top of page
Original.png

అతివ


అతివ కథలో తండ్రి అండతో జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్న లలిత భావోద్వేగ దృశ్యం

Athiva - Telugu Emotional Social Story | Bhaskara Rao B. R. K. V.

అతివ తెలుగు భావోద్వేగ సామాజిక కథ | బి ఆర్ కె వి భాస్కర రావు

Published in manatelugukathalu.com on 04/08/2026


"వయసొచ్చిన ఆడపిల్ల త్వరగా ఇల్లు చేరకపోతే, కనీస భయం లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు అలా కూర్చుని టీవీ చూస్తున్నావేమిటి?" బయటనుంచి వచ్చిన భర్త అడిగిన ప్రశ్నకు, ఏమాత్రం తొణుకు బెరుకు లేకుండా భర్త ఇచ్చిన పై కండువా అందుకుంటూ, "అదేమైనా చిన్నపిల్లా తప్పిపోవటానికి? వస్తుంది లెండి!" అని భర్త మాటల్ని తేలిగ్గా తీసుకొని వంటింట్లోకి వెళ్ళింది భర్తకు భోజనం వడ్డించడానికి.


నారాయణ స్నానం చేసి వచ్చి భోజనం చేస్తుండగా లలిత వచ్చింది.


"ఏమ్మా ఎందుకు లేటయ్యింది? కాలేజీ అయిదింటికి అయిపోతుందిగా!!!"


"మానసా వాళ్ళింటికి వెళ్ళాను నాన్నా!" అని సమాధానం చెప్పి, "అమ్మా! నాకు భోజనం పెట్టవే, కడుపులో ఎలకలు పరుగెడుతున్నాయి" అంది బాత్రూములోకి వెళ్తూ.


తల్లి తిరిగి సమాధానం చెప్పకుండానే కంచంలో అన్నం పెట్టింది.


పెళ్ళి కాక ముందు నుంచే ఓ కిరాణా దుకాణంలో పనిచేస్తూ ఉండే నారాయణ, యజమానికి నమ్మకస్తుడిగా ఉండటంతో వయసుతోపాటు జీతం కూడా పెరిగి, తినడానికి ఉండడానికి కరువు లేకుండా కాలం నెట్టుకొస్తున్నాడు.


భార్య మంగాదేవి కూడా దొడ్డ ఇల్లాలే. లలితతో పాటుగా ఇంకో అమ్మాయి ఉన్నా, భర్తకు భారం లేకుండా ఇంటి పరువు కాపాడుతోంది.


లలిత రోజురోజుకూ కాలేజీ నుంచి మరీ లేటుగా రావడం గమనిస్తున్న నారాయణ, ఓరోజు గట్టిగా మందలించి కాలేజీ మానేయమన్నాడు కూడా.


తర్వాత నాలుగు రోజులు పద్ధతిగానే వచ్చి, తిరిగి యథాప్రకారం లేటుగా రాసాగింది.


'ఇక కూతుర్ని మార్చడం తన వల్ల కాదనుకున్న నారాయణ, మంచి సంబంధం చూసి పెళ్ళి చేయాలని నిర్ణయించుకుని రోజులాగానే షాపుకు వెళ్తున్న నారాయణ, లలిత ఒక కుర్రాడి మోటార్ సైకిల్ మీద వెనుక అతన్ని హత్తుకుని నవ్వుకుంటూ వెళ్ళడం చూసి కొయ్యలా బిగుసుకుపోయాడు.


అదురుతున్న గుండెతోనే షాపుకు వెళ్ళి అన్యమనస్కంగానే పని చేసి, రోజు కంటే ముందే ఇంటికి వచ్చేద్దామనే లోపే మంగాదేవి ఫోన్ చేసి 'లలితకు వంట్లో బాగాలేదు, అర్జెంటుగా ఇంటికి ర’మ్మంది. 


అప్పటికే కుదురులేని మనసుతో పరిపరి విధాలుగా ఆలోచిస్తున్న నారాయణ, భార్య నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో కుదేలైపోయాడు.


యజమానితో చెప్పి పావుగంటలో ఇల్లు చేరాడు. అప్పటికే లలిత అచేతనంగా మంచంమీద పడి ఉంది. కూతురికి ఏమైందని భార్యను ఆరా తీశాడు.


"ఉదయం నుంచి వాంతులు అవుతున్నాయట. మాత్ర వేసుకున్నా తగ్గలేదట. నీరసంతో వచ్చి అలా వాలిపోయింది. ఇప్పుడే డాక్టరు గారు వచ్చి, లలిత నెల తప్పి......" ఆపై మాటలు రాక రెండు చేతులతోనూ ముఖాన్ని కప్పేసుకుని పెద్దపెట్టున రోదించింది మంగాదేవి.


వింటున్ నారాయణ అలాగే కూర్చుండిపోయాడు కుర్చీమీద నిలువు కళ్లేసుకుని...

కాసేపటికే తేరుకున్నాక శవంలా పడి ఉన్న కూతురిని చూసి, జాలిపడాలో కోప్పడాలో తెలియక పిచ్చివాడిలా ఉండిపోయాడు.


సాయంత్రం ఆరు ఔతుండగా నెమ్మదిగా లేచి హాల్లొకి వచ్చింది లలిత.


అప్పటికే తిండి తిప్పలు లేక భార్య భర్తలిద్దరూ చారికలు కట్టిన కళ్ళతో దైన్యంగా చూస్తూ ఉన్నారు.


"నాన్నా! నా గురించి మీరేమీ భయపడకండి. ప్రకాష్ మీరు భయపడినంత చెడ్డవాడేమీ కాదు. నన్ను తప్పక పెళ్లి చేసుకుంటాడు" నూతిలోంచి వస్తున్నట్టు ఉన్నాయి ఆ మాటలు.


"అమ్మా! ప్రతి మగవాడు ముందు అలాగే మాట్లాడుతాడు. తీరా అవసరం తీరాక నడివీధిలోకి విసిరేస్తాడు ఎంగిలి విస్తరాకులా!" తండ్రి మాటల్లోని అనుభవ సారాన్ని గుర్తించలేని లలిత,

"నువ్వేమి దిగులు పడొద్దు. వాళ్ళ నాన్న చాలా ఆస్తిపరుడు. పైగా సొసైటీ లో పేరున్నవాడు. ప్రకాష్ చాలా సార్లు ‘మానాన్న పరువుకోసం అవసరమైతే ప్రాణం కూడా తీసుకుంటా’డని అన్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. రేపే వెళ్ళి ప్రకాష్ ను కలసి మీ దగ్గరకు తీసుకు వచ్చి ఆ శుభవార్త అతని చేతే చెప్పిస్తాను " అంది నిండైన ఆత్మ విశ్వాసంతో..


మంగాదేవి ముఖంలో కాస్తంత నమ్మకం కనిపించినా, నారాయణ వదనంలో ధైర్యం తాలూకు ఛాయలు కనిపించలేదు.


మరునాటి ఉదయమే లలిత టిఫెన్చేసి ప్రకాష్ కు ఫోన్ చేసింది.



"అమ్మా! ప్రకాష్ అబిడ్స్‌లో ఉన్న తన గెస్ట్ హౌస్‌లో ఉన్నాడట. నేను వెళ్ళి విషయమంతా చెప్పి తీసుకువస్తాను" అని తల్లితో చెప్పి వెళ్ళిపోయింది లలిత.


నారాయణ మనసు బాగోక షాపుకు వెళ్లలేదు...

"హాయ్! హానీ, ఏమి చేస్తున్నావ్?" అంటూ సోఫాలో కూర్చున్న ప్రకాశ్ వెనుకకు వెళ్ళి మెడ చుట్టు తన చేతులు వేసి అతని తలపై తన గడ్డం ఆన్చి గారంగా అడిగింది.


"చెయ్యడానికి ఏముంది? నీ గురించే ఆలోచిస్తున్నా.." అన్నాడు ఆమె చేతులు విడిపించుకుని, తన చేత్తో లలిత చేతిని పట్టుకుని ముందుకు తీసుకుని పక్కనే కూర్చోపెట్టుకున్నాడు.


"ఏమ్మా? నా గురించి ఏమి ఆలోచిస్తున్నావు?" 


"ప్రతి రోజూ ఒక్కో ప్లేస్‌కు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం కదా! ఈ రోజు నా మూన్‌ను ఎక్కడకు తీసుకువెళ్ళాలా అని ఆలోచిస్తున్న.."


" ఈ రోజు మాఇంటికే"


"వై!!??" 


"ఎందుకంటే మా ఇంట్లో మన ఇద్దరి గురించి తెలిసిపోయింది.. ఇంకో గుడ్ న్యూస్ ఏమిటంటే.... ఏమిటంటే.. మన ఇద్దరం తల్లితండ్రులు కాబోతున్నాం" అంది మెరిసే కళ్ళతో.


"అయితే మనం వెళ్ళవలసింది హాస్పిటల్‌కుగా.. మీ ఇంటికి దేనికి?"


"హాస్పిటల్ కు దేనికి!!?"


"అబార్షన్ కోసం."


"అదేమిటి ప్రకాష్ మన పెళ్లి చేసుకోవాలి కదా!!"


"ఓ మై డియర్ సిల్లీ పూర్ మూన్!!! తెల్లారి లేచిన దగ్గర నుంచి మనమేమి చేయాలో మన చేతుల్లో లేదు. అంతా ఏఐ (AI) చెప్పేస్తున్న ఈ రోజుల్లో ఇంకా పెళ్లి వ్రతాలు అంటూ అమ్మమ్మల కాలం నాటి పద్ధతులు ఫాలో అవుతాను అంటావేమిటి? టేక్ ఇట్ ఈసీ బేబీ..


బుద్ధిగా హాస్పిటల్ కు వెళ్ళి అబార్షన్ చేయించుకుని ఫోర్ డేస్ రెస్ట్ తీసుకుని రా. మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. భయంగా ఉంటే చెప్పు తోడు వస్తా. అమౌంట్ లేకపోతే చెప్పు ఇస్తా..టెల్ మీ సంథింగ్." అని జీవితాన్ని అంత తేలిగ్గా తీసుకున్న ప్రకాష్ మాటలకు లలిత దగ్గర సమాధానం లేదు.


మెదడంతా మొద్దుబారిపోయింది.


ఉన్నపళంగా గుండెపోటు వచ్చి చనిపోతే బావుణ్ణు అనిపించింది లలితకు.


అవేమీ పట్టనట్టు ప్రకాష్ సిగరెట్టు ను వెలిగించాడు తన బ్రతుకును బగ్గి చేసినట్టు దాన్ని బూడిద చేయడానికి.


తనమీద అతనికున్న అభిప్రాయం ఏమిటో తెలిశాక ఇంక అక్కడున్నా ఫలితం శూన్యమని లేచి అదురుతున్న గుండెతో వెనుకనుండి ప్రకాష్ పిలుస్తున్నా పట్టించుకోకుండా బయటకు వచ్చేసింది.


నడి సముద్రంలోని నావలా తయారైన తన జీవితం, గాలి ఏ వైపు విసిరితే ఆ వైపు వెళ్ళడమే ప్రయాణం సాగుతుందని తెలిశాక, ఇంటికి వెళ్ళి వాళ్ళను బాధపెట్టడం కన్నా చావే మంచిదని నిర్ణయించుకుని ఆటో ఎక్కి హుస్సేన్ సాగర్ దగ్గరకు తీసుకువెళ్ళమంది.


అక్కడకు వెళ్ళాక ఆటో దిగి డ్రైవర్ కు డబ్బు ఇచ్చి, ఆ నీళ్ళల్లో దూకబోతుంటే ఎవరో చెయ్యి పట్టుకుని ఆపేసరికి చూసింది.


స్త్రీ జనోద్ధరణ సంఘం అధ్యక్షురాలు అనసూయ.

"ఏమైందమ్మా ?"


లలిత ఏడుస్తూ జరిగిందంతా చెప్పి, "మేడమ్, మీరు నాకు బాగా తెలుసు. మా కాలేజీలో జరిగే మహిళా మీటింగులకు చీఫ్ గెస్ట్‌గా చాలా సార్లు వచ్చారు" అంది కన్నీళ్లు తుడుచుకుంటూ.


"నీలాంటి అమ్మాయిలకు జరిగే అన్యాయాల్ని ఎదిరించడానికి మా సంఘం ఉంది. చనిపోవడం లాంటి పిరికి పని చెయ్యకు. నేనున్నాను. మీ ఇంటికి వెళ్దాం పద" అంటూ ధైర్యం చెప్పి లలితతో వాళ్ళింటికి వెళ్ళింది అనసూయ.


బాధ పోయింది.. బ్రతుకు అణచాలి.

‘పుట్టేది ఆడైనా మగైనా, వాడి పీఠం అణచడానికే పెంచుతాను’ అనుకుని ఆత్మవిశ్వాసంతో ఇంటికి వెళ్ళింది లలిత.


అప్పటికే కూతురు కోసం భయం భయంగా ఎదురుచూస్తున్నారు లలిత తల్లిదండ్రులు.


అనసూయ లలిత తండ్రితో జరిగిందంతా చెప్పి ప్రకాష్ ను కోర్టుకు ఈడ్చబోతున్నట్టు గా చెప్పేసరికి

"మీకు చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాను, ఈ విషయం ఇంతటితో వదిలేయండి. వాడి ఖర్మకు వాడే పోతాడు. చెట్టుకు కాయేమి బరువు కాదు. నా కూతుర్ని నేనే పెంచుకుంటాను" అన్నాడు పులుక్కుపోయిన గొంతుతో దుఃఖాన్ని దిగమింగుకుంటూ.

అనసూయ పట్టు విడువలేదు. దాంతో లలిత, తల్లి కూడా పదే పదే చెప్పడంతో నారాయణ, 'నిండా మునిగిన వాడికి చల్లామిటే' అని మనసులో అనుకుని ఎటూ చెప్పకుండా మౌనం వహించాడు.


మరునాడే అనసూయ లలిత తో ప్రకాష్ మీద కోర్టు లో కేసు వేయించింది.


వాదోపవాదాలు సుమారు మూడు నెలల పాటు జరిగాయి.ఈ విషయం కాస్తా మీడియా లో రావడంతో నారాయణ మరింత కృంగిపోయాడు.


చివరకు కోర్టులో నెగ్గింది. 'సదరు ప్రకాష్ లలిత ను బేషరతుగా పెళ్లి చేసుకోవాలి లేదా లక్ష రూపాయలు ఫైన్ కట్టాలి ' అనేది తీర్పు సారాంశం.


ప్రకాష్ ఫైన్ కట్టడానికే నిర్ణయించుకున్నాడు.

లలిత కూడా అతన్ని పెళ్లి చేసుకోడం ఇష్టం లేదని మీడియా ముందే చెప్పింది. 


ఆ రోజంతా టీవీల్లో లలిత గురించే.


అనసూయ తో పాటు చాలా మంది ఆడవాళ్ళతో గెలుపు ఉత్సాహం తనువంతా సంతోషాన్ని నింపుకుని ఇంటికి వచ్చింది లలిత.


చాలా సేపటికి వచ్చినవారంతా వెళ్లిపోయారు.

తల్లి ముఖంలోని ఆనందాన్ని గమనించిన లలిత, తండ్రి ముఖంలోని బాధను గమనించక పోలేదు. అయినప్పటికీ తండ్రికి మొదట్నుంచీ కోర్టుకు వెళ్ళడం ఇష్టం లేకపోవడం వల్ల అలా ఉన్నాడేమోనని సరిపెట్టుకుంది.


రాత్రి భోజనాలు పూర్తయ్యాక తండ్రి గదికి వెళ్ళింది లలిత. చాలా సేపటి వరకు ఇద్దరూ మౌనాన్ని ఆశ్రయించి, చివరకు "ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావమ్మా??" అడిగాడు నారాయణ.


" పెళ్ళి చేసుకుంటాను నాన్నా!"


"నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారో చెప్పు"


గుండెల్లో ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైనట్టైంది. నోట మాటలేదు. ధారాపాతంగా కళ్ళమట నీళ్ళు కారుతున్నాయి, గొంతు తడారిపోయింది.


"నాకు తెలుసునమ్మా. చేయి జార్చుకున్న అమ్మాయికి ఇటువంటి రోజొకటి వస్తుందని. నా మౌనాన్ని నువ్వు అపార్థం చేసుకున్నావు.


తల్లిండ్రులు తప్ప ప్రతి ఒక్కరూ ఆడదాన్ని తమ స్వార్థానికి ఉపయోగించుకుని విసిరేసేవాళ్ళే ఈ సమాజంలో.


ప్రకాష్ తన శరీర వాంఛ కోసం, అనసూయ పలుకుబడి కోసం నిన్ను ఓ పావులా వాడుకున్నారు. వారిద్దరికి నీ జీవితం, వాళ్ళు ఆడే వైకుంఠపాళిలో పైకి ఎగపాకే నిచ్చెనలా ఉపయోగపడింది. ఏది ఏమైనా నువ్వు నా బిడ్డవు. నీ కాలిలో ముల్లు గుచ్చుకున్నా విలవిలలాడే నా మనసు, ఇంత పెద్ద కష్టం వస్తే కంటికి రెప్పలా కాపాడుకోనా!?" అని నారాయణ లలితతో అన్నాడు. 


ఒక్క ఉదుటన వచ్చి తండ్రిని కౌగిలించుకుని హృదయంలోని బాధ తీరే వరకు ఏడ్చి, ఒక నిర్ణయానికి వచ్చినదానిలా కన్నీళ్లు తుడుచుకుని, "నాన్నా! నేను బిడ్డను కంటాను. అది ఎవరైనా సరే. మళ్ళీ ప్రకాష్ లాంటి వెధవలు మరే ఆడదాన్ని మోసం చెయ్యకుండా ఆబిడ్డను లాయర్ చేస్తాను " అంది ఆత్మ విశ్వాసంతో.


నారాయణ ముఖంలో అప్పుడు చిరునవ్వు విరిసింది, చాలా రోజుల తర్వాత..


ప్రశాంతమైన హృదయంతో తన గదిలోకి వచ్చి వాలేప్పటికి అనసూయ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఓ చిలిపి ఆలోచన లలితకు తట్టింది.


"లలిత, మీ నాన్నగారు ఏమన్నారు? మనం నెగ్గినందుకు సంతోషించారా?" అని గర్వంగా నవ్వుతూ అడిగింది.


"చాలా సంతోషించారు మేడమ్. పెళ్ళి చేసుకోమన్నారు. కానీ నన్నెవరు పెళ్ళి చేసుకుంటారని అడిగితే, అనసూయ గారికి అబ్బాయి ఉన్నాడుగా అతన్ని చేసుకోమను. అప్పుడు ఆవిడ స్త్రీ జనోద్ధరణ పరిపూర్ణం అవుతుందన్నారు మేడమ్. మీ ఒపీనియన్ చెప్పండి" అని లలిత అనేసరికి ఫోన్ కట్ చేసేసింది అనసూయ.


లలిత నవ్వుకుంటూ ఫోన్ ప్రక్కన పెట్టేసి వెల్లకిలా పడుకుని పొట్టపై చేత్తో నిమురుకుంది, 

మబ్బులు లేని ఆకాశమంతా ప్రశాంతంగా....


*** 

బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


బి ఆర్ కె వి భాస్కర రావు

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు


ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.

భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.

రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.

ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.

పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు

నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు

ఊరు పాలి

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page