ఆంధ్ర పితామహుడు

Andhra Pithamahudu - Telugu Inspirational Article | Thokala Rajesham
ఆంధ్ర పితామహుడు - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | తోకల రాజేశం
Published in manatelugukathalu.com on 11/11/2026
తెలుగు భాషా వికాసానికి, తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మాడపాటి హనుమంతరావు. 'ఆంధ్ర పితామహుడు'గా ప్రసిద్ధి చెందిన ఆయన విద్యా, సాహిత్య, సామాజిక ఉద్యమాల విశేషాలను తోకల రాజేశం ఈ వ్యాసంలో వివరించారు.
తెలుగు ప్రజల చేత గౌరవంగా 'ఆంధ్ర పితామహుడు' అని పిలిపించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మాడపాటి హనుమంతరావు. తెలుగుజాతికి పితామహునిగా ఆయన అందించిన సేవలు అనన్యసామాన్యమైనవి. ఆయన రాజకీయనాయకుడు, న్యాయవాది, సామాజిక-సాంస్కృతిక రంగాల ఉద్యమకారుడు, రచయిత, విద్యాసంస్థల స్థాపకుడు, వివిధ వృత్తి-కుల సంఘాల స్థాపకుడు. ఇలా చెప్పుకుంటూ పోతే అదే ఒక పెద్ద వ్యాసమైపోతుంది. ఆయన ప్రస్థానం ఏ రంగంలోని వారికైనా నిరంతరం స్ఫూర్తిని నింపుతూనే ఉంటుంది. క్రమశిక్షణ, చేసే పని మీద చిత్తశుద్ధి, సాధికారత ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు.
మాడపాటివారు కృష్ణా జిల్లాలోని నందిగామ తాలూకాలో ఉన్న పొక్కునూరు గ్రామంలో 1885, జనవరి 22న జన్మించారు. కానీ ఆయన జీవితం తెలంగాణ గడ్డపైనే వికసించి ఈ ప్రాంత చైతన్యానికి కారణమైంది. తెలంగాణ చరిత్రలో ఒక అపురూపమైన అధ్యాయంగా మారింది.
తండ్రి అకాలమరణం చెందడంతో నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో తహసీలు కార్యాలయంలో పేష్కారుగా ఉద్యోగం చేస్తున్న మేనమామ జమలాపురం వెంకటరావుగారి పోషణలో పెరిగారు. మేనమామల సహకారంతో చదువుకొని రకరకాల ప్రభుత్వ ఉద్యోగాలు చేశారు. ఉద్యోగం చేస్తూనే లా కోర్సులో చేరి 1917లో న్యాయవాదిగా తన మనస్తత్వానికి సరిపోయే వృత్తిలోకి మారారు.
ఒక రకంగా మాడపాటివారి జీవితం ఇక్కడి నుంచే మలుపు తిరిగింది. నిరంతరం తన వద్దకు న్యాయం కోసం వచ్చే ప్రజల నుంచి తెలుసుకున్న విషయాల ఆధారంగా ఆనాటి తెలుగు సమాజం తాలూకు అసలు స్థితిని అర్థం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగు సమాజంలో చైతన్యం తీసుకురావాలని సంకల్పించారు.
నిజాం పరిపాలన కింద ఉన్న తెలుగు ప్రాంతంలో ఆనాడు తెలుగులో చదువులు లేవు. తెలుగు సంస్కృతికి విలువ లేదు. భాష మీద, సంస్కృతి మీద పరాయి పెత్తనాన్ని సహించని మాడపాటి ఈ రెండంశాల పట్ల ప్రజల్లో కదలిక తీసుకురావాలని భావించారు. దాని కొరకు సారూప్య భావజాలం కలిగిన మిత్రులతో కలిసి 1921లో 'ఆంధ్రజనసంఘం' ఏర్పాటు చేశారు. ఇది తెలంగాణ ప్రాంతంలో పదమూడు మహాసభలను నిర్వహించి ప్రజలను చైతన్యపరిచింది.
అయితే 1930లో జోగిపేటలో జరిగిన మహాసభలో దీని పేరును 'ఆంధ్రమహాసభ'గా మార్చారు. దీని కేంద్ర సంఘానికి కూడా ప్రధాన కార్యదర్శిగా ఉండి సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా నిర్విరామ కృషి సల్పారు మాడపాటి. ఆ కాలంలోనే మహిళా లోకాన్ని చైతన్యం చేయడం కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు రూపొందించడంతో పాటు మహిళా నాయకులను తయారు చేసిన ఘనత మాడపాటి వారికి, ఆయన నడిపిన సంస్థకు దక్కుతుంది.
ప్రజల నుంచి మేధావులను తయారు చేసి తాను నడిపిస్తున్న సామాజిక ఉద్యమాలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో గ్రంథాలయాలను స్థాపించారు. 1901లో హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, 1904లో వరంగల్లులో రాజరాజ నరేంద్ర ఆంధ్రభాషానిలయం నెలకొల్పారు. ఆయన నిబద్ధత ఎలాంటిదంటే, షష్టిపూర్తి సందర్భంగా ఆయనకు జరిగిన సన్మానం ద్వారా లభించిన సొమ్మును కూడా గ్రంథాలయాలకు, గ్రంథ ప్రచురణలకే వినియోగించారు. కొమర్రాజు లక్ష్మణరావు తర్వాత గ్రంథాలయోద్యమంలో మాడపాటి వారి కృషి చెప్పుకోదగింది.
ఆనాడు విద్యార్థులకు తెలుగు మాధ్యమంలో పాఠశాలలు లేవు. ఆ లోటును పూడ్చడానికి 1928లో హైదరాబాదులోని నారాయణగూడలో బాలికల కోసం పాఠశాల ఏర్పాటు చేశారు. ఒక రకంగా మహారాష్ట్రలో ఫూలే సాగించిన కృషిలాంటిదే ఇది. తెలుగునాట ప్రసిద్ధి పొందిన ప్రముఖులు నందగిరి ఇందిరాదేవి, సంగం లక్ష్మీబాయమ్మ, మాదిరెడ్డి సులోచన, పాకాల యశోదారెడ్డి లాంటివారు ఈ పాఠశాల విద్యార్థులే. మాడపాటి వారి భార్య మాణిక్యమ్మ కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నారు.
ఇదే క్రమంలో ఆడపిల్లల కోసం ఆయన ఎన్నో పాఠశాలలు స్థాపించారు. రచయితగా ఆనాటి సమాజాన్ని ప్రతిబింబిస్తూ అనేక రచనలు చేశారు. 'తెలంగాణలో ఆంధ్రోద్యమము' అనేది వీరి ప్రసిద్ధ రచన. ఒకరకంగా ఇది ఆయన ఆత్మకథ లాంటిదే. ఈ రకంగా తెలుగు ప్రజల జీవితాల్లో చైతన్యం నింపడానికి ఆయన ఎన్ని రకాల అవకాశాలు అందుబాటులో ఉన్నాయో అన్నింటినీ ఉపయోగించుకున్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసమే ఆలోచించారు. అంత చేసి కూడా తన పేరుప్రఖ్యాతులను ఆధారంగా చేసుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుకోలేదు.
అంతటి నిస్వార్థపరుడు, నిరాడంబరుడు.
ఆనాటి రాజకీయ ధురంధరుల ఒత్తిడి నేపథ్యంలో హైదరాబాద్ నగర తొలి మేయర్‌గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి శాసన మండలి అధ్యక్షుడిగా ప్రజలకు మరిన్ని సేవలను అందించారు. ఆయన ప్రజాజీవితాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 'పద్మభూషణ్' పురస్కారంతో గౌరవించింది. తెలంగాణ ప్రజల జీవితాల మీద చెరగని ముద్ర వేసిన మాడపాటి తన 85వ ఏట నవంబర్ 11, 1970 నాడు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.
- తోకల రాజేశం
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
తోకల రాజేశం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: నా పేరు తోకల రాజేశం.
తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు.వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు.ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం(2006),చెమట చుక్కలు(నానీలు-2010),పాతాళ గరిగె(సాహిత్య వ్యాసాలు-2013),అడవి దీపాలు(వచన కవిత్వం-2017),మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర(తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020),కొబ్బరి నీరా! శతకం(పదిమందితో కలిసి-2023),మట్టి విజయం(పద్యకవిత్వం-2024),ఆట సాగుతూనే ఉంటది(వచన కవిత్వం-2026)అనే పుస్తకాలు ముద్రించారు.తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం(2012),సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012),సాహితీ శిరోమణి పురస్కారం(2015),సినారె పురస్కారం(2023),తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.










Comments