top of page

వెలుతురులోకి



'Veluthuruloki' - New Telugu Story Written By Siriprasad

Published In manatelugukathalu.com On 01/02/2024

'వెలుతురులోకి' తెలుగు కథ

రచన: శిరిప్రసాద్

 (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ధరణి గులాబీ రంగు చీర, మాచింగ్ బ్లౌజ్ లో అందంగా మెరిసిపోతోంది. పౌర్ణమి చంద్రుడిలా ఆమె ముఖం వెలిగిపోతోంది. కళ్ళు పెద్దవి కావడంతో వాటికి ఆకర్షణ శక్తి చాలా ఎక్కువ. దానికి తోడు మధ్యస్థంగా నుదురు, పదునుగా కనిపించే ముక్కు, కొద్దిగా గులాబీ వర్ణంలో చెక్కిళ్ళు, లేతగా కనిపిస్తున్న ఎర్రటి పెదాలు, నున్నటి చుబుకం, ధరణి అందాన్ని నిర్వచించ లేక పోతున్నాయి.


ఎంత నిర్వచించలేని అందమున్నా, సమాజంలో స్థాయిని పెంచేందుకు, అందాన్ని ద్విగుణీకృతం చేసుకునేందుకు, అప్సరసే స్వర్గం నించీ దిగొచ్చిందా అనిపించేందుకు దానికి పై అద్దకాలు అవసరం. ధరణి ఆ పనిని లూ రియల్ పేస్ మేకప్ ద్వారా చేసుకుంటుంటుంది. ఎంతో ఖరీదు చేసే ఆ మేక్ అప్ కిట్ కింద నెలకి పది వేలు ఖర్చుపెడుతుంది. అంతేనా అంటే, కాదు. నెలకి రెండు సార్లు బ్యూటీ పార్లర్ కి వెళుతుంది. సగటున ఆ ఖర్చు నెలకి ఓ యిరవై వేలవుతుంది. లిప్స్టిక్ కింద ఓ వెయ్యి రూపాయలవుతుంది. నెయిల్ పోలిష్ కింద మరో వెయ్యి రూపాయలు. 


మేకప్ కింద యింత ఖర్చు పెడుతున్నప్పుడు శరీరాన్ని కప్పివుంచే బట్టలకి యెంత పెట్టాలి? 

ఖరీదైన కుర్తా సెట్స్ ధరణి వార్డ్ రోబ్ లో మూడు వున్నాయి. ఆ మూడు సెట్స్ ఒకేసారి మూడు లక్షలకి కొన్నది. కంపెనీ ఎం డీ విజిట్ కి వచ్చినప్పుడు వేసుకుంటుంది. కొన్ని ముఖ్యమైన రోజుల్లో  సామాన్యులకి ప్రవేశం లేని  స్టూడియో  లో తీసుకున్న పది సెట్స్ టాప్స్, బోటమ్స్ , కుర్తీస్ , రోజు వాడకం కోసం కనీసం రెండు వేలు ఖరీదు చేసే కాటన్ సారీస్ యాభై వరకు వుంటాయి. ప్రత్యేకమైన ఫంక్షన్స్ కోసం సిల్క్ చీరెలు పదివేల నించి లక్ష ఖరీదు చేసేవి కొన్ని వున్నాయి. క్యాజువల్ డ్రెస్ లు, జీన్స్ పాంట్స్, షర్ట్స్ వంటివి పది జతల పైగానే వుంటాయి . అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫెర్ఫ్యూమ్స్ వాడుతుంది.


ఇక యాభై లక్షల విలువ చేసే బెంజ్ కార్ లో యీ అందాల భామ ఆఫీస్ కి వెళ్తూ వుంటుంది. అయిదేళ్ల కిందట కొనుక్కున్న హ్యుండై కారు, ఎప్పుడో కొనుక్కున్న టీ వీ ఎస్ స్కూటర్ జ్ఞాపకార్ధం గారేజ్ లో వుంచుకుంది . ప్రతి మూడు నెలలకి వాటిని వాడుతూ, సర్వీసింగ్ చేయిస్తుంది. 


ధరణి ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తుంది. ఒక మధ్య తరగతి కుటుంబం నించి వచ్చింది. చదువులో ఎప్పడూ నెంబర్ వన్ గా వుండేది . ఐ ఐ టీ లో ఇంజనీరింగ్ చేసి యూ ఎస్ లో మాస్టర్స్ చేసింది. అక్కడే ప్రొఫెసర్ రిఫరెన్స్ తో టాప్ కంపెనీ లో జాబ్ తెచ్చుకుంది. ఐదేళ్లలో మూడు కంపెనీలు మారి ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో స్థిర పడింది. మేధస్సు తో పాటు, యింగితం వున్న వ్యక్తి కాబట్టి చురుగ్గా వుండడంతో పై స్థాయికి త్వరత్వరగా  ఎదిగింది. శాలరీ ప్యాకేజీ సంవత్సరానికి రెండు కోట్లు. కంపెనీ షేర్స్ పది వేలున్నాయి. ఏటా లాభంలో వాటా కింద ఓ యాభై లక్షలు సంపాదిస్తుంది. టాప్ కంపెనీలని క్లైంట్స్ గా చేర్చి టాప్ మానేజ్మెంట్ మెప్పు పొందింది. ఇంకా పెళ్ళి చేసుకోలేదు. ఊరు నించి ఒక మధ్య తరగతి భార్య భర్తలని తెచ్చి తోడుగా వుంచుకుంది . వాళ్ళే ఆమెకి అన్నీ అవసరాలు తీరుస్తుంటారు. ఇంకా పెళ్ళి చేసుకోలేదు. 


అప్పుడప్పుడు పబ్స్ కి వెళ్తూ ఉంటుంది. తనతో స్నేహం చేసే మధ్య వయస్కులు ఇద్దరున్నారు. వాళ్ళతో కాసేపు డ్రింక్స్, కాసేపు డాన్స్ , మళ్ళీ డ్రింక్స్. తర్వాత బయట స్టార్ హోటల్ లో బఫెట్. ఆ తర్వాత మూడ్ ఉంటే ఆ ఫ్రెండ్ ని యింటికి తీసుకెళ్లి ఆ రాత్రి ఎంజాయ్ చేస్తుంటుంది. అది పెద్ద తప్పు పని అనుకోదు. ఆకలేస్తే హోటల్లో అన్నం తిన్నట్టు. ఒక భౌతిక అవసరం. అంతే. ఆ అవసరం కోసం పెళ్లి అనే గుదిబండని తగిలించుకోడం ఎందుకు, అనుకుంటుంది. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఇలాంటివి తప్పుకాదని అనుకుంటుంది. అయితే ఎందుకో అవి రహస్యం గా వుండాలని కోరుకుంటుంది. అక్కడే అది తప్పు పని అవుతుందని తెలుసుకోలేక పోతుంది. విచిత్రం!


ఆ రోజు కార్పొరేట్ ఆఫీస్ నించి వైస్ ప్రెసిడెంట్ [ పబ్లిక్ రిలేషన్స్ ] వస్తున్నాడు. మనోహర్. 

హైదరాబాద్ లో ఒక అనాధాశ్రమానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీ తరఫున ఒక వ్యాన్ డొనేట్ చేయడానికి వస్తున్నాడు. మనోహర్  సీ యీ ఓ కి అత్యంత సన్నిహితుడు. అతగాడి దగ్గిర మార్కులు కొట్టేయాలని మరింత అందంగా తయారైంది ధరణి. అనాధాశ్రమాల గురించి నెట్ లో కొంత మేటర్ సేకరించి చిన్న స్పీచ్ తయారు చేసుకుంది. ఆ కార్యక్రమంలో మాట్లాడాల్సి వస్తే తన హోదాకి తగ్గట్టు మాట్లాడాలి కదా!


ధరణి చక్కగా తయారై ఆఫీస్ కి వెళ్ళింది. అనాధాశ్రమానికి మనోహర్ ని, ధరణి ని తీసికెళ్లేందుకు ఆఫీస్ లో పనిచేస్తున్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ లలిత సిద్ధంగా వుంది. ముగ్గురూ కాఫీ తాగుతూ మాట్లాడుకున్నారు. 


'ధరణీ మేడం , మీరు వివాహం ఎప్పుడు చేసుకుంటున్నారు?' అడిగాడు మనోహర్. 

'నా పెళ్ళి పట్ల మీకెందుకో  అంత ఇంటరెస్ట్?'


' మీరు జీవితంలో అన్నీ సాధించారు. చక చకా పైకెదుగు తున్నారు... పెళ్ళీడు వచ్చేసింది... యింకా ఏమి అడ్డం వస్తున్నాయో... తెలుసుకుందామని...'


'ఏవీ అడ్డం రావట్లేదు... టైం వచ్చినప్పుడు అదే అవుతుంది... '


'అఫ్ కోర్స్, టైం వస్తే  అవుతుంది లెండి... ఆ టైం ఎప్పుడా, అని...'


'ఆ టైం వచ్చినప్పుడు మీకు ఇన్విటేషన్ పంపిస్తాను... తప్పకుండా రండి...'


'స్యూర్ ... నేనేమిటి, బోర్డు మొత్తం వస్తుంది... అప్పుడు వాళ్ళకి యిక్కడ ఏర్పాట్లు కూడా నేనే చూసుకోవాల్సి వస్తుంది...'


'తప్పకుండా....'


ముగ్గురూ లేచారు. 

'మీరు ఏ ఫెర్ఫ్యూమ్ వాడతారో?... మగవాళ్ళని యిట్టే పడేస్తుంది...'


'థాంక్స్... పెర్ఫ్యూమ్స్ లో ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ ఫేమస్ కదా!... అదే, ఏదో దొరికే వెరైటీ వాడుతుంటాను... '


'నైస్... '


లలితకి యీ సంభాషణ నచ్చలేదు. వాళ్ళిద్దరినీ తొందర పెట్టింది. తొందర పెట్టడం అంటే, పదే పదే వాచ్ చూసుకోడమే. 


అరగంటలో ఆశ్రమానికి చేరుకున్నారు. ఏంతో విశాలమైన క్యాంపస్. యోగా కోసం ఒక బిల్డింగ్, మెడిటేషన్ హాల్, లైబ్రరీలు మరో బిల్డింగ్ లో.  చివరి బిల్డింగ్ లో ఒక భాగం వృద్ధాశ్రమం, మరో భాగంలో అనాధ పిల్లలకి ఆశ్రయం.


అక్కడ ఆడుకునే పిల్లలు కొందరు, ఆడుకోలేని దివ్యాంగులు కొందరు, అస్వస్థత తో కొందరు కనిపించారు. ఒక వైపు అమాయకమైన ఆనందం, మరో వైపు కళ్ళు తడిపే దృశ్యం. సృష్టిలోని వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. 


బిల్డింగ్ వెనక మీటింగ్ హాల్ లో చాలామంది ఆహుతులు ఎదురుచూస్తూ కూర్చున్నారు. మీటింగ్ లో ధరణి ఆశ్రమ నిర్వాహకులకి వ్యాన్ తాలూకు కాగితాలు అందించింది. మనోహర్ కూడా ఫోటో కోసం ఓ చెయ్యి వేసాడు. నలుగురైదుగురు మాట్లాడారు. ధరణి ప్రిపేర్ అయిన స్పీచ్ కూడా పూర్తిగా చెప్పలేక పోయింది. అందుక్కారణం అస్వస్థత తో కనిపించిన చిన్నారులు. ఆమె మనస్సులో వాళ్ళే మెదులుతున్నారు. అక్కడ సభలో వున్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ విచారంగానే కనిపిస్తున్నారు. అలాంటి సమావేశానికి ఖరీదైన దుస్తులు వేసుకొచ్చినందుకు, మేకప్ దట్టించినందుకు, నాలుగు దిశలా వ్యాపిస్తున్న పెర్ఫ్యూమ్ వేసుకొచ్చినందుకు చిన్నతనంగా ఫీల్ అయింది ధరణి.


ఫొటోల్లో అందంగానే కనిపిస్తుంది. ఆ ఫోటోలు అన్నీ న్యూస్ పేపర్స్ లో వస్తాయి. కొన్ని టీ వీ ఛానెల్స్ లో కూడా చూపిస్తారేమో. కానీ ధరణి, జీవితంలో మొదటి సారి విచారపడింది. ఇలాంటి మీటింగ్స్ కి రాకూడదు, అని ఒక క్షణం అనిపించింది. 


మరుక్షణం ఆ ఆలోచన తప్పనిపించింది. కడుపులో దేవినట్టనిపించింది. రక రకాల వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లలు కనిపిస్తున్నారు. వాళ్ళు ఏ జన్మలో ఏ పాపం చేసారో , యీ జన్మలో యింత చిన్న వయసులో యిలా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఆశ్రయం కల్పించి యింత మంచిగా చూసుకుంటున్నయీ ఆశ్రమ నిర్వాహకులని  అభినందించాల్సిందే. వాళ్ళకి సేవ చేస్తున్న స్టాఫ్ ఎంత మంచివాళ్ళో . ధరణి గుండె బరువెక్కింది.

మీటింగ్ అయిపోయాక ముగ్గురూ ఆఫీస్ కి బయల్దేరారు.

******

ఇంటికి చేరిన  ధరణి కి మనస్సు మనస్సులో లేదు. ఆ ఆశ్రమం చుట్టూ తిరుగుతోంది. లోపల అనారోగ్యం తో బాధ పడుతూ, సంతోషంగా కనిపిస్తున్న పిల్లలు, వృద్ధులు, వాళ్లకి సేవ చేస్తున్న ఆయాలు, రేపో మాపో పోతారనిపిస్తున్న మంచాల్లోని పిల్లలు కనిపిస్తున్నారు. 


డ్రెస్ మార్చుకుని కప్ బోర్డు లోని స్కాచ్ విస్కీ బాటిల్ టీపాయ్ మీద పెట్టింది.ఫ్రిడ్జ్ లోంచి సోడా బాటిల్స్ తీసి టీపాయ్ మీద పెట్టింది. కిచెన్ లో హాట్ ప్యాక్ లో పెట్టిన చికెన్ టిక్కా ని ఓవెన్లో రెండు నిముషాలు వేడి చేసి డ్రాయింగ్ రూమ్ లోకి తెచ్చుకుంది. సోఫా లో కూర్చుని స్కాట్లాండ్ నించే తెప్పించిన అందమైన గ్లాస్ లో విస్కీ సుమారుగా ఓ ముఫై ఎం ఎల్ వేసుకుంది. సోడా తో గ్లాస్ని  సగం వరకు నింపింది. ఒక డ్రాప్ రుచి చూసింది. లేచివెళ్లి ఫ్రిడ్జ్ లోంచి ఐస్ క్యూబ్స్ తెచ్చుకుంది.  ఒక పీస్ గ్లాస్ లో వేసుకుని టేస్ట్ చేసింది. బాగుందనిపించింది.


పక్కనే వున్నరిమోట్ తో టీ వీ ఆన్ చేసింది. న్యూస్ చూస్తూ గ్లాస్ లోని విస్కీ ని కొద్ది కొద్దిగా చప్పరిస్తొంది. సంతోషానుభూతిని, సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్, పొందుతోంది. క్షణాల్లో మధ్యాహ్నం ఆశ్రమంలోని సీన్స్ మదిలో మెదిలాయి. అంతే. విస్కీ లోని చెడుతనము నాలుక్కి తగిలింది.


కడుపులో మళ్ళీ దేవినట్టయింది. ఒక్క గుటకలో మిగిలిన డ్రింక్ తాగేసింది. మరో అయిదు నిముషాల్లో మరో రెండు డ్రింక్స్ గటగటా తాగేసింది. ఇక తాగలేక పోయింది. ఆ విస్కీ వగరుగా, కొంచం తియ్యగా అనిపించింది. తాగాక ఇక చాలనిపించి, బాటిల్ ని మళ్ళీ కప్ బోర్డు లో పెట్టేసింది. కొంచం మత్తుగా అనిపించి సోఫాలో వాలిపోయింది.


ఒక గంట తర్వాత నరసింహ వచ్చి ధరణిని లేపి, వేడి వేడి చపాతీలు, చికెన్ వేపుడు తెచ్చి టీపాయ్ పెట్టి తినమని రిక్వెస్ట్ చేసాడు. నెమ్మదిగా రెండు చపాతీలు తిని ఇక చాలంది. మిగిలిన ఫుడ్ ని తీసి కిచెన్ లోకి వెళ్ళాడు నరసింహ. మిగిలిన ఐటమ్స్ అన్నీ గిన్నెల్లో పెట్టుకుని తను తీసికెళ్ళాడు. నెమ్మదిగా లేచి బెడ్రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద వాలిపోయింది ధరణి.  


తర్వాతి రోజు ఆఫీస్ కి వెళ్లిన గంటకి లలితని తన కేబిన్ కి పిలిచింది ధరణి. 

లలిత ధరణి కేబిన్ కి వెళ్లి ఎదురుగా నిలబడింది. మేడం ఏ విషయం గురించి అడుగుతుందో అని ఎదురుచూస్తోంది. తన దగ్గిర పెండింగ్ ఇష్యూస్ ఏమీ లేవు కూడా. 

'లలితా, నీకు ఆ అనాధాశ్రమం గురించి ఎలా తెలిసింది?'


అమ్మయ్య, అనుకుంటూ లలిత చెప్పింది, 'నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది మేడం . నేను నెల నెలా వెయ్యి రూపాయలు డొనేట్ చేస్తుంటాను...'


'ఐ సీ ... మనం యీ రోజు సాయంత్రం ఒక సారి అక్కడికి వెల్దామా?...'


'అలాగే మేడం '


సాయంత్రం ఆఫీస్ అయ్యాక లలిత ధరణి దగ్గిరకి వచ్చింది. నిజానికి ధరణికి టైమింగ్స్ అంటూ వుండవు. అయినా అయిదింటికి లలితతో వెళ్ళడానికి సిద్ధమైంది. ఇద్దరూ ధరణి కారులో ఆశ్రమానికి వెళ్ళారు . అక్కడ స్వామి రామానంద ని కలిసారు . ఒకసారి పిల్లల్ని చూడాలని వుంది, అన్నది ధరణి. ముగ్గురూ పిల్లలు వుండే బిల్డింగ్ కి వెళ్ళారు. స్వామి రామానంద పిల్లల్ని చూపిస్తూ, 'వీళ్ళిద్దరూ పోలియో బాధితులు, వీళ్ళు ఆరుగురు మానసికంగా ఎదగని పిల్లలు, వీళ్ళిద్దరూ పుట్టు గుడ్డి , యీ పిల్లగాడు ప్రమాదంలో రెండు కాళ్ళు పోగొట్టుకున్నాడు, యీ యిద్దరూ తలస్సేమియా వ్యాధితో బాధపడుతూ, చావు కోసం ఎదురు చూస్తున్నారు, వీళ్ళు పదిమంది ఆనాధలు, అడుక్కుంటుంటే పోలీసులు తీసుకొచ్చి మాకు అప్పగించారు.... యింకా నలుగురు రకరకాల కాన్సర్ వ్యాధులతో బాధపడుతూ ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో వున్నారు...ముగ్గురికి గుండెలో చిల్లు వుంది. వాళ్ళకి శస్త్రచికిత్స చేయించాలి ' అని వివరించాడు. 

'అందరూ అనాధలేనా స్వామీ?' ధరణి ప్రశ్నించింది. 


'అందరూ కాదమ్మా.... కొంతమంది పేద తల్లితండ్రులు వాళ్ళ పిల్లలికి ట్రీట్మెంట్ మేము యిప్పిస్తామని  మా దగ్గిర వదిలి వెళ్ళారు . మేము భగవంతుడి ప్రసాదమని భావించి వాళ్ళని కూడా చేరదీసాము..... మాకు వచ్చే డొనేషన్లు సరిపోవు.... ఎవరికి  ట్రీట్మెంట్ అత్యవసరమో, వాళ్ళకి చేయిస్తుంటాము...'


'తలస్సేమియా పిల్లలు యిద్దరికీ ట్రీట్మెంట్ ఖర్చు చాలా వుంటుంది కదా?'


'అవునమ్మా.... రక్త మార్పిడికి, మందులకి నెలకి ముఫై వేలవుతుంది ... శస్త్రచికిత్స చేయించాలంటే ఒక్కొక్కరికీ కనీసం పాతిక లక్షలవుతుంది... '


ధరణి ఆలోచిస్తూ, కిచెన్ వైపు నడిచింది. అక్కడ వంటలు చూసి ఆశ్చర్యపడింది. మేడం వైపు ప్రస్నార్ధకంగా చూస్తోంది లలిత . 


'ఆ పిల్లలిద్దరి చికిత్సకీ  నెలనెలా ముఫై వేలు నేను యిస్తాను. వాళ్ళిద్దరి సర్జరీ కి ఏర్పాట్లు కూడా చూస్తూ వుండండి... ' అంది ధరణి.


 'భగవత్ ప్రసాదం తల్లీ,' అన్నాడు స్వామి.


లలిత ఒక్కసారిగా షాక్ తింది . మేడం గురించి స్టాఫ్ కధలు కధలుగా చెప్పుకుంటుంటారు. ఆవిడ దుబారా ఖర్చుల గురించి, విలాసవంతమైన జీవితం గురించి ఎన్నో రూమర్స్ వున్నాయి. ఆమె అసలు యీ ఆశ్రమం చూద్దామనడమే షాకింగ్ అయితే, యిప్పుడు నెలకి ముఫై వేలు యిస్తామనడం, సర్జరీ ఖర్చులు భరిస్తాననడం  యింకా పెద్ద షాక్ అనిపించింది లలితకి. 

తర్వాత మరికొన్ని వివరాలు తెలుసుకుని ధరణి బయల్దేరింది. 'లలితా, నువ్వు నన్ను యిక్కడికి తీసుకొచ్చి మంచి పని చేసావు..... నా జీవితంలో యీ రోజు ఒక టర్నింగ్ పాయింట్ లలితా...' అంది. 


ధరణికి గాలిలో తేలిపోతున్నట్టుంది. మనసుకి హాయిగా వుందనిపించింది . రాత్రంతా గిల్టీ ఫీలింగ్. నిద్ర పట్టలేదు. తను చేస్తున్న తప్పులన్నీ ఒక సీరియల్ లా కనిపించాయి. ప్రపంచంలో ఎంతమంది డబ్బు లేక కష్టాలు పడుతున్నారో! తనకి డబ్బు ఎక్కువై ఏం చేయాలో తెలియక విశృంఖలంగా ప్రవర్తిస్తోంది. 


ఇంటికి చేరిన ధరణి వాష్ బేసిన్ దగ్గర నిలబడి మేకప్ ని శుభ్రం చేసుకుంది. పావుగంట పట్టింది. తర్వాత అద్దంలో ముఖాన్ని వివరంగా చూసుకుంది. చర్మంలో కాంతి లేదు. కళ్ళ కింద కొంచం నల్ల చారలు వస్తున్నాయి. చెక్కిళ్ళు కొంచం జారుతున్నట్టున్నాయి. మేకప్ పైపై మెరుగులు పెంచుతూ, అసలు అందాన్ని తగ్గిస్తుంది. వయసుని ఓ పదేళ్ళు పెంచేస్తుంది. ఈ మేకప్ మానేస్తే ఆ యిద్దరు తలస్సేమియా పేషెంట్స్ కి రక్త మార్పిడికి సరిపోతుంది. అలాగని ఆఫీస్ కి మేకప్ లేని ముఖంతో వెళ్తే గుర్తుపట్టరేమో !?... దేశీయ మేకప్ లైట్ గా చేసుకుని , ముఖాన్ని కాపాడుకోవాలి, అని తీర్మానించుకుంది ధరణి. దేశీయ మేకప్ గురించిన వివరాలు గూగుల్ లో సెర్చ్ చేసింది. మంచి సమాచారం దొరికింది. వెంటనే దేశీకి మారిపోవాలని నిర్ణయించింది.


దుస్తులు మార్చుకుంది. తను వేసుకునే నైటీ ధర ఏడువేల అయిదొందలు. వెయ్యి రూపాయల్లో మంచి నైటీ దొరకదా? అందులో మిగిలే డబ్బు ఏ పిల్లాడి వైద్యానికో సరిపోతుంది కదా?... అలా చేస్తే తను నైటీలు, డ్రెస్  కొనుక్కునే బౌటిక్ వాళ్ళ ఆదాయం తగ్గిపోదా?... తగ్గుతుందేమో కానీ, వీధిన పడరు కదా?... వాళ్ళ దగ్గిర కొనుక్కునే వాళ్ళు వందల్లో వుంటారు. నామీద పడి బతకడంలేదు కదా!... 


చీరల ల విషయంలో కూడా పాలసీ మార్చాలి   యికనించి మంచి కాటన్ చీరలు కట్టుకోవాలి. గంజి పెట్టి వుతికించి, యిస్త్రీ చేయించి కట్టుకుంటే అందంగా కనిపించనా?  ... డ్రెస్ మీద కూడా ఎంతో పొదుపు చేయచ్చు; ఎంతో మంది ప్రాణాలు కాపాడచ్చు. 


'ప్రపంచాన్ని మార్చలేను కానీ, నన్ను నేను మార్చుకోగలను,' అనుకుంది ధరణి.

డ్రింక్స్ తయారు చేసుకుంది. ఒక్కో సిప్ చప్పరిస్తూ, సోఫాలో వెనక్కి వాలిపోయి ఆలోచనలో పడింది ధరణి. గుండె బరువు కొద్దిగా తగ్గినట్టనిపించింది. తన అకౌంట్ లో ఎనభై లక్షలున్నాయి; వాటిని ఆ యిద్దరి పిల్లల సర్జరీ కి వుపయోగించవచ్చు . తన ఖర్చుల్ని గణనీయంగా తగ్గిస్తే ఆ ఆశ్రమంలో పిల్లల్ని ఆరోగ్యవంతుల్ని చేయచ్చు; మంచి చదువు చెప్పించచ్చు; మంచి జీవితాల్ని యివ్వచ్చు. తన తల్లితండ్రులు కష్టపడి తనకి యింత మంచి చదువు చదివించి, యింత మంచి జీవితాన్నిస్తే, దాన్ని కొద్దిగా అయినా సద్వినియోగం చేయాలి కదా!... ఇంతకాలం బాధ్యతా రాహిత్యంతో బతికింది తను;  ఇక నించైనా కొంచం బాధ్యతతో మెలగాలి, అనుకుంది.


మరో డ్రింక్ తయారు చేసుకుంది. 'స్కాచ్ విస్కీ కి ఇండియన్ విస్కీ కి ఎంత తేడా వుంటుంది? .... రుచిలో కొంచం తేడా, ధరలో చాలా యెక్కువ వ్యత్యాసం... లెట్ మీ షిఫ్ట్  టు ఇండియన్ బ్రాండ్స్,’ అని నిర్ణయం తీసుకుంది. 


మూడు నెలల్లో తలస్సేమియా పేషెంట్లు యిద్దరికీ బోన్ మారో సర్జరీ చేయించింది ధరణి. తన అకౌంట్ ఆల్మోస్ట్ ఖాళీ అయింది, మనసు సంతృప్తితో నిండిపోయింది.


'మేడం , మీ గురించి స్టాఫ్ చాలా బాగా చెప్పుకుంటున్నారు.... నాకు చాలా హ్యాపీ గా వుంది మాం ...'

'అది నాకు అంత అవసరం లేదు లలితా... ఆ ఆశ్రమం కి వెళ్ళాక అక్కడి దృశ్యం నన్ను కలచి వేసింది... అందుకే అలా చేయాలనిపించింది..... అంతే !'


'ఈ విషయాలన్నీ రమేష్ కార్పొరేట్ ఆఫీస్ లో కూడా స్ప్రెడ్ చేసేసాడు...'

'రమేష్ అంటే పోలియో తో ....'


'అవును మేడం ... '


ఒక్క క్షణం ఆలోచించింది. 'అతను నన్ను దొంగతనంగా చూస్తుంటాడు..... నాతో మాట్లాడాలని ట్రై చేస్తుంటాడు.... కానీ మాట్లాడడు. ఎందుకలా చేస్తుంటాడు ?'


'అతనికి మీరంటే పిచ్చి, మేడం .... అలా అని అతను చెప్పలేదు.... నేనే గమనించాను..... అతను జస్ట్ అకౌంట్స్ అసిస్టెంట్.... అందుకే ధైర్యంగా మీతో  ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి సంశయిస్తుండచ్చు. ఆత్మ న్యూనతా భావం కావచ్చు ...'


'ఐ సీ ... మనిషి మంచివా డే కదా?'


'చాలా... అతను , తల్లి యిద్దరే వుంటారు... ముఫై దాటినా పెళ్ళి చేసుకోలేదు... తన అంగవైకల్యాన్ని ఏ అమ్మాయీ యాక్సెప్ట్ చేయదనే  భావం వున్నట్టుంది...'


ఆశ్చర్యంగా చూసింది ధరణి.  తర్వాత  చిన్నగా నవ్వింది. తనకి తెలియకుండానే, అంటే ఏ మాత్రం ఆలోచించకుండా, నిర్ణయం తీసేసుకుంది.

'ధరణి అంటే భూమి ...... అన్నీ భరిస్తుంది... మరి  భూమిని భరించగలడా రమేష్?'


కళ్ళు పెద్దవి చేసి విస్మయంగా చూసింది లలిత . అర్ధం కావడానికి సమయం పట్టింది. అర్ధమయ్యాక అంది, 'కనుక్కుంటాను మేడం ,' అంటూనే ధరణి కేబిన్ నించి పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళింది లలిత.


పరిగెత్తిన లలితవైపే చూస్తోంది ధరణి. ‘తన జీవితాన్ని కొద్ది రోజుల్లో మార్చేసింది. తన తల్లితండ్రులు యెంత ప్రయత్నించినా కాని పని.  లలితకి రుణపడిపడి పోయాను.’ 


[సమాప్తం]

***

శిరిప్రసాద్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :

అందరికీవందనాలు.


చిన్నతనంనించి కథలురాయడం నా హాబీ. 15 వయేట మొదటికథ అచ్చయితే, 18 వయేట ఆంధ్రపత్రిక వారపత్రిక దీపావళికథల పోటీలోనా కథ 'విప్లవం' కి బహుమతి వచ్చింది. తర్వాత కొన్ని కథలు పత్రికల్లో వచ్చాయి. అక్కడితో సాహితీ ప్రస్థానం ఆగిపోయింది. కొన్నిసంవత్సరాల తర్వాత యీ మధ్య మళ్ళీ రాయడం మొదలెట్టాను. అయితే డిజిటల్ మీడియాలోనే రాస్తున్నాను. 2020 సంక్రాంతి సమయం లో ఒక కథకి [చెన్నైఅనే నేను] ప్రతిలిపిలో మూడో బహుమతి వచ్చింది. ఈమధ్య అందులోనే మరో కథ10 ఉత్తమ కథల్లో వొకటిగా నిలిచింది. గోతెలుగు డాట్కామ్ లో వొక హాస్య కథ ప్రచురింపబడింది. కొన్నిసంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ రాయగలననే ఆత్మవిశ్వాసం కలిగింది.


'శిరిప్రసాద్' అనేకలం పేరుతో రాస్తుంటాను.


ఇంతకంటే చెప్పుకోతగ్గ విషయాలు లేవు. కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.




94 views0 comments
bottom of page