'Yadbhavam Tadbhavathi' written by Muralidhara Sarma Pathi
రచన : పతి మురళీధర శర్మ
మా ఇంటి ప్రక్కనే గోపాలరావు ఇల్లు. గోపాలరావూ,నేనూ స్నేహితులం. స్నేహితులం అనేకంటే ఒకే ఆఫీసులో పని చేస్తున్నవాళ్ళం అనొచ్చు. గోపాలరావు రెండు పోర్షన్ ల ఇల్లు కట్టేడు. ఒకటి తను ఉండడానికీ, రెండవది అద్దెకివ్వడానికీ. కాని అద్దెకొచ్చిన వాళ్లందరిలో ఏదో లోపం వెదికి చూసి ఇల్లు అద్దెకివ్వడానికి సంకోచించేవాడు. అలా అద్దెకు వచ్చేవాళ్ళు రావడం, గోపాలరావు తటపటాయించడం జరిగేవి. ఓ సారి ఓ కుటుంబం వచ్చింది అద్దెకు. " అన్ని విధాలా బాగుంది కదా ! ఆ కుటుంబం మంచిదే కదా ! మరెందుకు కాదన్నారు ? " అని గోపాలరావును అడిగేను. " చూడండి ఈశ్వరరావు గారూ ! అన్నీ బాగున్నాయి కానీ వాళ్ళ కుటుంబంలో ఓ పండు ముసలమ్మ ఉందటండీ. అతని తల్లట. ముసలి వాళ్ళుంటే ఎప్పుడూ ఏదో రోగమూ, రొష్టూ. ఆ తర్వాత హరీమనడం. ఇంత ఇల్లు కట్టి ఇంట్లో ఒకవేళ అలాంటి అశుభం జరుగుతుందేమోనని వాళ్లకు ఇల్లు అద్దెకివ్వలేదు." అని చెప్పేడు గోపాలరావు. దానికి నేను " కుటుంబం అన్న తర్వాత తల్లీ , తండ్రీ ముసలాళ్ళు కాకుండా ఎలా ఉంటారు? రేపు మనమూ అంతే కదండీ. మనందరికీ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆ గతి పట్టక తప్పదు. పుట్టిన వాళ్ళందరూ చావకుండా ఉంటారా చెప్పండి. " అని గోపాలరావుకు సర్ది చెప్పి ఆ కుటుంబానికి అతని ఇల్లు అద్దెకిప్పించేను. అద్దెకు ఇల్లు దొరకని వాళ్ళకో ఉడత సాయం చేసేనన్న సంతృప్తితో సంతోషిస్తూ. ఓ రెండు రోజుల తర్వాత ఉదయం పక్క మీదనుండి లేచేసరికి గోపాలరావు ఇంట్లోంచి ఏడుపులు వినపడ్డాయి. వెంటనే అటు పరుగెత్తేను. నా మనసు ఎదో కీడు శంకించింది. ఒకవేళ గోపాలరావు అన్నట్టు అద్దెకు దిగిన వాళ్ళ ముసలమ్మగాని పోయిందేమోనని. కానీ అక్కడకు వెళ్ళేక తెలిసిందేమిటంటే గోపాలరావు అమ్మగారు తెల్లవారుజామున గుండెపోటు వఛ్చి చనిపోయేరని. అప్పుడనిపించింది " యద్భావం తద్భవతి " అని ఊరికే అనలేదు పెద్దలు అని. అద్దెకు దిగిన బామ్మగారు మాత్రం ఎంచక్కా ఉన్నారు. ఇంతకీ ఫలశృతి ఏమిటంటే గోపాలరావు గారి అమ్మగారు పోయిన తిథీ, వార, నక్షత్రాలు మంచివి కావని తెలిసి అద్దెకు దిగిన వాళ్ళు కాస్తా ఖాళీ చేసి వెళ్ళిపోయేరు. గోపాలరావుకు కూడా ఇల్లు విడిచిపెట్టక తప్పదని తెలిసి అద్దెకు ఇంటికోసం వేటలో పడ్డాడు. మరి ఆయనకు ఇల్లు అద్దెకు ఇచ్చేవాళ్ళు ఎన్ని ఆలోచించాలో ? అందుకే పోనీలే పాపం అని మా ఇంట్లో ఉన్న ఓ చిన్న పోర్షన్ ఖాళీ చేసి గోపాలరావుకు అద్దెకిచ్చేను తాత్కాలికంగా. మన మనసులో ఎలాంటి భావన ఉంటే అలాంటి ఫలితాలే కనబడతాయని గోపాలరావుకు అనుభవంలోకి వచ్చింది. (ఈ నా కథ "స్వప్న" జూలై 2011 మాసపత్రికలో ప్రచురితమైంది.ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఇచ్చిన ధ్వనికి ప్రతిధ్వనిగా నేను పంపగా తే.26.02.1988 దీని ప్రసారితమైంది.)
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి
రచయిత పరిచయం :
పేరు : పతి.మురళీధర శర్మ ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా 2008 లో పదవీ విరమణ స్వస్థలం/నివాసం : విశాఖపట్నం రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. నా రచనలలోని వర్గాలు : కథలు, కథానికలు (చిన్న కథలు), బాలసాహిత్యం, కథలు, కవితలు, పద్యాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యాసాలు , పదరంగం (పజిల్స్), హాస్యోక్తులు (జోకులు) నాటికలు (42), సూక్తిముక్తావళి, చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలోనూ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోనూ ప్రసారితం “తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది. నా రచనలు ప్రచురితమైన పత్రికలు దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్ పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి, వాస్తవం (అమెరికా), ఆఫ్ ప్రింట్, తెలుగువేదిక, ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017 చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే 2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ, వర్ణనలకు ఉత్తమ పూరణ, ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు, నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం “ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు , కథల పోటీలలో ఒక కథకూ, ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం 2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ 2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం
Comentaris