విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ
'A To AA Part 2/3' New Telugu Story Written By Rathnakar Penumaka
'‘‘అ’’ నించి ‘‘ఆ’’ దాకా - పార్ట్ 2/3' పెద్ద కథ
రచన: రత్నాకర్ పెనుమాక
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
ఆనంద్, అన్నపూర్ణ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో క్లాస్ మేట్స్.
ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. మంచి స్నేహితులు.
ఇక ‘‘అ’’ నించి ‘‘ఆ’’ దాకా పార్ట్ 2 చదవండి.
మా పక్కింటి పచ్చిపాల గంగరాజు గారికి బోలెడు చేను, పాడి, గొడ్లు, గోదా ఉన్నాయి. అంత పెద్ద పాడిని, చేనుని చూసుకోడానికి సింహాచలం అనే కుర్రోణ్ణి కుదుర్చుకున్నారు. అతను గిరజాల జుట్టుతో నల్లగా, అందంగా, బలంగా కుదుమట్టంగా రాక్షసుడు సినిమాలో చిరంజీవిలా బండగా ఉన్నాడు.
అతనిని చిరంజీవితో ఎందుకు పోల్చానంటే అతను చిరంజీవికి పిచ్చ అభిమాని. ఎక్కడైనా ఫంక్షన్‌లలో చిరంజీవి పాటలు ఏస్తే అతను చిరంజీవింత గ్రేస్‌ఫుల్‌గా డాన్స్ చేత్తాడు. అందుకే అతను చిరంజీవి జూనియర్ లాగ కన్పించీవోడు నా కళ్ళకి!
అతనితో మా తమ్ముడు బాగా జతగా ఉండీవోడు. అన్నయ్యా, అన్నయ్యా! అని పిలుత్తా. అతను ఆ రోజు అన్నపూర్ణ ఫంక్షన్ రోజున చిరంజీవి యముడికి మొగుడు సినిమా పాటలకి డాన్సు చేత్తంటే అందరూ అతన్ని పొగట్టం, మా తమ్ముడి కెందుకో నచ్చలేదు.
మరుసటి రోజు నేను, మా తమ్ముడు పంచాయితీ ఆఫీసు దగ్గర కరెంట్ బిల్లు కట్టటానికి కెళ్ళినపుడు అడిగితే ఆడు చెప్పేడు. ‘‘నాకు చలం అన్నయ్యంటే ఇష్టమే కానీ, అతన్ని అనూ ఎదురుగా అందరూ పొగడటం నాకు నచ్చలేదు. అంతేకాదు అనూ ఆడి డాన్సు చూడటం కూడా నాకు నచ్చలేదు’’ అన్నాడు.
నాకు ఆడి సమాధానం చాలా ఇడ్డూరంగా అన్పించింది. ఎందుకంటే సింహాచలం నాతో అసలు మాట్లాడడు. మా తమ్ముడు మాత్రం రోజూ గంటల తరబడి చలంతో మాటాడతాడు. ఆఖరికి మొన్న చలం తను దాచుకున్న డబ్బులతో నందు గాడికి రబ్బరు బాలు కూడా కొనిచ్చేడు. అంత స్నేహం ఆళ్ళిద్దరికీ. కానీ ఎందుకో చలం అంటే ఇప్పడు ఈడికి నచ్చట్లేదు.
***
రవీంద్రకి క్రికెట్ పిచ్చి, అలా అని ఆడే పిచ్చికాదు, చూసే పిచ్చి. ఆడటానికి వొయసూ లేదు, టైమూ లేదు అతనికి. అసలు అతను టి. వి. కొన్నదే క్రికెట్ కోసం.
ఆ సంవత్సరం క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుంది. ఆ మేచ్‌లు లైవ్ చూడటానికే అంత అర్జంటుగా టి. వి. కొన్నాడు. నందుగాడు అనూ ఆళ్ళింటికి టి. వి. చూడటానికి ఎప్పుడెళ్ళినా ఆళ్ళన్నయ్య క్రికెట్ చూత్తండీవోడు. ఏదోకటిలే అని చూడటం మొదలెట్టిన నందు గాడికి మధ్య మధ్యలో వొచ్చే యాడ్స్ నచ్చేవి, ఆటి కోసమే మొదట్లో క్రికెట్ చూసీవోడు.
తర్వాత్తర్వాత యాడ్స్ కంటే క్రికెట్టే మజాగా ఉంటంది. ఆ మజా ఎంతవరకూ ఎళ్ళిందంటే ఇప్పుడు ఆడికి తెలియని క్రికెటర్ లేడు. అంతే కాదు కపిల్‌దేవ్ బౌలింగ్ అన్నా, గవాస్కర్ బ్యాంటింగ్ అన్నా, వెంగ్‌సర్కార్ కెప్టెన్సీ అన్నా పిచ్చి ఆడికి!
ఆడి పిచ్చికి పరాకాష్ట ఏంటంటే మా ఇంటికొచ్చే ఈనాడు పేపర్‌లో ఏసే క్రికెటర్ల ఫొటోలు కట్ చేసి ఒక నోట్‌బుక్‌లో అంటించీవోడు. ఇప్పుడు ఆడికున్న వ్యసనాలేంటంటే మొదటది అన్నపూర్ణ, రెండోది క్రికెట్.
ఆ రెండూ ఒకే చోట దొరకటం ఆడి అదృష్టం. అలా అని ఆడి క్రికెట్ పిచ్చి చూడటానికే పరిమితం కాలేదు. మా ఇంటి పక్కనుండే నాని గాడిని, బంటి గాడిని, చంటి గాడిని, సుబ్బు గాడిని ప్రక్క వీధిలో ఉండీ కుర్రాళ్ళని పోగేసి ఓ క్రికెట్ టీం తయారుచేసి బ్రహ్మాల వీధిలో వడ్రంగి పనిచేసీ పండూరి వీరబ్రహ్మం గారి దగ్గర పనస చెక్కతో బ్యాట్ చేయించుకుని, రబ్బరు బాల్‌తో ఆడీవోరు.
ముందు మా ఇంటి ముందున్న కొండేటి ప్రకాశం గారి దొడ్లో ఆట మొదలెట్టారు. అలా మొదలైన ఆళ్ళ ఆట ఇప్పుడు క్రికెట్ బేట్, టెన్నిస్ బాల్ దాకా ఎదిగింది.
ఆ టెన్నిస్ బాల్ సింహాచలం కొనిచ్చేడు ఈళ్ళకి. అలా అని అతనేమీ ఆడడు. అంత ఖాళీ ఎక్కడిది పాపం అతనికి!
***
అంతకు ముందు అన్నపూర్ణ వొచ్చి పాలు పోయించుకు ఎళ్ళీది. ఇప్పుడు సింహాచలం వొచ్చేక అతనే పాలు పట్టుకెళ్ళి పోసి వత్తన్నాడు. పాలు పట్టుకెళ్ళినప్పుడల్లా అన్నపూర్ణని చూత్తన్నాడు.
అందమైన మొఖం, త్రెడిరగ్ చేయించుకున్నట్టుండే కనుబొమలు, ఇవేవీ కాదు దమ్ముంటే నన్ను చూసి చూపు తిప్పగలరేమో ప్రయత్నించండి అన్నట్టుండే అందమైన కళ్ళు, మత్తెక్కించే ముంగురులు, నున్నటి చెంపలు, అన్నిటికంటే ముఖ్యంగా తను నవ్వినపుడు కనీ కనిపించని పన్ను మీద పన్ను, ముద్దులొలికే మెడ, తెలుపు, నలుపు కాని గోధుమ ఛాయ! ఎక్కడ ఏది ఎంత ఉంటే మగాడు పిచ్చెక్కి పోతాడో అక్కడ అంత ఉన్నటువంటి బిగువైన అంగసౌష్టవం!
ఇంతటి అందాన్ని అందుకోగలమా అన్నట్టుండే పొడవు. ఆ పొడవుకి తగ్గట్టే పొడవైన జడ, ఎత్తైన కొండలతో సయ్యాటలాడతా ‘‘రెండు కొండల’’ మధ్య నుంచి జాలు వారుతున్న సెలయేరులా!
మొదట్లో పట్టించుకోకుండా పాలు పోసేసి వొచ్చేసీ సింహాచలం దృష్టి ఆమెపై పడిరది.
అతను తననలా పరిశీలించటం అన్నపూర్ణ కూడా గమనించలేదు. కానీ అప్పుడే వొచ్చిన నందు గాడు గమనించేడు. చలం చూపులోని ఆంతర్యం ఆడికి పూర్తిగా అర్ధమైపోయింది. ఆడికి అర్ధమైందని ఈడికి అర్ధమై, చూపు తిప్పేసుకుని సీమండి పాలకేను తీసుకొని ఎళ్ళిపోయేడు. నందూకి ఆడి చూపు నచ్చలేదు. ఆడసలు నచ్చలేదు. ఆడిని ఆ ఇంటికి రానివ్వకూడదు అనుకున్నాడు కానీ ఈడేం చేయగలడు? పాపం ఆందోళన పడటం తప్ప.
***
ఓ రోజు సింహాచలం నందూని పిలిచి ‘‘ఏరా! తమ్ముడూ నాతో మాటాడటం లేదు? ఇసయమేంటి?’’ అనడిగేడు.
ఏమీ దాచుకోలేని మనస్తత్వం ఉన్న నందు కొత్తగా దాపరికం అలవాటు చేసుకున్నాడు. మళ్ళీ చలమే రెట్టించి ‘‘ఒరేయ్! తమ్ముడు ఓ మాట చెప్పనా? నాకు నువ్వు సాయం చేయాల్రా, చేత్తానంటే చెబుతాను ఉట్టినే వొద్దులేరా, నీకు క్రికెట్ బేట్, బాల్ కొనిపెడతాను సాయం చేత్తే, చేత్తావా’’ అనడిగేడు. సాయం చేయటం ఇష్టం లేకపోయినా బేట్ కోసమైనా చేత్తాడనే ధైర్యంతో!
ఆడేమి అడగబోతున్నాడో ఈడికి ముందే అర్ధమైంది. ఎందుకంటే సినిమాల నించి సంక్రమించిన జ్ఞానం అలాంటిది మరి!
అయినా అర్ధం కానట్టే మొఖమెట్టి ‘‘చెప్పు అన్నయ్యా కుదిరితే చేత్తాను’’ అన్నాడు.
‘‘అదేరా మీ అన్నపూర్ణ అక్కంటే నాకిష్టంరా, ఆమాటే తనకి చెప్పి ఈ గాజులు పట్టుకెళ్ళి ఇయ్యి. తను తీసుకుంటే తనకీ నేనంటే ఇష్టమున్నట్టు లేదంటే లేదు.
తను తీసుకున్నా తీసుకోపోయినా నీకు మాత్రం బేట్ కొనిత్తాను’’ అంటా ఎరవేసాడు.
కానీ ఆ మాట ఇనగానే ఎక్కడ లేని కోపం తన్నుకొచ్చీసింది ఆడికి. ‘‘నీ విషయం మా అమ్మతో చెబుతానుండు. ఇంకెప్పుడు నువ్వు నాతో మాటాడకు. నువ్విలాంటి ఎదవ్వని తెలియక నీతో స్నేహం చేసేను. పనికిమాలిన ఎదవ’’ అంటా ఆడి నోటికొచ్చిన తిట్లు తిట్టేసి కసి తీర్చుకున్నాడు.
కానీ ఆడి కసి పూర్తిగా తీరలేదు. అందుకే ఓ రోజు సింహాచలం, తనకి మొన్న సంక్రాంతికి ఆళ్ళ రైతు కొనిచ్చిన నీలం గళ్ళ చొక్కా, నల్ల ఫ్యాంట్ ఉతుక్కుని మా ఇంటి పక్కన దండెం మీద ఆరబెట్టుకుంటే, ఆ బట్టలకి దురద గుండాకు తెచ్చి మొత్తం బట్టల నిండా రాసేసి ఏమీ తెలీనట్టు దండెం మీద ఆరబెట్టేసేడు.
ఇది తెలియని చలం పాపం! ఆ బట్టలేసుకుని దురదొస్తుంటే బట్టలు తీసేసినా కూడా ఒళ్ళంతా పట్టేసినా నూగు, చారలు పడేలా గోక్కున్నా దురద తీరక ఆఖరికి గంగరాజు గారు చెబితే ఒళ్ళంతా అదేదో మందు రాసుకుని స్నానం చేత్తే కానీ దురద తీరలేదు. అప్పటికి కాని నందు గాడి కసి తీరలేదు. ఇది ఎవరు చేసేరో చలానికి ఎప్పటికీ తెలియలేదు. ఈ ఎపిసోడ్ మొత్తంలో అన్నపూర్ణకి ఒక్క ముక్క కూడా తెలియదు.
***
నందు గాడి క్రికెట్ పిచ్చి అనే అంటు వ్యాధి నాకూ కూడా అంటించేసేడు. ఆడంటించిన పిచ్చితో నేనూ రాఘవయ్య గారింటికెళ్ళి క్రికెట్ చూసీవోడిని.
ఓ రోజు రాఘవయ్య గారింట్లో వోళ్ళు ఎవరూ లేరని నందూతో కలిసి అన్నపూర్ణ ఆళ్ళింటికెళ్ళి క్రికెట్ చూత్తంటే నా చూపు అనుకోకుండానే అన్నపూర్ణపై పడింది. క్రీగంట గమనించేను. చూపు తిప్పుకోలేక పోయేను. అలా అని సినిమా హీరోయిన్లకుండే తెలుపు మెరుపు ఏమీ లేదు కానీ ఆమెలో ఏదో ఆకర్షణ, ఒకసారి చూత్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించీలా, అందుకే చూపు తిప్పుకోలేక పోయేను.
నా ఖర్మకొద్దీ మా తమ్ముడు కంట్లో పడిపోయేను. ఇంక అక్కడ ఒక్క క్షణం ఉండనివ్వలేదు నన్ను ఆడు. ‘‘నడు అన్నయ్య అమ్మ రమ్మంది’’ అంటా గొడవ గొడవ చేసి తీసుకొచ్చీసాడు.
ఇంటికొచ్చాక చాలాసేపు నాతో మాటాడలేదు. నా మీద ఆడికి పట్టరాని కోపమొచ్చిందని ఆడి చింత నిప్పుల్లాంటి కళ్ళల్లో నాకు కనిపించింది.
ఆడిని చాలాసేపు మాటాడిరచకండా కొద్దిసేపు వొదిలేసిన తర్వాత అడిగేను ‘‘నేనేం చేసానురా అంత కోపమొచ్చింది నా మీద’’ అని.
దానికి ఆడు ‘‘నువ్వు అనూని చూసిన చూపు బాగుందా? నీ చూపులు తను చూడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే?’’
‘‘సరేరా నేనలా చూడటం తప్పే అనుకుందాం! ఒకవేళ నేనలా చూసినా కూడా నీకు ప్రోబ్లమ్ ఏంటి?’’ అని అడిగితే చాలాసేపు సంశయించి, చెప్పక తప్పదన్నట్టు చెప్పేడు.
‘‘నువ్వు నాకంటే బావుంటావు పొడుగ్గా, సన్నగా, ఎర్రగా, అందంగా. నువ్వు అలా చూడటం నాకు నచ్చలేదు. ’’
అంటా అన్నపూర్ణ నాకెక్కడ కనక్టైపోతుందోననే భయాన్ని చెప్పకనే చెప్పేడు. ప్రతి భయం ఎనక ఒక ఆందోళన ఉంటది. అప్పుడర్ధమైంది నాకు ఆడి ఆందోళన!
ఇలా మా అందరి చూపులనుంచి, దుష్ట దృష్టి నుంచి అనూని కాపాడుకుంటా వత్తన్నాడు.
***
ఇంతలో ఆ చదువుల సంవత్సరం పూర్తయిపోయింది. అంటే ఆళ్ళు పై క్లాసుకి ఎళ్ళాలంటే ఏరే ఊరెళ్ళి చదువుకోవాలి.
బహుశా! అన్నపూర్ణని ఇంక చదివించరేమోననే భయం నాకు మాత్రమే ఉంది. మా తమ్ముడికి లేదు మరి ఆడికున్న ధైర్యం ఏంటో ఆడికే తెలవాలి.
వేసవి శెలవులు ఇచ్చారని తెలుసుకుని అనూ ఆళ్ళ అమ్మమ్మ సుందరమ్మ ‘‘అనంతా! నువ్వు పెద్దదానికి పత్యం సరిగా పెట్టలేదు. ముగ్గురాడ పిల్లలతో నీకేమి కుదురుతాది? నేను తీసుకెళ్ళి ఓ పది రోజులుంచుకుని పత్యం పెట్టి తీసుకొత్తాను’’ అంటా బలవంతంగా అనంతాంటిని, నాగంకుల్‌ని ఒప్పించింది.
కాని ‘‘నేను ఎళ్ళనంటే ఎళ్ళను’’ అని భీష్మించు కూర్చుంది అన్నపూర్ణ.
‘‘అమ్మమ్మ బాధపడుతూంది ఎళ్ళవే తల్లీ’’ అని అనంతాంటి బతిమాలితే తప్పదన్నట్టు బయల్దేరింది. ఎళ్ళే ముందు నందు ఇంటి కొత్తాడేమో చూసి, చెప్పి ఎళ్దామనుకుంటే ఆడు ఆ టైమ్‌లో తన రెండో వ్యసనంలో ముగిని తేలుతున్నాడు స్పిన్ బౌలింగ్ చేత్తా!
ఈడిక రాడు, నేనే ఎళ్తాను, అనుకుంటా కంగారుగా, పరుగున మా ఇంటికొచ్చిన అన్నపూర్ణ ‘‘నందు ఏడాంటి?’’ అని అమ్మని అడిగింది.
‘‘ఆడి ఫ్రెండ్సొచ్చి తీసుకెళ్ళారమ్మా! బాలట్టుకుని బయల్దేరేడు బేట్టాటకి’’ అని చెప్పీసరికి ఒక్క క్షణం కూడా నిలబడలేక పోయిన అన్నపూర్ణ ఆళ్ళాడుకునే కొండేటి ప్రకాశం గారి దొడ్లోకి పరుగులాంటి నడకతో ఎళ్ళింది.
నందు అనూని చూసి దగ్గరకొచ్చేడు. ‘‘ఏమైందే అలా ఒగుర్చుకుంటూ వొచ్చేవ్?’’ అనడిగేడు. ‘‘అదీ, మా ముసిల్ది, అదే మా అమ్మమ్మ, నన్ను ఆళ్ళూరు తీసుకెళ్తాదంట అమ్మ నాన్న ఎళ్ళమని బతిమాల్తున్నారు. నేను మందపల్లి ఎళ్తున్నాను. పది రోజుల దాకా రాను. నీకు చెప్పి ఎల్దామని వొచ్చాను’’ అంటా ఇసయం చెప్పింది.
ఒక్కసారి గుండెల్లో గుబేల్‌మని రాయిపడినట్టు మనసంతా కకావికలమైపోయిన నందు ఇక ‘‘నేనాడను, నా బదులు వీరేష్! నువ్వు ఆడరా’’ అంటా ఆట వొదిలేసి అనూ కూడా వొచ్చేసేడు.
మనసంతా వేదనతో నిండిపోయిన ఆ క్షణంలో ఆళ్ళిద్దరి మధ్య మాటలు కరువైయ్యాయి. ఆళ్ళిద్దరూ మా ఇంటికి రాకండా నేరుగా అన్నపూర్ణ ఆళ్ళింటికి ఎళ్ళి ఆళ్ళమ్మమ్మ, అన్నపూర్ణ ఊరెళ్ళేదాకా అక్కడే ఉండి, ఆ తర్వాత నీరసంగా కాళ్ళీడ్చుకుంటా ఇంటికొచ్చేడు నందు.
అన్నపూర్ణ ఊరెళ్ళిన ఆ క్షణం నించి ఆడు పోస్టాఫీసోళ్ళ చిన్న మొత్తాల పొదుపు పథకంలో చేరినట్టున్నాడు. మాటలు కూడా చాలా పొదుపుగా దాచి దాచి ఖర్చు చేత్తన్నాడు. బహుశా! ఈ రెండు రోజుల్లో మొత్తం ఆడు మాట్లాడిన మాటలు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. మాటలే కాదు బయటికే రావటం లేదు. టి. వి. చూడ్డానికే కాదు క్రికెట్‌కి కూడా! ఫ్రెండొచ్చి ఎంత బ్రతిమాలినా బయటికెళ్ళలేదు.
ఈరోజు హనుమాన్ నగర్ కుర్రోళ్ళతో మేచ్ ఉంది. ఫ్రెండ్సొచ్చి రమ్మని బతిమాలితే ‘‘నేను ఆడనురా, మీరే ఆడండి’’ అంటే ‘‘కెప్టెన్‌వి నువ్వు లేకుండా ఎలా ఆడతాం రా? నువ్వు సరిగా ఆడకపోయినా పర్లేదు, ఎలా ఆడితే అలాగే ఆడు’’ అంటా బతిమాలితే ఆళ్ళందరితో ముఖ్యంగా తనతో మొన్న మేచ్‌లో గొడవ కారణంగా మాట్లాడట్లేని కందుల సురేష్‌తో కూడా బతిమాలించుకుని అప్పుడు ఎళ్ళాడు క్రికెట్ ఆడటానికి స్కూల్ గ్రౌండ్‌కి!
***
రెండు రోజులు ముళ్ళ మీద కూచ్చున్నట్టు ఎలాగో గడిపేసిన అన్నపూర్ణ ‘‘నందు గుర్తొత్తన్నాడు నేనెళ్ళిపోతాను, అని నిజం చెబితే, ఆళ్ళ గయ్యాళి అమ్మమ్మ, పులి పంజా లాంటి నోరేసుకుని, మీదడిపోయి మాటలతోనే, చీల్చి చెండాడేత్తాదని భయపడి, ‘‘నాన్న గుర్తొత్తన్నాడు నేను ఎళ్ళిపోతాను నన్ను తీసుకెళ్ళిపో’’ అంటా గోల చేయటం మొదలెట్టింది.
‘‘రెండు రోజులే కదే అయ్యింది. ఓ నాలుగు రోజులున్నాక తీసుకెళ్తాలేవే’’ అని ఎంత బతిమాలినా అన్నపూర్ణ ఇంటే కదా!
‘‘పోన్లే నాకీ రోజు నీరసంగా ఉంది, రేపు తీసుకెళ్తాను ఆగవే తల్లీ’’, అని సముదాయించినా ఇనని అన్నపూర్ణ ‘‘నీకు బాగోకపోతే నన్ను తీసుకెళ్ళి బస్సెక్కించేసెయ్, ఇక్కడెక్కి రాజమండ్రిలో దిగి, అక్కణ్ణించి ఐదో నెంబర్ బస్సెక్కటమే కదా నేనెళ్ళిపోగలను. అమ్మా, నాన్న ఏమనరు ఆళ్ళకి నేను చెప్పుకుంటాను’’ అంటా సంచి సర్దుకుని బయల్దేరింది.
సుందరమ్మ చేసేదేమీ లేక రోడ్డు మీదికి తీసుకొచ్చి అమలాపురం నించి మందపల్లి మీంచి రాజమండొచ్చీ ఎర్రబస్సెక్కించేసింది అనూ పోరుపడలేక, తనకిష్టం లేపోయినా.
ఆ బస్సెక్కి రాజమండ్రి కాంప్లెక్స్‌లో దిగి ‘‘కోస్తావాణి’’ ఆఫీసు దగ్గిరికొచ్చి శ్రీ లక్ష్మి నరసింహ సిటి బస్ సర్వీస్ ఆళ్ళ గోకవరం బస్టాండ్ నుంచి కాంప్లెక్స్ మీంచి హుకుంపేట వెళ్ళే ఐదో నెంబర్ సిటీ బస్సెక్కి, హుకుంపేట బాజీ కొట్టు సెంటర్‌లో దిగి, ఎంత నీరసంగా ఊరెళ్ళిందో, అంతకు రెట్టింపు ఉత్సాహంతో, పట్టుకెళ్ళిన బట్టల బేగ్ భుజానేసుకుని, ఇంటికొచ్చీసింది.
ఇంకో వారం దాకా అన్నపూర్ణ రాదు అనుకుంటున్న ఆళ్ళ అమ్మకి, చెళ్ళెళ్ళకి ‘‘ఇది ఇలా గోడక్కొట్టిన బంతిలా రెండు రోజులకే వొచ్చేసిందేం? ఏమైంది దీనికి’’ అనుకుంటా ఇంట్లోంచి బయటికి వొద్దామనుకునీ లోగానే ఇల్లంతా, ముఖ్యంగా టి. వి. గదిలో కళ్ళతో మూలమూలలా వెతికేసిన అన్నపూర్ణ ‘‘ఆడిక్కడికి రాలేదు’’ అనుకుంటూ, చెంబుతో నీళ్ళట్టుకొచ్చిన భవానీతో ‘‘భానూ ఇప్పుడే వొత్తానుండు’’ అంటా మా ఇంటికొచ్చింది.
అమ్మ లేదు. నేను మాత్రమే ఉన్నాను. ‘‘నందు ఏడి?’’ అనడిగింది. ‘‘ఆడు స్కూల్ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడటానికి ఎల్లాడు పిలుచుకురానా?’’ అంటే, ‘‘సరే! ఇంటికి రమ్మను’’ అంటా ఇంటికెళ్ళిపోయింది. నిరాశగా, నిర్లిప్తంగా, నిస్తేజంగా!
నేనెళ్ళే సరికి లాస్ట్ ఓవర్ బౌలింగ్ చేత్తన్నాడు ఆనంద్. మేచ్ డ్రా అయిందనిపించుకొని ఇరు జట్లు అనందిస్తున్న సమయంలో ఆ ఆనందాన్ని ఏమాత్రం ఆస్వాదించలేక పోతున్న ఆనంద్‌కి, నిజమైన ఆనందానిచ్చే వార్త!
‘‘అన్నపూర్ణ ఊరు నించొచ్చేసింది. నీ కోసం మనింటి కొచ్చింది, నిన్ను ఆళ్ళింటికి ఎంటనే రమ్మంది’’ అని, ‘‘ఎంటనే’’ అనే పదాన్ని మరింత నొక్కి, తన ఆత్రుతకి అక్షర రూపంగా చెప్పేను. బహుశ ఈ మధ్య కాలంలో ఆడికి అత్యంత ఆనందాన్నిచ్చిన వార్త ఇదే ననుకుంటా!
ఇన్న ఎంటనే ‘‘సైకిలివ్వు’’ అని, నా సమాధానం కోసం ఎదురు చూడకుండానే నా చేతిలోని ఎమ్. టి. బి. హెర్క్యూలిస్ సైకిల్ లాక్కున్నాడు. స్పీడుగా తొక్కుకుంటా, ఎంత స్పీడుగా అంటే రోడ్డు మీద గోతులు, గతుకులు చూడకండా, అన్నపూర్ణ ఆళ్ళింటికెళ్ళేంత వరకూ రెండు పెడల్స్ తిరగటం ఆపకుండా తొక్కుకుంటా ఎళ్ళాడు.
అన్నపూర్ణ ఇంటి ముందు సైకిల్‌కి బ్రేకేత్తే టైర్, రోడ్డు రాపిడికి రోడ్డు మీద సైకిల్‌తో స్పీడుగా వచ్చి సడెన్ బ్రేక్ కొట్టారని తెలిసీలా మచ్చపడీలా, టైర్ అరిగి, కాలిన వాసన వొచ్చీలా. బ్రేకేసిన సౌండ్‌కి ఎవరో సైకిల్ మీంచి పడిపోయారని కంగారుగా చూసిన, కుళాయి దగ్గర నీళ్ళు పట్టుకుంటున్న ఆడోళ్ళు, ఈడు పడకండా సైకిల్ స్పీడ్‌గా స్టేండేసి లోపలికెత్తంటే ‘ఈడా? ఎవరో అనుకున్నాం’’ అనుకున్నారంతా!
ఇంత వేగంగా ఎళ్ళిన నందూని చూసి ‘‘ఏరా! మీ అక్క లేకపోతే ఇంటి మొఖమే చూడవేమో ఈ రెండు రోజులు అసలు కనిపించావా?’’ అంటా భవాని ఎత్తి పొడుపు మాటలు. అయ్యేమీ పట్టించుకోకండా ఇంట్లో పడుకునున్న అన్నపూర్ణ దగిరికెళ్ళి అలికిడి చెయ్యకండా నించున్నాడు.
మంచం మీద అన్నపూర్ణ బోర్లా పడుకుని, తల పట్టిమీద ఆన్చి ఉంది. కళ్ళు మూసిలేవు. నిద్ర పోట్లేదు. అలా అని కళ్ళు ఏమీ చూడట్లేదు. వాటికేమి బాధొచ్చిందో, పాపం ఏడుత్తున్నాయి. ఓ కన్నీటి బొట్టు, కంటి నుంచి ముక్కును కొలిచి, ముక్కు చివరి ఒడ్లగింజను ముద్దాడి పట్టుతప్పి నేల రాలింది.
అది గమనించని నందు అలాగే నించునే ఉన్నాడు. ఎవరో వచ్చి నించున్నారు. బహుశా! అమ్మై ఉంటుంది. ఏమి చెప్పాలో తెలియదు. అనుకుంటా కళ్ళు తుడుచుకుని ఎనక్కి తిరిగి చూసింది. వెనక నించున్నది అమ్మ కాదు తన కన్నీటికి కారణమైనోడు నందు గాడు!
‘‘ఎప్పుడొచ్చావే’’ అనడిగేడు.
‘‘గంటైంది’’.
‘‘అదేంటి పదిరోజులుంటానన్నావ్!’’
‘‘వొంట్లో బాగోక వొచ్చేసేను’’ అంటా పొడిపొడి సమాధానం.
‘‘అదేంటి క్రికెట్ మేచ్ అయిపోయిందా? అప్పుడే వొచ్చేసేవ్! ఆడుకోలేక పోయావా? మధ్యలో ఎందుకొచ్చేసేవ్?’’ అంటా నేను లేపోయినా నీకు క్రికెట్ ఉంటే చాలు అనే అర్ధంలో ఓ పుల్ల విరుపు.
‘‘నేను మధ్యలో ఏమీ రాలేదు. మేచ్ అయ్యాకే వొచ్చాను’’ అంటా ఆడి సంజాయిషీ.
‘‘అవునా! ఇంకా నేనొచ్చానని తెలిసి మేచ్ వొదిలేసి వొచ్చేసావేమోనని ఫీలయ్యాను’’ అంటా పుల్లవిరుపు కొనసాగింపు.
నేను నిన్ను చూడకండా ఉండలేక, రెండు రోజులకే వొచ్చేత్తే నువ్వు మాత్రం నా ఆలోచనే లేకండా, చక్కగా ఏ ఫీలింగ్ లేకండా, క్రికెట్ ఆడుకుంటున్నావ్! అనే భావాన్ని పరోక్షంగా వ్యక్తం చేసింది.
ఇద్దరూ బయటికొచ్చేసేరు. అన్నపూర్ణ టి. వి. పెట్టింది. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకి దూరదర్శన్ నేషనల్‌లో వచ్చే ప్రాంతీయ భాషా ( ప్రాంతీయ భాషా చలనచిత్రం అంటే వారానికి ఒక భాష యొక్క సినిమా వేసీవోరు. ఒక వారం తమిళం, ఒక వారం మరాఠీ, ఒక వారం తెలుగు అలా ప్రాంతీయ భాషల సినిమాలు ప్రసారం చేసీవోరు) చలన చిత్రంగా ఆ వారం ‘‘శృతిలయలు’’ సినిమా ఏసేడు. అందులో కుర్రోడి పాత్ర పోషించిన షణ్ముఖశర్మ పోలికలు ఆనంద్ లాగే ఉండటంతో అందరూ సినిమా చూత్తంటే అన్నపూర్ణ మాత్రం ఆ కుర్రోడిలో ఆనంద్‌ని చూత్తా సినిమా చూసింది.
ఆ రోజు సుందరమ్మ కబురూ, కాకరకాయ లేకండా ఊడిపడిరది. కానీ ఏదో విషయం లేకండా రాదుగా! పిడుగులాంటి వార్త పట్టుకొచ్చింది.
ఆవిడ రాకకు ఆశ్చర్యపడిన అనంతాంటి, నాగంకుల్ ఏమైందంటా ఆరా తీసేరు.
చేలాసేపు ఆలోచించి, చించి ఆళ్ళిద్దరినీ లోపలికి తీసుకెళ్ళి, చెప్పింది. ‘‘పూర్ణాకి బుద్ది మారిపోయిందే అనంతా! అది, ఆడున్నాడు కదా, అదేనే ఆ కుర్రోడు ఆనందు గాడి కోసం, అక్కడ మనూర్లో ఇది ఒక్క రోజు కూడా ఉండలేక పోయింది. నాన్న మీద బెంగొచ్చేత్తుంది అంటా అసలు నిలబడలేదనుకో.
నేను రేపు తీసుకెళ్తానుండు అన్నా కూడా ఒక్క రోజు కూడా ఉండలేక పోయిందనుకో పిల్ల. ఆణ్ణి ఇంటికి రానీకండి! దీన్ని స్కూలు మాన్పించేయండి. మన రాంప్రసాద్‌కి చేసేద్దాం. మీకిష్టమైతే అన్నయ్యతో నేను మాటాడతాను’’ అంటా అన్నపూర్ణ జీవితం స్థంభించిపోయే సలహా చెప్పింది.
నాగంకుల్ ఆలోచనలో పడ్డారు. అనంతాంటి మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. కానీ! సుందరమ్మ ఉన్న రెండు రోజుల్లో అన్నపూర్ణ పెళ్ళి గురించి సమయం కుదిరినపుడల్లా చెబుతానే ఉంది.
అంకుల్‌కి ఆరోగ్యం ఇప్పుడు బాగోట్లేదు. టి. బి. ఉందన్నాడు డాక్టర్. మందులాడతన్నాడు. ఉప్పుడు ఆయన వొయసు యాభైయేళ్ళు. అన్నపూర్ణకైతే, ఇంకా ఇద్దరు ఆడపిల్లలకి చేయాలి. అంటే ఇప్పుడే మొదలెట్టాలి.
తనకు టి. బి. ఉంది. మందులాడతన్నా ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. మా బామ్మర్ది పెద్దిరెడ్డి వెంకట రమణ కొడుకు రాంప్రసాద్‌కి ఇప్పటికే ఇరవై ఏడేళ్ళొచ్చేయి. మొన్న కార్యక్రమానికొచ్చినపుడు సరదాకన్నట్టు ‘‘రాంప్రసాద్ బావని చేసుకుంటావా పూర్ణా?’’ అంటా వెటకారాలాడాడు. అతనైతే కట్నం ప్రసక్తి పెద్దగా ఉండదు.
పూర్ణాకి పెళ్ళీడు కాకపోయినా, ప్రసాద్‌కి మాత్రం పెళ్ళీడే! పూర్ణాని చేయము, అంటే ఆళ్ళు మాకోసం ఆగరు, వేరే సంబంధం చూసుకుంటారు.
బంగారం లాంటి సంబంధం చేజారిపోద్ది. ఇలా నాగంకుల్ మనసులో బోల్డు ఆలోచనలు. ఇక ఆనంద్ ఇసయం అంటావా, ఆడిని ఆళ్ళెప్పుడూ ‘ఆ’ దృష్టితో చూడలేదు. ఆడితో ఎలాంటి సమస్యా రాదు. ఆళ్ళ స్నేహం ఇప్పటిది కాదు. చిన్నప్పటిది.
అందుకే ఆడి ఇసయం ఆయన సీరియస్‌గా తీసుకోలేదు. కానీ.. పెళ్ళి విషయం మాత్రం సీరియస్‌గా ఆలోచించేరు.
అనంతాంటి ఇసయానికొస్తే, పూర్ణాకి ఇంకా పెళ్ళీడు రాలేదు. పిల్లకి ఇంకా వెన్ను ముదరందే పెళ్ళేంటి? అయినా రాంప్రసాద్ గాడికి పూర్ణాకి పన్నెండేళ్ళు తేడా! అంత పెద్దోడిని చేసుకోవటం వల్ల ఎలాంటి సమస్యలొత్తాయో ఆవిడకి ఏరే చెప్పక్కర్లెద్దు. ఆవిడ గత పద్దెనిమిదేళ్ళుగా అనుభవిత్తంది. నాగంకుల్‌కి అనంతాంటికి పదేళ్ళు తేడా మరి. ముందు భార్య చనిపోయిన పదేళ్ళకి తనని చేసుకున్నాడు. ఆవిడకిదే మొదటి పెళ్ళి!
ఆళ్ళన్నయ్య మంచోడైనా, ప్రసాద్ మంచి సంపాదనపరుడే అయినా, ఆళ్ళ వొదిన గయ్యాళితనం తనకి తెలియంది కాదు. అందుకే ఆవిడకి ఇష్టం లేదు.
ఇక ఆనంద్ విషయానికొత్తే, ఆడి మీద ఆవిడకి ఏ అనుమానం లేదు. ఆడ్ని ఆవిడ చిన్నప్పటి నుంచి చూత్తంది. ఆళ్ళమ్మ అనుకునేట్టు అంత దూరం ఆలోచించాల్సినంతవసరం లేదు అనుకునీది, మొన్నటివరకూ! అంటే మొన్న అన్నపూర్ణ కలవలపల్లి నుంచొచ్చిన రోజు, ఇంట్లోకి రాకండా మా ఇంటికే రాటం ఆవిడలో కొత్త అనుమానాలని మొలకెత్తించింది.
పతీ అనుమానం ఎనక ఒక భయం దాగి ఉంటది. ఈ అనుమానం ఎనక అన్నపూర్ణ మనసు మారిందేమో ననే భయం పురుడోసుకుని, దినదిన ప్రవర్దమానమౌతుంది. అందుకే ఇప్పుడు ఆడు ఎళ్తంటే, ఆవిడ క్రీగంట కనిపెడతంది.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
రత్నాకర్ పెనుమాక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: రత్నాకర్ పెనుమాక
నేను రత్నాకర్ పెనుమాక. యానాంలో ఉంటాను. B.Sc, MBA చదివి వివిధ బహుళ జాతి కంపెనీల్లో HR డిపార్టుమెంటులో ఉన్నతోద్యోగాలు చేసి ఉద్యోగ విరమణ చేసాను. ప్రజా సేవ చేయాలనే బలమైన కాంక్షతో 2005 లో యానం లో ఒక స్వచ్ఛంద సేవాసంస్థ నెలకొల్పి పూర్తికాల సామాజిక సేవ చేస్తున్నాను. ఏవిధమైన ఫండ్స్ వసూలు చేయకుండా నా స్వంత నిధులతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. వ్యక్తిగతంగా 41 సార్లు రక్తదానం చేసాను. మూడు సంవత్సరాల నుంచి రచనలు చేస్తున్నాను. 2022 లో నా మొదటి కథా సంపుటి "గౌతమీ తీరం" ఆవిష్కరించాను . అది మంచి పాఠకాదరణ పొందింది. ఈ సంవత్సరం నా రెండవ కథా సంపుటి "గౌతమీ ఒడ్డున " ఆవిష్కరించ బోతున్నాను. ఇప్పటి వరకూ 30 కవితలు 50 కథలు 5 నవలలు రాసాను. ఇవన్నీ అముద్రితాలే. 9 నెలల నుంచే పోటీలకు రచనలు పంపుతున్నాను. ఇప్పటికి 9 సాహిత్య పురస్కారాలందుకున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న పాఠకులకు, పోటీ నిర్వాహకులకు, న్యాయనిర్ణేతలకు సదా కృతజ్ఞుడను.
Comentários