'Veruni Maruvani Kommalu' - New Telugu Story Written By Durgam Bhaithi
'వేరుని మరువని కొమ్మలు' తెలుగు కథ
రచన: దుర్గం భైతి
రాత్రి పదకొండు గంటలు. సెల్ ఆగకుండా మోగుతోంది.గాఢ నిద్రలో ఉన్న వంశీ కళ్ళు నులుముకుంటూ సెల్ చూసాడు. పది మిస్డ్ కాల్స్ మావయ్య నుంచి.
'ఇన్ని సార్లు చేశారంటే....' మనసు ఎదో కీడును శంకించింది. మెల్లగా లేచి ఫ్రిజ్ లోంచి మంచినీళ్లు తీసుకుని త్రాగాడు. మావయ్య ఎందుకు ఫోన్ చేసాడు? నిద్ర మాయమైపోయింది. అశాంతిగా అటూఇటూ తిరిగాడు. ఫోన్ తీసుకుని ఇండియాకు రింగ్ చేసాడు.
"మావయ్యా..!” కాల్ కనెక్టయ్యింది.
అవతల మావయ్య, " ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి చాలా సార్లు ఫోన్ చేసాను. ఏంలేదు.... ఎలా చెప్పాలో తెలియడంలేదు.....” కాసేపు అవతల నిశ్శబ్దం.
“హలో... మావయ్యా...! ఏమైంది? అందరూ బావున్నారా? చెప్పు మావయ్యా. నాకు కంగారుగా ఉంది.”
“అదేరా....మీ నాన్న ఆరోగ్యం కొంచం విషమంగా ఉంది. అందుకే ఫోన్ చేసాను "
"నాన్న గారికి ఏమయ్యింది?'" ఆందోళనగా అడిగాడు.
"నీకు చెప్పలేదనుకోకు. మీ నాన్నకు రెండు నెలల నుండి ఆరోగ్యం బావుండటంలేదు. డాక్టర్లకు చూపించాం. వాళ్లేం చెప్పడం లేదు....” మావయ్య చెబుతోనే ఉన్నాడు. వంశీ మెదడు మొద్దు బారిపోయింది. మావయ్య చెబుతున్న మాటలు చెవికి ఎక్కడం లేదు. మనసుని ఎవరో రంపంతో కోసినట్లు నొప్పి. ఆయాసంగా ఉందనిపించింది. నిల్చునే ఓపిక లేక బెడ్ పై నిస్త్రాణంగా కూలబడి పోయాడు. ప్రక్కనే రాధ ప్రశాంతంగా నిద్ర పోతోంది. వంశీ పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు.
'రెండు నెలల నుండి నాన్న అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తనకు ఎందుకు చెప్పలేదు? నేనేం తప్పు చేసాను?' వంశీ ఎంతో మదనపడి పోయాడు. అతని ప్రమేయం లేకుండా మనసు గతంలోకి వెళ్లపోయింది.
*****
గోపాలం సన్నకారు రైతు. అతనికి ఇద్దరు తమ్ముళ్లు. చిన్నప్పుడే తల్లిదండ్రులని కోల్పోవడంతో వాళ్ల బాధ్యత గోపాలంపై పడింది. కష్టాలకు వెరవక, ఉన్న కొద్ది పాటి పొలాన్ని ఆలంబనగా చేసుకుని వ్యవసాయము చేస్తూ , తమ్ముళ్లిద్దరిని బాగా చదివించాడు. కుటుంబ
పోషణలో జయంతి, భర్త గోపాలానికి చేదోడు వాదోడయ్యింది. తమ్ముళ్లు కూడా గోపాలం మాటను ఎప్పుడు జవ దాటలేదు.తండ్రి ఎలా ఉంటాడో తెలియని తమను పెంచి పెద్ద చేసిన అన్న పట్ల వారి గౌరవం ఏనాడు తగ్గలేదు. పెద్ద తమ్మునికి బ్యాంకులో ఉద్యోగం, చిన్న తమ్మునికి ఇంజనీర్ గా ఉద్యోగాలు రావడంతో గోపాలం కొంచెం కుదుట పడ్డాడు. తమ్ముళ్లిద్దరూ అన్నావదినలకు నచ్చిన అమ్మాయిలనే పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగరీత్యా వేర్వేరు చోట ఉంటున్న తమ్ముళ్లు తమ అన్న వదినలను తమ దగ్గర ఉండమని ఎంతగానో చెప్పి చూసారు. పుట్టిన ఊరుని విడిచి ఉండలేక గోపాలం దంపతులు వెళ్లలేదు.
దైవం గోపాలం దంపతులను చిన్న చూపు చూసాడు. కష్టాలు తీరి సుఖంగా ఉన్న వారి దాంపత్య జీవితంలో వారికున్న ఏకైక బాధ సంతానం లేకపోవడం. కాని తన తమ్ముళ్ల సంతానాన్ని తమ సంతానంగా మురిసిపోతూ జీవితాన్ని గడుపుతున్నారు. ప్రతి పండుగ పూట అందరూ గోపాలం ఇంటనే సంతోషంగా గడిపేవారు. పెంకుటిల్లు స్థానంలో అందమైన భవంతిని నిర్మించి అన్నావదినలకు కానుకగా ఇచ్చి అన్న పట్ల తమ ప్రేమను చక్కగా నిరూపించుకున్నారు.
పిల్లలు లేకపోవడం వల్ల అన్న ఆనందంగా లేడని గ్రహించిన పెద్ద తమ్ముడు “ అన్నయ్యా , నువ్వు మరోలా భావించకపోతే వంశీ ఇకనుంచి నీ కొడుకుగా నీ దగ్గర పెరుగుతాడు. వాడిని నువ్వు తీర్చిదిద్ది ప్రయోజకుడిని చేస్తావు.” అంటూ తన రెండవ కొడుకుని గోపాలంకు దత్తత ఇచ్చాడు.
గోపాలం వంశీని అల్లారుముద్దుగా పెంచి, తన తమ్ముళ్ల కంటే ఎక్కువగా చదివించాడు. “ వంశీ ! నువ్వు విదేశాలలో పై చదువులు చదివి, జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలి. మన కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు తేవాలి.” వంశీని అమెరికా పంపుతూ గోపాలం అన్నాడు.
ఎమ్మెస్ అయిన తర్వాత గోపాలం కోరిక పై వంశీ తన మేనమామ కూతురు రాధను పెళ్లి చేసుకుని అమెరికా నాసాలో ఇంజనీరుగా స్థిరపడ్డాడు. అప్పడప్పుడు తండ్రికి ఫోన్ చేసి యోగ క్షేమాలు కనుక్కునేవాడు. రాన్రాను ఉద్యోగంలో బాధ్యతలు పెరగడంతోను, దైనందిక జీవితంలో వచ్చిన మార్పుల వలన వంశీ కొన్ని పనులను వాయిదా వెయ్యక తప్పలేదు. అందులో ఇండియాకు ఫోను చేసి అక్కడ వారి యోగ క్షేమాలను కనుక్కోవడం. అందు వలన తనని తన కుటుంబ సభ్యులే అపార్థం చేసుకుంటారని వంశీ ఊహించలేదు. మావయ్య నిష్టూరంగా మాట్లాడిన మాటలు వంశీ చెవుల్లో మారు మ్రోగుతున్నాయి
“చూడు వంశీ.. ఎన్నాళ్లయ్యింది నువ్వు ఇండియా వచ్చి? ఎన్నాళ్లయ్యింది మీ నాన్న యోగ క్షేమాలను కనుక్కుని? కనీసం ఫోన్ చేసి మాట్లాడే తీరికే లేదా మీ ఇద్దరికి? ఏ కుటుంబమైతే నీ ఉన్నతికి కారణమో దాన్ని నువ్వు పూర్తిగా మర్చిపోయావు. మేం కూడా మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయాం. అనుబంధాలకు, ఆత్మీయతకు పాతర వేసేసారని పిస్తోంది. మీ నాన్నకు తెలీకుండ ఫోను చేస్తున్నాను. ఇదే నేను నీకు చెప్పే చివరి మాట. నీలో మీ నాన్న పట్ల, కుటుంబం పట్ల ఏమాత్రం ప్రేమున్నా మీ నాన్న పాదాల చేరి నీ తప్పు సరిదిద్దుకో. ఆలస్యం అమృతం.... వినే ఉంటావు."
చెంప చెళ్లుమన్నట్టగా అనిపించింది వంశీకు. మావయ్య మాటలకు కృంగిపోయాడు. నేను పరదేశంలో సుఖమైన, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయినట్టు వీళ్లందరూ భావిస్తున్నారు. నేనేదో నా మూలాలను పూర్తిగా మరిచిపోయాననుకుంటున్నారు. నాన్న నిలువెల్లా ప్రేమను నింపుకున్న ఒక మహా వృక్షం. మేమంతా ఆ వృక్షానికి పెరిగిన కొమ్మలం. వృక్షానికి దూరమైనా వేరును మర్చిపోని కొమ్మలమని నాకు తెలుసు. కాని నన్నాపార్థం చేసుకుంటున్న వీళ్లకు నా బాధ ఎలా తెలుస్తుంది. విలాసంగా బతకాలని నేను అమెరికా రాలేదని, నాన్న కోరికపై వచ్చానని చెప్పాలనుంది. నాన్నను విడిచి రావడం తనకిష్టం లేకపోయినా విధి లేక వచ్చానని వీళ్లకు తెలీదు.
పై చదువుల కోసం తనని అమెరికా పంపుతున్నప్పుడు గోపాలం మాటలు జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. “ వంశీ నువ్వు నాకు మాటివ్వాలి. నాకు తెలుసు నన్ను విడిచి వెళ్లడం నీకిష్టం లేదని. నీకో విషయం చెప్పాలి. ఏ తల్లితండ్రులైనా పిల్లలు తమ కన్నా వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు. నేను చదువు కోవాలి విదేశాలు వెళ్లాలని కలలు కనే వాడిని. కాని నాకా అదృష్టం దక్కలేదు. నా పరిస్థితులు నాకు సహకరించ లేదు. నా కోరిక కనీసం నా తమ్ముళ్లయినా తీరుస్తారనుకున్నా. నా మీద వారికున్న ప్రేమ వాళ్లను నా నుంచి దూరం చేయలేక పోయింది. ఇక నాకున్న ఆశ నువ్వే. అందుకనే నిన్ను అమెరికా పంపుతున్నాను. నా కలలు, కోరికలు నువ్వే నెరవేర్చాలి. అందుకనే నువ్వొక లక్ష్యం పెట్టుకోవాలి. ఇంటిమీద, నా మీద బెంగ పెట్టుకుని చదువును నిర్లక్ష్యం చెయ్యకు. నువ్వు పెద్ద ఇంజనీరు అవ్వాలి. మా అందరికి గర్వ కారణమవ్వాలి. ఇందుకు నువ్వు కొన్నాళ్లు మమ్మలనందరిని మర్చిపోవాలి. మాటిమాటికి ఫోన్లు చెయ్యకు. ఇది నా స్వార్ధం. నీకు నాకు తప్ప ఈ విషయం ఎవ్వరికి తెలియకూడదు. గుర్తుంచుకో. నాకు మాటివ్వు.”
వంశీ కళ్లనుంచి కారుతున్న నీరు అతని మండే గుండెను చల్లార్చింది. తండ్రికిచ్చిన మాట వలన ఈ నిందను భరించక తప్పదనుకున్నాడు. కాని తన ఉన్నతిని సదా కోరుకునే ఆ మహానుభావుడిని ఈ సమయంలో తను తప్పక చూడాలి. ఆయనను రక్షించుకోవాలి. రాధకు అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. లేచి చూసేసరికి విచార వదనంతో కనిపిస్తున్న వంశీ దగ్గరకు వచ్చి "ఏమైంది వంశీ " కంగారుగా అడిగింది .
మనసును సాంత్వన పరుచుకుని రాధతో వంశీ "చదువుకునే సమయంలో నాన్నమాటకు కట్టుబడి ఫోన్ చేయలేదు, ఇప్పుడు ఉద్యోగ ఒత్తిడితోనే ఫోన్ చేయలేదని మావయ్య,నాన్నలకు ఎలా అర్థం అవుతుంది రాధా"అనిమనసులోని బాధనిచెప్పుకుని విలపించేసరికి వెంటనే రాధ తన తండ్రికి కాల్ చేసింది. "నాన్నా!అంత తొందరగా మాట ఎలా జారావు.ఆయన ఎంత మథనపడుతున్నారో తెలుసా? ఉద్యోగ బాధ్యతల్లో తీవ్రమైన ఒత్తిడి తో ఉండి ఫోన్ చేయలేకపోయారు,తన సొంత తండ్రి కన్నా ప్రాణంగా ప్రేమిస్తారు గోపాలం మావయ్యని " అని వంశీ గోపాలం మామయ్య కిచ్చిన మాట గురించి వివరంగా చెప్పింది.
విషయం అర్థమై అందరిలోనూ అపార్థాలు తొలగిపోయాయి.ఎప్పుడెప్పుడు తండ్రిని చూద్దామా అనే తహతహతో వంశీ ,రాధ తో సహా ఇండియా కు వెంటనే బయలు దేరాడు. గ్రహణం వీడిన ఇంటి వెలుగు వంశీ కి స్వాగతం పలకడానికి నిండు మనసుతో ఆ ఉమ్మడి కుటుంబం ఉత్సాహంగా ఎదురుచూస్తుంది. *************
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
Kommentare