అశ్వ విన్యాసం
- Nallabati Raghavendra Rao

- 4 days ago
- 8 min read

Ashwa Vinyasam – The King Who Won the War with a Horse's Intelligence | A Folk Tale | Nallabati Raghavendra Rao
అశ్వ విన్యాసం – గుర్రం తెలివితో యుద్ధం గెలిచిన రాజు | జానపద కథ | నల్లబాటి రాఘవేంద్ర రావు
Published in manatelugukathalu.com on 17/03/2026
పూర్ణపురం యువరాజు సుదర్శన భూపతి వంద ఏనుగుల బలశాలి. అది ఎలాగా అంటే ఒకసారి పక్కనే ఉన్న భయంకర అడవి నుండి అతని రాజ్యంలోనికి పది ఏనుగులు ఒక్కసారిగా దండయాత్ర చేస్తున్నట్టు పరుగు పరుగున వచ్చేసాయి. ప్రశాంతంగా ఇంటిలో పనులు చేసుకుంటున్న ప్రజలు భీతావహులైపోయారు. చెట్టుకొకరుగా పుట్టకొకరుగా పారిపోయి ప్రాణాలు రక్షించుకున్నారు. చాలామంది ధర్మగంట కొట్టి రాజుని ఆశ్రయించారు, మొరపెట్టుకున్నారు. తమకు వచ్చిన కష్టాన్ని కష్టంగా చెప్పుకున్నారు.
రాజు చలించిపోయాడు. వెంటనే అతి బలవంతులైన తన సైనికులు 100 మందిని పంపించాడు. అయితే వాళ్లు ఆ ఏనుగులను వెనక్కు అడవిలోకి పంపించ లేక పోయారు. ఎంత బెదిరించి అదిరించినా అవి కదలకుండా కూర్చున్నాయి తప్పించి తమ నివాసానికి మళ్ళీ తిరిగి వెళ్లడం లేదు. సైనికులు ఎన్నో ఉపాయాలు ఆలోచించినప్పటికీ పిసరంత కూడా ఫలితం లేకుండాపోయింది. అప్పుడు రాజు సైనికులను వెనక్కు పిలిపించాడు.
ఆ సమయంలోనే అశ్వశాలలో తను ఎప్పుడూ అధిరోహించే తెల్లని అశ్వం సరదాగా నాట్యం చేయడం మొదలెట్టింది. అది అలా నాట్యం చేసింది అంటే తనకు ఏదో విజయం వస్తుందని రాజుకు గట్టి నమ్మకం.
వెంటనే తన నడుముకు ఇనుప చట్రాలను బిగించుకొని ఆ అశ్వాన్ని అధిరోహించి ఆ ఏనుగుల గుంపు ముందుకు వెళ్లి, దిగాడు.
మరొకసారి తన నడుమునకు ఇనుప చట్రాలను గట్టిగా బిగించుకొని తను ఒక్కడే ఏనుగుల ముందుకు నడుచుకుంటూ వెళ్లాడు. ప్రజలందరూ దూరంగా చూస్తూ ఆశ్చర్యంగా నిలబడి ఉండిపోగా సుదర్శన భూపతి బలంగా ఏనుగులను తన బలమైన రెండు చేతులతో తోసుకుంటూ 100 క్రోసుల దూరంలో ఉన్న అడవిలోకి తరుముకుంటూ, గెంటుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే ఏనుగుల పీడ రాజ్యంలోని ప్రజలందరికీ తప్పింది.
రాజు చేసిన ఈ సాహసం ప్రజలు ఎవరికీ అర్థం కాలేదు. ఒక చిన్న ఏనుగు పిల్లను కూడా అలా అడవిలోకి తోసుకుంటూ బెదిరిస్తూ గెంటుకుంటూ పంపించడం సంభవం కాదు. మరి రాజుకు ఇది ఎలా సాధ్యమైంది?
అతను రాజు కనక... అంతే. ఇదే విషయం చుట్టూ ఉన్న శత్రు రాజులకు, సామంత రాజులకు కూడా ఏమాత్రం అర్థం కాలేదు. అయితే అప్పటి నుండి అందరూ 100 ఏనుగుల బలశాలి అని రాజును పిలవడం మొదలు పెట్టారు.
ఆ విషయం అలా ఉంచితే అంతటి గొప్ప బలశాలి, యోధుడు అయిన పూర్ణపురం యువరాజు సుదర్శన భూపతి మీద దండయాత్ర ప్రకటించి రాజుని జయించాలని అప్పటికప్పుడు ఉన్నట్టుండి తన సైనికులతో రాజ్య పొలిమేరకు వచ్చేసి యుద్ధ శంఖారావం పూరించడం మొదలుపెట్టాడు. ఉచ్ఛలీ రాజ్య రాజు దుష్టమారకుడు.
దుష్ట మారకుడు అప్పటికప్పుడు కుతంత్రమైన పద్ధతిలో రాజనీతి పద్ధతులకు విరుద్ధంగా తన మీద యుద్ధం ప్రకటించినప్పటికీ, ఎదురు దండయాత్రకు అప్పటికప్పుడు సన్నాహమై బయలుదేరాలని నిశ్చయించుకున్నాడు, సుదర్శన భూపతి రాజు. కానీ రాజుకు మనసులో ఎక్కడో కించిత్తు భయం, అనుమానం పీక్కు తింటూనే ఉన్నాయి.
ఎంతైనా అప్పటికప్పుడు యుద్ధం అంటే ఎవరికైనా కష్టమే. సైనికులు సిద్ధం కావడానికి, వాళ్ళ ఆయుధాలు సిద్ధం చేసుకోవడానికి, వాళ్ల రథాలు సక్రమ మార్గంలో పెట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలాంటిది అప్పటికప్పుడు యుద్ధం అంటే...?
ఆ విషయంలో తన బలమైన సైనికులు కూడా కొంచెం వెనకడుగు వేస్తున్నట్టు అర్థమైంది మహారాజుకు.
రాజు కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తుండగా అతని తెల్లని పాలవన్నెల అశ్వం తన అశ్వశాలలో సరదాగా నాట్యం చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడు యుద్ధానికి వెళ్ళిన ఆ అశ్వమే రాజు అధిరోహించి వెళ్లే అశ్వం.
అయితే ఆ అశ్వం అలా సరదాగా నాట్యం చేసిన ప్రతిసారీ రాజు వెళ్లిన ప్రతి యుద్ధము విజయమే మోసుకొచ్చింది. అయితే, అప్పటి ఆ విషయం వేరే.
సైనికులు సిద్ధంగా ఉండేవారు, దాంతో విజయం వచ్చేది. ఇప్పటి విషయం వేరే... ఇది ఇప్పటికిప్పుడు యుద్ధం.
రాజు విషయం అర్థం కాక నెమ్మదిగా సైనికులను వదిలి అశ్వం ఉన్న అశ్వశాలకు చేరాడు.
అయితే అశ్వం సరదాగా చెవులు, తల ఆడిస్తూ ఏదో చెబుతున్నట్టు రాజుకు అనిపించింది. ఎంతకీ దాని భాష రాజుకు అర్థం కాలేదు. అయితే ఒకటి మాత్రం ఖాయమని నిశ్చయించుకున్నాడు. ఇంతటి ఆనందం తన సైగలు ద్వారా ప్రకటిస్తున్న అశ్వం వల్ల తనకు ఏదో మహోపకారం జరుగుతుంది, జరగబోతుంది అని ఖచ్చితంగా నిశ్చయించేసుకున్నాడు, సుదర్శన మహారాజు.
ఏముంది సృష్టిలో ఊహించని సంఘటనలు ఎన్నో జరగవచ్చు కదా!
ఆ తెల్లని పాలవన్నెల అశ్వం ఆగకుండా ఇంకా అలాగే తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుండడంతో రాజు ఒక్కడే తను కూడా ఆనందంగా అశ్వాన్ని అధిరోహించి సైనికులను రావద్దని చెప్పి యుద్ధ ప్రదేశానికి బయలుదేరాడు. ఎందరు ప్రధాన మంత్రులు, జ్ఞాన బోధకులు వారించుతున్నప్పటికీ.
కనీసం అతని చేతిలో ఖడ్గం కూడా లేదు.
ఇక్కడే ఒక చిత్రం జరిగింది.
'అతని పాలవన్నెల అశ్వం శత్రురాజు అయిన దుష్టమారకుడిని గురి చూసి వస్తున్నప్పటికీ అతని వెనుక సైనికులు ఎవరు రావడం లేదు ఏమిటి?' అని శత్రు రాజు అనుమానపడ్డాడు. ఏదో కొత్తరకం యుద్ధతంత్రం లాగా అనిపించింది అతనికి.
పూర్ణపురం యువరాజుని, అతని బలాన్ని, ఆలోచనలని అంత తక్కువగా అంచనా వేయడానికి వీలులేదని నిశ్చయించుకున్నాడు శత్రురాజు, దుష్ట మారకుడు.
ఇక్కడ యుద్ధ భూమికి తాను ఒక్కడిగా తరలివస్తున్న పూర్ణపురం యువరాజు గత దశాబ్ద కాలంలో తనకు విజయాలను మూట కట్టిన ఆ బంగారు అశ్వాన్ని దాని ఆలోచనలను, దాని బలాన్ని అంత తక్కువగా అంచనా వేయడానికి వీలులేదని మనసులో తను కూడా నిర్ధారించుకొని సవారీ చేస్తూ యుద్ధభూమికి ప్రవేశించేశాడు.
శత్రు రాజు కంగారుపడ్డాడు తలపడకుండా తడబడ్డాడు. అతని కూడా వచ్చిన సైనికుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. పూర్ణపురం యువరాజు ఆలోచన ఏమిటి చెప్మా? అంటూ... యుద్ధం చేయడం మానేసి అతని చర్యను అలా పరికించి చూడడం మొదలుపెట్టారు.
ఇప్పుడే ఆ పాలవన్నెల అశ్వం తన మేధో శక్తిని ప్రదర్శించినట్టు అనిపించింది సుదర్శన మహారాజుకు.
ఆ అశ్వం అతి వేగంగా సుదర్శన చక్రంలా శత్రురాజును, శత్రు సైనికులను దాటి ఇంకా అతి వేగంగా ఎక్కడికో వెళ్లిపోతుంది. శరవేగంగా ఇంకా ఇంకా ముందుకు దూసుకుపోతుంది.
ఆ యుద్ధ కౌటిల్యత దుష్టమారకుడికి అతని సైన్యానికి అర్థం కాలేదు. రాజు భయపడి తన గుర్రం ఎక్కి రాజ్యం వదలి పారిపోతున్నాడా అంటే 100 ఏనుగుల బలశాలి అయిన రాజు అలా ఎందుకు పారిపోతాడు?
''అమ్మో, ఇక్కడ ఏదో జరుగుతుంది. మనం అనవసరంగా ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే, రాజు వెనుకకు తిరిగి వచ్చి వేలాది సైనికులతో కొత్త రకం యుద్ధ కౌటిల్యతతో తన సైన్యం అందరినీ సంహరించి నన్ను కూడా చంపేస్తాడేమో!'' అని నిశ్చయించేసుకున్నాడు శత్రురాజు దుష్ట మారకుడు. తత్తరబిత్తరపడ్డాడు.
'ఇదేదో గమ్మత్తు యుద్ధవిద్య లాగా ఉంది... వామ్మో!" అని దుష్టమారకుడు మళ్లీ మళ్లీ కంగారు పడి, బెంబేలు పడి, సుదర్శన యువరాజు ఏ పక్క నుంచి దూసుకు
వచ్చి తనను సంహరిస్తాడో అన్న విషయం అర్థంకాక
తికమకపడి మకతికపడి తన సైన్యంతో వెనుతిరగడంతో ఆ ప్రదేశం ప్రశాంతమైపోయింది - ఘడియల వ్యవధిలో.
సుదర్శన యువరాజుకు శతకోటి విద్యలతో పాటు మితిమీరిన వేగంతో పోతున్న అశ్వాన్ని కళ్ళెంతో బిగబట్టి తన అదుపులో పెట్టుకోగలిగే నేర్పు ఉన్నప్పటికీ ఆ సమయంలో అశ్వం తన మాట వినకపోవడం వల్ల జరిగిన ఈ పరిణామానికి, చాలా దూరం అశ్వం మీద యుద్ధ భూమిని, యుద్ధ సైనికులను వదిలి దూసుకుపోయి చివరికి వెనుకకు తిరిగి వచ్చిన సుదర్శన మహారాజు ముందు గడబిడ పడినప్పటికీ ఆ యుద్ధ ప్రదేశంలోని శత్రు సైనికులు, శత్రురాజు మరో మార్గం గుండా కంగారుపడి ఎక్కడికో వెళ్లిపోయినట్టు గ్రహించుకుని ప్రస్తుతానికి యుద్ధం ప్రశాంతపడినందుకు సంతోషించి తాను ఒక్కడే తన పాలవన్నెల అశ్వంతో వెనుతిరిగి తన రాజ్యానికి చేరుకున్నాడు.
చేరుకుని తన మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్న సుదర్శన మహారాజుకు ఈ చిత్ర విచిత్ర సంఘటన అసలు అంతు పట్టలేదు. ఇది ఒక కల, లేక యదార్థమా అతను తెలుసుకోలేకపోతున్నాడు.
ప్రశాంతంగా పడుకొని ఆలోచిస్తున్న అతనికి మాత్రం కాసేపటికి విషయం అర్థమైంది.
యుద్ధానికి వచ్చిన ఒక శత్రువు రాజుకి మంది మార్బలం, కత్తి, డాలు కాదు కావలసింది - ఆలోచన శక్తి ఉండాలి. అంతకుమించి గుండెధైర్యం, గుండెబలం ఉండాలి. ముఖ్యంగా తన మీద తనకు అనుమానం లేని నమ్మకం ఉండాలి. సూక్ష్మ ఆలోచన శక్తి ఉండాలి.
దుష్టబుద్ధితో అప్పటికప్పుడు యుద్ధానికి వచ్చిన ఆ శత్రురాజుకు దుష్టమారకుడికే కాదు ఎవరికీ అవేవీ ఉండవు.
అదే కనిపెట్టింది తన బంగారు పాలవన్నెల అశ్వం తన అశ్వ శక్తితో, అశ్వ ఆలోచన పటిమతో. మునుముందుగా ఏ మాత్రం తడబడక, తొట్రుపడక రాజును ప్రేరేపించింది. "నాతో నువ్వు ఒక్కడివే తరలిరా, విజయం మనదే..." అన్నట్టు సైగలు చేసి చెప్పింది.
అదంతా అలా అలా అర్థం చేసుకోగలిగిన రాజు ఒక్కసారిగా అశ్వశాలలోకి వెళ్లి తన రాచ వన్నెల బంగారు తెల్లని అశ్వాన్ని ముద్దాడి, మనసారా దానికి నమస్కరించి, తిరిగి విశ్రాంతి కోసం తన మందిరానికి వచ్చాడు, కేవలం తన పాల వన్నెల తెల్లని అశ్వం సహాయంతో అనుకోని విజయం సాధించిన సుదర్శన మహారాజు.
****
సమాప్తం
#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #అశ్వవిన్యాసం, #AshwaVinyasam, #MoralFolkStoryTelugu, #జానపదకథ
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు




Comments