top of page

వ్రాసుకున్నాము ప్రేమలేఖలెన్నో


'Vrasukunnamu Premalekhalenno' New Telugu Story

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఇద్దరి మనసులు కలవడమే కాదు.

ఇద్దరి ఆశయాలు కలిశాయి. ప్రేమించడమే కాదు.. ఆ ప్రేమకు అర్థం ఉండాలనుకున్నారు.

—-ఈ ప్రేమ పక్షుల ప్రయాణం లోని, మధుర జ్ఞాపకాలను, ఉత్తరాల రూపంలో మారిస్తే వచ్చిందే ఈ “ వ్రాసుకున్నాము ప్రేమలేఖలెన్నో”.


28 నవంబర్‌ 1990–మహిళల వసతి గృహం,

రెడ్డీ కాలేజీ.


ప్రాయం పూచిన పులకరింతలను పుష్పగుచ్ఛంగా పంపి పరిమళం పంచుదామని..అంతరంగ ఆలోచనలను అక్షరాలతో అద్ది అందిద్దామన్న ఆదుర్దా. నా ప్రణయ లేఖ క్రమం కొరవడిన విలోమ కావ్యంలా ముగిసింది కదూ! ఏం చేయనూ? అరడజను సార్లు మొదలు పెట్టాను. ప్రారంభం కుదరలేదని వ్రాసింది మొత్తం కొట్టేశా. ముక్తాయింపు ముచ్చటగా లేదని తిరగరాశా. నా కుటుంబ నేపథ్యం అడిగావు కదా.


నాకు నాలుగేళ్ళున్నప్పుడే ఏదో మిష మీద నాన్న ఇల్లు వదిలి పోయాడు. కొంత కాలానికి అమ్మ రక్తహీనతతో చనిపోయింది. కొంతకాలం మేనత్తలు పెంచారు. నరసాపూర్‌ దగ్గర పల్లెలో పెరిగాను. తొమ్మిదో తరగతిలో డబ్బులు పోగేసి రెండు ఆవులను కొన్నాను. పాలు అమ్మి మరిన్ని ఆవులు కొంటూ వచ్చాను. అలా అలా ముప్పై ఆవులయ్యాయి. అలా పాలసొమ్ముతో నా చదువు పూర్తయ్యింది.


రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ చేయడానికి రావడం, తమరి చూపులు నాపై పడటం, మీ మాయలో పడిపోవడం ఇట్టే జరిగిపోయింది.

నీ శాన్వి.


29 నవంబర్‌ 1990 బాలుర వసతి గృహం

వివి కాలేజీ.


చీకటి వేకువలో చెలి చేరవేసిన మానస మందారాల మకరందాలు మత్తెక్కించాయి. నీ ఆదుర్దాలో ఆర్ధ్రమైన ఆర్తి అవగతమైంది శాన్వీ, తలమానికమైన నీ తలంపులతో తోరణం కడదామని, మనసు పలికే ముచ్చట్లను ముత్యాల మాలగా మారుద్దామని మురిసిపోతూ అక్షరాలను పేర్చడం

మొదలెట్టా!నా మదిలో అవ్యక్తమైన చిరు ముచ్చట్ల సవ్వడి వ్యక్తం చేయలేక పోతానేమోనన్న చింతతో దిగాలు పడిపోయాను. పదాలు పొందికగా రాయలేకపోయానని చిర్రెత్తుకొచ్చి లేఖను చింపి చెత్త బుట్టలో పడేశా.


చివరికి ఇలా కుదిరింది. చెలి చక్షువులకు నా అక్షరాలు చీమలదండులా అనిపిస్తాయేమోనని ఒకటే గుబులు. నీ బాల్యం గురించి చదువుతున్నప్పుడు కళ్ళు మసక బారిపోయాయి.

బంధువులకు భారం అవ్వకుండా బాల్యం లోనే నీకాళ్ళ మీద నువ్వు నిలబడేందుకు వ్యాపారాన్ని ఎంచుకున్నావు చూడూ— అది చాలా ముచ్చటేసింది. నీపై ఆరాధానా భావంతో పాటూ గౌరవం రెట్టింపయ్యింది.


నా విషయానికొస్తే 1962 లో పుట్టాను. నేను మహా అయితే మూడేళ్ళు నువ్వు నాకంటే చిన్నదాని వనుకుంటా. సాగర్‌ నుండి మా తాత వచ్చి హైదరాబాద్‍లో స్థిరపడ్డారు. ఇక్కడే ఏజీ బి. ఎస్‌. సీ వరకూ చదివాను. 1989 లో Phd లో ప్రవేశం దొరికింది. కష్టాలు, కడగండ్లు, సాహసాలు లేని నిస్సార

మైన మధ్యతరగతి జీవితం నాది. నన్ను నేను నిరూపించు కోవడానికి చేయాల్సింది చాలానే ఉంది.

బోర్‌ కొట్టాను కదూ!

ప్రేమతో శ్యామ్‌.


4 డిశంబర్‌ 1990. బాలుర వసతి గృహం

వివి. కాలేజీ.


లేఖ పంపడానికి కూడా సమయం దొరకలేదా శాన్వీ? నిన్న నీ నుంచి లేఖ రాలేదని అసంతృప్తికి గురయ్యా. మనిద్దరి గదుల మధ్య ఉన్న దూరం ఐదొందల గజాల దూరం. నీతో మాట్లాడి 28 గంటలు గడిచిపోయిందన్న బెంగతో.. ఐదు వేల మైళ్ళ దూరంలాఅనిపిస్తోంది. నీ కోసమే నా హృదయం ఎదురుచూస్తోందని తెలియదా? నీకు బొత్తిగా జాలిలేదు. కలవరపడుతున్న ఈ కళ్ళపై కనికరం చూపవూ? నీతో శుభవార్త చెబుదామని కాలు కాలిన పిల్లిలా మీ హాస్టల్‌ చుట్టూ తిరిగాను. కలహంస నడక ఎక్కడా జాడ లేదే. వేల ఎకరాల విస్తీర్ణం గల క్యాంపస్‌లో ఎక్కడెక్కడని వెతకను నిన్ను,

పైగా నువ్వు అనంతమైనప్పుడు!


వ్యవసాయశాఖలో నాకు డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చిందోయ్‌. మొదట ఈ శుభవార్త నీకే చెప్పాలని, కలువరేకుల్లాంటి నీ కళ్ళలో మెరుపులు చూడాలని తహతహ లాడిపోయాను. ఎన్ని ఉత్తరాలు రాసుకున్నా ఏం ప్రయోజనం? మనం కలిసి మాట్లాడుకుంటే ! అన్న ఊహని నిజం చేయడమెలాగా ? అని ఆలోచిస్తున్నాను.

————ప్రేమతో శ్యామ్‌.


5 డిశంబర్‌ 1990 మహిళల వసతి గృహం.

రెడ్డీకాలేజీ.


అదేమిటీ. నాలుగవ జాములో లేచి నందివర్దనం చెట్టు కింద పెట్టిన నీలం రంగు కవర్‌ అందలేదా?

అయితే ఈ ఉత్తరం కూడా హుష్‌కాకి అయినట్లుంది. చెలికాడు రాత్రి రాసిన రాగమాలిక హేమంత తుషారాలకు తడిసి ముద్దయ్యింది. అక్షరాలను కూడ బలుక్కుని చదవాల్సి వచ్చింది. ఉదయం ఊడలమర్రి క్రింద నేను పెట్టిన ఉత్తరం ఈదురు గాలికి ఊరంతా ఊరేగిందేమో మరి..


ఈ వేళ దూరం నుంచే చూశాను నిన్ను. చకోరపక్షి వెన్నెల కోసం వెతికినట్టు, నీ కళ్ళలోని అన్వేషణ నా కోసమే నని గర్వంతో గుండె ఉప్పొంగింది. కలలోని నువ్వు వాస్తవమై మదిని మీటేకొద్ది మోహనమాధుర్యం నా మనసుని ముంచెత్తుతోంది. వ్యవసాయశాఖలో నాకు కూడా డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ గా నియమించినట్టు పొద్దుటే పోస్టింగ్‌ వచ్చింది. ఈ చల్లని కబురు చెప్పి నీతో పంచుకోవాలని

పరితపించిపోయాను..నీ వెన్నంటే ఉంటా. ఇద్దరికీ ఉద్యోగాలొచ్చాయి. కాబట్టి త్వరలోనే పెళ్ళి

చేసుకుందాం

—————-నీ ప్రియ సఖి.


6 డిశంబరు 1990 బాలుర వసతి గృహం

వివి. కాలేజీ.


నీ లేఖ చూశాక పోయిన ప్రాణం ప్రణయమై తిరిగొచ్చినట్లయింది. నవంబరు నీరెండలా నాజూకుగా,

నా నెచ్చెలి నన్ను తాకినంత అధ్బుతపరవశం పొందాను. స్వాతి చినుకు కోసం నిరీక్షించే ముత్యపు చిప్పలా, తొలి వెచ్చని సూర్య కిరణాల కోసం వేచియుండే తామరపువ్వులా ఆవురావురుమంటూ ఆసాంతం చదివాను. ఈ వారమే ఒకటవుదాం.


నాకు తెలిసిన, నేను పనిచేయబోయే సంగారెడ్డి దగ్గరలో సన్నకారు రైతులందరూ సహకార, సమిష్టి వ్యవసాయం చేద్దామనుకుంటున్నారు. మొత్తం ఐదువేల ఏకరాలు. నన్నే దగ్గరుండి అన్ని సలహాలు మరియు ఏఏ సమయాలలో ఏఏ పంటలు వేయాలో అన్నీ బాధ్యతలు నామీదే పెట్టారు.


ఆఫీసుపని, బయటపని అన్నీ కలిసి పోయాయి. పని ఎంతో సంతృప్తికరంగా ఉంది. ఉంటా చెలీ!

నీ శ్యామ్‌.


8 డిశంబర్‌ 1994, నర్సాపూర్‌.


శ్రీ వారికి పెళ్ళిరోజు నాలుగవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సమిష్టిసహకారవ్యవసాయం అనే

భావనకు మనం ఊపిరి పోయడం గొప్ప విషయమే కదా! నువ్వు ఊరెళ్ళి వారం అవుతోంది. ఈ

విరహానికి స్వల్ప విరామం ఒక వింత అనుభూతి.

——— ప్రేమతో శాన్వీ.


8 డిశంబర్‌ 1994, సంగారెడ్డి.


ప్రియమైన శ్రీమతికి పెళ్ళిరోజు శుభాకాంక్షలు. ప్రతి క్షణం నువ్వే గుర్తుకువస్తున్నావు. ఆ జ్ఞాపకాలు ఈ క్షణపు ఏకాంతాన్ని చెరిపేస్తున్నాయి. ఈ విరహం తరగదెందుకో! నాలుగేళ్ళ మనిద్దరి శ్రమకు ఫలితం దక్కింది. ఏడుపాయల చెక్‌డామ్ దగ్గర గడపడమంటే నీ కిష్టం కదా! ఆ వంతెననే

లోగోగా మన సహకారసంస్థ కు ఖాయం చేశాను. ఉద్యోగం చేస్తూ ఈ సమిష్టి వ్యవసాయ సంస్థ నిర్వహణ కుదరటము లేదు. త్వరలో ఉద్యోగం వదిలేస్తాను.

—————— నీ శ్యామ్‌.


ఏప్రిల్‌ 1997, సంగారెడ్డి.


కనిపిస్తూనే కనుమరుగవుతావు. ఊరిస్తూనే.. ఉపేక్షిస్తావు. ఊసులాడితూనే ఊరడిస్తావు. నీ ఆలోచనలతోనే పనిమీద బొత్తిగా ధ్యాస ఉండటం లేదు. అందుకే ఈ ప్రేమ సందేశం.

ఇవాళే ఒకమల్టీచెయిన్‌ సూపర్‌ మార్కెట్‌ వాళ్ళు మన పంటలను డైరక్టుగా కొనడానికి ఒప్పందం

కుదుర్చుకున్నారు.

—————ప్రేమతో శ్యామ్‌.


ఆగస్టు 2000, నర్సాపూర్


ఈ రోజు తెలియని నిశ్శబ్దత ఆవరించింది. ప్రస్తుతం నేను కూడా మొత్తముగా నా కార్యకలాపాలన్నీ వ్యవసాయము పైనే పెట్టదలచుకున్నాను. నేను కూడా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను.

————————-ఎప్పటికీ నీ శాన్వీ


10 డిశంబర్‌ 2021–సంగారెడ్డి.


ప్రియమైన శాన్వీ. మనం మన సహకారసస్థకు జన్మనిచ్చి

నేటికి ముప్పై ఏళ్ళు నిండాయి. నీవు కూడా 1200 ఏకరాలలో ఆర్గానిక్‌. వ్యవసాయం, డైరీఫామ్‌ పెట్టి ఎంతో పేరు తెచ్చుకున్నావు. నీకిష్టమైన పశుపోషణ ఎంతో శ్రద్దగా చేసుకుంటున్నావు. ఈ జన్మకి మనిద్దరికీ ఈ విధంగా పేరు రావడం, ఈ మాత్రం సార్థకత చాలదా.. !


—————ఎప్పటికీ నీ శ్యామ్‌.


శుభంభూయాత్‌

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link


Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.





194 views0 comments

Commenti


bottom of page