top of page
Original.png

భయం

ఈ కథ ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.

అడవిలో పులి తిరుగుతోంది… కానీ… అసలు భయం అది కాదు!
అడవిలో పులి తిరుగుతోంది… కానీ… అసలు భయం అది కాదు!

Bhayam - Telugu Suspense Story | Veereswara Rao Moola

భయం - తెలుగు సస్పెన్స్ కథ | వీరేశ్వర రావు మూల

Published In manatelugukathalu.com On 21/04/2026

పులి భయం…అడవి నిశ్శబ్దం…

కానీ నిజమైన భయం ఏమిటి?

ఈ కథ చివర్లో మీకు జవాబు తెలుస్తుంది.


"రంపచోడవరం, ఊట్ల గ్రామ వాసులకు హెచ్చరిక.

మహారాష్ట్ర అడవుల నుండి తప్పించుకున్న పులి ఊట్ల పరిసరాల్లో తిరుగుతోందని మా అంచనా. దయచేసి రాత్రి వేళల్లో ఎవరూ బయటికి రావద్దు" అడవిలో ఆ ప్రకటన మైకులో వినబడింది. చాలామంది భయంతో తలుపులు వేసుకున్నారు. పులి త్వరగా దొరికితే బాగుండునని భయంతో వణికిపోతున్నారు. పులి అప్పటికే రెండు ఆవులను గాయపరిచింది. 


                      *******

మల్లి అడవిలో పుట్టి అడవిలోనే పెరిగింది. మల్లి అడవిమల్లెలా గుబాళిస్తూ ఉంటుంది. 

"ఈ రోజు రాత్రికి వస్తున్నా" అన్న ఎస్.ఐ. మాటలు

మల్లి చెవిలో మారుమ్రోగుతున్నాయి.

"అసలు ఆ యదవ కంట్లో ఎందుకు పడ్డాను? నాలుగు రోజుల క్రితం నాగులమ్మ జాతరలో

నేను, చిన్నిగాడు నవ్వుకుంటూ ఉంటే

ఎదురయ్యాడు. ఆతను ఎస్.ఐ. భాస్కర్!"


                *******

"దండాలయ్య" అన్నాడు మల్లి పెనిమిటి, చిన్నిగాడు.

"ఏరా, బాగున్నావా?" అంటూ మల్లిని పరీక్షగా, పులి జింకని చూసినట్టు చూశాడు ఎస్.ఐ. భాస్కర్! 

"మా ఆడది, సిగ్గెక్కువ" అన్నాడు మల్లిని చూస్తూ. అప్పటికే మల్లి చిన్నిగాడి వెనక చేరి,

"పోదాం మావా," అంది. జాతరలో తాటిముంజలు తినడానికి వెళ్లారు ఇద్దరూ. 


            ********

                

 భాస్కర్ బైక్ ఆపి, 

 అట్లు వేసే నాగులమ్మ దగ్గరికి వెళ్లి,

"రెండు అట్లు," అన్నాడు, జాకెట్టు లోపలి అందాలు చూస్తూ.

"యదవ అరువు బేరం," అని పైట సర్దుకుని అట్టు వేసింది.

"రాత్రికి నాటుకోడి కూర పంపు," అని బైక్ మీద వెళ్లిపోయాడు.

"అలాగే, అరువే కదా," అని తిట్టుకుంది.

ఎస్.ఐ. భాస్కర్ అంటే అందరికీ భయమే, ఎక్కడ ఏ కేసులో ఇరికిస్తాడో అని.


                    *******

మల్లి వణికిపోతోంది. గాలి చప్పుడైతే చాలు. 

పోలీస్ భాస్కర్ అని వణికిపోతోంది. 

కొంచెం తలుపు చప్పుడైతే భయపడుతూ తీసింది. ముసలి తాత మరిడయ్య. 

"కొంచెం మంచినీళ్లు ఇవ్వు." 

"ఇదిగో తాతా, తొరగా తాగి బేగా వెళ్లిపో. పులి తిరుగుతోంది అడవిలో." 

"పులి నన్ను ఏం చేసినా భయం లేదు. కాటికి కాళ్లు సాచినోణ్ణి. నా భయం మనుషుల తోనే," 

అని తాత వెళ్లిపోయాడు కర్ర ఆడించుకుంటూ. చుట్టూ కీచురాళ్ల ధ్వని ఎక్కువైంది. ఎక్కడో పాము నోటికి కప్ప చిక్కినట్టుంది. దీనంగా అరుస్తోంది. మల్లి తలుపు వేసి లోపలికి వచ్చింది. గుండె వేగం తగ్గలేదు. ఆడి చేతిలో మానం పోవలసిందేనా అనుకుంటూ పెరటివైపు వెళ్ళింది. 

వచ్చింది. గుండె వేగం తగ్గ లేదు. 

               *******

అరగంట తర్వాత తలుపు చప్పుడైంది. 

అతనేనా? అతనే అయి ఉంటాడు. జింక కోసం పులిలా వెంటబడ్డాడు. 

మల్లి ఒణుకుతోంది. "నా పెనిమిటిని ఇరికించాడు," అనుకుంది మల్లి. 

మళ్లీ భాస్కర్ మాటలు చెవిలో గింగురుమంటున్నాయి. ఒళ్లంతా చెమటలు. 

గుండె వేగంగా కొట్టుకుంటోంది.

"చిన్నిగాడు నెక్లెస్ దొంగతనం చేశాడని సెల్లో వేశాను. ఇంకా ఎఫ్.ఐ.ఆర్. (FIR) రాయలేదు. నా మాట విన్నావనుకో. అతను సెల్లో ఉంటాడు. నువ్వు నా కౌగిలిలో ఉంటావు. కేసు లేకుండా బయటికి వచ్చేస్తాడు." 

"అతని నోరు పడిపోను. అతని కళ్లల్లో అడవి చెట్టు పాలు పోసి కళ్లు గుడ్డి చేయాలి." ఇలా చాలా అనుకుంది మల్లి. కానీ చిన్నిగాడు స్టేషన్లో ఉండిపోయాడు. 

ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. 


                 *****'*' '

తలుపు చప్పుడైంది. తలుపు తీసింది. ఎదురుగా కళ్ళల్లో ఎర్ర జీరలతో భాస్కర్. పులి లాగే ఉన్నాడు. 

దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యి వేశాడు. వెనక్కి జరిగింది మల్లి. భాస్కర్ ముందుకొచ్చి నడుము మీద చెయ్యి వేసి గిల్లాడు. 


                     ******* 

ఉదయం అటవీ శాఖ వాళ్ళు వచ్చేసరికి గోతిలో పడిపోయిన బైక్ కనబడింది. బైక్‌కు వంద అడుగుల దూరంలో పులి పంజా దెబ్బలు తిన్న భాస్కర్ దేహం. మెడ మీద పులి కొరికినట్టు ఆనవాళ్లు. ఒళ్లంతా రక్తం. పులి కాలి ముద్రలు. భయంకరంగా ఉంది. 

"రాత్రి పోలీసాయన వస్తుంటే పులి ఎదురై ఉంటుంది. బండి బ్యాలెన్స్ తప్పి గోతిలో పడి ఉంటుంది. అప్పుడే పులి అటాక్ చేసి ఉంటుంది. 

అంటే ఇక్కడే ఎక్కడో ఉంది. ఐనా పోలీస్ ఎందుకు వచ్చాడు?" అని అటవీ అధికారులు అప్రమత్తంగా ఉండమని చెప్పి భాస్కర్ దేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. 

అటవీ అధికారులు మల్లిని అడిగారు. 

"ఏమైనా కేకలు విన్నావా?"

"పులి తిరుగుతోంది బయటికి రావద్దన్నారుగా," చెప్పింది మల్లి. 

                  ******

రాత్రి ఏం జరిగింది? ఏం జరిగిందో మల్లికి మాత్రమే తెలుసు. కొన్ని గంటలు వెనక్కి వెళ్తే... 


                *******

"ఇక్కడ ఎందుకు, పెరట్లోకి వెళ్దాం. అక్కడ ఎవరూ చూడరు," అంది మల్లి. 

మల్లి గుడిసె వెనక్కి వచ్చింది. భాస్కర్ని కౌగలించుకుని పొద వరకూ తీసుకువెళ్లి, బలంగా పొదల్లోకి తోసింది. ఉలిక్కిపడ్డ పులి ఒక్కసారిగా గాండ్రించింది. భాస్కర్ మీద పులి ఒక్కసారిగా లంఘించింది. భాస్కర్ రాకముందే పొదల్లో పులి ఉందని మెరిసే కళ్లను చూసి మల్లి గ్రహించింది. 

బూతులతో నిండిన భాస్కర్ కేకలు దూరమయ్యాయి. మల్లి వేగంగా వెనక్కి వచ్చి 

భాస్కర్ బైక్‌కు తాడు కట్టి గోతి దాకా లాక్కెళ్లి, గోతిలో పడేసింది. 


                  ******

మర్నాడు చిన్నిగాడు వచ్చాడు. మల్లిని కౌగలించుకున్నాడు. 

"భయపడకు మల్లీ, వచ్చేసాగా. పాపం ఎస్.ఐ. గారిని పులి చంపేసిందిట కదా?" 


"ఏం పాపం చేశాడో.." అంది మల్లి చిన్ని కౌగిలిలో ఒదిగిపోతూ. 

***

          

వీరేశ్వర రావు మూల  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది. 


#TeluguComedyStory, #తెలుగుహాస్యకథ







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page