పిల్లల అపురూప ప్రపంచం
- Bugatha Yamuna

- 1 hour ago
- 4 min read

Pillala Apuroopa Prapancham - Telugu Family Story | Bugatha Yamuna
పిల్లల అపురూప ప్రపంచం - తెలుగు కుటుంబ కథ | బుగత యమున
Publishes in manatelugukathalu.com on 24/08/2026
పిల్లల బాల్యం అంటే కేవలం చదువులు, ట్యూషన్లు, హోమ్‌వర్క్‌లు, సమ్మర్ క్లాసులు మాత్రమే కాదు. ఆడుకోవడం, ప్రకృతిని ఆస్వాదించడం, స్నేహితులతో గడపడం, మట్టిలో పరుగులు తీయడం, గెలుపు–ఓటములను అనుభవించడం కూడా వారి ఎదుగుదలలో ఎంతో ముఖ్యమైన భాగాలు. “పిల్లల అపురూప ప్రపంచం” కథలో హాధ్య, హర్షల ద్వారా ఆధునిక నగర జీవనశైలిలో పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిడిని చూపిస్తూ, వారి శారీరక–మానసిక వికాసానికి స్వేచ్ఛాయుతమైన బాల్యం ఎందుకు అవసరమో హృద్యంగా చెబుతుంది.
కాంక్రీట్ అడవులుగా మారిపోయిన పట్నంలో పెరుగుతున్న పిల్లలకు ఆకాశాన్ని చూసే తీరిక, స్వేచ్ఛగా ఆడుకునే అవకాశం చాలా తక్కువ... ఇలాంటి లాక్డ్ పేరెంటింగ్ సమస్యతోనే బాధపడుతున్న పిల్లలు హాధ్య మరియు హర్షలు. ఉదయం లేచినప్పటి నుండి స్కూల్ బస్సుకు సమయానికి బయలుదేరడం.., స్కూల్లో ఖాళీ లేని పీరియడ్లు.., కంటిన్యూస్‌గా చెప్పే పాఠాలతో సతమతమవడం.. సాయంత్రం ఇంటికి రాగానే హోమ్‌వర్క్, వీకెండ్ వచ్చిందంటే ప్రాజెక్ట్ వర్క్స్... ఇదీ వాళ్లకు విసుగును తెప్పించే జీవన విధానం. అందుకే ఆటస్థలం ముఖచిత్రం వారికి ఎప్పుడూ అపురూపంగానే కనిపిస్తుండేది... ఎప్పుడెప్పుడు వేసవి సెలవులు వస్తాయా, అమ్మమ్మ గారి పల్లెటూరికి వెళ్లి ఆరుబయట ఎంత సేపైనా ఆడుకుందామా! అని వాళ్లు కలలు కంటూనే ఉండేవారూ.
ఎట్టకేలకు ఏప్రిల్ నెల రానే వచ్చింది. స్కూల్స్‌కి వేసవి సెలవులు ప్రకటించారు. హాధ్య, హర్ష ఆనందానికి అవధులు లేవు. కానీ వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. వాళ్ల అమ్మ దివ్య ఓ పెద్ద షెడ్యూల్ పేపర్ తీసుకువచ్చి గోడకు అంటించింది.
"చూడండి పిల్లలూ.. ఈ రెండు నెలలు చాలా ముఖ్యం. ఉదయం ఎనిమిదింటికి మ్యాథ్స్ ట్యూషన్, పదింటికి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్, మళ్లీ సాయంత్రం ఆరు గంటలకు డాన్స్ క్లాస్. మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు స్కూల్ వాళ్ళు ఇచ్చిన సమ్మర్ అసైన్‌మెంట్స్ పూర్తి చేయాలి," అని ఆర్డర్ వేసింది.
ఆ మాటలు వినగానే పిల్లల ముఖాలు మాడిపోయాయి. అమ్మతో వాదించే ధైర్యం లేక, ఆమె ఆఫీస్‌కి వెళ్లగానే రహస్యంగా అమ్మమ్మ మంగమ్మకు ఫోన్ చేసి భోరున ఏడ్చేశారు. "అమ్మమ్మా... మమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్లు. మాకు ఈ సమ్మర్ క్లాసులు వద్దు, ఈ రెండు నెలలూ నీ దగ్గరే ఉంటాం" అని బ్రతిమాలారు.
మనవల మాటలు విన్న మంగమ్మ గుండె తరుక్కుపోయింది. మరుసటి రోజే నేరుగా పట్నం వచ్చేసింది. కూతురు దివ్యతో, "ఏమే దివ్యా... పిల్లలు యంత్రాలు కారే, అలా చేసిన పనిని చేసుకుంటూ ఉండటానికి... పిల్లలన్న తర్వాత ఆటా పాటా కూడా ఉండాలే.. నీ చిన్నప్పుడు నిన్ను ఇలాగేనా బంధించి చదివించేశాను.. ఏం నువ్వు చదువుకోలేదా.. ప్రయోజకురాలివి కాలేదా..!?
వయసు పెరుగుతుంటే అవే వస్తాయి.. అన్నీ చిన్నప్పుడే చదివేయాలంటే ఎలానే... ఈ పది నెలలు చదివింది చాలు కానీ..., ఈ సెలవుల్లో అయినా నా దగ్గర ఉండనీయవే.. ఊర్లో ఉంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్నీ అయినా చూస్తారు.. వాళ్లను ఈ నాలుగు గోడల మధ్యనే బంధించేయకు. ఈ సెలవుల్లో వాళ్ళ పూచి నాది" అని గట్టిగా చెప్పి, ఎట్టకేలకు దివ్యను ఒప్పించి పిల్లలను తనతో పాటు వాళ్లూరికి తీసుకెళ్లి పోయింది.
పల్లెటూరికి చేరుకోగానే హాధ్య, హర్షలకు రెక్కలొచ్చినట్లు అయింది. విశాలమైన పచ్చని పొలాలు, చెరువు గట్లు, మామిడి తోటలు... ఎటు చూసినా వాళ్లకు ఆటస్థలమే కనిపించింది. పట్నంలో నాలుగు గోడలకే పరిమితమైన వాళ్ల అల్లరి, ఊళ్లో ఆకాశమంత అయింది. వాళ్ల అల్లరిని చూసి మంగమ్మ ఏమాత్రం విసుక్కోలేదు సరి కదా, ఎంతో ఆనందంగా మురిసిపోయింది. "మట్టిలో ఆడితేనే రా పిల్లలు గట్టిపడేది" అంటూ వాళ్లకు కావాల్సిన స్నాక్స్ చేసిపెడుతూ స్వేచ్ఛగా ఆడుకోమనీ వదిలేసింది.
కానీ, ఆ ఉత్సాహంలో పిల్లలు ఎండను సైతం లెక్కచేయకుండా రోజంతా ఆడుకుంటూనే గడపడం మొదలెట్టారు. ఒకరోజు బాగా ఎండలో ఆడి రావడం వల్ల చిన్నవాడైన హర్షకు వడదెబ్బ తగిలి జ్వరంతో నీరసించిపోయాడు. ఈ విషయం ఫోన్ ద్వారా తెలుసుకున్న దివ్య, హుటాహుటిన ఊరికి బయలుదేరింది.
ఇంటికి రాగానే మంగమ్మపై చిర్రుబుర్రులాడింది. "నీకు కనీసం బాధ్యత లేదా అమ్మా? ఎండలో పిల్లల్ని అలా వదిలేస్తారా? అక్కడైతే ఇంట్లో ప్రశాంతంగా క్లాసులు వినేవాళ్ళు. ఇక్కడ ఊళ్లో ఆ మట్టిలో ఆడి రోగాల పాలయ్యారు" అంటూ అరుస్తూ, పిల్లల్ని తీసుకుని వెంటనే పట్నం వెళ్ళిపోయింది.
పట్నం చేరుకున్న వెంటనే హర్షను ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది దివ్య...
డాక్టర్ హర్షను పరీక్షిస్తుండగానే, చూడండి దివ్య మంగమ్మ మీద, పిల్లల మీద కంప్లైంట్ చేయడం మొదలుపెట్టింది. "చూడండి డాక్టర్... మా అమ్మ పల్లెటూరు వద్దంటుంటే తీసుకెళ్లి బాగా గారం చేసింది.. వీళ్లేమో దొరికిందే ఛాన్స్ అని పిచ్చి పిచ్చిగా మట్టిలో ఆడి, ఎండలో తిరిగి ఇలా తయారయ్యారు. వీళ్ల నాన్నకు ఇలా జరిగిందని తెలిస్తే అస్సలు ఊరుకోరు... ఆయన ఆఫీస్ టూర్ నుంచి వచ్చేసరికి తగ్గేలా చూడండి డాక్టర్... ఇలాంటిదేదో జరుగుతుందనే ముందుగానే ఇంట్లో ఉండి చదువుకోవడానికి సమ్మర్ క్లాసులు బుక్ చేశాను, కానీ, మా అమ్మ వల్లే ఇలా జరిగిం"దని విసుక్కుంది.
డాక్టర్ దివ్య మాటలు విని నవ్వుతూ, "దివ్య గారూ... హర్షకు తగిలిన వడదెబ్బ చాలా చిన్న సమస్య, రెండు రోజులు మందులు వాడితే తగ్గిపోతుంది. కానీ మీరు చెబుతున్న ఆ 'సమ్మర్ షెడ్యూల్' వల్ల పిల్లలు పడే మానసిక ఒత్తిడికి మందు లేదు. పిల్లలు ఎప్పుడూ ఏసీ రూముల్లో, నాలుగు గోడల మధ్యే ఉంటే వారిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కడినుండి వస్తుంది?
మట్టిలో ఆడితేనే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆటస్థలం అనేది కేవలం ఆడుకునే జాగా కాదు, అది వారి వ్యక్తిత్వ వికాసానికి పునాది. స్నేహం పంచుకోవడం, గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడం వాళ్ళు ఆటల్లోనే నేర్చుకుంటారు. దయచేసి మీ సమ్మర్ షెడ్యూల్, మిస్ అయ్యే క్లాసుల పేరు చెప్పి పిల్లల బాల్యాన్ని చంపకండి. వాళ్లని స్వేచ్ఛగా ఎదగనివ్వండి," అని సున్నితంగా బుద్ధి చెప్పారు.
డాక్టర్ మాటలతో దివ్యలో ఆలోచన మొదలైంది. తాను చేస్తున్న తప్పు ఏమిటో తనకు అర్థమైంది. పిల్లల కళ్ళలోని ఆనందం ఏ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులోనూ దొరకదని గ్రహించింది. ఇంటికి వెళ్ళగానే, సమ్మర్ షెడ్యూల్ పేపర్‌ను చింపేసి, "పదండి పిల్లలూ... ఈ సాయంత్రం మనం పార్కుకి వెళ్లి ఆడుకుందాం" అని చెప్పింది. ఆ మాట విన్న హాధ్య, హర్షల ముఖాల్లో వికసించిన నవ్వులు చూసి దివ్యకు ఆటస్థలం నిజమైన విలువ అర్థమైంది..
సమాప్తం
బుగత యమున గారి కొన్ని ఇతర రచనలు:
బుగత యమున గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: బుగత యమున
నేను బుగత యమున,సెకండరీ గ్రేడ్ టీచర్ గా గోకవరం మండలంలో పని చేస్తున్నాను..నాకు సాహిత్యం అంటే ఎనలేని అభిమానం..ఆ అభిమానం అందించిన ప్రోత్సాహకంతోనే ముందుగా ప్రతిలిపి యాప్ లో రచనలు చేయడం మొదలుపెట్టి..సుమారు 200 వరకూ రచనలు చేసాను..అలాగే సాహితీ గోదావరి మరియు విశాఖ సంస్కృతి పత్రికలకు కూడా నేను కవితలు రాస్తూ ఉంటాను..
***










Comments