విశ్వ సత్యాలు
- Gadwala Somanna
- Jun 3
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ViswaSathyalu, #విశ్వసత్యాలు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 82
Viswa Sathyalu - Somanna Gari Kavithalu Part 82 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 03/06/2025
విశ్వ సత్యాలు - సోమన్న గారి కవితలు పార్ట్ 82 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
విశ్వ సత్యాలు
----------------------------------------
నేర్చుకుంటే పాఠము
బాగుపడును జీవితము
లేదంటే కకావికలము
తోక తెగిన గాలిపటము
పెద్దవారి హెచ్చరికలు
తప్పించును ప్రమాదము
పాటిస్తే జాగ్రత్తలు
జీవితాలు బహు పదిలము
విలువైనవి సత్యాలు
అమూల్యమైన ముత్యాలు
అక్షరాల వాస్తవమ్ము
కాంతులీను కాగడాలు
మేనులోని అందాలు
వాడిపోయే పుష్పాలు
అంతరంగ సుగుణాలు
వెలలేని ఆభరణాలు

సాగర తీరం మనోహరం
----------------------------------------
సాగర తీరానికి
సహనమెంతో అమితము
కెరటాలు తాకినా
చూపును క్షమాగుణము
సంధ్యాసమయంలో
పంచును ఆహ్లాదము
చల్లని గాలులతో
కలిగించును మోదము
సాగర తీర ప్రాంతము
కనువిందు చేస్తుంది
పర్యాటకుల మదులను
పరవశింపజేస్తుంది
జలప్రాణుల నిలయము
ఘోషించే సముద్రము
తీర ప్రాంత అందాలు
దోచునోయ్!హృదయాలు
తీరమే లేకుండా
సాగరం ఉండేనా!
మత్స్యకారులకిలలో
ఉపాధి దొరికేనా!

గురూపదేశం
-----------------
నమ్మరాదు పుకారు
చేయునోయి!షికారు
నిర్ధారించుకొనుము
వాస్తవాలు ఒక మారు
వ్యాపించును వదంతి
నమ్మితే అధోగతి
పరిశీలన ముఖ్యము
అవసరమే జ్ఞానము
చెప్పుడు మాటలు చెరుపు
అధిగమిస్తే గెలుపు
ఉంటేనే మంచిది
అన్నింటిపై అదుపు
పుకార్లు పుట్టిస్తే
పుట్టగతులు ఉండవు
రాద్దాంతం చేస్తే
సత్ఫలితాలివ్వవు

పంతులు ప్రబోధ మాలిక
----------------------------------------
కొసరి కొసరి వడ్డించే
కసిరి కసిరి గద్దించే
అమ్మను, గురుదేవులను
మరవరాదు మహాత్ములను
మంచి దారి చూపించే
సద్విషయాలు నేర్పించే
ఎవరిని నొప్పించరాదు
దూరం చేసుకోరాదు
బాధ్యతలు నెరవేర్చే
బ్రతుకంతా ప్రేమించే
కన్నోళ్లను మరువొద్దు
కన్నీళ్లు పెట్టించొద్దు
సాయపడిన వ్యక్తులను
వెన్నంటే మిత్రులను
పోగొట్టుకోవద్దు
నిర్లక్ష్యం చేయొద్దు

చిలుకమ్మల సూక్తులు
----------------------------------------
జగతిలో ఉదయినిగా
మాటలో మధువనిగా
ఉండాలోయ్!గొప్పగా
బ్రతుకులో పున్నమిగా
ఇంటిలో దీపంగా
వెలగాలి దివ్యంగా
ఉండాలోయ్! అన్నింటా
నలుగురికి మురిపెంగా
దండలో దారంగా
తేనెలా మధురంగా
ఉండాలోయ్!లోకాన
పవిత్రంగా హృదయాన
వ్యసనాలకు దూరంగా
మహిలో ఆదర్శంగా
ఉండాలోయ్! ముత్యంలా
కోహినూర్ వజ్రంలా
-గద్వాల సోమన్న
Comments