top of page

అమ్మ మనసు


'Amma Manasu' New Telugu Story Written By Lakshmi Sarma B

రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ


“కవితా …నాకు టైం అవుతుంది టిఫిన్ అయిందా? ఎంత సేపు పిల్లలతోనేనా? నన్ను పట్టించుకునేది వుందా లేదా,” గట్టిగా కేక వేసాడు మధు.

“అబ్బా… వస్తున్నానండి మీకే టిఫిన్ తయారు చేస్తున్నాను, అయినా పిల్లలు చిన్నవాళ్ళు. ఎంత సేపు వాళ్ళ మీదనే మీకు, మీరేం చిన్నపిల్లలా… లోపలికి వచ్చి ప్లేట్ లో పెట్టుకోవచ్చు కదా! పిల్లలకు స్కూల్ లో లేట్ అయిందంటే వాళ్ళకు దెబ్బలు పడతాయి మీకేం తెలుసు,” అంది ప్లేట్ లో టిఫిన్ తెస్తూ.

“సరేలే …అలా అనుకున్నప్పుడు పిల్లలు నువ్వు తొందరగా లేవడం అలవాటు చేసుకోవాలి,రాత్రి టీవీచూసుకుంటూ కూర్చునే బదులు పిల్లలను తొందరగా పడుకోబెట్టడం అలవాటు చేయ్యాలి నన్నడం కాదు,” అన్నాడు మధు టిఫిన్ తినడం ముగిస్తూ.

“సరేలేండి మిమ్మలను కదిలించడం నాదే తప్పు,”అంటూ విసవిస లోపలికి వెళ్ళింది కవిత. ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు మధు.


“అమ్మా… బాయ్ బాయ్,” అంటూ ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు. కాస్త వూపిరి తీసుకున్నట్టయింది కవితకు. పిల్లలంటే పంచ ప్రాణాలు కవితకు వాళ్ళ మీద ఈగ వాలనీయదు. అబ్బాయి సాయికి పదేళ్ళు. సౌమ్యకు పన్నెండు సంవత్సరాలు. కంటికి రెప్పలా కాపాడుతుంది. తను ఇంజనీర్ చేసి కూడా మంచి వుద్యోగం వున్నా వదులుకుంది పిల్లల కోసం.


తను ‘వుద్యోగానికి వెళితే పిల్లలను ఎవరు చూస్తారు? సమయానికి తిండి పెట్టి వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుతారా’ అంది వుద్యోగం మానేయ్యోద్దు అని మధు అన్నరోజు.

‘మా అమ్మ, నాన్న వస్తారు’ అంటే కూడ ‘మీ అమ్మ మిమ్మల్ని అమ్మలా చూస్తుంది. నా పిల్లలను కాదు’ అంటూ గొడవ చేసింది కవిత.

“కవితా… పిల్లలను నువ్వు మరీ గారాబం చేస్తున్నావు, వాళ్ళు అడిగిందే తడవు అన్నట్టు అన్ని ఇస్తున్నావు, ఇలా అయితే చాలా కష్టం. వాళ్ళు మొండి వాళ్ళలా తయారవుతున్నారు, నా మాట అసలు లెక్క చెయ్యడం లేదు,” అంటూ మందలించాడు కవితను మధు.

“మధు… చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు, మనమేం చెబితే అది చేస్తారు, కొంచెం పెద్దవాళ్ళయితే వాళ్ళకు అన్నితెలుస్తాయి,” అని వాళ్ళను వెనకేసుకొచ్చింది కవిత.

చూస్తుండగానే పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు.

“బాబు సాయి… లేవరా కాలేజికి వెళ్ళాలి, టైం చూడు ఎంతవుతుందో,” అంటూ కొడుకును లేపింది.

“అబ్బా పో అమ్మ నేను లేవను,” అని ముసుగు తన్ని పడుకున్నాడు సాయి.

“అదేమిట్రా అక్కను చూడు, చకచకా తయారయింది నీకు టైం అవుతుంది,” అంటూ కప్పు తీసి పక్కన పడేసింది.

“అమ్మా… నన్ను ప్రశాంతంగా పడుకోనియవా,” విసుక్కుంటులేచి గబగబ తయారయ్యాడు.

కవిత మనసు చివుక్కుమన్నది సాయి అన్నమాటకు. ఎన్నడు ఎదురుమాట్లాడని కొడుకు అలా అనేసరికి. అదే మాట మధుతో చెప్పి బాధ పడింది.

“ఊరుకో కవిత , ఇంత చిన్న విషయానికే బాధ పడితే ఎలా? అయినా… పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు మన జాగ్రత్తలో మనముండాలి,” చెప్పాడు మధు.

“సౌమ్యా… బాక్సు అంతా అలానే తెచ్చావేంటి? ఏమి తినలేదు ఏమైంది ఒంట్లో బాగలేదా ఏమైందిరా,” అని కూతురు సౌమ్యను పట్టుకుని చూసింది

జ్వరమేమైన వచ్చిందేమోనని.

“అబ్బా అమ్మా… నీకు అన్నింటికి కంగారే, మేమేమన్న చిన్నపిల్లలమా! ఒక్కపూట అన్నం తినకపోతే హడావుడి చేస్తావు, మా ఫ్రెండ్సందరు పార్టీ చేసుకుందాము అన్నారు, సరే అని అందరం హోటల్ కి వెళ్ళాము,” సింపుల్ గా చెప్పింది సౌమ్య.

తల్లి మనసు తల్లడిల్లింది సౌమ్య మాటలకు. “మరి ముందు చెప్పివుంటే నాన్ననడిగి డబ్బులు ఇప్పించేదాన్ని కదా,” నొచ్చుకుంటూ అంది కవిత.

“అయ్యో పిచ్చి అమ్మా… ఇప్పుడు మేము పెద్దవాళ్ళము అయ్యాము, అప్పుడంటే చిన్నపిల్లలం మాకు ఏం కావాలో తెలియక అన్ని నిన్ను అడిగేవాళ్ళం, నాన్న కోప్పడుతారేమోనని భయం అప్పుడు, కాని ఇప్పుడు మాకేం కావాలో మేము తెలుసుకోగలుగుతున్నాము కదా! మీ పాతకాలం వాళ్ళలాగ అన్నిటికి భయపడుతు కూర్చోవడం మా వల్ల కాదమ్మ,” టక టక సమాధానం చెప్పింది సౌమ్య.

మాట రాక నోరు వెళ్ళబెట్టింది కవిత. అంతా విన్న మధు కవితను వూరడించాడు. “మనం చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు” అంటూ.

“అదికాదండి… వాళ్ళు చాలా ఎదిగిపోయారు, మన మాట వింటారా ముందు ముందు,” భయంగా అంది.

“కవితా ప్రతి విషయం భూతద్దంలో పెట్టి చూడొద్దు, వాళ్ళకు మెల్లగా నచ్చచెప్పాలి మనం కఠినంగా అన్నామే అనుకో, వాళ్ళు ఇంకా మొండిగా తయారవుతారు, నేను ఆరోజే చెప్పా వాళ్ళను మరీ గారాబం చెయ్యొద్దని విన్నావా కానీలే ఏం చేద్దాం,” అంటూ భార్యకు నచ్చచెప్పాడు మధు.

“సాయి… ఎప్పడనగా వెళ్ళావు ఇంత సేపు ఎక్కడున్నావు? జోరు వాన పడుతుంది మీ అమ్మ ఎంత హైరాన పడుతుందో చూసావా? ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, అంత తీరకలేకుండా వున్నావా? ఎక్కడతిరిగి వస్తున్నావు ఇంత సేపు,” గట్టిగా అడిగాడు మధు.

“ఎవరు ఎదురు చూడమన్నారు ఆవిడగారిని, మాకంటు స్వేచ్ఛ స్వాతంత్రాలు వుండవా? ఎప్పుడు చూసినా ఎక్కడకెళ్ళావు? ఇది తిను అది తిను ఈ డ్రెస్సు వేసుకొ ఆ డ్రెస్సు వేసుకో, అన్ని మీరు చెప్పినట్టువుండాలంటే మాకు కుదరదు, మమ్మల్ని ఫ్రీగా వదిలెయ్యమని చెప్పండి నాన్న,” అన్నాడు సాయి తల్లి వైపు చూస్తూ.

నిశ్చేష్టురాలై చూస్తుండిపోయింది కవిత. మధు ఆవేశంతో సాయి చెంప చెళ్ళు మనిపించాడు.

“ఏమిట్రా మాటలు ఎక్కువయిపోతున్నాయి? చిన్నా పెద్దా తేడాలు మర్చిపోయావా? కన్నతల్లిని పట్టుకుని ఇలానేనామాట్లాడేది గట్టిగా,” అన్నాడు మధు.

“అయ్యో అదేంటండి వాణ్ని అంత దెబ్బ కొట్టారు,” అంటూ పరుగున వచ్చింది సాయిని పట్టుకోవడానికి కవిత. దూరంగా జరిగాడు సాయి. గుండెలో ముల్లులా కుచ్చింది కవితకు.


“మరేంటి నాన్నా, అమ్మ ప్రతిది తనకు చెప్పాలంటుంది, కొంచెం లేట్ అయితే పాపం మా ఫ్రేండ్ వాళ్ళకు ఫోన్ చేస్తుంది, మొన్న ఏం చేసిందో తెలుసా నాన్న, నేను కాలేజికి రాలేదని కాలేజి వాళ్ళు అమ్మకు ఫోన్ చేసారట, అమ్మేమో కాలేజికి వచ్చి పెద్ద హంగామ చేసిందట, నేను మా ఫ్రెండ్ కు జ్వరంగా వుంది అంటే, మా ఫ్రెండ్స్ నేను కలిసి హాస్పిటల్ కు వెళ్ళి చూసి మధ్యాన్నం వరకు కాలేజికి వెళ్ళాము, ఈ లోపల అమ్మ మా ఫ్రెండ్స్ వాళ్ళందరికి ఫోన్ చేసి కనుక్కుందట, మాఫ్రెండ్ వాళ్ళమ్మ చెప్పాక అప్పుడు ప్రశాంతంగా వుందట, మా పరువు పోతుంది నాన్న ఇలా అయితే,” అని చెపుతున్న కూతురిని.


“ఆపు సౌమ్య… నువ్వు చెప్పింది చాలు, నువ్వు ఆడపిల్లవయి బ్రతికిపోయావు, అదే మీ తమ్ముడు అయివుంటే ఈ పాటికి అలా మాట్లాడినందుకు నాలుక తెగ కోసుండేవాడిని, ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీ అమ్మ గురించి మీకు, మీ అమ్మ మీ కోసం ఎన్ని కష్టాలు పడిందో తెలుసా? తను ఇంజనీరు చదివి మంచి వుద్యోగంలో వుండి కూడా మీ కోసం తన భవిష్యత్ ను వదులుకుంది, ఇప్పుడు తన జీతం ఎంత వుండేదో తెలుసా. నెలకి లక్ష రూపాయలు హాయిగా దర్జాగా బ్రతకవలసిన ఆమె మీకోసం, ఎన్ని రాత్రులు నిద్రలేకుండా గడిపిందో తెలుసా?

“ఏమండి …ఇప్పుడవన్ని ఎందుకండి వాళ్ళకు చెప్పడం చిన్నపిల్లలు వదిలేయండి,” అంది కవిత.


“కవితా నువ్వు అడ్డురాకు, వీళ్ళకు అమ్మ మనసంటే ఏమిటో తెలియాలి, నువ్వు వీళ్ళ కళ్ళకు చదువు సంధ్య లు లేని అమాయకురాలి లాగా కనిపిస్తున్నావు, ఇప్పుడు చెప్పకపోతే వీళ్ళు నిన్ను పిచ్చిదాని లాగా జమకడతారు,” అంటూ వాళ్ళ వైపు తిరిగి “సాయికి అమ్మవారు పోసిందని తెలిసి, ఎంత కఠినంగా వుందో తెలుసా మీ అమ్మ, కొడుకు ఏమి తినడం లేదని తను పచ్చి ఉపవాసాలు వుంది తగ్గేవరకు, అంతే కాదు పచ్చి బట్టలతో విజయవాడ కనకదుర్గమ్మకు పొర్లు దండాలు చేసింది నూట ఎనిమిదిసార్లు, అంతేనా… వీడు పుట్టిననాటి నుండి హాస్పిటల్ చుట్టు తిరగడమే సరిపోయింది తనకు,

ఒకరోజు బాగుంటే మూడోరోజుకల్లా ఏదో ఒక సుస్తి, రాత్రింబగళ్ళు నిన్ను కనిపెట్టుకునే వుండేది, తను వుద్యోగానికి వెళితే మీకు వేళకు తిండి తిప్పలు వుండవని, మిమ్ములను ఎవరు సరిగా చూసుకుంటారో లేదోనని, తన వుద్యోగానికి రాజీనామ చేసింది, ఆ సమయంలో మీ అమ్మను అనని వారు లేరు, ఇంత మంచి జాబు వదులుకుంటారా? పిల్లలు ఎవరికి లేనట్టు చేస్తున్నావు ఇంత అపురూపామా అని, నా పిల్లలు నాకు ప్రాణంతో సమానం నాకే వుద్యోగాలు వద్దు అని మొండికేసింది.


అంతే కాదు… సౌమ్య నువ్వు పోట్లాడుకున్నప్పుడు, నువ్వు సౌమ్య ను తోసివేస్తే వెళ్ళి పెద్ద బండరాయికి గుద్దుకుంది బొటబొటా రక్తం కారిపోయింది, హాస్పిటల్ కు తీసుకవెళితే చాలా రక్తం పోయింది, రక్తం ఎక్కించాలి అంటే, అప్పటికప్పుడు మీ అమ్మ రెండు బాటిళ్ళ రక్తం ఇచ్చింది తెలుసా? ఆ రోజు మీ అమ్మ నీ కోసం పడిన ఆరాటానికి, ఈ రోజు నువ్విచ్చే బహుమానం మీ పరువు తీస్తుందనా! రెండు నిమిషాలు స్కూల్ ఆటో లేటయితేనే కంగారు పడుతుంది మీ అమ్మ, ఈరోజులు ఎలా వున్నాయో తెలిసి,

మీరు పెద్దవాళ్ళయితున్నారు ఎక్కడ పెడదారులు పడతారోనని ఆమె మీ కోసం ఆరాటపడతుంటే, మీకు స్వాతంత్రం లేకుండా చేసిందా?


చూడండి… మీరింకోక మాట మీ అమ్మ గురించి మాట్లాడినా, ఆమెను బాధ పెట్టినా, తక్షణం ఈ ఇంట్లో నుండి మెడలుపట్టి బయటకు ఈడ్చిపడవేస్తాను, కడుపునపుట్టిన పిల్లలని కూడ చూడను తెలిసిందా,?” అంటూ ఉరిమి చూసాడు.


ఆపాటికే సాయి సౌమ్య లు తల్లి కాళ్ళు పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ, “అమ్మా మమ్మల్ని క్షమించుమని అడిగే అర్హత కూడా మాకు లేదమ్మా,” అంటూ చెరో వైపు తల్లిని పట్టుకుని బావురమన్నారు.


“అయ్యయ్యో ఏమిట్రా ఇది… ఇప్పుడేమైందని ఇంతగా ఏడుస్తున్నారు, ఛ ఛ వూరుకోండి,” అంటూ “చూడండి… ఇదంతా మీ వల్లనే, అనవసరంగా పిల్లలను ఏడిపిస్తున్నారు,” అని భర్తను మందలించి పిల్లలను అక్కున చేర్చుకుంది కవిత.

“చూసారా… ఇప్పటికైనా ఆ అమ్మ మనసు మిమ్మలను తప్పు పట్టకుండా ఎలా అక్కున చేర్చుకుందో,” అన్నాడు మధు.


“నాన్న …అమ్మా … మీరిద్దరు మమ్మల్ని క్షమించాలి,” ఇక నుండి మీరెలా

చెబితే అలా నడుచుకుంటాం,” అంటూ ఇద్దరి చేతులు పట్టుకుని కళ్ళకద్దుకున్నారు.

కవితకు మధుకు కళ్ళనుండి ఆనందభాష్పాలు రాలాయి పిల్లలిద్దరిని చూసుకుని.

॥ ॥ శుభం ॥ ॥

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ (త్రిగుళ్ళ)

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్



405 views4 comments
bottom of page