top of page
Original.png

వినోద విహార ఆధ్యాత్మిక యాత్ర

#RCKumar #శ్రీరామచంద్రకుమార్ #వినోదవిహారఆధ్యాత్మికయాత్ర #TeluguArticle

ree

వైవిద్య భరితమైన వినోద విహార ఆధ్యాత్మిక యాత్ర


Vinoda Vihara Adhyatmika Yathra - New Telugu Article Written By R C Kumar

Published In manatelugukathalu.com On 27/08/2025

వినోద విహార ఆధ్యాత్మిక యాత్ర - తెలుగు వ్యాసం

రచన: ఆర్ సి కుమార్


ప్రతి సంవత్సరం రెండు మూడు పర్యాయాలు వినోద, విహార, ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లడానికి అలవాటు పడ్డ మా రాయల సేవా సమితి యాత్రా బృందం కారణాంతరాల వల్ల గత తొమ్మిది నెలలుగా స్తబ్దుగా ఉండిపోయింది. ఆషాడ శ్రావణ మాసాలలో తప్పనిసరిగా ఒక యాత్ర ప్లాన్ చేసుకోవాలనే కుతూహలం, ఒత్తిడి సభ్యులలో పెరిగిపోగా తత్సంబంధిత మేధోమథనం మొదలైంది. ముందుగా అందరం కలిసి స్థానికంగా ఒక రోజంతా చక్కటి ప్రకృతి సౌందర్యం గల ప్రాంతంలో విహరించి, తదనంతరం ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లవచ్చని అనుకున్నాము. మా యాత్ర సభ్యుల సమూహం కల సోషల్ మీడియాలో అనేక విధాలుగా తర్జనభర్జనలు చేసి, చివరికి షిరిడి నాసిక్ ప్రాంతాలలో గల మందిరాలను, విహార ప్రాంతాలను దర్శించే విధంగా నిర్ణయం చేయబడింది.


అనేక పర్యాయాలు షిరిడి సాయి మందిర దర్శనం చేసుకున్నా, ఒక రాత్రి అక్కడే బస చేయడానికి అందరూ ఇష్టపడ్డారు. నాసిక్ కూడా వెళ్లడానికి ఉత్సాహం చూపడానికి కారణం అక్కడ త్రయంబకేశ్వర మందిరం, గోదావరి జన్మస్థలం, పంచవటి, సప్తశృంగి దేవి మందిరం వంటి ప్రముఖ యాత్రా స్థలాల దర్శనం చేసుకునే అవకాశం ఉన్నది. రెండు గంటల ప్రయాణంతో షిరిడి నుండి నాసిక్ వెళ్లడానికి ఆస్కారం ఉండడం కూడా మాకు అనుకూలించింది. మిగతా ప్రాంతాలను మా బృంద సభ్యులలో కొందరు చూడగలిగినా ఏడు శక్తుల కలయికతో, ఏడు శిఖరాల మధ్య అవతరించిన సప్తశృంగి మాత ఆలయాన్ని దర్శించుకునే భాగ్యం ఇప్పటివరకు మాలో ఎవరికీ కలగలేదు. 


అప్పటికే గత నెల రోజులుగా షిరిడీ సాయిబాబా మందిరంలో రాయల సేవాసమితి, సంజీవరెడ్డి నగర్ వారిచే సత్సంగం ఏర్పాటుకు షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయి. అనుకోని విధంగా సంస్థాన్ ట్రస్టు వారి నుండి ఆగస్టు 18 వ తారీఖున సత్సంగానికి అనుమతి లభించింది. ఆరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు సంస్థాన్ ట్రస్ట్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో నిర్మించిన ఆడిటోరియంలో మందిరం తాలుకు మౌలిక సదుపాయాలతో సభా ఏర్పాట్లకు అధికారికంగా అనుమతి పొందడం మా యాత్ర బృంద సభ్యులకు, సమితి కార్యవర్గానికి కలిసొచ్చిన అదృష్టం. ఇంకేముంది, మా యాత్రను షిరిడీలో జరిపే సత్సంగానికి అనుసంధానిస్తూ బయలుదేరే సభ్యుల నిర్ధారణ చేయడం జరిగింది.


ప్రయాణానికి మూడు వారాల సమయం దొరకడంతో రానుపోను 2 టైర్ ఏసీ రైల్వే టికెట్ల బుకింగ్, వసతి గృహాల బుకింగ్, మధ్యాహ్న హారతి టికెట్ల బుకింగ్, సౌకర్యవంతమైన బస్సు బుకింగ్ వంటి ముందస్తు ఏర్పాట్లు చక చకా సాగిపోయాయి. ఆయా ప్రాంతాలలో గల పరిచయస్తుల నుండి తెలుసుకున్న సమాచారం మరియు అంతర్జాలంలో శోధించి సేకరించిన సమాచారంతో నాసిక్ లో సందర్శనీయ స్థలాల పట్టిక సిద్ధం చేసుకున్నాం. ప్రతిసారి టూర్ కి బయలుదేరే ముందు ఈ విధమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం మాకు అలవాటైన ప్రక్రియ. 


బస్సులో, రైల్లో కాలక్షేపానికో, జిహ్వచాపల్యానికో చిరుతిళ్లకు అలవాటు పడ్డ మా సభ్యులు రకరకాల తినుబండారాలతో తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక ప్రయాణంలో పదనిసలు కలగకుండా సభ్యులు వర్షాకాలంలో ఏ విధమైన వస్తువులను తెచ్చుకోవాలి, మోయడానికి, బస్సులో పట్టేంత విధంగా వీలైనంత తక్కువ బరువుతో రాగలిగితే మంచిదన్న సలహాలతో మా క్రియాశీలక సభ్యులు ఎప్పటికప్పుడు సమూహంలో తెలియజేశారు. ఈ పర్యాయం బస్సులో మహిళలందరికీ ముందు వరుసలో సీట్లు కేటాయించి వారిని సంతోషపెట్టాము.


అందరి సలహా సంప్రదింపులతో సందర్శనీయ స్థలాల పట్టికలో మార్పులు చేర్పులు చేసుకొని షిరిడీలో 18 వ తారీకు రాత్రి బస నిమిత్తం "సాయి తులసి భవన్", నాశిక్ లో రెండు రోజుల బస నిమిత్తం హోటల్ "పంచవటి యాత్రి" మరియు అక్కడ స్థానికంగా ప్రయాణించడానికి సౌకర్యవంతమైన ఫోర్స్ అర్బానియా బస్సు బుకింగ్ లు పూర్తి చేసుకున్నాము. ఈ విధమైన పక్కా ప్రణాళికల అమలుతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా యాత్ర సుఖంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. 


ఈ పర్యటన కేవలం ఒక యాత్ర అనడం కంటే అంతకన్నా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఒక మానసిక ఆనందం, పరివర్తన కలిగించే అనుభూతి మిగిలింది. బయలుదేరిన రోజు నుండి ప్రయాణం పూర్తిచేసుకుని తిరిగి వచ్చే రోజు వరకు నాలుగు రోజులు మా బృందం జడివానకు జడవకుండా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడం మా అదృష్టం. ఇది చిన్న ప్రయాణమే కావచ్చు. సాయిబాబా ఆశీస్సులతో, సప్తశృంగి మాత కటాక్షంతో తొమ్మిది నెలల తర్వాత మేమంతా పునరుత్తేజం పొందడానికి దోహదం చేసిన మధురానుభూతుల యాత్ర అని చెప్పుకోవచ్చు.


ఆగస్టు 17 వ తేదీన సాయి నగర్ వెళ్లవలసిన రైలులో కొందరు సభ్యులు సికింద్రాబాద్, కొందరు బేగంపేట, మరికొందరు లింగంపల్లి స్టేషన్ల నుండి బయలుదేరారు. అందరూ ఏసి తరగతుల్లోనే ఉండడం వలన తరచుగా కలుసుకోవడం, ఒకే భోగీలో గుమి కూడడం, పలకరింపులు పులకరింపులతో నవ్వుల పువ్వులు వెదజల్లారు. అటు పిమ్మట సభ్యులు తెచ్చిన స్వీటు హాటు ఆరగించి, రాత్రి భోజనానికి ఒక బృంద సభ్యుడు తెచ్చిన విందు భోజనాన్ని ముగించాము.


ఆగస్టు 18 వ తేదీన రైలు దిగిన వెంటనే ఆర్యవైశ్యుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే సత్రం లాంటి సాయి తులసి భవన్ హోటల్లో విశాలమైన డబుల్ బెడ్ రూముల్లో దిగి, స్నాన పానాదులు ముగించుకొన్నాము. మధ్యాహ్న హారతి పూర్తయిన వెంటనే సత్సంగం ప్రారంభం కానున్న దృష్ట్యా ఉదయం 11:30 కల్లా షిరిడి మందిర ప్రాంగణం చేరుకొని అందరూ ప్రశాంతంగా మధ్యాహ్న హారతి దర్శనం పూర్తి చేసుకొని సభా ప్రాంగణానికి చేరుకున్నాం. 150 మందికి పైగా ఆసీనులైన భక్త బృంద సభా ప్రాంగణంలో సమితి ప్రతినిధులుగా వచ్చిన మా పాతిక మందికి ముందు వరుసలోని విఐపి సీట్లను కేటాయించడం జరిగింది.


ముందుగా సాయి ప్రార్థనతో మొదలైన కార్యక్రమంలో సంస్థాన్ ఆస్థాన గాయకుడు శ్రీ ప్రవీణ్ మహాముని గారు వారి వాద్య బృంద సహాయంతో వీనుల విందుగా భజన కీర్తనలు, సాయిబాబా పాటలను గానం చేస్తుండగానే విచ్చేసిన షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీయతులు గోరక్ష గాడిల్కర్ గారిని సమితి అధ్యక్షులు ఆర్.సి. కుమార్ సాదరంగా ఆహ్వానించి వేదిక పైకి తోడ్కొని వచ్చారు. 


ఆర్.సి.కుమార్ గారి అధ్యక్షోపన్యాసం, ‌ సాయిబాబా బోధనల ప్రవచనం భక్తజనులను ఆకట్టుకుంది. భగవంతుని కేవలం నమ్మడం కంటే సమర్పణ భావంతో విశ్వసించడమే ప్రయోజనకరం అని ఒక చక్కటి ఉపాఖ్యానం ద్వారా తెలియజేశారు. శ్రీమతి విజయశ్రీ గారిచే భగవద్గీత లోని పురుషోత్తమ ప్రాప్తి యోగ పారాయణం రాగయుక్తంగా లయబద్ధంగా కొనసాగింది. సాయి దాస్ మహారాజ్ గారి సాయి చరిత్రతో కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.


కార్యక్రమ రూపకల్పన మొదలు చివరి వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సత్సంగం సజావుగా సాగడానికి సమితి అధ్యక్షులు, వారి బృందం చేసిన ఏర్పాట్ల విషయంలో ఆనందాన్ని సంతృప్తిని వ్యక్తం చేసిన ముఖ్య కార్యనిర్వహణాధికారి రాయల సేవా సమితి ప్రతినిధులను, బృంద సభ్యులను శాలువలతో, ఆలయ మర్యాదలతో ఘనంగా సన్మానించారు. సాయి ప్రసాదంగా ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన భోజనం చేసి, హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. ఆ సాయంత్రం కొందరు సభ్యులు తిరిగి సాయిబాబా మందిరం, ద్వారకామయి, చావడి దర్శించుకుని ప్రసాదాలు, తదితర సామాగ్రి కొని తెచ్చుకున్నారు. 


మరుసటి రోజు19వ తేదీ ఉదయం ఏడు గంటలకు సౌకర్యవంతమైన అర్బానియా బస్ లో నాసిక్ బయలుదేరి మార్గమధ్యంలో తేనీటి కోసం ఆగిన హోటల్ లోనే వేడి వేడిగా చేసిన నోరూరించే పోహా, సగ్గుబియ్యం కిచిడి కూడా ఒక పట్టు పట్టాము. సమయం వృధా చేయకుండా త్వరగా ముగించుకొని నేరుగా ముక్తి ధామ్ ఆలయానికి చేరుకున్నాం. ఇది నాసిక్ లో ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. బిర్లా మందిర్ గా కూడా పేరు గాంచిన ఈ పాలరాతి ఆలయ సముదాయంలో అనేక రకాల దేవతలు కొలువై ఉన్నారు. ఇందులో పన్నెండు జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు కూడా ఉన్నాయి. అక్కడనుండి పంచవటికి బయలుదేరే సమయంలో సభ్యుల కోరిక మేరకు భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగ సారాంశాన్ని బస్సు ప్రయాణంలోనే క్లుప్తంగా వివరించారు సమితి అధ్యక్షులు.


రానుపోను రెండు రోజుల రైలు ప్రయాణం, రెండు రోజుల బస్సు ప్రయాణంలో తినడానికి సరిపడా సభ్యులు తెచ్చిన పిండి వంటలు, మురుకులు, జంతికలు, చెక్కలు, కరాచీ బిస్కెట్లు, మైసూర్ పాక్, బందర్ లడ్డు, గర్జలు, బెల్లం పూతరేకులు మా నోళ్ళకి చవులూరించాయి. ఆ తర్వాత పంచవటి చేరుకొని త్రివేణి సంగమం, రామకుండ్, కాలారామ్, గోరారామ్, అర్ధనారీశ్వర్, కపాలేశ్వర్ మందిరాలు, ఐదు పెద్ద వటవృక్షాలను తనివి తీరా దర్శించుకున్నాం. తదుపరి గోదావరి నది జన్మస్థానం సమీపంలోని బ్రహ్మగిరి పర్వతాల వద్ద గల త్రయంబకేశ్వర ఆలయానికి బయలుదేరాం. 


దారిలో తేనీటి కోసం బస్సు ఆపగా, ఆ హోటల్లో వేడిగా చేస్తున్న సగ్గుబియ్యం వడలు చూసి అందరూ ఆకర్షితులయ్యారు. ఆ ప్రాంతం సగ్గుబియ్యం వడలకు పెట్టింది పేరని విని ఆ అవకాశాన్ని వదులుకోకుండా అందరూ ఆస్వాదించారు. నల్లని కొండలపై నుండి తెల్లని పాలనురుగలా జాలువారే జలపాతాలు, పచ్చని పరిసరాలతో గల రహదారిలో బస్సు ప్రయాణం అత్యంత మనోహరంగా సాగింది. పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర ఆలయంలో శివ కేశవులు ఒకే చోట కనిపిస్తారు. బ్రహ్మ విష్ణువులు ఒకే పానపట్టం లో పరమేశ్వరుడితో కలిసి లింగాకారాల్లో కొలువుతీరి దర్శనమిస్తారు.


ఈ దృశ్యాలను ఎదురుగా ఉన్న అద్దంలో స్పష్టంగా చూడవచ్చు. ఇతర శివాలయాలలో వలె త్రయంబకేశ్వరంలో గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉండదు. కాకపోతే నందీశ్వరుడికి విడిగా మందిరం ఉంటుంది. తదుపరి దర్శనీయ స్థలం హనుమంతుని జన్మస్థలంగా చెప్పబడుతున్న ఆంజనేరి. అక్కడి భారీ ఆంజనేయుని విగ్రహం చూపరులకు భక్తి భావాన్ని కలిగిస్తూ కనువిందు చేస్తుంది. ఆనాటి రాత్రి మంచి హోటల్ లో పావు బాజీ, వెజ్ బిర్యానీ దట్టించి విశ్రాంతి తీసుకున్నాం. 


ఇక మా యాత్రలో చివరి రోజు ఆగస్టు 20వ తేదీన ముందుగా అనుకున్న ప్రకారం క్రమశిక్షణ పాటిస్తూ అందరం ఉదయం ఏడు గంటలకల్లా హోటల్ రిసెప్షన్ లో కలుసుకొని అల్పాహారం కోసం ఎదురు చూడకుండా జోరుగా కురుస్తున్న వానలోనే హుషారుగా సప్తశృంగి మందిర దర్శనానికి బయలుదేరాం. రెండు గంటల ప్రయాణంలో దారి పొడుగునా అందమైన ప్రకృతి సౌందర్యాన్ని, పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ సప్తశృంగి మందిరానికి సాగిన మా బస్సు యాత్ర ఒక హైలైట్. కొండల నుండి జాలువారుతున్న జలపాతాలు, చిటపట చినుకుల సందడితో ఆనంద పారవశ్యంలో తడిచి ముద్దైపోయాం. ఘాట్ రోడ్డు ప్రయాణంలో కమ్ముకొస్తున్న పొగమంచులో కనిపించే మైమరిపించే దృశ్యాలు, బస్సులో వీనుల విందుగా వినిపించిన ఆధ్యాత్మిక పాటల తన్మయత్వంతో ఏ మాత్రం ప్రయాణ బడలిక తెలియలేదు.


మహిళల సామూహిక స్తోత్ర పారాయణంతో బస్సులో ఆధ్యాత్మిక తరంగాలు వ్యాపించాయి. మందిర ప్రాంగణానికి చేరుకొని ట్రాలీ లాంటి కోచ్ లో శిఖరం పైకి చేరుకున్నాం. ఒక్కొక్క కోచ్ లో పదిమంది కూర్చునే విధంగా ఉండే ఈ ట్రాలీ రోప్ వేలా కాకుండా పట్టాలపై ఏటవాలుగా ప్రయాణిస్తుంది. ఏడు శిఖరాల మధ్య ఏడు శక్తుల కలయికతో అవతరించిన అమ్మవారి ఆలయం ఇది. అమ్మవారు 18 చేతులతో ప్రతి చేతిలో ఒక భిన్నమైన ఆయుధంతో అసురసంహారిణి అయిన దుర్గాదేవి రూపంలో భీకరంగా కనిపిస్తుంది. ప్రధాన ఆలయంలోని విగ్రహం పది అడుగుల ఎత్తుతో సమున్నతంగా ఉన్న మాతను ప్రశాంతంగా దర్శించుకున్నాం. దర్శనానంతరం మందిర భవన ప్రాంగణంలోనే షాపింగ్, అల్పాహార విందు ముగించుకొని ఉదయం 10:30 కల్లా తిరుగు ప్రయాణానికి సిద్ధపడ్డాం. 


అక్కడినుండి బస్సులోనే తంబోలా, అంత్యాక్షరి ఆడుకుంటూ సుమారు రెండు గంటలు ప్రయాణించగా భోజనం వేళకు పెరుచివాడి మిసాల్ అనే ఒక ప్రఖ్యాతిగాంచిన జామ తోటలతో నిండిన రిసార్ట్స్ వంటి హోటల్ కి వెళ్లి రకరకాల మహారాష్ట్ర వెరైటీ పదార్థాలతో సుష్టుగా భోంచేసాము. ఫైబర్ రూఫ్ టాప్ పైన పడుతున్న చిటపట చినుకుల జడివాన చప్పుడులో భోంచేయడం మాకొక నూతనానుభవం. రుచికరమైన మిసాల్ పావ్, బాజ్రా రోటి (సజ్జ రొట్టెలు), అప్పుడే చేసిన బెల్లం జిలేబితో పాటు నోరూరించే జామ జ్యూస్, జామ లస్సి, జామ ఐస్ క్రీమ్, జామ టీ లను కడుపునిండా ఆరగించి ఇండియన్ వైన్ క్యాపిటల్ గా ప్రఖ్యాతిగాంచిన సూలా వైన్ యార్డ్ సందర్శనార్థం బయలుదేరాము.


మహిళలకు ఆరోజు (ప్రతి బుధవారం) ఉచిత ప్రవేశం సౌకర్యం ఉండడంతో కాస్త పొదుపు చేయగలిగాము అన్న తృప్తి కలిగింది. కానీ చెప్పుకోదగ్గ సందర్శనీయ స్థలాలు లేకపోవడంతో ఫోటోలు, సెల్ఫీలతో సందడి చేస్తూ అక్కడే కాస్త సమయం గడిపాం. కొందరు సభ్యులు అక్కడ మాత్రమే లభించే అరుదైన ప్రీమియం వైన్ బాటిళ్లను కొనుగోలు చేయగా ఆనాటి యాత్ర ముగించి హోటల్ కు చేరుకున్నాం. ఆ విధంగా మూడు రోజుల యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా మూడు ఘడియలుగా గడిచిపోవడంతో మదినిండా మధురమైన అనుభూతులను నింపుకొని రాత్రి అదే బస్సులో నాసిక్ రైల్వే స్టేషన్ కి చేరుకొని దేవగిరి ఎక్స్ ప్రెస్ లో సికింద్రాబాద్ కు తిరుగు ప్రయాణం సాగించాం.


ఆద్యంతం సజావుగా సాగిన ఇలాంటి ఆహ్లాదకరమైన యాత్రానుభూతి త్వరలో మరొకసారి కలగాలని మనసారా కోరుకుంటూ, మరునాడు మధ్యాహ్నం ఒకరికొకరు ఆత్మీయ వీడ్కోలు తెలుపుకొని క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. 


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page