top of page
Original_edited.jpg

మార్గం

  • Writer: Srinivasarao Jeedigunta
    Srinivasarao Jeedigunta
  • Nov 5
  • 5 min read

#Margam, #మార్గం, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Margam - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 05/11/2025

మార్గం - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

“ఏమిటి పద్మా ఆలా వున్నావు,, మీ మామగారు ఏమన్నా అన్నారా” అన్నాడు శ్రీకాంత్ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి షూస్ విప్పుకుంటో.


“ప్రత్యేకంగా అడగటం ఎందుకు, అత్తయ్యగారు సద్దుకుంటారు కాని మీ నాన్న.. బాబోయ్. ప్రతిదీ పట్టించుకుంటారు. దానితో గొడవ మొదలు అవుతుంది. సరే ఇది అలవాటైయ్యింది, అసలు గొడవ యిప్పుడే మొదలు అయ్యింది, మీ అమ్మగారు యింకా మెలుకువగా వున్నారు తరువాత చెప్తాను” అంది.


అప్పుడే వాకింగ్ చేసి లోపలికి వచ్చిన సుధాకర్ “ఎప్పుడు వచ్చావురా” అన్నాడు కొడుకుని. 


“పావుగంట అయ్యింది నాన్నా, వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకుని రండి, మొహం అంతా చెమటలు” అన్నాడు శ్రీకాంత్ తండ్రితో. 


భర్త వచ్చినట్టు గ్రహించి తన గదిలోనుంచి బయటకు వచ్చిన సుధాకర్ భార్య సుగుణ  “ఎందుకండి అంత సేపు వాకింగ్, మీరు ఏమి బాలాకుమారుడు కాదు, త్వరగా స్నానం చేసి రండి” అంది.


“అమ్మాయి.. రాత్రికి టిఫిన్ ఏమిటి నాకు” అని కోడలిని అడిగాడు. 


పులకాలు, ఉదయం టొమోటో పప్పు వుంది” అంది పద్మ.


“దోశ పిండి వుంటే రెండు దోశలు, కొద్దిగా దోసఆవకాయ వేసి పెట్టు, పుల్కాలు తినలేను నేను” అన్నాడు.  


“రాత్రి పడుకునే ముందు సుధాకర్ భార్య అంది, “ఏది వుంటే అది తినకుండా నాకు యిదే కావాలి అని అంటం బాగుందా చెప్పండి. వాళ్లకు చిరాకు తెప్పించే దాకా మీరు మారరా” అంది.


“నేను ఏమన్నాను, పుల్కాలు అంటే నాకు చిరాకు, రెండు దోశలు కూడా వేసి పెట్టలేకపోతే మన బ్రతుకు మనము బ్రతుకుతో వుంటే రా రమ్మని పిలవడం ఎందుకు, సరేలే నువ్వు చెప్పింది నిజమే, కొన్నాళ్ళు పిల్లాడితో ఉందాం అనుకున్నప్పుడు వాళ్ళు తినేదే తినటం అలవాటు చేసుకోవాలి” అన్నాడు.


అర్ధరాత్రి మెలుకువ వచ్చి లేచి బాత్రూం కి వెళ్దాం అని హాలులోకి వచ్చాడు.  కొడుకు గదిలోనుంచి మాటలు వినిపించడం తో వినటం మర్యాద కాదు అనుకున్నా విషయం తన గురించి అయినట్టు ఉండటం తో ఒక్కక్షణం ఆగాడు.  


కోడలు పద్మ అంటోంది “అత్తయ్య గారు మామయ్యగారు యిక్కడే ఉండిపోవడం తో మా అమ్మా నాన్న రావడానికి వీలు లేకుండా పోయింది. నా తల్లిదండ్రులు కూడా నాతో కొన్నాళ్ళు ఉండాలి అనే కోరిక నాకు ఉంటుంది కదా” అంది 


“చూడు.. ముందు నువ్వు ఒక్కటి గ్రహించాలి. మా అమ్మా నాన్న గెస్టులు కాదు. ఈ ఇంటికి యజమాని మా నాన్న. ఆ తరువాతే నేను, నువ్వు. అలా అని మీ అమ్మగారు నాన్నగారు రాకూడదు అని అసలు మనసులో కూడా వుండదు. వాళ్ళు రావాలి అంటే రమ్మను, నేను కూడా పిలుస్తాను” అన్నాడు శ్రీకాంత్. 


“వున్న రెండు గదులలో ఒకటి అత్తయ్యా మామయ్యగారు, ఒక్కటి మనము, యిహ మిగిలింది హాలు. మా వాళ్ళని హలులో పడుకోమనలేను, మీ అమ్మా నాన్నని వాళ్ళ గది మా వాళ్ళకి ఇమ్మన లేను’ అంది పద్మ.


“దానికి ఎందుకు అంత వర్రీ అవుతావు, మీ అమ్మా నాన్నలకి మన గది యిద్దాం, మనం హలులో పడుకుందాం, సమస్య తీరిపోతుంది” అన్నాడు. 


“చూడండి.. మా పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు వచ్చి కొన్నాళ్ళు ఉండాలి అనుకుంటారు. వాళ్ళకీ వృద్ధాప్యం వచ్చింది. ఒంటరిగా ఉండలేక పోతున్నారు, ఆలా అని అత్తయ్యా మామయ్యగారు యిక్కడే వున్నంతవరకు మా నాన్నా వాళ్ళు రావడానికి బిడియ పడతారు” అంది. 


“చూడు.. కావాలంటే యింకో రూమ్ వున్న యిల్లు తీసుకుందాం. అప్పుడు మామయ్యగారు అత్తయ్య గారు మనతోనే ఉండవచ్చు. మా నాన్నకి కూడా కాలక్షేపం అవుతుంది, యింతకంటే వేరే మార్గం లేదు. యిహ ఈ విషయం ఆలోచించక పడుకో” అన్నాడు శ్రీకాంత్.


కొడుకు కోడలు మాటలు విన్నతరువాత ఎందుకు బయటకు వచ్చానో మర్చిపోయి తన గదిలోకి వెళ్లి మంచం మీద కూర్చున్నాడు.  


“వచ్చారా. చాలా సేపైంది బాత్రూం లో పడ్డారా అని అనుమానం వచ్చి లేస్తున్నాను” అంది సుగుణ.  


“పడ్డ దానికంటే పెద్ద సమస్య వచ్చింది యిప్పుడు” అంటూ తను విన్నది  భార్యకి చెప్పాడు.   


“నిజమే మరి, ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడవు అని మనం యిక్కడే వున్నంతవరకు వాళ్ళు రాలేరు. ఒక్క ఆడపిల్లను కన్న తల్లిదండ్రులకి ఈ పరిస్థితి తప్పదు. మొండికెత్తి వాళ్ళు కూడా మనతో కలిసి ఉండాలి అంది. మీరేమనుకుంటున్నారు” అని భర్తని అడిగింది.


“నా మనసులో చాలా రోజుల నుంచి ఈ విషయం మీద ఒక ఆలోచన వుంది. నిజాయితీగా ఆలోచిస్తే మన కోడలు కూడా చంద్రయ్య గారికి ఒక్క సంతానం.. వాళ్ళు కూడా కూతురుని ప్రేమగా పెంచుకున్నారు. 


వయసులో వున్నంతవరకు ‘మనకి వున్నది ఒక్క సంతానమే, అదికూడా ఆడపిల్ల, రేపు పెళ్ళి అయ్యి వెళ్ళిపోతే మనం వృద్ధాప్యం లో ఎక్కడ ఉంటాము? అందుకే యింకొకరిని కంటే మనం పెంచగల స్థోమత వుంది కదా అని ఆలోచన చెయ్యకుండా, వయసు మీద పడగానే అయ్యో కూతురు దగ్గర ఉందాం అనుకుంటే అక్కడ కూతురు మామగారు అత్తగారు వుంటున్నారు. మనం యిలా ఒంటరిగా బ్రతకాలిసిందేనా’ అని బాధ పడటం సహజం.


జీవితం ముందు ఎలా ఉండాలి అనేది నిర్ణయం చేసుకోకుండా ఉండటం వల్ల చివరికి మిగిలేది ఈ ప్రశ్న.   మూడువేల జీతంతో నలుగురిని కని పోషించిన రోజులు చూసాము, మరి యిప్పుడు లక్షలు జీతంతో ఒక్కళ్ళని కని వీళ్ళని బాగా పెంచుకోగలిగితే చాలు అనుకుంటున్నాము. పచ్చిగా చెప్పాలి అంటే భార్య భర్తల మధ్యలో సరైన ప్లానింగ్ లేకపోవడమే ఈ సమస్య కి కారణం.    


వృద్ధాప్యంలో తప్పనిసరిగా కొడుకో కూతురో చేయూత అవసరం. అందుకే నేను అనుకునేది ఏమిటంటే ఏడాది లో ఒక నాలుగు నెలలు మనం విశాఖపట్నం లో మన యింట్లో ఉందాం. ఆ నాలుగు నెలలు మన వియ్యంకులు, వాళ్ళు కూతురు అల్లుడు దగ్గర వుంటారు.


ఆ తరువాత వాళ్ళు తిరిగి హైదరాబాద్ వచ్చిన తరువాత మనం వెళ్దాం. అదృష్టం కొద్దీ మన కొడుకు కోడలు కూడా మంచి వాళ్ళు కాబట్టి మన ప్లాన్ ని అర్థంచేసుకోగలరు. 


ఇహ ప్రాణం మీదకి వస్తే అప్పుడు ఎలాగో ఉండేది హాస్పిటల్ లోనే కదా, ఎక్కువ రోజులు ఉండేది కూడా ఉండదు, ఆ కొద్ది రోజులు ఏదో విధంగా జరుగుతుంది” అన్నాడు సుధాకర్.  


“సరే, రేపే ఈ విషయం మాట్లాడితే వాళ్ళ మాటలు విన్నారు అనుకుంటారు అసహ్యంగా. ఒక నాలుగు రోజులు ఆగి కొడుకు కోడలుని ఇద్దరిని కూర్చోపెట్టి నచ్చచెప్పండి” అంది సుగుణ.


ఒక ఆదివారం పెసరట్టు ఉప్మా తింటున్న కొడుకు దగ్గరికి వచ్చి సుధాకర్ కోడలిని కూడా పిలిచాడు.   


“నేను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను. అది మీ ఇద్దరికి చెప్పాలి అని పిలిచాను” అన్నాడు.  


“పెసరట్టు సుఖంగా తిననియ్యండి డాడీ, మీరు ఏది చెప్పినా యిబ్బంది విషయాలు చెప్తారు” అన్నాడు నవ్వుతూ కొడుకు శ్రీకాంత్.


“పెసరట్టు తింటో వింటే బాగుంటుంది. అందుకే ముందు చెప్పేది వినండి.  మేము.. అంటే నేను అమ్మా అరవై ఏళ్ళ నుంచి విశాఖపట్నం లో ఉంటున్నాము. ఈ రెండేళ్ల నుంచి నీతో పాటు కేరళ వచ్చేసాము. మాకు ఎందుకో విశాఖపట్నం ని పూర్తిగా వదిలేసి యిక్కడే ఉండటం యిష్టం లేదు. యిహ రెండవది. నీ భార్య మీ మామా అత్తలకి ఒక్కత్తె కూతురు. వాళ్ళు కూడా హైదరాబాద్ లో బిక్కు బిక్కుమంటో వుంటున్నారు. మీ దగ్గరికి వచ్చి ఉందాం అనుకుంటే మేము యిక్కడే వుంటున్నాము, ఆలా అని వాళ్ళు మేము కలిసి ఉండాలి అన్నా యిబ్బంది ఉంటుంది. అందుకే ఏడాది లో వింటర్ లో ఒక నాలుగు నెలలు మేము విశాఖపట్నం మన యింట్లో ఉండి మా అన్నదమ్ముల ఇళ్ళు తిరుగుతో, పొలం రైతులతో కౌలు గురించి మాట్లాడుకుంటాము.


ఆ నాలుగు నెలలు మీ అత్తగారిని మామగారిని మీ దగ్గరికి పిలిపించుకో. దానితో వాళ్ళకి కూడా కూతురు దగ్గర ఉన్నట్టు ఉంటుంది.  ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎవ్వరైనా హాస్పిటల్ లో ఉండాలిసిందే. అదికూడా ఎక్కువ టైము వుండరు” అన్నాడు.   


కోడలు వంక చూసి “నువ్వు మీ నాన్నగారితో మాట్లాడు, వాళ్ళు ఏ నాలుగు నెలలు మీ దగ్గరికి రావడానికి ఇష్ట పడతారో తెలుసుకో” అన్నాడు సుధాకర్.


“ఏదో ఫిట్టింగ్ పెట్టకుండా వుండరు డాడీ మీరు, వాళ్ళు వస్తే మీరు ఎందుకు వెళ్లడం” అన్నాడు కొడుకు.


“ఇప్పటికే నీకు మా వల్ల ఒక్కొక్కసారి విసుగు వస్తోంది. ఇహ మేము వాళ్ళు కూడా వుంటే ముందు రెండు రోజులు బాగున్నా తరువాత నరకం కనిపిస్తుంది. అందుకే నేను సరైన మార్గం కనిపెట్టాను.” అన్నాడు సుధాకర్.


“మరి మీలా ఆలోచించకుండా కొడుకు దగ్గర మేమే ఉండాలి అనుకునే వాళ్ళు వుంటే అప్పుడు ఎలా” అన్నాడు.   


చిన్న చిరునవ్వు నవ్వి, “ఏ తల్లిదండ్రులయినా ఒక్క కూతురునో, కొడుకునో కని తరువాత మాకు పిల్లలు అక్కర్లేదు అనుకున్న రోజే వాళ్ళ కోసం సీనియర్ సిటిజెన్ హోమ్స్ వున్నాయి అని బాగా తెలుసుకునే  ఆ నిర్ణయం తీసుకుంటారు” అన్నాడు.


“ఏమైనా మా అదృష్టం కొడుకు కోడలు, అల్లుడు కూతురు మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు, అందుకే కోడలి కి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కొన్నాళ్ళు సేవ చేసుకోవడానికి అవకాశం యివ్వాలి అని నా నిర్ణయం. అదే విధంగా ప్రతీ వాళ్ళు ఆలోచిస్తే అందరూ సుఖంగా వుంటారు” అన్నాడు కోడలు యిచ్చిన పెసరట్టు ఉప్మా ప్లేట్ అందుకుంటూ.


     శుభం      

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ree


ree


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page