top of page
Original.png

వ్యసనం ఖరీదు

#PallaVenkataRamarao, #పల్లావెంకటరామారావు, #VyasanamKhareedu, #వ్యసనంఖరీదు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Vyasanam Khareedu - New Telugu Story Written By - Palla Venkata Ramarao

Published In manatelugukathalu.com On 22/01/2026

వ్యసనం ఖరీదు - తెలుగు కథ

రచన: పల్లా వెంకట రామారావు

మోహన్ మాస్టారుకు వారం రోజులుగా మనసులో ఒక అనుమానం పీడిస్తూ వుంది. సమస్య ఏమిటంటే పదవ తరగతిలో ముగ్గురు విద్యార్థుల ప్రవర్తన అనుమానాస్పదంగా వుంది. మల్లెష్, రాజా, ప్రభాకర్లు ముగ్గురూ ప్రతిరోజూ ఇంటర్వెల్లో పాఠశాల ఆవరణలో కాస్తదూరంగా పాడుబడిన క్లాసుల దగ్గరికి వెళ్తున్నారు. మూత్రవిసర్జనకైతే ఎక్కడికెళ్ళే అవసరం లేదు. విద్యార్థులకు కావలసిన మరుగుదొడ్లు వున్నాయి. ఆడుకోవడానికి గ్రౌండ్ వుంది. మరేదో కారణం వుంది. వారం క్రిందట యథాలాపంగా వారిని గమనించాడు మోహన్. అప్పటినుంచి నిఘా పెట్టాడు. 


ఏం చేస్తున్నారు వీళ్ళు? తను అక్కడికి వెళ్ళిచూడటం బాగుండదు. చివరికి క్లాసులో ఒక బుద్దిమంతుడిని పిలిచి వారు వెళ్ళిన మరునిమిషానికి వాడిని రహస్యంగా పంపాడు. అక్కడికి వెళ్ళినవాడు ‘ఆముగ్గురు ప్రతిరోజూ అక్కడికిచేరి సిగరెట్లు తాగుతున్నారు’ అని చెప్పాడు. మోహన్ గుండె కలుక్కుమంది. ఇదివరకటి రోజుల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు కనుక ఇలాంటి అల్లరి చేష్టలు చేస్తే కొట్టి తిట్టి దారిలో పెట్టేవారు. ఇప్పుడా అవకాశం లేదు. పిల్లలు సున్నితంగా వున్నారు. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. 


ప్రభుత్వ విధానాల ప్రకారం కూడా పిల్లల్ని కొట్టడం, తిట్టడం నేరం. ఏ చిన్న పొరపాటు జరిగినా టీచర్ని నేరస్తున్ని చేస్తారు. పోనీ వారి తల్లిదండ్రులను పిలిచి విషయం చెబుదామంటే వారు ఎలా స్పందిస్తారో తెలియదు. కొంతమంది తల్లిదండ్రులు "మా పిల్లలు ఇలాంటివారా? మా పిల్లలు మంచివారు. తప్పు చేయరు" అంటూ ఎదురు తిరిగి మాట్లాడే వారు ఉంటారు. మరి ఇలాంటి సమయంలొ ఏం చేయాలి? ఇతర దేశాల్లో పిల్లల మానసిక సమస్యల పరిష్కారానికి కౌన్సిలర్లు ఉంటారు. ఇక్కడ ఆ పని ఉపాధ్యాయడే చేయాలి. ఈ విషయంలో తొందరపడకుండా బుద్ధినేర్పాలి అనుకున్నాడు మోహన్.


 మరుసటి రోజు క్లాసుకు వచ్చాడు మోహన్. కాసేపు పాఠం లో ఏదో సందర్భం వచ్చి ఒక విద్యార్థి "సార్! మీరు చదువుకునేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండేవి?" అని అడిగాడు. మోహన్ ఇదే సరైన సమయం అనుకున్నాడు. "మీకు అప్పటి పరిస్థితులకు సంబంధించి ఒక కథ లాగా జరిగిన నిజమైన సంఘటనలు చెబుతాను వినండి" అన్నాడు. నిజానికి అవి మోహన్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలే.


 విద్యార్థులంతా పుస్తకాలు మూసి ఆసక్తిగా అతని వైపు చూశారు.

 “నేను పదవ తరగతి చదివే రోజుల్లో నలుగురు స్నేహితులం ఒక జట్టుగా ఉండేవాళ్ళం. నేను, ప్రసాదు, రమేష్, చంద్ర. నేను, రమేష్ చదువులో మొదటిస్థానం కోసం పోటీ పడేవాళ్ళం. చంద్ర, ప్రసాదు సాధారణ మార్కులు తెచ్చుకునేవారు. వారికి చదువు పైన అంతగా ఆసక్తి ఉండేది కాదు. అయితే కొన్ని విషయాలు వారు ముగ్గురు నాతో చెప్పేవారు కాదు. ఎందుకంటే నేను అమాయకున్ని అని, పుస్తకాలు తప్ప వేరే లౌకిక జ్ఞానం లేదని, ఇతర విషయాల్లో నాకంటే వారే ఎక్కువ అని భావించేవారు. 


సాధారణంగా మేము ఇంటర్వెల్లో గానీ, మధ్యాహ్నం భోంచేసిన తర్వాత గానీ ఆటలు ఆడుకునేవాళ్ళం. అలాంటిది కొద్దిరోజులు వారు ఆ సమయాల్లో నాకు కనిపించడం మానేశారు. నేను ఎక్కడికెళ్తున్నారని ప్రశ్నిస్తే నవ్వేవారు, లేదా ఏదో కారణం చెప్పేవారు. నాకు అనుమానం వచ్చి ఆరా తీయాలని నిర్ణయించుకున్నా. ఒకరోజు బెల్ కొట్టాక వారికి తెలియకుండా అనుసరించి వెళ్ళా. మా బడి చాలా పాతది. పాఠశాల ఆవరణలో పాడుబడ్డ గదులున్నాయి. వీరు అక్కడికే వెళ్తున్నారు. నేనూ రహస్యంగా వెళ్ళి చూద్దును కదా ముగ్గురూ సిగిరెట్లు తాగుతున్నారు.


నాకు ఆశ్చర్యము,ఆవేశమూ కలిగాయి.దగ్గరికెళ్ళి “ఏంట్రా మీరు చేస్తున్న పని?” అని అడిగాను.

వారు దాన్ని తేలిగ్గా తీసుకుని “రేయ్! మనమిప్పుడు పెద్దవాళ్ళం అవుతున్నాం రా! ఇలాంటి థ్రిల్ వుండే పనులు చేయాలి” అన్నారు.


నేను "మీమొహం" అంటూ వారిని తిట్టాను. వారు బ్రతిమాలి ఎవరికీ ఈ విషయం చెప్పొద్దన్నారు. ఎంతైనా మిత్రులు కదా! నేనూ ఎవరికీ చెప్పలేదు.


తర్వాత వారు సిగిరెట్లతోనే ఆగలేదు. మరికొన్ని వ్యసనాలు నేర్చుకున్నారు. ఆ మత్తులో పడి పబ్లిక్ పరీక్షలు సరిగా రాయలేకపోయారు. నేను స్కూలు ఫస్టు వచ్చాను. మునుపు నాతో పోటీ పడే రమేష్ ఇప్పుడు ఎలాగో గట్టెక్కి అత్తెసరు మార్కులతో పాసయ్యాడు. ప్రసాదు, చంద్రలు పరీక్షలు తప్పారు. దాంతో వారి తల్లిదండ్రులు వారిని చదువు మాన్పించి పనిలో పెట్టారు. వీరికి కూడా చదువు కంటే అదే నయమనిపించింది.


నేనూ రమేష్ కాలేజీలో చేరాం. అయినా రమేష్ వారి సహవాసం మానలేదు. సమయం దొరికినపుడల్లా వారితోనే తిరిగేవాడు. ప్రసాదు, చంద్ర సంపాదించిన డబ్బుని వ్యసనాలపై ఖర్చు చేసేవారు. రమేష్ కూడా తండ్రికి మాయమాటలు చెప్పి డబ్బు తీసుకెళ్ళి వారితో కలిసేవాడు. ఆ తాత్కాలిక ఆనందమే జీవితపరమావధిగా భావించేవారు.


నేను ఇంటర్ మంచిమార్కులతో పాసయ్యాను. రమేష్ పరీక్ష తప్పి, తరువాత సంవత్సరం పాసయ్యాడు.నాకంటే వెనుకబడ్డాడు. తర్వాత నేను డిగ్రీ పాసయ్యి, టీచర్ ట్రైనింగ్ చేసి, ఆ వెంటనే ఉద్యోగం సంపాదించాను. రమేష్ డిగ్రీ కూడా డింకీలు కొట్టి, ఎలాగో పాసయ్యాడు.ఆ పై చదవలేక ఎవరో సాయం చేయగా, చిన్న ప్రయివేటు ఉద్యోగంలో చేరాడు. సిగిరెట్లు, మద్యం, గుట్కా ఇతర వ్యసనాల వల్ల వారి ఆదాయం ఎప్పటికప్పుడు ఖర్చయిపోయేది.


ప్రసాదు తల్లిదండ్రులు ఒక మాదిరి ధనవంతులు. వీడి పరిస్థితి చూసి, ఈడు రాగానే వాడికి పెళ్ళి చేశారు. ఇవ్వాల్సిన భాగం ఇచ్చేసి వేరు కాపురం పెట్టించారు. మొదట వాడు ఒక బట్టలకొట్టు పెట్టి బాగానే ఉండేవాడు. వ్యసనాల వల్ల కొంతకాలానికి అప్పులపాలయ్యాడు. షాపు అమ్మి, అప్పులు కట్టేసి, తానే ఒకరి వద్ద గుమస్తాగా చేరి, బ్రతుకుబండి లాగిస్తున్నాడు.


చంద్ర తల్లిదండ్రులు పేదవారు. చంద్ర పని చేసి డబ్బు గడించినా వ్యసనాల వల్ల సాధారణజీవితం గడపడానికే ఇబ్బంది పడేవాడు. అందరి దగ్గరా చేయి చాచి అప్పులు చేసి బతికేవాడు. నా వద్ద కూడా ఎన్నోసార్లు డబ్బులు తీసుకున్నాడు. తిరిగి ఇచ్చేవాడు కాదు. నేను కూడా వాడి పరిస్థితి గమనించి అడగలేకపోయేవాడిని. చాలా కష్టం మీద పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. రోజూ ఇంటి డాబా పైన పడుకోవడం వాడికి అలవాటు. అలా పడుకున్నవాడు ఒకరోజు తాగిన మత్తులో పైనుంచి కింద పడి చనిపోయాడు. నలభై ఏళ్ల వయసులోనే జీవితం ముగించాడు. వాడు పోయిన తర్వాత చిన్న పిల్లలతో ఇప్పుడు వాడి భార్య పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు.


రమేష్ చేసేది చిన్న ఉద్యోగమైనా బ్రతకడానికి సరిపడా జీతం వచ్చేది. అయితే అతడు ఉన్న వ్యసనాలను వదులుకోక పోగా కొత్త వ్యసనాలను నేర్చుకున్నాడు. వాటి వల్ల నయం కాని భయంకరమైన జబ్బు వచ్చి ముప్ఫయ్యేళ్ళ వయసు లోపే చనిపోయాడు.

చూశారా! చిన్న దురలవాటు నుంచి మొదలయ్యి, థ్రిల్ చాల్లేదని వాటిని పెంచుకుంటూ పోయారు.ఆ తాత్కాలిక ఆనందమే జీవితం అనుకుని వారి బ్రతుకుల్ని నాశనం చేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి! ఇలాంటి జీవితాలను మీరు కోరుకుంటారా?" ప్రశ్నించాడు మోహన్.


 "లేదు.. లేదు.. పొరపాటున కూడా కోరుకోం" అడ్డంగా తలలూపారు విద్యార్థులంతా.


 వింటున్న మిత్రత్రయానికి గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. తాము ఇప్పుడు సరదా అనుకుంటున్నది భవిష్యత్తులో భయంకర భూతమై జీవితాలనే కబళిస్తుందని భయపడ్డారు. జీవితంలో ఇంకెప్పుడూ వ్యసనాల జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. వ్యసనానికి చెల్లించే మూల్యం తమ జీవితాలని వారికి అర్థం అయింది.

***************


పల్లా వెంకట రామారావు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు

Profile Link:


జన్మస్థలం:     ప్రొద్దుటూరు, కడప జిల్లా. 

జననం:         1974 

తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ

చదువు:        ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)

ఉద్యోగం:       స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) 

అభిరుచి:      సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్)  travel India telugu     

                    (యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)

రచనలు:  'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,

                   వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,

                   బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల

                   ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల

                   బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

 సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం

                    మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ      

                    కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా 

                    రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ 

                    వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page