అత్తగారి కథలు - 22: అహం
- LV Jaya

- 1 day ago
- 3 min read
అత్తగారి కథలు, అహం కథ, తెలుగు కుటుంబ కథ, అత్త కోడళ్ళ కథ, జాగృతి కథ, సమర్థ్ కథ, కుటుంబ సంబంధాలు, అహంకారం, తెలుగు కథలు, భావోద్వేగ కథ, కుటుంబ విలువలు, Mana Telugu Kathalu

Ahama - Telugu Emotional Family Story | L. V. Jaya
అహం - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ (అత్తగారి కథలు - పార్ట్ 22) | L. V. జయ
Published in manatelugukathalu.com on 01/07/2026
అహంకారం మనిషి చూపును మసకబారుస్తుంది. ప్రేమించాల్సిన వారినే తక్కువ చేసి చూసేలా చేస్తుంది. తన కొడుకే అందరిలో గొప్పవాడని భావించిన రాధ, కోడలు జాగృతి గురించి నిజం తెలుసుకున్న తర్వాత జీవితంలో మొదటిసారి తన అహంకారానికి ఎదురుదెబ్బ తగులుతుంది. కుటుంబ బంధాలు, ఆత్మగౌరవం, అహం మధ్య జరిగే భావోద్వేగ సంఘర్షణను ప్రతిబింబించే "అత్తగారి కథలు - 22: అహం" మీ కోసం.
తన కొడుకు సమర్థ్ బాగా చదువుకున్నాడని, మంచి ఉద్యోగం చేస్తున్నాడని, తనకన్నా, తన కుటుంబం కన్నా ఎవరూ ఎక్కువ కాదన్న గర్వం రాధకి ఉంది. సమర్థ్ కి, జాగృతికి పెళ్ళి జరుగున్నప్పటినుండి జాగృతిని, జాగృతి కుటుంబాన్ని కించపరుస్తూ, తక్కువచేస్తూ ఆనందించింది రాధ.
పెళ్ళి అయ్యాక, జాగృతితో కలిసి 10 రోజులు వేరే దేశం తిరిగి రావాలనుకుంటున్నానని రాధకి చెప్పాడు సమర్థ్.
"దీన్ని పెళ్లి చేసుకోవడమే ఎక్కువ. వేరే దేశం కూడా తిప్పుతావా? ఇంతకీ అది అడిగిందా? లేక నీకే అనిపించిందా వేరే దేశం వెళ్లాలని? అదే అడిగుంటుందిలే. తల్లితండ్రుల నుండి మొగుణ్ణి ఎలా వేరు చెయ్యాలి? ఎలా లొంగదీసుకోవాలో బాగా తెలుసు దీనికి." అంది రాధ కోపంగా జాగృతిని చూస్తూ. జాగృతి కళ్ళలో నీళ్లు తిరిగాయి.
"నాకే వెళ్ళాలనిపించిందమ్మా. జాగృతికి ఇంకా నేనీ విషయం చెప్పలేదు." అన్నాడు సమర్థ్.
"ఎలాగూ బెంగుళూరులో వేరే కాపురం పెడుతున్నారు కదా. ఇంకెందుకు వేరే దేశాలకి?" అంది రాధ.
"అమ్మా. అది వేరు. ఇది వేరు. మమ్మల్ని వెళ్ళనీ." అని రాధని బతిమాలాడు సమర్థ్.
"మా కాలంలో ఇలాంటివి ఏమి లేవు. మీ నాన్న నార్త్ లో ఎక్కడ ఉద్యోగం చేస్తే, అక్కడికి నన్ను తీసుకువెళ్లారు. ఎదో ఆ చుట్టుపక్కల ప్రదేశాలు చూసాను." అంది రాధ బాధగా.
'ఆ కాలంలో, సౌత్ లో ఉండేవాళ్ళకి నార్త్ లో ఉండడం, తిరగడమన్నది పెద్ద విషయమే కదా. ఈవిడ తన భర్తతో చక్కగా ఎంజాయ్ చేసి, మమ్మల్ని మాత్రం ఎక్కడికీ వెళ్ళదు అని చెప్తోందేమిటి?' అనుకుంది జాగృతి.
"పోనీ. మీ అక్క పావని అన్నా వేరే దేశం వెళ్ళిందా? పెళ్లయ్యాక వాళ్ళ ఆయనతో షిమ్లా వెళ్ళింది. అంతే." అంది రాధ కూతురి కష్టాలను గుర్తు చేసుకుంటూ.
'వదినకి కూడా పెళ్ళై చాలా సంవత్స్తరాలయ్యింది. ఆవిడ చిన్నప్పటినుండి అన్నీ తిరిగింది కదా. అందుకే వాళ్ళ ఆయన షిమ్లా తీసుకెళ్లి untaru. వీళ్ళు ఎక్కడికైనా తిరగచ్చు కానీ, సమర్థ్, నేను వెళ్తామంటేనే ఈవిడకి ప్రాబ్లెమ్ వస్తోంది.' అనుకుంది జాగృతి.
"అమ్మా. ఎక్కడికి వెళ్లలేదని బాధ పడుతున్నావ్ కదా. పోనీ మాతోపాటు నువ్వు కూడా రా. నిన్ను కూడా వేరే దేశం తీసుకువెళతాను." అన్నాడు సమర్థ్.
'హనీమూన్ కి వెళ్తూ, ఈవిడని కూడా రమ్మంటున్నారేమిటి? అసలు ఎం జరుగుతోంది?' అనుకుంది జాగృతి.
"నాకంత అదృష్టం లేదులే. నా బతుకు ఇక్కడే తెల్లారని. నేను రాను." అంది రాధ విసుగ్గా.
ఆ మాట కోసమే ఎదురుచూస్తునట్టున్న సమర్థ్ వెంటనే, "అయితే మమ్మల్ని వెళ్ళనిస్తున్నావన్నమాట." అన్నాడు నవ్వుతూ.
తనకి, తన కూతురికి దక్కనిది కోడలికి దక్కడం ఇష్టంలేదు రాధకి. కానీ సమర్థ్ వెళ్లకుండా ఆపలేదన్న విషయం అర్ధం అయ్యి, మాటమార్చి, "నా కొడుకు కాబట్టి నిన్ను వేరే దేశానికి తీసుకువెళ్లాలనుకుంటున్నాడు. లేకపోతే నీలాంటి దాన్ని పెళ్ళి చేసుకోవడమే ఎక్కువ." అంది రాధ గర్వంగా. కళ్ళల్లో వస్తున్న నీళ్ళని తుడుచుకుంటూ, మౌనంగా ఉండిపోయింది జాగృతి.
"ఇకనుండి వాడు కష్టపడి సంపాదించిందంతా నీ నోట్లో పడేసుకుని నమిలెయ్యి. ఆఖరుకి వాడిని అడుక్కుతినేవాడిని చెయ్యి." అంది రాధ కోపంగా.
జాగృతిని మొదటిసారి ఇంటర్నేషనల్ ట్రిప్ కి తీసుకువెళ్తున్నాన్న గర్వం సమర్థ్ కూడా ఉంది. "ఇంతకీ నీకు పాస్ పోర్ట్ అయినా ఉందా? ఇప్పుడు అది కూడా చేయించాలా?" అని అడిగాడు. ఉందని చెప్పింది జాగృతి.
"అయితే తీసుకురా. అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూస్తాను." అన్నాడు సమర్థ్.
జాగృతి తెచ్చిన పాస్ పోర్ట్ ని అటుఇటు తిప్పుతూ, ఒక పేజీ దగ్గర ఆగి, ఆశ్చర్యంగా చూస్తూ, "నీకు అమెరికా వీసా ఉందా?" అని అడిగాడు.
అవునని చెప్పింది జాగృతి. "అది కూడా 10 సంవత్త్సరాలకి. ముల్టీపుల్ ఎంట్రీతో. నువ్వు ఎప్పుడు US వెళ్ళావ్?" అని అడిగాడు ఆశ్చర్యంగా.
"పెళ్ళికి ముందు అక్కడ ఉద్యోగం చేశాను." అంది జాగృతి.
"ముందే చెప్పలేదేం మరి?" అన్నాడు సమర్థ్.
"అందులో చెప్పడానికేం ఉంది?" అని, సమర్థ్ అప్పటికి ఎక్కడికీ వెళ్లలేదన్న విషయాన్నీ అర్ధం చేసుకుని, "మీరు నాకు మొదటిసారి వేరే దేశాన్ని తీసుకువెళ్తున్నాను అన్నారు. అందుకే చెప్పలేకపోయాయను." అంది జాగృతి. సమర్థ్, జాగృతిని ప్రేమగా చూసాడు.
"ఏమయిందిరా? ఏం జరుగుతోంది? ఇప్పుడేం పెంట పెట్టింది ఈవిడ?" అని సమర్థ్ ని అడిగింది రాధ.
"నేను జాగృతిని మొదటిసారి వేరే దేశానికి తీసుకువెళ్లడం ఏమిటమ్మా? తను అమెరికాలో ఉండి, ఉద్యోగం చేసి వచ్చింది. తనే నన్ను మొదటిసారి వేరే దేశం తీసుకువెళ్లే స్థాయిలో ఉంది." అని జాగృతి గురించి గొప్పగా చెప్పాడు సమర్థ్.
రాధ మొహం మాడిపోయింది. ఎప్పుడూ తామే ఎక్కువ అనుకునే రాధ అహం దెబ్బతింది. కోడలు, కొడుకు కన్నా ఎక్కువదన్నవిషయాన్ని తట్టుకోలేకపోయింది. "ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టిందంటే, అమెరికాలో ఏం చేసి వచ్చిందో ? దీనికి సిగరెట్లు కాల్చడం, తాగుడు, తిరుగుడు లాంటి అలవాట్లు ఉన్నాయేమో? ఎంతమందితో దీనికి సంబంధాలు ఉన్నాయో ఏమో? దీన్ని చేసుకోవద్దురా అంటే నువ్వు వినలేదు. అంతా మన ఖర్మ." అని తలకొట్టుకుంటూ కూర్చుంది.
జాగృతి కళ్ళలోంచి నీళ్లు ఆగలేదు. తనని , జాగృతిని కలిసి రాధ చూడలేకపోతోందని, ఇద్దరినీ సంతోషంగా ఉండనివ్వదని సమర్థ్ అర్ధం చేసుకున్నాడు. జాగృతిని, రాధ నుండి దూరంగా ఉంచాడు.
***
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya/profile
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు



Comments