top of page

అమ్మ ఆశీస్సులు


'Amma Asissulu' New Telugu Story


Written By Ch. C. S. Sarma
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

కన్నతల్లి తన జీవిత కాలంలో తన బిడ్డల ఆనందానికి ఏదైనా వెనుకాడకుండా చేస్తుంది. అవసరమైతే ఎవరినైనా ఎదుర్కొంటుంది. తన తనయుడి కోరిక నెరవేర్చేటందుకు... అందుకే అన్నారు పెద్దలు అమ్మకు సాటి అమ్మేనని!!...


అంజి బాబు రాఘవేంద్ర అన్నదమ్ములు. వారి తల్లిదండ్రులు సావిత్రి, శేషగిరిరావు. రావు గారు పి.డబ్లి.యుడిపార్ట్మెంట్లో యి.యి.గా పనిచేస్తున్నారు. పెద్ద కొడుకు అంజిబాబు చాలా నిదానం... నెమ్మది, కోపం ఎప్పుడూ రాదు. పరమశాంతమూర్తి. తమ్ముడంటే ఎంతో ఇష్టం. చిన్నవాడు రాఘవేంద్ర మొండివాడు. ఆవేశపరుడు. తన మాటను కాదంటే అతనికి కోపం వస్తుంది. ఆ కోపానికి కారకులు స్నేహితులయితే... కొట్లాడుతాడు తల్లిదండ్రులు అన్న అయితే... అలుగుతాడు. మూగవాడు అయిపోతాడు.

కన్నబిడ్డలు... ఎలాంటి వారైనా తల్లిదండ్రులు వారి పట్ల ఎంతో అభిమానంగా ఉంటారుగా... ఆ కారణంగా పిల్లలు తప్పు చేస్తే చేయకూడదని నచ్చ చెబుతారు. వారి బాగును కోరుకుంటారు. వారు సరైన మార్గంలో నడిచి వృద్ధిలోనికి వస్తే ఎంతగానో సంతోషిస్తారు. ఈ దంపతులు వారి బిడ్డల విషయంలో అంతే.

అంజి బాబు తన తల్లిదండ్రుల ఆశలు తీర్చాడు. సివిల్ ఇంజనీరయ్యాడు. నెల్లూరులో హైవే డిపార్ట్మెంట్లోఏ.ఈ. గా మూడేళ్ల నుంచి పని చేస్తున్నాడు. రాఘవ ఎం.కామ్ ఫైనల్ ఇయర్. వారి సంసారంలో ఎంతో ఆనందం. వారి ఇల్లు ఆనంద నిలయం.

జగన్నాథుడి నిర్ణయాలు అనూహ్యాలు. శేషగిరిరావు తొమ్మిది నెలల కిందట కార్ యాక్సిడెంట్ లో స్వర్గస్తులైనారు. ఆనంద నిలయంగా ఉన్న ఆ ఇంటిని కారు చీకట్లు చుట్టూ ముట్టాయి. పతివియోగం సావిత్రికి సమ్మెట దెబ్బ అయింది.

అంజి బాబు దుఃఖాన్ని దిగమ్రింగి... తల్లిని, తమ్ముడిని ఓదార్చుతూ ఆసరాగా నిలబడ్డాడు. ముఖ్యంగా తల్లి విషయంలో ఆమె ప్రతి మాటను గౌరవించి పాటించేవాడు. ఆచరించేవాడు.


రాఘవ తల్లి అన్నల మాటలను ఆదరించేవాడు. పాటించేవాడు.

మూడు నెలల క్రిందటఎదురింట్లో... డిఎస్పి రామనాథం గారు, భార్య శ్రీమతి యుక్త వయసులో ఉన్న ప్రేమ వారి కుమార్తెతో వచ్చి చేరారు. ప్రేమ అందాల బొమ్మ.

రాఘవేంద్ర... ప్రేమను చూసిన తొలిచూపులోనే ఆమెను తనదాన్నిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రేమ బిఏ చదువుతూ ఉంది. దార్లు కాచి, పలకరించి మెల్లగా ప్రేమను ముగ్గులోకి దించాడు మాటకారి మాయదారి రాఘవ. ఇరువురికి కొద్ది కాలంలోనే ఎంతో సన్నిహితం ఏర్పడింది.

***

ఆరోజు సాయంత్రం... వారిరువురూ స్కూటర్ పై పైనించేటప్పుడు అంజిబాబు చూచాడు. ఇంటికి వచ్చాడు. ఆ రాత్రంతా వారిని గురించిన ఆలోచన. వీధి వ్యవహారం ఎంత దూరం దాకా వెళ్ళింది ఇద్దరూ ప్రేమలో పడ్డారా!... ఈ ఆలోచనలతో అర్ధరాత్రి తర్వాత అంజిబాబు నిద్రపోయాడు.

ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఆఫీసుకు వెళ్లే దానికి రెడీ అయ్యాడు. అప్రయత్నంగా అతని చూపు ఎదురింటి ముంగిట నిలబడి ఉన్న ప్రేమ మీద పడింది. రాత్రంతా తనను సతమతం చేసిన ప్రశ్నలు మస్తిష్కములో పైకి లేచాయి. గదిలో అద్దం ముందు నిలబడి రాఘవ తలదువుకుంటున్నాడు. ఆందోళనతో కొన్ని క్షణాలు కళ్ళు మూసుకున్నాడు అంజిబాబు. కొద్ది క్షణాల తర్వాత...

"రాఘవా ఆఫీసుకి వెళ్ళొస్తారా" రాఘవ జవాబును ఎదురు చూడకుండానే గది నుండి క్రింది ఫ్లోర్లో ఉన్న హాల్లోకి వెళ్ళాడు అంజిబాబు. వంట ఇంట్లో నుంచి హాల్లోకి సావిత్రమ్మ వచ్చింది.

"అమ్మా!... కొంచెం ముందుగా ఆఫీసుకు వెళ్లాలి. పని ఉంది. టిఫిన్క్యాంటీన్లో తింటాను. వెళ్ళొస్తా అమ్మా!..." మెల్లగా చెప్పి బయటకు వచ్చి స్కూటర్ స్టార్ట్ చేశాడు అంజిబాబు.

వాకిట్లో నిలబడి సావిత్రి "సరే నాన్నా!... జాగ్రత్త" క్షణం తర్వాత ఇంట్లోకి చూస్తూ, "రాఘవా!... టిఫిన్ రెడీ రా తిందువుగాని..." రాఘవను పిలిచింది.


అంజిబాబు స్కూటర్ వీధిలో ముందుకు పోతూ వుంది. మస్తిష్కంలో... రాఘవ ప్రేమలకు సంబంధించిన ఆలోచనే. అతని వాహనం ఆఫీస్ ఆవరణములో ప్రవేశించింది. మీటింగ్ ఉన్నందువల్ల స్కూటర్ ను స్టాండ్ లో నిలిపి తన గది వైపు వేగంగా వెళ్ళాడు.

***

ప్రతిరోజు రాత్రి ముగ్గురూ కలిసి భోజనం చేయడం వారి అలవాటు. భోజనానంతరం అంజి, రాఘవ మెడపై ఉన్న తమ గదులకు వెళ్ళిపోతారు. సావిత్రి క్రింద ఉన్న తన గదికి వెళ్ళిపోతుంది.

రాత్రి పదిన్నర వరకు టీవీలో న్యూస్... పాటలు వినడం అంజిబాబు దినచర్య. ఆ తర్వాత పడుకుంటాడు. రాఘవ తన గదిలో పన్నెండు గంటల వరకు చదువుకుంటాడు... ఆ తర్వాతనే శయనం.

వారం రోజుల క్రిందట రాత్రి 10:30 కు టీవీ ఆఫ్ చేసి వరండాలోకి వచ్చి రాఘవ గది వైపు పోబోయాడు అంజి. అప్రయత్నంగా అతని చూపులు డి.ఎస్.పి గారు ఉంటున్న ఇంటిపై అంతస్తులో ఉన్న గదుల వైపుకు మళ్ళింది. మొదటి గదిలో రెండు కిటికీలు రోడ్డు వైపుకు ఉన్నాయి. అటూ ఇటూ గదిలో తిరుగుతూ ప్రేమ చదువుతూ ఉంది. మధ్య మధ్యలో ఆగి కిటికీ గుండా రాఘవ గది కిటికీ వైపు చూస్తూ ఉంది. ఈ దృశ్యాన్ని అంజి చూచాడు.

రాఘవ గదికి ఎదురింటి కిటికీలకు నేరుగా రెండు కిటికీలు ఉన్నాయి. గదిలో ఒక కిటికీ ముందు టేబుల్... కుర్చీ. స్థానంలో కూర్చుని రాఘవ చదువుకుంటాడు. ఎదురింటి ప్రేమ, రాఘవా తలుచుకుంటే... ఒకరినొకరు చూడవచ్చు. సైగలు చేసుకోవచ్చు. తమ మనోభావాలను చూపులతో గాల్లో కలిపి ఒకరికొకరు చేర్చుకోవచ్చు. సరిగ్గా అదే పనిని అంజి చూచిన సమయంలో ఆ ఇద్దరు చేశారు. అంజి బాబుకు ఆ దృశ్యాన, ప్రేమ సైగలు గోచరించాయి తదేకంగా పరీక్షగా చూచాడు. ప్రేమ అంజని గమనించలేదు.

కొద్ది నిమిషాల తర్వాత... అంజి తన గదిలోనికి వెళ్ళిపోయాడు. తను చూచిన ప్రేమ, రాఘవల ప్రేమ సైగలను తలచుకొంటూ పడుకొన్నాడు.


ఆ తర్వాత సహజంగా చాలా నిదానస్థుడైనఅంజి తనలో ఏర్పడ్డ అనుమానం తప్పా రైటా.... అన్న విషయాన్ని తేల్చుకోవడానికి ఐదుసార్లు ప్రేమరాఘవులను పరీక్షించాడు. అతని అనుమానం తీరింది. ఏదో మూగ సినిమా కథనం వారి మధ్యన జరుగుతూ ఉందని నిర్ణయించుకున్నాడు. ఆవేశంతో తొందరపడి రాఘవను అడిగి అతన్ని కించపరచలేదు.

నిన్న... ప్రేమను రాఘవను స్కూటర్ పై చూచిన తర్వాత వారి ఇరువురు ఏ స్థాయికి చేరారన్న విషయం అంజికి తెలిసింది. 'సహనం కొంత కాలానికి సమస్యను పరిష్కరించవచ్చు. అది కాలానికి ఉన్న మహిమ.' అనుకున్నాడు అంజి.

***

అంజి బాబుకు ప్రమోషన్ వచ్చింది. నెల్లూరు నుంచి చీరాలకు మార్చారు. విషయాన్ని తల్లికి, తమ్ముడికి చెప్పాడు. తమ్ముడు 'కంగ్రాచ్యులేషన్స్' చెప్పాడు. తల్లి సావిత్రమ్మకు అయిష్టం. ప్రమోషన్ కనుక పోక తప్పదని తన్ను తాను సమాళించుకుంది.

వారం రోజుల తర్వాత ఆదివారము నాడు సాయంత్రం అంజి ప్రయాణానికి అన్నీ సర్దుకోవడం ముగిసింది. సావిత్రమ్మ అంజిబాబు పేరున అర్చన చేయించడానికి శివాలయానికి వెళ్ళింది.


రాఘవ కాలేజీ నుంచి వచ్చాడు. అంజి హాల్లో కూర్చుని కళ్ళు మూసుకుని రాఘవులు గురించి ఆలోచిస్తున్నాడు.

"అన్నయ్యా!... అమ్మేది?..." రాఘవ ప్రశ్న.


అంజి కళ్ళు తెరిచాడు. రాఘవ సోఫాలో కూర్చున్నాడు.

"గుడికి వెళ్ళింది" ఆప్యాయంగా రాఘవ ముఖంలోకి చూస్తూ చెప్పాడు అంజిబాబు.

"అమ్మను, నన్ను వదిలి వెళ్లాలంటే... నీకు దిగులుగా ఉంది కదూ" అంజి ముఖంలోకి పరీక్షగా చూస్తూ అడిగాడు రాఘవ.

విరక్తిగా నవ్వాడు అంజిబాబు... కొద్ది క్షణాల తర్వాత...

"రాఘవా!... నామీద నీకు నమ్మకం ఉందా?" రాఘవ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. అంజిబాబు.


"అన్నయ్యా!... ఏమిటీ ప్రశ్న?..." ఆశ్చర్యంతో అడిగాడు రాఘవ.

"రాఘవా!... నాకు సంబంధించిన అంతవరకూ నేను... అమ్మకు, నీకు చెప్పకుండా ఏ విషయాన్ని దాచలేదు. అవునా?..." ప్రశ్నార్ధకంగా రాఘవ ముఖంలోకి చూచాడు అంజి.

"అవును" సాలోచనగా కిటికీ గుండా చూస్తూ అన్నాడు రాఘవ.

"అయితే... నీవు!..." రాఘవ కళ్ళల్లోకి సూటిగా చూచాడు అంజిబాబు.

అంజి ప్రశ్న విన్న రాఘవ మౌనంగా తలదించుకున్నాడు.

అతన్ని కొద్ది నిమిషాలు పరీక్షగా చూచి అంజిబాబు రాఘవ కూర్చున్న సోఫాలో పక్కన కూర్చుని...

"రాఘవా!... మన అమ్మ చాలా అమాయకురాలు. మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది. నాన్నగారు పోయి ఇంకా సంవత్సరం కాలేదు. ఇది నీకు ఫైనల్ ఇయర్. బాగా చదివి పరీక్ష చక్కగా వ్రాయాలని, నిన్ను పై చదువులకు పంపి మంచి ఉన్నత స్థితిలో చూడాలనేది నా ఆశయం. అదే నాన్నగారి చివరి కోరిక కూడా!... నేను వారికి మాట ఇచ్చాను. పరీక్షలు రెండు నెలలలో వ్రాయాలి. ఇలాంటప్పుడు..." చెప్పడం ఆపేసి కళ్ళు మూసుకున్నాడు అంజి. కొద్ది క్షణాలు వారి మధ్యన మౌనం నాట్యం చేసింది

అంజి కళ్ళు తెరిచాడు. తదేకంగా తన్నే చూస్తున్నా రాఘవను అతని ముఖ భావాలను గమనించాడు.


"ప్రస్తుతంలో నీ ధ్యాసంతా చదువు మీదనే ఉండాలి. నీ మనసు మార్చుకో... ఆ ప్రేమను మరిచిపో. రాఘవా!... నీకంటే పెద్దవాణ్ణి నీ మేలు కోరేవాణ్ణి. స్థిమితంగా ఆలోచించుకో... ఈ విషయం అమ్మకు తెలీదు. తెలిస్తే ఆమె అవమానానికి తట్టుకోలేదు. బాగా ఆలోచించి నీవు తీసుకోబోయే నిర్ణయంలోనే ఉంది నీ భవిష్యత్తు. మీ ఇరువురి ప్రవర్తనను నేను చూచాను కాబట్టి నీ మేలు కోరే మీ అన్నగా ఇది నేను నీకు ఇచ్చే సలహా. నీ కర్తవ్యాన్ని నిర్ణయించుకొని... సరైన మార్గంలో నీవు పయనించాలనే నా కోరిక.”ఎంతో ఆప్యాయంగా అంజిబాబు రాఘవ చేతిని తన చేతిలోనికి తీసుకుని చెప్పాడు. మంత్రముగ్ధుడిలా రాఘవ అంజి ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు.

"నాయనా!... అంజీ!..." గుడి నుంచి ప్రసాదంతో సావిత్రి ఇంట్లోకి వచ్చింది.

"రామ్మా!..." నవ్వుతూ తల్లి ముఖంలోకి చూచాడు అంజి.

"సావిత్రి తాను తెచ్చిన విభూతి, కుంకుమను అంజి బాబు నొసటన తీర్చిదిద్దింది. తర్వాత రాఘవ ముఖంలోకి చూచి...

"ఏరా!... రాఘవా!... అన్నయ్య చీరాలకు వెళుతున్నాడని బెంగగా ఉందా?" ప్రశ్నార్థకంగా రాఘవ ముఖంలోకి చూచింది సావిత్రి.


"అవునమ్మా!... రాఘవ చాలా ఫీల్ అవుతున్నాడు. నచ్చ చెప్పాను. నెలకొకసారి తప్పకుండా వస్తానమ్మా... మిమ్మల్ని వదిలి వెళ్లాలంటే నాకూ..." నిట్టూర్చి ఆగిపోయాడు అంజి.


రాఘవ, సావిత్రి అంజి ముఖంలోకి చూశారు. అతని వదనంలో విచారం... వారి చూపులను ముఖభావాలను గమనించిన అంజి నవ్వుతూ "అమ్మా!... ఇక నేను బయలుదేరుతాను" తల్లి పాదాలకు నమస్కరించాడు.


ఆప్యాయంగా అతని భుజాలను పట్టుకుని సావిత్రి "సరే నాయనా... జాగ్రత్త. చీరాలను చేరగానే ఫోన్ చెయ్యి." ఆవేదనను హృదయంలో అణుచుకుంటూ ఆప్యాయంగా చెప్పింది సావిత్రి.


"అలాగే అమ్మా!..." తల్లి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అంజి. ఆ క్షణంలో ఆమె కళ్ళ చుట్టూ నిండి ఉన్న కన్నీటిని చూచాడు. సూట్ కేసును చేతికి తీసుకున్నాడు. రాఘవ దాని ప్రక్కన ఉన్న బ్యాగును తన చేతిలోనికి తీసుకున్నాడు. ముగ్గురూ వాకిట్లోకి వచ్చారు‌ అదే సమయానికి అంజి చెప్పిన ప్రకారంగా అతని మిత్రుడు ప్రభు ఆటోలో వచ్చి దిగాడు. అంజిచేతిలోని సూట్ కేసును, రాఘవ చేతిలోని బ్యాగును తన చేతుల్లోకి తీసుకొని ఆటోలో ఉంచాడు. అంజి రాఘవ ముఖంలోకి చూచి... “రాఘవా!... అమ్మకు ఎలాంటి కష్టం కలిగించకు. నేను చెప్పింది జ్ఞాపకం ఉంచుకో బాగా చదువు ర్యాంక్ సాధించాలి" చిరునవ్వుతో పలికాడు అంజి.


'సరే' అన్నట్లు తల ఆడించాడు రాఘవ సాలోచనగా.

అంజిప్రభూలు ఆటోలో కూర్చున్నారు. అంజిచేతిని పైకెత్తి టాటా చెప్పాడు. రాఘవ సావిత్రి అదే పని చేశారు. ఆటో సారథి రథాన్ని కదిలించాడు.

***

"గుడ్ మార్నింగ్ సార్"

కుర్చీలో కూర్చుని టేబుల్ పైని ఫైల్ సీరియస్ గా చూస్తున్నా అంజిబాబు తల ఎత్తి చూచాడు. ఎదురుగా అప్సరస నవ్వుతూ నిలబడి ఉంది. తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు.


"నా పేరు హేమ... ఏం.యిని సార్" ఎంతో వినయ విధేయతలతో పలికింది హేమ.

తొట్రుపాటుతో అంజి... "ఓ మీ గురించి విన్నాను. రండి కూర్చోండి"

హేమ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది. చేతిలోని ఫైల్ ను టేబుల్ పై ఒక పక్కన ఉంచింది.

"చెప్పండి ఏమిటా ఫైల్?" హేమ ముఖంలోని చూస్తూ అడిగాడు అంజిబాబు.

"చీరాల బాపట్ల రోడ్ ప్రాజెక్ట్ ఎస్టిమేట్ సార్... మీరు చూడాలన్నారట" నవ్వుతూ చిలకలా పలికింది హేమ.

"అవును"


ఫైలును తన చేతిలోనికి తీసుకొని అంజిబాబు చేతికి అందించింది హేమ.

"ఓకే చూచి మీకు పంపిస్తాను" ఫైలును చూస్తూ అన్నాడు అంజిబాబు.

'అంటే... ఇక మీరు వెళ్ళవచ్చనా!... మనసులో అనుకుంది హేమ. 'మనిషి చాలా సీరియస్... మితభాషిలా ఉన్నాడు'

"సార్ నేను వెళతాను" అతని ముఖంలోకి చూస్తూ ఉంది హేమ.


"మంచిది. థాంక్యూ" ఫైలును చూస్తూ ఆమె ముఖంలోకి చూడకుండానే యాంత్రికంగా పలికాడు అంజిబాబు.

‘మనిషి మంచి అందగాడు... పెళ్లయ్యిందో లేదో కనుక్కోవాలి!...’

అనుకుంటూ గది నుండి బయటికి నడిచింది హేమ ఆమెకు ఇంకా వివాహం కాలేదు అంజి ఆమెకు బాగా నచ్చాడు.

***


రత్తాలు... సావిత్రమ్మ, డి.ఎస్.పి రామనాథం ఇళ్లల్లో పనిమనిషి. మంచి మాటకారి. రత్తాలు... సావిత్రమ్మ కుటుంబాన్ని గురించి ప్రేమ తల్లి శ్రీమతితో... ఆ ఇంటి వారిని గురించి సావిత్రితో ఎంతో ప్రశంసాపూర్వకంగాచెప్పేది. ఆ కారణంగా శ్రీమతికి, సావిత్రికి ఒకరి పట్ల ఒకరికి ఎంతో గౌరవం, అభిమానం ఏర్పడింది. ఒక శుభ ఘడియలో ఆ ఇరువురూ శివాలయంలో కలిశారు. పలకరింపు చిరునవ్వులతో మొదలై... అరగంటలో ఆ ఇరువురు సన్నిహితులై ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఒకే రిక్షాలో తమ ఇళ్ళకు చేరారు.


ఆ తర్వాత... రామనాథం ఇంట్లో లేని సమయంలో సావిత్రి శ్రీమతి ఇంటికి వెళ్లడం... రాఘవ లేని సమయంలో శ్రీమతి సావిత్రి ఇంటికి వెళ్లడం తరచుగా జరిగేది. ఇరువురూ కొద్ది కాలంలోనే మంచి మిత్రులు, సన్నిహితులుగా మారారు. ఇండ్ల పేర్లను గురించి... గోత్రాలను గురించి తెలుసుకొన్నారు. ఇరువురికి ఎంతో ఆనందం.


ప్రతినెలా అంజిబాబు నెల్లూరుకి వచ్చేవాడు. తల్లికి, తమ్ముడికి కావలసిన వాటిని సమకూర్చేవాడు. తిరిగి వెళ్ళేటప్పుడు రాఘవతో... "బాగా చదువు. ర్యాంక్ తప్పకుండా సాధించాలి. ఏ విషయంలోనూ అమ్మను నొప్పించకు. జాగ్రత్త." ఎంతో అనునయంగా చెప్పి వెళ్ళేవాడు అంజి.


కాలచక్రంలో నాలుగు మాసాలు మహావేగంగా గడిచిపోయాయి. రాఘవ అన్న మాటలను గౌరవించాడు. పాటించాడు. పరీక్షలు బాగా వ్రాశాడు. ఫస్ట్ క్లాసులో ర్యాంకు సాధించాడు.

ఫలితాలు తెలిసిన రోజున ప్రేమతో టాక్సీలో పెంచలకోనకు వెళ్లి నరసింహస్వామిని శ్రీ మహాలక్ష్మిని దర్శించి "మా ఇరువురికి వివాహం జరిగేలా ఆశీర్వదించండి మాతా పితా" అని వేడుకున్నాడు. ప్రేమ కూడా ఏంతో శ్రద్ధగా ఆ జగన్మాతా పితరులను తమ కోర్కె తీర్చమని వేడుకొంది.


ఆ మహా క్షేత్రంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వరదరాజులు రాఘవేంద్రను, ప్రేమను చూశాడు. ప్రేమ తమ డి. ఎస్. పి గారి అమ్మాయిని గుర్తించాడు. ఈ విషయం ఆ ప్రేమ జంటకు తెలియదు.


ఆ రాత్రి భోజనానంతరం సావిత్రి మేడ పైకి వచ్చింది. రాఘవ వరండాలో నిలబడి ఏదో సైగ చేస్తున్నాడు ప్రేమకు. అప్రయత్నంగా సావిత్రి చూపులు ఎదురింటి కిటికీ వైపు వెళ్లాయి. కిటికీలో ప్రేమ నవ్వుతూ కనిపించింది. సావిత్రి పైకి వచ్చినట్లు రాఘవకు సైగ చేసింది. తొట్రుపాటుతో రాఘవ తల్లిని చూశాడు. వెంటనే... ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని గదిలోనికిలాక్కెళ్ళాడు. వంగి తల్లి రెండు కాళ్ళను పట్టుకొని...

"అమ్మా!... నన్ను క్షమించు నేను నీతో చెప్పలేదు. నేను ప్రేమా పెండ్లి చేసుకోవాలనుకున్నామమ్మా... మా కోర్కెను నీవు తీర్చాలమ్మా." గద్గద స్వరంతో ఏడుస్తూ చెప్పాడు రాఘవ.


సావిత్రమ్మకు తలపై పిడుగు పడినట్లు అయింది. అచేతనంగా శిలా ప్రతిమలా నిలబడిపోయింది. పెద్దవాడికి పెండ్లి కాకుండా చిన్నవాడికి పెళ్లా!.... ఆమె మస్తిష్కంలో మారుమ్రోగిన శబ్దమది.

***

ఆ మరుదినం... సావిత్రి డి.ఎస్.పి గారు ఆఫీసుకు వెళ్ళగానే శ్రీమతి గారి ఇంటికి వచ్చింది. కాలింగ్ బెల్ నొక్కింది. ఆమె ఆశల ఊయలలో శ్రీమతి గారి ఇద్దరు పిల్లల్ని తన ఇద్దరి కొడుకులకు ఇచ్చి వివాహాలు జరిపించాలనే కోర్కె తలుపు తెరవబడింది.

"మీరూ!..." ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది హేమ.


"మాది ఎదురిల్లు. అమ్మగారు ఉన్నారా!..." చిరునగవును చిందిస్తూ అడిగింది సావిత్రి.

"ఉన్నారు రండి" సాదరంగా సావిత్రిని ఆహ్వానించింది హేమ.

హేమను చూచి సావిత్రి 'ఎంత అందం. చందనపు బొమ్మ' మనసులో అనుకొంటూ సావిత్రి హాల్లోకి ప్రవేశించింది.


"కూర్చోండి" సోఫాను చూపించింది హేమ.

"అమ్మా!... కాస్త హెచ్చుస్థాయిలో పిలిచింది.

శ్రీమతి హాల్లోకి వచ్చింది. సావిత్రిని చూచి "ఓ... మీరా! కూర్చోండి. ఈ పిల్ల మా పెద్దమ్మాయి హేమ. చీరాలలో ఏఈగా పనిచేస్తూ వుంది" నవ్వుతూ చెప్పింది శ్రీమతి.

"శ్రీమతి గారూ!... మీ పెద్ద అమ్మాయి... చిన్న అమ్మాయిలా చాలా బాగుంది" ఎంతో ఆనందంతో చెప్పింది సావిత్రి.


హేమ ముసిముసి నవ్వులతో మేడ మీదకి వెళ్ళిపోయింది.

సావిత్రి... శ్రీమతి ఒకే సోఫాలో కూర్చున్నారు.

సావిత్రి శ్రీమతి ముఖంలోకి చూస్తూ...

"మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడాలని వచ్చాను చాలా మెల్లగా పలికింది సావిత్రి.


"ఏమిటండీ అది?..." ప్రశ్నార్థకంగా సావిత్రి ముఖంలోకి చూచింది శ్రీమతి.


"మా చిన్న అబ్బాయి రాఘవ మీ చిన్నమ్మాయి ప్రేమ ప్రేమించుకున్నారట. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. రాత్రి వాడు నాతో చెప్పాడు. మనం కుల గోత్రాలను గురించి ఇంతకుముందే మాట్లాడుకున్నాము. ఎలాంటి లోపాలు లేవు. మీరు మంచి మనస్సు చేసుకుని మీ వారితో మాట్లాడి ఒప్పించి వారి వివాహం జరిపించాలనేదే నా కోరిక. కానీ... పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా రెండవ అమ్మాయికి పెళ్ళా... అనే ప్రశ్న మీకు కలగవచ్చు. దానికి నా సమాధానం... మీకు సమ్మతం అయితే... నా పెద్ద కొడుకు మీ పెద్ద అమ్మాయిని చేసుకునే దానికి నాకు పరిపూర్ణ సమ్మతం. నా పెద్ద కొడుకు నా మాటను ఏనాడూ కాదనడు. ఈ ఫోటోను మీ అమ్మాయికి చూపించండి" అంజిఫోటోను శ్రీమతి చేతిలో ఉంచింది సావిత్రి ఎంతోప్రీతిగా ఆమె ముఖంలోకి చూస్తూ.


ఆమె మాటలకు చర్యకు శ్రీమతిలో ఎంతో కలవరం ఒకవైపు.... మరోవైపు ఎంతో ఆనందం గట్టిగా కళ్ళు మూసుకుంది.


క్రిందటి రాత్రి తనతో ప్రేమ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

"అమ్మా!... రాఘవ చాలా మంచివాడు. నేను పెండ్లి అంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను." ఆలోచన సాగరంలో మునిగిపోయింది శ్రీమతి. తన భర్త ఏమంటాడో? అదే శ్రీమతి సందేహం.


కొద్ది నిమిషాలు ఆమెను పరీక్షగా చూసిన సావిత్రి...

"శ్రీమతి గారూ!.... మాకు ఎలాంటి కట్న కానుకలు అనవసరం. మీకు తోచిన విధంగా వివాహాన్ని జరిపించండి. మీ ఇరువురు కూతుళ్లు నా కోడళ్లు కావాలనేదే నా కోరిక" ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని గట్టిగా నొక్కి నవ్వుతూ చెప్పింది సావిత్రి.


"ఇవి కన్నీళ్లు కాదండి ఆనందభాష్పాలు. మా వారితో మాట్లాడతాను. ఆ సర్వేశ్వరుడు మన కోర్కెను తీరుస్తాడని నా నమ్మకం." ఎంతో ఆనందంగా పలికింది శ్రీమతి.

"మా పెద్దబ్బాయి ఉండేది చీరాలలోనే... ఈ కాగితంలో వాడి ఫోన్ నెంబర్ ఉంది. మీ హేమను వాడితో మాట్లాడమని చెప్పండి. బాగా చదువుకున్న పిల్ల కదా!... వాణ్ణి కలిసి వాడి తత్వాన్ని అర్థం చేసుకోమని చెప్పండి. మీ హేమకు నా కొడుకు నచ్చుతాడని నా అభిప్రాయం" చిరునవ్వులు చిందిస్తూ చెప్పింది సావిత్రి.


సోఫా నుంచి లేచి "ఇక నేను వెళ్లి వస్తాను మీ వారి అంగీకారం కోసం ఎదురు చూస్తూ ఉంటాను" చేతులు జోడించి శ్రీమతికి నమస్కరించి హాల్లో నుంచి బయటికి వచ్చింది. శ్రీమతి ఆమెతోటే నడిచి రోడ్డు దాటి సావిత్రి తన ఇంట్లో ప్రవేశించిన తర్వాత... తను ఇంట్లోకి ప్రవేశించింది.


తలుపు మూసేందుకు వెనక్కి తిరిగిన శ్రీమతి వరదరాజులు గేటు తెరుచుకొని లోనికి రావడాన్ని గమనించి వరండాలోకి వచ్చింది.

వరదరాజులు చేతులు జోడించి "నమస్కారం అమ్మా" ఎంతో వినయంగా పలికాడు.

"వరదరాజులు గారూ!... ఏమిటి విషయం" అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది శ్రీమతి.


వరదరాజులు తడబడుతూ "అమ్మా... నేను మొన్న...మన చిన్న అమ్మాయి గారిని ఆ ఎదురింటి రాఘవనూ పెంచాలకోనలో చూచానమ్మా... ఈ విషయం అయ్యగారితో చెబితే గొడవ అవుతుందని మీతో చెప్పాలని వచ్చానమ్మా" ఎంతో వినయంగా తగ్గుస్థాయిలో చెప్పాడు వరదరాజులు.


శ్రీమతి నవ్వుతూ "నాకు వారి విషయం తెలుసు. మీరు అయ్యగారితో చెప్పకండి నేను చూసుకుంటాను మీరు వెళ్లి రండి" అంది.

వరదరాజులు మరోసారి నమస్కరించి వెళ్లిపోయాడు.

***

ఆరోజు శ్రీమతి రామనాథం పెళ్లిరోజు. ఆ దంపతులు తమ పిల్లలతో ఉదయాన్నే శివాలయానికి వెళ్లి వచ్చారు. గుడిలో కలసిన సావిత్రిని శ్రీమతి భర్తకు పరిచయం చేసింది. నమస్కార ప్రతి నమస్కారాలు జరిగాయి. 'అన్నయ్యగారూ' అంటూ వరుస కలిపింది సావిత్రమ్మ.


ఆ రాత్రి భోజనానంతరం హేమకు శ్రీమతి సావిత్రి పెద్ద కొడుకు అంజిబాబు ఫోన్ నెంబర్, ఫోటో ఇచ్చి... "ఈ అబ్బాయితో ఫోన్ చేసి మాట్లాడు వీలు చూసుకుని ఒకసారి కలువు. అతని విషయంలో నీ అభిప్రాయం ఏమిటో నాకు తెలియజేయి" అంది శ్రీమతి.


హేమ పకపకా నవ్వింది. "అమ్మా!... ఈ నెంబర్ నా బాస్ ది. ఆయన గారి పేరు అంజిబాబు. అపర ప్రవరాఖ్యుడు. చాలా అందగాడు‌ తెలివైనవాడు. మితభాషి."

"నీకు అతడు అంటే ఇష్టమేనా" హేమ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది శ్రీమతి.

"అమ్మా!..." ఎంతో ఆశ్చర్యంతో అంది హేమ.


"నీ అభిప్రాయాన్ని చెప్పవే. ఆ అబ్బాయి మన ఎదురింటి సావిత్రి గారి పెద్ద కొడుకు. నీకు నచ్చితే అతనే నీకు కాబోయే భర్త" అనునయంగా చెప్పింది శ్రీమతి.

నవ్వుతూ శ్రీమతి కళ్ళల్లోకిచూసింది హేమ కొన్ని క్షణాలు ఆమె కళ్ళల్లో హేమకు ఎంతో ప్రేమాభిమానాలు గోచరించాయి.


"నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా" తల్లి ముఖాన్ని తన చేతులతో పట్టుకొని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి ప్రేమ గదిలోకి పరుగు తీసింది హేమ.


ఆ రాత్రి ఏకాంత సమయంలో భర్త రామనాథంతో......

శ్రీమతి సావిత్రమ్మ కుటుంబ వివరాలు... ఆమె ఇద్దరి కొడుకులను గురించి ఎంతో వివరంగా చెప్పింది. పడక మంచం పై పరుండి చివరగా... "కులగోత్రాలను గురించి ఎంచుకోనవసరం లేదు. మంచి కుటుంబం. మనకు అన్ని విధాల తగిన సంబంధం. ఆ పిల్లలిద్దరూ రామలక్ష్మణుల్లా ఉంటారు. సావిత్రమ్మ చాలా మంచిది. నా బిడ్డలు ఆ ఇంట అన్ని విధాల సుఖపడతారు. వారికి వివాహాలు త్వరలో జరిపించాలనేది నా కోరిక. ఏలిన వారు తమ సమ్మతిని తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. నా మాటను కాదనరు కదా!..." భర్తకు దగ్గరగా జరిగి అతని వీపుపై తన చేతిని వేసి ఆత్రుతతో అతని ముఖంలోకి చూసింది.


రామనాథం తదేకంగా భార్య ముఖంలోకి కొన్ని క్షణాలు చూస్తూ ఉండిపోయాడు. ఆ క్షణంలో ఆయనకు తమ ప్రేమ... శ్రీమతి సాహసం గుర్తుకు వచ్చాయి. మనస్సు పులకించింది. మస్తిష్కంలో మధురస్మృతులు... వదనంలో ఆనందం.

తన రెండు చేతులతో అర్ధాంగిని దగ్గరకు తీసుకొని తన గుండెలకు హత్తుకున్నాడు.

"శ్రీమతీ నీ నిర్ణయాన్ని నేను ఏనాడూ కాదనలేదు. కాదనబోను. కారణం... నీవు నాకు ఆ దేవుడు ప్రసాదించిన దేవతవు. నా సర్వస్వం." ఎనలేని ప్రీతికి ప్రతిరూపంగా ఆ పలుకులు వినిపించాయి శ్రీమతికి. అతని హృదయాన్ని హత్తుకుపోయింది ఎంతో ఆనందంగా.

***

"సార్... గుడ్ మార్నింగ్" సెల్యూట్ చేసి అంజి బాబు ముందు నిలబడింది హేమ.

"రండి కూర్చోండి" ఫైల్ చూస్తూ యాంత్రికంగా పలికాడు అంజిబాబు.


"సార్ ఒక్కసారి నా వైపు చూడండి సార్." ఎంతో వినయంగా పలికింది హేమ.


అంజి బాబు తల ఎత్తి చూడకతప్పలేదు. తెల్లటి చీర.. జాకెట్... తల్లోమల్లెపూలు. సాక్షాత్ దివి నుంచి భువికి దిగివచ్చిన అప్సరకాంతలా కనిపించింది ఆ క్షణంలో...


అంజిబాబు ఆశ్చర్యంగా తదేకంగా హేమను చూస్తుండిపోయాడు.

"ఈరోజు నా బర్త్‌డే సార్" నవ్వుతూ కోకిలలా పలికింది హేమ.

అంజిబాబు హేమ స్వరాన్ని విని తొట్రుపాటుతో "ఓహో... అలాగా... మెనీమెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే" నవ్వుతూ అన్నాడు అంజి.


"సార్ స్వీట్ తీసుకోండి" కుర్చీకి దగ్గరగా వచ్చి ప్యాకెట్ ఓపెన్ చేసింది.

అంజి స్వీట్ ప్యాకెట్ నుంచి తీసుకోబోయాడు. అతనికంటే ముందు హేమ చేతికి తీసుకొని ప్యాకెట్‌ను అంజికి అందకుండా టేబుల్ చివరనవుంచింది. అంజి నిర్గాంత పోయాడు ప్రశ్నార్థకంగా హేమ ముఖంలోకి చూశాడు.

"నోరు తెరవండి"

"ఆ..." అప్రయత్నంగా అంజి నోరు తెరిచాడు.


హేమ స్వీట్ ను అంజి నోట్లో వేసింది.

అంజి ఆ చర్యకు ఆశ్చర్యపోయి నిట్టూర్చాడు. ఆ బుస హేమ చెవికి సోకింది చిరునగవును చిందిస్తూ...


"స్వీట్ ఎలా ఉంది సార్..." అంది హేమ కొంటెగా నవ్వుతూ.

అంజి స్వీట్ మ్రింగి... గ్లాసులో ఉన్న నీళ్లు కొంచెం త్రాగి "మీరు ఇలా చేయడం ఏం బాగాలేదు" చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ "ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు" ప్రశ్నార్థకంగా హేమ ముఖంలోకి చూశాడు.


హేమ హేళనగా నవ్వుతూ "నా ప్రశ్నకు తమరు జవాబు చెప్పలేదు" అంజి మాటలకు జవాబు చెప్పకుండా నవ్వుతూ అడిగింది...

"ఏమిటా ప్రశ్న?"

"స్వీట్ రుచి ఎలా ఉంది!..."

"మా అమ్మ చేసినట్లు ఉంది" సాలోచనగా అన్నాడు అంజి.


“మీ అమ్మగారు కాదు. చేసింది మా అత్తయ్య" గలగలా నవ్వుతూ స్వీట్ ప్యాకెట్ ను తీసుకుని హేమ గది నుండి వెళ్లిపోయింది.

హేమ చివరి మాటలకు అంజిఅదిరిపోయాడు. ‘మీ అమ్మగారు కాదు మా అత్తయ్య’ అతని మస్తిష్కంలో మారుమ్రోగింది ఈ మాట...


మొబైల్ చేతికి తీసుకుని వెంటనే సావిత్రమ్మకు ఫోన్ చేశాడు.

"నాయనా!.. అంజీబాగున్నావా?..." సావిత్రమ్మ ప్రశ్న.

"నేను బాగున్నానమ్మా. నీవు రాఘవా..." అంజి పూర్తి చేయకముందే సావిత్రి...

"లడ్డు ఎలా ఉంది. హేమ వచ్చి ఇచ్చిందా లేదా!..." సావిత్రమ్మ ప్రశ్న.


అంజి ఆశ్చర్యంతో మునిగిపోయాడు. కొద్ది క్షణాల తర్వాత తేరుకొని...

"అమ్మా!... హేమ నీకు ఎలా తెలుసమ్మా? ఎంతో ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.


"ఓరి నా పిచ్చి సన్యాసి... హేమ మన ఎదురింటి డి.ఎస్.పి రామనాథం గారి పెద్దమ్మాయి. నీకు కాబోయే భార్య. రేపు ఆదివారం నాటికి ఇంటికి రా. అన్ని వివరంగా చెబుతాను. నీకు... నీ తమ్ముడికి వివాహాలు ఒకేసారి... నీ మరదలు ఎవరో తెలుసా హేమ చెల్లెలు ప్రేమ." ఎంతో ఆనందంగా పలికింది సావిత్రి.


"ఆ క్షణం అతని ఎదుట హేమ నవ్వుతూ సాక్షాత్కరించింది.

"సార్!... ఈ వీకెండ్ లో నెల్లూరుకి పయనమా!... నేనూ మీతో వస్తాను. రెండు టికెట్లు బుక్ చేయండి." గలగల నవ్వుతూ దేవకన్యలా అదృశ్యం అయ్యింది హేమ.


అంజిబాబు మనస్సు ప్రస్తుతం ఈ లోకంలో లేదు... ఏవేవో ప్రశ్నలు.... చిత్రవిచిత్రమైన ఊహలు. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. సెల్ మ్రోగింది. చేతికి తీసుకున్నాడు.

"అన్నయ్యా!... నాకు టాటాలో ఉద్యోగం వచ్చింది. ఇద్దరు అమ్మల ఆశీస్సులు. నాకు ఈనాడు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించాయి అన్నయ్యా!" ఎంతో ఆనందంగా చెప్పాడు రాఘవ.


'అమ్మల ఆశీస్సులు' అన్న రాఘవ మాట పదేపదే అతని చెవుల్లో మారుమ్రోగింది. వదనంలో అవధులు లేని ఆనందం.

* * *

-సమాప్తం-

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Twitter Link

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.131 views0 comments

Comentarios


bottom of page