top of page

అడవిలో వర్షం

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


'Adavilo Varsham' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 06/02/2024

'అడవిలో వర్షం' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణఇప్పుడు మీకు తాత మోహన కృష్ణ గారు రాసిన అడవిలో వర్షం అనే కథను చదివి వినిపిస్తాను.   

ఒకానొక ఊరిలో రంగయ్య అనే ఒక చిరు వ్యాపారి ఉండేవాడు. రోజూ.. తన సరుకు తీసుకుని రాజధాని నగరానికి వెళ్లి.. అక్కడ అమ్మి..వచ్చిన డబ్బులతో జీవించేవాడు. రంగయ్య ఒంటరిగా ఆ చిన్న పల్లెటూరు లో ఉండేవాడు. ఊరిలో అందరూ పెళ్ళి చేసుకోమని సలహా ఇచ్చినా.. రంగయ్య తనకి వచ్చే సంపాదన చాలా తక్కువ అవడం చేత, పెళ్ళి వాయిదా వేస్తూ వచ్చేవాడు.


"నువ్వు పెళ్ళి చేసుకుంటే, నీ పెళ్ళాం నీకు తోడుగా ఉంటూ..నీ వ్యాపారానికి కుడా మంచి సలహా ఇస్తుంది.." అని తన స్నేహితుడు చంద్రయ్య సలహా ఇచ్చాడు.


"పెళ్ళి చేసుకుంటే.. నాకు వచ్చే సంపాదన సరిపోదు..పైగా నన్ను అర్ధం చేసుకునే పెళ్ళాం వస్తే సరి..లేకుంటే, డబ్బుల కోసం నేను ఇబ్బంది పడాలి.." అన్నాడు రంగయ్య 


"నువ్వు చెప్పింది కూడా నిజమే.." అని చెప్పి..బాగా అలోచించి మంచి నిర్ణయం తీసుకోమని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు చంద్రయ్య..


మర్నాడు.. రంగయ్య తన సరుకు తీసుకుని బయల్దేరాడు. ఆ ఊరికి, రాజధాని నగరానికి మధ్యలో ఒక చిన్న అడవి ఉంది. అది దాటుకుని వెళ్ళాలి. చీకటి పడితే, ఆ దారిలో జన సంచారం తక్కువ. ఎప్పుడూ రంగయ్య..తన పని ముగించుకుని..చీకటిపడక ముందే ఇంటికి చేరుకునేవాడు. కానీ..ఆ రోజు ఎందుకో..పెద్ద గిరాకీ తగలడం చేత, ఆలస్యం అయిపోయింది. ఆ మార్గంలో..అప్పుడప్పుడు క్రూర మృగాలు..దెయ్యాలు తిరుగుతూ ఉంటాయని, ఊరిలో అందరూ అనుకోవడం విన్నాడు రంగయ్య. చీకటి పడడం చేత..అడవి దారిలో వెళ్ళడానికి కొంచం భయపడ్డాడు. 


అప్పుడే మబ్బు పట్టి..చల్లటి గాలి వీస్తోంది. వర్షం కుడా పడేలాగా ఉందని అనుకుంటూ అడుగులు వేయసాగాడు. వర్షం మొదలై..పెద్దదయ్యింది. అదే సమయంలో అడవి లో ఉన్న రంగయ్య.. చెట్టు కిందకు పరిగెత్తాడు. చాలా సేపు తర్వాత ఆ దారిలో ఒక మనిషి రావడం గమనించాడు రంగయ్య. ఆ మనిషి ఆ చెట్టు కిందకే వస్తున్నాడు.


"ఎవరు మీరు..? పొద్దు పోయాక ఇక్కడ ఏం చేస్తున్నారు..?" అని అడిగాడు ఆ మనిషి

"నా పేరు రంగయ్య. ఇంటికి వెళ్తూ..ఇక్కడ వర్షం లో చిక్కుకున్నాను.."

"చీకటి పడితే..ఇక్కడ దెయ్యాలు తిరిగుతాయని నీకు తెలియదా..?"

"పొట్ట గడవడం కోసం తప్పదు కదా..! నేను ఒక్కడినే..నా కోసం బాధపడడానికీ ఎవరూ లేరు. ఇంతకీ మీరు ఎవరు..? ఎక్కడకు వెళ్తున్నారు..?" అడిగాడు రంగయ్య 

"నా పేరు దేవయ్య..నేను ఇక్కడే చుట్టుపక్కల ఉంటాను..ఇప్పుడు నాకు చాలా ఆకలి వేస్తోంది. తినడానికి ఏమైనా ఉన్నాయా..?"

"ఇదిగో.." అని తన దగ్గర ఉన్న పల్లీలు ఇచ్చాడు రంగయ్య..

"నీకు ఏమైనా సహాయం కావాలంటే చెప్పు...చేస్తాను" అన్నాడు దేవయ్య 

"నన్ను పెళ్ళి చేసుకోమని అందరూ చెబుతున్నారు. నాలాంటి పేదవాడికి అందమైన పెళ్ళాం ఎలా వస్తుంది..?"

"అదా.. నీ సమస్య...?"

"అదే కాదు..పెళ్ళి కి అయ్యే ఖర్చు కూడా నా దగ్గర లేదు.."

"నీ మనసులో ఎవరైనా ఉన్నారా..?" అడిగాడు దేవయ్య 

"నాకు రాజకుమారిని పెళ్ళి చేసుకోవాలని ఉంది. ఆ రాజభోగాలు అనుభవించాలని నా కోరిక. కానీ, నాలాంటి వాడికి అది సాధ్యపడదు కదా..!"

"నువ్వు నీకోసమని తెచ్చుకున్న పల్లీలు నాకు ఇచ్చావు. నా ఆకలి తీర్చావు.." అని తన అసలు రూపం లోకి వచ్చాడు దేవయ్య


తెల్లటి ఆకారంలో..గాలిలో తేలుతూ ఉన్నాడు దేవయ్య..

"దేవయ్య..! ఇలా.. మారిపోయావేమిటి..?..నువ్వు దెయ్య..మా..ఆ..?"


"దేవయ్య కాదు...దెయ్యాన్నే...! భయపడకు..నిన్ను ఏమీ చెయ్యను. నా ఆకలి తీర్చిన నీకు.. సాయం చేసి నీ ఋణం తీర్చుకుంటాను.."

"దెయ్యం...? నాకు సహాయం చేస్తుందా..?" 

"నేను మంచి దెయ్యాన్ని.. నాకు మంచి చేసినవారికి నేను మంచే చేస్తాను.."

"నేను నమ్మలేకున్నాను.." అన్నాడు రంగయ్య 


"నువ్వు రాజకుమారిని పెళ్ళి చేసుకోడానికి నేను ఒక ఉపాయం చెబుతాను..అలా చెయ్యి..." అని ఆ దెయ్యం రంగయ్యకు తన ఉపాయం చెప్పింది..


కొన్ని రోజులు పోయాకా..రాజకుమారికి ఒంట్లో బాగోలేదని..దెయ్యం పట్టిందని..నయం చేసినవారికి రాజకుమారిని ఇచ్చి వివాహం చేస్తానని చాటింపు వేయించాడు మహారాజు. ఆ దెయ్యం చెప్పినట్టుగా రంగయ్య..ఒక దెయ్యాల మాంత్రికుడిలాగా రాజ్యం లోకి ప్రవేశించాడు. రాజకుమారి ఉన్న చోటుకు వెళ్లి...ఆమెను దగ్గరగా చూసాడు. ఆమె అందానికే అందం..అనుకున్నాడు రంగయ్య. ఆమెను పెళ్ళి చేసుకుంటే.. అన్ని సమస్యలు తీరిపోతాయని ఆనందపడ్డాడు.


చాలా హడావిడి చేసిన తర్వాత..రాజకుమారి చెవిలో రంగయ్య.. 'అడవిలో వర్షం' అని చెప్పాడు. రాజకుమారి లో ఉన్న ఆ దెయ్యం..అక్కడకు వచ్చింది రంగయ్య అని గ్రహించి..బయటకు వచ్చేసింది..


"నా మాట నేను నిలబెట్టుకున్నాను రంగయ్య..! రాజకుమారిని పెళ్ళి చేసుకుని సుఖంగా ఉండు.." అని చెప్పి దెయ్యం మాయమైపోయింది..


రాజకుమారిని మళ్ళీ మాములుగా చూసేసరికి...మహారాజు చాలా ఆనందపడి.. ప్రకటించిన విధంగా రాజకుమారిని రంగయ్యకు ఇచ్చి పెళ్ళి చేసాడు..

సమాప్తం

కథను విన్న పాఠకులకు ధన్యవాదాలు. 


*****

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


73 views0 comments

コメント


bottom of page