ఆత్మన్యూనత
- Ch. Pratap

- Nov 6
- 5 min read
#Athmanyunatha, #ఆత్మన్యూనత, #ChPratap, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

Athmanyunatha- New Telugu Story Written By Dr. Ch. Pratap
Published In manatelugukathalu.com On 06/11/2025
ఆత్మన్యూనత - తెలుగు కథ
రచన: Dr. Ch. ప్రతాప్
ఆంధ్రప్రదేశ్‌లోని పచ్చని పొలాల నడుమ ప్రశాంతంగా ఉన్న గ్రామం అనంతగిరి. అక్కడే పెరిగారు రవి మరియు సురేష్ — బాల్యం నుంచి విడదీయరాని స్నేహితులు.
పండుగల సందర్భాల్లో జనాలు ఇద్దరినీ ఒకటిగా పిలిచేవారు: “రవి–సురేష్ వచ్చారు!”
కాలం మాత్రం ఇద్దరినీ రెండు దారుల్లో నడిపించింది. సురేష్ చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండేవాడు.
కష్టపడి హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్థాయికి చేరాడు. కారు, విద్య, స్థిరమైన ఆదాయం — సుఖంగా నిలిచిన జీవితం.
రవికి కూడా మంచి తెలివితేటలు ఉన్నాయి. కానీ ఇంట్లో తీవ్రమైన కుటుంబ సమస్యలు — తండ్రి అనారోగ్యం, ఇంటి బారం, చెల్లెలి బాధ్యత — ఇవన్నీ అతన్ని చిన్న వయసులోనే పెద్దవాడిని చేశాయి. చదువుపై దృష్టి పెట్టే అవకాశం రాలేదు. తర్వాత పట్టణంలో ఒక చిన్న ఫ్యాక్టరీలో కూలీ పని చేయాల్సి వచ్చింది.
సురేష్ ఊరికి వచ్చినప్పుడు రవిని పలకరించేవాడు, కొన్నిసార్లు సాయం పేరుతో డబ్బు కూడా ఇస్తుండేవాడు.
సురేష్ ఉద్దేశం మంచిదే. కానీ రవి మనసులో ఆ సహాయం స్నేహంలా కాకుండా, దయలా అనిపించింది.
ఈ భావనను మరింతగా పెంచింది. భార్యల మధ్య పెరిగిన కోపం మరియు అసహనం. సురేష్ భార్య కనకదుర్గ బంగారు నగలు, కొత్త చీరలతో, ఇంద్రభవనం లాంటి భవంతిలో జీవనం సాగిస్తుండగా, రవి భార్య లక్ష్మి పాత ఇంటిలో, మార్చుకున్న చీరలతో, పొదుపు కోసం ప్రతిదినం లెక్కలు వేసుకుంటూ జీవించాల్సి వచ్చేది. లక్ష్మి తరచూ రవితో గొడవపడేది:
“ఇతరులు ఎలా ఎదిగారు చూడు. నీ స్నేహితుడు సురేష్ ఎలా నిలబడ్డాడు ?. మన పిల్లలకు మంచి జీవితం ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నేనూ ఇలా బతకాల్సిందేనా?”
ఈ మాటలు రవి హృదయంలో అగ్నిపర్వతాలను లేపాయి. వారి మధ్య చిన్నగా ప్రారంభమయ్యే గొడవలు చిలికి చిలిక గాలివానగా మారేది. తరచు ఘర్షణలతో రవి జీవితంలో ప్రశాంతత మృగ్యమయ్యింది.. హీనభావం, అవమానం, ఈర్ష్య — ఇవన్నీ నిశ్శబ్దంగా అతనిలో పేరుకుపోయాయి.
ఒక సాయంత్రం, పాత మామిడిచెట్టుల నీడలో ఇద్దరూ మద్యం తాగుతున్నారు. పాత జ్ఞాపకాలు గాలిలో తిరుగుతున్నాయి. సురేష్ ఆప్యాయంగా అన్నాడు:
“రవీ, ఇలాగే చిన్న చిన్న పనులు చేస్తూ నీవు జీవితాన్ని నెట్టుకోకూడదు. నేను ఉన్నాను కదా.. నీకు హైదరాబాద్‌లో చిన్న వ్యాపారం ప్రారంభించేందుకు సహాయం చేస్తాను. నువ్వు వెంతనే నాతో వచ్చేయి. కొంచెం సెటిల్ అయ్యాక భార్యా పిల్లలను కూదా తీసుకొని అక్కడికి వచ్చేయవచ్చు.. ”
అది సురేష్ ప్రేమతో చెప్పిన మాట. కానీ రవి మనసు ఆ వాక్యాన్ని ఇలా విన్నది:
“నువ్వు నీ జీవితాన్ని ఒంటరిగా నిలబెట్టుకోలేవు. నీకు నీ కాళ్ళ మీద స్వంతంగా, ధైర్యంగా నిలబడే దమ్ము లెదు. కాబట్టి నా కాళ్ళపై పడు. నీపై దయతో కాస్త భిక్ష పారెస్తాను. నువ్వు ఆ ముష్టి తీసుకొని నీ జీవితం ఎలాగోలా పడి లేస్తూ కుంటి గుర్రంలా నడుపు. జీవితాంతం నాకు కృతజ్ఞతతో వుండాలి సుమా”
సురేష్ తన మంచి కొసమే ఆ సలహా ఇచ్చాడని రవి అనుకోలేదు. అంతవరకు అతని మనస్సులో సురేష్ పట్ల గూడు కట్టుకున్న ఈర్ష, అసూయాద్వేషాలు ఒక్కసారిగా లావాలా పైకి పెళ్ళుబికాయి. రవి ఒక్కసారిగా లేచి అరిచాడు:
సురేష్ మాటలు రవికి అస్సలు నచ్చలేదు. ఆ దాతృత్వపు మాట రవి అహంకారాన్ని బద్దలు కొట్టింది. రవి కళ్లల్లో క్రోధం కనిపించింది:
చాలు సురేష్! ఇక ఒక్క మాటా వద్దు! ఎప్పటి నుంచో నువ్వు నా జీవితాన్ని నీకు హక్కుగా భావిస్తున్నావు. సాయం చేస్తున్నానంటావు కానీ ప్రతీసారి నన్నే చిన్నచూపు చూస్తావు. నేను నీ దయ, ప్రాపకాలతో బ్రతకాలనుకోవడం లేదు. ఇప్పటి వరకు జరిగింది కాదు. ఈక నాపై దయ, సానుభూతి చూపించే ఇలాంటి మాటలు మాట్లాడితో అసలు ఒప్పుకోను" రవి ఆవేశంతో ఊగిపోసాగాడు. !
సురేష్ నిశ్శబ్దంగా ముందుకు వాలుతూ అన్నాడు: “రవీ.. మనం చిన్నప్పటి నుంచే అన్నదమ్ముల్లా—”
అతని వాక్యం పూర్తికాకముందే — రవి పక్కనే ఉన్న బండరాయి తీసుకుని, ఆవేశంలో, ఒళ్ళు పై తెలియని
సురేష్ తలపై బలంగా కొట్టాడు. ఒక స్నేహం, ఒక బంధం, ఒక విశ్వాసం —ఒక క్షణంలో ముగిసిపోయింది.
సురేష్ శవం కనుగొనబడిన తరువాత, విచారణ అధికారులకు మొదట్లో ఇది సాధారణ గొడవగా అనిపించింది. కానీ సాక్ష్యాలు ఒక్కొక్కటిగా మాటలకన్నా ఎక్కువగా చెప్పడం ప్రారంభించాయి.
మామిడితోటలోని మట్టి ఇంకా తడిగా ఉంది. అక్కడే పడివున్న బండరాయి మీద ఎండిన రక్తపు మరకలు —
మరియు అదే రాయి మీద రవికి చెందిన వేలిముద్రలు. పక్కన పడివున్న మద్యం బాటిల్ — అదే బాటిల్‌పై ఉన్న రెండు వేలిముద్రలు — రవి మరియు సురేష్.
ఈ రెండూ కలిసి ఒక రాత్రి స్నేహం ఎలా రక్త సత్యంగా మారిందో చెబుతున్నాయి.
పరిసర సాక్షులు చెప్పారు: “రాత్రి ఇద్దరూ కలిసి కనిపించారు సార్.. మరుసటి ఉదయం మాత్రం..”
రవిని స్టేషన్‌కు తీసుకువెళ్ళినప్పుడు, అతని కళ్లలో పశ్చాత్తాపం కాదు.. పగలిన మనసు, అలసట, మరియు ఓడిపోయిన అహంకారం మాత్రమే కనిపించాయి.
రవిని స్టేషన్‌కు తీసుకురాగానే, మొదట అతను గట్టిగా నిరాకరించాడు. సురేష్ మరణానికి తనకి సంబంధం లేదని, అదే మామిడితోటలో కలిసి కూర్చుని వెళ్లిపోయానని చెప్పడానికి ప్రయత్నించాడు.
కానీ దర్యాప్తు అధికారులకు సాక్ష్యాలు ఒక్కొక్కటిగా చేతిలోకి వస్తున్నాయి— రక్తపు చారలు, ఫోరెన్సిక్ నివేదిక, సాక్షుల వాంగ్మూలాలు. ఇవి ఎదుట ఉంచిన తర్వాత కూడా రవి మౌనం వదల్లేదు.
అప్పుడు మొదలైంది పోలీసుల ప్రశ్నల దాడి. గంటలు.. మళ్లీ గంటలు.. జవాబు కోసం కాదు —
బద్దలైన మనసును బయటకు తీసేందుకు.
అది పోలీస్ విచారణ గది. బయట ఎంత వెలుతురు ఉన్నా, లోపల మాత్రం చలిగా, ఏదో తెలియని నిశ్శబ్దంతో మూలుగుతున్నట్లు ఉంది. గోడల మీద నీడలు భయంకరంగా కదులుతున్నాయి.
రవి ఎదురుగా ఉన్న టేబుల్‌పై పోలీసులు నెమ్మదిగా ఒక పసుపు ఫైలు తెరిచారు. గదిలో ఉన్న అధికారుల చూపులు అన్నీ బరువులా రవిపైనే నిలిచాయి. దూరం నుండి కారిడార్‌లో వినిపించే బూట్ల చప్పుడు, రవి గుండెను కొడుతున్న డప్పులా అనిపించింది. ఆ శబ్దం ప్రతిసారి అతని గుండెల్లో ఒక గుద్దు వేసినట్టే.
కానిస్టేబుల్ టేబుల్‌పై రక్తపు మరకలు ఆరిపోయిన బండరాయి ఫోటోను ఉంచాడు. అది సాక్ష్యంలా కనిపిస్తోంది.
అధికారి శాంతంగా, కానీ కఠినంగా అడిగాడు: “ఈ రాయిపై ఎవరి వేలిముద్ర ఉందో నీకే తెలుసు.. కదా?”
రవి కళ్లను ఆ ఫోటో నుండి తిప్పాలని ప్రయత్నించాడు, కానీ నిజం అతని కళ్లలోనే నిలిచిపోయింది.
తర్వాత, మరొక అధికారి టేబుల్‌పై మద్యం సీసా ఫోటోను పెట్టాడు.
అధికారి: “ఇదీ మీ ఇద్దరి రాత్రి కథ. ఇది చిన్న ప్రమాదం కాదు. సాయం చేయాలని మొదలై.. రక్తంతో ముగిసిన రాత్రి ఇది. ”
గదిలో మళ్లీ భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. అది మనసును బలవంతంగా నిజం వైపు లాగేసే నిశ్శబ్దం. బయట ఉన్న సాక్ష్యాల బరువు తక్కువ. కానీ రవి మనసులో జరుగుతున్న యుద్ధమే అసలైన బరువు.
ఏళ్లుగా దాచుకున్న నొప్పి, సురేష్‌తో తనను తాను పోల్చుకున్న అవమానం, లోలోపల పెరిగిన ఈర్ష్య— అన్నీ ఒకేసారి రవి ఎదురుగా నిలబడ్డాయి. ఆ నిశ్శబ్దంలో రవి తీసుకున్న ప్రతీ ఊపిరి, ఒప్పుకోబోయే ముందు చివరి ఊపిరిలా అనిపించింది.
చివరకు, రవి తల నెమ్మదిగా వాలింది. గతం, స్నేహం, ఈర్ష్య, చేసిన ద్రోహం— అన్నీ ఒకే ఒక్క మాటలో కరిగిపోయాయి.
అతని గొంతు విరిగినట్టుగా పలికింది:
“అవును.. నేనే చేశాను. ”
ఆ మాట విన్న గదిలోని అధికారులు మాత్రమే కాదు, ఆ గోడలు కూడా నిజం బరువును మోసినట్టుగా అనిపించింది.
“అవును.. నేను.. నేనే కొట్టాను. ” అది విజయం కాదు. అది ఒక మనిషి తన మనసు ఓడిపోయిన క్షణం.
కోర్టు గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. న్యాయమూర్తి తమ తీర్పును చదవడం మొదలుపెట్టారు.
"నువ్వు చేసిన పని చాలా పెద్ద నేరం. ఇది ఐ. పి. సి. 302 (హత్య) సెక్షన్ కిందకి వస్తుంది. అంతేకాకుండా, సంఘటన తర్వాత సాక్ష్యాలను దాచడానికి ప్రయత్నించినందుకు ఐ. పి. సి. 201 కింద కూడా నీకు శిక్ష పడుతుంది. నీకు జీవిత ఖైదు విధిస్తున్నాను. "
గది ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. అందరూ రవి వైపు చూస్తున్నారు. చివరిగా, న్యాయమూర్తి నెమ్మదిగా, లోతైన మాటలతో ఒక సందేశాన్ని ఇచ్చారు:
ఈ కేసులో స్పష్టంగా తేలింది ఒక్కటే. ఈ ఈర్ష్య మన కంటికి గాలిలా కనిపించదు, కానీ అది ఎంత ప్రమాదకరమైనదో మనం తెలుసుకోవాలి. అది ఒక్కసారి మనిషి మనసులోకి ప్రవేశిస్తే, తమ జీవితాలనే కాదు, పక్కవారి జీవితాలను కూడా అగ్నిలా కాల్చేస్తుంది. ఇతరుల ఎదుగుదలతో పోల్చుకుని, అసూయతో నిలబడే ఏ స్నేహ బంధమూ, ఏ కుటుంబ బంధమూ ఎక్కువ కాలం నిలవదు.
మనసులో పెరిగే ఈ హీనభావం చివరికి మనుషుల విచక్షణను కోల్పోయేలా చేసి, నిస్సహాయుల ప్రాణాలను తీసేంతటి ఘోరానికి దారి తీస్తుంది. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. "
స్నేహం అనేది చాలా సున్నితమైనది. దాన్ని నిలబెట్టేది గౌరవం మరియు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం.
దానిని నాశనం చేసేవి – పోలికలు, ఈర్ష్య, చిన్నతనంగా భావించుకోవడం.
రవి సురేష్‌ను చంపలేదు. తన మనసులో ఏళ్లుగా పెంచుకున్న బాధను, హీనభావాన్ని చంపుకోవడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ప్రాణం పోయింది – స్నేహం పోయింది – జీవితం పోయింది.
***
Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/pratap

నేను వృత్తిరీత్యా ఒక సివిల్ ఇంజనీర్ అయినప్పటికీ, నా నిజమైన ఆసక్తి, నా జీవనసారం సాహిత్యానికే అంకితం. తెలుగు పుస్తకాల సువాసన నా జీవితంలో 1984 నుంచే పరిమళించింది. అప్పటి నుంచి పఠనం నా అలవాటుగా కాక, నా జీవనశైలిగా మారింది. పుస్తకాలు నా మనసును తీర్చిదిద్దాయి, ఆ పఠనమే క్రమంగా రచనగా రూపాంతరం చెందింది. ఆలోచనల రూపం, అనుభవాల ప్రతిబింబం, హృదయానికి స్వరం — అదే నా రచన.
ఆధ్యాత్మికత, మానవ సంబంధాల లోతులు, సామాజిక స్పృహ, ప్రజాసేవ పట్ల నాలో ఉన్న మమకారం ప్రతి రచనలోనూ ప్రతిఫలిస్తుంది. నేను రాసే ప్రతి వాక్యం పాఠకునితో చేసే ఒక మౌన సంభాషణ. నా కలం కేవలం అక్షరాలు కాదు; అది జీవనాన్ని గ్రహించే ఒక మార్గం.
ఇప్పటివరకు నేను రచించినవి రెండు వందలకుపైగా కథలు, ఐదు నవలలు, రెండు వేల వ్యాసాలు. ఇవి పలు దిన, వార, మాస పత్రికలలో, అలాగే డిజిటల్ వేదికలలో వెలువడి విభిన్న వయస్సుల పాఠకులను చేరాయి. ప్రతి రచన నా అనుభవాల సారాన్ని పాఠకుని మనసుతో కలిపే ఒక మాధ్యమంగా నిలిచింది.
సాహిత్యం నాకు హాబీ కాదు — అది నా జీవిత యానం. కొత్త ఆలోచనలను అన్వేషించడం, తెలుగు భాషా సౌందర్యాన్ని కొత్త రూపాల్లో వ్యక్తపరచడం, సమాజానికి ఉపయోగపడే మార్గాలను వెతకడం — ఇవే నా సాహిత్య సాధనకు మూలాధారం. రచన ద్వారా మనసులను మేల్కొలపడం, మనసుల్లో విలువల జ్యోతిని వెలిగించడం నా నిశ్చయం.
ఇటీవల నా కృషికి గాను ఒక ప్రముఖ సంస్థ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం నా జీవితంలో ఒక విశిష్ట ఘట్టం. అది కేవలం గుర్తింపే కాదు, మరింత బాధ్యతను జోడించిన ప్రేరణ.
మన పురాణాలు, ఉపనిషత్తులు, వేద వాక్యాలలో దాగి ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధునిక పాఠకులకు అందించడం, వాటి సారాన్ని సమాజానికి చేరవేయడం నా సాహిత్య లక్ష్యం. ఆ దిశగా ప్రతి రచన ఒక నూతన యత్నం, ఒక అంతర్ముఖ ప్రయాణం.
సాహిత్యం నా కోసం కేవలం అభిరుచి కాదు; అది నా ఆత్మ స్వరూపం. నా కలం నా ఆలోచనలకు శ్వాస, నా రచన నా జీవితయానం




Comments