top of page
Original.png

అత్యాశ

1 day ago
3 min read

అత్యాశ వల్ల వ్యాపారాన్ని కోల్పోయిన సుశీల, నిజాయితీతో తిరిగి విజయం సాధించిన రామయ్యను చూపించే తెలుగు నీతి కథ దృశ్యం

Atyasha - Telugu Moral Story | Ganti Asa Padmini

అత్యాశ - తెలుగు నీతి కథ | గంటి ఆశ పద్మిని

Published in manatelugukathalu.com on 30/09/2026


అత్యాశ మనిషి జీవితంలో ఉన్న విలువలను, సంబంధాలను ఎలా దెబ్బతీస్తుందో తెలిపే సామాజిక సందేశాత్మక తెలుగు కథ ఇది.

“అత్యాశ” కథ ద్వారా నిజాయితీ, సంతృప్తి, కష్టపడి పనిచేయడం వంటి విలువైన జీవిత పాఠాలను తెలుసుకోవచ్చు.


రామయ్య, సోమయ్య ఇద్దరు మంచి స్నేహితులు. రామయ్య పట్నం నుంచి బొమ్మలు తీసుకొచ్చి, ఊరిలో అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. సోమయ్య ఏ పనిపాటా చేయకుండా ఖాళీగా ఉండేవాడు.


ఒక రోజు భోజనం ముగించుకుని అరుగుపైన కూర్చున్నాడు సోమయ్య. అటుగా వెళ్తున్న రామయ్య, “ఏం చేస్తున్నావ్? భోజనం అయిందా?” అని పలకరించాడు సోమయ్యను.


“ఇప్పుడే భోజనం అయింది. ఒక్కఘడియ కూర్చుందామని ఇగో ఇలా వచ్చాను” అని బదులిచ్చాడు సోమయ్య.


“ఇప్పటికైనా పని ఏమైనా చేస్తున్నావా? లేక ఇంకా ఖాళీగానే ఉన్నావా?” అని అడిగాడు రామయ్య.


“ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నారు అన్నయ్యా” అని మజ్జిగ పట్టుకొస్తూ చెప్పింది సోమయ్య భార్య సుశీల.


“ఇంకా ఖాళీగానే ఉన్నావా?” అని అన్నాడు రామయ్య.


“ఎక్కడైనా పని ఉంటే చూడండి అన్నయ్యా” అని చెప్పింది సుశీల.


“సరే అమ్మ! చూస్తాను” అని చెప్పి వెళ్ళిపోయాడు రామయ్య.


రామయ్య ఇంటికి వచ్చి, “నేను నా స్నేహితుడు సోమయ్యను కలిశాను. సోమయ్యకు ఏ పని లేదు, అందుకు ఏదో ఒక పని వెతికి పెట్టమని చెప్పింది అతని భార్య” అని చెప్పాడు తన భార్యకు.


“మీ స్నేహితుడి భార్య చాలా బాగా పిండివంటలు చేస్తుంది అని చెప్తుంటారుగా... పిండివంటలు చేసి అమ్ముకునే వ్యాపారమే చేయమనండి” అని సలహా ఇచ్చింది రామయ్యకు అతని భార్య.


మరుసటి రోజు రామయ్య సతిసమేతంగా సోమయ్య ఇంటికి వెళ్ళి పిండివంటల వ్యాపారం పెట్టుకోమని సలహా ఇచ్చాడు.


ఆ మాటలు విని, “పిండివంటల వ్యాపారమంటే మాటలా! బాగా ఖర్చు అవుతుంది. ఇప్పుడు అంత పెట్టుబడి ఎక్కడిది?” అని అంది సుశీల.


సుశీల మాటలు విన్న రామయ్య భార్య, “ఏవండీ! మీరు బొమ్మల వ్యాపారం, మీ స్నేహితుడు పిండివంటల వ్యాపారం కలిపి చేయండి. మనకు బొమ్మల వ్యాపారంలో వచ్చిన లాభంతో పిండివంటల వ్యాపారం పెడదాము” అని సలహా ఇచ్చింది.


రామయ్య, సోమయ్య ఇద్దరూ కలిసి పిండివంటల వ్యాపారం, బొమ్మల వ్యాపారం కలిపి పెట్టుకున్నారు. సుశీల పిండివంటల రుచి బాగుండటంతో వ్యాపారం బాగా సాగింది. రామయ్య లాభాల్లో సగం తను ఉంచుకుని మిగిలిన సగం సోమయ్యకు ఇచ్చేవాడు.


కొద్ది రోజుల్లోనే ఎక్కువ లాభాలు రావడం ఆరంభమయ్యాయి. పిండివంటల వ్యాపారం బాగా పెరగడంతో ఖాళీ లేక బొమ్మల వ్యాపారం బాగా తగ్గిపోయింది.


కొద్ది రోజుల తరువాత రామయ్య భార్యకు అస్వస్థతగా ఉండటంతో తను పట్నంలోనే ఉండవలసి వచ్చింది. సోమయ్య, సుశీలకు వ్యాపార బాధ్యత అప్పగించాడు రామయ్య. సుశీల బొమ్మల వ్యాపారాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, తన పిండివంటల వ్యాపారమే చేయసాగింది.


మూడు మాసముల తరువాత రామయ్య పట్నం నుంచి తిరిగి వచ్చి వ్యాపార బాధ్యతలు చేపట్టదలిచాడు. సోమయ్య దగ్గరకు వచ్చి మూడు మాసముల లాభనష్టాల లెక్కలు అడిగాడు.


అంత లాభాలు చూసిన సుశీలకు మనసులో దుర్బుద్ధి పుట్టి, “మీరు వెళ్ళిన దగ్గరనుంచి అస్సలు బొమ్మల వ్యాపారం జరగనే లేదు, ఐదు వేలు నష్టం వచ్చింది” అని చెప్పింది.


“అదేమిటి? బొమ్మల వ్యాపారంలో నష్టం వచ్చినా పిండివంటల వ్యాపారం బాగానే జరుగుతోంది కదా?” అని అడిగాడు రామయ్య.


“పిండివంటల వ్యాపారం మాది. నా వల్ల ఆ వ్యాపారం బాగా జరుగుతోంది, ఆ వ్యాపారానికి మీకు సంబంధం ఏమిటి?” అని అంది సుశీల.


“అదేమిటి? నేనే కదా రెండు వ్యాపారాలకు పెట్టుబడి పెట్టి మొదలు పెట్టాను!” అని అన్నాడు రామయ్య.


“పెట్టుబడి మాత్రమే మీరు పెట్టారు. కానీ వ్యాపారం నా చేతి రుచి, కష్టం పైన సాగుతోంది” అని అంది సుశీల.


“నాకు ఏమీ సంబంధం లేదా?” అని అన్నాడు రామయ్య.


“అవును, మీకు ఈ పిండివంటల వ్యాపారానికి ఏమీ సంబంధం లేదు. మీరు పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు మీ వ్యాపారం వల్ల వచ్చిన నష్టానికి సరిగ్గా సరిపోతుంది” అని చెప్పి, మిగిలిపోయిన బొమ్మలన్నీ చేతికి అందించింది సుశీల. రామయ్య చేసేది ఏమీ లేక దిగాలుగా ఇంటికి తిరిగి వచ్చాడు.


రామయ్య భార్య తన భర్తను చూసి, “ఏమైంది? ఇంత వేగంగా తిరిగి వచ్చేశారు?” అని అడిగింది.


“నేను మోసపోయాను” అని మొదలుపెట్టి జరిగినదంతా చెప్పాడు.


“ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళ దుర్బుద్ధి బయటపడినందుకు సంతోషించాలి” అని చెప్పి, “మళ్ళీ మన వ్యాపారం మనం మొదలుపెడదాము” అని అంది రామయ్యతో అతని భార్య.


“నువ్వు చెప్పేది నిజమే, కానీ మన లాభమంతా ఆ వ్యాపారంపైన పెట్టేశాము కదా! ఇప్పుడు ఎలా?” అని అన్నాడు రామయ్య.


“కొంత డబ్బు అప్పు తెచ్చుకుని మొదలుపెడదాము” అని చెప్పింది అతని భార్య.


రామయ్య మళ్ళీ తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. రామయ్య భార్య కొత్తగా టెడ్డీబేర్ బొమ్మలు, కుక్కపిల్లల బొమ్మలు తయారు చేయడం నేర్చుకుని రంగురంగుల బొమ్మలు తయారుచేసింది. రామయ్య పట్నం నుంచి “కీ” ఇచ్చే బొమ్మలు తెచ్చి అమ్ముతూ కొద్ది నెలల్లోనే నిలదొక్కుకుని బాగా వ్యాపారం చేయసాగాడు.


సోమయ్య పిండివంటలకు సరుకులు తక్కువ ధరకు రావడంతో, నాణ్యత లేని సరుకులు కొని మోసపోయాడు. అందువల్ల పిండివంటల వ్యాపారం బాగా దెబ్బతిన్నది.


చేతిలో చిల్లిగవ్వ లేదు. చేసేది ఏమీ లేక సోమయ్య, సుశీల రామయ్య వద్దకు వచ్చారు.

రామయ్య ఇద్దరినీ మర్యాదించాడు. సుశీల జరిగినదంతా చెప్పి, “మళ్ళీ కలిసి వ్యాపారం చేద్దాము” అని అంది.


“నేను ఉన్నదానితో సంతోషంగా ఉన్నాను, నాకు అత్యాశ లేదు” అని సమాధానం ఇచ్చాడు రామయ్య.


“నేను అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకున్నాను” అని బాధపడసాగింది సుశీల.


*** 


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



గంటి ఆశ పద్మిని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



గంటి ఆశ పద్మిని

పరిచయం: నా పేరు గంటి ఆశ పద్మిని.

నేను ఇప్పటివరకు ముఫై కథలు, పది బాలగేయాలు, ఒక మినీ నవల , ఐదు పుస్తక సమీక్షలు చేసాను.రాసాను. నా కథలు విశ్వభవిష్యత్, ఈనాడు, రేపటికోసం పత్రికలో పబ్లిష్ అయ్యాయి. సుమబాల, ఉషబాల, బాలబాట పుస్తకాల్లో, కదంబం అనే వెబ్ మ్యాగజైన్ లో కూడా నా కథలు ప్రచురణ అయ్యయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page