top of page
Original_edited.jpg

మానవ గ్రహణం

  • Writer: Sairam Allu
    Sairam Allu
  • Nov 6
  • 7 min read

#AlluSairam, #అల్లుసాయిరాం, #ManavaGrahanam, #మానవగ్రహణం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Manava Grahanam - New Telugu Story Written By Allu Sairam

Published In manatelugukathalu.com On 06/11/2025

మానవ గ్రహణం - తెలుగు కథ

రచన: అల్లు సాయిరాం

శ్రీకాంత్, శ్రావణి లు తాము కొత్తగా తీసుకున్న త్రిబుల్ బెడ్రూం ప్లాట్ లో గృహప్రవేశం చేస్తూ, శ్రావణమాసంలో తెల్లవారుజామున శ్రీ సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. బంధువులు, స్నేహితులు రావడంతో యిల్లంతా సందడిగా ఉంది. పూజ క్రతువు ముగిసింది. ప్రసాదం అందరూ తీసుకున్నారు. మధ్యాహ్న విందు భోజనాలకి అన్ని సిద్ధం చేస్తున్నారు. 


శ్రీకాంత్ ఆఫీసు కొలీగ్స్, స్నేహితులు వస్తుంటే, శ్రీకాంత్, శ్రావణి లు వచ్చినవారందర్ని పలకరిస్తూ, ఆహ్వానిస్తున్నారు. కొలీగ్స్ అంతా ప్లాట్ ఇంటీరియర్ డిజైనింగ్ చూస్తూ “ప్లాట్ బాగుంది మామ!” అని, “ఏదైనా మీరు రిచ్ కిడ్స్!” అని శ్రీకాంత్ తో జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. 


దిలీప్ నవ్వుతూ “అవును మామ! అన్ని విషయాలు చెక్ చేసి ప్లాట్ కొన్నానన్నావు. మన సూపర్వైజర్ 2జిమూర్తి కూడా ఇదే అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు. అది చెక్ చెయ్యలేదా!” అని అంటే, పక్కనున్న రాజేష్ “ఏంటి నిజమా! 2జి మూర్తి అపార్ట్మెంటా! ముందే చెప్పాలి కదా!” అని అంటే అందరూ నవ్వుతున్నారు. 


 “బ్రదర్! చాలారోజుల నుంచి ఒక డౌట్. ఆయనని అసలు 2జి మూర్తి అని ఎందుకు అంటారు?” అని నవ్వుతూ సతీష్ అడిగితే, దిలీప్ నవ్వుతూ “సతీష్! నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కదా. అందుకే, నీకు తెలియదేమో.. అదొక పెద్ద చరిత్ర! ఆయన పూర్తి పేరు జి. గణేష్ మూర్తి అంటే జి. జి. మూర్తి. అదే 2జి. 


ఆ పేరుకి తగ్గట్టుగానే 2జి కీప్యాడ్ ఫోన్ వాడుతుంటాడు. ఆ కీప్యాడ్ ఫోన్ కి మెడలో పెద్ద ట్యాగ్ వేసుకుంటాడు. నో వాట్సాప్. నో మెయిల్స్. ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ అయినా, అర్జంట్ ఫైల్ అయినా ప్రింట్లు తీసి యివ్వమని చెప్తాడు. అందుకే 2జి మూర్తి అని అంటారు!” అని చెప్తుంటే అందరూ నవ్వుతున్నారు. 


రాజేష్ నవ్వుతూ “మొన్న అర్జంట్ మీటింగ్ అంటే, పైల్స్ వాట్సాప్, మెయిల్ చేస్తానని చెప్పాను.. కానీ, ప్రింట్లు తీయ్యమని బుర్ర తిన్నాడురా బాబు. కంపేనీ సిఇవో వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్లో డైరెక్ట్ గా 2జి మూర్తిని అడిగేశాడు. ‘మీటింగ్ అప్డేట్స్ ఫాలో అవ్వట్లేదు. ఎందుకు వాట్సాప్ వాడట్లేదంట. స్మార్ట్ ఫోన్ లేదంట. మన కంపేనీ తరఫున ఏర్పాటు చెయ్యమంటావా’ అని అడిగినప్పుడు మూర్తి ముఖం చూడాలి!” అని పగలబడి నవ్వుతూ చెప్తున్నాడు.


 వినోద్ నవ్వు ఆపుకుంటూ “మూర్తిగారు అటువంటి ఎన్నో చూసేశారు. కానీ, ఏమాటకామాటే చెప్పుకోవాలి. టాలెంట్, సబ్జెక్టు పరంగా మంచి టాలెంటెడ్. మూర్తిగారు సార్, మూర్తిగారు అంతే!” అని చెప్తుంటే అందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. అదే సమయంలో మూర్తి, తన భార్యతో సహా లంచ్ చెయ్యడానికి వస్తుండడం చూసి “అందరికి కాసేపు సిగ్నల్స్ ఉండవు. 2జి వస్తుంది. ఆయన నడక కూడా 2జి లాగే ఉంటుందిరా బాబు!” అని అందరూ నవ్వు ఆపుకుంటూ, మూర్తికి “హాయ్ సార్!” అని విషెస్ చేస్తున్నారు. 


మూర్తి నవ్వుతూ “యు బోయ్స్ క్యారీ ఆన్! లంచ్ అయిపోయాక, అందరూ మాయింటికి రండి! శ్రీకాంత్.. అందరిని తీసుకుని రా!” అని చెప్పి, ఫ్యామిలీతో వెళ్ళి లంచ్ చేస్తున్నారు. ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ అందరూ విందు చేశారు. 


 రాజేష్ ఆశ్చర్యంగా “అవును మామ! మీరంటే రిచ్ కిడ్స్. ఇద్దరూ జాబ్ చేస్తున్నారు. లైఫ్ ఎంజాయ్ చెయ్యడానికి, యింత రిచ్ ఏరియాలో ప్లాట్ తీసుకున్నారు. మరి, పొదుపుకి మారుపేరైన మూర్తి ఎప్పటినుంచో ఎలా ఉంటున్నారు?” అని అడిగాడు. 


శ్రీకాంత్ నవ్వుతూ “ఈ ఫ్లాట్ అన్నివిధాలా మాకు బాగుంటుందని చెప్పింది అయనే! ఆయనతో మాట్లాడితే తెలుస్తుంది. ఆయన ఆలోచనా విధానం 2జి కాదురా, 10జి లాగా ఉంటుంది. ఎంజాయ్ చెయ్యడమంటే, రోజులో సగం సమయం ఆఫీసుల్లో ఒత్తిడిలు మధ్యన వర్క్ చెయ్యడం, విందులు, వినోదాలు కాదు, జీవితాన్ని ఆస్వాదించడం. 


ఇక పొదుపు విషయమంటావా, అది పొదుపు కాదు, జాగ్రత్త!” అని అంటే, దిలీప్ నవ్వుతూ “గాలి ప్రభావం. ఇంకా ఈ ఏరియాలోకి పూర్తిగా రాలేదు.‌ అప్పుడే ఈ గాలి, నీరు నిన్ను మార్చేసింది. నీ ఫ్యూచర్ నాకు అర్ధమైపోతుంది మామ. ఇప్పుడు ఆయనని చూసి ప్లాట్ కొన్నానంటున్నావు. తర్వాత ఆయనలా ఈ స్మార్ట్ ఫోన్లు పక్కన పారేసి, చిన్న కీప్యాడ్ ఫోన్ కొనుక్కుంటావేమో?” అని అంటే, శ్రీకాంత్ నవ్వుతూ “ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానురా!” అని అన్నాడు. 


సతీష్ నవ్వుతూ శ్రావణితో “అమ్మా శ్రావణి! పూర్తిగా 2జిమూర్తిలా మారిన నీ భర్త శ్రీకాంత్ ని చూడు!” అని అంటే, శ్రావణి “నాకు చిన్న మొబైల్ వాడాలనిస్తుందిరా అన్నయ్య!” అని అంటే, “సరిపోయింది!” అని అనుకున్నారంతా. 


“మీకు క్లారిటీ రావాలంటే, మూర్తి సార్ యింటికి వెళ్దాం పదండి!” అని శ్రీకాంత్ అందరిని చూసి అంటే, “ఏంటి బాబు! మూర్తిగారింటికా! ఆఫీసులో ఆయన్ని చూసింది చాలు. మేం రాం రా బాబు!” అని అందరూ బయలుదేరుతుంటే, “సరే! మీ యిష్టం. ఆయన మీకు రమ్మని చెప్పారు. 


నాకు అందరిని తీసుకురమ్మని చెప్పారు. రాకపోతే ఆఫీసులో ఉంటుంది మరి!” అని చెప్తే, అందరూ ఆలోచనలో పడ్డారు. 


“పదండి! ఇలా వెళ్లి అలా వచ్చేద్దాం!” అని చెప్తూ శ్రావణి ఒకపక్క, శ్రీకాంత్ ఒకపక్క అందరిని తీసుకుని మూర్తిగారి గారు ప్లాట్ వైపు వెళ్లారు. 


 మూర్తిగారి ప్లాట్ దగ్గరికి వెళ్లి కాలింగ్ బెల్ కొడితే, మూర్తి డోర్ ఓపెన్ చేసి, అందర్ని చూసి ఆనందంగా “రండి! రండి! నేను ఎప్పటినుంచో మీ అందరిని పిలుద్దామనుకుంటున్నాను. కుదరలేదు. ఈరోజు శ్రీకాంత్, శ్రావణి ల పుణ్యమా అని మా యింట్లో అడుగుపెడుతున్నారు! రండి. కూర్చోండి!” అని ఆహ్వానిస్తుంటే, మూర్తి కొత్తగా కనిపిస్తున్నాడు. 


ఇంట్లోపల ఫర్నిచర్, ఇంటీరియర్స్ అన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు శ్రీకాంత్ చెప్పిన మాటలు నిజమే అనిపించాయి. మూర్తిగారి భార్య సునంద అందరికి డ్రింక్స్, స్నాక్స్ తీసుకొచ్చి యిచ్చింది. 


“శ్రీకాంత్! శ్రావణి! అంతా ప్రశాంతంగా జరిగిందా?” అని అడిగితే, “మొదట్లో మేమిద్దరం టెన్షన్ పడ్డాం కానీ, మీరు, మేడం యిచ్చిన సపోర్ట్ తో అంతా బాగా జరిగింది సార్!” అని యిద్దరూ నవ్వుతూ చెప్పారు. 


“మీరు పెళ్లి చేసుకుని, గృహప్రవేశాలు చేసేశారు. మిగతావాళ్ళకి కూడా కొంచెం సంబంధాలు చూడవయ్యా!” అని మూర్తి నవ్వుతూ అంటే, శ్రీకాంత్ నవ్వుతూ “అందరూ రెడీగా ఉన్నారు సార్!” అని అన్నాడు. 


సతీష్, దిలీప్, రాజేష్ ఎవరు ఏం మాట్లాడకుండా, సరే వెళ్ళిపోదామన్నట్టుగా శ్రీకాంత్ కి సైగలు చేస్తున్నారు. 

 టేబుల్ మీద ఉన్న పేపర్లు చూపిస్తూ “సార్ అవి ప్రాజెక్ట్ పేపర్లా!” అని శ్రీకాంత్ అడిగితే, మూర్తి పేపర్లు చూస్తూ “ఆఁ రేపు మీటింగ్ ఉంది కదా!” అని అంటే, “సార్! మీరు ఏమనుకోకపోతే ఒక డౌట్ అడగొచ్చా?” అని అడిగితే, “అడుగు శ్రీకాంత్!” అని మూర్తి చెప్తుంటే, మిగతా ఫ్రెండ్స్ అడగొద్దురా అని సైగలు చేస్తున్నారు. 

శ్రీకాంత్ “ఈరోజుల్లో అందరూ స్మార్ట్‌ఫోన్లలోనే ఉంటున్నారు. సోషల్ మీడియా, వాట్సాప్, యూట్యూబ్ లేకుండా ఒకరోజు గడపలేరు. మీరు మాత్రం యింకా పాత కీప్యాడ్ ఫోన్ వాడుతున్నారు. ఆఫీసుకి అవసరమైన ప్రాజెక్టు ఫైల్స్ కి కూడా వాడట్లేదు. నిజంగా ఎలా సాధ్యమవుతుంది?” అని అడిగేసరికి మూర్తి ఎలా స్పందిస్తారో అని అందరూ కంగారుపడుతుంటే, 


మూర్తి సీరియస్ గా “మీతో 2జిమూర్తి అని పిలిపించుకోవడానికి!” అని అనేసరికి, అనవసరంగా వచ్చాం అని ఫ్రెండ్స్ భయపడుతున్నారు. 


మూర్తి నవ్వుతూ తన ముందున్న ఒక డెస్క్ లోపల ఉన్న ఒక బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తే, అందులో పాత రెండు యాపిల్ మొబైల్స్, ఆండ్రాయిడ్ మొబైల్స్, చార్జర్స్ చూపిస్తూ “సరదాగా అన్నాను. అయినా, ఎవరు చెప్పారు మేం స్మార్ట్ ఫోన్లు వాడమని. ఒకటేంటి, రెండేసి స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్ళం!” అని అంటే, అందరికీ ఆశ్చర్యంగా అనిపించి “మరి ఎందుకు వదిలేశారు సార్!” అని అందరూ ఒకేసారి అడిగారు. 


మూర్తి నవ్వుతూ “అసలు మొబైల్ ని తయారుచేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి చెప్పండి!” అని అడిగితే, శ్రీకాంత్ “ఫోన్ కాల్స్!” అని, సతీష్ “మెసేజ్లు” అని, దిలీప్ “వీడియో కాల్స్” అని, రాజేష్ “మొబైల్ పేమెంట్స్” అని ఒక్కొక్కరు చెప్తుంటే, మూర్తి నవ్వుతూ “అవన్ని మొబైల్ ఫీచర్లు అయ్యా! మొబైల్ తాలూకా ముఖ్య ఉద్దేశమేంటంటే, కమ్యూనికేషన్. 


పూర్వం మనిషికి మనిషికి మధ్యన కమ్యూనికేషన్ కోసం పావురాల ద్వారా పంపించేవారు. మనుషుల్ని పంపించేవారు. ఉత్తరాలు పంపించేవారు. ల్యాండ్ లైన్ ఫోన్లు, తర్వాత మొబైల్స్ వచ్చాయి. ప్రస్తుతం మనం ఫోన్ కాల్స్ కంటే, మిగతా వాటికే ఎక్కువగా వాడుతున్నాం. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో రావడం, రీల్స్, స్టేటస్లు, వీడియోలు, ఫోటోలు ఏదోకటి షేర్ చేయడం, కామెంట్ చేయడం, కామెంట్ చేయకపోతే ఫీల్ అవ్వడము, సగము జీవితం అనేది ఇందులోనే గడిచిపోతుంది. పాపం, ఏం తెలియని ఈతరం పిల్లలు రోజురోజుకీ ఒక్కోరూపంలో మారుతున్న టెక్నాలజీకి పూర్తిగా బానిసలు అయిపోతున్నారు. 


తర్వాత తరం చాలా ప్రమాదంలో ఉంది. రోజులో మనం గడుపుతున్న ఫ్యామిలీ టైం కంటే, టెక్నాలజీ స్క్రీన్ టైం ఎక్కువైయిపోతుంది!” అని చెప్తుంటే, అందరూ ఆశ్చర్యాసక్తిగా చూసేసరికి “అర్ధమైంది! ఇంకా వివరంగా చెప్తాను!” అని కొంచెం నీళ్ళు తాగుతూ అంటూ, సునంద వైపు చూస్తే, సరే నేను చెప్తానన్నట్టుగా సైగ చేసింది. 


 సునంద తన కొడుకు ఫోటో చూపిస్తూ “మా కొడుకు ఏడేళ్లు వయసున్నప్పుడు, అంటే పదకొండు సంవత్సరాల క్రితం అని మాట. ఒకరోజు వచ్చి తను అమ్మ నాకు దగ్గరున్న బుక్ సరిగ్గా కనిపించట్లేదని చెప్తే, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, కళ్లద్దాలు పడతాయని చెప్పారు. 

మేం షాకయ్యి “దీనికి కారణం ఏమవచ్చు అని అడిగితే, డాక్టర్ సూటిగా ఒకటే క్వశ్చన్ అడిగారు. బాబు మొబైల్ ఎక్కువగా చూస్తున్నాడా అని! అప్పట్లో మా యిద్దరికీ రెండేసి మొబైల్స్ ఉండడంవల్ల, ఏదో పనుల్లో బిజీగా ఉంటే, మా యిద్దరు పిల్లలు చెరో మొబైల్ తీసుకుని బాగా చూసుకుంటుండేవాళ్ళు. 


అదే విషయం డాక్టర్ కి చెప్తే, కోపంగా పిల్లల్ని చేతులారా పాడుచేసేస్తున్నారండి అని తిట్టి, మొబైల్ వాడకం మీద జరిపిన కొన్ని సర్వేలు గురించి చెప్పారు. మాకు యిప్పటికీ పంపిస్తుంటారు! 


ఈమధ్య వచ్చిన ఒక అంతర్జాతీయ సర్వేలో, ప్రపంచవ్యాప్తంగా పన్నెండు నుండి పదహారేళ్ళ పిల్లల్లో అరవై రెండు శాతం మంది రోజుకు ఆరు గంటలకు పైగా మొబైల్ స్క్రీన్ ముందు గడుపుతున్నారు. దీని వల్ల కళ్ళు బాగా అలిసిపోయి, చూపు బలహీనమవుతుంది. అందుకే, దాదాపు స్కూల్లో చదువుకున్న పిల్లల్లో సగం కంటే ఎక్కువమంది కళ్లద్దాలు వేసుకుంటూ వస్తున్నారు. 


వాళ్ళు ఏం పాపం చేశారో గాని, వాళ్ల జీవితం మొత్తం కళ్ళద్దాలతోనే బతకాల్సి ఉంటుంది. వాళ్ళకేంటి ఆ కర్మ, మనం చేసిన తప్పుకి వాళ్ళు ఎందుకు శిక్ష అనుభవించాలి! ముఖ్యంగా, తల్లిదండ్రులతో కుటుంబసభ్యులతో, స్నేహితులతో గడపాల్సిన సమయం మొబైల్ తో పోతుంది. దానివల్ల వాళ్లకి తల్లిదండ్రుల దగ్గర ఉండే ప్రేమలబంధం దొరకట్లేదు. 

కుటుంబసభ్యుల దగ్గర ఉండే ప్రేమ ఆప్యాయతలు రావట్లేదు. స్నేహితుల దగ్గర ఆడుకోకపోవడం వల్ల, స్నేహబంధం దొరకట్లేదు. ఆటలే తెలియకపోతే, ఆటలో గెలుపు, ఓటములు ఉంటాయని ఎలా తెలుస్తుంది, వాటిని ఎలా తట్టుకోవాలో ఎలా తెలుస్తుంది, పోటీతత్వం గురించి మాత్రం ఎలా తెలుస్తుంది. ఏయే లోపాలు, బలహీనతలు ఉన్నాయో వాళ్లతో పాటు పెరిగి పెరిగి అవి ఆత్మన్యూనతభావాలుగా మారిపోయి, ఏదైనా చిన్న సమస్య వస్తే, వాళ్లు దానికి ఏం చేయాలో తెలియక వెంటనే ఏదోక అఘాయిత్యాలు చేసేసుకుంటున్నారు. 


మనం ఒకసారి ఆలోచిద్దాం. మనం యింత బ్రతుకు బ్రతుకుతున్నది పిల్లల భవిష్యత్తు గురించే అని చెప్పుకుని తిరుగుతాం కదా. మరి పిల్లలకే మనం టైం కేటాయించినప్పుడు, ఏమి సంపాదించి యిస్తే మాత్రం ఏం లాభం?” అని అనర్గళంగా భావోద్వేగంతో మాట్లాడుతుంటే, వాస్తవాన్ని అంగీకరిస్తూ అందరూ మౌనంగా వింటున్నారు.

 

 దిలీప్ కంగారుగా “అంటే సార్! మీ పిల్లలు..!” అని అడిగితే, మూర్తి నవ్వుతూ “అటువంటిదేం కాదు. బాబు యిప్పుడు ఐఐటిలో చదువుతున్నాడు. కూతురు యూపిఎస్సి మొదటి అవకాశంలోనే పాసయ్యింది! ఈతరం పిల్లల గురించి ఆలోచన వస్తే, మా సునంద అలాగే బాధపడుతుంది! 


డాక్టర్ చెప్పినప్పుడు, మాకు విషయం అర్ధమైంది. ఎంటంటే, పిల్లలకి యివ్వవలిసింది స్క్రీన్ టైం కాదు.. మన టైం! మాయిద్దరం ఉద్యోగాలపరంగా కంపెనీలో టాప్ పొజిషన్లో ఉన్నాం. మొబైల్ లేకుండా ఎలా అని ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకలేదు. పిల్లలు మనం ఏం చెప్తే, అది చెయ్యరు. మనమేదైతే చేస్తామో, అది చూసి నేర్చుకుంటారు. 


మనం చేతిలో మొబైల్ చూస్తూ, వాళ్ళ చేతుల్లో చదవమని బుక్స్ పెడితే, వాళ్ళు చదవరు. అదే, మనం వాళ్ళ పక్కన కూర్చుని, ఏదైనా బుక్ మనం చదువుకుంటుంటే, పెద్దోళ్ళు చదువుకుంటున్నప్పుడు, నేను ఎందుకు చదవకూడదని వాళ్ళు చదువుతారు. అప్పుడు డిసైడ్ అయ్యాం. ఇద్దరం మొబైల్స్ పక్కన పెట్టేసి, ఈ కీప్యాడ్ మొబైల్స్ తీసుకున్నాం. 


ఎంత టైం మిగిలిందంటే, మా అమ్మాయిని ఎటువంటి కోచింగ్ లేకుండా మొదటి పరీక్షలోనే ఐఏఎస్ చేసేటంత! చిన్నవయసులోనే కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వస్తుందేమో అనుకున్న బాబు, ఇప్పుడు ఎటువంటి యిబ్బంది లేకుండా ఐఐటిలో చదువుకునేటంత! పిల్లలకి అనే కాదు, పెద్దోళ్ళకి అంతే. 


ఈకాలంలో మనిషికి, మనిషికి మధ్య చనువు ఉండట్లేదు. ఎందుకంటే అస్తమానం కంప్యూటర్లతో, మొబైల్స్ తో టైం గడుపుతూ, అయినవాళ్ళతో కూడా ఎప్పుడో అవసరానికి మాట్లాడుతుంటే, యింకెక్కడ చనువు ఉంటుంది. మీరు నన్ను 2జి మూర్తి అని నా గురించి మాట్లాడుతుంటారు. నేను యిప్పుడు అదే మాట నవ్వుతూ తిరిగి అడిగేసరికి, భయపడిపోతున్నారు. 

దాదాపు అందరం నాలుగైదు సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం. మరి మన మధ్యన ఎంత బాండింగ్ ఉండాలి. మరి ఎలా ఉంది? ఒకరి సమస్యను ఒకరు అర్థం చేసుకుంటే, అవసరానికి సాయం దొరుకుతుంది. ఆసరా దొరుకుతుంది! మొబైల్ ఒకటే కాదు. ప్రతి పనికి టెక్నాలజీతో మెషినరీలు పెరిగిపోయి, మనిషిని తన పని తను చేయనివ్వకుండా సుఖం అనే భయంకరమైన వ్యాధిని వ్యాపిస్తున్నాయి. 


పెద్దలు చెప్పినట్టుగా, ఒంటికి చెమట పట్టకపోతే ఆరోగ్యం ఉండదు. ఈరోజుల్లో చెమట ఎక్కడ పడుతుంది, ఆఫీసుల్లో ఏసీలు, ఇంట్లో ఏసీలు, తినేదంతా జంక్ ఫుడ్స్, యింకెక్కడ ఆరోగ్యం ఉంటుంది? అందుకే చిన్నాపెద్దా తేడాలేకుండా చిత్రవిచిత్రమైన రోగాలు వచ్చేస్తున్నాయి. మీరు మొత్తం ప్రాబ్లం మొత్తం ఒకసారి ఆలోచించి చూడండి. ఇదంతా టెక్నాలజీ వల్ల జరుగుతుంది. పంచభూతాల తర్వాత ఆరోభూతంగా టెక్నాలజీ తయారయ్యి, అది లేకపోతే మనం లేం అనే అంతలా తయారుచేస్తుంది. 


ఈ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఉండొచ్చు గాని, నష్టాలే ఎక్కువ ఉన్నాయి! ఈ ప్రకృతిని నాశనం చేయడానికి మనిషి పుడితే, ఆ మనిషిని నాశనం చేయడానికి టెక్నాలజీ పుట్టింది. సాంకేతికత మనకోసం పుట్టింది, కానీ మనం దానికి బానిసలమైతే, భవిష్యత్తు తరాలు చీకటిలో మునిగిపోతాయి. కంప్యూటర్ దగ్గర నుంచి లేటెస్టుగా ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ వరకు టెక్నాలజీ వీపరీతంగా పెరిగిపోయి, మానవత్వం విలువలు తగ్గించేసి, మానవ జాతిని గ్రహణంలా మింగేస్తుంది! 


నిప్పుని మనిషి కనిపెట్టాడు. కానీ, మనిషిని నిప్పు తగలబెట్టేయగలదు. టెక్నాలజీ కూడా నిప్పు లాంటిదే. నిలువునా నాశనం చేసేయగలదు!” అని కూలంకషంగా వివరిస్తుంటే, మూర్తిగారి గురించి ఏదో అనుకున్నాం కానీ, ఆయన వేరురా బాబు అని అందరూ అనుకుంటున్నారు. 


 మూర్తి ఆగి ఆలోచిస్తూ “సారీ! ఎక్కువగా క్లాస్ పీకుతున్నానా?” అని అడిగితే, దిలీప్ నవ్వుతూ “ఏం లేదు సార్! మీ ఫ్లాట్ పక్కన యింకేమైనా ఫ్లాట్లు ఖాళీగా ఉంటే, అడ్వాన్స్ గా మాకోసం ఉంచేయండి. మేమందరం పెళ్లిళ్లు చేసుకుని, యిక్కడ గృహప్రవేశం చేస్తాం! రేయ్ శ్రీకాంత్! మాకోసం కూడా కీప్యాడ్ మొబైల్స్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టు! కష్టమే కానీ, ట్రై చేద్దాం!” అని అంటే అందరూ నవ్వారు.


***

అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం


హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన

ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.

ఐదు బహుమతులు గెలుచుకున్నాను.


 


 



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page