top of page

వినిపించని రాగాలు 8


'Vinipinchani Ragalu 8' New Telugu Web Series

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ...


మధు భార్యాపిల్లలు ఊర్లో లేని సమయంలో అతని క్లాస్మేట్ రజిత అతని ఇంటికి వస్తుంది.

రజిత, గోడకు తగిలించిన తన తండ్రి ఫోటో వంక తదేకంగా చూడడం గమనించాడు మధు. అతని దగ్గర సెలవు తీసుకొని హాస్పిటల్ కు వెళుతుంది.

ఊరికి వెళ్లిన మధు కుటుంబ సభ్యులు తిరిగి వస్తారు.

భార్య చేతికి దొరికిన ఉత్తరం చూసి ఆందోళన పడతాడు మధు. అది మధు చిన్ననాటి స్నేహితుడు సంపత్ కుమార్ జాతకం. అందులో అతనికి భార్య చేతిలో మరణం ఉన్నట్లు ఉంటుంది.

ఆ కాగితం రజిత అక్కడ ఉంచినట్లు అనుమానిస్తాడు మధు. రజితకు కాల్ చేసి, ఆమె వెళ్లిన హాస్పిటల్ కి వెళ్లి, ఆమెను కలుస్తాడు.

అక్కడ బెడ్ మీద అచేతనంగా పడిఉన్న తన స్నేహితుడు కుమార్ ని చూస్తాడు.

తన జీవితం నాశనం కావడానికి కారణం నువ్వేనని మధుని నిందిస్తుంది రజిత.

జరిగిన కథను అతనికి ఇలా వివరిస్తుంది.

జాతకాన్ని నమ్మిన కుమార్ రాజితను వేరొక వివాహం చేసుకొని భర్తకు విడాకులు ఇస్తే దోషం పోతుందని చెబుతాడు.

అందుకు అంగీకరించదు రజిత.

దాంతో ముహూర్తం సమయంలో పవర్ కట్ చేసి రజితకు వేరే వాళ్ళ చేత తాళి కట్టిస్తాడు.

శోభనం గదిలోకి కూడా వేరే వాళ్ళను పంపిస్తాడు.

ఇక వినిపించని రాగాలు ధారావాహిక ఎనిమిదవ భాగం చదవండి.


అర్ధరాత్రి.. హోటల్ నిర్మానుష్యంగా ఉంది. క్యారిడార్ లో ఎవరూ లేరు. ఒకరిద్దరు స్టాఫ్ వున్నా వాళ్ళు నిద్రలో జోగుతున్నారు. రిసెప్షన్ లో కూడా ఎవరూ లేరు. మెయిన్ గేటుకు చాలా దూరంగా ఉంది.


నేను అక్కడికి పరిగెత్తాను. గేటు మూసి ఉంది. దానికి తాళం వేసి గూర్ఖా కుర్చీలో కూర్చుని నిద్రపోతున్నాడు. గేటు పైకెక్కి దూకాను. కుక్కలు భౌ భౌ మన్నాయి అవేం పట్టించుకోకుండా అక్కడ్నించి పారిపోయాను. చిమ్మ చీకటి. ఎంతదూరం వెళ్ళానో తెలీదు.


ఆ కంగారులో ఫోన్ తీసుకురావడం మర్చిపోయాను. నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పే అవకాశం లేదు. రోడ్డు పక్కన ఒక పార్క్ కనిపించింది. గేటు తీసుకుని అందులోకి వెళ్ళాను. ఆయాసంతో నిలబడలేక పోయాను. చెట్లకింద గట్టు మీద కూర్చున్నాను. మనసంతా వికలమైపోయింది. శరీరం నీరసించింది.


అవమాన భారం దహించేస్తోంది. నమ్మకద్రోహం వెక్కిరిస్తోంది. ఇంత నయవంచనా? ఇన్ని ఎత్తులా? ఇన్ని వ్యూహాలా. పెద్దవాళ్ళని రిస్క్ లో పెట్టి ఈ పెళ్లి తెలివిగా జరిపించుకున్నాడు.


ఎవరికీ వీసమెత్తు అనుమానం కూడా రాలేదు.

వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఇందులో పాత్రధారులయ్యారా?. పెళ్లిలో అతని స్నేహితులు మాత్రమే ఉండేలా వ్యూహం రచించిన కుమార్ మనసులో ఇంత కుట్ర దాచుకుని నవ్వుతూ నటించాడా? మై గాడ్! ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో అర్ధంకాని పరిస్థితి.

కుమార్ తన ప్రాణం కోసం నన్ను పావుగా వాడుకుంటున్నాడు. దీన్ని ప్రేమంటారా?


శోభనం పెళ్లి కూతురు ముస్తాబులో నిర్మానుష్య ప్రదేశంలో వుండకూడని చోట, వుండకూడని పరిస్థితుల్లో అగమ్యగోచరంగా నేను. వంచించే మనుషులు చాలా జాగ్రత్తగా వుంటారన్నమాట. ఇతరులకి ఏమాత్రం అనుమానం రాకుండా.


కీచురాళ్ల అరుపులు, పక్షుల రెక్కల చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. నా గుండె చప్పుడు నాకే వినబడుతోంది. విధి ఇంతలా నా జీవితంతో ఆడుకుంటుందని అనుకోలేదు.

ఇది కుమార్ బుర్రలో పుట్టిన ఆలోచనా, లేక జాతకాల మధు వ్యూహ రచనా ఎంత ఆలోచించినా అర్ధంకాలేదు.


ఎందుకంటే అప్పుడు కుమార్ ప్రేమతప్ప నాకు ఏవీ కంటికి కనిపించలేదు. అది మంచికో చెడుకోగానీ నా ఆశ, ధ్యాస కుమార్ అయ్యాడు.


ఎవరో తాగుబోతులు వస్తున్నారు. నేను చెట్టు చాటుకి వెళ్లి దాక్కున్నాను. వెళ్ళేవాళ్ళు చెట్టుదగ్గర ఆగిపోయారు. నేను కనపడకపోయినా నానుంచి వచ్చే మల్లెపూలు, సెంటు వాసనకి ఆగి చుట్టూ చూసారు. నేను ఇంకా వెనక్కి వెళ్లి మరో పొదవెనక చేరాను. వాళ్ళు అదంతా తిరిగి చూశారు. కాసేపు చూసి ఎవరూ కనబడకపోవడంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. నేను పొదకు ఆనుకుని కూర్చున్నాను.


చలితోపాటు భయంతో వెన్నులో ఒణుకుపుట్టింది. నా వెనక అడుగుల చప్పుడై తిరిగి చూసాను. ఇద్దరు నా దగ్గరకు నడిచివచ్చారు. వాళ్ళు కుమార్, అతని స్నేహితుడు. ఇంకా ఎందుకు వెంటాడుతున్నారు. న్యాయానికి హద్దులు చెరిపేస్తూ దగ్గరకొచ్చి నన్ను పట్టుకున్నారు. గట్టిగా అరిచాను. నా నోరు మూశారు.


కుమార్ నాదగ్గరకు వచ్చి, "రజితా, ప్లీజ్.. కొంచెం కోపరేట్ చేసావంటే చాలు. మన జీవితం పూలబాట అవుతుంది. నా జాతకంలో పెళ్లి కాగానే ప్రాణ గండం ఉంది. అందుకే ఇంత సాహసానికి పూనుకున్నాను. నేను చేస్తున్నది తప్పే. పాపమే. కానీ నిన్ను ఒదులుకోలేక ఇలా చేయాల్సి వచ్చింది. నువ్వంటే ప్రేమ పిచ్చి. ఇంకా చెప్పాలంటే నువ్వు లేకపోతే నేను లేను. ఇదంతా మన మంచికోసమే. మనం జీవితాంతం కలిసి హాయిగా బతకడంకోసమే" అన్నాడు.


"అనడానికి నీకెలా వుందో వినడానికి నాకసహ్యంగా ఉంది" అన్నాను.


"అయితే సరే. ఇక ఈ దాగుడు మూతలు ఆపేద్దాం. జరిగిందంతా మర్చిపో. మనం మనింటికి వెళ్లిపోదాం. భార్యా భర్తలుగా జీవితాన్ని కొనసాగిద్దాం. ఏదైతే అదవుతుంది. అన్నిటికీ సిద్ధపడదాం" అన్నాడు కుమార్.


నేనున్న పరిస్థితుల్లో కుమార్ ని నమ్మక తప్పదు. అతని వెంట ఇంటికి వెళ్ళటానికి సిద్ధపడ్డాను.

ఎదిరించి ఓడిపోవడం కంటే నమ్మించి ఇంటికి చేరుకోవడం మంచిదనిపించింది. కుమార్ ఎలా నమ్మించి నట్టేట ముంచాడో అలాగే అతన్ని నమ్మించి బుద్ధి చెప్పాలి. నావల్ల అతనికి హాని లేదని, ఈ విషయం ఎవరితో చెప్పనని నమ్మించాలి. లేకపోతే ఇక్కడే నా చావు చూస్తారు వాళ్లిద్దరూ అనుకున్నాను.


"కుమార్, జరిగిందేదో జరిగిపోయింది. నీ పరిస్తితిని నేనర్థం చేసుకోగలను. చాలా అలిసిపోయాను. మనింటికి వెళదాం. ఏ విషయమైనా ప్రశాంతంగా కూర్చుని ఆలోచిద్దాం" అన్నాను.


నాతోపాటు నడుస్తూ కొంతదూరం వచ్చాడు. అతని స్నేహితుడు వెనకనుంచి వచ్చి "ఆగరా. ఈ విషయం వాళ్ళింట్లో చెప్పదని నమ్మకం ఏంటి? చెప్పిందంటే నీకు గౌరవం ఉంటుందా ఆలోచించు. చెప్పకుండా నోరు మూయించాలంటే ఇంటికి కాదు. హోటల్ రూమ్ కి తీసుకెళ్లు" అన్నాడు.

అతనేంచెబుతున్నాడో నాకర్ధమైంది.


కుమార్ ని మా మొదటిరాత్రికి ప్రోత్సహిస్తున్నాడు. అభిమానం చంపుకుని నేను, ప్రాణ భయంతో కుమార్. ఈ స్థితిలో మేం కలవడం అవసరమా? ఆమాటే కుమార్ తో అన్నాను. నా దృష్టంతా భద్రంగా ఇంటికి చేరాలనే ఉంది. ఇంటికి వెళ్ళాలా లేక రూముకు వెళ్ళాలా అని కుమార్ ఆలోచనలో పడ్డాడు. అతను చెప్పే మాటలు వినకుండా కుమార్ ని ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నించా.


"కుమార్, చిన్నప్పటినుంచీ మనిద్దరం స్నేహితులం, తర్వాత ప్రేమికులం, ఇప్పుడు దంపతులం. ఏ నిర్ణయమైనా మనిద్దరం కలిసి తీసుకోవాలి. మన మధ్యలో అతనెందుకు? వెళ్ళిపొమ్మని చెప్పు" అన్నాను.


"ఉరేయ్, ఈ డబ్బు తీసుకో. ఇక్కడ్నించి వెళ్లిపో. ఈ విషయం ఎవరితో చెప్పకు" అని డబ్బులు తీసిచ్చాడు కుమార్.


అతను డబ్బులు తీసుకోకుండా "ఉరేయ్ పిచ్చోడా, తను చెప్పే మాటలు విన్నావంటే మోసపోతావ్. ఇంతవరకూ వచ్చాక ఆమె దెబ్బతిన్న పులి. నీకు ముప్పు తప్పదు. నువ్వు ఏమనుకుని ఇదంతా చేసావో దానికి ఆమెని ఒప్పించు. నీకు పెళ్లికాగానే ప్రాణ గండం ఉందన్న విషయం మర్చిపోకు. " అన్నాడు. కుమార్ మళ్లీ ఆలోచనలో పడ్డాడు.


అతనిలో ఊగిసలాట. నా మాటలతో అతన్ని మార్చాలని ప్రయత్నిస్తుంటే అతని స్నేహితుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు.


అర్ధరాత్రి ఆ పార్కులో మా ముగ్గురి మాటల్లో ఏకాభిప్రాయానికి రాలేకపోయాం. చీకటి తెరలు అప్పుడప్పుడే తొలగుతున్నాయి. కాసేపట్లో తెల్లవారబోతోందనగా కుమార్ ఒక నిర్ణయానికొచ్చాడు.


ఇల్లూ కాదూ రూమూ కాదని తను ముందు అనుకున్నట్టుగానే తన వ్యూహాన్ని అమలుపరచాలనుకున్నాడు. అతని స్నేహితుడు నా దగ్గరకి వచ్చాడు. నేను పరిగెట్టబోయాను. కుమార్ నన్ను వెళ్లకుండా పట్టుకున్నాడు.


"ఛీ సిగ్గులేకుండా నీ భార్యని నీ స్నేహితుడికి అప్పచెప్పాలని చూస్తున్నావ్. ఇలాంటివాడివని ముందే ఏ మాత్రం తెలిసినా నిన్ను నా చాయలక్కూడా రానిచ్చేదాన్ని కాదు. నువ్వూ వద్దు, నీ ప్రేమా వద్దు. ఎవడో కట్టిన ఈ తాళీ వద్దు. నేను ఇంటికి వెళ్లిపోతాను" అని మెళ్ళో తాళి తీసి విసిరేసాను.


ఇంగితజ్ఞానం మరచిన ఇద్దరి చేతుల్లో పెనుగులాడుతున్న నా జీవితం ఆరోజుతో పరిసమాప్తం అనుకున్నాను. దౌర్జన్యానికి తలవంచడంకన్నా చావు మేలని అంతరాత్మ హెచ్చరించింది.


సర్వశక్తులూ కూడదీసుకుని వాడిని కాలితో నడుం కింద బలంగా తన్నాను.

బాధతో విలవిల్లాడుతూ పడిపోయాడు.


షాక్ తిన్న కుమార్ నావైపు భయంగా చూస్తూ నిలబడ్డాడు.

ఆ ఊపులో వెళ్లి కుమార్ ని కూడా తన్నగలను. కానీ నేను మనసా వాచా మనసిచ్చిన నా కుమార్.

ఇంత దుర్మార్గపు పనికి పూనుకున్నా అతన్ని గాయపరిచేందుకు మనసు రాలేదు.


దాన్ని అలుసుగా తీసుకున్న కుమార్ నాపై లంఘించాడు.

నా నవనాడులూ కుంగి పోయాయి.

కంచే చేనుమేస్తే, రాముడే శిక్షవేస్తే నట్టడవిపాలైన సీతకి దిక్కెవరని ఏడ్చాను.


ఆ భయంకర పరిస్థితుల్లో కనిపించిందో వెలుగురేఖ.

తెల్లవారుజామునే వాకింగ్ కి వచ్చిన వ్యక్తి నా పరిస్థితిని చూసాడు.


"ఏం బాబూ, ఏం చేస్తున్నావ్? ఆ అమ్మాయిని వదలండి. ఇది పద్ధతి కాదు" అన్నాడు.


"మీకెందుకు. మీ పని మీరు చూసుకోండి. మా విషయంలో జోక్యం చేసుకోవద్దు" అన్నాడు కుమార్.

నేను హెల్ప్ హెల్ప్ అని అరిచాను. కుమార్ నా నోరు మూసాడు. పెనుగులాడాను.


వదల్లేదు. వాకింగ్ కి వచ్చిన వ్యక్తి వాళ్ళని దూరంగా నెట్టాడు. వాళ్ళు నన్ను వదిలి పక్కకు పడ్డారు. నేను పరిగెత్తాను. ఇద్దరూ నన్ను వెంబడించారు. కుమార్ స్నేహితుడు పరిగెత్తుకొచ్చి నా గొంతు పట్టుకున్నాడు.


"చచ్చిపోతుందిరా" అన్నాడు కుమార్.

"అదే మంచిది. లేకపోతే మన బతుకు బస్టాండే. ఇది ఇంటికెళ్లి మొత్తం చెప్పేస్తుంది" అన్నాడు.


"అయితే ఏం చేద్దాం?" " పీక నొక్కి ఆ పక్కన ఉన్న చెరువులో వేద్దాం"

"బుద్ధిలేకుండా మాట్లాడకు. హోటల్ కి నేనే తీసుకొచ్చాను. దీనికి ఏదైనా జరిగితే నా మీదకే వస్తుంది. "


"అలాగని వదిలేస్తే ఇది నేరుగా పోలీస్టేషన్ కి వెళుతుంది. మనం జైల్లో వుండాల్సొస్తుంది. "

" ఏదైనా మనకి ప్రమాదమే. మధ్యలో వీడొకడు చూసాడు. "

"వాడిమొహం. ముసలాడు. ఏం చెయ్యలేడు. ముందు ఇక్కడినుంచి వెళ్లిపోదాం"


"ఎక్కడికి?" "మన సోమసుందర్ గెస్ట్ హౌస్ కి",

" అది ఊరి చివర ఉంది కదా" "అవును. టాక్సీ మాట్లాడుకుని వెళ్లిపోదాం"


"ఈలోపు మీ వాళ్ళు ఫోన్ చేస్తే?"

"ఏం చెప్పను?"

"మేం అలా చెరువుగాలి పీల్చుకుందామని వెళ్ళాం. అని చెప్పు"

"సరే అక్కడ కూర్చుని తీరిగ్గా ఆలోచిద్దాం"


" ఏం అలోచిస్తావ్" "రజితతో నా ప్రయాణం కొనసాగించడానికి ఏం చెయ్యాలా అని"

"అది సాధ్యపడుతుందా? "ఏ ఎందుకు సాధ్యపడదు? మేం ప్రేమికులం కదా"


"ఇంకా ఏం ప్రేమరా. అదెప్పుడో పారిపోయింది. ఇప్పుడు మిగిలింది పగ"

" ఎవరికి?" "రజితకి నీమీద పగ"


"తను అలాంటిది కాదు. నన్నర్ధం చేసుకుంటుంది" " తను నీ మాట వినదు"


"నేను నచ్చచెబుతా. నా జాతకం గురించిన భయం వలనే ఇంతకి తెగించానని తను గుర్తిస్తుంది. నన్ను క్షమిస్తుంది. "

"మరి చనిపోతానని తెలిసినా తనతో కాపురం చేస్తావా?" " చేస్తాను. తను ఒప్పుకుంటే. చావు ఎప్పుడైనా వస్తుంది. ఇక నువ్వు వెళ్లిపో. నన్ను ఆలోచించుకోనీ"


"నీకిప్పుడు జ్ఞానం వచ్చిందా. నీ చావు అప్పుడు కాదు ఇప్పుడు వస్తుంది. నీ ఇంట్లో నువ్వు వెధవ్వి అవుతావు. నీకు ఆ ఇంట్లో స్థానం ఉండదు"

" నన్ను భయపెట్టకు",

" జరిగబోయేది చెబుతున్నా. ఈరోజుతో నీ జీవితం సమాప్తం"

" అలా అనకురా. ఇప్పుడు నేనేం చెయ్యాలి?"


" గెస్ట్ హౌస్. చెరువు. కాలు జారి పడిపోయిన రజిత. అంతే అదే స్టోరీ. ది ఎండ్. "

కుమార్ మనసుని కలుషితం చేస్తున్నాడు. ఏ లాభాపేక్షతో చేస్తున్నాడో తెలీదుగానీ స్నేహితుడంటే మంచి సలహాలు ఇవ్వాలి.


భర్తంటే భార్య మాట వినాలి. రెండూ జరగలేదు. వీళ్ళ తర్జనభర్జనలు సాగుతుంటే వాకింగ్ మనిషి నన్ను పక్కకి రమ్మని సైగ చేసాడు.


నేను మెల్లగా చెట్టు చాటుకి తప్పుకున్నాను.

కుమార్ అతని స్నేహితుడి మధ్యా ఏకాభిప్రాయం కుదిరింది. నా కోసం వెతికారు. నేను కనపడకపోయేసరికి చుట్టూ చూసారు. వాళ్లలో ఆందోళన పెరిగింది.


"ఇంటికి వెళ్లకుండా చూడరా"

"ఇక్కడినుంచి ఇంటికి అప్పుడే వెళ్ళలేదు. వెతుకు" అన్నాడు కుమార్.


చెట్టు వెనకున్న నేను కనిపించాను. నన్ను పట్టుకోబోయారు.

వాకింగ్ వ్యక్తి ఇనపరాడ్డు తీసుకుని వచ్చాడు.


"ఏంటి కొట్టేస్తావా? కొట్టు. కొట్టి నువ్వు ఇక్కడినుంచి వెళతావా?" అన్నాడు కుమార్ స్నేహితుడు అతని మీద మీదకి వెళుతూ..


ఇనపరాడ్డుతో కుమార్ ని వారిస్తూ, బెదిరిస్తూ దూరంగా తరిమేందుకు ప్రయత్నించాడు.

ఆడపిల్లని బాధ పెట్టద్దని బతిమాలాడు.


వినకపోతే పోలీసులకి ఫోన్ చేస్తానని బెదిరించాడు. కుమార్ కాస్త జంకాడు.

"ఉరేయ్ నీకేమన్నా పిచ్చా. ఈ పిల్ల బతికుంటే మన బండారం బయటపెట్టేస్తుంది. ఓ పట్టు పట్టు" అంటూ కుమార్ ని ప్రోత్సహించాడు.


కుమార్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో వున్నాడు. ఒత్తిడిలో తీసుకునే నిర్ణయాల్లో చాలావరకూ చెడుమార్గాన్నే ఎంచుకోవడం జరుగుతుంది.


కుమార్ ముందున్న అతి పెద్ద సమస్య నేనే. ఏ రకంగా చూసినా నా వలనే అతనికి ముప్పు అనుకున్నాడేమో.. పారిపోయే వీలు లేకుండా నన్ను పట్టుకున్నాడు.

గోరంత ప్రాణం పోవడం ఎంతసేపు.

నేను గుడ్లు తేలేసాను.


వాకింగ్ వ్యక్తి నా గొంతు పట్టుకున్న అతనితో తలపడ్డాడు..

శాయశక్తులా ఇద్దర్నీ నియంత్రిస్తూ నన్ను తన వెనకే ఉండేలా చూసుకున్నారు.

కానీ ఆ ఇద్దరి పశుబలం ముందు గెలవలేక కింద పడిపోయారు. దెబ్బ తగిలినా పట్టించుకోకుండా లేచి మళ్లీ వాళ్ళతో తలపడ్డారు.


నాపై వెనకనించి దాడి చేయబోయాడు కుమార్ స్నేహితుడు.

నన్ను తప్పించే ఉద్దేశ్యంతో అతని తలపై రాడ్డుతో కొట్టబోయారు.

అది అతని వెనకే ఉన్న కుమార్ తలపై బలంగా తాకింది. రక్తం చివ్వున చిమ్మింది.

కుమార్ కుప్పకూలి పోయాడు.

================================================

...సశేషం...

================================================

గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Twitter Link


Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

నా పేరు గొర్తివాణి

మావారు గొర్తి శ్రీనివాస్

మాది విశాఖపట్నం

నాకు ఇద్దరు పిల్లలు

కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది

అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

రచనల మీద ఎంతో మక్కువతో

కవితలు, కథలు రాస్తున్నాను.

విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,

ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి  వంటి  ప్రముఖ   సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు

ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.


మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ

గొర్తివాణిశ్రీనివాస్

విశాఖపట్నం

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


37 views2 comments

2 Kommentare


Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
19. Feb. 2023

gopala krishna • 7 hours ago

కథనం, పఠనం బాగున్నాయి.

Gefällt mir

Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
19. Feb. 2023

vani gorthy • 11 hours ago

అద్భుతంగా చదివారు సార్

Gefällt mir
bottom of page