top of page
Original.png

వేర్లని విడిచిన వృక్షం

5 hours ago
5 min read

వేర్లని విడిచిన వృక్షం కథలో కుటుంబంతో తిరిగి సంతోషంగా జీవిస్తున్న ప్రవీణ్, మౌనిక మరియు వారి పాప
వేర్లని విడిచిన వృక్షం కథలో కుటుంబంతో తిరిగి సంతోషంగా జీవిస్తున్న ప్రవీణ్, మౌనిక మరియు వారి పాప

Verlani Vidichina Vruksham - Telugu Family Story | Kulakarni Pavana Dattasai

వేర్లని విడిచిన వృక్షం - తెలుగు కుటుంబ కథ | కులకర్ణి పవన దత్తసాయి

Published in manatelugukathalu.com on 12/11/2026


పెరుగుతున్న ఆదాయం కంటే కుటుంబంతో కలిసి గడిపే సమయం, మనసుకు లభించే ప్రశాంతతే నిజమైన సంపద అని చెప్పే కథ ‘వేర్లని విడిచిన వృక్షం’.

భవిష్యత్తు కోసం వర్తమానాన్ని కోల్పోకూడదనే చక్కని జీవన సందేశాన్ని ఈ కథ అందిస్తుంది.


ఒక మోస్తరు జనాభా కలిగిన రామాయంపేట అనే పట్టణంలో ప్రవీణ్ తన తల్లిదండ్రులతో కలిసి సొంత ఇంట్లో నివసించేవాడు. 


బీటెక్ పూర్తి చేసిన తర్వాత తన తండ్రి నిర్వహిస్తున్న రైస్ మిల్లు వ్యాపార బాధ్యతలను చూసుకుంటూ ఉండేవాడు.


తన బీటెక్ క్లాస్‌మేట్ మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మౌనికకు భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం. 


చిన్నప్పటి నుంచే ఆసక్తితో నేర్చుకున్న నాట్యాన్ని, ఇప్పుడు రామాయంపేటలోని తమ వీధి పిల్లలకు నేర్పిస్తూ తన అభిరుచిని కొనసాగించేది.


సొంత ఊళ్లోనే ఉంటున్నాడు కాబట్టి ప్రవీణ్‌కి ఆ ఊరిలో చుట్టాలు, స్నేహితులూ ఎక్కువే. 


రోజంతా రైస్ మిల్లు వ్యవహారాలు చూసుకోవడం, సాయంత్రాలు స్నేహితులతో వాలీబాల్ ఆడి అలసి ఇంటికొచ్చి, తనకు ఇష్టమైన వంట చేస్తున్న భార్యకి వంటలో సహాయం చేసి అందరితో కలిసి భోజనం చేసి, రాత్రిళ్లు మరింత అలసిపోయేవాడు.


అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ మరియు మౌనికల మధ్య వచ్చే చిలిపి కినుకలను సమన్వయం చేస్తూ, వారాంతాల్లో కుటుంబంతో కలిసి సినిమాలకు వెళ్తూ వారి దాంపత్య జీవితం హాయిగా సాగిపోతుండేది.


అలా సరదాగా, సరసంగా సాగిపోతున్న వారి జీవితంలోకి ఒకరోజు ప్రవీణ్ బీటెక్ క్లాస్‌మేట్, కామన్ ఫ్రెండ్ అయిన నీరజ్ వచ్చాడు.


ముగ్గురూ కలిసి కాలేజీ రోజుల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ రోజంతా సరదాగా గడిపారు. మాటల మధ్యలో నీరజ్ తాను హైదరాబాద్‌లో కొనుగోలు చేసిన గేటెడ్ కమ్యూనిటీ విల్లా గృహప్రవేశానికి ఆహ్వానించడానికి వచ్చానని చెప్పాడు.


నీరజ్ కొనుగోలు చేసిన విల్లా ప్రవీణ్‌ను ఎంతగానో ఆకర్షించింది.


ప్రవీణ్: “చాలా బాగుందిరా ఈ విల్లా! ఎంతకు కొన్నావు?”

నీరజ్: “నాలుగు కోట్లు అయిందిరా! పూర్తిగా ఫర్నిష్ చేశాను. 24 గంటల సెక్యూరిటీ, నీళ్ళు, విద్యుత్ వంటి సౌకర్యాలకు కూడా ఢోకా లేదు. 


నువ్వు కూడా హైదరాబాద్‌కు వచ్చేయరా! ఈ చిన్న ఊరిలో ఉండి ఏం సాధిస్తావు? నువ్వు కూడా బీటెక్ చేశావు కదా! ఒక AI కోర్సు చేయమని చెబుతాను. మా కంపెనీలో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. నేను రిఫర్ చేస్తాను, ఆలోచించుకో. రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా సిటీలోనే ఉండాలి కదా!”

అని చెప్పి నీరజ్ వెళ్ళిపోయాడు.


కానీ అతను చెప్పిన ప్రతి మాట ప్రవీణ్ చెవుల్లో పదే పదే ప్రతిధ్వనిస్తూనే ఉంది. నీరజ్ విల్లా, అతని జీవనశైలి, హైదరాబాద్‌లోని అవకాశాలు ప్రవీణ్ మనసులో బలమైన ముద్ర వేశాయి.


చాలా ఆలోచించిన తర్వాత హైదరాబాద్‌కు వెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాడు.


తన నిర్ణయాన్ని తండ్రికి చెప్పాడు.


తండ్రి: “చూడు నాన్నా! నీకు ఇప్పుడు ఏది మంచో, ఏది కాదో నిర్ణయించుకోగలిగే వయసు వచ్చింది. నీ నిర్ణయంపై నాకు నమ్మకం ఉంది. నీకు ఏది సరైనదనిపిస్తే అది చేయి.” అని చెప్పాడు.


తండ్రి తన నిర్ణయాన్ని వ్యతిరేకించకపోయినా, ప్రోత్సహించకపోయినా ప్రవీణ్ తన ఆలోచనకే కట్టుబడ్డాడు. మిగతా కుటుంబ సభ్యులు కూడా పెద్దగా ఏమీ మాట్లాడలేదు.


అలా మౌనికను తీసుకుని ప్రవీణ్ హైదరాబాద్‌కు మకాం మార్చాడు.

నీరజ్ సలహాతో AI కోర్సు పూర్తి చేసి, అతని కంపెనీలోనే ఉద్యోగంలో చేరాడు.


రైస్ మిల్లు వ్యాపారంతో పోలిస్తే సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో ఆదాయం ఎక్కువగా ఉండటంతో ప్రవీణ్ ఆర్థికంగా ఎదుగుతున్నానని భావించాడు. అయితే అతని మనసులో ఎక్కడో నిలిచిపోయిన నీరజ్ విల్లా కల మాత్రం రోజురోజుకూ బలపడుతూనే ఉంది.


చివరకు తండ్రిని అడిగి కొంత మొత్తాన్ని డౌన్ పేమెంట్‌గా తీసుకుని, మిగిలిన మొత్తానికి హోమ్ లోన్ తీసుకుని తన కలల విల్లాను కొనుగోలు చేశాడు.


విల్లాలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రవీణ్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.


విల్లా కొనుగోలు కోసం తీసుకున్న భారీ హోమ్ లోన్‌కు నెలనెలా చెల్లించాల్సిన EMI జీతంలో ఎక్కువ భాగాన్ని మింగేస్తోంది. మిగిలిన మొత్తంతో రోజువారీ ఖర్చులు నిర్వహించడం కూడా కష్టంగా మారింది. దీంతో మౌనిక కూడా ఉద్యోగంలో చేరక తప్పలేదు.


ఇద్దరూ ఉద్యోగ జీవితంలో పూర్తిగా నిమగ్నమైపోయారు.

వంట వండే తీరిక మౌనికకి, వంటలో సహకరించే ఓపిక ప్రవీణ్‌కి లేకుండా పోయాయి.


క్రమంగా ఇద్దరూ ఆన్‌లైన్ ఫుడ్‌కు అలవాటు పడ్డారు.


కొత్త విల్లాకు తగ్గట్టుగా జీవనశైలి కూడా మారిపోయింది. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ వంటి ఖర్చులు తప్పనిసరయ్యాయి. విల్లాకు తగ్గట్టుగా ఉండాలనే ఆలోచనతో తన పాత i10 కారును అమ్మేసి, లాంగ్ డ్రైవ్స్‌కు సౌకర్యంగా ఉంటుందని నీరజ్ సలహా మేరకు పెద్ద SUV కారు కొనుగోలు చేశాడు. 


పెరిగిన కారు పరిమాణానికి అనుగుణంగా దాని నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయి.

ఇలా ఆదాయం పెరిగినా, ఖర్చులు అంతకంటే వేగంగా పెరిగాయి.


ఈ మార్పులన్నింటి మధ్య ప్రవీణ్ జీవితంలో కొన్ని విలువైన విషయాలు మాత్రం క్రమంగా కనుమరుగయ్యాయి.


కంటినిండా నిద్ర... పెదవులపై చిరునవ్వు... భార్యతో గడిపే ఆప్యాయమైన క్షణాలు!

భార్యపై ప్రేమ తగ్గలేదు, కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడానికి సమయం లేకుండా పోయింది.


ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో ప్రవీణ్ స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేశాడు. మొదట IPOలలో పెట్టుబడులు పెట్టడంతో ప్రారంభమైన అతని ప్రయాణం క్రమంగా డైలీ ట్రేడింగ్ వరకు వెళ్లింది. 


త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో షార్ట్‌టర్మ్ లాభాల కోసం ప్రయత్నించాడు. కానీ ఆశించిన ఫలితాలు రాకపోగా నష్టాలే మిగిలాయి.


ఇంతలో వారి జీవితంలోకి మరో కొత్త ఆనందం ప్రవేశించింది. వారికి పాప పుట్టింది.

అయితే ఆనందంతో పాటు బాధ్యతలు కూడా రెట్టింపయ్యాయి. 


మౌనిక మెటర్నిటీ లీవ్ ముగిసిన తర్వాత ఉద్యోగానికి తిరిగి వెళ్ళాల్సి రావడంతో పాపను చూసుకోవడం పెద్ద సమస్యగా మారింది. అందుకే ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంచుకుంది.


అయినా పాపను చూసుకోవడం, ఇంటి బాధ్యతలు నిర్వహించడం, ఉద్యోగం చేయడం మౌనికకు కష్టంగా మారింది. దీంతో ఒక బేబీ సిట్టర్‌ను నియమించుకున్నారు.


బేబీ సిట్టర్ పాపను ఎలా చూసుకుంటుందో తెలుసుకోవడానికి ప్రవీణ్ ఇంట్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాడు.


ఒకప్పుడు ఇంట్లోనే నానమ్మ, తాతయ్యల ఒడిలో ఆడుకోవాల్సిన పాప, ఇప్పుడు బేబీ సిట్టర్ సంరక్షణలో పెరుగుతోంది. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నా ఉద్యోగ బాధ్యతల కారణంగా పాపతో గడిపే సమయం చాలా తక్కువగా ఉండేది.


అలా ఆశలకు, ఆకాంక్షలకు, ఆర్థిక బాధ్యతలకు మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రవీణ్, మౌనికలను చూడటానికి ఒకరోజు ప్రవీణ్ తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చారు.


మూడు రోజుల పాటు అక్కడే ఉన్న ప్రవీణ్ తండ్రికి ఇంటి పరిస్థితి, కొడుకు జీవనశైలి, కుటుంబ సభ్యుల మధ్య తగ్గిపోతున్న అనుబంధం మొత్తం అర్థమైపోయింది.


ఒకప్పుడు రామాయంపేటలో చలాకీగా, చిలిపిగా, స్నేహితులతో సరదాగా గడిపే ప్రవీణ్ ఇప్పుడు కనిపించడం లేదు. అతని స్థానంలో బాధ్యతల భారంతో నలిగిపోతున్న ఒక వ్యక్తి మాత్రమే కనిపిస్తున్నాడు.


అతని జీవితంలో విల్లా ఉంది, పెద్ద కారు ఉంది, మంచి ఉద్యోగం ఉంది. కానీ వాటి మధ్య ప్రవీణ్ మాత్రం ఎక్కడో కనుమరుగైపోయాడు.


ఆ రోజు సాయంత్రం ప్రవీణ్‌ను తన దగ్గర కూర్చోబెట్టుకుని తండ్రి మాట్లాడటం ప్రారంభించాడు.


తండ్రి: “చూడు ప్రవీణ్! నువ్వు విల్లా కొనాలనుకున్నప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఒకసారి పక్కన పెట్టి, ఇప్పుడు నీ జీవితాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించు. ఈ విల్లా కోసం నువ్వు ఏం పొందావో, దాని కోసం ఏం కోల్పోయావో నీకే అర్థమవుతుంది.


పొందిన దానికంటే కోల్పోయినదే ఎక్కువైతే దాన్ని నష్టం అంటారు కదా! స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే నీకు ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాలా?


సొంత ఊరిని, సొంత మనుషులను వదిలి ఇక్కడికి వచ్చావు. కన్న కూతురిని చూసుకోవడానికి ఒక ఆయాను పెట్టావు. ఆ ఆయా పాపను ఎలా చూసుకుంటుందో తెలుసుకోవడానికి మళ్ళీ సీసీ కెమెరాలు పెట్టావు.


అదే మన ఊరిలో ఉంటే నీ కూతురిని చూసుకోవడానికి నానమ్మ, తాతయ్య ఉండేవారు కదా! నువ్వు, నీ భార్య ఉద్యోగాలు చేసుకుంటూనే పాప పెంపకాన్ని కూడా ఆనందంగా చూసుకునేవారు కదా!


ఒకప్పుడు నీకు సంతోషాన్నిచ్చిన చిన్నచిన్న విషయాలన్నీ ఇప్పుడు నీ జీవితంలో లేవు. సంపాదన పెరిగింది కానీ ప్రశాంతత తగ్గింది. సౌకర్యాలు పెరిగాయి కానీ సంతోషం తగ్గింది. ఇల్లు పెద్దదైంది కానీ కుటుంబంతో గడిపే సమయం చిన్నదైపోయింది.


మూలాలను మరిచిన మనిషి, వేర్లను వదిలేసిన వృక్షం నిలబడలేవురా!

ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మనం రామాయంపేటకు తిరిగి వెళ్లిపోదాం. 


అక్కడ నీకు, నీ భార్యకు నచ్చినట్లు జీవించండి. పాపను చూసుకోవడానికి మేమున్నాం. కనీసం స్కూలు చదువు పూర్తయ్యే వరకు మన ఊరిలోనే ఉండొచ్చు కదా! ఆ తర్వాత తన ఉన్నత చదువుల గురించి ఆలోచిద్దాం.


ఈ విల్లాను అమ్మేసి అప్పులు తీర్చేయి. ఏమైనా డబ్బులు మిగిలితే పాప పేరు మీద పెట్టుబడి పెట్టు.


ఎప్పుడో రాబోయే భవిష్యత్తు గురించి భయపడుతూ, చేతిలో ఉన్న వర్తమానాన్ని ఇంతలా ఇబ్బంది పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవాలి కానీ, ఆ భవిష్యత్తు కోసమే వర్తమానాన్ని కోల్పోకూడదు కదా నాన్నా!”

అని ప్రేమతో హితబోధ చేశాడు.


తండ్రి మాటలు విన్న ప్రవీణ్ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. గత కొద్దిరోజులుగా తన అంతరాత్మ తనకు చెబుతున్న మాటలనే తండ్రి నోటి నుంచి వినడంతో అతని మనసులో ఏదో తెలియని భారం తొలగిపోయినట్లనిపించింది.


తన జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. రామాయంపేటలో గడిపిన ఆ రోజులు, స్నేహితులతో ఆడుకున్న ఆటలు, తల్లితో మౌనికకు జరిగే చిన్నచిన్న అలకలు, భార్యతో కలిసి వంట చేసిన క్షణాలు, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన సమయాలు... అన్నీ కళ్ళముందు కదలాడాయి.


తనకు కావాల్సింది నిజంగా విల్లానా? లేక ఆ విల్లా కోసం తాను కోల్పోయిన జీవితమా? అనే ప్రశ్న అతని మనసును తొలిచింది.


ఏం చేద్దామని మౌనిక వైపు చూశాడు. ఆమె కూడా మామయ్య చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని అర్థం చేసుకున్నట్లుగా చిరునవ్వుతో తల ఊపింది.


చివరకు ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు.

విల్లాను విక్రయించి, అప్పులు తీర్చి, మిగిలిన మొత్తాన్ని పాప భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు.


కొన్ని రోజుల తర్వాత ప్రవీణ్, మౌనిక, వారి పాప తిరిగి రామాయంపేటకు చేరుకున్నారు.

మళ్ళీ పాత ఇంట్లో సందడి మొదలైంది. మౌనిక తనకు ఇష్టమైన భరతనాట్యాన్ని పిల్లలకు నేర్పించడం ప్రారంభించింది. 


ప్రవీణ్ తిరిగి తండ్రి వ్యాపార బాధ్యతలను చూసుకుంటూ, సాయంత్రాలు స్నేహితులతో వాలీబాల్ ఆడటం మొదలుపెట్టాడు. ఇంటికి వచ్చాక భార్యకు వంటలో సహాయం చేయడం, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం మళ్ళీ అతని దినచర్యలో భాగమయ్యాయి.


అన్నింటికంటే ముఖ్యంగా, పాపకు నానమ్మ ఒడిలో ఆడుకునే అదృష్టం, తాతయ్యతో కబుర్లు చెప్పుకునే ఆనందం తిరిగి లభించాయి.


ఆ రోజు ప్రవీణ్‌కు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది.


జీవితంలో ఎదగడం అంటే పెద్ద ఇల్లు కొనడం, పెద్ద కారు నడపడం, ఎక్కువ జీతం సంపాదించడం మాత్రమే కాదు. మనం ప్రేమించే మనుషులతో కలిసి ఆనందంగా జీవించగలగడం కూడా నిజమైన ఎదుగుదలే!


అలా ప్రవీణ్ కుటుంబం తమ పాత జీవితాన్ని కొత్త అవగాహనతో, కొత్త ఆనందంతో మళ్ళీ ప్రారంభించింది.


***









మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y




కులకర్ణి పవన దత్తసాయి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


కులకర్ణి పవన దత్తసాయి
కులకర్ణి పవన దత్తసాయి

రచయిత పరిచయం: కులకర్ణి పవన దత్తసాయి

నమస్కారం.. నేను కులకర్ణి పవన దత్తసాయి.

వృత్తి రీత్యా  AG office Hyderabad లో auditor గా పని చేస్తున్నాను.  ప్రవృత్తి రీత్యా సాహితీ ప్రియుడిని.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page