'Ashadam - Part 3/4' - New Telugu Story Written By Allu Sairam
Published In manatelugukathalu.com On 30/08/2024
'ఆషాఢం - పార్ట్ 3/4' పెద్ద కథ
రచన: అల్లు సాయిరాం
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
జరిగిన కథ:
కొత్తగా పెళ్ళైన గాయత్రి ఆషాడం రావడంతో పుట్టింటికి వస్తుంది.
కొద్ది రోజులకే ఆమె భర్త వినయ్ ఏదో నెపంతో అత్తగారింటికి వస్తాడు.
భార్యను ఏకాంతంగా కలవడానికి ప్రయత్నిస్తాడు.
ఇక ఆషాఢం - పెద్ద కథ మూడవ భాగం వినండి.
పూజ సామాన్లు సర్దుకోవడానికి గాయత్రి గాభరాగా అటు యిటు తిరుగుతుంటే, గాయత్రి కాళ్లపట్టీల శబ్ధాలు యిల్లంతా మారుమ్రోగాయి. రమణమ్మకి, నీలిమకి గాయత్రి ఎందుకు అంత కంగారు పడుతుందో అర్ధంకాక ఆశ్చర్యపోయి చూస్తుండగానే, పూజ మొదలుపెట్టడానికి దీపం వెలిగించడం, అగరువత్తులు వెలిగించడం, మంత్రాలు చదివేయడం, గంట కొట్టేయడం, హారతి యిచ్చేయడం కుడా జరిగిపోయింది.
గబగబా నైవేద్యం దేవుడి దగ్గర పెట్టేసి, నైవేద్యం పట్టుకుని రమణమ్మ, నీలిమ ల ముందు చెమటలు కారుతూ నిలబడింది గాయత్రి. ఇంత వేగంగా పూజ ఎప్పుడు చెయ్యలేదు, ముఖ్యంగా, గాయత్రిని యింత కంగారుగా ఎప్పుడు చూడని వాళ్ళు ఆశ్చర్యపోతూ నైవేద్యం తీసుకున్నారు. గాయత్రిని బాగా అర్థం చేసుకున్న వినయ్ లోలోపల నవ్వుకుంటూ నైవేద్యం తీసుకున్నాడు.
నైవేద్యం పళ్లెం పక్కన పెడుతూ “నవ్వుకుంటున్నది చాలు. టైం చూశారా ఎంతయ్యిందో! తొమ్మిది దాటింది. ఆఫీసుకి ఎప్పుడు వెళ్తారు? ఏం పని మీద వచ్చారో, ఆ వస్తువు ఏదో తొందరగా వెతికి, తిన్నగా ఆఫీసుకి బయలుదేరండి. మధ్యాహ్నం భోజనానికి క్యారేజ్ యిక్కడ నుంచే పెట్టేస్తాను!” అని అంటూ గాయత్రి దడదడలాడించేసరికి వినయ్ సరే అన్నట్టుగా తలవుపాడు.
గదిలో ఉన్న బ్యాగు మరోసారి వెతకడానికి ముందు గాయత్రి, వెనుక వినయ్ వెళ్లారు. గాయత్రి ఎందుకంత గాభరాగా పూజ పూర్తిచేసిందో రమణమ్మ, నీలిమ లకి అప్పుడు అర్ధమైంది.
గది లోపల బ్యాగులు, బీరువాలో ఉన్న బట్టలు గాభరాగా ఎత్తిపెడుతూ వెతుకుతుంది. వినయ్ మంచం మీద కూర్చుని ప్రశాంతంగా గాయత్రిని చూస్తున్నాడు. అది గమనించిన గాయత్రి “ఏంటి! అక్కడ కూర్చుని ఏం చూస్తున్నారు? ఆఫీసుకి వెళ్లాలని లేదా మీకు?” అని దగ్గరికి వచ్చి అడిగితే, గాయత్రి చేయి పట్టుకుని లాగి “నేను ఆఫీసుకి వెళ్లను కదా! ఈరోజు మాకు సెలవు కదా!” అని నవ్వుతూ చెప్పాడు.
“అది! అది అసలు విషయం! లేదంటే, ఆఫీసు టైం కి అరగంట ముందు నన్ను గాభరా పెట్టేసి బయలుదేరే మీరు, టైం దాటిపోతున్నా కుడా యింత ప్రశాంతంగా ఉన్నారంటే, నాకెందుకో ముందు నుంచే అనుమానం వచ్చింది!” అని తను ఊహించిందే, నిజమైంది అని సంబరపడిపోతుంది గాయత్రి.
“మరేం చెయ్యమంటావు! సెలవు రోజున యింటి దగ్గర ఒక్కడినే ఉండడమెందుకు, ఎలాగైనా నీ దగ్గరికి రావాలనిపించింది. మరి రావడానికి ఓ కారణం ఉండాలి కదా! ఉన్న అవకాశాలు ఆలోచిస్తే, యి పెన్ డ్రైవ్ ఆలోచన వచ్చింది. అంతే. వచ్చేశాను! నీదగ్గరకి రాకుండా ఉండగలనా!” అని గాయత్రిని తన కౌగిలిలోకి లాగడానికి ప్రయత్నించగా, గాయత్రి రాకుండా “అబ్బా! ఉండండి! మీరు ఆఫీసుకి వెళ్లరు అనే విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా! నేను తెగ కంగారుపడిపోయి పూజ గాభరాగా చేసేశాను. ఎలా చేశానో ఆ దేవుడికే తెలియాలి! వదలండి! బయట అమ్మ, చెల్లి ఉన్నారా! ఇంతసేపు గదిలో ఉంటే ఏమనుకుంటారు!” అని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.
వినయ్ గాయత్రిని ఒకచేతితో పట్టుకుంటూ, మరో చేతితో ఆఫీసు నుంచి మేనేజర్ ఫోన్ చేసినట్టుగా “హలో! చెప్పండి సార్! నేను ఆ పెన్ డ్రైవ్ పట్టుకుని వచ్చేస్తాను సార్!” అని గట్టిగా బయటికి వినిపించేలా అన్నాడు.
ఒక్క నిమిషం గాయత్రి కుడా “ఇదేంటీ! ఇప్పుడే కదా ఆఫీసుకి వెళ్లను అన్నారు. మళ్లీ వెళ్తాను అంటున్నారు. ఏంటీ!” అని ఆశ్చర్యపోయి చూస్తుంది.
వినయ్ ఫోన్ పక్కన పెట్టి “మీ అమ్మ, చెల్లి ఏమనుకుంటారు! నిజంగానే, నేను పని మీద వచ్చానని అనుకుంటారు కదా!” అని నవ్వుతూ అన్నాడు.
“అబద్దం అని తెలిసిన నేనే, ఒక్క క్షణం మీరు మాట్లాడేది నిజమనుకున్నాను. అబద్ధాలు ఎక్కువ ఆడేస్తున్నారు. అబద్ధాలు ఎక్కువ ఆడితే ఆడపిల్లలు పుడతారంట! చూడండి!” అని నవ్వుతూ అంది గాయత్రి.
“అదే నిజమైతే, యింక ఎక్కువ అబద్దాలు ఆడతాను! నీలాంటి మంచి కూతురికి తండ్రి అవ్వాలంటే, రాసిపెట్టి ఉండాలి కదా!” అని వినయ్ నవ్వుతూ అంటే, గాయత్రి సిగ్గుతో వినయ్ ఒడిలో వాలిపోయింది.
రమణమ్మ కంగారుగా వంటింట్లో నుంచి యింటి గుమ్మం వైపు చూస్తూ "అల్లుడుగారు యింతసేపు ఉండి, మీ నాన్న వచ్చేసరికి, ఆఫీసుకి వెళ్లాలని బయలుదేరిపోతారేమో! ఎక్కడికెళ్లాడో, మీ నాన్న యింక రాలేదు! సరైన సమయానికి యింట్లో ఉండడు ఈయన!" అని అంది.
నీలిమ చేతితో తలపట్టుకుని “అబ్బా! మీరున్నారే! ఎప్పుడు ఎదురుచూపులేనా! పనికి మనుషులు తీసుకుని నాన్న పొలం పని మీద వెళ్లారా! వచ్చేస్తారులేయమ్మా! నువ్వేమి కంగారు పడి బిపిలు తెచ్చుకోకు! నాకెందుకో, మీ అల్లుడు అవతారం చూస్తుంటే, యిప్పుడప్పుడే వెళ్లేటట్టులేడు అనిపిస్తుంది. ఎందుకంటే, యింటికి వచ్చినప్పుడు, అక్క తెచ్చిందే ఒకే ఒక్క బ్యాగ్! మరి వీళ్ళు ఏదో పురావస్తు శాస్త్రజ్ఞులులాగా ఉదయం నుంచి ఆ బ్యాగులో తెగ వెతికేస్తున్నారు. అయినా, ఆ వస్తువు దొరకలేదంట. బావ దగ్గర నుంచి అక్క మరేం తీసుకొచ్చేసిందో! బహుశా, బావ మనసు అయివుంటుంది!” అని ఆలోచిస్తూ చెప్పింది.
“ఇవే, యి ముదురు మాటలు వద్దనేది. ఏదో అన్ని నీకు తెలిసిపోయినట్టు! వాగుతావు ఎందుకు! పోనీ, నిజమే, మీ బావ ఏం వస్తువు మరిచిపోలేదనుకో! లేకపోతే, పోయింది. అయితే, నీకేమి! ఏం, అత్తగారింటికి అల్లుడు సందర్భం లేకుండా రాకూడదా ఏంటి? మా పెద్దఅల్లుడు మాత్రమే కాదు, యి యింటికి పెద్దకొడుకులా ఉంటాడు!” అని వినయ్ పై తనకి ఉన్న నమ్మకంతో చెప్పింది రమణమ్మ.
నీలిమ రమణమ్మని పట్టుకుంటూ “సరేనమ్మ! ఒప్పుకుంటాను! కానీ, నిజంగానే, బావ అయితే మాత్రం ఆ పెన్ డ్రైవ్ కోసం రాలేదనిపిస్తుంది. అది నువ్వు ఒప్పుకోయమ్మ! ఎందుకంటే, అక్క తెచ్చిన బ్యాగు తను వచ్చినరోజే, ఏం తెచ్చిందా అని నేను చూశాను. అందులో ఏ పెన్ డ్రైవ్ లేదు. అక్కని వదిలి బావ వుండలేకే వచ్చాడనిపిస్తుంది!" అని నీలిమ రమణమ్మతో అన్న మాటలకి "చూడండి! అంతా మీ వలనే!" అని మెల్లగా వినయ్ తో అంది గాయత్రి.
"అది నిజమే కదా!" అని నవ్వుతూ అన్నాడు వినయ్.
నీలిమ కొనసాగిస్తూ "పోనీ, మీ పెద్ద కూతురు బంగారం ఏమైనా తక్కువ తిన్నాదా ఏంటి, పూజలు చేస్తూ, ఏదేదో కలవరించేస్తుంది. బావని యింటికి వచ్చేలా చెయ్యమని దేవుడికి మొక్కుకుందో ఏమో! యిలా మొక్కుకోగానే, అలా బావ వచ్చేశాడు! వీళ్లు ఆషాఢానికి వచ్చిన వారం రోజులే ఉండలేకపోతే, యింక నెల రోజులు ఏముంటారో!" అని ఆలోచిస్తూ నీలిమ మాటలు విని సిగ్గుపడి నవ్వుతూ తలదించుకున్న గాయత్రి నుదురు పట్టుకుని పైకెత్తి "ఏంటమ్మా! అంతా నా వలనేనా! కలవరించేస్తున్నావా!" అని వినయ్ నవ్వుతూ అంటే, గాయత్రి మరింత సిగ్గుపడుతూ వినయ్ ని హత్తుకుంది.
రమణమ్మ వంటింట్లో నుంచి యింటి ద్వారం దగ్గరికి వస్తూ "వసపిట్టలా వాగకుండా, కొంచెం మెల్లగా మాట్లాడు చిన్న కూతురా! వాళ్లకి మాటలు వినిపిస్తాయి! నీ పెళ్లి అయితే నీకు తెలుస్తోంది. ఎవరు ఏం చేస్తారో! ఎందుకు ఎదురుచూస్తారో!" అని అంది.
యింటి గుమ్మం దగ్గర నిలబడి భర్త రాక కోసం ఎదురు చూస్తున్న రమణమ్మ దగ్గరికి నీలిమ వస్తూ "బావ గురించి అక్క చూసింది. నాన్న గురించి నువ్వు చూస్తున్నావు. నేనేమి మీలాగా ఎదురుచూడను. చూసేటంత కోరికలు నాకు లేవు. నాకు వచ్చినవాడే నాకోసం ఎదురుచూడాలి!" అని అంది.
రమణమ్మ నవ్వుతూ "కోరికలు లేవా! మబ్బులు లేకుండా ఆకాశం ఉంటుందేమో గాని, కోరికలు లేని అమ్మాయిలు మాత్రం ఉండరు! అదిగో! మీ నాన్న వచ్చేస్తున్నారు! బావ వచ్చారని చెప్పు! వెళ్లు! ఆయన అసలే కంగారు మనిషి! ఆయన కంగారుపడి మనల్ని కంగారుపెడతాడు!" అని కంగారుపడుతూ అంది.
"నాన్న వచ్చేస్తున్నారోచ్!" అని నీలిమ గట్టిగా అరుస్తూ వెళ్తుంటే "ఎందుకే అంత గట్టిగా అరుస్తున్నావు?" అని రమణమ్మ అడిగింది.
"ఆఁ వినపడాల్సినోళ్లకి, వినపడాలి కదా!" అని గణపతి దగ్గరికి వెళ్తుంది నీలిమ.
"ఏమండోయ్! వినపడాల్సినోళ్లకి వినపడిందా! నాన్న వచ్చేస్తున్నారంట!" అని మెల్లగా అంది గాయత్రి.
"యిప్పుడు ఎవరు వచ్చినా, నిన్ను వొదిలేదిలే!" అని వినయ్ అంటే "అబ్బా! వదలండి బాబు!" అని మెల్లగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే "యిప్పుడు నిన్ను వొదిలితే, మళ్లీ నాకెప్పుడు దొరుకుతావో! వొదిలేదిలే!" అని వినయ్ నవ్వుతూ గాయత్రి చుట్టూ చేతులతో పెద్ద కంచె కట్టేశాడు.
నీలిమ ఎదురుగా వెళ్లి "ఏంటి నాన్న! ఎక్కడికి వెళ్లిపోయావ్? లోపల మీ అల్లుడుగారు మీకోసం ఎదురుచూస్తుంటే, మీరు యిక్కడ ఏం చేస్తున్నావు నాన్న?" అని అడిగింది.
గణపతి గాభరా పడిపోతూ పొలం నుంచి తీసుకొస్తున్న సామాన్లు గట్రా పక్కన పడేసి "ఏంటి, అల్లుడుగారు వచ్చారా! ఎప్పుడు వచ్చారు? నాకు ముందే చెప్పొచ్చు కదా! ఎవరితోనైనా కబురు పెట్టొచ్చు కదా!" అని అంటూ గబగబా యింట్లోకి వచ్చేసి, చుట్టూ చూసేసి, వంటింట్లో ఉన్న రమణమ్మ దగ్గరికి వచ్చి "ఏమోయ్! అల్లుడుగారు వచ్చారంట! ఎక్కడున్నారు? అల్లుడుగారు వస్తే, నాకు చెప్పవా? నీకసలు బుర్ర పనిచెయ్యదే!" అని గ్యాప్ యివ్వకుండా అడిగాడు.
రమణమ్మకి చిర్రెత్తుకొచ్చి “ఏంటి! నాకు బుర్ర పనిచెయ్యదా! మిమ్ముల్ని!” అని అంటూ గణపతి దగ్గరికి వచ్చి "ఆఁ అల్లుడుగారు వచ్చి మూడు గంటలవుతుంది. ఉదయం అన్నం తినడానికి కుడా రాకుండా పొలంలో ఏం పనిచేస్తున్నావయ్యా? టైం పది అవుతుంది. ఉదయం అన్నం తినడానికైనా వస్తావనుకున్నా. రాలేదు! రాలేనంత పని పొలంలో ఉన్నప్పుడు, అన్నం తీసుకురమ్మని కబురు ఎవరితోనైనా చెప్పమనొచ్చు కదా! ఆ చిన్న ఫోన్ కుడా తీసుకెళ్లమంటే, పొలం బురదలో పడిపోతుందేమో అని తీసుకెళ్లలేదు. ఫోన్ తీసుకెళ్లి ఉంటే, నీకే తిన్నగా ఫోన్ చేసేవాళ్లం కదా! అన్ని చేసేసి, నాకు బుర్ర లేదనడం!” అని లోపల ఉన్న బిపి మొత్తం బయటకొచ్చేసింది.
గణపతి రెండడుగులు వెనక్కి వేసి “సరే సరేలే! రేపటి నుంచి ఫోన్ తీసుకెళ్తానులే! అల్లుడుగారు వచ్చారంట! ఆ విషయం చెప్పు!” అని మెల్లగా అడిగాడు.
రమణమ్మ కాస్త నీళ్లు తాగి “గాయత్రి యింటికి వచ్చినప్పుడు తెచ్చిన బ్యాగులో ఏదో వస్తువు మర్చిపోయారంట, ఆ వస్తువు ఆఫీసుకి అవసరమంట, ఆ వస్తువు కోసం అల్లుడుగారు వచ్చారు! వచ్చినప్పటి నుంచి ఆ వస్తువు యింకా దొరికినట్లు లేదు! గదిలో వాళ్ళిద్దరూ వెతుకుతున్నారు!” అని అంది.
రమణమ్మ చెప్పిన మాటలన్ని వదిలేసి చివరిగా అన్న వెతుకుతున్నారు అని మాట గణపతి బుర్రలోకి ఎక్కిపోయి "ఏంటి యింకా వెతుకుతున్నారా! మరి చెప్పవేం!" అని అంటూ కంగారుగా నడుస్తున్న గణపతితో "ఏమయ్యో! అల్లుడుగారు, కూతురు లోపల ఉన్నారు. నువ్వు లోపలికి వెళ్ళకుండా, పిలిస్తే వాళ్ళే బయటికొస్తారు!" అని రమణమ్మ చెప్పేలోపే గాయత్రి గదిలోకి వచ్చేశాడు గణపతి.
మందార చెట్టుని మల్లెతీగ అల్లుకున్నట్టుగా, ఒకర్నొకరు గట్టిగా హత్తుకున్న వినయ్, గాయత్రి లు, ఊహించని విధంగా గణపతి రాకతో ఒక్కసారిగా చెరోవైపు వెళ్లిపోయారు. గణపతికి విషయం అర్ధమై గది నుంచి బయటికొచ్చేశాడు.
రమణమ్మ ఎదురుగా వచ్చి కోపంగా చుస్తూ "నీ కంగారు నీదే గాని, ఎదుటివాళ్లు చెప్పింది పూర్తిగా వినవేమయ్యా!" అని అంది. మొదటి నుంచి అంతా చూస్తున్న నీలిమ పొట్టపగిలేలా నవ్వుతుంది.
ఇంకా ఉంది..
ఆషాడం పెద్దకథ చివరి భాగం త్వరలో..
=================================================================================
ఇంకా వుంది..
ఆషాఢం - పార్ట్ 4 త్వరలో
=================================================================================
అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం
హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన
ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.
ఐదు బహుమతులు గెలుచుకున్నాను.
Comments