top of page

వృద్ధుడి చరమాంకం



'Vruddhudi Charamankam' - New Telugu Story Written By Varanasi Bhanumurthy Rao

'వృద్ధుడి చరమాంకం' తెలుగు కథ

రచన: వారణాసి భానుమూర్తి రావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

అర్ద రాత్రి అయినా ఇంకా నిద్ర రాలేదు పరంధామయ్యకు. నిద్ర వచ్చిందంటే వింత గానీ, నిద్ర పట్టక పోవడం అనేది మామూలు విషయమే ఈ వయసులో! హాల్లో జీరో లైట్ బల్బు వెలుగుతుంది గుడ్డి గుడ్డిగా తన జీవితంలాగే! ఫాన్ గాలికి కిర్రు కిర్రు మని శభ్ధం చేస్తున్నాయి కొక్కీలు లేని కిటికీ తలుపులు. ఒక్కొక్క సారి గాలికి శబ్ధం చేసుకొంటూ ముందుకూ వెనక్కు కొట్టుకొంటున్నాయి. కిటికీ చెక్క తలుపుల్లాగా తన గుండె ఎన్నో సార్లు బలంగా వేగంగా కొట్టుకొంటూ వూగిసలాడుతోంది.


తను లేచి కిటికీ తలుపులు వేద్దామనుకొంటాడు. కానీ ఓపిక ఏదీ? దుమ్ము పట్టి, యాభై ఏళ్ళ నుండి తనతో సహ వాసం చేస్తూ కిర్రు కిర్రుమని శబ్ధం చేస్తూ తిరుగుతున్న ఫాను రెక్కల శబ్ధం తన రెక్కలుడిగిన వృద్ధ్యాపాన్ని పదే పదే గుర్తుకు తెస్తుంది. బేరింగులు చెడిపోయిన ఫాను చేసే వింత శబ్ధం వింటూ నిద్ర పోవడం తనకు అలవాటే! తను సావిత్రిని పెళ్ళి చేసుకొన్న రోజుల్లో తెచ్చుకొన్న ఓరియంట్ ఫాన్ అది. యాభై ఏళ్ళు అయినా ఇంకా మూలుగుతూ పని చేస్తోంది.


ఈ ఇల్లు తను కష్ట పడి వూరవతల కట్టించుకొన్నాడు. ‌ ఆ రోజుల్లో లక్ష రూపాయల వ్యయంతో ఈ రెండు రూముల ఇల్లు కట్టించి యాభై ఏళ్ళు దాటింది. తనకు ముసలి వయసు వచ్చినట్లుగా ఈ ఇంటికీ ఆలనా పాలనా లేక పాత బడి పోయింది. ఇంటికి సున్నాలు కొట్టించింది పాతిక సంవత్సరాల క్రితం పెద్దోడి పెళ్ళి కోసం. పెద్దోడి పెళ్ళికి‌ పైన ఒక రూము వేయించాడు తను. పిల్లలు వస్తే హాయిగా వుంటారని. పెద్దోడు పెళ్ళి చేసుకొని అమెరికా వెళ్ళి పోయి పాతిక సంవత్సరాలు దాటింది.


ఇంతవరకూ వాడి మొహం తను చూడనే లేదు. ‌ ఎక్కడున్నాడో ఏమో పెద్దోడు, కనీసం ఫోన్ గూడా చెయ్యడు. ఎక్కడున్నాడో గూడా తెలీదు. చిన్నోడయినా ఇంటి పట్టున వుండి హైదరాబాదు లో వుద్యోగం చేసుకొని వుంటాడనుకొంటే ఏదో రష్యన్ అమ్మాయిని పెళ్ళి చేసుకొని రష్యాకి వెళ్ళి పొయ్యాడు. ‌ ఇంతవరకూ రాలేదు. ఎలా వున్నావన్న అడిగిన పాపాన పోలేదు.


పొరలు పొరలుగా వస్తున్న దగ్గు. దగ్గుతో పాటు కఫం గళ్ళలు గళ్ళలుగా ఛాతీ ని ఆక్రమిస్తోంది. ‌ లేచి వాష్ రూము కెళ్ళి శుభ్రం చేసు కొందామన్నా ఓపిక లేదు. ఒక మగ్ పక్కన బెట్టుకొని అందులోకి గళ్ళను వుమ్ముతున్నాడు. దగ్గు వచ్చిందంటే ఒక సారిగా వదలదు. పది నిముషాలు ప్రాణాలు తోడేస్తుంది. సిగరెట్ కోసం పెట్టె వెదికాడు. అరవై ఏళ్ళ నుండి సిగరెట్ కాల్చడం అలవాటు అయింది. తను ఆ అలవాటు మాన లేక పోతున్నాడు. ఈ ధూమ పానం వల్లనే ఈ రోజు తను అనారోగ్యం పాలు అయ్యాడు. లంగ్స్ బాగా డామేజి అయిపొయ్యాయని డాక్టర్ చెప్పాడు.


దగ్గు ఈ సారి ఆగడం లేదు. లేచి మంచి నీళ్ళు తాగి పరుపు మీద పడుకొన్నాడు. అతని ఇంకి పోయిన కళ్ళ నుండి సన్నని కన్నీటి బొట్లు కను సన్నల నుండి పక్కకు జారి దిండు మీద పడ్డాయి. పరంధామయ్య గతం లోకి జారుకొన్నాడు. ************************************************************************************

"నాన్నా!" పెద్ద కొడుకు మౌళి పిలిచాడు.


"నేను బి టెక్ పాస్స్ అయ్యాను గదా? మరి నన్నేమి చెయ్యమటారు?"


"ఏదైనా వుద్యోగం చూసుకో ! ప్రైవేటు కంపెనీలలో సాఫ్ట్ వేర్ వుద్యోగంలో చేరు. నేను గూడా బి ఎస్సీ అవుతూనే ఒక ప్రైవేటు కంపెనీలో కెమిస్ట్ గా జాయిన్ అయ్యాను."


"నాకు వుద్యోగం చెయ్యడం ఇష్టం లేదు" అన్నాడు మౌళి.


"నేను పెద్ద చదువులు చదివించ లేనురా! ఏదో ఈ ప్రైవేటు వుద్యోగాన్ని ఇలా నెట్టు కొస్తున్నాను"


"నేను ఎం ఏస్ చెయ్యాలను కొన్నాను. అమెరికా యూనివర్సిటీలకు అప్లయి చేస్తాను. మీరు కొంచెం సపోర్ట్ చెయ్యండి" అన్నాడు మౌళి.


"నా ఆర్థిక పరిస్థితి నీకు తెలీనది గాదు మౌళి. ఫారిన్ పోవాలంటే పది లక్షలు అయినా గావాలి. అంత డబ్బు ఎలా సర్దను? ఇక నీ తమ్ముడు గూడా బి ఫార్మసీ లో చేరుతానంటున్నాడు. నువ్వు జాబ్ లో చేరితే మంచిదని నా అభిప్రాయం" అన్నాడు పరంధామయ్య.


ఒక్క సారిగా చేతిలో ఉన్న సర్టిఫికెట్లు, మార్క్స్ మెమో, అమెరికన్ యూనివర్సిటీ కి చెందిన ఆఫర్ లెటర్లు అన్నీ విసిరి కొట్టి బయటకు వెళ్ళి పొయ్యాడు మౌళి కోపంగా. పరంధామయ్య గుండె బలంగా కొట్టు కొనింది. తన శ్రీమతి సావిత్రి తనని పొదివి పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టింది. ఒక సిగరెట్ తీసి కాలుస్తూ బలంగా రింగులు రింగులు వదలుతున్నాడు. తన సమస్యలు అలాగే తనని ఆ పొగ లాగా వుక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ***********************************************************************************

తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొనని పిల్లల ఈ వింత మానసిక పరిస్థితికి, ఈఅనుచిత ప్రవర్తనకు కారణం ఎవ్వరు? తల్లిదండ్రుల పెంపకమా? అతి గారాబమా? అడిగిన వన్నీ కొనిచ్చి, కష్టపడే మనః స్థత్వాన్ని నేర్పించక పోవడమా? కష్టాలను, సమస్యలను ఎదురొడ్డే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించక పోవడమా?


బ్రతక డానికి పిల్లలకి లౌకిక విద్యల్ని నేర్పిస్తున్నాము గానీ మనిషిగా జీవించడానికి నైతిక సూత్రాలను నేర్పించడం లేదు. అందుకే తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. పిల్లలు ఇద్దర్నీ కష్టం తెలీకుండా పెంచాడు. మంచి స్కూల్స్ లో ఫీజు ఎక్కువయినా కట్టి చదివించాడు. సావిత్రి నల్ల పూసల గొలుసు కావాలని అడిగినా కొనివ్వ లేక పొయ్యాడు తను. ఇప్పుడు తను ఇంత అప్పు చేసి మౌళిని అమెరికా పంపడం కత్తి మీద సాము లా వుంది తనకి. అయినా మౌళి అర్థం చేసుకొనే పరిస్థితిలో లేడు. అర్థం కాని పరంధామయ్య అచేతనంగా ఆలోచనలో పడి పొయ్యాడు. *******************************************************************************

"మౌళీ !"


"నాన్న గారు!"


"అమెరికా పొయ్యే ఏర్పాట్లు చేసుకో ! పి ఏఫ్ లోన్ కి అప్లయి చేశాను. అలాగే బాంకు లోను‌కు గూడా ట్రై చేస్తున్నాను" అన్నాడు పరంధామయ్య గారు.


మౌళి ఆనందానికి అవదుల్లేవు. ‌ తన తండ్రి ఎలా ఫండ్స్ అరేంజ్ చేస్తున్నాడు ?ఎలా ఆ ఋణాన్ని నాన్న గారు తీర్చగలడు ? అన్న ధ్యాస లేకుండా మూడు నెలల్లో పెట్టె బేడా సర్దుకొని అమెరికా చెక్కేశాడు పెద్ద కొడుకు మౌళి. అలా పోయిన పుత్ర రత్నం పాతిక సంవత్సరాల అయినా నాన్న గారిని పలకరించిన పాపాన పోలేదు.


చిన్న కొడుకు బి ఫార్మసీ అయిపోతూనే రష్యాకు వెళ్ళి పొయ్యాడు. అక్కడే రష్యన్ అమ్మాయిని పెళ్ళి చేసుకొని తల్లినీ తండ్రినీ పట్టించుకొన్న పాపాన పోలేదు. ************************************************************************************

"సావిత్రీ! పిల్లలకు రెక్క లొస్తే దూరంగా వెళ్ళి‌ పోతారు. మరి ఈ వృద్ధ పక్షులకు దిక్కెవ్వరు?"


"మీకు నేను. నాకు మీరు" అన్నది సావిత్రి.

"ఈ అసమర్థుని జీవన యాత్రలో నిన్ను సంతోష పెట్టిందే లేదు. దానికి తోడు మన పుత్ర రత్నాలు మనకు చేసిన అన్యాయం నన్ను దహించి వేస్తోంది"


"పిల్లలు ఫారిన్ లో ఉన్నారు. ఎక్కడో హాయిగానే ఉంటారు. వారి గురించి బెంగ పడడం మానెయ్యండి" అంది సావిత్రి.


"ఇలాంటి దౌర్భాగ్యుల్ని కన్న తల్లి దండ్రులు మనం ముందు జన్మలో ఏదో పాపం చేసి ఉంటాము. అందుకే మనకీ శిక్ష విధించాడు దేవుడు."


"అలాంటి మాటలు అనకండి. విశ్రాంతి తీసుకోండి" సావిత్రి అనునయింపుగా ఓదార్చింది.


కొన్ని రోజుల తరువాత అనారోగ్య సమస్యలు కారణంగా సావిత్రి గూడా పరంధామయ్య ను ఒంటరి వాడ్ని చేసి వదలి వెళ్ళిపోయింది. సావిత్రి లేని లోటు పరంధామయ్య ను చాలా కృంగ దీసింది. కనీసం బాధల్ని చెప్పుకోవడానికి గూడా ఎవరూ లేరు. ఈ లోకంలో జన సంబంధాలన్నీ ధన సంబంధాలేనా?


ప్రైవేటు వుద్యోగం లో రిటైర్ అయిన తనకి రెండు వేల రూపాయలు ఫామిలీ పెన్సన్ తప్ప ఇంకో ఆదాయం లేదు. ఇప్పుడు తనకు ఆ ఇల్లు తప్ప దిక్కు ఎవ్వరూ లేరు. సావిత్రి పోయి నప్పటి నుండీ ఎంతో కాలంగా తన ఇంటిలో పని చేస్తున్న రాజమ్మ ఇంటి పనులు చేసి వెడుతుంది. ‌ నిస్సారమైన తన జీవితం ఇలా ముగుస్తుందని అనుకోలేదు పరంధామయ్య. ************************************************************************************

ఇప్పుడు ఆ ఇంటిలో పరంధామయ్య ఒక్కరే! అనుబంధాలు, ఆప్యాయతలు లేని ఆ ఇల్లు కళా విహీనంగా ఉంది. ఇంటి నిండా బూజు, అక్కడక్కడా ఎలుకలు, దోమలు బొద్దింకలు పారాడుతున్నాయి. ‌ దుమ్ము ధూళితో నిండి పోయిన ఒక టీవీ, ప్రక్కనే ఒక చార్జింగ్ లేక ఆగి పోయిన పాత మొబైల్ ఫోన్. కీ ఇవ్వని టేబుల్ క్లాక్ ముళ్ళు తిరగడం ఎప్పుడో మానేశాయి. ‌ తెల్ల వారింది. రాత్రంతా ఆలోచనలతో సతమతమై పోయిన పరంధామయ్య ఇంకా లేవనే లేదు. ‌ ఇంటి పని చెయ్యడానికి ఉదయం రాజమ్మ వచ్చింది.


"అయ్యగారూ!"


కళ్ళు తేల వేసి, నోటి నుండి బురుగు తో తల వాల్చేసిన పరంధామయ్య ను చూసి పని మనిషి రాజమ్మ భయ పడింది. యాభై ఏళ్ళుగా అదే ఇంటిలో జీవచ్చవంలా బ్రతికిన పరంధామయ్య పార్థివ శరీరాన్ని పట్టుకొని చిన్న పిల్లలా ఏడుస్తోంది రాజమ్మ. ***********************************************************************************

వారణాసి భానుమూర్తి రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

వారణాసి భానుమూర్తి రావు గారు ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె లో జన్మించాడు. అతను వృత్తిరీత్యా కార్పొరేట్ కంపెనీలల్లో ముఖ్య ఆర్థిక కార్య నిర్వహణాధికారిగా పనిచేసాడు. ప్రవృత్తి రీత్యా కథలు , వచన కవితలు రాస్తున్నాడు. ఇప్పటికి అతను 60 కథానికలు, 600 దాకా వచన కవితలు రాశాడు. అతని కథలు ఆంధ్ర జ్యోతి , విజేత , ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో 1981 లో 'జీవన గతులు ' అనే కథ అచ్చయ్యింది. తరువాత ' ఈ దేశం ఏమై పోతోంది? ' అనే అదివారం ఆంధ్రప్రభ దిన పత్రిక లో అచ్చయ్యింది. ఆంధ్ర జ్యోతిలో పది కథలు దాకా అచ్చయ్యాయి. నల్లటి నిజం , జన్మ భూమి , అంతర్యుద్ధం , వాన దేముడా! లాంటి కథలు అచ్చు అయ్యాయి. 2000లో "*సాగర మథనం* ", 2005 లో " *సముద్ర ఘోష*" అనే కవిత సంపుటిలను ప్రచురించాడు. అందులో "సముద్ర ఘోష" పుస్తకాన్ని అక్కినేని నాగేశ్వర రావు గారికి అంకితం చేశారు. ఈ పుస్తకాన్ని జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి. నారాయణ రెడ్డి విడుదల చేసారు. అతను రాసిన కథ "పెద్ద కొడుకు" ( రాయల సీమ రైతు బిడ్డ మీద కథాంశం) భావగీతి ప్రతిలిపి 2014 కథల పోటీలో ప్రతిలిపి ద్వారా ప్రత్యేక బహుమతి పొందింది.ఈ కథను 60000 మంది పాఠకులు చదివారు. 4500 మంది స్పందించారు.

వారణాసి భానుమూర్తి రావు రాయలసీమ వ్యవహారిక బాషలో వ్రాయడానికి ఇష్టపడతారు.ఇప్పుడు " రాచపల్లి కథలు " , " నాన్నకు జాబు " అని తమ చిన్ననాటి అనుభవాలన్నింటినీ అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు.‌ .అలాగే తన మొట్టమొదటి నవలా ప్రక్రియను " సంస్కార సమేత రెడ్డి నాయుడు " తెలుగు వారి కోసం వ్రాశారు .ఆ తరువాత '' వరూధిని - ప్రవరాఖ్య '' శృంగార ప్రబంధ కావ్యాన్ని తమ దైన శైలిలో నవలీ కరణ చేశారు . కరోనా పై వీరు రాసిన కవిత ఆంధ్ర ప్రభలో ప్రచురించారు. సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ ను కనబరచిన వీరికి సాహితీ భూషణ , ప్రతిలిపి కవితా ప్రపూర్ణ ,సహస్ర కవి రత్న అనే బిరుదులు లభించాయి.

వారణాసి భానుమూర్తి రావు గారు ఇటీవల అనగా ఏప్రిల్‌ నెల 2022 లో రెండు పుస్తకాలు పాఠక లోకానికి అందించారు. 1. *మట్టి వేదం* కవితా సంపుటి 2. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* తెలుగు నవల . గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ వారిచే సాహిత్య రంగంలో విశేష మైన సేవలు చేసినందుకు గానూ , వీరి *మట్టి వేదం* కవితా సంపుటికి , *గిడుగు రామమూర్తి సాహిత్య పురస్కారం -2022* ని అందు కొన్నారు.

తెలుగు కవులు లో వారణాసి వారి కథలు రాయల సీమ గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో కలిగి వుంటాయి.చిత్తూరు జిల్లాకు చెందిన వారణాసి భానుమూర్తి గారి కథలు , కవితలు వివిధ ఆన్ లైన్‌ పత్రికలలో వచ్చాయి. త్వరలో మరి కొన్ని నవలలు , కథల సంపుటాలు , కవితా సంకలనాలు వెలువడుతున్నాయి.ఇంతవరకు మూడు కవితా సంపుటిలు , ఒక నవలను పాఠక లోకానికి అందించారు.

*వీరి ముద్రిత రచనలు* ------------------

1. *సాగర మథనం* : 2000 సంవత్సరంలో అవిష్కరించారు. డాక్టర్ గోపీ గారు , తెలుగు అకాడమీ ప్రధాన సంచాలకులు , ఈ కవితా సంపుటి మీద ముందు మాట వ్రాశారు.

2. *సముద్ర ఘోష*: 90 కవితలున్న ఈ కవితా సంపుటి 2005 సంవత్సరంలో జ్డానపీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు ( సినారె) అవిష్కరించారు. ఈ పుస్తకాన్ని , పద్మ విభూషణ్ డాక్టర్ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకిత మిచ్చారు .

3. *మట్టి వేదం* : 70 కవితలున్న ఈ కవితా సంకలనాన్ని 2022 ఏప్రిల్‌ నెల 17 వ తేదీ వెలువరించారు.‌ ఈ పుస్తకానికి కే రే జగదీష్ గారు , ప్రముఖ కవి , జర్నలిస్టు ముందు మాట వ్రాశారు

4. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* : ఇది రచయిత గారి తొలి నవలా ప్రక్రియ. ఈ నవల 17 ఏప్రిల్ 2022 నాడు అవిష్కరణ జరిగింది. ఈ నవల రాయల సీమ కక్షలు , ఫాక్షన్ ల మధ్య ఎలా రెండు కుటుంబాలు , రెండు గ్రామాలు నలిగి పొయ్యాయో తెలిపిన కథ. శ్రీమతి రాధికా ప్రసాద్ గారు ఈ నవలకు ముందు మాట వ్రాశారు. ఈ నవలకు ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 అందు కొన్నారు.

5. *పెద్ద కొడుకు* : 19 కథల సంపుటి. వారణాసి భానుమూర్తి రావు గారు వ్రాసిన కథల సంపుటి *పెద్ద కొడుకు* తుమ్మల పల్లి కళా క్షేత్రం , విజయ వాడ లో మల్లె తీగ వారు నిర్వహించిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు , ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చేర్ పర్సన్ , కళారత్న శ్రీ బిక్కి కృష్ణ , తదితరుల చేతుల మీదుగా 20.11.2022 తేదీన అవిష్కరించారు. ఇందులో 19 కథలు ఉన్నాయి. ప్రతి కథ ఆణి ముత్యమే. కళా రత్న శ్రీ బిక్కి కృష్ణ గారు ముందు మాట వ్రాసిన ఈ పెద్ద కొడుకు కథల సంపుటి మానవీయ విలువల్ని అనేక కోణాల్లో రచయిత స్పృశించారు. వారణాసి గారు ఈ " పెద్ద కొడుకు " కథల సంపుటిని పాఠక లోకానికి అందించారు. ఇందులోని కథలన్నీ ఆణి ముత్యాలే! సమాజానికి సందేశ మిచ్చే కథలే!

*అముద్రిత రచనలు*

1 . *వరూధిని ప్రవరాఖ్య* : అల్లసాని పెద్దన గారి మను చరిత్రము నవలీ కరణ చేశారు‌. ఇది ఇంకా అముద్రితము.త్వరలో ప్రచురణకు వస్తుంది.

2 .*రాచ పల్లి కథలు* : తన చిన్న నాటి అనుభూతుల్ని , గ్రామీణ ప్రాంతాల్లో తను గడిపిన అనుభవాల్ని క్రోడీకరించి వ్రాసిన కథానికలు . త్వరలో ప్రచురణకు వస్తుంది.

3 . *నాలుగవ కవితా సంపుటి* త్వరలో వస్తుంది.

4 . *నాయనకు జాబు* అనే ధారావాహిక ఇప్పుడు వ్రాస్తున్నారు. లేఖా సాహిత్యం ద్వారా కథను వాస్తవిక సంఘటనలతో చెప్పడం ఈ జాబుల ప్రత్యేకత.

*విద్యాభ్యాసం* -----------

వారణాసి భానుమూర్తి గారి విద్యాభ్యాసం అంతా చిత్తూరు జిల్లాలో జరిగినది.

ఐదవ తరగతి వరకూ ప్రాధమిక పాఠశాల మహల్ లో , తరువాత ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకూ మహల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగింది. ఆ తరువాత తొమ్మిది , పది తరగతులు మేడికుర్తి కలికిరి చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల లో చదివారు.‌ ఇంటర్మీడియట్ మరియు బి కాం బీ.టీ కాలేజీలో చదివారు.‌ తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఎస్ వీ యూనివర్సిటీ లో చదివారు.‌ వుద్యోగ నిమిత్తం హైదరాబాదు వెళ్ళిన తరువాత అక్కడ కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అక్కౌంటన్సీ ( FCMA) చేశారు.‌ ప్రొఫెషనల్ అక్కౌంట్స్ లో నిష్ణాతులయ్యారు.

*వృత్తి* ------

వారణాసి భానుమూర్తి గారు అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ జనరల్ మేనేజర్ గా వివిధ కార్పోరేట్ కంపెనీలల్లో పని చేశారు. హైదరాబాదు మహా నగర మంచి నీటి సరఫరా మరియు మురుగు నీటి సంస్థలో చీఫ్ జనరల్ మేనేజర్ (అక్కౌంట్స్) గా పని చేశారు.ఒక పేరు పొందిన నిర్మాణ సంస్థలో సీనియర్ జనరల్ మేనేజర్ (అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ ) గా పని చేసి వివిధ బాధ్యతలను 36 సంవత్సరాల పాటు నిర్వర్తించారు. కాస్ట్ అక్కౌంట్స్ హైదరాబాదు చాప్టర్ కి వైస్ చేర్మన్ హోదాలో బాధ్యతలను నిర్వర్తించారు.

వృత్తి ఏమైనప్పటికీ , ప్రవృత్తిగా కవిగా , రచయితగా రాణించారు. పదవ తరగతి నుండీ కవితలు , కథానికలు వ్రాశారు.ఇతని కథలు , కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‌

ఇతనికి ఇంత వరకు లభించిన బిరుదులు; 1. ప్రతిలిపి కవితా ప్రపూర్ణ 2. సహస్ర కవి రత్న 3. సాహితీ భూషణ 4. గిడుగు రామమూర్తి వారి సాహిత్య పురస్కారం 2022 లో. 5. ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 6. కళావేదిక వారి సాహితీ పురస్కారం 31.12.2022 న అందుకొన్నారు.



71 views4 comments

4 Comments


@varanasikathalukavitalu4849 • 53 minutes ago

కథ ఏటా బాగుంది అంటే చెప్పలేను. ఒక్క ఉదుటున వినేసాను. ఎటొచ్చి చివర అశ జ్యోతి చూడాలని ఎదురు చూసా. కానీ, ఆ మహానుభావుడు ఒంటిరిగానే ఉంటూ దేహం విడిచాడు. ఇలాంటిది కూడా జరిగింది అని చెప్పే విధానం అదిరింది. Abhinandanu, ధన్యవాదములు.ఏ రాఘవేంద్ర రావు, గ్లెన్ అల్లెన్, Virginia, America...

Like

వృద్ధుడిచరమాంకదశను కనులకు గట్టించి మనసుకదిలించె నహోవార్ధక్యమందునెదురౌసహజ స్థితి గతులు,కుటుంబ సభ్యులతీరున్గడచినకాలము,పొందినఅనుభవములు జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చెన్అతి సహజమొప్ప,వృద్ధుని స్వగతము వినిపించెను 'వారణాసి'చెవులూరగనున్!వృద్ధుని మనోగతాన్ని బహు చక్కగా ఆవిష్కరించి న రచయిత శ్రీ వారణాసి భానుమూర్తి రావు గారికిహార్దిక అభినందనలు. శుభాకాంక్షలు!చింతలచెరువు మోహనరావు.సికింద్రాబాద్.

Like

@varanasikathalukavitalu4849 • 2 hours ago

ధన్యవాదములు

Like

@seshagirirao9527 • 49 minutes ago

A practical story. Super to hear the language.

Like
bottom of page