కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Ame Peru Sailaja' Written By Venku Sanathani
రచన: వెంకు సనాతని
ఈ మధ్యనే ప్రభుత్వ కొలువుకు పదవీ విరమణ చేసిన నాకు పుస్తకాలు మంచి స్నేహితులయ్యాయి. ఉద్యోగం చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడూ చదివేవాణ్ణి. కానీ ఇప్పుడు పుస్తక పఠనమే ఉద్యోగమైపోయింది. రోజూ ఏదో ఒక పుస్తకం ఎంతో కొంత చదవకపోతే రోజు గడవదంటే నమ్మండి.
రోజూ లాగానే టైముకి టిఫిన్ చేసి యధావిధిగా ఏదైనా పుస్తకం చదువుదామని పుస్తకాల అల్మారా వైపు నడిచాను. పుస్తకాల వెతుకులాటలో మనసు ఓ పుస్తకం దగ్గర ఆగింది. అది భౌతికంగా అచ్చైన పుస్తకం కాదు మానసికంగా అచ్చైన పుస్తకం. నా స్వహస్తాలతో నేను వ్రాసిన నోటు పుస్తకం. ఆ పుస్తక స్పర్శతో జ్ఞాపకాలు గిర్రున తిరిగే సరికి కళ్ళకు కొద్దిగా తడి తగిలింది. అపురూపంగా ఆ పుస్తకాన్ని అందుకుని తెరిచాను. మొదటి పేజీలో రెండంటే రెండు చిరు వాఖ్యాలతో వ్రాసిన ఆ అక్షరాల అల్లికకు మది తుళ్ళక మానదు.
శైలజ..
ఓ జ్ఞాపకం
ఓ వ్యాపకం
నలభై ఏళ్ళ కిందట ఇదే పుస్తకంలో గుట్టుగా వ్రాసుకున్న మొదటి మాటలివి. ఇంకా ఎన్ని మాటలు పూదోటలై విరిశాయో పుస్తకానికి నాకు తప్ప మూడో కంటికి కూడా తెలీదు. ఆమె చూపుల కోసం ఆమె మాటల కోసం మనసున మునిమాపులు పడిగాపులు కాచాయంటే, ఆ క్షణాలు అద్భుతం అంతే..
******
అవి బీఎస్సీలోకి అడుగుపెట్టిన రోజులు. కౌమారం దూరమై యవ్వనం చేరువైన చేష్టలు. నిజంగా ఊహ తెలిసేది బహుశా అప్పుడేనేమో. చదువుతో పాటు ఆట, పాటల చనువు కూడా..
కొత్త పరిచయాలతో, కొత్త స్నేహితులతో కొత్త చదువు కొంగొత్తగా ఉంది. అల్లర్లతో, ఆటపాటల్తో చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. పరిచయాలు పాతబడ్డాయి. కొత్త బాధ్యతలు మోతబడ్డాయి. రెండవ సంవత్సరం మొదటి సంవత్సరానికేం తీసిపోనట్టుగా పరిగెడుతుంది.
ఆ రోజు ఆదివారం కావడంతో టైమ్ తొమ్మిదవుతున్నా ముంచుకొచ్చేదేం లేదని ఇంకా మంచం మీదే ఉన్నాను. అదేమంత మత్తు నిద్ర కాక పోవటంతో ఇంట్లో మాటలు, వీధిలో అరుపులు వెరసి చప్పుళ్ళన్నీ వినపడుతున్నాయి.
అమ్మ వంట గదిలో ఉన్నట్లు ఉంది. పాత్రలు కదిలించిన శబ్దం వస్తుంది. నాన్న నేనున్న గదిలోనే పేపర్ తిరగేస్తున్నాడు. గాలికి ఆ శబ్దం కూడా..
ఇంతలో అమ్మ టీ తెచ్చినట్లుంది. చిక్కని టీ తాగుతూ చక్కని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరూ. కొడుకునే అయినా కొద్దిపాటి సరసంగా ఉన్న ఆ కబుర్లు సరదాగా ఉండటంతో కోడినిద్రపోతున్న నేను దుప్పట్లో ఉండే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాను. కొద్ది సేపటి తర్వాత సంభాషణ మారిందని అర్థం అయింది. మారిన ఆ మాటలకు ఒక్కసారిగా లేచాను.
నా ఉదుటకు ఉలిక్కిపడిన అమ్మా నాన్న
"ఏంట్రా ఏమైంది?" అన్నారు కంగారు పడుతూ..
"ఏం లేదు." పరిగెత్తుకుంటూ ఇంటి పైకి చేరాను.
ఈ మధ్య వీడికి తగిలేది తప్పేది అస్సలు తెలియటం లేదండి అన్న అమ్మ మాటలైతే చెవిన పడ్డాయి.
పక్కింటి వైపే చూస్తున్నాను. రెప్పార్పకుండా చూస్తున్నాను. వేకువ కోసం ఎదురుచూస్తున్న చక్రవాక పక్షిలా చూస్తున్నాను. వెన్నెల కోసం వేచిచూస్తున్న చకోర పక్షికేం తీసిపొనట్టుగా చూస్తున్నాను. ఏ వైపు నుండి వస్తుందోనని తీక్షణంగా ఇంటి ముందు వెనుకలు గమనిస్తున్నాను. పచార్లు కొడుతున్నాను. గోర్లు కోరుకుంటున్నాను. ఇదివరకు ఎరుగనివి, నేనెప్పుడూ చేయనివన్నీ చేస్తున్నాను.
ఇంతక ముందు వరకూ అమ్మా, నాన్నల మాటల్లో బయటపడిన అమ్మాయి. తిట్లు పడి ఇంతసేపు నేను పాట్లు పడిన అమ్మాయి. ఎంతకూ.. బయటకు రాదే..!!
వీధిలోనూ అమ్మాయిలు ఉన్నారు. చదివే కాలేజ్లోనూ ఉన్నారు.. ఎప్పుడూ వారి ఊసే ఎత్తని నాకు ఇప్పుడు కొత్తగా ఈ ధ్యాస ఏంటి.? సమాధానాల్లేని ఎన్నో సందేహాలు నన్ను చుట్టుముట్టాయి.
పక్కింట్లోకి అద్దెకు వచ్చిందన్న మాటే తప్ప మరొకటి తెలియదు. అప్పటి దాకా దుప్పటి కప్పుకున్న కళ్ళు ఇకపై నిదురించేవేమో బహుశా. రమారమి అలానే ఉంది నా వరస.
ఓ వైపు ఆలోచనల్లో మునిగి తేలుతున్నా.. రెప్ప పాటును కూడా వదలక చూస్తున్న నాకు ఆ అమ్మాయి కదలికలు కనపడకపోయే సరికి ఒకింత ఆశతో, మరికొంత నిరాశతో కిందికి వచ్చాను.
కోపంగా చూస్తున్న అమ్మా నాన్న నుండి తప్పించుకుని బాత్రూంలోకి దూరాను. స్నానం చేసొచ్చే పది నిమిషాల్లో పది వేల ఆలోచనలు మతిని, మదిని మొత్తంగా ఆక్రమించాయి.
నిద్రలో నుండి ఒక్కసారిగా లేచావేంట్రా..? లేచావు సరే. పడుతూ లేస్తూ ఆ పరుగేంటి..? అమ్మ టిఫిన్ పెట్టింది. టిఫినుతో పాటూ తిట్లూ పెట్టింది. ఏదైనా మాట్లాడితే నాన్న వడ్డన కూడా జరుగుతుందని తెలిసి మౌనంగానే ఉన్నాన్నేను.
"మూర్తి..
పక్కింట్లోకి కొత్తగా ఓ అమ్మాయి అద్దెకొచ్చింది.
ఏం తిందో ఏమో? ఈ టిఫిను, టీ ఇచ్చేసిరా..” అమ్మ పిలిచింది.
ఆ మాటకు మతాబులా వెలిగిపోయింది నా ముఖం. "నువ్వు అమ్మవు కాదమ్మా అమ్మలగన్నమ్మవు" అని మనసులో అనుకుంటూ అవి తీసుకుని పక్కింటికి కదిలాను.
గేటు శబ్దమవడంతో నా రాకను గమనించిన ఆ అమ్మాయి. ఇంట్లో నుండి వరండాలోకి వచ్చింది.
"ఎవరూ..?" వస్తువులు సర్దుతూ మధ్యలో వచ్చినట్లు ఉంది. చెమటలు ధారగా కారుతున్నాయి.
స్వేదమంటిన లక్ష్మీదేవిలా ప్రత్యక్షమయిన ఆ క్షణాల్ని ఓ క్షణం కనులలో దాచే ప్రయత్నం చేస్తున్నాను. ఆ దాపు దరిదాపుల్లోకి ఎన్నో వలపు భావాలు వరదై వచ్చి చేరాయి. తేనెకి తీసిపోని మాట, హంసను మించిపోయే నడక, ఆ అందం, అణకువ అన్నీ నన్ను కట్టిపడేశాయి.
"మిమ్మల్నే ఎవరు మీరు.? అన్న మాటకు తేరుకుని
"మేము పక్కింట్లో ఉంటాము. అమ్మ మీకు ఇవి ఇచ్చిరమ్మన్నారు." అన్నాను చిరునవ్వుతో..
అంత అభిమానంతో పంపినవి కాదనటం ఇష్టం లేక అందుకుంటూ..
"చాలా థాంక్స్ అండి" అంది.
"పర్లేదండి" అన్నాన్నేను.
"మీరొక్కరే వచ్చినట్లు ఉన్నారు.” మీకు అభ్యంతరం లేకపోతే నేను సాయం చేస్తాను.
"అయ్యో మీకు ఎందుకండీ శ్రమ."
ఇందులో శ్రమ ఏం ఉందండి.
ఇరుగుపొరుగు వాళ్ళం.
"ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలాగు" అన్నాన్నేను కలుపుగోలుతనంగా..
పరిచయాలు, పరిభాషణలు మొదలయ్యాయి. మాటలు పరిమళాలను వెదజల్లుతున్నాయి. ఊసులు ఊకొడుతున్నాయి. ఊహలు తేలియాడుతున్నాయి. దోబూచులాడుతూనే ఆ అందాన్ని చూస్తున్నాను. ఆనందాన్ని చవిచూస్తున్నాను.
ఉన్నట్టుండి ఓ విషయం విషాదాన్ని వెంట పెట్టుకొచ్చింది. పరిచయంతో తెలిసింది. ఆమె పేరు శైలజ అని. సొంత ఊరును వదలి ట్రాన్స్ఫరుతో కదలి స్థానికంగా పేరున్న బ్యాంకులో అసిస్టెంట్ మేనేజరుగా ఉద్యోగ రీత్యా ఈ ఊరొచ్చిందని. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆమె నా కంటే పెద్దది. మూడు సంవత్సరాలు పైనే ఉంటుంది. ఈ మాటతో పదారణాల తెలుగందం పక్కనే ఉందని తెలిసి కూడా ఆనందమంతా ఎటో వెళ్లిపోయింది.
ఆమెతో ఏమీ చెప్పకుండానే ఇల్లు చేరాను. ఏదో తెలియని బాధ, ఎదపై మిలియన్ టన్నులు బరువు ఉన్నట్టు మనసు నలిగిపోతుంది. పరిచయమై గంట కూడా కాలేదు అంతలోనే కలివిడి అంతలోనే అలజడి, ఆ పరంపరలోనే వందల కొద్దీ సందేహాల సందోహాలు, సందోహాల సంవాదాలు ఇలా ఎన్నో..
******
మరుసటి రోజు నేను కాలేజ్ నుండి ఇంటికి వస్తున్నాను. ఆమె కూడా రావటం గమనించాను.
“మూర్తీ..” అన్న పిలుపు ఆమె నుండి.
ఆ పిలుపుకు ఉక్కిరిబిక్కిరవుతున్న మనసుకు రెక్కలొచ్చినట్టయ్యింది. నిన్న నా చుట్టూ నేను కట్టుకున్న బిడియపు గోడలన్నీ కూలిపోయాయి.
అయినా.. వినపడనట్టు నటించాను!
“మూర్తీ.. మిమ్మల్నే” అంటూ మళ్ళీ అదే పిలుపు.
ఆగుదామా వద్దా అన్న సంశయంలో ఉండగానే, ఆమె నన్ను సమీపించింది.
“నిన్న చెప్పాపెట్టకుండా అలా వెళ్ళిపోయారేంటి.?” అంది ఆమె.
"ఏం లేదండి. వేరే పని ఒకటి గుర్తొచ్చి వెళ్ళా”నన్నాను మాటను దాట వేస్తూ.
ఆమెకు ఏమని అర్థమైందో, కాసేపు మౌనం అడ్డమైంది.
ఆమెతో తొలి నడకలు ఓ వేడుకలా తోచాయి. ముసిరిన ఆ మౌనాన్ని మాటలు కసురుకున్నాయి. అలానే ఇల్లు చేరాయి.
ఆ మాటలన్నీ పూదోటలు కావాలని, ఆ అందానికి అక్షర రూపం ఇవ్వాలని తలపులు మది తలుపులు తడుతున్నాయి. ఊహలతో కూడిన ఊసులతో పాటుగా పుస్తకంలో పేజీలు కూడా పోటీ పడ్డాయి.
శైలజ.. ఓ జ్ఞాపకం.. ఓ వ్యాపకం..
అచ్చెరువొందే పదాలతో కలం కదులుతుంది. ఊహల్లో.. ఊసుల్లో.. ఆశల్లో.. శ్వాసల్లో.. ధ్యాసల్లో..
అన్నింటా ఆమే..!! నేను అనే మాట ఇకపై ఉండదేమో బహుశా అనేలా ఆక్రమించింది నా మనసుని.
కలం ఆగింది. ఏమైందో అన్నట్లుగా ఆశ్చర్యంగా చూస్తున్నాయి పుస్తకంలో పేజీలు. "నేనేనా..!! ఇదంతా నా భావనేనా..!!" నాలో నేనే నవ్వుకుంటున్నాను.
కొద్దిసేపు మౌనపు గవాక్షంలోకి చూసింది మనసు. అక్కడ ఆలోచనలు జగడ మాడుతున్నాయి. ఆ సంవాదంలో నా సందేహానికి ఓ సమాధానం దొరికింది. మాటల కందని సాన్నిహిత్యానికి వయసుతో పనేముంది! ఒకింత ఊరట నిచ్చిన ఈ మాటకు మనసు నిచ్చెనలెక్కింది.
ఆ రోజు మొదలు ప్రతి రోజూ ఓ పండుగలా తోచేది. ఆమెను చూడకపోతే పూటైనా పూర్తయ్యేది కాదు. ఆమెకు కూడా అంతేనేమో అన్నట్లుగా ఆమె ముఖంలో కూడా వెలితి. నన్ను చూడగానే సంతోషం. సాన్నిహిత్యపు సౌరభాన్ని ఆస్వాదిస్తూ ఆమెతో గమిస్తూ ఇవన్నీ గమనిస్తున్నాను.
అంతు చిక్కని ఆనందం! అంతే చక్కని అనుబంధం!! అంతకు మించిన ఆరాధన!! నిత్యం మథించే హృదయ వేదన!! హాయైనా.. బాధైనా.. ఆమెతో జరిగినది అది ఏదైనా కునుకు సమయానికి పుస్తకానికి కానుక చేసేవాడిని. వేసే వేషాలన్నీ పుస్తకానికి అప్పచెప్పేవాడిని. ప్రతి జ్ఞాపకాన్ని అపురూపంగా స్వహస్తాలతో అచ్చు వేసేవాడిని.
వచ్చి పోయే దారికి, ఊరవతలున్న ఏరుకి, కొండ మీద ఉన్న గ్రామదేవత గుడికి, పొలం గట్టుకి, శేషయ్య తాత తోటలో ఉన్న ప్రతీ చెట్టుకీ రాగశృతిలయల మిళితమైన మా బంధం ఓ మకరందమే! ఓ సుమగంధమే!!
ఆదివారం కోసం వారమంతా వేచి చూడటం. ఆ రోజంతా ఈ దూరాలన్ని చుట్టి గువ్వలల్లే గూటికి చేరటం. చేరిన తీరాల గురించి బోలెడన్ని కబుర్లు చెప్పుకోవటం. ఒక్క ఆదివారమేనా ఏ మాత్రం సెలవు దొరికినా ఈ ఆనందాలను ఆస్వాదించటమే పని.
ఆమెలో ప్రతి భావన ఓ అద్భుతమే!! ఆమెతో ప్రతి భాషణ ఓ అద్భుతమే!! ఆమే ఓ అద్భుతం!! ఆమెకు దూరంగా జరగటం అంటే ఊపిరి తీగలు బిగుసుకున్నట్టే. చీకటి మబ్బులు కమ్ముకున్నట్టే. ఇలా ఆ అందంతో ముడిపడిన బంధంతో రెండు సంవత్సరాలు గడిచాయి ఆనందంతో..
వయసులు వ్యత్యాసాలున్నా..
మనసులు ముత్యాల సరాలయ్యాయి.
కానీ విధికి తలవంచాయి.
******
ఆమెకు ట్రాన్సఫర్ అవ్వటం, నాకు పెళ్ళి జరగటం, రెండూ ఒకరోజే కావటంతో గుండెలో ఆమె ఉందని తెలిసినా ఆ బాధను గొంతులోనే దాచుకున్నాను. అప్పుడూ.. ఇప్పుడూ..
***సమాప్తం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
పేరు : వెంకు సనాతని
అమ్మ పేరు : సులోచన నాన్న పేరు : శ్రీను వృత్తి : రచయిత
ఊరు : బాపట్ల
జిల్లా : గుంటూరు
రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్
Commentaires