top of page
Original.png

క్వాంటమ్‌ బ్యాటరీలు

2 hours ago
3 min read

క్వాంటమ్‌ బ్యాటరీతో వేగవంతమైన చార్జింగ్‌, విద్యుత్‌ నిల్వపై పరిశోధన

Quantum Batterylu - Telugu Science and Technology Article | Ch. Pratap

క్వాంటమ్‌ బ్యాటరీలు - తెలుగు సైన్స్ & టెక్నాలజీ వ్యాసం | Ch. ప్రతాప్   

Published in manatelugukathalu.com on 09/11/2026


క్వాంటమ్‌ బ్యాటరీలు భవిష్యత్తులో విద్యుత్‌ నిల్వ, వేగవంతమైన చార్జింగ్‌ రంగాలను మార్చగల సరికొత్త సాంకేతికతగా నిలుస్తున్నాయి. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల తాజా పరిశోధన ఈ దిశగా కీలక ముందడుగుగా భావిస్తున్నారు.


సెల్‌ఫోన్‌ చార్జింగ్‌కు గంటల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకపోతే! విద్యుత్‌ కార్లు పెట్రోలు నింపుకునే సమయంకంటే వేగంగా చార్జింగ్‌ పూర్తిచేసుకుంటే! విద్యుత్‌ నిల్వలో ఇలాంటి అద్భుతాలు సాధ్యమవుతాయనే ఆశలను క్వాంటమ్‌ బ్యాటరీ సాంకేతికత చిగురింపజేస్తోంది. 


ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సాధించిన తాజా పరిశోధన విజయం ప్రపంచ ఇంధన సాంకేతిక రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. విద్యుత్‌ను నిల్వచేసే సంప్రదాయ పద్ధతులను సమూలంగా మార్చగల వినూత్న ఆవిష్కరణగా ఇది శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది.


ఆస్ట్రేలియా జాతీయ పరిశోధన సంస్థ సీఎస్‌ఐఆర్‌ఓ (CSIRO), ఆర్‌ఎంఐటీ (RMIT) విశ్వవిద్యాలయం, మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అభివృద్ధి చేసిన క్వాంటమ్‌ బ్యాటరీ నమూనా వివరాలను 2026 మార్చి 18న ప్రకటించాయి. పరిశోధకుడు డాక్టర్‌ జేమ్స్‌ క్వాచ్‌ నేతృత్వంలో రూపొందించిన ఈ నమూనా విద్యుత్‌ శక్తిని స్వీకరించడం, నిల్వచేయడం, తిరిగి విడుదలచేయడం అనే మూడు ప్రక్రియలను విజయవంతంగా ప్రదర్శించింది. పరిశోధన ఫలితాలు ప్రతిష్ఠాత్మక 'లైట్‌: సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌' శాస్త్రీయ పత్రికలో ప్రచురితమయ్యాయి.


సాధారణ లిథియం అయాన్‌ బ్యాటరీలు రసాయనిక చర్యల ఆధారంగా పనిచేస్తాయి. అయితే క్వాంటమ్‌ బ్యాటరీలు సూక్ష్మకణాల ప్రత్యేక ప్రవర్తనను ఉపయోగించుకుంటాయి. క్వాంటమ్‌ సూపర్‌పొజిషన్‌, ఎంటాంగిల్‌మెంట్‌ వంటి భౌతిక సూత్రాలు ఈ సాంకేతికతకు ఆధారం. అనేక శక్తి నిల్వ విభాగాలు విడివిడిగా కాకుండా సమష్టిగా స్పందించడం దీని విశిష్టత. దీనివల్ల శక్తిని అత్యంత వేగంగా స్వీకరించే అవకాశం ఏర్పడుతుంది.


ఈ పరిశోధనలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం బ్యాటరీ పరిమాణానికి, చార్జింగ్‌ వేగానికి మధ్య ఉన్న సంబంధం. సంప్రదాయ బ్యాటరీల్లో సామర్థ్యం పెరిగినప్పుడు చార్జింగ్‌ సమయం కూడా సాధారణంగా పెరుగుతుంది. 


కానీ నిర్దిష్ట పరిస్థితుల్లో క్వాంటమ్‌ బ్యాటరీ పరిమాణం పెరిగేకొద్దీ చార్జింగ్‌ సమయం తగ్గుతుందని శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఇదే భవిష్యత్తులో భారీ విద్యుత్‌ నిల్వ వ్యవస్థల రూపకల్పనకు కొత్త అవకాశాలను కల్పించవచ్చు.


పరిశోధకులు అనేక సన్నని సేంద్రీయ పదార్థాల పొరలతో సూక్ష్మ బ్యాటరీని రూపొందించారు. లేజర్‌ కాంతి ద్వారా తీగల అవసరం లేకుండా దానిని చార్జ్‌ చేశారు. అత్యంత వేగవంతమైన కాంతి కొలత పద్ధతులతో దాని పనితీరును పరిశీలించారు. చార్జింగ్‌కు పట్టిన సమయంతో పోలిస్తే దాదాపు పది లక్షల రెట్లు ఎక్కువసేపు శక్తిని నిల్వ ఉంచగలిగినట్లు గుర్తించారు. సాధారణ గది ఉష్ణోగ్రత వద్దనే ఈ ప్రయోగం విజయవంతం కావడం మరో ముఖ్యమైన విశేషం.


అయితే ఈ విజయాన్ని వాణిజ్య వినియోగానికి సిద్ధమైన బ్యాటరీగా భావించరాదు. ప్రస్తుత నమూనా నిల్వచేసే శక్తి అత్యంత స్వల్పం. అది కూడా కొన్ని నానోసెకన్లపాటు మాత్రమే నిలిచి ఉంటుంది. ఒక నానోసెకను అంటే సెకనులో వందకోటో వంతు. అందువల్ల మొబైల్‌ ఫోన్లు, విద్యుత్‌ వాహనాలకు ఇప్పుడే ఈ బ్యాటరీని ఉపయోగించడం సాధ్యంకాదు.

భవిష్యత్తులో క్వాంటమ్‌ కంప్యూటర్లు, సూక్ష్మ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, డ్రోన్లు, వైర్‌లెస్‌ చార్జింగ్‌ వ్యవస్థలకు ఈ సాంకేతికత ఉపయోగపడవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ సమయంలో శక్తిని అందించాల్సిన అత్యాధునిక పరికరాలకు ఇది విలువైన పరిష్కారంగా మారవచ్చు.


ప్రస్తుతం శక్తి నిల్వ సమయాన్ని పెంచడం, సామర్థ్యాన్ని విస్తరించడం, తయారీ వ్యయాన్ని తగ్గించడం ప్రధాన సవాళ్లు. సంప్రదాయ బ్యాటరీల నిల్వ సామర్థ్యాన్ని క్వాంటమ్‌ బ్యాటరీల చార్జింగ్‌ వేగంతో అనుసంధానించే అవకాశాలనూ శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.


మానవాళి ప్రగతిలో విద్యుత్‌ ఆవిష్కరణ ఎంతటి విప్లవాన్ని సృష్టించిందో, భవిష్యత్తులో క్వాంటమ్‌ బ్యాటరీలు కూడా అంతటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. నేటి ప్రయోగశాలలో పుట్టిన ఈ సూక్ష్మ ఆవిష్కరణ రేపటి ప్రపంచ ఇంధన అవసరాలకు సమర్థమైన పరిష్కారంగా ఎదగవచ్చు. చార్జింగ్‌ వేగమే కాదు, విద్యుత్‌ వినియోగ విధానాన్నే మార్చగల శక్తి ఈ పరిశోధనలో దాగి ఉంది.


***











📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


Ch. ప్రతాప్ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):










Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/pratap

Ch. Pratap

నేను వృత్తిరీత్యా ఒక సివిల్ ఇంజనీర్‌ అయినప్పటికీ, నా నిజమైన ఆసక్తి, నా జీవనసారం సాహిత్యానికే అంకితం. తెలుగు పుస్తకాల సువాసన నా జీవితంలో 1984 నుంచే పరిమళించింది. అప్పటి నుంచి పఠనం నా అలవాటుగా కాక, నా జీవనశైలిగా మారింది. పుస్తకాలు నా మనసును తీర్చిదిద్దాయి, ఆ పఠనమే క్రమంగా రచనగా రూపాంతరం చెందింది. ఆలోచనల రూపం, అనుభవాల ప్రతిబింబం, హృదయానికి స్వరం — అదే నా రచన.

ఆధ్యాత్మికత, మానవ సంబంధాల లోతులు, సామాజిక స్పృహ, ప్రజాసేవ పట్ల నాలో ఉన్న మమకారం ప్రతి రచనలోనూ ప్రతిఫలిస్తుంది. నేను రాసే ప్రతి వాక్యం పాఠకునితో చేసే ఒక మౌన సంభాషణ. నా కలం కేవలం అక్షరాలు కాదు; అది జీవనాన్ని గ్రహించే ఒక మార్గం.

ఇప్పటివరకు నేను రచించినవి రెండు వందలకుపైగా కథలు, ఐదు నవలలు, రెండు వేల వ్యాసాలు. ఇవి పలు దిన, వార, మాస పత్రికలలో, అలాగే డిజిటల్ వేదికలలో వెలువడి విభిన్న వయస్సుల పాఠకులను చేరాయి. ప్రతి రచన నా అనుభవాల సారాన్ని పాఠకుని మనసుతో కలిపే ఒక మాధ్యమంగా నిలిచింది.

సాహిత్యం నాకు హాబీ కాదు — అది నా జీవిత యానం. కొత్త ఆలోచనలను అన్వేషించడం, తెలుగు భాషా సౌందర్యాన్ని కొత్త రూపాల్లో వ్యక్తపరచడం, సమాజానికి ఉపయోగపడే మార్గాలను వెతకడం — ఇవే నా సాహిత్య సాధనకు మూలాధారం. రచన ద్వారా మనసులను మేల్కొలపడం, మనసుల్లో విలువల జ్యోతిని వెలిగించడం నా నిశ్చయం.

ఇటీవల నా కృషికి గాను ఒక ప్రముఖ సంస్థ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం నా జీవితంలో ఒక విశిష్ట ఘట్టం. అది కేవలం గుర్తింపే కాదు, మరింత బాధ్యతను జోడించిన ప్రేరణ.

మన పురాణాలు, ఉపనిషత్తులు, వేద వాక్యాలలో దాగి ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధునిక పాఠకులకు అందించడం, వాటి సారాన్ని సమాజానికి చేరవేయడం నా సాహిత్య లక్ష్యం. ఆ దిశగా ప్రతి రచన ఒక నూతన యత్నం, ఒక అంతర్ముఖ ప్రయాణం.

సాహిత్యం నా కోసం కేవలం అభిరుచి కాదు; అది నా ఆత్మ స్వరూపం. నా కలం నా ఆలోచనలకు శ్వాస, నా రచన నా జీవితయానం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page