top of page
Writer's pictureSairam Allu

ఆషాఢం - పార్ట్ 4

#AlluSairam, #అల్లుసాయిరాం, #ఆషాఢం, #Ashadam, #TeluguRomanticStory


'Ashadam - Part 4/4' - New Telugu Story Written By Allu Sairam

Published In manatelugukathalu.com On 02/10/2024

'ఆషాఢం - పార్ట్ 4/4'  పెద్ద కథ

రచన: అల్లు సాయిరాం 

కథా పఠనం: పద్మావతి కొమరగిరి




జరిగిన కథ:

కొత్తగా పెళ్ళైన గాయత్రి ఆషాడం రావడంతో పుట్టింటికి వస్తుంది.

కొద్ది రోజులకే ఆమె భర్త వినయ్ ఏదో నెపంతో అత్తగారింటికి వస్తాడు.

భార్యను ఏకాంతంగా కలవడానికి ప్రయత్నిస్తాడు.



ఇక ఆషాఢం - పెద్ద కథ చివరి భాగం వినండి.



 “బాగున్నారా మావయ్య!” అని అంటూ వినయ్ గదిలో నుంచి బయటికి వచ్చాడు. 


గణపతి అభిమానం చూపించడంలో కుడా కంగారుపడుతూ వినయ్ దగ్గరికి వచ్చి “బాగున్నాను బాబు! నువ్వు వస్తున్నావని నాకు తెలియదు. పొలానికి వెళ్లి ఉండిపోయాను. ఎవరు నాకు చెప్పలేదు. తెలిసి ఉంటే, అసలు వెళ్లుండేవాడ్ని కాదు బాబు!” అని ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్టు మెత్తపడి మాట్లాడుతుంటే వినయ్ కి యిబ్బందిగా అనిపించి “అయ్యోయ్యో! మావయ్య. నేను వస్తున్నట్టు ఎవరికి తెలియదు. మీకు ముందే చెప్పి ఉండాల్సింది! నాకు కొత్త కదా. నేను నా పరంగా గాయత్రి దగ్గరికి వస్తున్నాననే అనుకుంటూ వచ్చాను. 


అదే విషయాన్ని మీ పరంగా చూస్తే, అత్తగారింటికి అల్లుడు వస్తున్నాడంటే, యింత హడావిడిగా ఉంటుందా అని ఉదయం నుంచి అత్తయ్యని, యిప్పుడు మిమ్ముల్ని చూస్తేనే తెలిసింది. ఈసారి వచ్చేటప్పుడు, కచ్చితంగా ముందు మీకు చెప్పేసి వస్తాను!” అని అన్నాడు. 


రమణమ్మ పళ్ళుకొరుకుతూ గణపతి దగ్గరికి వచ్చి “ఏమయ్యా! చెప్పానా నీకు! కంగారుపడొద్దని. ఎవరిని కంగారుపెట్టొద్దని! చూడు. నువ్వు చేసిన పనికి అల్లుడుగారు ఎంత కంగారు పడుతున్నారో..!” అని ఏదో అంటుండగా వినయ్ కలుగజేసుకుని “అత్తయ్య! ఇందులో మావయ్య చేసింది ఏముంది?” అని తనని సమర్ధిస్తూ మాట్లాడేసరికి లోలోపల ఆనందంతో పొంగిపోయి గణపతి భుజాలు గజాలు అయిపోయాయి. 


“అదో! అల్లుడుగారే చెప్పారు ఏం కంగారుపడలేదని! నువ్వు ఎక్కువ కంగారుపడిపోకులే రమణమ్మ!” అని రమణమ్మ వైపు చూస్తూ చమత్కారంగా అంటే, అందరు నవ్వుతున్నారు. 


 “ఏంటర్రా! అందరూ కలిసి అంతలా నవ్వుతున్నారు!” అని యింట్లోకి వస్తూ అంది సుభద్రమ్మ. 


“అమ్మమ్మ!” అని అంటూ నీలిమ ముందుగా వెళ్లి సుభద్రమ్మని అప్యాయంగా హత్తుకుంది. మిగతావాళ్ళు కుడా సుభద్రమ్మని పలకరిస్తూ దగ్గరికి వచ్చారు. 


గాయత్రి వెనుక వస్తున్న వినయ్ ని చూసి “ఏంటమ్మ గాయత్రి! అప్పుడే మా మనవడ్ని నీ వెనుక తిప్పుకుంటున్నావా!” అని సుభద్రమ్మ నవ్వుతూ అంటే, “అదేమీ లేదు అమ్మమ్మ!” అని అంటూ గాయత్రి సిగ్గుతో సుభద్రమ్మని గట్టిగా చుట్టేసింది. 


చెరోవైపు తన మనవరాళ్లు తనని అభిమానంగా కౌగిలించుకోవడంతో, సుభద్రమ్మ ఎంతగానో మురిసిపోతుంటే, వినయ్, రమణమ్మ, గణపతి లు సంతోషంతో నవ్వుతూ చూస్తున్నారు. 


 “మాటల్లో పడి మరిచిపోయాను బాబు. ఇంతకీ మీరు వెతుకుతున్న వస్తువు దొరికిందా! ఆఫీసుకి చాలా ఆలస్యమైపోయినట్టుంది! పర్వాలేదా బాబు?” అని వినయ్ వైపు చూస్తూ అడిగింది రమణమ్మ. 


వినయ్ తన చేతి వాచ్ చూస్తూ “అవును కదా!” అని మనసులో అనుకుంటూ “ఆ వస్తువు దొరికింది అత్తయ్య!” అని తన ప్యాంటు జేబులో నుంచి పెన్-డ్రైవ్ తీసి చూపించాడు. 


అది ఊహించని గాయత్రి ఆశ్చర్యపోతూ, వినయ్ వైపు పళ్ళు కొరుకుతూ చుస్తూ “బాబు ముందస్తు ప్రణాళిక ప్రకారమే పక్కగా వచ్చినట్లున్నాడు!” అని మనసులో అనుకుంది.


 గణపతి, రమణమ్మ లు ఆనందంగా “హమ్మయ్య! దొరికిందా బాబు! ఏంటమ్మా గాయత్రి! బ్యాగు సర్దుకునేటప్పుడు అంతా చూసుకోవాలి కదా! బాబుకి ఎంత యిబ్బంది అయ్యిందో!” అని గాయత్రికి చెరోవైపు చేరి, జాగ్రత్తలు చెప్తుంటే, బయటికి వింటున్నట్టుగా గాయత్రి తలవూపుతూ “నవ్వండి! నవ్వండి! మా అమ్మానాన్నలు అమాయకులు. మీరు ఏది చెప్పినా నమ్మేస్తారు. నాకు క్లాసు పీకుతారు!” అని మనసులో అనుకుంటున్న మాటలు గాయత్రి ముఖంలో కొట్టొచ్చినట్లు కనపడుతుంటే చూసి వినయ్ మెల్లగా నవ్వుకుంటున్నాడు. 

సుభద్రమ్మకి యిదంతా అర్ధం కాక “ఏంటమ్మ గాయత్రి! ఎదైనా విశేషమా? ఎదో దొరకడం అంటున్నారు. మీ అమ్మానాన్నలు అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు!” అని అడిగింది. 


“సరిపోయింది! నీకలా అర్ధమైందా అమ్మమ్మ! తప్పులేదులే!” అని మనసులో అనుకుంది గాయత్రి. 


రమణమ్మ నవ్వుతూ “నువ్వన్నట్లు ఆ విశేషం తొందరలోనే ఖాయం అవ్వబోతుంది అమ్మ! దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు విషయం ఏంటంటే, అల్లుడుగారు ఆఫీసుకి కావాల్సిన ఒక వస్తువు గాయత్రి యింటికి వచ్చినప్పుడు తెచ్చిన బ్యాగులో ఉండిపోయిందంట. ఆ వస్తువు గురించి బాబు వచ్చారు. పూజ చేసిన ప్రతిసారి ఉన్నట్లుగానే, ఈరోజు కుడా గాయత్రి, అల్లుడుగారు యిద్దరూ పూజ కోసమని ఉన్న ఉపవాసంతో చాలాసేపటి నుంచి వెతికితే, యిప్పుడు దొరికిందంట!” అని సుభద్రమ్మ వైపు చూస్తూ చెప్పింది. 


“చూసుకోవాలి కదా అమ్మ!” అని తనని పట్టుకున్న గాయత్రి తల నిమురుతూ అని అంది సుభద్రమ్మ.


 రమణమ్మ కొనసాగిస్తూ “మధ్యాహ్నం అయిపోతుంది. ఇప్పుడు ఆఫీసుకి వెళ్తే పర్వాలేదా బాబు? ఏమైనా అంటారా?” అని అడిగింది. 


వినయ్ మనసులో “ఈ ఆఫీసు విషయం తొందరగా తేల్చేయాలి!” అని అనుకుంటూ “నేను మా సార్ కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాను. అక్కడ మీటింగ్ అయిపోయిందంట. అత్తగారింటికి వచ్చానని నేను అడగకుండా, ఆయనే యిరోజు ఆఫీసుకి రావద్దులే అని పర్మిషన్ యిచ్చారు!” అని గాయత్రికి కన్నుకొడుతూ చెప్పాడు. 


గాయత్రి నవ్వుతూ “మీరు ఏది చెప్పినా, మా అమ్మానాన్నలు నమ్మేస్తున్నారు! అలా సాగుతోంది మీకు! కానీ. కానీ!” అని మనసులో అనుకుంది. 


గణపతి సంబరపడిపోతూ “అది! అలాగా! పెద్దాయన అంటే అలా ఉండాలి! నువ్వు కూర్చో బాబు. నేను బయటికి వెళ్లివచ్చేస్తాను!” అని గాబరాగా ద్వారం వైపు అడుగులు వేస్తున్నాడు. 


గణపతి గాబరా చూసి రమణమ్మ కంగారుగా “ఏమయ్యో! ఆగు!” అని గణపతి వెనక్కి పరుగెత్తి “ఇప్పుడు ఎక్కడికి అంత గాబరాగా వెళ్ళిపోతున్నావు?” అని ఆయాసపడుతూ అడిగింది. 


గణపతి మెల్లగా “బాబు ఉంటాడు కదా. చికెన్, మటన్ తీసుకొస్తాను! నువ్వు ఆ ఉల్లిపాయలు, మసాలాలు ఏవో తొందరగా చెయ్యి!” అని చెప్పి గబగబా నడుస్తున్నాడు. 


“ఏమయ్యో! వినవయ్యా! ఈరోజు పాప పూజ చేసింది కదా. ఇద్దరూ ఉపవాసం చెల్లించేటప్పుడు మాంసం కూరలు తినకూడదు!” అని రమణమ్మ గట్టిగా చెప్పేసరికి, గణపతి నీరుగారిపోయి “అవునా! మరి బాబుకి ఏం పెట్టవా? మర్యాదగా ఉంటుందా!” అని ఆలోచనలో పడ్డాడు. 


రమణమ్మ గణపతి వైపు చూస్తూ “నాయనా! నువ్వేం కంగారుపడకుండా ప్రశాంతంగా ఉండు! పూజ ప్రసాదం కోసం పులిహార, పాయసం, గారెలు వండాం. ఇంకా అరిసెలు, జంతికలు, అప్పడాలు ఉన్నాయి. ఇప్పుడు ఉపవాసం చెల్లించాక, యివన్ని పెడతాను. రాత్రి భోజనానికి ఏదైనా చుద్దాం!” అని వివరంగా చెప్పేసరికి, గణపతి కంగారు కాస్త కుదుటపడింది. 


 “మీ అమ్మానాన్నలు ఏం గుసగుసలు మాట్లాడు కుంటున్నారు చిన్నమనవరాలా!” అని సుభద్రమ్మ అడిగితే “వాళ్ళల్లుడికి తినడానికి ఏం పెట్టాలో, ఎలా మర్యాదలు చేయాలో అని నీ కూతురు, అల్లుడు మాట్లాడుకుంటున్నారు అమ్మమ్మ!” అని నవ్వుతూ అంది నీలిమ. 


అది విన్న వినయ్ వాళ్ళిద్దరి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి “ఏమైంది మామయ్య? నీలిమ చెప్తుంది నిజమేనా!” అని అడిగితే, నిజమే అన్నట్టుగా గణపతి, రమణమ్మ తలవూపారు. 


ఇద్దరివైపు చూస్తూ వినయ్ “ పూజ ప్రసాదంతో ఉపవాసం చెల్లిస్తాం కదా! దానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు మీరు!” అని అన్నాడు. 


“అంటే..అది” అని యిద్దరూ నీళ్లునములుతుంటే, “ఏమక్కర్లేదు మామయ్య! రండి! భోజనం చేద్దాం!” అని అన్నాడు వినయ్. 


నీలిమ నవ్వుతూ “బావగారు ఏమక్కర్లేదు అని అన్నారు కదా అని, మనం ఏం పెట్టకపోతే, అత్తగారింట్లో ఏం మర్యాదలు చేయట్లేదని ఆయనే అంటారు!” అని అంది. 


“ఇప్పుడు వద్దు అన్నానంతే, ఎప్పుడూ వద్దని కాదులే మరదలా! అయినా, అత్తగారింట్లో జరిగే మర్యాదలు ఎవరు వద్దంటారు!” అని వినయ్ నవ్వుతూ అంటే అందరూ నవ్వారు. 


“ఈ బావమరదళ్ళు ఒకరి మీద ఒకరు వికటాలాడడం మొదలుపెడితే, మనకి నవ్వి నవ్వి అక్కడే కడుపు నిండిపోతుంది కానీ, ముందు భోజనాలు చేద్దాం రండి!” అని బోజనాలు చెయ్యడానికి సిద్ధం చేస్తూ పిలిచింది రమణమ్మ. అందరూ కలిసి నవ్వుతూ భోజనాలు చేశారు.


 “అవునమ్మా! అమ్మమ్మకి ఫోన్ చేసి మరి అడుగుదామని అన్నావు. అమ్మమ్మ యింటికి వచ్చేసరికి, ఆ విషయమే మర్చిపోయావా!” అని అడిగింది నీలిమ. 

సుభద్రమ్మ ఆశ్చర్యంగా “దేని గురించి మనవరాలా?” అని అడిగింది. 


తన పేరు చెప్పి ఏం అడగబోతుందనే ఆలోచిస్తున్న రమణమ్మ వైపు చూస్తూ నీలిమ “ఇప్పుడు ఆషాఢం కదా అమ్మమ్మ! ఆషాఢం అల్లుడు తొమ్మిదో రోజున అత్తగారింట్లో అడుగుపెట్టాలంట కదా. మరి మా బావగారు ఆగలేక ముందు వచ్చేశారు. పర్వాలేదా?” అని అడిగింది. 


సుభద్రమ్మ నీలిమ చెవి నులుపుతూ “రాకూడదు కదా. మరి, మీ బావగార్ని యింటి బయట నుంచి పంపించేయ లేకపోయవా!” అని అడిగితే, “ముందు యి విషయం నాకు తెలియదు. తెలిసి ఉంటే..” అని నీలిమ నవ్వుతూ చెప్తుంటే, రమణమ్మ కలుగజేసుకుని “చాలు. చాలులే సంబరం! బాగా మాటలు ఎక్కువ అయిపోతున్నాయి నీకు!” అని కసిరేసరికి, రమణమ్మ కోపం చూసి నీలిమ అమ్మమ్మ వెనక్కి చేరిపోయింది. రమణమ్మ కొనసాగిస్తూ “నువ్వే దీన్ని బాగా గారాబం చేశావమ్మ! రేపు తొమ్మిదోరోజు నవమి కదా, యింటికి అడుగుపెట్టడానికి యిరోజు ఫోన్ చేద్దామని అనుకున్నాం. ముఖ్యమైన పని మీద అల్లుడుగారు ముందు వచ్చేశారు. అది పరవాలేదా అని అమ్మమ్మకి అడుగుదామంటే, యిది సగం సగం అర్ధం చేసుకుని అందరి ముందు వాగుతుంది!” అని కూలంకషంగా వివరించింది. 


సుభద్రమ్మ నవ్వుతూ “ముఖ్యమైన పని మీద మనవడు వచ్చాడని నువ్వే చెప్తున్నావు కదమ్మ! మరింక, అందులో ఏంటి సందేహం?” అని అంది. 

రమణమ్మ తలగోక్కుంటూ “ఆఁ రాకుడదంటారు కదా! మాకు కొత్తే కదా!” అని ఆలోచిస్తూ అంది. 


సుభద్రమ్మ కాస్త నీళ్లు తాగి “ఆషాడంలో అల్లుడు అత్తగారింటికి రాకూడదనేది, రావడం దోషమనేది, అటువంటిది ఏమీలేదమ్మా! మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా, దానికి కచ్చితంగా బలమైన కారణాలే ఉంటాయి. ముఖ్యంగా మనలాంటి వ్యవసాయ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని చెప్పారు. 


ఆషాఢమాసం వచ్చేసరికి యించుమించుగా తొలకరి వర్షాలు బాగా పడి, నాట్లు వెయ్యడం, నారుతీతలు, దుక్కి దున్నడం, ఎరువులు వెయ్యడం, యిలా పొలాల్లో పనులు ముమ్మరంగా ఉంటాయి. ఈ పనుల్లో ఎక్కువ మగవాళ్ళు చేసే పనులు ఎక్కువ ఉంటాయి. బయట తెలిసిందే కదా, కూలికి మనుషులు దొరకరు. దొరికినా, కూలీ ఖర్చులు యివ్వడానికే డబ్బులు అయిపోతే, పంట మదుపులకి మళ్లీ అప్పులు చేయాల్సి ఉంటుంది. 


మరి, కొత్తగా పెళ్లయినవాళ్లు యింటి దగ్గరే ఉంటే, యి అమ్మాయిని వదిలేసి, పొలానికి రమ్మని అ అబ్బాయికి పెద్దవాళ్ళు చెప్పలేరు! అలా అని పనుంది కదా అనేసి, పొలానికి ఆ భార్యను వదిలేసి భర్త పొలానికి వెళ్లి, ఎంతో ఎక్కువ సేపు పని చేయాలనుకోడు. చెయ్యడానికి యిష్టపడడు. తన మనసంతా యింటి వైపే లాగుతుంది. మరి పనులు జరగవు! 

పైగా, రోజూ పొద్దు పొడవకముందే, ఆ యింటి పెద్దాయన పొలానికి వెళ్లి పని చేస్తుంటే, కొడుకు యింట్లోనే ఉంటే, రెండు మూడు రోజులు చూస్తుంది. ఏదో రోజు ఆ అత్తమ్మ యింట్లో ఉంటున్న కొడుకుని పొలంలో ఉన్న ఆ పెద్దాయనకి అన్నం తీసుకెళ్లమనో లేదా సాయం చేయమనో, ఏదో చెప్తుంది. అప్పుడు కోడలికి అది నచ్చదు. అందువల్ల, వాళ్ళిద్దరికి విభేదాభిప్రాయాలు రావడం ఒకవైపు, పనులు జరగట్లేదని మరోవైపు, యిలా అన్ని రకాలుగా యింట్లో వాతావరణం మారిపోయి, చిన్నచిన్నగా మొదలైన విభేదాభిప్రాయాలు చిలికి చిలికి గాలివానలా మారి, చివరికి కుటుంబంలో పెనుతుఫాను ప్రభావం చూపుతుంది! 


అందుకే, కొత్తగా పెళ్లయిన అమ్మాయిని ఆషాఢమాసమంతా పుట్టింట్లో ఉండమని చెప్పారు. మాములుగా చెప్తే, మనం వినం కదా, అందుకే, ఆషాఢమాసంలో కొత్త కోడలు, అత్త ఒకే యింట్లో ఉండకూడదని, ఒక ద్వారం దాటకూడదని, ముఖాలు ఎదురెదురుగా చూసుకోకూడదని, యివన్ని పెట్టారు!” అని సుభద్రమ్మ చెప్తుంటే, దీని వెనుక యింత రహస్యం ఉందా అన్నట్లుగా ఆసక్తితో అందరూ వింటున్నారు. 


 సుభద్రమ్మ కొనసాగిస్తూ “ఇక ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లయినవాళ్లు కలవకూడదని ఎందుకు అంటారంటే, ఇప్పుడు ఆషాఢమాసంలో కలిస్తే, దేవుడి దయ వల్ల వాళ్లకి ఏ పండో, కాయో కలిగితే, ఆ బిడ్డ చైత్ర, వైశాఖ మాసాల్లో పుడుతుంది. తర్వాత జ్యేష్ఠమాసం. అంతా మంచి ఎండలకాలం. శిశువుకి, బాలింతరాలకి యిద్దరికీ కష్టమే! తల్లిబిడ్డలు ఆరోగ్య దృష్ట్యా ఎక్కువగా యిబ్బంది పడతారు. అందుకు ఈ ఒక్క నెల దూరం ఉంటే మంచిది అంటారు. అది ఒక కారణం అంతే తప్ప, దోషం కాదు! 


అయినా, మీ అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి. వాళ్లది ఉద్యోగస్తుల కుటుంబం. మీ అల్లుడు దగ్గరలో పనిచేస్తున్నాడు. కాబట్టి, ఆషాఢానికి మీ అమ్మాయిని పంపించాడు. అదే, దూరంలో ఎక్కడో పట్టణాల్లో పనిచేస్తున్న కొందరు, వీళ్ళతోనే పెళ్లయినవాళ్లు, వీలు లేక వాళ్ళిద్దరే ఉండిపోతున్నారు! పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నప్పుడు అన్ని వీలుకావమ్మా! ఇందులో తప్పులేనప్పుడు, ఆ పరిస్థితికి, ఆ సమయానికి అనుకూలంగా వెళ్లిపోవడమే. పట్టింపులు అన్ని పట్టించుకుంటే అవ్వదు!” అని విపులంగా చెప్పింది. 


 గణపతి తన పెళ్ళయిన కొత్తలో విషయాన్ని గుర్తు చేసుకుంటూ “బాగా చెప్పావు అత్తమ్మ! అందుకేనేంటి, మాకు పెళ్లయిన కొత్తలో మీ యింటికి రావొద్దని చెప్పేదానివి. అప్పుడు అర్ధమయ్యేది కాదు. మొత్తానికి మంచి మాట చెప్పావులే!” అని గొప్ప అయిపోతూ చెప్తుంటే “అర్ధమైతే మాత్రం ఏం చేసేవాడివో! ఇప్పుడు ఏదో పెద్ద అర్ధమైపోయినట్లు చెప్తున్నావు!” అని రమణమ్మ మెల్లగా అనేసరికి, గణపతికి చిరుకోపం వచ్చినా, తర్వాత అందరూ నవ్వేసరికి తాను నవ్వేశాడు. 


సుభద్రమ్మ నవ్వుతూ “అయినా రమణ! నువ్వు ఎప్పుడో అంటుంటావు కదా! ఈ యింటికి పెద్దల్లుడు అయినా, పెద్దకొడుకు అయినా తానే కదా! మరి, నీ కొడుకు నీ యింటికొచ్చినప్పుడు ముహుర్తాలతో పనేముంది! ఎందుకు యిన్ని ఆలోచనలు!” అని అంటే, నిజమే కదా అన్నట్లుగా రమణమ్మ తలవూపింది. 


“మీకు దండం పెడతా! అల్లుణ్ణి అల్లుడిలాగే ఉంచండి చాలు! మా ఆయన్ని యింటికి పెద్దకొడుకుని చేసి, మా యిద్దరిని అన్నాచెల్లెళ్లని చేసేయొద్దు!” అని చేతులు జోడించి గాయత్రి అమాయకంగా అనేసరికి, అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతుంటే, గాయత్రి సిగ్గుతో వినయ్ వెనక్కి చేరిపోయింది. అక్కడ నవ్వులు మాత్రం ఆగలేదు.


=================================================================================

                                      సమాప్తం

=================================================================================


 అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం


హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన

ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.

ఐదు బహుమతులు గెలుచుకున్నాను.


38 views1 comment

1 Comment


Djprakash

7 hours ago

Allu Sai ram garu ❤

Like
bottom of page