వార్డు నెం. 3... మూడు రోజులు
- Ramana Bandhakavi

- 1 hour ago
- 7 min read
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారి ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.
వార్డు నెం 3 మూడు రోజులు, తెలుగు కథ, బంధకవి రమణ, కుటుంబ కథ, దాంపత్య ప్రేమ, భార్యాభర్తల అనుబంధం, ఆసుపత్రి కథ, భావోద్వేగ తెలుగు కథ, ఉగాది షడ్రుచులు, కుటుంబ విలువలు, తెలుగు సాహిత్యం, హృద్యమైన కథ, middle age love story Telugu, hospital emotional story, Telugu family story, Mana Telugu Kathalu

Ward No. 3 Mudu Rojulu - Telugu Emotional family Story | Ramana Bandhakavi
వార్డు నెం. 3... మూడు రోజులు - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | రమణ బంధకవి
Published in manatelugukathalu.com on 02/07/2026
ఉదయం ఏడు గంటలు.
"రాత్రంతా భరించాను... ఇక నా వల్ల కాదు." శారద మెల్లగా అంది.
ఆమె గొంతులో భయం లేదు. అలసట మాత్రమే ఉంది. శ్రీనివాసరావు ఒక్కమాటా మాట్లాడకుండా కారు స్టార్ట్ చేశాడు.
నిన్న సాయంత్రం వరకూ "ఇంకో రెండు రోజుల తర్వాత అడ్మిట్ అవుదాం" అన్న డాక్టర్, స్కాన్ రిపోర్టు చూసిన వెంటనే నిర్ణయం మార్చేశాడు.
"గాల్‌బ్లాడర్‌లో ఇన్‌ఫెక్షన్ పెరుగుతోంది. ఉదయం మొదటి కేసుగా ఆపరేషన్ చేద్దాం. ఆలస్యం మంచిది కాదు."
ఆ మూడు మాటలే రాత్రంతా అతని చెవుల్లో మోగాయి.
గాల్‌బ్లాడర్...
ఇన్‌ఫెక్షన్...
ఆపరేషన్...
నగరం అప్పుడే కళ్లు తెరుస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆగింది. కిటికీలోంచి బయటకు చూస్తూ శారద అడిగింది.
"తులసి మొక్కకి నీళ్లు పోశారా?"
"పోశాను."
"మీ షుగర్ మాత్ర వేసుకున్నారా?"
అతను చిరాకుగా చూశాడు.
"నువ్వు ఆపరేషన్‌కి వెళ్తున్నావా... నేనా?"
ఆమె చిన్నగా నవ్వింది. "ఇద్దరం."
ఆ ఒక్క మాటతో కారు లోపల మళ్లీ నిశ్శబ్దం అలముకుంది. సిగ్నల్ పచ్చగా మారింది. కారు ముందుకు కదిలింది.
ఆసుపత్రి పోర్టికోలో కారు ఆగగానే వార్డ్‌బాయ్ వీల్‌చైర్ తీసుకొచ్చాడు.
"నేను నడుస్తాను." అంది శారద.
"రూల్ మేడమ్." అన్నాడు నవ్వుతూ.
ఆమె అయిష్టంగా వీల్‌చైర్లో కూర్చుంది.
శ్రీనివాసరావు రిపోర్టులు, ఫైళ్లు తీసుకుని రిసెప్షన్‌కి వెళ్లాడు. అన్నీ సిద్ధంగానే ఉన్నాయి.
ఆధార్, ఇన్సూరెన్స్, స్కాన్ రిపోర్టు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు, ఏదీ మర్చిపోలేదు.
కానీ గుండెల్లో పేరుకున్న ఆందోళనను మాత్రం ఏ ఫైల్లో పెట్టాలో అతనికి తెలియలేదు.
"సార్... కన్సెంట్ ఫారం." నర్స్ పెన్నుతో పాటు కాగితం అందించింది.
పెద్ద అక్షరాల్లో ఆపరేషన్ పేరు:
'Routine Laparoscopic Cholecystectomy.'
కింద చిన్న అక్షరాల్లో అనుమతులు... జాగ్రత్తలు... ప్రమాదాలు.
బ్యాంకులో ముప్పై ఐదేళ్ల ఉద్యోగంలో వేలాది సంతకాలు చేశాడు. ఈ ఒక్క సంతకం పెట్టడానికి మాత్రం రెండు క్షణాలు పట్టింది. సంతకం చేసి పెన్ను జేబులో పెట్టుకున్నాడు.
"సార్..." నర్స్ నవ్వుతూ పిలిచింది.
"అది మా పెన్." అంది.
శ్రీనివాసరావు ఉలిక్కిపడి వెంటనే పెన్ను తీసి "సారీ" అని చెప్పి ఇచ్చాడు.
"పర్వాలేదు సార్." అని ఆమె నవ్వింది.
ఆ నవ్వు చూసి తన ఆందోళన ఎంత స్పష్టంగా బయటపడిందో అతనికే అర్థమైంది.
"శారదగారిని తీసుకెళ్తాం." అని నర్స్ చెప్పగానే ఆమె వీల్‌చైర్‌లో కూర్చుంది.
ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్లే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది.
"షుగర్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోవద్దు."
"ఇప్పుడూ దాని గురించేనా?" అతను విసుగ్గా అన్నాడు.
"మీకు మర్చిపోయే అలవాటు ఉందిగా."అంది.
నర్స్ వీల్‌చైర్‌ను లోపలికి తీసుకెళ్లింది. తలుపు నెమ్మదిగా మూసుకుంది.
బయట ఎర్రలైట్ వెలిగింది.
ఆపరేషన్ థియేటర్ కారిడార్లో ఉన్న కుర్చీలో శ్రీనివాసరావు కూర్చున్నాడు. గోడ మీద ఒక బోర్డు.
"నిశ్శబ్దాన్ని పాటించండి."
చూసి అతనికి నవ్వు వచ్చింది. ఆసుపత్రిలో నిశ్శబ్దాన్ని ఎవరు పాటిస్తారు?
ఆందోళనకు శబ్దం ఉండదు. అది మనసులోనే మాట్లాడుతుంది.
కొద్దిసేపటికి కాంటీన్ బాయ్ వచ్చాడు.
"టీ సార్?" అడిగాడు.
"ఒకటి ఇవ్వు" అన్నాడు.
కప్పు చేతిలోకి వచ్చింది. ఒక గుక్క తాగాడు. రుచి తెలియలేదు. కప్పు పక్కన పెట్టేశాడు.
అప్పుడే ఆపరేషన్ థియేటర్ తలుపు కదిలింది. అతను ఉలిక్కిపడి లేచాడు.
బయటికి వచ్చిన నర్స్ చిరునవ్వు నవ్వింది. "ఇంకా టైమ్ ఉంది సార్."
అతను మళ్లీ నెమ్మదిగా కుర్చీలో కూర్చున్నాడు.
గడియారం ముందుకు నడుస్తోంది. అతనికి మాత్రం కాలమే అక్కడ ఆగిపోయినట్టుంది.
ఇంతలో కారిడార్‌లో ఒక్కసారిగా సందడి మొదలైంది.
"అమ్మాయే పుట్టింది!" ఎవరో ఆనందంగా అరిచారు.
ఎదురుగా ఉన్న ప్రసూతి వార్డు తలుపు తెరుచుకుంది. చేతిలో స్వీట్ల పెట్టె పట్టుకుని ఓ యువకుడు బయటికి వచ్చాడు. ఎదురుపడిన ప్రతి ఒక్కరికీ లడ్డూ అందిస్తున్నాడు.
"అంకుల్... తీసుకోండి." అంటూ శ్రీనివాసరావు చేతిలో కూడా ఒకటి పెట్టాడు.
"అమ్మా... బిడ్డా ఇద్దరూ బాగున్నారు." అని చెబుతుంటే అతని గొంతు ఆనందంతో వణికిపోతోంది.
శ్రీనివాసరావు చేతిలోని లడ్డూను చూస్తూ ఉండిపోయాడు. ఒక్క చిన్న ముక్క నోట్లో వేసుకున్నాడు.
ఆ తీపి నాలుక మీద కరిగేలోపే... కాలం నలభై ఏళ్లు వెనక్కి నడిచింది.
విజయవాడ ప్రభుత్వాసుపత్రి.
మే నెల. ఎండలు మండిపోతున్నాయి.
ప్రసూతి వార్డు బయట వరండాలో శ్రీనివాసరావు ఆందోళనగా తిరుగుతున్నాడు.
కరెంటు లేదు. ఫ్యాన్లు ఆగిపోయాయి. చెమట చొక్కాను తడిపేస్తోంది.
అప్పుడప్పుడూ నర్స్ బయటికి వచ్చి ఎవరిదో పేరు పిలుస్తోంది. ప్రతి సారి అతని గుండె ఒక్కసారి బలంగా కొట్టుకుంటోంది.
చివరికి...
"శారద వాళ్ల బంధువులు ఎవరు?" అని పిలిచింది.
అతను ఒక్క గెంతులో ఆమె దగ్గరకు చేరుకున్నాడు.
"అభినందనలు..." అని నవ్వింది. "...అమ్మాయి." అంతే చెప్పింది.
ఆనందంతో బయటకు పరిగెత్తి ఆసుపత్రి గేటు దాటేసరికి ఎదురుగా చిన్న మిఠాయి దుకాణం కనిపించింది.
"లడ్డూలు ఇవ్వండి."
"ఎంత ఇమ్మన్నారు?"
జేబులో డబ్బులు లెక్కపెట్టాడు. నెలాఖరు. జీతం రావడానికి ఇంకా నాలుగు రోజులు ఉంది.
"ఆరు ఇవ్వండి."
దుకాణదారుడు ఆశ్చర్యంగా చూసినా ఏమీ అడగలేదు. ఆరు లడ్డూలు కాగితంలో చుట్టి ఇచ్చాడు.
ఒకటి వార్డ్‌బాయ్‌కు. ఒకటి నర్స్‌కు. ఒకటి తనతో వచ్చిన స్నేహితుడికి.
ఒకటి బయట ఎదురుచూస్తున్న బంధువుకి. ఒకటి తానే తిన్నాడు. ఇంకొకటి జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాడు.
ఆసుపత్రి నుంచి మళ్ళీ బయటికి వచ్చి ఎదురుగా ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీసులోకి వెళ్లాడు. ఎస్‌టిడీ బూత్‌లో గుంటూరులో ఉన్న అమ్మానాన్నలకు ఫోన్ చేశాడు.
"అమ్మాయి పుట్టింది" అని చెప్పగానే అవతల కాసేపు నిశ్శబ్దం. తర్వాత అమ్మ గొంతు వినిపించింది. "శారద, పాపాయి బావున్నారా? విశేషాలు చెప్పి వెనక్కి వచ్చాడు.
"సాయంత్రం వార్డులోకి వెళ్లేసరికి శారద అలసటగా పడుకుంది. పక్కనే ఊయలలో పాప. అతను నెమ్మదిగా పిలిచాడు.
"శారదా..."
ఆమె కళ్లు తెరిచింది.
మొదటి ప్రశ్న- "పాప?"
"చాలా బాగుంది."
"ఏడ్చిందా?"
"గట్టిగానే."
ఆమె కళ్లల్లో చిన్న వెలుగు మెరిసింది. అతను జేబులోంచి లడ్డూ తీసి చిన్న ముక్క విరిచి ఆమె చేతిలో పెట్టాడు.
"మీరు తిన్నారా?"
"తిన్నాను."
ఆమె నవ్వింది. చిన్న ముక్క విరిచి అతని నోట్లో పెట్టింది.
"ముందు మీరు తినండి."
కొద్దిసేపు పాప వైపు చూస్తూ మెల్లగా అంది-
"ఈరోజు మీరు కూడా పుట్టారు."
"టీ... కాఫీ..."
కాంటీన్ బాయ్ స్వరం అతన్ని మళ్లీ వర్తమానంలోకి తీసుకొచ్చింది.
నోటిలోని లడ్డూ ఎప్పుడో అయిపోయింది. రుచి మాత్రం ఇంకా మిగిలే ఉంది.
పక్కనే కూర్చున్న వృద్ధ దంపతులు టిఫిన్ బాక్స్ తెరిచారు.
"చాలు... అంత తినొద్దు." అంది ఆవిడ.
"రెండు ఇడ్లీలు తింటే ఏం అవుతుంది?" అన్నాడాయన.
"డాక్టర్ ఒకటే తినమన్నాడు." అంది.
"ఆసుపత్రిలో కూడా నువ్వేనా డాక్టర్?"
చుట్టూ కూర్చున్నవాళ్ల ముఖాల్లో చిరునవ్వు మెరిసింది. శ్రీనివాసరావుకూ తెలియకుండానే నవ్వొచ్చింది.
శారద కూడా ఇక్కడ ఉంటే... "మీకు షుగర్ ఉంది." అంటూ ఇలాగే చేసేదేమో.
ఆ ఆలోచనతో ఆమె బ్యాగ్ తెరిచాడు. లోపల చిన్న చిన్న కవర్లు. వాటిలో టాబ్లెట్స్. ఒక్కో దానిమీద ఆమె చేతిరాత.
"శ్రీను – ఉదయం."
"మధ్యాహ్నం."
"రాత్రి."
పక్కనే షుగర్-ఫ్రీ సాచెట్లు. కళ్లజోడు తుడుచుకునే గుడ్డ. అతను ఒక్క క్షణం నిశ్చలంగా ఆ కవర్లనే చూస్తూ ఉండిపోయాడు.
నెమ్మదిగా బ్యాగ్ జిప్ మూసేశాడు.
శ్రీనివాసరావు ఎదురుగా వెలుగుతున్న ఎర్రలైట్ వైపు చూస్తూ కూర్చున్నాడు.
ఇంతలో మొబైల్ మోగింది.
అరవింద్.
"నాన్నా... అమ్మ ఎలా ఉంది?"
"ఇంకా లోపలే ఉంది."
కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడలేదు.
"నాన్నా... నేను బయలుదేరి రావాలా?"
"వద్దురా."
"ఎందుకు?"
"డాక్టర్ రొటీన్ సర్జరీ అంటున్నాడు."
అవతల నుంచి వెంటనే సమాధానం వచ్చింది.
"రొటీన్ అయినా... అమ్మే కదా."
ఆ మాటతో శ్రీనివాసరావు గొంతు బిగుసుకుంది.
"ఉగాదికి మేమంతా వస్తున్నాం నాన్న."
"మంచిది."
"ఈసారి మాత్రం మీరు మాతో వచ్చేయాలి...తప్పించుకోకండి."
"ముందు నువ్వు రా." అని ఫోన్ పెట్టేశాడు.
అతని పెదవుల మీద చిన్న నవ్వు మెరిసింది.
ఎంత దూరంలో ఉన్నా... పిల్లలు పెద్దవాళ్లు కారనిపించింది.
"సార్..." పక్కనే కూర్చున్న వృద్ధుడు పిలిచాడు.
"వాటర్ బాటిల్ ఇస్తారా?" శ్రీనివాసరావు అందించాడు.
"ధన్యవాదాలు." అని రెండు గుక్కలు తాగి మళ్లీ కూర్చున్నాడు.
"మీ ఆవిడా?" అని అడిగాడు.
"అవును." అన్నాడు శ్రీనివాసరావు.
"సర్జరీ?" అడిగాడు.
"అవును."
“ఓహో అలాగా...మా ఆవిడ ఐసీయూలో ఉంది."
"ఎన్ని రోజులైంది?" అడిగాడు.
"ఇవాళ పదో రోజు."
"ఇంటికి వెళ్తుంటారా?"
"అరగంట."
"అంతేనా?"
"స్నానం చేసి... బట్టలు మార్చుకుని... మళ్లీ వచ్చేస్తాను."
కొద్దిసేపు మౌనంగా కూర్చున్నాడు. తర్వాత నవ్వుతూ అన్నాడు.
"యాభై ఏళ్లుగా నన్ను వదలకుండా చూసుకుంది. ఇప్పుడు నేను ఎలా వదిలి వెళ్తాను?"
ఆ మాటలో బాధ లేదు. ప్రేమ మాత్రమే ఉంది.
అప్పుడే ఐసీయూ వైపు హడావిడి మొదలైంది.
నర్సులు.
డాక్టర్.
తలుపులు.
పరుగులు.
కారిడార్ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు. ఎదురుచూస్తున్న కుటుంబం ఆయన చుట్టూ చేరింది.
ఆయన మెల్లగా ఒక యువకుడి భుజం మీద చేయి వేశాడు.
అంతే. ఆ యువకుడు నేలమీద కూర్చుండిపోయాడు.
పక్కనే నిలబడ్డ మహిళ చేతుల్లో మొహం కప్పుకుంది.
నర్స్ మెల్లగా చెప్పింది.
"కొడుకు వస్తాడని... చివరి వరకూ ఎదురు చూశారు."
ఆ మాట వినగానే... శ్రీనివాసరావు మనసులో ఏదో కదిలింది.
చాలా ఏళ్ల క్రితం... రాజమండ్రి.
బ్యాంక్ వార్షిక తనిఖీలు నడుస్తున్నాయి. ఊరినుంచి మధ్యాహ్నం ఫోన్ వచ్చింది.
"నాన్నగారికి బాగా లేదు. వెంటనే బయలుదేరి రండి." అని.
"సాయంత్రం బయలుదేరుతాను." అన్నాడు.
తెల్లవారుజామున ఇంటికి చేరేసరికి...
ముందు గుమ్మం నిండా చెప్పులు. మధ్యగదిలో తెల్లని వస్త్రం మీద నాన్న.
అమ్మ వంటింటి గుమ్మం దగ్గర కూర్చుంది. తనను చూడగానే మెల్లగా అంది.
"రాత్రంతా 'శీను వస్తాడు... శీను వస్తాడు...' అంటూనే గడియారం వైపే చూస్తున్నారు."
అంతే.
ఆ మాట ఈన్నాళ్ల తర్వాత కూడా ఎందుకు గుండెల్లో అలాగే మిగిలిపోయిందో...
ఈరోజు అర్థమైంది.
ఆపరేషన్ థియేటర్ పైన ఉన్న రెడ్ లైట్ ఆరిపోయింది. థియేటర్ తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి.
డాక్టర్ మాస్క్ తీసుకుంటూ బయటికి వచ్చాడు.
శ్రీనివాస రావు కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
"సర్జరీ చాలా బాగా జరిగింది." అన్నాడు.
ఆ ఒక్క మాటతో శ్రీనివాసరావు గుండెల మీదున్న బరువు ఒక్కసారిగా దిగిపోయింది.
“కాసేపట్లో రూమ్ కి షిఫ్ట్ చేస్తాం” అని చెప్పి డాక్టర్ వెళ్లిపోయాడు.
శ్రీనివాసరావు నెమ్మదిగా కళ్లజోడు తీసి రుమాలుతో తుడిచాడు.
కొద్దిసేపటికి ఆపరేషన్ థియేటర్ తలుపు మళ్లీ తెరుచుకుంది.
నర్స్ స్ట్రెచర్ మీద శారదను తోసుకుంటూ బయటకు వచ్చింది.
తనకు మత్తు ఇంకా పూర్తిగా దిగలేదు. కళ్లుమూసే ఉన్నాయి.
చేతికి సెలైన్. ముక్కుకి ఆక్సిజన్ గొట్టం. స్ట్రెచర్ నెమ్మదిగా వార్డు వైపు కదిలింది.
శ్రీనివాసరావు దాని పక్కనే నడిచాడు.
మధ్యలో శారద కనురెప్పలు కదిలాయి. కళ్లు కొద్దిగా తెరిచింది. మసకగా అతని వైపు చూసింది.
బలహీనంగా నవ్వింది.
"ఏమండీ..." అంది.
అతను వెంటనే దగ్గరికి వంగాడు.
"ఏమైంది?"
"మాత్ర... వేసుకున్నారా?"
అతని గొంతు బిగుసుకుంది. "వేసుకున్నాను." అన్నాడు మెల్లగా.
ఆమె మళ్లీ కళ్లు మూసుకుంది. స్ట్రెచర్ ముందుకు కదులుతూనే ఉంది.
వార్డులోకి షిఫ్ట్ చేసిన తర్వాత నర్స్ డ్రిప్ సర్ది,
"మత్తు పూర్తిగా తగ్గేవరకు ఎక్కువ మాట్లాడనివ్వకండి." అని చెప్పి వెళ్లిపోయింది.
గదిలో నిశ్శబ్దం. మధ్య మధ్యలో శారద కళ్లు తెరుస్తోంది. అతను కుర్చీలో ఉన్నాడని చూసి మళ్లీ నిద్రలోకి జారుకుంటోంది.
ఒకసారి ఆమె చేయి దుప్పటి బయటకు వచ్చింది. శ్రీనివాసరావు మెల్లగా ఆ చేతిని దుప్పటి లోపల పెట్టాడు. ఆమె వేళ్లు అతని చేతిని క్షణం పట్టుకున్నాయి. వెంటనే వదిలేశాయి.
అది మత్తులో జరిగిన స్పర్శో... మనసులోంచి వచ్చిన స్పర్శో... అతనికి తెలియదు.
తెలుసుకోవాలనిపించలేదు.
కిటికీలోంచి సాయంత్రపు వెలుగు గదిలోకి జారుకొచ్చింది. బయట ఆసుపత్రి తన పరుగులో ఉంది.
ఈ చిన్న గదిలో మాత్రం తొలిసారిగా ప్రశాంతత నెమ్మదిగా చోటు చేసుకుంది.
సాయంత్రం ఫిజియోథెరపిస్ట్ వచ్చాడు.
"కొంచెం నడుద్దాం." అన్నాడు.
శారద మంచం మీద నుంచి నెమ్మదిగా లేచింది. మొదటి అడుగులోనే నొప్పితో ఆగిపోయింది.
శ్రీనివాసరావు వెంటనే దగ్గరకు వచ్చాడు.
"పోనీ వద్దు... తర్వాత నడుద్దాం." అన్నాడు కంగారుగా.
"ఇప్పుడే నడవాలి సార్." అన్నాడు ఫిజియోథెరపిస్ట్.
శారద భర్త భుజం మీద చేయి వేసింది. నెమ్మదిగా కారిడార్ చివరివరకు నడిచి వచ్చింది.
"చాలు." అంది.
"ఇంకో అడుగు." అన్నాడు శ్రీనివాసరావు. ఆమె నవ్వింది.
"మీరు డాక్టర్ ఎప్పుడయ్యారు?" అంది.
మరుసటి ఉదయం డాక్టర్ రౌండ్స్‌కి వచ్చాడు. రిపోర్టులు చూసి చిరునవ్వు నవ్వాడు.
"అంతా బాగుంది. ఈరోజు డిశ్చార్జ్."
శారద ముఖంలో చిన్న వెలుగు మెరిసింది. "ఇంటికి వెళ్తున్నామన్నమాట."
"అవును."
"అయితే త్వరగా పంపించండి డాక్టర్."
"ఇంకా రెండు రోజులు ఉంటే బాగుంటుంది." అన్నాడు.
"వద్దండీ... ఆసుపత్రిలో ఒక్కరోజు కూడా సంవత్సరం లాగానే ఉంటుంది." అంది శారద.
“అలాగే, ఈరోజే వెళ్ళవచ్చు. కానీ ఇంటి పనులు అవీ, రెండు వారాల దాకా చేయకూడదు” అని చెప్పి
డాక్టర్ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.
డిశ్చార్జ్ పేపర్లు తీసుకుని బయటకు వస్తుంటే ఆ వృద్ధ దంపతులు ఎదురుపడ్డారు.
"ఈరోజు డిశ్చార్జ్ చేశారా?" అడిగాడు పెద్దాయన.
"అవును."
"చాలా సంతోషం."
వీడ్కోలు చెప్పుకుని ఎవరి దారి వాళ్లు వెళ్లిపోయారు.
కారులో ఇంటికి చేరుకున్నారు. శ్రీనివాసరావు ఇంటి గేటు తెరిచాడు.
తులసి కోట అలాగే ఉంది. మల్లె తీగ కొత్త మొగ్గలు వేసింది.
శారద గుమ్మం దాటగానే ఒక్కసారి ఇల్లంతా చూసింది. "హమ్మయ్య..." అంది నెమ్మదిగా.
అది ఊరటో... సంతోషమో... శ్రీనివాసరావుకు అర్థం కాలేదు.
వంటగదిలోకి వెళ్లి రెండు కప్పుల టీ చేశాడు. ఒక కప్పు ఆమె చేతిలో పెట్టాడు.
ఒక గుక్క తాగి నవ్వింది. "చక్కెర కాస్త ఎక్కువైంది."
అతను చిన్నపిల్లాడిలా మొహం పెట్టాడు.
"పరవాలేదు."
"మొదటిసారి చేశారు కదా." అంది.
అప్పుడే అరవింద్ ఫోన్ చేశాడు.
"అమ్మా! ఉగాదికి టికెట్లు బుక్ చేసుకున్నాం."
"నిజమా?" అంది శారద నమ్మలేనట్టుగా.
"ఈసారి అందరం వస్తున్నాం." అన్నాడు అరవింద్.
శారద కళ్లల్లో అలసట ఒక్కసారిగా మాయమైంది.
"అయితే..." అని తనలోతానే లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టింది.
"బెల్లం కొనాలి..."
"చింతపండు సంగతి చూడాలి..."
"వేపపూలు ముందే తెప్పించాలి..."
కొద్దిసేపు ఆలోచించి అంది. "ఈసారి ఉగాది పచ్చడి నేను చేయలేను."
శ్రీనివాసరావు వెంటనే అన్నాడు.
"నేను చేస్తాను."
ఆమె నవ్వింది. "మీకు వచ్చా?"
"నువ్వు చెబితే చేస్తాను."
"సరే." అని తన బ్యాగ్ లోంచి చిన్న నోటుపుస్తకం తీసి అతని చేతిలో పెట్టింది.
"రాసుకోండి."
అతను పెన్ను తీసుకున్నాడు. ఆమె చెబుతోంది.
"బెల్లం..."
"చింతపండు..."
"మామిడికాయ..."
"వేపపూలు..."
“అరటి పళ్లు...”
“చెరుకు ముక్కలూ.”
అతని అన్నీ శ్రద్ధగా పుస్తకంలో రాశాడు.
“అన్ని రుచులు సరిగా రావాలి సుమా!” అంది.
“ప్రయత్నిస్తాను” అన్నాడు.
ఆమె ఒకసారి అతని వైపు చూసి నవ్వింది.
“నలభై ఏళ్ల పైచిలుకు జీవితం నేర్పిన రుచులు తలుచుకుంటే చాలు, అవే వస్తాయి” అంది.
శ్రీనివాసరావు కూడా నవ్వాడు.
నలభై ఏళ్లు అక్కర్లేదు, ఒక్కోసారి మూడు రోజులే చాలు అనుకున్నాడు.
కిటికీలోంచి వచ్చిన సాయంత్రపు గాలి నోటుపుస్తకం పేజీని మెల్లగా తిప్పింది.
***
రమణ బంధకవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రమణ బంధకవి
రమణ బంధకవి, ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు. సాహిత్యాభిలాష, తెలుగు మరియు ఆంగ్లంలో రచనాభిలాష కలిగినవారు. కథలు, కవితలు, నవలలు, అనువాద నవలలు వ్రాయడం హాబీ. ఇప్పటివరకు ముప్పై పైచిలుకు కథలు, ఎన్నో కవితలు, రెండు అనువాద నవలలు ప్రచురింపబడ్డాయి. రెండు స్వీయ నవలలు ప్రస్తుతం ప్రచురణలో ఉన్నాయి. ఒకటి 'సంచిక' వెబ్ మాగ్జైన్ వార పత్రికలో ధారావాహికగా వస్తోంది. ఇంకోటి 'ప్రతిలిపి' లో ధారావాహికగా వస్తోంది.






Comments