అమ్మాయిలూ.. తస్మాత్ జాగ్రత్త!
- Nandyala Vijaya Lakshmi
- May 25
- 3 min read
#NandyalaVijayaLakshmi, #నంద్యాలవిజయలక్ష్మి, #AmmayiluTasmathJagrattha, #అమ్మాయిలూతస్మాత్జాగ్రత్త, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Ammayilu Tasmath Jagrattha - New Telugu Story Written By - Nandyala Vijaya Lakshmi
Published in manatelugukathalu.com on 25/05/2025
అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త - తెలుగు కథ
రచన: నంద్యాల విజయలక్ష్మి
ఎవరో తరుముకుంటూ వస్తున్నారు. అలుపు లేకుండా తను పరుగెడుతూనే ఉంది. వందన ఉలిక్కిపడి లేచింది. తనను ఎవరన్నా గమనిస్తున్నారా? అనుకుంటూ చుట్టూ చూసింది. ఓహ్! ఇది కల. ధైర్యం తెచ్చుకుని లేచింది.
తను చేసింది తప్పో ఒప్పో ఆలోచించే సమయం లేదు. చేతకాని ఆడదానిలా ఏడుస్తూ కూర్చోలేదు. తనపై అత్యాచారం చేయాలని చూసినవాడిని చాకు తో మెడమీద కోసింది. అప్పటికి అది అనివార్యమైంది. మహా అయితే ఏమి జరుగుతుంది? పోలీసులు వస్తారు, కేసు వ్రాసుకుంటారు. సాధ్యమైనంతవరకూ తన వేలిముద్రలు కనపడకుండా తుడిచేసింది. తలుపు నెమ్మదిగా వేసి బయటకు నడిచింది. ఎదురుగా వచ్చిన ఆటోలో రూంకి చేరింది.
ఈ రోజు ఇలా ఎందుకు జరిగింది గుర్తు చేసుకుంది. ఆదివారము సెలవే కదా. బద్ధకంగా పడుకుంది. ఇంతలో ఫోన్ మ్రోగింది. "హలో, స్పందనా నేనే. లేచావా? ఇవాళ ఖాళీ ఏనా? మా ఇంటికి వచ్చేయ్. ఎటైనా తిరిగివదాము. వీలైతే మూవీ చూద్దాం."
"సరే," అని ఫోన్ పెట్టేసింది వందన.
గబగబా తయారై ఆటోలో స్పందన వాళ్ళ ఇంటికి చేరింది. కాలింగ్ బెల్ నొక్కింది.
ఎవరో అపరిచితుడు నవ్వుతూ తలుపు తీసాడు. "మనిషి బాగున్నాడు" అనుకుంటూ, "స్పందన..
"ఇంకా అమ్మగారి మేకప్ అవలేదా?" అంటూ లోపలి గదిలోకి నడిచింది.
వెంటనే అతను ముందు తలుపు వేసాడు. వందనకు ఏమి చేయాలో, ఏమి జరుగుతోందో అర్థం కాలేదు. "ఎవరు మీరు? స్పందన ఇంట్లో లేదా?" అని ప్రశ్నలు వేసింది.
"నేను మగాడిని, నువ్వు ఆడదానివి. అందులో అందమైనదానివి. మధ్యలో స్పందన ఎందుకు?" అంటూ వందన వైపు అదొరకమైన మత్తుగా చూసాడు.
"మరి స్పందన ఫోన్?" అనుకుంటూ అటూ ఇటూ చూసింది.
అప్రయత్నంగా టేబుల్ వైపు చూసింది. స్పందన ఫోన్ అక్కడ ఉంది. ఇప్పుడేమి చేయాలి? ఆలోచనలో పడింది వందన.
"కొంచెం వేడి కాఫీ త్రాగు. నరాలు వేడెక్కుతాయి," అంటూ కాఫీ గ్లాస్‌తో దగ్గరికి వచ్చాడు.
గ్లాస్ అందించే నెపంతో మరింత దగ్గరకు వచ్చి నడుముపై చెయ్యి వేసాడు. మత్తుగా చూస్తూ ఆమె చెక్కిలి నిమరబోయాడు.
వందనకు అతని తీరు తెలిసింది. క్షణం ఆలోచించకుండా వేడి కాఫీ అతని ముఖంపై పోసింది. "అబ్బా! రాక్షసి!" అంటూ ఆమెను గట్టిగా తనవైపు లాక్కున్నాడు.
ఏపిల్ పండు పక్కనే ఉన్న చాకు చేతిలోకి తీసుకుంది. జరుగబోయే ప్రమాదాన్ని ఊహించి వెంటనే చాకుతో కసిగా అతని మెడమీద కోసింది. రక్తం చిమ్మింది.
"ఇప్పుడెలా? ఏమి చేయాలి?"
ప్రస్తుతం ఇక్కడినుండీ బయటపడాలి అనుకుంటూ చాకు మీద తన వేలిముద్రలు తుడిచేసింది. పరుగులాంటి నడకతో తలుపు దగ్గరగా వేసి, ఎదురుగా వచ్చిన ఆటో ఎక్కింది.
ఇల్లు చేరగానే స్నానం చేసి కొంచెం ఉప్మా చేసుకుని తిని పడుకోవడానికి ప్రయత్నించింది. ఇంతలో ఫోన్ మ్రోగింది. "హలో," అంది.
"సారీ, నిన్న అమ్మ తొందరగా రమ్మంటే వెళ్ళాను. ఆ హడావుడిలో ఇంట్లో ఫోన్ మర్చిపోయా. నీకు చెప్పుదామని. ఎందుకైనా మంచిదని తాళం చెవి ఎదురింట్లో ఇచ్చాను. నువ్వు వస్తే చెపుతారని."
"సరే. నువ్వు ఇప్పుడు ఇంట్లో ఉన్నావా?" అనుమానంగా అడిగింది వందన.
"ఏమిటి అలా అడిగావు? నీకు ఒంట్లో బాగోలేదా? నేను రానా?" అడిగింది స్పందన.
"ఏమీ లేదు. రేపు కలుద్దాం," అని ఫోన్ పెట్టేసింది.
"అదేమిటి? అయితే నేను హత్య చేసిన వ్యక్తి ఏమయ్యాడు? స్పందన ఏమీ జరగనట్లే మాట్లాడుతోంది. ఏం జరిగింది? ఏమి జరగబోతోంది?" ఆలోచనలతో తల పగిలిపోతున్నట్లు అనిపించింది.
ఫోన్ మ్రోగింది ఇంతలో.
"హలో," అంది.
"హలో, బాగున్నారా?" అని వినిపించింది.
"ఎవరు మీరు? మీరు నాకు తెలియదు. మీకేమైనా అవసరమా?"
కొంచెం భయంతో అడిగింది.
"నేను, మీరు చంపినవాడి ఆత్మను..."
"నేను ఆత్మలు, దెయ్యాలను నమ్మను. నేను ఎవ్వరినీ చంపలేదు!" బుకాయించింది వందన. లేని ధైర్యం తెచ్చుకుని.
"అహా, అలాగా? ఇంక పడుకోండి," అని ఫోన్ పెట్టేసాడు.
ప్రశాంతంగా సాగే తన జీవితంలో మొదటిసారిగా అశాంతి మొదలైంది. చాలాసేపు పక్కమీద దొర్లి, ఆ తర్వాత నిద్రలోకి జారుకుంది. మరునాడు పొద్దున్నే ఫోన్ మ్రోగింది. "హలో," అంది.
"మీరు వందన కదా? వెంటనే నల్లకుంట పోలీస్ స్టేషన్ దగ్గరికి రండి."
"ఎందుకు?"
"వచ్చాక చెప్తాము. ఒక కేసు విషయములో మీరు సహకరించాలి."
"అలాగే," అని ఫోన్ పెట్టేసింది.
త్వరగా తయారై ఆటో ఎక్కబోతూ స్పందనకు ఫోన్ చేసింది. "హలో స్పందనా, వెంటనే నల్లకుంట పోలీస్ స్టేషన్ దగ్గరకి రా," అని ఫోన్ పెట్టేసింది.
అయిదు నిమిషాల్లేలో ఇద్దరూ స్టేషనుకు చేరారు.
"రండి వందనగారు, కూర్చొనండి," అన్నాడు ఇన్‌స్పెక్టర్ మధు.
"నిన్న స్పందన ఇంటికి మీరు వెళ్ళారా?"
"లేదు," అని తల ఊపబోయి "అవును," అంది వందన.
"అక్కడ ఒక వ్యక్తిని పొడిచారా? హత్య చేశారా?" అడిగాడు ఇన్‌స్పెక్టర్.
స్పందన కంగారుపడింది. "సార్, మా వందన చాలా అమాయకురాలు. ఇలాంటి పని అసలు చేయదు. పైగా మా ఇంట్లో ఎవరూ హత్య చేయబడలేదు."
"అది నిజమే. ఇతడే క్రిమినల్. బ్లాక్ మైలర్. అనుమానంతో ఇతడిని అరెస్ట్ చేశాం. వందన గారి సాక్ష్యము కోసం పిలిచాం.
ఈ మధ్య ఇలాంటి నేరాలు ఎక్కువయ్యాయి. అమాయకులైన అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. అందరూ వందనగారి లా ధైర్యంగా ఉంటే, ఇలాంటివి జరగకుండా ఆపవచ్చు."
"అమ్మో!" అని ఊపిరి పీల్చుకున్నారు.
నవ్వుకుంటూ బయటకు వచ్చారు.
అదంతా విన్న ఒక కానిస్టేబుల్, "సార్, మీరు ఎలా కనుక్కొన్నారు సార్? ఇతనే దోషి అని?"
"నిన్న ఇంటికి వెళ్తూ ఉంటే, దారిలో స్పందన ఇంటి ఎదురుగా కంగారుగా వస్తున్న ఇతనిని చూశా. మెడ దగ్గర ప్లాస్టర్ ఉంది. ఎర్ర రంగుతో తడిసింది. అనుమానంతో ఇతని వెంట వెళ్ళా. అక్కడ ఇంకో ఇద్దరు ఉన్నారు.
'కాయాపండా, ఇది కొంచెం మొండి ఘటం' అంటూ బీరు గ్లాస్ ఎత్తాడు.
వెంటనే అరెస్ట్ చేసా. ఇతనిదగ్గర వందన-స్పందన కలిసి ఉన్న ఫొటో చూశా.
స్పందన బయటకు వెళ్లడం చూశాడు. ఎదురు ఇంట్లో తాళం చెవి ఇవ్వడమూ గమనించాడు. వందన వచ్చిందని చెప్పి తాళం తీసుకున్నాడు.
వాళ్లు అనుమానం చేయలేదు. వందన వెళ్ళిపోయాక అన్నీ సర్ది బయటకు వచ్చాడు.
అప్పుడే నేను చూశా. వందన ఫోన్ నంబర్ కూడా ఇతని దగ్గర ఉంది.
బ్యాంక్ ఉద్యోగి కదా, నాకు చూసినట్టే అనిపించింది. బ్యాంక్ వాళ్లని అడిగి కన్‌ఫర్మ్ చేసుకున్నా."
"సార్, మీరు గ్రేట్ సార్! థ్యాంక్యూ సార్! ఆనందంతో, మీకు చెప్పకుండా వెళ్ళాము.”
అమ్మాయిలు కూడా ధైర్యంగా సమస్యలను ఉపాయంగా ఎదుర్కోవాలి.
అమ్మాయిలూ, తస్మాత్ జాగ్రత్త! ధైర్యమే సాహసమే లక్ష్మి.
***
నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి
ఊరు. హైదరాబాదు
నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి
చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను .
రెండు వందలపైగా కవితలు మూడుకథానికలు రాసాను
యాభై పైగా సర్టిఫికెట్స్ సహస్రకవిమిత్ర బిరుదు పొందాను .
పుస్తకపఠనము పై నాకు ఆసక్తి .
విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను .ఇంకా ఎన్నో చదవాలని కోరిక .
Comments