top of page
Original.png

అమ్మాయి మనసు


తల్లిదండ్రుల పట్ల బాధ్యతతో తన పెళ్లి నిర్ణయాన్ని స్వయంగా తీసుకుంటున్న సుజిత

Ammayi Manasu - Telugu Family Story | Chilakamarri Padmavathi

అమ్మాయి మనసు - తెలుగు కుటుంబ కథ | చిలకమర్రి పద్మావతి

Publishes in manatelugukathalu.com on 24/08/2026


అమ్మాయి మనసు అనేది చిలకమర్రి పద్మావతి రచించిన హృద్యమైన కుటుంబ, సామాజిక విలువల కథ. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలను మాత్రమే కాదు, రెండు కుటుంబాలను కూడా కలిపే బంధమని ఈ కథ చక్కగా చూపిస్తుంది.

తన తల్లిదండ్రుల పట్ల బాధ్యతను గుండెల్లో పెట్టుకున్న సుజిత, పెళ్లి తర్వాత కూడా వారికి అండగా ఉండాలని కోరుకుంటుంది. అయితే తన జీవిత భాగస్వామి తన అభిప్రాయాలను గౌరవించాలని కూడా స్పష్టంగా చెబుతుంది. ఆమె ఆలోచనలను మొదట పూర్తిగా అర్థం చేసుకోలేని సూర్య, తర్వాత తన తల్లి మాటలు మరియు స్నేహితుల అనుభవాల ద్వారా సుజిత మనసును అర్థం చేసుకుంటాడు.

అమ్మాయి మనసు కథలో స్త్రీ స్వతంత్ర ఆలోచన, తల్లిదండ్రుల పట్ల బాధ్యత, వివాహంలో పరస్పర గౌరవం, కుటుంబ బంధాలు, భార్యాభర్తల మధ్య అవగాహన వంటి అంశాలు సహజమైన కుటుంబ నేపథ్యంతో అందంగా మిళితమయ్యాయి. ఒక అమ్మాయి తన జీవిత భాగస్వామి నుంచి నిజంగా ఏం కోరుకుంటుందో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ కథ ఆలోచన కలిగిస్తుంది.


"ఇవాళ బ్యాంకులో ఏం జరిగిందో తెలుసా" అంటూ ఎప్పుడెప్పుడు ఆ విషయం తన వాళ్లకు చెప్దామా అని హుషారుగా ఇంట్లోకి అడుగుపెట్టిన సుజితకు ఒక్క క్షణం అక్కడేం జరుగుతోందో అర్థం కాలేదు...


అమ్మ, నాన్న, చెల్లి అందరూ చాలా ఆనందంగా గట్టిగా మాట్లాడుకుంటున్నారు.. రోజూ తన రాక కోసం ఎదురుచూసే వాళ్ల ముగ్గురిలో ఒక్కరు కూడా తను వచ్చిందన్న సంగతే పట్టనట్టు వాళ్ల ఆనందంలో వాళ్లు ఉన్నారు...


"అమ్మా... మీ అందరికీ అంత ఆనందం ఇచ్చిన విషయం ఏమిటో చెప్తే నేను కూడా మీ నవ్వుల్లో కలుస్తానుగా..." కొద్దిగా ఉక్రోషం నిండిన స్వరంతో అంది సుజిత. రోజూ తను ఎప్పుడొస్తుందా అన్నట్టు చూసి గుమ్మం దగ్గరే ఎదురొచ్చేవాళ్లు తన ఉనికే గమనించకపోయేటప్పటికీ సుజితకు ఏదో తెలియని భావం... అదే తన మాటల్లో ఉక్రోషాన్ని నింపింది..


"తల్లీ సుజీ... వచ్చావా... ముందు నీ నోరు తీపి చేసుకో... అంతకన్నా తియ్యటి కబురు చెప్తా.." అంటూ అక్కడే ఉన్న డబ్బా మూత తెరిచి పాలకోవా నోట్లో పెట్టింది తల్లి...


"ఏంటమ్మా ఇది... విషయం ఏమిటో చెప్పండి ముందు..." అంటూనే తనకి ఇష్టమైన కోవా ఇంకోటి చేతిలో తీసుకుని "ఇప్పటికైనా చెప్తారా..." అంది.


"ముందు నువ్వు ఇలా స్థిమితంగా కూర్చో... చెప్తాను" అంటూ సుజిత చేయి పట్టుకుని సోఫాలో తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు తండ్రి మాధవరావు.


"క్రింది ఆదివారం పెళ్లిచూపులకి వచ్చిన వాళ్లు ఫోన్ చేసి నువ్వు నచ్చావని చెప్పి మంచి రోజు చూసుకుని ఒకసారి వాళ్ల ఇంటికి రమ్మన్నారు తల్లీ... అబ్బాయి బావున్నాడు, మంచి ఉద్యోగం, మనకి మాత్రం అభ్యంతరాలు ఏముంటాయి అని నేను కూడా ఓకే అని చెప్పేసానమ్మా... నీకూ ఓకే కదా" ఎంతో ప్రేమగా సుజిత తల మీద చేత్తో నిమురుతూ చెప్పాడు..


చాలా మంది ఆడపిల్లల్లానే తండ్రి అంటే చాలా ఇష్టం సుజితకి కూడా.

అంత సంతోషంగా మాట్లాడుతున్న తండ్రి మొహంలోకి చూస్తూ నెమ్మదిగా అంది, "నాన్నా... వాళ్లకి ఓకే అని చెప్పే ముందు నన్ను ఒక్క మాట కూడా అడగాలనిపించలేదా?"


ఆ మాట వినగానే తల్లి శ్యామల కంగారుగా, "అదేంటే... ఈ ఇంట్లో ఏ విషయమైనా నాన్నగారిదే తుది నిర్ణయం అని నీకూ తెలుసు కదా... కొంపదీసి ఎవరినన్నా ప్రేమించావా ఏంటి..."


"ఆగమ్మా నీకు అన్నీ కంగారే... మీ పెంపకం నాకు పిరికితనం నేర్పించలేదు... అలాంటిది ఏమన్నా ఉంటే ముందే చెప్పేదాన్ని."


అప్పటికే సుజీ అడిగిన ప్రశ్నకు అపరాధ భావంతో ఆలోచనలో పడిన తండ్రిని చూసి ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుని,

"నాన్నా... మీరు నా కోసం ఏం చేసినా అన్నీ ఆలోచించి చేస్తారన్న నమ్మకం నాకుంది... కానీ నా పెళ్లి విషయంలో మాత్రం నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను... వాటిని గౌరవించేవాడు దొరికినప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను... లేదంటే ఇలాగే మీ దగ్గరే ఉండిపోతాను. దయచేసి ఇంకెప్పుడూ తొందరపడి నన్ను ఇబ్బంది పెట్టకండి.." అని లేచి తన గదికి వెళ్లబోతుంటే తల్లి శ్యామల అడ్డుపడింది..


"అసలు నీ మనసులోని మాట ఏమిటో సరిగ్గా చెప్పు ఇవాళైనా... అవతల వాళ్లకి ఏం సమాధానం చెప్పాలో కూడా నువ్వే చెప్పు..."


"అమ్మా... రేపు బ్యాంకు సెలవు. రేపు ఉదయం నలుగురం సరదాగా నాన్న రోజూ వాకింగ్కి వెళ్లే పార్కుకి వెళదాం.. అమ్మా... రేపు నీకు కూడా సెలవే... పార్కు నుంచి తిరిగి వచ్చేటప్పుడు నీకు ఇష్టమైన బాబాయ్ హోటల్ నుంచి టిఫెన్ తెచ్చుకుందాం, మధ్యాహ్న భోజనం నేనూ చెల్లి కలిసి తయారు చేస్తాం."


అప్పటిదాకా సీరియస్గా ఉన్న వాతావరణం సాధారణ స్థితిలోకి రావడంతో చెల్లి సుమిత, "అక్కా... అయితే రేపు మనం బిర్యానీ చేసుకుందామా... తిని చాలా రోజులైంది.."


చిన్న కూతురి మాటలతో మామూలు స్థితిలోకి వచ్చిన శ్యామల, "మొన్ననే కదే నీ స్నేహితులు అందరూ మనింట్లో బిర్యానీ కావాలని అడిగారంటే చేశాను... అందరికీ పెద్ద డబ్బా నిండా పట్టుకెళ్లావు... బిర్యానీ అంటే అంత ఇష్టమేంటే నీకు" అంటూ ముద్దుగా తల మీద మొట్టబోయింది.


"నాన్నా అమ్మ చూడు" తల్లి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తండ్రి చాటుకి చేరిన చిన్న కూతురిని అప్రయత్నంగా దగ్గరికి తీసుకున్నాడు...


"ఇంక చాలు పదండి... భోజనాలు చేసి పడుకుందాం" అంటూ వంటింట్లోకి దారి తీసింది శ్యామల.


"నా పిల్లలు రత్నాలు... వాళ్లెప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకోరు... చూద్దాం రేపు ఉదయం సుజి ఏం చెప్తుందో" అని మనసులో అనుకుంటూ వీధి తలుపు గడియ వేసి లోపలికి నడిచాడు మాధవరావు.


తన గదిలోకి వెళ్లి గబగబా చల్లనీళ్లతో మొహం కడుక్కుని కాస్త ఉపశమనం పొంది వంటింట్లోకి వచ్చింది సుజి... ఎవరికి ఎంత ఆలస్యం అయినా నలుగురూ కలిసి భోజనం చేయడం వాళ్లకు చిన్నప్పటి నుంచీ వచ్చిన అలవాటు... రోజూ లానే ఆ రోజు కూడా అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ముగించారు... తల్లికి, తండ్రికి గుడ్ నైట్ చెప్పారు సుజిత, సుమిత...


"నాకు ఎల్లుండి పరీక్ష ఉంది... కాసేపు చదువుకుని వస్తాలే... నువ్వు పడుకో అక్కా..." అంటూ చదువుకునే గదిలోకి వెళ్ళింది సుమిత... "సరే" అంటూ పడక గదికి వెళ్ళింది సుజిత.


కాసేపు ఏదన్నా చదువుదాం అని ఎదురుగా కనిపించిన పుస్తకం తీసుకుంది కానీ మనసు లగ్నం కాలేదు, ఇంక లాభం లేదు పడుకుంటే సరి అనుకుని మంచంపై వాలింది... కళ్లు మూసుకుని పడుకున్న సుజితకి పది రోజుల నుంచి జరిగిన విషయాలన్నీ ఒక్కసారిగా కళ్ల ముందు కదలాడాయి..


పెళ్లి గురించి పూర్తిగా తన ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే, తను గుర్తించే లోపే పెద్దవాళ్ల మాటలు పెళ్లి దాకా వెళ్ళిపోయాయి..


పది రోజుల క్రితం ఒక రోజు బ్యాంకుకి ఎవరో స్నేహితురాలితో కలిసి వచ్చిన రమాదేవికి, సుజితను చూడగానే ఆ అమ్మాయి అందం, నెమ్మదితనం అన్నీ బాగా నచ్చేసి ఇలాంటి అమ్మాయి కోడలిగా వస్తే బావుండు అనిపించింది.. అనుకున్నదే తడవు సుజిత గురించి తెలుసుకుని మంచి రోజు చూసుకుని పెళ్లిచూపులకి వస్తాం అని కబురు కూడా చేసేసింది...


"కక్కొచ్చినా కల్యాణమొచ్చినా ఆగదు" అనే సామెతని తలుచుకుంటూ ఆనందంగా పెళ్లిచూపులకి సిద్ధం చేశారు... "అప్పుడే పెళ్లా అంటున్నా నువ్వు చెప్పేవన్నీ తర్వాత వింటాం ముందు ఇప్పుడు సిద్ధం అవు" అంటూ సుజితను పెళ్లిచూపుల్లో కూర్చునేలా చేశారు...


స్వతహాగా నెమ్మదస్తురాలు అయిన సుజి వాళ్ల మాట కాదనలేకపోయింది... పెళ్లిచూపుల్లో రమాదేవి గారి మాటల్లో కనిపించిన, వినిపించిన ఆప్యాయత చూసి ఆ రోజు ఏమీ మాట్లాడలేకపోయింది... కొడుకు గురించి అన్నీ వివరంగా చెప్పింది ఏమీ దాచకుండా... సూర్య తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో చిన్నప్పటి నుంచి తండ్రికి దూరంగా పెరగడంతో నాయనమ్మ, తాతల గారాబంతో పెరిగాడని, ఈ మధ్యనే పెద్దవాళ్ళిద్దరూ చనిపోవడంతో ఒంటరితనంలో ఉండిపోతున్నాడని, అందుకే పెళ్లి చేస్తే బావుంటుందని అనుకుంటున్నామని చెప్పింది. సూర్యతో విడిగా మాట్లాడదాం అనుకున్న సుజితకి ఆ అవకాశం ఇవ్వకుండానే వెళ్లిపోయారు తల్లికొడుకులు... సూర్య కూడా అంతగా సుముఖత చూపించలేదు అనిపించింది..


తర్వాత రోజు ఎలాగైనా సూర్యని కలిసి తన మనసులోని మాట చెప్పాలని ఇంట్లో ఎవరికీ తెలియకుండా పార్కులో కలుసుకుంది..


మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే ఆర్థిక ఇబ్బందుల గురించి, ఇప్పుడు వాళ్లు ఉంటున్న ఇల్లు కోసం తీసుకున్న పెద్ద మొత్తం అప్పు వాయిదా ప్రతి నెలా తన జీతంలోంచే కడుతుందని... పెళ్లి అయ్యాక కూడా అదే విధంగా జరగాలని తన కోరిక అని, ఇందులో తన తల్లిదండ్రుల ప్రమేయం ఏమీ లేదని అదంతా తన కన్నవారి కోసం తను తీసుకున్న నిర్ణయం అని సూటిగా చెప్పింది సుజిత... ఆ విషయంలో కొంతకాలం సహకరించమని అభ్యర్థన అని చెప్పింది..


అంతా మౌనంగా విన్న సూర్య, "మీరు చెప్పినది అంతా బానే ఉంది. మీరు మీ తల్లిదండ్రులకి ఏ రకంగా సహాయం చేసినా నాకు సమ్మతమే... కానీ ఇలా ఖచ్చితంగా ప్రతి నెలా అనేది అంత సబబుగా అనిపించడం లేదు... మీరు పెళ్లి తర్వాత మా ఇంటికి వచ్చేస్తారు కదా... అక్కడ అవసరాలు అవీ కూడా ఉంటాయి కదా... మన భవిష్యత్తు మన సంసారం కూడా చూసుకోవాలి కదా. ఆలోచించండి" అని తన అసహనాన్ని పైకి కనబడనీయకుండా మర్యాదగానే అన్నాడు..


సుజిత మాత్రం వెంటనే, "నేను ఆలోచించేది ఏమీ లేదండి... నేను చెప్పిన దాని ప్రకారం ఇప్పటిలానే మా పుట్టింటి వాళ్లకి సహాయంగా ఉంటాను, మీకు ఇష్టమైతే కబురు చేయండి... లేదంటే మనిద్దరం ఇప్పుడే బై చెప్పేసుకుందాం" అంటూ చేతి గడియారం చూసుకుని, "చాలా సమయం అయింది... నేను వెళ్తాను" అని గబగబా పార్కు బయటికి నడిచింది...


తన సమాధానం కోసం కనీసం ఒక్క నిమిషం అయినా ఆగకుండా వెళుతున్న సుజితను చూసి కొద్దిగా కోపం వచ్చినా తమాయించుకుని ఇంటి దారి పట్టాడు సూర్య..

తర్వాత రెండు రోజులు నిశ్శబ్దంగా గడిచిపోయాయి... "నేను ఏదన్నా తప్పుగా ఆలోచిస్తున్నానా... నాన్నకి చెప్పి సూర్యతో మాట్లాడితే బావుండేదేమో... అయినా నేనేమీ తప్పు మాట్లాడలేదు" అని తనకి తనే సర్ది చెప్పుకున్నా ఆ తర్వాత రోజంతా అన్యమనస్కంగానే గడిపింది బ్యాంకులో.


ఇంట్లో ఆ పెళ్లి సంబంధం గురించి తల్లీతండ్రి ప్రస్తావన తీసుకురాబోతుంటే "వాళ్ల దగ్గర్నుంచి కబురేదన్నా రానివ్వండి అప్పుడు చెప్తా నా అభిప్రాయం" అంటూ మళ్ళీ వాళ్లను ఆ విషయం గురించి మాట్లాడనివ్వలేదు..


ఇంక సూర్యని మర్చిపోవడం మంచిది అనే నిర్ణయానికి వచ్చింది సుజిత మూడు రోజుల తర్వాత.


మర్నాడు ఉదయం ఆలోచనలన్నీ వదిలేసి హుషారుగా బ్యాంకుకి బయల్దేరింది...

సాయంత్రం బ్యాంకు పని వేళలు అయ్యాక సుజితని కలవాలంటూ లోపలికి వచ్చారు రమాదేవి గారు... ఆవిడని చూస్తూనే లేచి నిలబడిన సుజితను చూసి నవ్వుతూ, "ఒక అరగంట నాతో బయటికి రాగలవా అమ్మా... నిన్ను మళ్ళీ బ్యాంకు దగ్గర దింపి వెళతాను" అన్నారు...


"సరే" అన్నట్టు తలూపుతూ, అప్పటికే సుజిత కోసం వచ్చింది ఎవరా అన్నట్టు చూస్తున్న తన సహోద్యోగుల చూపుల్ని తప్పించుకుంటూ మేనేజర్ గదిలోకి వెళ్ళి చెప్పేసి వచ్చి "పదండి" అంటూ చరవాణి ఉన్న చిన్న పర్స్ పట్టుకుని బయటికి దారితీసింది...


సూర్యతో కలిసి మాట్లాడిన విషయం, తను పెట్టిన నియమం తల్లితో చెప్పి ఉంటాడా? ఆ సంగతి తెలిసే ఆవిడ మాట్లాడటానికి వచ్చారా... ఇలా పరిపరివిధాలుగా ఆలోచిస్తూ నడుస్తోంది...


"పదమ్మా... నేను కారులో వచ్చాను... దగ్గరలో ఏదైనా హోటల్కి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం..." అని సుజిత చేయి పట్టుకుని కారు దగ్గరికి తీసుకెళ్లింది రమాదేవి. మౌనంగా ఆమెని అనుసరించింది సుజిత.


"ఇప్పుడు చెప్పమ్మా... ఏం తీసుకుంటావ్... కాఫీ అలవాటు ఉందా? లేకపోతే నువ్వు వెంటనే అలవాటు చేసుకో... మా వాడికి కాఫీ అంటే ప్రాణం... ఎంత ఇష్టమైనా కంపెనీ లేకుండా మాత్రం తాగడు... నీకు కాఫీ కలపటం రాకపోయినా పర్లేదు కానీ తనతో కలిసి తాగాల్సిందే..." అంటూ సుజిత భయాన్ని ఆదుర్దాని తగ్గించే ప్రయత్నం చేసింది రమాదేవి.


"ఏమిటీవిడ... అంతా ఓకే అయినట్టుగా మాట్లాడేస్తోంది..." మనసులో అనుకున్న సుజిత, "ఆంటీ... మీకో నిజం చెప్పాలి నేను... పెద్దవాళ్ళకి ఎవరికీ తెలియకుండా నేను మీ అబ్బాయి పార్కులో కలుసుకున్నాం..." అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న సుజితని వారిస్తూ, "నాకు అంతా చెప్పాడమ్మా సూర్య... వాడు ఆ విషయంలో అంత సుముఖంగా లేడు... అలా కుదరదని కబురు చేసేయమని చెప్పేసి స్నేహితుడి పెళ్లికి వెళ్ళాడు. ఈ పాటికి ఇంటికి తిరిగి వచ్చేసే ఉంటాడు... ఈ లోగా నీతో ఒకసారి మాట్లాడితే బావుండు అనిపించింది..." అంటూ ఎదురుగా తల వంచుకుని కూర్చున్న సుజితను చూస్తూ మళ్ళీ తను చెప్పదలచుకున్న మాటల్ని కొనసాగించింది.


"నిన్ను మొదటిసారి చూడగానే నువ్వు మా ఇంటి కోడలివి అయితే బావుండు అనిపించింది... మా వాడికి కూడా వేరే అభ్యంతరాలు ఏవీ లేవు... కానీ నువ్వు అంత ఖచ్చితంగా మాట్లాడి వెళ్ళిపోయేటప్పటికీ వాడికి కోపం వచ్చిందట... నేను ఒక మాట చెప్తాను... బాగా ఆలోచించుకో..."


కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండిపోయారు ఇద్దరూ.


"చూడమ్మా... మీ వాళ్లకు ఆర్థికంగా అండగా ఉండటం పట్ల నాకు ఎటువంటి ఇబ్బందీ లేదు... నువ్వు అనుకున్నట్టుగా ప్రతి నెలా ఎంత ఇవ్వాలనుకుంటుందో చెప్తే నేను వాళ్లకి అందజేస్తాను... ఈ విషయం మనిద్దరి మధ్యే ఉంటుంది... నువ్వు నన్ను నమ్ము... కావాలంటే మీ చెల్లి పెళ్లి అయ్యాక అమ్మానాన్నలను మన దగ్గరే ఉండమందాం... ఏమంటావ్... ఏ సంగతీ ఆలోచించుకుని రేపు సాయంత్రం లోపు చెప్పు..." సౌమ్యంగా అంటూ, "పదమ్మా... నీ పని మధ్యలో వదిలేసి వచ్చావు కదా... నిన్ను బ్యాంకు దగ్గర దింపేసి నేను వెళతాను... నీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటా" అంటూ తన ఫోన్ నెంబర్ ఉన్న విజిటింగ్ కార్డు సుజిత చేతిలో పెట్టింది..


బ్యాంకు దగ్గరికి రాగానే సుజిత కారులోంచి దిగి రమాదేవి వైపు వెళ్లొస్తాను అన్నట్టు కళ్ళతోనే బై చెప్పింది... కారు వీధి చివరకు వెళ్ళేదాకా అటే చూస్తూ నిలబడిన సుజిత, "ఇంక ఇవాళ్టితో ఈ విషయం మర్చిపోతే మంచిది... ఇంటికి వెళ్లగానే అమ్మ వాళ్లకి జరిగినదంతా చెప్పేసి వాళ్ళని కూడా ఈ సంబంధం గురించి వదిలేయమని చెప్పాలి..." అని తనలో తనే గట్టిగా అనుకుంటూ లోపలికి నడిచింది... మిగిలిన పని పూర్తి చేసుకుని ఇంటి దారి పట్టింది..


అమ్మావాళ్ళు కంగారు పడుతుంటారేమో అనుకుంటూ హడావుడిగా ఇల్లు చేరిన సుజితకు ఎప్పుడూ లేనంత ఆనందకర వాతావరణం కనిపించింది... "నాతో మౌనంగా ఏమీ మాట్లాడని రమాదేవిగారు నాన్నకి ఫోన్ చేసి సంబంధం ఓకే అని చెప్పడమేమిటి? ఏమిటి ఆవిడ ఉద్దేశ్యం? ఆ సంగతి ఎలా వున్నా నేను అనుకున్నది అమ్మానాన్నలకి చెప్పేస్తాను..." అని దృఢంగా అనుకుని నిద్రకి ఉపక్రమించింది..


అంతవరకు ఆ నాలుగైదు రోజుల నుంచీ సరైన నిద్ర లేని సుజితని నిద్రాదేవి వెంటనే అనుగ్రహించింది.


మర్నాడు ఉదయం అనుకున్నట్టుగా నలుగురూ పార్కుకి బయల్దేరారు... వాతావరణం చల్లగా హాయిగా అనిపిస్తోంది. నడక కోసం, వ్యాయామం కోసం, కబుర్ల కోసం వచ్చిన వాళ్లందరూ బిజీ బిజీగా ఎవరి గోలలో వారు ఉన్నారు... చుట్టూ ఒక నిమిషం దృష్టి సారించి, "నాన్నా అదిగో అక్కడ ఖాళీగా ఉంది... పదండి అక్కడ కూర్చుందాం..." అంటూ ఖాళీగా ఉన్నవైపు నడిచింది సుజిత...


నలుగురూ వెళ్లి అక్కడ కూర్చోగానే తన వెంట తీసుకొచ్చిన ఫ్లాస్క్లోంచి కాఫీ నాలుగు కప్పుల్లో పోసింది శ్యామల... "అమ్మా నువ్వంటే అందుకే నాకు ఇష్టం" అంటూ ఒక కప్ అందుకుంది... "అమ్మా కాఫీతో పాటు స్నాక్స్ కూడా ఏమన్నా తెచ్చావా... ఇంకా ఏమున్నాయి ఆ బ్యాగ్ లో" అని అంటున్న సుమితని, "నీ కెప్పుడూ తిండి గోలే... ముందు కాఫీ చల్లారిపోతోంది చూస్కో" అంటూ ముద్దుగా విసుక్కుంది తల్లి..


సుజిత పది రోజుల క్రితం రమాదేవి గారు బ్యాంకుకి వచ్చిన దగ్గర్నుంచీ ముందు రోజు సాయంత్రం ఆవిడ వచ్చి వెళ్ళిన దాకా వివరంగా చెప్పింది, మధ్యలో ముగ్గురిలో ఎవరినీ మాట్లాడనీయలేదు..


"ఇప్పుడు చెప్పండి మీ అభిప్రాయాలు... పరిష్కారం ఏదైనా చెప్పండి..." అంటున్న సుజితను చూసి, "మా గురించి నువ్వు పడుతున్న తపన నాకు అర్థమైంది తల్లీ... కానీ మన సమాజంలో ఆడపిల్ల ఎప్పుడూ వేరే ఇంటి పిల్లే... పెళ్లి తర్వాత ఒకరికొకరు అండగా నిలుస్తూ కలిసి బాధ్యతలను పంచుకోవడమే జీవితానికి పరిపూర్ణత... ముందు పెళ్లికి ఒప్పుకో... పెళ్లికి మాత్రం కొంత సమయం కావాలని అడుగుదాం... ఆ అబ్బాయి అన్నదాంట్లో తప్పేమీ లేదు... ఈలోగా ఇద్దరూ పరిచయాలు పెరిగి ఒక అభిప్రాయానికి రావచ్చు... శ్యామలా నువ్వేమంటావ్?"


"మీరు చెప్పింది బావుంది... అన్ని విధాల బావున్న సంబంధం... పైగా వాళ్లు మన పిల్ల నచ్చి, కావాలని వచ్చిన వాళ్లు... కొన్ని రోజులు సమయం కావాలని అడుగుదాం ఇవాళే వెళ్లి. వాళ్లు చెప్పిన సమాధానాన్ని బట్టి అప్పుడే ఆలోచిద్దాం" తుది నిర్ణయం అదే అన్నట్టుగా లేచి నిలబడింది.


బాబాయ్ హోటల్లో టిఫెన్ తిని ఇంటికి వచ్చేదాకా దారంతా సుజిత బదులు కూడా సుమితే మాట్లాడుతూ ఉంది... అక్క పెళ్లి ఇలా చేద్దాం అలా చేద్దాం అంటూ.

సుజిత మాత్రం రమాదేవి గారు అంత తొందరగా నాన్నకి ఫోన్ చేసి పెళ్లికి వాళ్ల అంగీకారం తెలపడం వెనక ఏం జరిగిందో తెలుసుకోవాలి... దానికోసం అయినా ఇంకోసారి వాళ్ళని కలిసి మాట్లాడగలిగితే బావుండు... అలా ఆలోచనల్లో వుండగానే ఇల్లు చేరారు.


ఇంటికి వచ్చిన తరువాత కుతూహలం ఆపుకోలేక రమాదేవి గారికి ఫోన్ చేసి అడిగేద్దామా అనుకుంది... కానీ ఏదో మొహమాటం అడ్డుపడింది..


సుజిత డోలాయమాన పరిస్థితిలో వుండగానే, "అక్కా... బావగారు వచ్చారు" సుమిత అరిచిన అరుపుతో ఉలిక్కి పడి పరుగులాంటి నడకతో హాల్లోకి వచ్చింది... సూర్యని చూసి, "లోపలికి వచ్చి కూర్చోండి" అని, "సుమీ... అమ్మానాన్నలకి సూర్య గారు వచ్చారని చెప్పు" అంటూ కుర్చీలు సరిగ్గా వేసింది..


అతి మామూలు బట్టలు వేసుకుని ఉన్నా ఒక రకమైన అయస్కాంతం లాంటి ఆకర్షణ ఏదో ఉంది ఈ అమ్మాయిలో... బహుశా అమ్మకి కూడా అందుకే బాగా నచ్చి ఉంటుంది... అలా అనుకుంటుంటే అతనికి తెలియకుండానే చిన్న నవ్వు వచ్చింది..


ఏమీ మాట్లాడకుండానే నవ్వుకుంటున్న అతని మొహం చూసిన సుజిత, "నవ్వుతుంటే ఇతని మొహం ఎంత బావుందో" అనుకుంటూ నిలబడిపోయింది...

ఒకళ్ళ వైపు ఒకళ్ళు అలా కొత్తగా పరిశీలనగా చూసుకుంటూ ఉండగానే సుమీ చెప్పిన కబురు విని గబగబా ఆ గదిలోకి వచ్చారు శ్యామల, మాధవరావు.


"రండి బాబూ... అలా నిలబడే ఉన్నారు... అమ్మగారు రాలేదా..." అంటూ స్వాగతం పలికారు.. 


"లేదండీ... అమ్మ రాలేదు... ఇవాళ నాన్నగారు వస్తున్నారు... మిమ్మల్ని సాయంత్రం మా ఇంటికి రమ్మని కబురు చెప్పమని పంపారండీ నన్ను... ఒకవేళ మీకు రావటం కుదరక పోతే మీకు వీలుగా వున్న టైమ్ చెప్తే వాళ్లిద్దరే మిమ్మల్ని కలవడానికి వస్తాం అని చెప్పమన్నారు... ఏ సంగతీ అమ్మకి ఫోన్ చేసి చెప్పండి"


నిలబడే ఏదో పాఠం అప్పచెప్పినట్టు గబగబా చెప్పేసి మాధవరావు గారి సమాధానం కోసం అన్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు ఒక్క నిమిషం..


ఆయన జవాబు చెప్పే లోపే, "నాదో చిన్న విన్నపం అండి మీకు... ముఖ్యంగా సుజిత గారికి అభ్యంతరం లేకపోతే కాసేపు ఇద్దరం బయటికి వెళ్ళి వస్తాం" ఎంతో మర్యాదగా అంటూ ఒకసారి అందరి మొహాలు చూశాడు..


అప్పటికి సూర్య అకస్మాత్తుగా వచ్చినప్పటి ఆశ్చర్యం నుంచి కాస్త బయట పడిన సుజిత, "అమ్మా... వెళ్ళి రానా" అని అడిగింది... అందరి మొహాల్లో అంగీకారం కనిపించడంతో, "ఇప్పుడే ఒక్క నిమిషంలో వస్తాను..." అంటూ వేగంగా లోపలికి నడిచింది.


"ఈ లోపు కూర్చుని కాస్త కాఫీ తాగండి" అంటున్న శ్యామలను, "వద్దండీ... నేను కారు దగ్గర ఉంటాను" ఎవరి జవాబు కోసం చూడకుండానే మోగుతున్న ఫోన్ని పట్టుకుని, "హలో..." అంటూ ఏదో మాట్లాడుతూ బయటికి నడిచాడు సూర్య.


ఎక్కువ సమయం తీసుకోకుండానే చక్కగా తయారై వచ్చిన సుజితను చూసి తల్లి ప్రేమగా కొద్దిగా సందేహం నిండిన స్వరంతో, "సుజీ... అతను ఏం చెప్తాడో ముందు విను... మా గురించి ఎక్కువ ఆలోచించి తొందరపడి వచ్చిన అవకాశాన్ని వదులుకోకు... మంచి కుటుంబం లా వున్నారు. అబ్బాయి కూడా నిన్ను బాగా చూసుకునేలా ఉన్నాడు" అంది.


సహజంగా ప్రతి తల్లికి ఉండే ఆదుర్దా అంతా వినిపించింది ఆవిడ స్వరంలో..

"అలాగే అమ్మా... వెళ్ళొస్తాను." తల్లి చేతిని ప్రేమగా నొక్కి చెప్పి బయటికి కదిలింది..


"అక్కా... ఆల్ ది బెస్ట్... ఇంటికి వచ్చాక మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో వివరంగా చెప్పాలి..." అంటూ కొంటెతనం నిండిన స్వరంతో వెనక నుంచి గట్టిగా అంటున్న చెల్లెలికి నవ్వుతూ చేయూపి సూర్య దగ్గరికి నడిచింది..


కారు ఎక్కాక ఎక్కడికి వెళదాం అని అడక్కుండానే సూర్య డ్రైవ్ చేస్తూ మాట్లాడటం మొదలు పెట్టాడు. "మిమ్మల్ని ఎక్కువసేపు సందేహంలో ఉంచటం నాకు ఇష్టం లేదు... సూటిగా విషయంలోకి వస్తాను. మనం క్రితంసారి కలుసుకున్నప్పుడు మీ మాటలకు మీ మీద కోపం వచ్చిన మాట నిజం... కానీ మొన్న నేను ఒక స్నేహితుడి పెళ్లికి వెళ్ళొచ్చాను కదా... అక్కడ నా పాత మిత్రులం అందరం కలిశాం. చాలా కాలం తర్వాత కలవడంతో అందరం ఒకళ్ళ గురించి ఒకళ్ళం చెప్పుకుంటున్న నేపథ్యంలో నేను మీకు 'నో' అని చెప్పడం ఎంత తప్పో నాకు అర్థమైంది.


ఇంటికి రాగానే అమ్మతో ఆ సంగతులు అన్ని చెప్తూ నేను నీ అభిప్రాయాన్ని గౌరవించకుండా మౌనంగా ఉండటం తప్పని తెలిసిందని చెప్పాను.

దానికి అమ్మ ఏం చెప్పారో తెలుసా..


'పెళ్లి రెండు హృదయాలను మాత్రమే కాదు రెండు కుటుంబాలని చేస్తుంది... అటు అత్తమామలను ఇటు అమ్మానాన్నలను ఇద్దరూ సమానంగా గౌరవంతో చూసినపుడే అందరూ సంతోషంగా ఉంటారు.


ప్రస్తుతం ఎక్కడ చూసినా చిన్న కుటుంబాలే (న్యూక్లియర్). ఆ పద్ధతి మారి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్ళీ వస్తే ఇప్పుడు యువత ఎదుర్కొంటున్న ఒత్తిడి కొంతవరకు తగ్గుతుంది..' అంటూ ఇంకా ఇంకా చాలా చాలా చెప్పింది అమ్మ.


పెళ్లి తర్వాత ఆ కుటుంబాన్ని ఆ కుటుంబ సభ్యుల్ని పరాయి వారు లా కాకుండా సొంత వాళ్ల లా భావించినపుడే సంతోషంగా ఉండగలం..


అలా స్నేహితుల అనుభవాలు, ఆపై అమ్మ చెప్పిన మాటలు నన్ను నీతో పెళ్లికి అంగీకారం చెప్పేలా చేశాయి.."


ఏకబిగిన తను చెప్పదలచుకున్నవన్నీ చెప్పేసి,

"హమ్మయ్య... నేను మాట్లాడాలనుకున్నవి అన్ని చెప్పేశాను... కానీ ఒక్క మాట... నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమో కాదో అడక్కుండానే ఇవన్నీ మాట్లాడాను... ఇప్పటికైనా నీకు నేను నచ్చితేనే ముందుకు వెళదాం... ఒకవేళ నువ్వు నచ్చలేదు అని చెప్పినా నాకు నా ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చిన అమ్మాయిగా జీవితాంతం గుర్తు ఉంటావు... నీ నిర్ణయం ఏదైనా సరే నిర్మొహమాటంగా చెప్పేసేయి." అంటూ ఆమె వైపు చూశాడు..


"అరె... నువ్వు ఒక విషయం గమనించావా... నేను నాకు తెలియకుండానే మిమ్మల్ని ఏకవచనంలో సంబోధిస్తున్నాను. మీకు ఇష్టం అవునో కాదో తెలుసుకోకుండానే" అంటూ, "ఇంకా నేను నాకు బుద్ధి తెలిసాక ఇంతసేపు ఎవరితోనూ మాట్లాడలేదు... నాకే ఆశ్చర్యంగా ఉంది..." అన్నాడు.


సుజిత వెంటనే అడిగింది... "నా అభిప్రాయం తెలుసుకునే ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పండి... నాలో ఏం నచ్చింది మీకు?"

"నిజం చెప్పనా... మీ ఇంటికి పెళ్లిచూపులకి వచ్చినపుడు నాకు ఏ అభిప్రాయమూ లేదు అమ్మకి నచ్చింది అంతే అనుకున్నా... కానీ నిన్న ఆలోచిస్తుంటే నువ్వే నాకు తగిన దానివి అనిపించింది... ఎందుకంటే నీ తల్లిదండ్రుల్ని గురించి అంతలా ఆలోచించే మనిషివి నా వాళ్ల పట్ల కూడా అలాగే ఉంటావనిపించింది. అందుకే ఆలస్యం చేయకుండా అంగీకారం చెప్పేయమన్నాను.


ఇవాళ నాన్నగారు వస్తారు. ఆయనకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం... నువ్వు ఆయనకి కూడా నచ్చుతావనే నా నమ్మకం... పెళ్లిచూపుల్లో వీడియో కాల్ లో చూసినప్పుడే మెచ్చుకున్నారు"


ఇంతలో వెనక నుంచి ఏదో లారీ పెద్ద శబ్దం చేస్తూ వేగంగా పక్క నుంచీ ముందుకి వెళ్ళడంతో సూర్య కళ్లు చుట్టూ గమనించాయి... మాటల్లో పడి చాలా దూరం వచ్చేశారు... పక్కనే కాఫీ హౌస్ బోర్డు కనిపించింది... వెంటనే కారు ఆపుతూ, "నీకు ఇష్టమైతే కాఫీ తాగి వెళదాం" అంటూ సుజిత అంగీకారం కోసం ఆగాడు..


"ఏ ఇష్టం గురించి అడుగుతున్నారు... మీరంటేనా లేక కాఫీ తాగటం అంటేనా..." అంటూ అప్పటిదాకా ఉన్న సంకోచాలన్ని పోయి తేలికైన మనసుతో హుషారుగా అంది..


చెప్పకుండానే తన అంగీకారం సుజిత మొహంలో గమనించిన సూర్య రెట్టింపు హుషారుతో, "నాతో కలిసి కాఫీ తాగటం" అంటూ కారు ఆపాడు..


ఇంకో గంట తర్వాత ఇంటి దగ్గర దింపేసి సాయంత్రం కలుద్దాం అని ఆలస్యం చేయకుండా కారు దిగకుండానే వెళ్లిపోయాడు సూర్య..


లోపలికి రమ్మంటే మా అమ్మానాన్నలతో ఈ నా సంతోషాన్ని వెంటనే పంచుకోవాలి అంటూ, కారు శబ్దం విని బయటికి వచ్చిన సుమితకి టాటా చెప్తూ వెళ్లిపోయాడు..

కారు మలుపు తిరిగేదాకా అటే చూసి లోపలికి నడిచింది చెల్లెలితో పాటు.


"ఏమ్మా... లోపలికి రాకుండానే వెళ్ళిపోతున్నారు... ఏం నిర్ణయించుకున్నారు" అంటూ అడిగింది శ్యామల.


"అమ్మా... ఇంకా నీకు అర్థం కాలేదా.. అక్క మొహం చూడు ఎంతలా వెలిగిపోతోందో... మనం సాయంత్రం బావగారింటికి వెళుతున్నాం... మా అక్క పెళ్లికూతురాయనే..." అంటూ రాగం తీసింది సుమిత.


"నిజమేనా తల్లీ..." అని అడిగిన తండ్రికి, "మీ అందరికీ నచ్చితే నాకు ఇష్టమే నాన్నా..." సిగ్గు పడుతున్నట్టున్న తన మొహం కనపడకుండా తల దించుకునే అనేసి తన గదిలోకి వెళ్ళింది సుజిత.


"అయితే సాయంత్రం మంచి సమయం చూసుకుని వాళ్ల ఇంటికి వెళదాం... మీరు బయటికి వెళ్ళి వాళ్లకి లడ్డూ, బూందీ, పళ్ళూ అన్నీ తీసుకురండి... మొదటిసారి వెళుతున్నాం మరీ ఒక రకమే కాకుండా రెండు మూడు రకాలు తీసుకురండి" అంటూ హడావుడిగా అంటున్న శ్యామలను చూసి, "అప్పుడే ఇంటికి పెళ్లి కళ వచ్చినట్టుందే నీ మాటలు వింటుంటే... సరే... ఇప్పుడే నువ్వు అడిగినవి అన్నీ తీసుకుని వస్తా..." అంటూ నవ్వుతూ చేతి సంచీ తీసుకుని బయటికి బయల్దేరారు గుండెల మీద బరువును దింపుకోబోతున్న ఆడపిల్ల తండ్రిగా.


                   ***************************************


చిలకమర్రి పద్మావతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


చిలకమర్రి పద్మావతి

రచయిత్రి పరిచయం: చిలకమర్రి పద్మావతి

నా పేరు చిలకమర్రి పద్మావతి

నేను విజయవాడ ఆంధ్రా బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగ విరమణ చేశాను.. మా వారు శ్రీ మరింగంటి సుందర శ్రీనివాస్ సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ నుండి రిటైర్ అయ్యాక ఇద్దరం విశ్రాంతి జీవితం గడుపుతున్నాము .మాకు ఇష్టమైన ప్రదేశాలన్నీ తిరగటం ,మా పిల్లల, మనవరాళ్ళ ఫోటోలు వీడియోలు చూడటం..ఇవే మా ఆనందాలు.. మొదటి నుంచి (పుస్తకాలు) కథలు నవలలు చదవటం అలవాటు..చిత్ర కళ లో కొద్దిగా ప్రవేశం వున్నా అన్ని లలిత కళలను ఆస్వాదించడం చాలా ఇష్టం..

మా మనవరాళ్ళకి కథలు చెప్పటం ఇంకా ఇంకా ఇష్టం.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page