అత్తగారి నిజస్వరూపం
- LV Jaya

- 1 day ago
- 6 min read

Atthagari Nijaswarupam - New Telugu Story Written By L. V. Jaya
Published in manatelugukathalu.com on 09/12/2025
అత్తగారి నిజస్వరూపం - తెలుగు కథ (అత్తగారి కథలు - పార్ట్ 18)
రచన: L. V. జయ
సమర్థ్, జాగృతిల పెళ్ళిమాటల కోసం ఇరుతరపువాళ్ళు కలిసినప్పుడు, సమర్థ్ వాళ్ళ అమ్మ రాధ, జాగృతి వాళ్ళ అమ్మ లతతో, "మీ అమ్మాయికి అలాంటి పేరు పెట్టారేంటి? ఇంకేం మంచిపేర్లు దొరకలేదా?" అంది వెటకారంగా.
"తన పేరు శ్రీ జాగృతి. మేమందరం శ్రీలు అని పిలుస్తాం. మీరు కూడా అలానే పిలవండి పోనీ. " అంది లత.
సమర్థ్ తరపువాళ్ళందరూ 'శ్రీలు' అన్న పేరు వినగానే, రాధ వైపు చూసారు. రాధ మొహం మాడిపోయింది. "నేను అలా పిలవను. " అంది కోపంగా.
'ఏం తప్పు మాట్లాడానని ఈవిడకి కోపమొచ్చింది. ' అనుకున్న లత, "లక్ష్మీదేవి పేరు. మా అమ్మాయి, మీ ఇంటికి కాబోయే లక్ష్మి కదాని అలా పిలవమన్నాను. " అంది.
రాధ కళ్ళు ఎర్రచేసి, మాణిక్యాలరావుని చూస్తూ, "ప్రతి ఒక్కరికి మా ఇంటి లక్ష్మి అయిపోదామనే కొరికే. నా కూతురు పావని మాత్రమే మా ఇంటి లక్ష్మి. నేను బతికుండగా, ఇంకెవ్వరు కారు. నేను కానివ్వను. " అంది.
జాగృతి తరపువాళ్ళు రాధని చూసి భయపడ్డారు. వాళ్ళకి రాధ మాటలు అర్థం కాలేదు. 'ఇంత చిన్నదానికెందుకు ఈవిడకి ఇంత కోపం వచ్చింది? జాగృతిలాంటి నెమ్మదైన పిల్ల ఇలాంటి కోపిష్టి అత్తగారితో ఎలా బతుకుతుందో ఏమో?' అనుకున్నారు.
సమర్థ్ "అందరూ నిన్ను చూసి భయపడుతున్నార"ని చెప్పటంతో, శాంతపడిన రాధ, "మా ఆయన పేరు శ్రీనివాస మాణిక్యాలరావు. ఆయన పేరులో శ్రీ ఉంది కదా. భర్త పేరు భార్య చెప్పకూడదని, నేను శ్రీలు అని పిలవనన్నాను. " అని చెప్పింది.
'భర్త పేరు భార్య చెప్పకూడదు అంటూనే చెప్పారే? వాళ్ళ ఆయన పేరు శ్రీనివాస అయితే నన్ను శ్రీలు అని పిలవటానికి ప్రాబ్లెమ్ ఏమిటి?' అనుకుంది జాగృతి.
రాధలాంటి కోపిష్టావిడతో తన భవిష్యత్తుని ఊహించుకుని జాగృతి భయపడింది. ఈ పెళ్ళి వద్దని లతకి చెప్పింది. కానీ లత ఇంతవరకూ వచ్చాక, పెళ్లివద్దంటే ఎలాగని నచ్చచెప్పి జాగృతిని ఒప్పించింది.
*********************************************************
సమర్థ్, జాగృతిల పెళ్ళి జరిగింది. పెళ్ళి తరువాత, సమర్థ్ తన చుట్టాలందరినీ జాగృతికి పరిచయం చేస్తూ, "మాది చాలా పెద్ద కుటుంబం. అందరినీ పరిచయం చెయ్యడం, నువ్వు గుర్తు పెట్టుకోవడం కష్టమే. " అన్నాడు నవ్వుతూ.
అందరి పరిచయాలు అయ్యాక, ఒకావిడ జాగృతి దగ్గరికి వచ్చి, "నేను సమర్థ్ కి అక్కని అవుతాను. నా పేరు శ్రీలు. నీ పేరు కూడా అదే అంట కదా. " అని నవ్వుతూ తనని పరిచయం చేసుకుంది.
"అవునండి. మీరు సమర్థ్ కి కజిన్ అవుతారా?" అని అడిగింది జాగృతి.
శ్రీలు సమాధానం చెప్పేలోపే, వాళ్ళు మాట్లాడుకోవడం చూసిన రాధ అక్కడికి వచ్చింది. రాధని చూసి భయపడిన శ్రీలు, "నైస్ మీటింగ్ యు. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో?" అని జాగృతికి చెప్పి వెళ్ళిపోయింది.
'ఈవిడని చూసి శ్రీలు ఎందుకు భయపడింది? వీళ్ళకి, వాళ్లకి ఏమైనా గొడవలు ఉన్నాయా? అందుకే ఈవిడ నన్ను శ్రీలు అని పిలవనందా?' అనుకుంది జాగృతి మనసులో.
*********************************************************
పెళ్ళి తరువాత సమర్థ్, జాగృతిలు ఉద్యోగాల కోసం బెంగుళూరు బయలుదేరారు. వారి చేత కొత్త కాపురం పెట్టించడానికి, రాధ, మాణిక్యాలరావులు కూడా వచ్చారు. ట్రైన్లో, జాగృతి కొలీగ్ ఒక అబ్బాయి, జాగృతిని పలకరించి, జాగృతికి, సమర్థ్ కి అభినందనలు తెలిపి, ఇద్దరితో కాసేపు మాట్లాడి వెళ్ళాడు.
ఆ అబ్బాయి వెళ్ళిన వెంటనే, "ఎవడే వాడు? నీకు ఇప్పుడే పెళ్ళి అయ్యింది. మొగుడు పక్కనే ఉన్నాడు. అయినా సిగ్గు లేకుండా నవ్వుతూ మాట్లాడుతున్నావ్? " అని జాగృతి మీద అరిచింది రాధ.
"అతను నా కొలీగ్ అండి. పెళ్ళికి విషెస్ చెప్పాడు. " అంది జాగృతి.
"నాకే సమాధానం చెప్తుందా? ఉద్యోగం చేస్తోందన్న పొగరు దీనికి. వీడు దీని లవర్ అయ్యుంటాడు. పెళ్ళి తరువాత కూడా దీన్ని వదలలేక వెంటపడుతున్నాడు. ఇది పెళ్ళికి ముందు ఏమేం చేసొచ్చిందో ఏమో? పెళ్ళి అయ్యిపోయింది కదా. ఇప్పుడు ఏమీ చెయ్యలేం అనుకుంటున్నట్టుంది. అణుస్తాను దీని పొగరు. " అంది రాధ అరుస్తూ.
"నేను అలాంటిదాన్ని కాను. ఆ అబ్బాయి నిజంగానే నా కొలీగ్. అంతకుమించి ఇంకేమీ లేదు. " అని చెప్పింది. రాధకి కోపం పెరిగిపోయింది. సమర్థ్, మాణిక్యాలరావులు ఆపమని చెప్తున్నా, వినకుండా, బెంగుళూరు చేరేవరకూ జాగృతిని తిడుతూనే వుంది రాధ. రాధ అంటున్న మాటలని జాగృతి తట్టుకోలేకపోయింది. తన భవిష్యత్తుని ఊహించుకుని, కన్నీళ్ళతో బెంగుళూరు స్టేషన్ లో దిగింది.
స్టేషన్ నుండి బయటకి వస్తుండగా, దూరంనుండి ఒక అబ్బాయి పరిగెత్తుకుని వాళ్ళ దగ్గరకు వచ్చాడు. "వీడు దీని ఇంకో లవ్వరేమో!! " అంది రాధ. రాధ అంటే అసహ్యం వేసింది జాగృతికి.
ఆ అబ్బాయి మాణిక్యాలరావుని చూసి, "మీరు మా శ్రీలు వదిన వాళ్ళ నాన్నగారే కదండీ" అని పలకరించాడు. అవునని చెప్పాడు మాణిక్యాలరావు.
రాధ, వాళ్ళ మాటలని విని, "నా కర్మ. నాకే ఇలాంటివాళ్ళు దొరుకుతారు. " అని తల కొట్టుకుంటూ, గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది. సమర్థ్ కూడా రాధతో పాటు వెళ్ళిపోయాడు.
అప్పటివరకూ తిట్లు తిని, ఏడుస్తున్న జాగృతికి, వాళ్ళ మాటలు అర్ధం కాలేదు. మాణిక్యాలరావు మీద రాధకి ఎందుకు కోపంవచ్చిందో కూడా తెలియలేదు. తన సూట్ కేసులతో నెమ్మదిగా సమర్థ్ వెనక నడిచింది.
*********************************************************
సమర్థ్, జాగృతి ఉద్యోగాలకి వెళ్ళడం మొదలుపెట్టారు. ఇద్దరూ ఆనందంగా కారులో ఉద్యోగాలకి వెళ్ళడాన్ని, సమర్థ్ డ్రైవ్ చేస్తుంటే, జాగృతి పక్కన కూర్చోవడాన్ని, సమర్థ్ జాగృతి మీద ప్రేమ చూపించడాన్ని రాధ చూడలేకపోయింది. జాగృతిని రోజూ ఎదో ఒకటి అంటూ, ఏడిపిస్తూ, ఆనందించింది.
కొన్నాళ్ల తరువాత, జాగృతి ప్రెగ్నెంట్ అని తెలిసి తట్టుకోలేకపోయింది రాధ. జాగృతి మీద లేనిపోని నిందలు వేసి, అవమానించింది. "పుట్టబోయేది నీ బిడ్డ కాదు. ట్రైన్ లో కలిసినవాడిది. " అని సమర్థ్ కి, "నువ్వు సమర్థ్ కి రెండో భార్యవి. " అని జాగృతికి చెప్పి, ఇద్దరిని దూరం చెయ్యడానికి ప్రయత్నించింది.
జాగృతిని ఉద్యోగం మానెయ్యమని బలవంతపెట్టింది. ఉద్యోగానికి వెళ్ళనివ్వకుండా చేసింది. "బల్ల గుద్ది మరీ చెప్తున్నా, నువ్వు ఉద్యోగం మానెయ్యకపొతే, మీ ఇద్దరినీ విడకొడతాను. " అంది రాధ.
జాగృతికి తిండి కూడా పెట్టకుండా, కొడుతూ, "ఈ విషయాలేమైనా సమర్థ్ కి గాని, ఇంకెవరికైనాగాని చెప్పావో నిన్ను చంపేస్తాను. " అని జాగృతి గొంతు పిసికి బెదిరించింది. మాణిక్యాలరావు రాధకి భయపడి, ఆపలేకపోయాడు.
రాధ అంటున్న మాటలని, పెడుతున్న బాధలని, జాగృతి భరించలేకపోయింది. ఉద్యోగం మానేసింది. తను పడుతున్న కష్టాలని ఎవరికీ చెప్పుకోలేక, నెమ్మది నెమ్మదిగా ధైర్యం కోల్పోతూ, పిచ్చిదానిలా అయ్యిపోయింది.
జాగృతి ప్రెగ్నెంట్ కాబట్టి ఉద్యోగం మానేసిందనుకున్న సమర్థ్, జాగృతిలో వస్తున్న మార్పుని గుర్తించాడు. ఇంకొన్ని రోజులు రాధ ఇక్కడే ఉంటే, జాగృతి తనకిక దక్కదని అర్ధమయింది సమర్థ్ కి. రాధని ఎలాగైనా రాజమండ్రికి పంపించెయ్యాలని నిర్ణయించుకున్నాడు.
ఏం చెప్తే, రాధ, మాణిక్యాలరావు వెంటనే బయలుదేరి వెళతారా అని ఆలోచించుకుని, "మన కారులో, మన సొంత ఊరిలో తిరుగుతుంటే బాగుంటుంది కానీ ఇక్కడ ఆ ఆనందం రావటం లేదు నాకు. మీరు కార్ తీసుకెళ్ళి, చక్కగా వాడుకోండి. మనవాళ్ళందరిముందూ గొప్పగా ఉంటుంది. ఏమంటారు?" అని అడిగాడు సమర్థ్. కార్లంటే విపరీతమైన పిచ్చి ఉన్న మాణిక్యాలరావు, వెంటనే సరేనన్నాడు కానీ రాధ ఏమంటుందా అని భయపడ్డాడు.
రాధ చాలాసేపు అలోచించి, "అంత దూరం మీరు డ్రైవ్ చెయ్యలేరు. సమర్థ్ చెయ్యగలడు. మాతో కూడా వచ్చి కార్ అక్కడ వదిలేసి, ట్రైన్లో వెనక్కి వచ్చేస్తాడు. " అంది రాధ. రాధ వెళ్ళిపోతానన్నందుకు, జాగృతి ఆనందానికి హద్దులు లేవు. 'ఇక ప్రశాంతంగా ఉండచ్చు' అనుకుంది.
కానీ ఆఖరి నిమిషంలో, "ముగ్గురూ కలిసి ప్రయాణం చెయ్యకూడదు. దాన్ని కూడా రమ్మను మనతో. అసలే కడుపుతో ఉంది కదా. ఎవరితో వచ్చిందో తెలియదనుకో. దాన్ని వైజాగ్ లో వాళ్ళ అమ్మ ఇంటికి పంపేస్తాను. ఆవిడే చూసుకుంటుంది. మనకెందుకు వచ్చింది ఈ గొడవ?" అంది రాధ.
'ఇద్దరిని విడగొట్టడానికి ఇలా అంది' అన్న విషయం సమర్థ్, జాగృతిలద్దరికి అర్ధమయ్యింది.
'ఇన్నాళ్ళు జాగృతి పడిన బాధలకి, కొన్నాళ్ళు వాళ్ళ అమ్మ దగ్గిర ఉంటే మంచిదే. ముందు అమ్మని ఇక్కడినుండి పంపించేసి, కొన్నాళ్ల తరువాత జాగృతిని వెనక్కి తెచ్చుకోవచ్చు. ' అనుకున్న సమర్థ్, జాగృతిని కూడా బట్టలు సర్దుకుని బయలుదేరమన్నాడు.
సమర్థ్ కి కూడా తనని వదిలేయాలని ఉందని అనుకున్న జాగృతి, 'అమ్మ దగ్గరికి వెళ్ళి, ఇక జనంలో వీళ్ళ మొహం చూడను. ' అనుకుంది.
*********************************************************
చాలాసేపు డ్రైవ్ చేసిన తరువాత, రాత్రి భోజనాల సమయానికి ఏలూరు దరిదాపులకు చేరారు. "ఇప్పటికే 14 గంటలు డ్రైవ్ చేశాను. ఇంకో 2 -3 గంటలు డ్రైవ్ చెయ్యాలి. నీరసంగా ఉంది. నిద్ర కూడా వస్తోంది. ఇక నేను చెయ్యలేను. రాత్రికి ఇక్కడెక్కడైనా తిని, పడుకుని, రేపు ఉదయాన్నే వెళ్దాం. " అన్నాడు సమర్థ్.
"మీ అమ్మ బయటెక్కడా తినదు కదా. మా బావ రామారావు ఇంటికి వెళ్దామా. " అన్నాడు మాణిక్యాలరావు.
"ఏం? అక్కడ మీ సొంతవాళ్ళని చూడాలని ఉందా? లేక ఈవిడకి చూపించాలని ఉందా?" అంది రాధ కోపంగా.
"నీ గురించి ఆలోచించే వాళ్ళ ఇంటికి వెల్దామన్నాను. అక్కడ నేను ఎవరితోనూ మాట్లాడాను. మీరు మాట్లాడక్కరలేదు. " అన్నాడు మాణిక్యాలరావు. రామారావు ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంది రాధ.
"ఇంతకీ అది మిమ్మల్ని, నన్నూ ఏమని పిలుస్తుంది?" అని మాణిక్యాలరావుని అడిగింది రాధ.
"నాకేం తెలుసు? చూద్దాం. " అన్నాడు మాణిక్యాలరావు. వాళ్ళ సంభాషణ జాగృతికి అర్ధంకాక, సమర్థ్ వైపు చూసింది. సమర్థ్ ఏమీ తెలియనివాడిలా కార్ డ్రైవ్ చేస్తూ, రామారావు ఇంటికి తీసుకువెళ్ళాడు.
అక్కడ శ్రీలుని చూసి ఆశ్చర్యపోయింది జాగృతి. రామారావు శ్రీలుని "మా కోడలు" అని పరిచయం చేసి, "మీరిద్దరూ ముందు కలిసారా? " అని శ్రీలుని అడిగాడు. లేదని చెప్పింది శ్రీలు.
"అవునా. సరే అయితే. ఇది మా అక్క కూతురు. దీన్ని కంటూనే వీళ్ళ అమ్మ చనిపోయింది. చిన్నప్పటినుండి మేమే పెంచి, మా అబ్బాయికి ఇచ్చి చేసాం. " అని శ్రీలు గురించి జాగృతికి చెప్పాడు రామారావు.
శ్రీలు చాలా ఆనందంగా, ఆప్యాయంగా అందరినీ పలకరించి, రాత్రికి వంట చేసి, పడుకోవడానికి ఏర్పాట్లు చేసింది. జాగృతి శ్రీలుకి సాయం చేస్తూ, "మీకు అన్నదమ్ములు, అక్కచెలెళ్ళు ఉన్నారా? వాళ్ళెక్కడ ఉంటారు?" అని అడిగింది. సమాధానం చెప్పకుండా, కళ్ళు తుడుచుకుంది శ్రీలు. జాగృతికి శ్రీలు ఎందుకు ఏడ్చిందో అర్ధంకాలేదు.
ఉదయాన్నే లేచి, కాఫీ, టిఫిన్లు తయారుచేసింది శ్రీలు. అందరూ బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, బట్టలు పెట్టి, " మొదటిసారి మీరందరూ నన్ను కలవటానికి మా ఇంటికి వచ్చారు. " అని కన్నీళ్ళతో చెప్పింది.
శ్రీలు ఎంత ప్రయత్నింస్తున్నా, రాధ, మాణిక్యాలరావు, సమర్థ్ శ్రీలుతో మాట్లాడకపోవడాన్ని, రాధ కాళ్ళకి శ్రీలు దణ్ణంపెడుతుండగా, రాధ దూరంగా జరగడాన్ని జాగృతి గమనించింది. శ్రీలుతో వీళ్ళకున్న ప్రాబ్లెమ్ ఏమిటన్నది జాగృతికి అర్ధం కాలేదు. 'అయినా నాకెందుకు వీళ్ళెవ్వరిని ఇంకా జన్మలో కలవను' అనుకుంది.
*********************************************************
రాజమండ్రి చేరిన వెంటనే, రాధ వంటింటిలోకి వెళ్ళి, ఎవరికీ కనపడకుండా, ఏలూరు విషయాల్ని చెప్పటానికి పావనికి ఫోన్ చేసింది.
"అసలు మీరెందుకు అక్కడికి వెళ్ళారు? నీ కోడలికి అంతా అర్ధమయ్యిపోయిందా?" అని అడిగింది పావని.
"దానితో మేము మాట్లాడితే కదా దీని మొహానికి అర్ధమవ్వటానికి? అయినా దీనికి ఏ అనుమానం రాకుండా, ముందునుండే జాగ్రత్త పడ్డాను. ఇదే సమర్థ్ కి రెండో భార్యేమోనాన్న అనుమానాన్ని పెట్టాను. " అంది రాధ నవ్వుతూ. పావని కూడా నవ్వింది.
"మరి అది మిమ్మల్ని పిలిచినప్పుడైనా తెలిసిపోయుంటుంది కదా?" అని అడిగింది పావని.
"అది మమ్మల్ని ఏమీ పిలవలేదు. " అంది రాధ.
"హమ్మయ్య. ఈ నిజం నీ కోడలికి ఎక్కడ తెలిసిపోయుంటుందేమోనని భయపడ్డాను. నాన్నకి నేనొక్కడిదాన్నే కూతుర్ని. దాన్ని ఎవరైనా నాన్న కూతురు అన్నారంటే నేను ఒప్పుకోను. " అంది పావని.
"సరేనమ్మా. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో దాని పేరు ఎవరూ ఎత్తకుండా చూసుకున్నాను కదా. ఇకముందు కూడా అంతే. నాకు ఎలాగూ భర్త ప్రేమ పూర్తిగా అందలేదు. నీకు మాత్రం నాన్న ప్రేమ పూర్తిగా అందేలా ఇన్నాళ్ళు చూసుకున్నాను. నువ్వొక్కదానివే ఈ ఇంటి ఆడపడుచువి. లక్ష్మీదేవివి. సరేనా?" అంది రాధ.
మంచినీళ్ళు తాగడానికి వంటిట్లోకి వెల్దామనుకున్న జాగృతికి, రాధ, పావని మధ్య జరిగిన సంభాషణ వినపడింది. నిజం తెలిసి ఆశ్చర్యపోయింది జాగృతి.
*********************************************************
మాణిక్యాలరావు, తన మరదలు లక్మిని ఇష్టపడి, పెళ్ళిచేసుకున్నాడు. వాళ్ళకి పుట్టిన అమ్మాయి శ్రీలు. పిల్లని కంటూ, లక్ష్మి చనిపోతే, ఆ చిన్న పిల్లని చూసుకోవడానికి పెద్దవాళ్ళ బలవంతంవల్ల మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు మాణిక్యాలరావు. కానీ, రాధకి శ్రీలుని పెంచటం ఇష్టంలేక, తనని వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి పంపేసింది. శ్రీలు అమ్మమ్మ కూడా పోయాక, రామారావు తన అక్క కూతుర్ని పెంచి, తన కొడుకుకే ఇచ్చి పెళ్ళి చేసాడు.
రాధ చేసిన ఈ పని సమర్థ్ తరపు చుట్టాలందరికి తెలుసు. రాధ ఎంత గయ్యాలో కూడా అందరికీ తెలుసు. కానీ ఎవరూ ఈ విషయం జాగృతివాళ్ళకి చెప్పలేదు.
మాణిక్యాలరావు కి రెండో భార్యగా వచ్చిన రాధ, భర్త ప్రేమని పూర్తిగా పొందలేకపోయిందన్న కోపంతో, జాగృతి మీద సమర్థ్ చూపిస్తున్న ప్రేమని చూసి తట్టుకోలేపోయింది. ఇద్దరి మధ్య చిచ్చుపెట్టాలని, ఇద్దరినీ విడగొట్టాలని ప్రయత్నించింది. తన పెళ్ళి సమయానికే, భర్తకి ఒక కూతురు ఉందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన రాధ, కోడలికి కూడా ముందే ఎవరితోననైనా సంబంధం ఉండే ఉంటుందన్న అనుమానంతో బాధపెట్టింది. తన కూతురు, కొడుకు మాత్రమే తన భర్తకి పిల్లలు, తన కూతురు మాత్రమే తన ఇంటికి లక్ష్మి అన్న ఆలోచనతో, శ్రీలుని తన కుటుంబం దగ్గరికి రానివ్వలేదు. కోడలిని, శ్రీలు అని పిలవడానికి ఇష్టపడలేదు. శ్రీలు మీద, మాణిక్యాలరావు మీద ఉన్న కోపాన్ని జాగృతి మీద చూపింది. ఇంజనీరింగ్ లో టాపర్ అయ్యి, ఐటీలో మంచి పొజిషన్లో ఉద్యోగం చేస్తున్న జాగృతిని ముప్పుతిప్పలుపెట్టి, పిచ్చిదాన్ని చేసి, ఉద్యోగం మాన్పించి, భార్యాభర్తల్ని దూరం చేసి, సంతోషించింది.
అత్తగారి నిజస్వరూపం, మాణిక్యాలరావు, సమర్థ్ చేతకానితనం చూసిన జాగృతి, సమర్థ్ కి విడాకులు ఇవ్వాలని, తను కనబోయే బిడ్డకి తానే తల్లి, తండ్రి అవ్వాలని నిర్ణయించుకుంది.
***
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya/profile
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు



Comments