top of page

ఓటు - నోటు



'Vote - Note' - New Telugu Story Written By D V D Prasad

Published In manatelugukathalu.com On 10/12/2023

'ఓటు - నోటు' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. ప్రచారం ఊపందుకుంది. రాజకీయ నాయకుల హడావుడికి అంతే లేదు. ఎవరికి పార్టీ టికెట్ దొరకనుందా అని ప్రతీ నాయకుడూ ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఏ ఎండకా గొడుగు పట్టేవాళ్ళు గోడమీద పిల్లుల మాదిరి పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. కొత్త పార్టీ తీర్థాలు పుచ్చేసుకుంటున్నారు. ఆఖరికి పార్టీ టిక్కెట్లు ఖరారవడమూ, నామినేషన్లు దాఖలవడమూ కూడా జరిగిపోయాయి. రాజకీయం వాతావరణం వేడెక్కుతోంది. పార్టీల ప్రచారం జోరందుకుంది. ప్రతీ రోజూ ఏదో రోడ్ షో, లేక పార్టీ సభో జరుగుతూనే ఉంది. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో పాటు స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగినవారూ ఉన్నారు. పెద్ద పార్టీలు బోలెడన్ని హామీలు గుప్పించేస్తున్నారు. సాధ్యాసాధ్యాలు మరిచి వాగ్దానాలు మీద వాగ్దానాలు చేసేస్తున్నారు.


జంబుకేశ్వర్రావు నిలబడిన నియోజిక వర్గంలో అతనికి బలమైన ప్రత్యర్థి ఉండటంతో తను గెలుస్తానో లేదోనని చాలా భయంగా ఉంది. కిందటి సారి ఎన్నికల్లో నిలబడి, బోలెడన్ని హామీలిచ్చి మళ్ళీ అయిదేళ్ళవరకూ కనపడకుండా పోయాడు. ఇప్పుదు మళ్ళీ ప్రజలను కలిసి ఓట్లు అడగాలంటే కొంచెం బెరుగ్గా ఉంది. అందుకే తన బామ్మర్ది, సెక్రెటరీ అయిన కుక్కుటేశ్వర్రావుని పిలిచి సలహా అడిగాడు. బావ సందేహం విని ఫక్కున నవ్వాడు కుక్కుటేశ్వర్రావు.


"నిజమే బావా! నిన్ను మళ్ళీ అయిదేళ్ళ తర్వాత చూస్తే జనం పోల్చుకోలేకపోవచ్చు. ఈ అయిదేళ్ళలో చాలా మారిపోయావు బావా!" అన్నాడు పెరిగిన జంబుకేశ్వర్రావు పొట్టవైపు చూస్తూ.


"సరేలేవోయ్! అలా చూడకు, నువ్వే నన్ను దిష్టి పెట్టేసేట్లు ఉన్నావు! ఈ సారి ఎలా గట్టెక్కాలో చెప్పు చాలు." అన్నాడు.


"ఇందులో కొత్తదనం ఏమీ లేదు బావా! ఎలాగూ మన పార్టీ మానిఫేస్టో అధిస్థానం విడుదల చేసింది. అందులో ఉన్న వాగ్దానలన్నీ చేసేయ్! అయితే, ఎన్నికల ముందు రోజు మాత్రం ప్రతీ సారిలాగే మందు ఏరులాగ ప్రవహించాలి. డబ్బులు పంచాలి. మందు ప్రభావంతో ప్రజలు అన్నీ మర్చిపోతారు బావా, మళ్ళీ నీకే పట్టం కడతారు. మద్యం మత్తు అలాంటిది మరి! మళ్ళీ అయిదేళ్ళ వరకూ నీకు ఢోకా లేదు." చెప్పాడు కుక్కుటేశ్వర్రావు బావకి మందు గ్లాసు అందిస్తూ.


"సరే, తప్పేదేముంది! అలాగే చేద్దాం! మరి అంత మందికి డబ్బులు పంచాలంటే మనవల్ల అవుతుందా?" అన్నాడు. 


అప్పటికే కొన్ని కోట్లు కమీషన్ల కింద నొక్కేసినా, కోట్ల కొద్దీ నల్ల ధనం కూడబెట్టినా, డబ్బులు ఖర్చుపెట్టాలంటే కాస్త బాధగానే ఉంటుంది మరి!

 ********************

మొత్తానికి ఎన్నికల ప్రచారం ముగిసింది. చాలా మంది రాజకీయ నాయకుల మాదిరే, జంబుకేశ్వర్రావు కూడా తన నియోజిక వర్గం ప్రజలకి కావలసినంత మందు ప్రవహింప చేసాడు. బామ్మర్ది కుక్కుటేశ్వర్రావు సలహా మేరకు, తనకు ఓటు వెయ్యడానికి ధారాళంగా నోట్లు పంచాడు. అయితే బామ్మర్ది సలహా ప్రకారం ముందుగా కొంత డబ్బిచ్చినా, తనకే కచ్చితంగా ఓటు వేసిన వాళ్ళకి ఇరవై వేలు చొప్పున ఇస్తానని వాగ్దానం చేసాడు. ఓటు వేసి బయటకు రాగానే డబ్బులిచ్చే ఏర్పాటు చేస్తానని ఇంటింటికి తిరిగి మరీ చెప్పాడు. ఇంతవరకూ ఎవ్వరూ అంత డబ్బులు ఇవ్వని కారణంగా జంబుకేశ్వర్రావుకి ఓటెయ్యడానికే అందరూ మొగ్గు చూపారు.


ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఓటు వేసిన తర్వాత, తను చెప్పినట్లే సీల్ద్ కవరులో ఇరవై వేలు చొప్పున అందిరికీ పంపిణీ చేసాడు జంబుకేశ్వర్రావు.


రెండు రోజుల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బంపర్ మెజారిటీతో గెలిచిన జంబుకేశ్వర్రావు ఆనందానికి అవధులు లేవు. వెంటనే రాష్ట్ర రాజధానికి పయనమయ్యాడు.


అయితే, ఇక్కడ అతనికి ఓటు వేసిన జనం అతను తమకిచ్చిన ప్యాకెట్ తెరిచి చూసి గొల్లు మన్నారు. ఇరవై వేల రూపాయల కోసం ఆశతో ఓటు వేసి వాళ్ళు గెలిపించిన జంబుకేశ్వర్రావు వాళ్ళని మోసం చేసాడు. వాళ్ళకిచ్చిన డబ్బుల్లో అన్నీ రెండు వేల రూపాయల నోట్లు మాత్రమే ఉన్నాయి. ఆ రెండు వేల రూపాయిల నోట్ల చెల్లుబాటు కాలం అయిపోయింది మరి. నోటుకు ఓటేసిన ఆ జనం, ఆ నోట్లనేమి చేసుకోవాలో అర్థం కాక బుర్ర గోక్కున్నారు. జంబుకేశ్వర్రావుని నిలదీయాలన్నా, మళ్ళీ అయిదేళ్ళ తర్వాత మాత్రమే అతను కనిపిస్తాడు. అప్పటికి వాళ్ళకి ఈ సంగతి గుర్తుంటుందా అన్నది సందేహమే! అందుకే జంబుకేశ్వర్రావు లాంటి రాజకీయ నాయకుల ఆటలు సాగుతున్నాయి మరి!

 *************


దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


57 views1 comment
bottom of page