top of page
Writer's pictureRathnakar Penumaka

‘‘అ’’ నించి ‘‘ఆ’’ దాకా - పార్ట్ 3

విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ

'A To AA Part 3/3' New Telugu Story Written By Rathnakar Penumaka

'‘‘అ’’ నించి ‘‘ఆ’’ దాకా - పార్ట్ 3/3' పెద్ద కథ

రచన: రత్నాకర్ పెనుమాక

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

ఆనంద్, అన్నపూర్ణ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో క్లాస్ మేట్స్.

ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. మంచి స్నేహితులు.

వేసవి శెలవుల్లో అన్నపూర్ణని వాళ్ళ అమ్మమ్మ సుందరమ్మ తనతో తీసుకొని వెళ్తుంది.

ఆనంద్ కి దూరంగా ఉండలేక అన్నపూర్ణ రెండు రోజులకే తిరిగి వచ్చేస్తుంది.

సుందరమ్మ మాటలతో అన్నపూర్ణ ను గమనించడం మొదలుపెడుతుంది వాళ్ళ అమ్మ.


ఇక ‘‘అ’’ నించి ‘‘ఆ’’ దాకా పార్ట్ 3 చదవండి.


ఇంట్లో ఇన్ని రహస్య మంతనాలు, గూఢుపుఠానీలు జరుగుతున్నా ఏమీ తెలియక అప్పుడే వొచ్చిన నందూతో కబుర్లాడుతంది అనూ!


నాగంకుల్‌, అనంతాంటికి, అన్నపూర్ణకి అప్పుడే పెళ్ళి చేయటం ఇష్టం లేపోయినా, తన అనారోగ్యం గురించి, ప్రసాద్‌ పెళ్ళీడు గురించి, ఆళ్ళ లేవరికం గురించి ఇవరించి, ఆంటీని ఒప్పించి, సుందరమ్మని రాయబారానికి పురమాయించేడు.


ఆళ్ళు ఒప్పుకున్న రోజే, సుందరమ్మ ఏరే పనేలేనట్టు, ఇక్కడి నించి నేరుగా అన్నపూర్ణ ఆళ్ళ మేనమామ ఉంటన్న గేదెల్లంక ఎళ్ళింది.



ఫ్రెంచి యానాం నించి ముమ్మిడివరం ఎళ్తుంటే, మురమళ్ళ దాటాక కుడి ప్రక్కకెళ్తే వొచ్చే గేదెల్లంకలో కొబ్బరి తోటల మధ్య ఉన్న, ఆళ్ళ బంగాళా పెంకుటింటిలో రెండు రోజులుండిపోయింది.

ఆళ్ళని ఒప్పించి, ఆవిడ గారి గయ్యాళి కోడలు ఒప్పుకోపోయినా ‘‘ఈడు జోడు బాగుంటుంది, మీకున్నది ఒక్కడే కొడుకు, బయటి దాన్ని చేసుకుంటే ఆ వొచ్చీది నిన్ను చూడదే పిల్లా’’ అని సర్దిచెప్పి ఒప్పించింది.


ఇయ్యన్నీ ఒకెత్తైతే అన్నపూర్ణంటే ఆవిడకి ముందు నించీ ఉన్న ఇష్టంతో ఆవిడ సరేనంది.


***


ఆరోజు ఏకాదశి, సోమవారం శ్రావణ మాసం మంచి రోజు అనంతాంటి ఆళ్ళ అన్నయ్య పెద్దిరెడ్డి ఎంకటరమణ వొదిన సుభద్రమ్మ, రాంప్రసాద్‌ని తీసుకుని వొచ్చారు.

సుందరమ్మ అప్పటికే వొచ్చి ఉంది.


ముందురోజు రాత్రి అనంతాంటి ఆళ్ళ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, నాగంకుల్‌ ఆళ్ళ తమ్ముళ్ళు మరదళ్ళు అంతా వొచ్చేరు.


ఈళ్ళంతా ఎందుకొచ్చేరో? ఇంట్లో ఏం శుభకార్యం జరుగుతుందో? అన్నపూర్ణకి, ఆళ్ళ చెల్లెళ్ళకి తప్ప మిగిలినోళ్ళందరికీ తెలుసు. అందుకే చుట్టాలొచ్చినందుకు, ఇల్లంతా ఇలా సందడి సందడిగా ఉన్నందుకు, ఎంతో ఆనందంగా ఉంది అన్నపూర్ణకి.


అందరూ ఆరోజు అన్నపూర్ణ అందానికి మెరుగులు దిద్ది మరింత అందంగా తయారు చేసి, నిన్న కడిపిలంక సిద్దాంతి గారు చెప్పిన శుభఘడియల్లో హాల్లో కుర్చీ ఏసి కూర్చోబెట్టి అందరూ కుర్చీల్లో కూచ్చున్నారు. పూర్ణాని రాంప్రసాద్‌కి ఎదురుగా కూచ్చోబెట్టారు.


‘‘ఒరేయ్‌ పెళ్ళి కొడకా! సిగ్గుపడక పిల్లని బాగా చూస్కో, తర్వాత సరిగా చూడలేదంటే కుదరదు’’ అంటా పరాచికాలాడేరు.


అప్పటి వరకూ అక్కడేమి జరుగుతుందో అర్ధం అయ్యి, కాకుండా, ఉన్న అన్నపూర్ణకి అక్కడేమి జరుగుతుందో అర్ధం కావటం, గుండెల్లో ఎవరో గునపం దింపినంత వేదన ఒకేసారి అన్నపూర్ణ మనసులో!


ఆ తంతు ముగిసిన ఎంటనే అన్నపూర్ణని లోపలికి తీసుకెళ్ళిపోయేరు.

పెద్దలంతా కూచ్చుని కట్న కానుకలు, లాంచనాలు అన్నీ మాటాడుకుంటన్నారు. ఆళ్ళేం మాట్టాడుకుంటన్నారో ఇనేలా లేదు అన్నపూర్ణ పరిస్థితి.


పెళ్ళిని తప్పించుకోటం ఎలా? ఏం చెయ్యాలి, అని ఆలోచిత్తంది. ఆ ఆలోచనలతో బాటుగా ఈ పరిస్థితికి కారణమైన అమ్మమ్మపైనా, అమ్మపైనా, నాన్నపైనా ఎప్పుడూ రానంత కోపం, ద్వేషం, మనసంతా మోయలేనంత భారం. చెప్పలేనంత ఆవేదన!


చుట్టాలంతా ఎప్పుడు పోతారో, అప్పటిదాకా తను కాలుకదిపే పరిస్థితి లేదు. ఆనంద్‌ వొస్తే బావుణ్ణు జరిగిందంతా చెప్పి ఓదార్పు పొందుదును అనుకుంది.


ఆ రోజు ఆనంద్‌ అన్నపూర్ణ ఆళ్ళింటికి ఎళ్ళాడు. ఇంటి దగ్గర బంధువుల హడావిడి చూసి ఏదో జరుగుతుందని అర్ధమైంది. కానీ ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు.


అనంతాంటి చెప్పేరు ‘‘ఈరోజు ఇంటినిండా చుట్టాలున్నారు. పూర్ణ లోపలెక్కడో ఉంది. రేపు రారా’’ అని చెప్పి పంపించేసింది.


ఏమ్మాట్లాడాలో తెలివక ఎనక్కొచ్చేసేడు. రావటం రావటమే, నీరసంగా మంచంపై ఆలిపోయేడు. ఆడి మనసేదో కీడు శంకించింది. కాని ఆ కీడేంటో క్లారిటీ లేదు. ఏవేవో ఆలోచించుకుంటానే నిద్రలోకి జారుకున్నాడు.


***

ఎప్పుడు చుట్టాలొచ్చినా, ఇంకో రెండు రోజులుండమని బతిమాలే అన్నపూర్ణ ఈ రెండు రోజులూ ఆళ్ళెప్పుడు పోతారా, ఎప్పుడు మా ఇంటికి వద్దామా అని ఎదురు చూత్తంది.


వొచ్చే నెల ముహూర్తం కూడా ఖరారు చేసుకుని, ఆ రోజు బయల్దేరేరు అందరూ. ‘‘హమ్మయ్య!’’ అంటా ఊపిరి పీల్చుకుంది అన్నపూర్ణ. ఆళ్ళు ఎళ్ళిన వెంటనే, అన్నపూర్ణ మా ఇంటికొచ్చింది.

లంఖనాలు చేస్తున్నోడిలా నిన్నటి నించి మంచంతోటే జత చేత్తన్న మా తమ్ముడిని చూసి ‘‘ఈ రెండు రోజులు ఏమైపోయావురా బాబూ, అస్సలు కన్పించనే లేదు, ఒంట్లో బాలేదా?’’ అని అడిగింది.

‘‘లేదే నిన్న వొచ్చాను. ఇంట్లో బంధువులున్నారు అంతా హడావిడిగా ఉంది, రేపురా అని ఆంటీ చెప్తే వొచ్చేసాను. చుట్టాలెందుకొచ్చారే? ఇంట్లో ఏదైనా ఫంక్షనా? వరలక్ష్మి కానీ.. ?’’


‘‘ఫంక్షనా నా తలకాయా? నా దినం చెయ్యడానికొచ్చారు ఎదవలందరూ! నాకు పెళ్ళి చేసేత్తారంట. నిన్న పెళ్ళిచూపులు మా రమణ మాయ కొడుకు ప్రసాద్‌ గాడితో నా పెళ్ళంట’’ అంటా ఎప్పుడూ ప్రసాద్‌ బావ అంటా సంభోదించీ అనూ, తన కసి ఎళ్ళగక్కింది.


‘‘ఆ ఇసయమే మాటాడ్డానికొచ్చేరు. మా ముసిల్ది ఉంది కదా అది తెచ్చింది ఈ ముప్పంతా. దొంగముండ’’ అంటా తిట్లపురాణం అందుకుంది. ఆనంద్‌కైతే గొంతు పూడుకు పోయింది. మాట పెగలటం లేదు, మతి పోయినట్టుంది. బుర్ర గిర్రున భూమి కంటే వేగంగా తిరుగుతా తన చుట్టూ ఉన్నవన్నీ తిరుగుతున్న భావన!


ఆడు తమాయించుకోడానికి చాలాసేపు పట్టింది. తమాయించుకుని ‘‘స్కూలుకి రావా? మాన్పించేత్తారా’’ అని అడుగుతంటే ఆడి అమాయకత్వానికి, అన్నపూర్ణ కళ్ళల్లో సన్నని కన్నీటి పొర చూపుని క్షణం పాటు మసకబార్చింది.


‘‘అయ్యో, తింగరోడా! పెళ్ళి చేసేత్తన్నారంటే స్కూలు మాన్పించేత్తారా అంటావేంట్రా? పెళ్ళి కాకండా పోనీ స్కూలు మాన్పించేసి ఇంటికాడ ఉండమన్నా బావుణ్ణు, పెళ్ళట పెళ్ళి! పెళ్ళయ్యాక మళ్ళీ ఇక్కడుండడానికి కుదరదు ఆ గేదెల్లంకలోనే ఉండాలి. నాకు పెళ్ళస్సలు ఇష్టం లేదురా, ఈ పెళ్ళే కాదు అసలు పెళ్ళే ఇష్టం లేదెహె! ఏం చెయ్యాలో తెలివట్లేదు. ఇంట్లోంచి పారిపోదామనిపిత్తందిరా!


నందు నువ్వు నాకంటే ఓ ఐదేళ్ళు ముందు పుట్టాల్సిందిరా! నాకీ ఖర్మ తప్పేది’’ అంటా ఆడ్ని పొదివి పట్టుకొని ఎక్కిఎక్కి ఏడుత్తా, అప్పటిదాకా మోత్తన్న దు:ఖ భారాన్ని కన్నీళ్ళతో దించేసుకుంది.


అప్పుడు ఇంట్లో అమ్మ లేదు. నేను పక్క గదిలో ఉండి ఇదంతా గమనిత్తా ఈళ్ళు స్నేహితులా? లేక.. ? ఇంకాస్త ముందుకెళ్ళి ప్రేమికులా అని గమనిత్తాన్నాను. నేనున్న గదిలోంచి చూత్తే వీళ్ళు నాకు కనిపిత్తారు, ఇన్పిత్తారు. కానీ నేనాళ్ళకి కనిపించను ఇనిపించను.


ఇంతలో అన్నపూర్ణ ఆళ్ళ చెల్లి ఒగర్చుకుంటూ వొచ్చి ‘‘అక్కా! అమ్మ నిన్ను రమ్మంటుంది’’ అంటా తీసుకెళ్ళిపోయింది.


ఆరోజు నుంచి నందు అన్నపూర్ణ తనకి దూరమైపోతుందనే బాధతో బయటికే రావటం మానేసి క్రికెట్‌కి కూడా దూరమైపోయేడు. ఇంట్లోనే ఉంటున్నాడు బెంగగా!


ఓరోజు ఆనంద్‌, అన్నపూర్ణ ఆళ్ళింటికి ఎళ్తే తనక్కడ లేదు! ‘‘తనని అమ్మ ఊరు తీసుకెళ్ళింది’’ అని భవాని చెప్పింది.


***

ఈ రెండు రోజులు ఈడి వాలకం చూసి ఇంట్లో ఎవరూ లేనపుడు ‘‘అసలు నీ సమస్య ఏంట్రా’’ అనడిగేను.


‘‘అన్నపూర్ణకి పెళ్ళంటన్నయ్యా’’ అంటా బోరున ఏడ్చేడు.


నేను సముదాయిత్తా ‘‘అదేంట్రా మరి పెళ్ళి చేసుకోవద్దా? నువ్వు, నీ వాలకం చూస్తుంటే అన్నపూర్ణని అక్కలా కాకండా వేరే దృష్టితో చూత్తన్నట్టున్నావ్‌’’ అనీసరికి ‘‘అన్నపూర్ణని నేనెప్పుడైనా ‘అక్కా’ అని పిలటం ఇన్నావా, తన గురించి చెబుతూ అక్కా అని సంబోధించటం ఇన్నావా? లేదా తను నన్ను తమ్ముడూ అని పిలటం కానీ, నా గురించి ఎవరికైనా చెబుతా నన్ను తమ్ముడని సంబోధించటం ఇన్నావా?


నువ్వు గమనించేవో లేదో నువ్వు కానీ అమ్మ కానీ, తనని ‘మీ అక్క’ అని సంభోదిత్తంటే నాకు పిచ్చి కోపం వొచ్చేసీది. నాకు చిన్నప్పటి నించి తన మీద ‘అక్క’ అనే భావం లేదు’’.


‘‘అంటే నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిత్తన్నావా?’’ అని అడిగేను.


‘‘చ! చ! లేదన్నయ్యా, ప్రేమించటం అంటే ఏంటో తెలివదు కానీ తను లేకుండా బతకలేను, తను ఎప్పుడూ నా ప్రక్కనే ఉండాలి. తను నాతో మాత్రమే మాట్లాడాలి. తన ఇంక స్కూలుకి రాదు అంటే నాకు మొత్తం స్కూలే మానెయ్యాలనిపిత్తంది’’ అంటా ఆడి బాధని, ‘‘అనూ’’పై ఆడికున్న అవ్యాజమైన, అనిర్వచనీయమైన అనురాగాన్ని అనూపై ఆడికున్న అంతులేని ప్రేమని నా కర్దమయ్యీలా చెప్పేడు.


ఏదిఏమైనా అంత బాధ పడుతున్న ఆడు కానీ, ఆడి బాధని అర్ధం చేసుకున్న నేను కానీ ఈ పరిస్థితిని మార్చటం మాట దేవుడెరుగు కనీసం ప్రభావితం చేయలేని స్థితి. ఈ స్థితిలో తమ్ముడి మీద నాకు ఎనలేని ప్రేమ, జాలి, పొంగి కన్నీటి రూపంలో పొర్లింది.


ఆడిని గట్టిగా కావిలించుకున్నాను.

ఇది నా స్టైల్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌.


***

పెళ్ళికి ముందు అన్నపూర్ణని బతిమాలో భయపెట్టో ఆళ్ళ పిన్ని గారూరు ఫ్రెంచి యానాం తీసుకెళ్ళి అక్కణ్ణించి ముహూర్తానికి అన్నవరం తీసుకెళ్ళి పెళ్ళి జరిపించేసేరు.


అన్నపూర్ణ పెళ్ళి చేస్కోడానికి ఊరెళ్ళిన ఆరోజు నించి ఆనంద్‌ ఆడు ఎప్పుడూ ఉండీలా చలాకీ తనానికి విడాకులిచ్చీశాడు. మొఖంలో కళ పోయింది. జీవితం అంతా చేజారిపోయిన వైరాగ్యం నిర్లిప్తత!


పెళ్ళయ్యాక ఆళ్ళింటికొచ్చిన అన్నపూర్ణ ఒకసారి మా ఇంటికొచ్చింది. నందూని పట్టుకొని ఆపకండా ఓ పావుగంట ఎక్కిఎక్కి ఏడ్చి తన గుండెల్లో అన్ని రోజులూ పోగేసుకున్న దు:ఖాన్ని పారబోసింది.

మాటల్లేని ఆ క్షణంలో అనూ ఆడికిచ్చిన వాగ్ధానం, ‘‘ఎళ్ళొత్తానురా’’! అంటా ఇంకెప్పటికీ నెరవేర్చలేని వాగ్ధానం చేసి ఆడి కౌగిట్లోంచి, మా ఇంట్లోంచి ఎళ్ళిపోయింది.


చివరగా అనూ చూసిన చూపు, అన్నపూర్ణ మొఖం ఆడి మెదడులో, మనసులో చిరంతరంగా ముద్ర ఏసుకున్నాయి. ఆటిని మర్చిపోవటానికి ఎంత ప్రయత్నించినా వాడి మనసు మాట వినలేదు. మారాం చేసింది. ఆ మారాం ముదిరి వాడిని మానసిక వ్యాధిగ్రస్తుడిలా బెంగతో మంచం పట్టీలా చేసింది.


తిండి తినటం మానీసి మంచానికే మిత్రుడైపోయేడు. మంచం పట్టి మానసికంగా కుమిలిపోతున్న ఆడిని చూసి నా గుండె తరుక్కుపోయీది.


మనోవేదనకి మందు లేదని తెలిసినా పెద్ద హాస్పటల్‌కి తీసుకెళ్తే, ఏమి జబ్బు లేదని ఆడి మనోవేదనని మాన్పలేమని చేతులెత్తీశారు.


ఈ సమయంలో ఆడికి నేను అన్నలా కాక జతగాడిలా అన్నీ చేత్తా, అమ్మ, నేను ఆడిని ఎంతో ఆదరిత్తా, ఆడిని మామూలు మనిషిని చేయటానికి పది నెలలు పట్టింది. చావు ముఖద్వారం దాకా ఎళ్ళిన ఆణ్ణి రక్షించుకోడానికి ఏమేమి చేయాలో అన్నీ చేసేము.

ఈ ప్రయత్నాల్లో మాకు సహకరించింది అన్నపూర్ణ చిన్న చెల్లెలు భవాని!


తమ్ముడికి అన్నపూర్ణ మీదున్న అనురాగం భవానీ మీదికి మళ్ళితే, కొంచెమైనా ఓదార్పు పొందుతాడని నేను చేసిన ప్రయత్నాలు ఫలించేయి.


‘‘ఎందుకంటే సైకలాజికల్‌గా ఒకరిమీద మనకి విపరీతమైన ప్రేమ, అభిమానం, అనురాగం ఉంటే అది ఆళ్ళకి సంబంధించిన వ్యక్తుల మీదికి, వస్తువుల మీదికి బదిలీ అవుతాయి. ’’


ఒక్క ప్రేమే కాదు అది కోపమైనా, ద్వేషమైనా! అందుకే మనం ప్రేమించినోళ్ళిచ్చిన చాక్లెట్‌ రేపర్‌ కూడా మనకి చాలా విలువైనదిగా కనిపిత్తాది. ఆ ప్రేమ ఆ రేపర్‌ని కూడా దాచుకునీలా చేత్తాది. ఇచ్చిన మనిషి మీదున్న ప్రేమ ఇచ్చిన వొస్తువుల మీదికి బదిలీ కావటం దీన్నే ‘‘ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ఎమోషన్‌’’ అంటారు.


అదెంత దాకా పని చేసిందో తెలివదు కానీ ఆడు నయం అయ్యేడు. మళ్ళీ చదువులో పడ్డాడు. భవానీ తోటే డిగ్రీ చదివేడు. ఇప్పుడు ఆడు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో మాస్‌ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్‌ చేసి ‘‘ఆజ్‌తక్‌’’ న్యూస్‌ ఛానల్‌లో న్యూస్‌ ప్రెజంటర్‌గా చాలా పాపులరయ్యేడు. చాలా బాగా స్థిరపడ్డాడు.


తనతో డిగ్రీ వరకా చదివిన భవాని ఆడికి ప్రపోజ్‌ చేత్తే, నవ్వుతా తనని నొప్పించకండా రిజెక్ట్‌ చేసేడు. ఇప్పుడు ఆడి వయసు 28 సం॥లు. పెళ్ళి చేసుకోమని ఎంతమందిమి గోల చేత్తన్నా సమాధానం చెప్పట్లేదు.


ఓ రోజు ఇంటికొచ్చినపుడు అమ్మా, నేను గట్టిగా నిలదీసీసరికి, అసలు ఇసయం చెప్పేడు. ‘‘తనకి అన్నపూర్ణ ముఖ కవళికలతో అటు తెలుపు ఇటు నలుపు కాకండా గోధుమ ఛాయతో, పెద్ద పెద్ద కళ్ళతో, పొడవాటి జుట్టుతో ముఖ్యంగా పన్ను మీద పన్నుతో ఉన్న అమ్మాయి, అంటే అచ్చం అన్నపూర్ణ లాంటి పోలికలున్న అమ్మాయిని తీసుకొస్తేనే చేసుకుంటాను’’ అంటా కండీషన్‌ పెట్టేడు.

ఇన్నేళ్ళకైనా ఒప్పుకున్నాడని అసాధ్యమైనా, మేమూ ఒప్పుకున్నాం. ఎతకటం మొదలెట్టెం. కానీ గత రెండుళ్ళుగా ఎతుకుతున్నా దొరకలేదు. ఓ రోజు చిరాకొచ్చి ఆడినన్నాను ‘‘ఒరేయ్‌! నీకు తెలిసీ తెలియని వొయసులో ప్రేమో, ఆకర్షణో తెలియని వొయసులో పరిచయమైన అమ్మాయి లాంటి అమ్మాయే కావాలంటే ఎలా’’ అంటే,


ఆడు చెప్పాడు ‘‘అన్నయ్యా నాది ప్రేమ కాదన్నది ఎవరు? నాదే నిజమైన ప్రేమ ఎందుకంటే పన్నెండేళ్ళ వయస్సులో పుట్టిన ప్రేమ 28 ఏళ్ళు వచ్చేవరకూ ఏ మాత్రం వాడిపోకుండా, వీడిపోకుండా, పద్నాలుగేళ్ళపుడు ఎంత తాజాగా ఉందో ఇప్పటికీ అంతే ఫ్రెష్‌గా ఉంది. అందుకే ఇన్నేళ్ళలో నాకు పరిచయమైన ఎంతోమంది అమ్మాయిలలో ఫ్రెండ్స్‌నే చూసేను.

కానీ ప్రియురాలిని ఎతుక్కోలేదు.


ఎందుకంటే ఆళ్ళల్లో అన్నపూర్ణ లాంటి ముఖ పోలికలే కాదు లక్షణాలు కూడా కన్పించలేదు నాకు. తను ఎళ్తా నాతో చివరిగా ‘‘ఎళ్ళొత్తాను’’ అంటా ఎళ్ళింది.

తను వత్తాది.

తన రాక కోసమే ఎదురు చూత్తన్నాను.


తను తప్పకుండా వత్తాది. అన్నపూర్ణగా కాకపోతే ఇంకో పేరుతో అదే రూపంతో..

ఇక ఈ పన్నెండేళ్ళకే ప్రేమంటావా? నీకో ఇసయం చెప్పనా?

సైకాలజి ప్రకారం బిడ్డ పుట్టిన ఐదవ నెల నించి ఆడికి లైంగిక స్పందనలు మొదలౌతాయి. దాన్ని లిబిడో అంటారు. అది మనలో మనకే తెలియకండా స్పందిస్తా ఉంటుంది. కాబట్టి నాది ఖచ్చితంగా మెచ్యూర్డ్‌ లవ్వే!’’


ఆడలా చెప్పాక నాకు మాట రాలేదు. మేమిక ఆడి పెళ్ళి మీద ఆశలు వొదిలేసుకుంటున్న రోజులవి.

మరి మా అమ్మ శివాలయంలో రాజరాజేశ్వర స్వామికి, అమ్మవారికి చేయించిన పూజల ఫలమో ఆడి ప్రేమ బలమో! తనతో పనిచేసీ నార్త్‌ ఇండియన్‌, పంజాబీ పేరు ఆంచల్‌ కౌర్‌!


అచ్చం రూపంలో అన్నపూర్ణకి డూప్‌లా ఉండే ఆంచల్‌, ఆడి మనసులోకి మా ప్రమేయం లేకుండా, ఆడి జీవితం లోకి మా అందరి అనుమతితో ప్రవేశించింది.


ఈ రోజు ఆళ్ళ పెళ్ళి.

ఆడు తన గురించి చెప్పిన అభిప్రాయం ప్రకారం ఆంచల్‌ తన రూపంలోనే కాదు ఆడిని ప్రేమించటం లోనూ అన్నపూర్ణకి పోటీనే!


ఇదీ మా తమ్ముడు ఆనంద్‌ ప్రేమకథ ‘‘అ’’ నుంచి అన్నపూర్ణ నుంచి ‘‘ఆ’’ వరకూ ఆంచల్‌ కౌర్‌ వరకూ చేసిన ప్రేమ ప్రయాణం.


ఆడి ప్రేమ ప్రయాణం సుఖాంతం కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీకో?


***

========================================================================

సమాప్తం

========================================================================

రత్నాకర్ పెనుమాక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రత్నాకర్ పెనుమాక

నేను రత్నాకర్ పెనుమాక. యానాంలో ఉంటాను. B.Sc, MBA చదివి వివిధ బహుళ జాతి కంపెనీల్లో HR డిపార్టుమెంటులో ఉన్నతోద్యోగాలు చేసి ఉద్యోగ విరమణ చేసాను. ప్రజా సేవ చేయాలనే బలమైన కాంక్షతో 2005 లో యానం లో ఒక స్వచ్ఛంద సేవాసంస్థ నెలకొల్పి పూర్తికాల సామాజిక సేవ చేస్తున్నాను. ఏవిధమైన ఫండ్స్ వసూలు చేయకుండా నా స్వంత నిధులతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. వ్యక్తిగతంగా 41 సార్లు రక్తదానం చేసాను. మూడు సంవత్సరాల నుంచి రచనలు చేస్తున్నాను. 2022 లో నా మొదటి కథా సంపుటి "గౌతమీ తీరం" ఆవిష్కరించాను . అది మంచి పాఠకాదరణ పొందింది. ఈ సంవత్సరం నా రెండవ కథా సంపుటి "గౌతమీ ఒడ్డున " ఆవిష్కరించ బోతున్నాను. ఇప్పటి వరకూ 30 కవితలు 50 కథలు 5 నవలలు రాసాను. ఇవన్నీ అముద్రితాలే. 9 నెలల నుంచే పోటీలకు రచనలు పంపుతున్నాను. ఇప్పటికి 9 సాహిత్య పురస్కారాలందుకున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న పాఠకులకు, పోటీ నిర్వాహకులకు, న్యాయనిర్ణేతలకు సదా కృతజ్ఞుడను.




54 views1 comment

1 Comment


అ నుండి ఆ వరకూ కథ ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్కంఠ భరితంగా సాగింది.

-Janaki from Kakinada

Like
bottom of page