విధి లీల
- Neeraja Prabhala

- May 17
- 3 min read
Updated: May 18

Vidhi Leela - Telugu Story | Neeraja Hari Prabhala
విధి లీల - తెలుగు కథ | నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
Published In manatelugukathalu.com On 17/05/2026
బాధతో మనసు భారమైన వాస్తవఘటన.
"అనాయాసేన మరణం,
వినా దైన్యేన జీవనం,
దేహాంతే తవ సాన్నిధ్యం,
దేహిమే పరమేశ్వరా!"
నేను వేకువజాముననే లేచి, కనులు తెరిచి ఈ శ్లోకంతో దైవాన్ని ప్రార్థన చేయడం నాకు అలవాటు.
మృత్యువు మనకు పక్కలో బల్లెం - పక్కలో పాము లాగా ఎప్పుడూ మన పక్కనే ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని నవ్వుతూ మనం ఆహ్వానించటమే. అది తథ్యం. ఎంతటి వాళ్ళకైనా మృత్యువు తప్పదు. జనన మరణాలు ఈ జీవిత చక్రభ్రమణంలో నిరంతరం జరిగే ప్రక్రియ.
(అనాయాసేన మరణం) ఎలాంటి మృత్యు బాధ, నొప్పి లేకుండా సునాయాసంగా మరణం కలిగి పువ్వు లాగా తనువు చాలించాలి.
(వినా దైన్యేన జీవనం) బ్రతికినంత కాలం ఎవరినీ 'దేహి' అని యాచించకుండా, ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా హాయిగా, ఆరోగ్యంగా జీవిస్తూ,
(దేహాంతే తవ సాయుజ్యం) దేహం చాలించాక నిన్ను దర్శించుకుని నీలో ఐక్యమయ్యేలా చేయి,
పరమేశ్వరా!" అని నిత్యం ప్రార్థిస్తాను.
మా ఇంటి నుంచి నిన్న మిట్టమధ్యాహ్నం 1.30కు నేను మెడికల్ షాపుకు మందుల కోసం నడిచి వెళుతున్నాను. మళ్ళీ లంచ్ టైమ్'లో మూసేస్తారని బయలుదేరాను. దారిలో యథాలాపంగా బస్సు స్టాప్ వైపు చూశాను. ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పురుషులు నిలబడి బస్సు కోసం చూస్తున్నారు. ఆ ఇద్దరు మహిళలలో బాగా సన్నగా ఉన్న ఒకావిడ, సుమారు 42 ఏళ్ళు ఉంటాయేమో, బస్సు కోసం చూస్తోంది.
అమ్మో! ఇప్పుడే ఇంత ఎండలు ఉన్నాయి. ఇక ముందు ముందు ఈ విజయవాడలో ఈ వేసవి కాలం ఎలా తట్టుకోవాలో అనుకున్నా. ఇంతలో మెడికల్ షాప్ కనబడితే దానిలోకి వెళ్లి నాకు కావలసిన మందులు తీసుకుని తిరిగి ఇంటివైపు నడుస్తున్నాను.
మళ్ళీ ఇందాక చూసిన బస్ స్టాప్ వైపు చూశాను. అంత బక్కగా ఉన్న ఆవిడ అక్కడే ఉందా? బస్సు ఎక్కిందా? పాపం ఈ ఎండలకు ఎలా ఉందో అని ఎందుకో అనిపించి అలా అటువైపు చూశాను. ఆవిడ ఒక్కతే ఉంది. మిగిలిన వాళ్ళెవరూ లేరు.
అంతే. ఆవిడకు కళ్ళు తిరిగినట్టు సైగ చేస్తూ ఉన్న పళంగా కిందకు పడిపోవడం రెప్పపాటులో జరిగింది. వెంటనే పరుగున వెళ్లి ఆవిడను చేతిలోకి తీసుకుని, అప్పుడే అటుగా ఒక ఆటో వెళుతుంటే అందులోకి ఎక్కించి దగ్గరలోని హాస్పిటల్'కు తీసుకుని వెళ్లి డాక్టరుకు చూపించాను. వెంటనే డాక్టర్ చూసి చెక్ చేసి "సారీ మేడం, షీ ఈజ్ నో మోర్" అన్నారు. సడన్ కార్డియాక్ అరెస్టుట. డాక్టర్ చెప్పారు. ఒక్కసారిగా ఎంత బాధ అనిపించిందో మాటలలో చెప్పలేను.
"అయ్యో! చూస్తూ ఉండగానే నా కళ్ళ ముందే, నా చేతిలోనే ఒక నిండు ప్రాణం ఇలా వెళ్ళిపోయిందే" అని మనసంతా చాలా భారంగా అనిపించింది.
ఆ బస్సు స్టాప్'కు ఆ హాస్పిటల్ 4 షాపుల అవతల. గట్టిగా నడిస్తే 5 నిమిషాలు. అది చాలా పెద్ద హాస్పిటల్. ఆ డాక్టర్లు కూడా బాగా తెలుసు. లోగడ ఎవరికో హెల్ప్ కావాలంటే తెలిసిన ఒక పేషంట్'ను తీసుకెళ్ళి చూపించి అందులో జాయిన్ చేశాను. మా ఇంటి నుంచే ఆవిడకు బ్రేక్ ఫాస్ట్, ఫుడ్ వండి తీసుకెళ్ళేదాన్ని. ట్రీట్మెంట్'తో తగ్గి ఆవిడ వాళ్ళింటికి సంతోషంగా వెళ్ళింది.
అలాగే ఈవిడ కూడా కోలుకుంటుందనుకున్నా. కానీ మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి అన్నట్టుగా ఇలా జరిగింది. విధి లీల అంటే ఇదేనేమో మరి. అప్పటిదాకా ఇంట్లోనే ఉన్న నేను సరిగ్గా ఆ సమయానికి అటువైపు వెళ్ళటం, అటుగా ఆవిడను చూడటం, అదే సమయంలో పాపం ఆవిడకు అలా జరగటం... సమయానికి హాస్పిటల్'కు తీసుకెళ్ళినా అప్పటికే ఆవిడ మరో లోకాలకు తరలి వెళ్ళటం చాలా బాధ అనిపించింది. ఆవిడ బ్రతికితే చాలా సంతోషించేదాన్ని.
ఇక ఆవిడ చేతిలో ఒక చిన్న ఫోన్ ఉంటే అందులో 2 నెంబర్లకు కాల్ చేశాను. అందులో ఒకటి వాళ్ళ తమ్ముడి నెంబర్'ట. అతనికి జరిగింది చెబితే ఒక అరగంటలో రామవరప్పాడు నుంచి వచ్చాడు. తనతో పాటు ఆవిడ కూతుర్లిద్దరిని తీసుకొచ్చాడు. వాళ్ళ వయసు 10 ఏళ్ళ లోపే ఉంటుంది. అందులో ఒక పాప హ్యాండీక్యాప్, నడవలేదు. చాలా బాధ అనిపించింది. ఆ వయసులో ఆ పిల్లలకు, ఆ పరిస్థితిలో వాళ్ళకు అమ్మ లేదే... అయ్యో! ఇక ముందు వాళ్ళకు ఎలా అని.
ఆవిడ పేరు లక్ష్మి అనీ, ఆవిడ భర్త చెడు వ్యసనాలకు బానిస అయి ఆవిడను, పిల్లలను వదిలేస్తే ఎలక్ట్రీషియన్'గా పని చేస్తున్న ఆ తమ్ముడి వద్ద ఆవిడ తన పిల్లలతో తలదాచుకుంటోందిట. ఆవిడ నాలుగు ఇళ్ళల్లో పనిచేసుకుంటోందిట. ఇదంతా వాళ్ళ తమ్ముడు చెప్పాడు.
నాకు తోచిన సాయం చేసి వాళ్ళను, ఆవిడను ఒక వెహికల్'లో ఎక్కించి భారంగా ఇంటికి వచ్చాను. అప్పటిదాకా ఆవిడ, నేను అపరిచితులం. కళ్ళముందే నా చేతులలోనే ఆవిడ తుది శ్వాస విడవటం... "బంధమంటే ఇదేనేమో" అని బాధ కలిగింది.
.. సమాప్తం ..
నీరజ హరి ప్రభల గారి కొన్ని ఇతర రచనలు:

-నీరజ హరి ప్రభల
Profile Link
Youtube Playlist Link







Comments