top of page

వినిపించని రాగాలు 10


'Vinipinchani Ragalu 10' New Telugu Web Series(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ..

మధు భార్యాపిల్లలు ఊర్లో లేని సమయంలో అతని క్లాస్మేట్ రజిత అతని ఇంటికి వస్తుంది.

రజిత, గోడకు తగిలించిన తన తండ్రి ఫోటో వంక తదేకంగా చూడడం గమనించాడు మధు. అతని దగ్గర సెలవు తీసుకొని హాస్పిటల్ కు వెళుతుంది రజిత.

ఊరికి వెళ్లిన మధు కుటుంబ సభ్యులు తిరిగి వస్తారు.

భార్య చేతికి దొరికిన కాగితాన్ని చూసి ఆందోళన పడతాడు మధు. అది మధు చిన్ననాటి స్నేహితుడు సంపత్ కుమార్ జాతకం. అందులో అతనికి భార్య చేతిలో మరణం ఉన్నట్లు ఉంటుంది.

ఆ కాగితం రజిత అక్కడ ఉంచినట్లు అనుమానిస్తాడు మధు. రజితకు కాల్ చేసి, ఆమె వెళ్లిన హాస్పిటల్ కి వెళ్లి, ఆమెను కలుస్తాడు.

అక్కడ బెడ్ మీద అచేతనంగా పడిఉన్న తన స్నేహితుడు కుమార్ ని చూస్తాడు. తన జీవితం నాశనం కావడానికి కారణం నువ్వేనని మధుని నిందిస్తుంది రజిత.

జరిగిన కథను అతనికి ఇలా వివరిస్తుంది.

జాతకాన్ని నమ్మిన కుమార్ రజితను వేరొక వివాహం చేసుకొని భర్తకు విడాకులు ఇస్తే దోషం పోతుందని చెబుతాడు. అందుకు అంగీకరించదు రజిత.

దాంతో ముహూర్తం సమయంలో పవర్ కట్ చేసి రజితకు వేరే వాళ్ళ చేత తాళి కట్టిస్తాడు. శోభనం గదిలోకి కూడా వేరే వాళ్ళను పంపిస్తాడు. హోటల్ నుండి తప్పించుకొని ఒక పార్క్ లో దాక్కుంటుంది.

కుమార్ అతని స్నేహితుడు అక్కడికి వచ్చి రజితను చంపెయ్యాలనుకుంటారు. పార్క్ లో మార్కింగ్ వాక్ కి వచ్చిన వ్యక్తి రజితను కాపాడటానికి ప్రయత్నిస్తాడు. ఆ పెనుగులాటలో కుమార్ తలపై బలమైన గాయం అవుతుంది.

అతన్ని హాస్పిటల్ లో చేరుస్తారు.

పార్క్ లో తనను కాపాడింది మధు తండ్రేనని, అందుకే మధుని క్షమించానని చెబుతుంది రజిత.

స్వప్న అనే వితంతువును కుమార్ ప్రేమించానని చెప్పి మోసం చేసాడని చెబుతాడు మధు. స్వప్న చేత నిజం చెప్పిస్తాడు.

ఇక వినిపించని రాగాలు ధారావాహిక పదవ(చివరి) భాగం చదవండి.


కుమార్ ఏపరిస్థితులకి లొంగిపోయాడో, ఎవరి మాటల ప్రభావంలో పడి ఇలా ప్రవర్తించాడో అని ఏదో మూల అనిపిస్తుంటే వదులుకోలేక ఇక్కడిదాకా తీసుకొచ్చి వైద్యం చేయిస్తున్నాను. కోలుకున్నాకైనా మంచి మనిషిగా నా మనిషిగా మారతాడని ఆసించాను. ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది" అంది రజిత.


"హు.. పనికిరాని శరీరం మీద కూడా ఆత్మకి భ్రాంతి చావదుట. ఎంత తొందరగా ఆ శరీరాన్ని పూడ్చడమో, కాల్చడమో చేస్తేనేగానీ ఆ ఆత్మకి విముక్తి దొరుకుతుందిట. అందుకే కడుపులో బిడ్డని తీసినపుడే నా మనసులోంచి కుమార్ ని కూడా తీసేసాను. ఇప్పుడు వాస్తవంలో బతుకుతున్నాను" అంది స్వప్న.


"మనిషి గుణాలను బట్టే జాతకాలు నిర్ణయించబడతాయేమో. నేనొకందుకు చెబితే అదొకందుకు జరిగింది. పరిస్థితులకీ, బుద్ధికీ మధ్య సంఘర్షణ ఎదురైతే సంస్కారాన్ని మేల్కొల్పి, జరగబోయే దారుణాల్ని ఆపచ్చనే ఉద్దేశ్యంతో చెప్పాను.


ఆరోజు నా ఏకైక లక్ష్యం భర్త లేని ఆమెకు ఒక తోడు దొరుకుతుందని. కానీ నీ జీవితంలోకొచ్చి ఇంత కల్లోలం సృష్టిస్తాడనుకోలేదు. ఈ అవకాశవాది కోసం నీ బతుకుని పాడుచేసుకోకు. జీవితం భగవంతుడు మనకిచ్చిన బహుమానం. మనమే దాన్ని అపురూపంగా మలుచుకోవాలి.


అపశృతులను సరిచేసుకుంటూ కలల రెక్కల్ని సవరించుకోవాలి.

ఉన్నచోటే ఉండిపోతే మహానదికీ, బురదగుంటకీ తేడా ఏముంది?

నీ సంస్కారం, నీ విలువలూ నీ వెంట ఉన్నంతవరకూ నిన్ను ఏ జాతక చక్రాలూ ఏం చెయ్యలేవు. హాయిగా బతికేందుకు మరోచల్లని చోటు చూసుకో. జరిగింది పీడకలలా మర్చిపోయి ఈ అధ్యాయాన్ని ముగించి, కొత్త జీవితాన్ని ఆహ్వానించు. వెళ్ళు రజితా.


తెలిసో తెలియకో నా వలన నీకు నష్టం జరిగింది. మా నాన్న వలన నీ జీవితం నిలబడింది. ఆయన చేసింది ఆ సమయంలో సరైనదే. అయినా అది రికార్డులకెక్కని నేరం. వీటన్నిటి పరిహారం ఒక్కటే. కుమార్ వైద్య ఖర్చులు నేను భరిస్తాను. వాడు చేసిన తప్పులకు శిక్షాకాలం పూర్తయ్యేదాకా ఆ కోమానే వాడికి తోడు." అన్నాడు మధు.


"మధూ, నిన్ను అపార్ధం చేసుకుని నా మాటలతో బాధపెట్టాను. నువ్వు కూడా తండ్రికి తగ్గ కొడుకువి అనిపించుకున్నావు. ఒకరకంగా మా ఇద్దరి జీవితాల్నీ నువ్వే కాపాడావు. జాతకంలో జరగబోయేది తెలుసుకుని బతుకుని మంచిగా మలుచుకోమని నీలాంటి వాళ్ళు చెప్పే హెచ్చరికల్ని తప్పుగా అర్ధం చేసుకున్నవాళ్ళు, వాళ్ళతోపాటు ఇతరుల జీవితాల్ని కూడా కష్టాల్లో పడేస్తారు. శాస్త్రాన్ని నేను గౌరవిస్తాను. " అంది రజిత.


ఇంతలో నర్స్ రూమ్ లోకి వచ్చింది.

వస్తూనే "ఇందాక ఇద్దరు, ఇప్పుడు ముగ్గురున్నారు. వెళ్ళిపొమ్మని చెప్పాను కదా. ఇంకా వెళ్లలేదే?" అని కయ్యిమంది.

"రెండోసారి ఇంత టైం ఇచ్చి వచ్చినందుకు థాంక్స్. నేను వీళ్లిద్దరి జాతకాలు చెబుతుంటే సమయం తెలియలేదు. ఇదిగో ఇప్పుడే వీళ్ళని పంపించేస్తా" అన్నాడు మధు.


"మీరు జాతకాలు చెబుతారా సార్. నా చెయ్యిచూసి నాకు పెళ్లెప్పుడవుతుందో కాస్త చెబుతారా?" అంది నర్స్.


"ఏదీ.. నీ చెయ్యి చూపించు” అన్నాడు మధు.


నర్స్ నవ్వుతూ తన అరచేతిని చూపించింది. చెయ్యి కాసేపు చూసి

"నీ మొగుడు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకే వస్తాడు. ముందు అతను నీ మీద అజమాయిషీ చేస్తాడు. తర్వాత అతనిమీద నువ్వే స్వారీ చేస్తావు" అని చెప్పాడు.


"అవునా సార్.. తొందర్లోనే నా పెళ్లైపోతుందా?" అంది ముసిముసిగా నవ్వుకుంటూ.


"నీ పెళ్లి అతి త్వరలో అవుతుంది. తధాస్తూ" అన్నాడు మధు చెయ్యి పైకెత్తి దీవిస్తున్నట్టు.

చాలా థాంక్స్ సార్. అని నర్స్ సిగ్గుపడుతూ వెనక్కి తిరిగింది.


జూనియర్ న్యూరో సర్జిన్ రఘురామ్ రూమ్ లోకి వచ్చాడు.

వస్తూనే " అపర్ణా! నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్? నిన్ను వార్డ్ నెంబర్ థర్టీన్ దగ్గర వుండమన్నాను కదా. చెప్పిన మాట వినకుండా డ్యూటీ వదిలేసి పెత్తనాలు చేస్తున్నావా? చీఫ్ తో చెప్పి నీ ఉద్యోగం తీయించేస్తా చూడు" అన్నాడు.


"అయ్యో సార్ అలా చేయకండి ప్లీజ్. ఇంకోసారి ఇలా చెయ్యను. మీరెలా చెప్తే అలా ఉంటాను" అంది. భయంగా చూస్తూ.


"ఇంకా ఇక్కడే నుంచున్నావే పద" అన్నాడు అతను బయటకు వెళ్లిపోతూ.

కంగారుగా ఆమె కూడా అతన్ని అనుసరించింది.


"అయ్యో పాపం. డాక్టర్ తో తిట్లు పడ్డాయి. ఆమె మొహంలో పెళ్లి అవుతుందన్న సరదా కాస్తా క్షణంలో ఎగిరిపోయింది. " అంది రజిత.


"ఏం ఫర్వాలేదు. మళ్లీ ఏడాదికి నువ్వు ఇక్కడికి వచ్చి చూడు. ఆ డాక్టర్ నే గడగడ లాడిస్తుంది ఈ నర్సు" అన్నాడు.


"అంటే?"

"అంటే ఆ డాక్టరే ఈమెకి కాబోయే భర్త. ముందు తను అతనికి భయపడింది. తర్వాత అతన్ని భయపెడుతుంది. ఇదంతా భార్యాభర్తల్లో ఉండేదే" అన్నాడు మధు నవ్వుతూ.


"చెయ్యి చూసి అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావ్. ?" అంది రజిత ఆశ్చర్యంగా.


"అది అలా తెలిసిపోతుందంతే. అతను వేసుకున్న ఐ డి కార్డ్ లో రఘురామ్ అనే పేరు చూసాను, అతను ఆమెని అపర్ణా అని పిలిచాడు. అంటే రఘురామ్ అపర్ణ. ఇద్దరి పేరు బలాలూ సరిపోయాయి. నాకు ఫేస్ రీడింగ్ కూడా తెలుసు. అతనికి ఆమెంటే చాలా ఇష్టం అని అర్ధమైంది.


ఆమె చేతి రేఖల్లో ఒకే వృత్తికి సంబంధించిన వాళ్ళతోనే ఆమె పెళ్లవుతుంది. ఆమెకోసం అతను అన్ని రూములో వెతుక్కుంటూ రావడం గమనించాను. అంతకోపంలోనూ ఆమె మీద చూపించే ప్రేమను గుర్తించాను. అందుకే అలా చెప్పగలిగాను. " అన్నాడు మధు.


"నువ్వు నిజంగా జీనియస్ వి మధూ.

నా చెయ్యి చూసి రాబోయే జీవితం ఎలా ఉండబోతోందో చెప్పవా" అని అడిగింది రజిత మధుకి చెయ్యి చూపిస్తూ.

అతను తదేక దృష్టితో ఆమె అరచేతివంక చూస్తూ భ్రుకుటి మూడేసి " ఓ మై గాడ్.. " అన్నాడు.


"ఏంటి చెప్పు. ఏదన్నా ఇబ్బందా?"

"ఇబ్బందన్నరే, కుమార్ కోమాలోంచి బయటకొచ్చి అమాంతం నిన్ను పెళ్లిచేసుకుంటాడు" అన్నాడు.


"షటప్, నేను చచ్చినా అతన్ని పెళ్లి చేసుకోను" అంది చెయ్యి వెనక్కి లాకుంటూ.

మధు పగలబడి నవ్వుతూ" జస్ట్ జోక్ చేసా సీరియస్ గా తీసుకున్నావా?" అన్నాడు.


"సరిగ్గా చూసి చెప్పు "అంది మళ్లీ చెయ్యి చూపిస్తూ.

"నీ మనసు నీతో ఎప్పుడూ తప్పు చెప్పదు. అది చెప్పినట్టుగా విని నిర్ణయాలు తీసుకో. నీ ధర్మ చింతనే నిన్ను రక్షింస్తుంది. నీకు కుమార్ విషయంలో కూడా ముందు నుంచే చాలా సందేహాలున్నాయి. వాటిని నివృత్తి చేసుకోకుండా కప్పి పుచ్చుకున్నావు. ఇక మీదట అలా చెయ్యకు. ఎక్కడ ఏ అనుమానం కలిగినా ప్రశ్నించు, నీకు సరైన సమాధానం దొరికెవరకూ ప్రశ్నించు. నువ్వు సమాధాన పడ్డాక అప్పుడు ముందడుగు వెయ్యి. నీ కష్టాలు ఈరోజుతో తీరిపోయాయి. ఏలినాటి శని వెళ్ళిపోయింది. ఇక నీకు అన్నింటా జయమే. " అన్నాడు.


మధు మాటలకు రజిత మనసులో శాంతి నెలకొంది. ప్రశాంతతకు మించిన వరం లేదంటారు.

"చాలా థాంక్స్ మధూ, నిన్ను కలవడం దైవ సంకల్పం. నా సందేహాలన్నీ తొలగించావు. థాంక్స్ ఎ లాట్" అంది.


"మధుగారూ. నా చెయ్యి కూడా ఒకసారి చూడరా ప్లీజ్" అంది స్వప్న చెయ్యి చూపిస్తూ.

ఆమె చేతిని కాసేపు పరికించి చూసి

"స్వప్నా, నీకు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని దేవుడు నీకీ జన్మ ఇచ్చినట్టున్నాడు. " అన్నాడు


"అంటే. మీరన్నది నాకర్ధం కాలేదు. " అంది స్వప్న.

"ఏం లేదు. త్వరలో తల్లి లేని ఇద్దరు పిల్లలకి తల్లివవుతావు. భార్యా వియోగంతో అలమటించే వ్యక్తికి ఆలంబన అవుతావు.

త్వరలోనే నీ పెళ్లి జరుగుతుంది. " అన్నాడు.


" చాలు మధుగారూ.. ఏవో వ్యామోహాల్లో పడి, తెగిన గాలిపటంలా రెపరెపలాడుతున్న నామనసుకి ఒక ఆశ కల్పించారు. నాకు మళ్లీ పెళ్ళైతే అమ్మా నాన్నలకు అంతకన్నా ఆనందం లేదు. నా భర్త, పిల్లల్ని చూసుకుంటూ హాయిగా ఈ జీవితాన్ని గడిపేస్తాను. ఆ రోజు కోసం సంతోషంగా ఎదురుచూస్తాను. " అంది స్వప్న.


"మీ ఇద్దరి జాతకాలూ చెప్పించేసుకుని ఖుషీగా వున్నారు. మరి నా జాతకాన్ని ఎవరు చూస్తారు" అన్నాడు మధు.


"మాకు చూడ్డం రాదుగా. నీది నువ్వే చూసుకోవాలి" అన్నారిద్దరూ.

అతని ఫోన్ రింగయింది.

"అదిగో నా ఫేట్ ఫోన్ చేసింది. "అన్నాడు.

"ఎవరు?" అన్నారిద్దరూ.

"ఇంకెవరు నా భార్య సత్య "


"ఇంత పెద్ద జ్యోతిష్యులయ్యుండి ఆవిడకి భయపడుతున్నావా?" అంది రజిత.

"మరి, శ్రీ కృష్ణుడు సత్యభామకి భయపడలేదూ, మొదట్లో ఆవిడ నాకు భయపడింది. ఇప్పుడు నన్ను భయపడుతోంది. వుండండి" అంటూ

"వచ్చేస్తున్నాను సత్యా, దగ్గరలోనే వున్నాను" అన్నాడు.


"సరే, ఇక మీ ఇద్దరూ వెళ్ళండి. కుమార్ విషయం డాక్టర్ తో మాట్లాడి ఏం చెయ్యాలో ఆలోచిస్తాను. "

"సరే మధూ, కుమార్ వాళ్ళ పేరెంట్స్ కాసేపట్లో ఇక్కడికి వస్తారు. వాళ్ళతో నువ్వే మాట్లాడు. ఇక నేనిక్కడకి రాను. వెళ్లిపోతున్నాను" అని లేచింది రజిత.


"రజితా, ఒక్కమాట. కుమార్ విషయం నువ్వు పూర్తిగా మర్చిపో. అతిత్వరలో ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లిచేసుకో. ఒక మంచి తోడు దొరికినపుడు గతం తాలూకు బాధ మర్చిపోవటానికి అవకాశం ఉంటుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసుకో" అన్నాడు.


నన్నోడి తానోడెనా?తానోడి నన్నోడెనా?

ద్రౌపది ప్రశ్నే రజితలోనూ కలిగింది.

జాతకం కుమార్ ని మార్చిందా?

తను మారి జాతకాన్ని నిజంచేసాడా?

సృష్టిలో జరిగే ప్రతి చర్యకూ ఏదో కారణం వుండే ఉంటుంది.

ఎవరిని ఎప్పుడు కలవాలో విధి నిర్ణయిస్తుంది.

అన్నిటికీ కారణమైన మనసు మన ఆధీనంలోకి రావటంకన్నా స్వర్గం మరోటి వుండదేమో అనుకుంటూ

ఒక్కసారి కుమార్ వంక చూసింది.

నేరము, శిక్షకి నిదర్శనంగా కనిపించాడు.


గతంలో కలిగిన కల్లోలం ఇప్పుడు ఆమెలో లేదు. నిశ్చలంగా ఉంది.

సంఘర్షణల ముడులను తెంచుకున్న ఆమె మనసు భారం వీడి తేలికయ్యింది. ప్రపంచాన్ని జయించినవాళ్ళు కూడా మనసును జయించలేక అర్ధాంతరంగా గతించారు.


తనకి ఆ దుస్తుతి తప్పించిన మధుకి నమస్కరించి మరో దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగింది రజిత.


స్వప్న, రజిత ల మనసుల్లో వినిపించని రాగాలేవో మధురంగా మెదిలాయి.

కొత్త జీవితాన్ని వెతకటానికి కదిలారు ఇద్దరూ..


-----------------శుభం------------

========================================================================

ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత్రి శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం.

========================================================================


గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Twitter Link


Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

నా పేరు గొర్తివాణి

మావారు గొర్తి శ్రీనివాస్

మాది విశాఖపట్నం

నాకు ఇద్దరు పిల్లలు

కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది

అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

రచనల మీద ఎంతో మక్కువతో

కవితలు, కథలు రాస్తున్నాను.

విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,

ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి  వంటి  ప్రముఖ   సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు

ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.


మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ

గొర్తివాణిశ్రీనివాస్

విశాఖపట్నం

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


52 views0 comments

Commentaires


bottom of page