top of page
Original.png

యుద్ధ ప్రభావం - ఆర్థిక సంక్షోభం


 

Yuddha Prabhavam Arthika Samkshobham - Telugu Article |R C Kumar

యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం - తెలుగు వ్యాసం | ఆర్ సి కుమార్

Published In manatelugukathalu.com On 22/03/2026


గెలుపు ఓటమిలతో నిమిత్తం లేకుండా యుద్ధంలో పాల్గొనే దేశాలన్నీ వినాశకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిందే అన్న సత్యాన్ని మరోసారి రుజువు చేసింది ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం.‌ మౌలిక సదుపాయాలు ధ్వంసమై, పర్యావరణం దెబ్బతిని, దేశాల అభివృద్ధి దశాబ్దాల పాటు వెనకబడిపోయింది. ఆయా ప్రాంతాల్లో సైనికులతో పాటు పౌరులు ప్రాణనష్టానికి గురై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు నేలకూలి విధ్వంసం సృష్టించిన ఈ యుద్ధం ఇంధన సంక్షోభానికి తెర తీసి దీర్ఘకాలిక ప్రభావంతో ప్రపంచ దేశాల ఆర్థిక సంక్షోభానికి ఆజ్యం పోసింది.‌ స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతూ, రోజుకు లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరైపోతోంది. 


మధ్యప్రాచ్యంలో ఇప్పటివరకు జరుగుతున్నది భూతల యుద్ధం కాదు. ఆకాశంలో జరిగే క్షిపణులు మరియు ద్రోణ్ ల యుద్ధం. ముందు ముందు ఇది ఏ రూపాన్ని సంతరించుకుంటుందో అన్న కలవరం అందరిలోనూ మొదలైంది. అంతకంతకు పెరుగుతున్న ఈ యుద్ధం ప్రత్యక్షంగా14 దేశాలపై, పరోక్షంగా యావత్ ప్రపంచంపై తన ప్రభావాన్ని చూపుతోంది.‌ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖుమైనీని తన అనుచరులతో సహా మట్టుపెట్టిన తర్వాత మూడు రోజుల్లో యుద్ధ లక్ష్యాన్ని నెరవేరుస్తానని భావించిన ట్రంప్ అంచనాలు తారు మారాయినవి.  అత్యున్నత స్థాయి సైనిక అధికారులను కోల్పోయి, కొన్ని ముఖ్యమైన గ్యాస్ క్షేత్రాలు, రిఫైనరీలు, సైనిక స్థావరాలు, క్షిపణి వ్యవస్థలు, వైమానిక, నౌకాదళ సామర్థ్యాలకు భారీ నష్టం కలిగినా ఇరాన్ మాత్రం అమెరికా, ఇజ్రాయిల్ పై తీవ్రంగా ప్రతిఘటన కొనసాగిస్తూనే ఉంది. 


భీకరంగా  కొనసాగుతున్న ఇరాన్‌ యుద్ధం యొక్క ముగింపు ఆనవాళ్లు కనుచూపుమేరలో కనబడడం లేదు.‌ యుద్ధ పరిణామాలు, ఇరాన్ ప్రతిఘటన సామర్థ్యాలను ముందుగా అంచనా వేయలేక ట్రంప్ ప్రభుత్వం చేజేతులా గందరగోళాన్ని సృష్టించుకొని, తన దేశంతో సహా ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టింది.‌ చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదని భావించి  విధిలేని స్థితిలో యుద్ధంలో ముందుకెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. హార్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ ఖర్చులు పెరిగాయి. ఆర్థిక మాంద్యం ముప్పుతో ఎన్నో దేశాలు సతమతమవుతున్నాయి. ఎవరిని ఉద్ధరించడానికి ఈ యుద్ధం మొదలయ్యింది అన్నది విషయంలో  అమెరికన్లతో సహా ప్రపంచ దేశాలకు విస్మయం కలిగించే విషయం.‌


లక్ష్యాలు ఏవైనా, సాధారణంగా అమెరికా తన చేతులకు మట్టి అంటకుండా యుద్ధాలు చేస్తుంది. కానీ ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ అమెరికాపై నేరుగా మిస్సైల్ దాడి చేయకున్నా,  వ్యూహాత్మకంగా గల్ఫ్ ప్రాంతంలోని ఆ దేశానికి సంబంధించిన సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలు, వారి  పెట్టుబడులతో స్థాపించిన పరిశ్రమలు, ఆయిల్ రిఫైనరీలు, మౌలిక సదుపాయాలపై భీకర దాడులు చేస్తుండడం వల్ల జరగవలసిన నష్టం ప్రత్యక్షంగా, పరోక్షంగా జరుగుతూనే ఉంది. పెరుగుతున్న చమురు ధరలు, పెరిగిన ద్రవ్యోల్బణం మరియు దేశీయ వినియోగదారుల అసహనంతో ఈ యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రతికూల ప్రభావాలను చూపుతోంది. అక్కడ ఇంధన ధరలు 30% నిత్యావసర వస్తువుల ధరలు 50% వరకు పెరిగాయి. 


ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించాలనే పరిమిత లక్ష్యం నుండి ప్రజా తిరుగుబాటు ద్వారా ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కూల్చివేసే అంతిమ లక్ష్యం వరకు ప్రయత్నాలు సాగుతాయని ఇజ్రాయిల్ మరియు అమెరికా ప్రభుత్వ నేతలు చెప్పుకొస్తున్నారు.‌ ఈ యుద్ధం వల్ల అమెరికా సేనలు ఇరాన్ వాయుసేన, నౌకాదళ సామర్థ్యాన్ని దెబ్బతీసి, వారి పోరాట శక్తిని కొంతమేర బలహీన పరచడం జరిగింది. కానీ ఇరాన్ లో అంతర్గత తిరుగుబాటుకు ప్రేరేపించాలనే ట్రంప్ వ్యూహం మాత్రం బెడిసి కొట్టింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాదాపుగా  విజయం సాధించినట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినప్పటికీ, ఇరాన్ ప్రతిఘటన యొక్క తీవ్రత, హర్ముజ్ జల సంధి మూసివేతల పై అవగాహనా రాహిత్యం,  అస్పష్టమైన యుద్ధ లక్ష్యాలు, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ పై ఇంధన ప్రభావం, మరియు స్పష్టమైన యుద్ధ విరమణ ప్రణాళికా  లోపం ట్రంప్ వైఫల్యాలకి సూచనగా విశ్లేషకులు భావిస్తున్నారు. 


అంతకంతకు పెరుగుతున్న యుద్ధం వలన ప్రపంచ దేశాలు తీవ్రమైన చమురు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. పరిస్థితి ఎంత విషమించిందంటే అమెరికాతో సహా అనేక దేశాలు ఎన్నడూ లేని విధంగా తమ వ్యూహాత్మక చమురు నిల్వలను (Strategic Petroleum Reserves) అత్యవసరంగా బయటకు తీయాల్సి వస్తోంది. అతి విశ్వాసంతో దూకుడు పెంచి ముందుకెళ్లిన ఇజ్రాయిల్ అమెరికాల ధీమా ఇప్పుడు వారికి, ప్రపంచ దేశాలకు శాపంగా మారింది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో రవాణా నిలిచిపోయి వాణిజ్యం స్తంభించి, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి.‌ ఈ భారాన్ని తగ్గించే మార్గం తెలియక అనేక దేశాలు ఇబ్బందుల పాలవుతున్నాయి.‌ హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.


యుద్ధాన్ని మేము మొదలు పెట్టలేదు కానీ ఆపేది మేమే అంటున్నారు ఇరాన్ ప్రభుత్వ నేతలు. అంతే కాదు తానో ఇజ్రాయెలో ఏదో ఒక దేశం మాత్రమే పశ్చిమాసియాలో ఉంటాయని చెప్తున్నారు. అమెరికా కూడా ఎప్పటికప్పుడు బలమైన హెచ్చరికలు జారీ చేస్తూ ఇరాన్ పై విరుచుకు పడుతూనే ఉంది. 86 ఏళ్ళ వృద్ధుడైన ఖమేనీని మట్టుపెట్టినా, అతని కంటే చురుకైన వాడు దృఢనిశ్చయం గలవాడు 57 ఏళ్ళ జూనియర్ ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా రావడంతో ఇరాన్ యుద్ధ స్వరూపమే మారిపోయింది. ఇరాన్ అగ్ర నాయకుడైన మోజ్తాబా ఖమేనీ గురించి సమాచారం ఇచ్చిన వారికి అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది కూడా. తమ విశ్వాసాలు దెబ్బతిన్న ఇరాన్ ప్రజలంతా ఏకతాటిపై నిలబడి కసిగా ఉన్నారు. ఇక్కడే కధ అడ్డం తిరిగి అమెరికా తల పట్టుకోవాల్సి వస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.


కారణాలు ఏవైనా యుద్ధాన్ని సాగదీయడం వల్ల ఆయా దేశాలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల పైకి ఎగబాకింది. దీనివల్ల  ప్రపంచవ్యాప్తంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ 93.50 గా రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయింది. సామాన్యుడిపై పడుతున్న ఆర్థిక భారం ద్రవ్యల్బణానికి దారితీస్తున్నది. మనదేశంలో ఇప్పటికే వంట గ్యాస్ కొరతతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. పెట్రోలియం నిల్వలు కూడా తరిగిపోయి కొరత ఏర్పడే ప్రమాదం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలతో సత్వర కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేసుకుంటోంది.‌ 


అమెరికా ఇజ్రాయిల్ ఉమ్మడి లక్ష్యం అణ్వాయుధాలను సృష్టించే ఇరాన్ సామర్థ్యాన్ని నిర్మూలించడం, సైనిక ఆయుధశాలను నాశనం చేయడం, హెజబుల్లా, హౌతి, గాజాల వంటి ఇరాన్ ప్రాక్సీల బెదిరింపు చర్యలను అరికట్టడం. మరీ ముఖ్యంగా ఇంధన నిల్వలతో సంపన్నంగా ఉన్న మధ్యప్రాచ్యంపై పూర్తిస్థాయిలో అధిపత్యాన్ని సాధించాలని పట్టుదలతో ఉన్న అమెరికాకు ఇరాన్ అడ్డుగా ఉండడం మింగుడు పడడం లేదు. ఈ లక్ష్యంతోనే ఇరాన్ ప్రజలు తమ ప్రభుత్వానికి ఎదురు తిరగాలని, అమెరికా చెప్పు చేతుల్లో ఉండే నాయకులను ఎన్నుకోవాలని నేరుగానే సూచించారు. దాన్ని బేఖాతరు చేసిన ఇరాన్ ప్రజలు, పాలకులు అమెరికాపై గెలవలేమని తెలిసినా, యుద్ధం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఈ యుద్ధంలో వారు గెలవలేకపోవచ్చు కానీ, ప్రత్యర్థులు భారీ మూల్యాన్ని చెల్లించేలా వారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా యుద్ధాన్ని మార్చాలన్నదే వారి వ్యూహంగా కనబడుతోంది. సందులో సడేమియా అన్నట్టుగా ఈ యుద్ధం ఇంధన నిల్వలున్న రష్యాను ఆర్థికంగా బలపరిచే పరిస్థితికి తీసుకొచ్చింది. అది అమెరికా ఊహించని మరొక ప్రతికూల పరిణామం. 

ఏది ఏమైనా సంబంధిత దేశాలు త్వరగా యుద్ధానికి ముగింపు పలికి ప్రపంచ శాంతిని నెలకొల్పుతారని భావిస్తూ ...


స్వస్తి 


ఆర్ సి కుమార్


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

war impact economy, oil crisis Telugu, inflation Telugu, global economy war, Iran Israel war impact, petrol price increase, economic crisis Telugu, Yuddha Prabhavam Arthika Samkshobham, యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం, R C Kumar, ఆర్ సి కుమార్


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page