్ళ తర్వాత, "అమ్మాయీ! ఈ రోజు కలెక్టర్ గారు మన స్కూలు ఇన్‌స్పెక్షన్‌కి వస్తున్నారు. అన్నీ సరిగ్గా ఉండాలి, లేకపోతే రిమార్క్ వస్తుంది. ముఖ్యంగా పిల్లలకి మధ్యాహ్న భోజన పథకంలో భోజనం గురించి ప్రత్యేకంగా పరిశీలిస్తారట! ఏమిటి సౌగంధీ, ఏమీ సమస్యలు లేవు కదా?" అడిగాడు హెడ్ మాస్టర్ హరనాథరావు. 


"లేవండి." 


సరిగ్గా 11 గంటలకి కలెక్టర్ చైతన్యగారికి ఘన స్వాగతం ఇచ్చాడు హరనాథరావు.

స్కూళ్ళో అన్ని విభాగాలు చెక్ చేసి వస్తుండగా సౌగంధి ఎదురయ్యింది. చైతన్య ఆశ్చర్యపోయాడు. 


"ఎవరు?" అని అడిగాడు.


 "ఆ అమ్మాయి మెస్‌లో పనిచేస్తుంది. వంటలో ఎక్స్‌పర్ట్" మెస్ ఇన్‌ఛార్జ్ చెప్పాడు. 


"ఆ విషయం తెలుసు" అని మనసులో అనుకున్నాడు. 


తరువాత కలెక్టర్ గారు స్కూలు పిల్లలతో కలిసి భోజనం చేశారు. సౌగంధి వడ్డించింది. "నువ్వు చేసిన ములక్కాయ కూర అదుర్స్!" అన్నాడు చైతన్య సౌగంధికి వినబడేలా! 


భోజనాల కార్యక్రమం అయ్యాక కలెక్టర్ గారు తన బంగ్లాకి వెళ్ళిపోయారు. వెళ్తూ సౌగంధికి మాత్రమే వినబడేలా "ఐ లవ్ యూ" అన్నాడు. 


"ఏమిటి సార్?" అడిగాడు హరనాథ్. 


"ఏం లేదు, మెస్ నిర్వహణ బాగుందని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను." 


"అంతా మా సౌగంధి పనితనం, మా అదృష్టం!"


"సాయంత్రం మా ఊరి వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళండి."


"తప్పకుండా."


********

సాయంత్రం ఇంటికి వచ్చాక రంగాచార్య కలెక్టర్‌ని పొగుడుతున్నాడు. గుడి అభివృద్ధికి ప్రత్యేక నిధులు వచ్చేలా చేస్తానని చెప్పారు. తండ్రి ముఖంలో అంత ఆనందాన్ని సౌగంధి ఎప్పుడూ చూడలేదు.


********

మర్నాడు ఉదయం కారు వచ్చి ఆగింది. కారు నుండి కలెక్టర్ చైతన్య, తల్లి పార్వతి, తండ్రి నారాయణరావు దిగారు. కలెక్టర్ మన ఇంటికి రావడమేమిటి అని ఆశ్చర్యంలో మునిగిపోయారు కాత్యాయని, రంగాచార్య. "మీరు మా ఇంటికి..."


"అవును, మీ సౌగంధిని కోడలిగా చేసుకోవడానికి" అని పార్వతి సౌగంధిని కౌగిలించుకుంది.


"అంతా ఆ వేణుగోపాల స్వామి దయ" అన్నాడు రంగాచార్య.


పట్టు చీర, గాజులు ఉన్న పళ్ళాన్ని కాత్యాయనికి అందించింది పార్వతి. 

"మా అబ్బాయిని చేసుకోవడం నీకు ఇష్టమేనా?" అడిగాడు నారాయణరావు.


"ఒక షరతు" అంది సౌగంధి స్థిరంగా.


"అదృష్టం కాళ్ళ దగ్గరకు వస్తే షరతులు ఏమిటే?" అని విసుక్కుంది కాత్యాయని. 


"అమ్మాయిని చెప్పనివ్వండి" అన్నాడు చైతన్య.


"ఏ అమ్మాయైనా కలెక్టర్ సంబంధం అనగానే నా అదృష్టం అనుకుంటుంది. నేను కలెక్టర్ గారి భార్య కన్నా పదిమందికి విద్యను పంచే ఉపాధ్యాయురాలిని అవ్వాలనుకుంటున్నాను. ముందు నాకు ఒక టీచర్‌గా గుర్తింపు కావాలి. అది నా ఆశయం. ముందు టీచర్, తరువాతే కలెక్టర్ గారి భార్య. నా ఆశయానికి తోడ్పడితేనే నేను ఆయన భార్యనవుతాను."


"బాగుంది వరస! నా కొడుకు కోసం అమ్మాయిలు క్యూలో ఉన్నారు" అసహనం వ్యక్తపరిచింది పార్వతి.


సరిగ్గా అదే సమయానికి ఫోన్ రావడంతో హడావుడిగా వెళ్ళిపోయాడు చైతన్య.


*******

స్కూలుకి వెళ్ళాక సౌగంధికి తెలిసిందా వార్త! కలెక్టర్ గారి కారుకి యాక్సిడెంట్ అయ్యిందని. సౌగంధి ఆందోళనగా హాస్పిటల్‌కి వెళ్ళింది. చైతన్య లేడు.

అక్కడి వాళ్ళని అడిగితే ట్రీట్‌మెంట్ తీసుకుని వెళ్ళిపోయినట్లు చెప్పారు.


"అదృష్టం కాళ్ళ దగ్గరికి వస్తే కాదన్నావు, ఏం జాతకమో" అని సౌగంధి తల్లి గొణిగింది. 


"నీకేం కర్మ? ఆ పూజారి కూతురు! రాజా లాంటి సంబంధాలు వస్తున్నాయి" అని చైతన్య తల్లి సణుగుతోంది. 


చైతన్యతో మాట్లాడడానికి సౌగంధి దగ్గర చైతన్య ఫోన్ నంబర్ లేదు.


రెండేళ్ళ తర్వాత సౌగంధి కూనవరం గ్రామంలో గవర్నమెంట్ టీచర్‌గా చేరింది. ఆ రోజు స్కూల్ వార్షికోత్సవమునకు ముఖ్య అతిథిగా వచ్చాడు చైతన్య. చైతన్యను చూసి సౌగంధి మనసు ఉత్సాహంగా గంతులు వేసింది.


మళ్ళీ "ఈపాటికి పెళ్ళి చేసుకునే ఉంటాడు" అనుకుంది.


వార్షికోత్సవం అయ్యాక ప్రధానోపాధ్యాయుడి గదిలో కూర్చుని, చైతన్య రికార్డులు పరిశీలిస్తున్నాడు.


"అంతా బాగుంది. ఇలాగే ఉంచండి."


"దీనికి కారణం సౌగంధి."


"పిలవండి" అన్నాడు చైతన్య.


********

భయంగానే లోపలికి అడుగు పెట్టింది సౌగంధి.

"బాగున్నారా?" పలకరించాడు చైతన్య. "ఈమధ్య మతిమరుపు ఎక్కువైనట్లుంది. జూన్ నెల అటెండెన్స్ పిల్లల పేర్లు రాయలేదు."


"రేపు కదా ఒకటో తారీఖు!"


"బాగానే చెప్తున్నారు. ఆ రోజు హాస్పిటల్‌కి రాలేదే?"

చిరుకోపం నటించాడు చైతన్య.


"ఫోన్ నంబర్ లేదు అడగడానికి" అంది సౌగంధి తలదించుకుని.


"పెళ్ళయిందా?" అడిగాడు చైతన్య.


"మీకు పెళ్ళయి ఉంటుంది. గొప్ప సంబంధాలు వచ్చి ఉంటాయి" అంది సౌగంధి.


"కానీ సౌగంధి వ్యక్తిత్వం రాదుగా. అంటే నీ కోసం బ్రహ్మచారిగా మిగిలిపోయాను."


సౌగంధి కళ్ళల్లో ఆనందబాష్పాలు. ఆనందంగా అతని ఎద మీద వాలింది. 



                  సమాప్తం 



***


 వీరేశ్వర రావు మూల  గారి కొన్ని ఇతర రచనలు:


వీరేశ్వర రావు మూల  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

వీరేశ్వర రావు మూల

రచయిత పరిచయం:

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది. 








Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page