top of page

ఆ రోజుల్లో... ఆ ఇద్దరు....

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Youtube Video link

'Aa Rojullo Aa Iddaru' New Telugu Story

Written By: Ch. C. S. Sarma

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


అది కరోనా సమయం.

అయినా వాళ్లే ఒకరినొకరు దూరం పెడుతున్న రోజులు.

అలంటి సమయంలో తమకు ఏమీకాని కూలీల కోసం ఒక లారీ డ్రైవర్, క్లీనర్ చూపిన మానవత్వం ఎంతో అభినందనీయం, అందరికీ ఆచరణీయం.

మానవత్వపు విలువలను చాటి చెప్పే ఈ కథను చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారు రచించారు.


2019 నవంబర్ ... డిశంబర్లో చైనాలో మహమ్మారి పుట్టి ప్రబలి వ్యాపించి 2020 ఫిబ్రవరి మార్చి నాటికి యావత్ ప్రపంచాన్ని కమ్ముకొని... లక్షల్లో వ్యాధి పీడితులు కాగా... లక్షల్లో మరణాలు సంక్రమించాయి.

సువిశాల భారత దేశంలో.... నిర్విరామంగా కొనసాగే అనేక రకాల కట్టడ నిర్మాణాల్లో పనిచేసేటందుకు కూలీలు... ఒక ప్రాంతాన్నుంచి మరో ప్రాంతానికి (పనిదొరికే చోటికి) వెళ్లి పనిచేసుకొంటూ పొట్ట నింపుకుంటారు. అలాగే అనేక రకాల వస్తువులను లారీ ట్రాన్స్‌పోర్టు సర్వీస్లు... ఒక వూరి నుండి మరొకపూరికి చేరవేస్తుంటాయి.

దేశంలో కరోనా వ్యాధి తీవ్రత వలన 'లాక్డౌనును గవర్నమెంటు అమలు పరచింది. మాస్కులు... సోషల్ డిస్టెన్స్... విధిగా జనం అంతా పాటించవలసిన సమయం... వ్యాధి తీవ్రతగా సంక్రమించిన ప్రాంతాలను రెడ్ జోన్స్... నలువైపు కట్టుదిట్టాలతో ఇతరులు... ఆ ప్రాంతానికి రాకుండా రక్షకభటుల బందోబస్తులు నిర్దేశింపబడిన సమయం... రాముడు లారీ డ్రయివర్....

అతని శిష్యుడు క్లీనర్ అంజి... ప్లయ్‌వుడ్‌ను హైదరాబాద్ ఎల్.బి.నగర్. గోడౌన్లో దించారు. తిరుగు ప్రయాణం వయా కడప తిరుపతి... మీదుగా చెన్నైకి చేరాలి...

కరోనా కారణంగా కట్టడ నిర్మాణాలు అపివేయబడ్డాయి. వలసగా వచ్చిన కూలీలకు పనిలేని కారణంగా కూలీ డబ్బులు రానందున... మహానగరంలో పప్పు నిప్పు నీరు... కూడా కొనవలసి వచ్చినందున నగరంలో నిలువలేక... ప్రయాణ సౌకర్యాలు రైళ్లు... బస్సులు... ప్రైవేట్ వాహనాలు అన్ని ఆగిపోయినందున... వీరభద్రుడి లేబర్ నలభైమంది స్వగ్రామమైన రేణుగుంటకు కాలినడకన బయలుదేరారు. హైదరాబాద్ నుండి తిరుపతి 560 కిలోమీటర్లు... వీరభద్రుడి ముఠాలో ఐదుగురు చిన్నపిల్లలు... పదిహేనుమంది. పాతికేళ్లవాళ్లు... పదిమంది యాభైకి లోపు... పదిమంది అరవై లోపు... వయస్సు వారున్నారు.

మొత్తం నలభైమందిలో పాతిక మంది మగ... పదిహేనుమంది స్త్రీలు. వారిలో... మంగమ్మ గర్భిణీ నవమాసాలు... మొగుడు రాజయ్య... బరువునంతా తను మోస్తూ... భార్యచేతిని పట్టుకొని మెల్లగా నడుస్తున్నాడు.

అందరూ కాలి నడకలో... దేవుని మీద భారం వేసి హైదరాబాదు నుండి బయలుదేరారు. చిన్ని... మణి అక్కా చెల్లెళ్లు... కవలలు... ఇరవై సంవత్సరాలలోపు... అందరికీ సాయంగా వరస కలిపి ఆప్యాయంగా మాట్లాడుతూ.. ముందుకు నడుస్తున్నారు.

రాముడు... అంజి.. ఖాళీ లారీతో షమ్‌షాబాద్‌ను సమీపించారు. వారిని పోలీసులు అటకాయించారు. ముందుకు పోయేదానికి లేదని లారీని ప్రక్కన పెట్టమన్నారు.. రాముడు లారీని రోడ్డు ప్రక్కన నిలిపి... దిగి, పోలీసులను సమీపించాడు. "సార్!..." "ఎక్కడికి పోవాలా?"

"తిరుపతికి సార్!.." "బండ్లో ఏముంది?..." "ఏంలేదు సార్.. ఖాళీ... ప్లయ్‌వుడ్‌ను ఏసుకొచ్చి దించినా!... ఎనక్కి వెలుతుండా సామీ!.. బయలుదేరనా సామీ!..." చిరునవ్వుతో అడిగాడు..

"ఏందీ!.. ఏరా నేను నిన్ను బయలుదేరమన్నానా!.." "అహ!... మీరనలేదు సామీ!... నేను అడుగుతుండా!..." "బండి నీదేనా?..." "సామీ!... నేను అంత గొప్పోణ్ణి కాదండీ... డ్రైవర్నీ..." దీనంగా చెప్పాడు రాముడు. "ఇప్పుడప్పుడే పోయేదానికి లేదు... అడ్డంలే... పక్కకు తప్పుకో..." చిరాగ్గా చెప్పాడు పోలీసు.

రాముడు తన లారీని సమీపించాడు. “అన్నా!... ఏమంటుండాడు?..." అడిగాడు అంజిగాడు. "పక్కకు తప్పుకో అన్నార్రా!.... కాస్త గడ్డి ఎయ్యాల్సినట్టుందిరా... వాడి ఎవ్వారం..." "అదే అయితే ఏసెయ్యి అన్నా!... ఎల్లిపోదాం...." అంజి చెప్పాడు.

రాముడు బీడీ వెలిగించాడు. రెండు దమ్ములు లాగి కొంత ముదుకు వెళ్లి... పని ముగించుకొని మెల్లగా పోలీస్‌ను సమీపించాడు. చేతిలో ఐదు వందలు వున్నాయి. "ఏందయ్యా!..." ఆవేశంగా అన్నాడు పోలీస్. "సార్" "ఏంలేదు సార్... ఎల్లిపోతా! వదలండి సార్!..” తన చేతిని పోలీసు చేతితో కలిపాడు. నోటు చేయిమారింది. “సరే... ఎల్లిపో!..." అన్నాడు పోలీస్.

రాముడు సంతోషంగా సలాం కొట్టాడు. వేగంగా నడిచి లారీని సమీపించాడు. ఎక్కాడు. అంజి ఎక్కి వెనక్కి చూచి "రైట్ అన్నా..." అన్నాడు. రాముడు లారీని కదిలించాడు.. *** వీరభద్రుడి ముఠా మెల్లగా ముందుకు సాగిపోతున్నారు.. వర్షం ప్రారంభమయింది..... పిల్లా... పెద్దా... ఆ నలభైమంది గుడ్డలను తల నిండా కప్పుకొని... మెల్లగా చలికి వణుకుతూ నడుస్తున్నారు.

అందరికంటే ఎక్కువ శ్రమ... మంగమ్మది నిండు చూలాలు. చిన్ని... రాజయ్య తలపై వున్న లగేజిని తీసుకొంది. రాజయ్య మంగమ్మను... తన చేతిని ఆమె నడుము చుట్టూ వేసి.. మెల్లగా నడిపిస్తున్నాడు. అందరికంటే... వెనుక ఆ జోడీ నడుస్తూ వుంది. రాముడు లారీ వారిని సమీపించింది.

అంజి... మంగమ్మను... రాజయ్యను చూచాడు. 'ఆ గర్భిణీ స్త్రీ... అమ్మ... రేపో మాపో... ఓ బిడ్డకు అమ్మ కాబోతోంది... అంజిగాడి మదిలో మధుర భావన.... "అన్నా!.." "ఏందిరా!..." "అటు చూడు ..." ఎడమవైపు చివరన చూచాడు రాముడు...

"కడుపుతో వుందిరా!..." "అవునన్నా!... వర్షం కురుస్తావుంది... బండి ఆపన్నా!... వాళ్లని ఎక్కించుకుందాం... మనకు పుణ్యం వస్తుందన్నా!..." దీనంగా అర్థించాడు అంజి. రాముడి మనస్సు అంజి మాటలకు చలించింది.

"అవున్రా పాపం..." లారీని అపాడు. "అన్నా!... దిగి వారిని లారీ ఎక్కమని చెపుతా..." "ఆ ... దిగరా!..." "అంజి దిగి పరుగున వారిని సమీపించాడు. "అన్నా!... ఏడకి పోవాలా?...". "తిరుపతికి..." "రండన్నా!... మేమూ ఎల్లేది తిరుపతికే... లారీ ఎక్కండి.. మా అన్న రమ్మంటుండాడు!..." నవ్వుతూ చెప్పాడు అంజి.

వీరభద్రుడి మిగతా గ్యాంగు వెను తిరిగి చూచారు. కొందరు మొగవారు పరుగున అంజని సమీపించారు. "మేమూ లారీ ఎక్కొచ్చా?..." దీనంగా అడిగారు.. "మేమంతా ఒక్కటే !.” వీరభద్రుడు అన్నాడు. "అన్నా!... మా అన్నను అడుగు..." అన్నాడు అంజి.

వీరభద్రుడు లారీని సమీపించి.... "అన్నా.. మేమూ ఎక్కుతాం అన్నా ... మేమంతా ఒక్కటే.. తిరుపతి ఎల్లాల.." దీనంగా అడిగాడు. రాముడు... బయటి వాతావరణాన్ని చూచాడు. వైపర్లు లారీ ముందరి సైట్ గ్లాస్లను తుడుస్తూ వర్షపు నీటిని క్రిందకి జారేలా చేస్తున్నాయి. అందరూ చలికి వణుకుతున్నారు

'పాపం... ఈ వర్షం ఇంకా పెద్దదయ్యేలా వుంది... రోడ్డు ప్రక్కన ఎక్కడా ఒక చెట్టుకూడా లేదు. వున్న చెట్లను రోడ్డు విశాలం చేసేదానికి నీడనిచ్చే చెట్లను కొట్టి పారేశారు. చిన్నా పెద్దా అందరూ వున్నారు. సాయం చేయాల...' అనుకొన్నాడు రాముడు. "అందరూ.. ఎక్కండి.." చెప్పాడు...

అందరూ లారీ ఎక్కారు. మంగ, రాజన్న తప్ప.... "అన్నా!... నేను బాడీలో ఎక్కుతా!. ఈ అన్నను... ఆమెను ముందు ఎక్కించుకో అన్నా!!" దీనంగా కోరాడు అంజి. అంజిగాడికి ఆ గర్భవతిమీద కలిగిన అభిమానానికి... రాముడికి ఆనందం కలిగింది. "ఆ... వాళ్లను ఎక్కించు..."

ముందు మంగను.. తర్వాత రాజన్నను ముందు క్యాబిన్లో ఎక్కించి... అంజి వెనుకాల బాడీలో ఎక్కాడు. రాముడు బండిని స్టార్ట్ చేశాడు.. *** కొంతదూరం వెళ్లే సరికి వర్షం తగ్గింది. సమయం రాత్రి ఎనిమిది గంటలు. లారీని ఒక చోట దాబా ముందు భోజనానికి ఆపాడు రాముడు. తాను క్రిందికి దిగాడు.. "రేయ్! అంజీ!... దిగు..." అంజి లారీ దిగబోతూ.... "మీరంతా భోంచేశారా !..." అడిగాడు అంజి.

"మధ్యాహ్నం జొన్న రొట్టెలు తిన్నాం..." చెప్పాడు వీరభద్రుడు. "మరి ఇప్పుడు?....". "మా దగ్గర ఏమీ లేదు..." విచారంగా చెప్పాడు వీరభద్రుడు... అంజి ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూచాడు. మనస్సున ఏదో భావన...

"అన్నా... రెండు వారాలుగా పనిలేదు. వున్న డబ్బులు అన్నీ తిండికి అయిపోయినాయ్ అన్నా...." దీనంగా చెప్పాడు వీరభద్రుడు కొన్ని క్షణాల తర్వాత.... "వున్న పూరైతే.. ఇలాంటి ఇబ్బంది వస్తే.. అందరూ తెలిసినవాళ్లు కాబట్టి ఒకరు కాకపోయినా... మరొకరు సాయం చేస్తారు. పరాయి పూర్లో ఎవరికి ఎవరన్నా. అందుకే సొంతూరికి బయలుదేరామన్నా... "అతని కళ్లల్లో కన్నీరు.

అంజి మనస్సుకు ఎంతో బాధ.. వేగంగా దిగి రాముణ్ణి సమీపించాడు. "ఏరా.. ఇంతసేపు... నేను చపాతి చెప్పినా ... నీకేం కావాలో చెప్పు .." అన్నాడు "అన్నా ... ఓ చిన్న మాట !..." "ఏందిరా !..." "పాపం... వాళ్లకు తినేదానికి ఏమీ లేదంటన్నా.." "నేను ముందు కూకోనుండారే... వాళ్ళిద్దరికీ చపాతీ పంపినా !.".

"నేను చెప్పేది బాడీలో వుండే వాళ్లను గురంచన్నా!..." "అట్టాగా !..." "అవునన్నా!... తలా రెండు చపాతీలు ఇప్పిద్దామన్నా ... పాపం... వాళ్ల ఆకలి తీర్చినోళ్లం... అవుతాం... ఏమంటావు అన్నా!..... "మనం ఓనర్ గారికి డబ్బు లెక్క చెప్పాలి కదరా!..." "అవుననుకో అన్నా!... నాకు బత్తా డబ్బులు ఒద్దన్నా!..." అనునయంగా చెప్పాడు అంజి. రాముడు అతని ముఖంలోకి పరీక్షగా చూచాడు. "అన్నా!... వాళ్లందరిదీ తిరుపతే అన్నా!..." దీనంగా రాము కళ్లల్లోకి చూచాడు అంజి... 'అంజిగాడు నాకన్నా చిన్నోడు... నేను ఏంచెబితే... అదిచేసేవాడు. ప్రతి ట్రిప్పులో... మందుకు... పొందుకు ఎంతో తగలేసేవాణ్ణి... ఈ కరోనా కోవిడ్ 19 కారణంగా ఆ ఆటలన్నీ సాగని పరిస్థితి... వయస్సులో చిన్నవాడైనా... వాడి మనస్సున మావత్వం వుంది. మరి... నేను... వాడికంటే పెద్దోణ్ణి... మరి నా భావన వాడికన్నా గొప్పగా వుండాలిగా !..." అనుకొన్నాడు రాముడు. "రేయ్!... అంజీ!... సరే... అందరికీ చపాతీలు ఇప్పించరా!... పాపం వాళ్లకీ మనలాంటి ఆకలే కదరా!..." జాలిగా చెప్పాడు రాము. అంజి ఆనందంగా చపాతీలు అందరికీ ఆర్డర్ చేశాడు. ముగ్గురు మగవారిని రమ్మని... అందరికీ చపాతీలు కుర్మా.... అందించాడు. తనూ తిన్నాడు. అందరినీ అడిగి మరీ కనుక్కొన్నాడు. వారంతా ఆనందంగా.. 'తిన్నాము సామీ !...' అన్నారు..... రాము... అంజీ లారీ ఎక్కారు. రాము లారీని కదిలించాడు. కడుపులో చల్ల నిండితే... కాయకష్టం చేసేవారి మనస్సు పరవశంతో... ఆనందంగా ఏదో రాగాలాపన చేస్తుంది. అదే చేసింది చిన్ని... మణి వంతపాడింది.... అందరికీ వుత్సాహం... వూపుతో రాగాలాపన... పదోచ్ఛారణ... ఆనందంగా చేశారు. ప్రశాంతమైన రాత్రి... మేఘాలు... వర్షం మాయమై.. త్రయోదశి.. పండు వెన్నెల.. చిన్ని, మణి ఆనందంగా పాడుతున్నారు. మిగతా వారంతా వంతపాట.. రాము.. ఆనందంగా ఆ పాటలను అలకిస్తూ వారిని నడుపుతున్నాడు. అంజి బాడీలో కూర్చొని వున్న కారణంగా చిన్నీ... మణీలు ఒక పాటను ముగించగానే....

"అహా! ఓ చిన్నీ ...మణీ.. అద్భుతం. చాలాచాలా బాగా పాడుతుండారు... ఏదేది... ఇంకొకటి…” అలా వారిని అభినందించి పాటలు పాడించాడు అంజి. "ఓ అంజిబాబు!... " పిలిచాడు వీరభద్రుడు... "ఏందన్నా..." "ఏం అనుకోవు కదా!" నవ్వాడు వీరభద్రుడు. "ఏందన్నా... ఏం అనుకోనన్నా.. విషయం ఏంటో చెప్పు..." అడిగాడు అంజి,

"మా చిన్నిని పెళ్లి చేసుకొంటావా ..." "అన్నా!... నేను ఈ బండికి క్లీనర్ ని అన్నా... నాకు ఆస్థి గీస్థి ఏమీలేదు..." అంజి జవాబు. "ఆ... తమ్ముడూ !.. మాకు మాత్రం ఏముంది... రెక్కలు ఆడితేనే డొక్కలు ఆడతాయ్ !.." నవ్వాడు వీరభద్రుడు.

"అన్నా! నాకు అమ్మ వుందన్నా.. నేను ఏంచేసినా నా అమ్మకు చెప్పకుండా చేయను..." అన్నాడు అంజి. "అట్టాగా ." "అవునన్నా!...". "ఓ మాట సెప్పు...." "ఏందన్నా..." "చిన్ని నీకు నచ్చిందా! నేను మీ అమ్మతో మాట్లాడతా.."

"చిన్నికేం అన్నా.. బంగారు బొమ్మ... " తన మనస్సులోని మాటను దాపరికం లేకుండా చెప్పాడు అంజి. "సరే అంజన్నా!.. నేను తిరుపతికి చేరాక... నీతో మీ ఇంటికి వస్తా!.. మీ అమ్మతో మాట్లాడతా!. ఇది అబద్దం కాదు నిజం!." అన్నాడు వీరభద్రుడు.

"అహా!..." నవ్వాడు అంజి, "తప్పకుండా వస్తా తమ్ముడూ!.." చిన్నవైపు చూచి.... . "చిన్నీ!... ఏమంటానే!.. అంజిగారు ఇష్టమేనా?..." అడిగాడు వీరభద్రుడు. "పో మావా .... నీవు నీ మాటలు!..." ముసి ముసి నవ్వుతో చెప్పింది చిన్ని. అంజివైపు ప్రేమాభిమానాలతో చూచింది. అంజి కొన్ని క్షణాలు చిన్ని ముఖాన్నిచూచి చిరునవ్వుతో తల దించుకొన్నాడు.

రాము లారీని ఆపాడు... అది ఓ హోటల్ ప్రాంతం... "రేయ్... అంజి !... వాళ్లకి ఏదైనా అవసరాలుంటే తీర్చుకోమని చెప్పరా!.." చెప్పాడు... రాము లారీ దిగాడు. "సరే అన్నా ..." అందరికీ ఆ విషయాన్ని చెప్పాడు అంజి. కొందరు దిగారు. పని ముగించుకొన్నారు. టీ తాగారు... అందరూ లారి ఎక్కారు... రాము బండిని స్టార్ట్ చేశాడు.

సమయం... రాత్రి మూడుగంటల ప్రాంతం... లారీ కడపని సమీపించింది. డ్రైవర్ రాము ప్రక్కన రాజయ్య డోర్ ప్రక్కన మంగమ్మ కూర్చొనివున్నారు. మంగమ్మ కడుపులో సంకటం... నొప్పి.. బయటకు చెప్పకుండా మెడను కిటికీ వైపుకు త్రిప్పింది.. ముఖానికి చల్లని గాలి తగులుతున్నందున శరీరానికి కొంతవుపశమనం కలిగినా... కడుపులో బాధ పెరిగింది.

ముఖమంతా చమట... క్రింది పొట్టలో ఎంతో బాధ... కూర్చో లేకపోయింది... "అయ్యా !..." దీనంగా చూచింది మంగమ్మ... రాజయ్య ముఖంలోకి.... రాజయ్య ఆత్రంగా మంగమ్మ ముఖంలోకి చూచాడు. "అయ్యా !... నొప్పి... బండిలో కూర్చోలేను... నన్ను దింపయ్యా..." భోరున ఏడ్చింది... రాము మంగమ్మ ముఖంలోకి చూచాడు. ఆమె ముఖ భంగిమలను చూచి... ఆమె ప్రసవ వేదనతో బాదపడుతోందని గ్రహించాడు.

ఊరు.. రెండు కిలోమీటర్ల దూరం ఉంది... లారీ వేగాన్ని పెంచాడు... బస్టాండ్ దగ్గర ఆపాడు.. మంగమ్మ బాధతో ఏడుస్తూ... "అమ్మా... అమ్మా... " అంటూ బాధ పడుతోంది. "అంజి"..." బిగ్గరగా పిలిచాడు రాము. "అన్నా !!.."

"బండి దిగరా!..." అరిచాడు రాము. మంగమ్మ బాధను రాము చూడలేకపోతున్నాడు. అమాయకుడు రాజయ్య.... "మంగమ్మను కాపాడన్నా !.. మంగమ్మను కాపాడన్నా !... " అంటూ భోరున ఏడుస్తున్నాడు. మంగ వెనుకగా తన చేతిని వేసి పట్టుకొని బాదపడుతున్నాడు. "ఏందన్నా !..." క్రిందికి దిగి అడిగాడు అంజి...

"రేయ్ !... మంగమ్మకు నొప్పులురా, ఏడుస్తా వుంది... ఆ టీబంకులో ఆస్పత్రి దగ్గరలో ఎక్కడ వుందో కనుక్కొనిరా!..." ఆవేశంగా చెప్పాడు రాము. అంజి పరుగెత్తికెళ్లి ఆ టీమాస్టరును హాస్పటల్ గురించి అడిగాడు. అతను నేరుగా వెళ్లి ఎడమవైపు తిరగమని చెప్పాడు. అంజి లారీని సమీపించాడు.

టీబంకు అతను చెప్పిన మాటలు విన్న రాము... "రేయ్.. ఎక్కు " అన్నాడు. ఆంజి లారీ ఎక్కాడు. ఐదు నిముషాల్లో లారీ హాస్పిటల్ ను సమీపించింది. రాము... అంజి... దిగారు.. అంజి.. పరుగెత్తికి వెళ్లి నర్సుకు చెప్పి స్ట్రెచర్ తీసుకొచ్చారు. రాజయ్య లారీ దిగాడు...

అంజి సాయంతో రాజయ్య మంగను లారీనుంచి దించారు. స్ట్రెచర్ పై పడుకోబెట్టారు... మంగ ప్రసవ వేదనతో అల్లాడుతూ వుంది. నర్సులు ఆమెను గదిలోనికి తీసుకెళ్లారు... డ్యూటీ డాక్టరు ఆ గదిలోకి వెళ్లింది.

ఎంతో ఆందోళనలో రాజయ్య... అంజి... రాము హాస్పిటల్ వరండాలో నిలబడి విచార వదనాలతో లోనికి... చూస్తున్నారు... కాలు కాలిన పిల్లులా అటూ ఇటూ తిరుగుతున్నారు. వారి మధ్యన భారంగా ఓ అరగంట గడిచింది. నర్సు వేగంగా బయటకు వచ్చింది. "బాబు పుట్టాడు... తల్లీ బిడ్డా బాగున్నారు..." నవ్వుతూ చెప్పింది. ఆ ముగ్గురూ నిలబడి పోయారు. అంజి.. రామును... రాజయ్యను తాకి "అన్నా! బాబు పుట్టాడంట..." నవ్వుతూ చెప్పాడు.

ఆ ఇరువురి ముఖాల్లో వెయ్యి దీపాల వెలుగు... జేబునుండి ఐదువేలు డబ్బును తీసి రాము రాజయ్య చేతికి ఇచ్చి "అన్నా! ఈ డబ్బు నీ దగ్గర వుంచుకో... నీకు తోడుగా ఒకరిద్దరిని... వుంచుకో... మేము వెళ్లిపోతాము... అందరూ కలసి ఆమెను డిశ్చార్జ్ చేశాక రండి... " అంటూ అభిమానంతో చెప్పాడు..

రాజన్న ఆనంద భాష్పాలతో చేతులు జోడించాడు. చిన్ని... మణిలను లారీ దిగమన్నాడు... వారు దిగారు. రాము... అంజి, లారీ ఎక్కారు.... రాము స్టార్ట్ చేశాడు. "రామూ అన్నా ... అంజిబాబు పెళ్లి చిన్నితో జరిపించాలి. నేను మిమ్మల్ని కలుస్తా!." నవ్వుతూ చెప్పాడు. రాజయ్య....

చిన్ని ఓరకంట అంజి ముఖంలోకి చూసి నవ్వింది. దాన్ని గమనించిన రాము.... "అట్లాగే రాజయ్యా !.." నవ్వుతో చెప్పి... బండిని కదిలించాడు.. / సమాప్తి /


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.43 views0 comments

Opmerkingen


bottom of page