బాధని పంచుకుంటూ...
- Veluri Sarada

- 2 hours ago
- 4 min read

Badhani Panchukuntu - Telugu Emotional Family Story | Mayukha
బాధని పంచుకుంటూ... - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | మయూఖ
Published in manatelugukathalu.com on 13 /08/2026
బాధని పంచుకుంటూ... – మయూఖ రచించిన ఈ హృదయస్పర్శి తెలుగు కథ ఒక కుమార్తె తన తల్లికి రాసిన ఉత్తరం రూపంలో సాగుతుంది. చిన్ననాటి నుంచి తండ్రి కఠినత్వం, తల్లి నిస్సహాయ మౌనం, కుటుంబంలో ఆడపిల్లపై ఉండే ఆంక్షలు, తన జీవితానికి సంబంధించిన నిర్ణయాల్లో తన మాటకు చోటు లేకపోవడం వంటి అనుభవాలను లక్ష్మి తన ఉత్తరంలో గుర్తుచేసుకుంటుంది.
“నా మంచికే” అనే మాట వెనుక దాగిన ప్రేమ, భయం, అధికారం, పురుషాహంకారం, కుటుంబ బాధ్యతల మధ్య ఒక ఆడపిల్ల జీవితం ఎలా ప్రభావితమవుతుందో ఈ కథ ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా వివాహం, విడాకులు, ఆడపిల్ల స్వేచ్ఛ, తల్లిదండ్రుల నిర్ణయాలు, కుమార్తె మానసిక వేదన వంటి అంశాలను ఎంతో భావోద్వేగంతో ఆవిష్కరిస్తుంది.
తన తల్లిని బాధపెట్టాలని కాదు, తాను అనుభవించిన మానసికక్షోభను ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలనే ఉద్దేశంతో లక్ష్మి ఈ ఉత్తరం రాస్తుంది. చివరికి తన కుమారుడికి తాత పేరు పెట్టి, ఎంత బాధ ఉన్నా తండ్రి తన తండ్రేనని చెప్పే లక్ష్మి మనసు ఈ కథకు మరింత భావోద్వేగాన్ని జోడిస్తుంది.
క్షేమం
హైదరాబాద్
ప్రియమైన అమ్మకు,
లక్ష్మి నమస్కరించి వ్రాయునది. ఉభయకుశలోపరి. ఈ ఉత్తరం నీకు ఇలా రాయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు కూడా నీకు రాయకపోతే ఎప్పటికీ నా అభిప్రాయం నీకు చెప్పలేను.
"అమ్మా! చిన్నప్పుడు నీ ఒళ్ళో పడుకుని నువ్వు చెప్తుంటే కథలు వినాలని ఆశపడేదాన్ని. కానీ ఎప్పుడూ నాకు ఆ అవకాశం రాలేదు. నువ్వు ఎప్పుడు చూసినా "పని పని" అంటూ ఉండేదానివి. నాన్న అంటే నాకు భయం వేసేది. ఎప్పుడు చూసినా నన్ను కోపంతో తిట్టేవారు.
చెల్లిని, తమ్ముడిని గారంగా చూసేవారు. ఇది అలుసుగా తీసుకుని తమ్ముడు తను చేసిన అల్లరి పనులన్నీ నా మీద పెట్టేవాడు. నాన్న నన్ను కొట్టేవారు. నాన్నంటే భయం కొద్దీ ఆయన్ని చూసేటప్పటికి, భయంతో నోరు ఎండిపోయేది. నేను మాట్లాడలేకపోయేదాన్ని.
నేను 4వ తరగతి చదువుతున్నాను. అప్పుడు ఒకరోజు రోడ్డు మీద పీచు మిఠాయి అమ్మే కుర్రాడు, "పీచు మిఠాయి" అని అరుచుకుంటూ గంట కొడుతూ సైకిల్ మీద వెళుతుంటే, తమ్ముడు అది కావాలని పేచీ పెట్టి దాని వెనుక పరిగెత్తాడు. అప్పుడు నేను హోంవర్క్ చేసుకుంటుంటే నువ్వు నా దగ్గరకు వచ్చి, "తమ్ముడు రోడ్డు మీదకు వెళ్ళిపోతున్నాడు, తీసుకురా!" అన్నావు.
నేను పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేటప్పటికి వాడు రోడ్డు దాటేసి పక్క వీధిలోకి వెళ్ళిపోతున్నాడు... ఆ సైకిల్ వెనుక. నేను పరుగెత్తుకుంటూ వెళ్లేటప్పటికే తమ్ముడికి రాయి తగలడం, కింద పడిపోవడం జరిగింది.
నేను గబగబా వెళ్లి వాడిని లేవదీశాను. మోచేతులు, మోకాళ్లు కొట్టుకుపోయి చిన్నగా రక్తం వస్తోంది.
అది చూసి తమ్ముడు, "నాన్నతో చెబుతాను నీ పని. నన్ను కింద పడేసావు" అని ఏడవడం మొదలెట్టాడు.
నాన్న కారణం లేకుండానే నన్ను తిడతారు. అటువంటిది వాడి దెబ్బలు చూస్తే నన్ను చంపేస్తారు అనే భయంతో, తమ్ముడిని ఎత్తుకుని ఇంటి దగ్గర దింపేసి నేను గుడిలోకి వెళ్ళిపోయాను. నా చిన్ని బుర్రకి ఆలోచన ఒక్కటే... "గుడికి వెళితే దేవుడు రక్షిస్తాడు" అని.
మధ్యాహ్నం గుడి కట్టేస్తుంటే పూజారి గారు నన్ను చూసి, "ఎందుకమ్మా ఇక్కడ ఉన్నావ్? గుడికి తాళం పెట్టే వేళ అయింది! ఇంటికి వెళ్ళు" అన్నారు. నేను భయంతో "వెళ్ళను, నేను ఇక్కడే ఉండిపోతాను" అన్నాను.
అప్పుడు పూజారి గారు ఏం అర్థం చేసుకున్నారో నన్ను చూసి, నాకు ప్రసాదం పెట్టి నన్ను మన ఇంటి దగ్గర దింపారు. నేను బిక్కుబిక్కుమంటూ లోపలికి అడుగు పెట్టాను.
గుమ్మంలో పెద్దపులిలా నాన్న. ఆయన ఒళ్లో దర్జాగా కూర్చున్న తమ్ముడు. నాన్నను చూసి నేను వణికిపోయాను. నేను అనుకున్నట్టే "ఎక్కడికి పోయావ్?" అంటూ నన్ను నైలాన్ తాడుతో కొట్టారు.
నా వీపు మీద వాతలు తేలాయి. నువ్వు అడ్డుపడితే నీకు కూడా దెబ్బలు తగిలాయి. నేను వెక్కీ వెక్కీ ఏడుస్తుంటే, నా దెబ్బలకి నువ్వు వెన్నపూస రాసి నన్ను ఒడిలో పడుకోబెట్టుకుని ఎంతో ఏడ్చావు.
నాకు ఆ దెబ్బల వల్ల నీ ఒడి యొక్క వెచ్చదనం, ఆ స్పర్శ, ఆ అనుభూతి కలిగి, ఆ సంతోషం ముందు ఈ దెబ్బల బాధ పెద్దగా అనిపించలేదు.
"అమ్మా! నన్ను ఎందుకు నాన్న ఎప్పుడూ కొడుతూ ఉంటారు?" అని నిన్ను అడిగాను.
"నీకు నీ మేనత్త పోలిక. ఆ అమ్మాయి చదువుకుంటూ కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించి అతనితో వెళ్లిపోయింది.
నాన్న నీ మేనత్తను ఎంతో ప్రేమగా చూసేవారు. అటువంటిది ఆమె మీ నాన్న నమ్మకాన్ని వమ్ము చేసి వెళ్లిపోయింది. నువ్వు ఆమె పోలికతో ఉండడంతో నువ్వు ఎక్కడ చెయ్యి దాటిపోతావేమోనని ఆయన భయం. అందుకే నిన్ను చూసినప్పుడల్లా ఆయనకి తన చెల్లెలు గుర్తుకొస్తుంది" అని చెప్పావు.
నేను ఎప్పుడైనా మీరు గీసిన గీత దాటానా? అన్నీ మీ ఇష్టప్రకారమే చేశాను కదా!
నువ్వు, నాన్న నన్ను ఎంతో సాంప్రదాయబద్ధంగా పెంచారు. అటువంటిది నేను తప్పటడుగు వేస్తానని ఎలా అనుకున్నారు?
నేను డిగ్రీలో ఉండగా ప్రముఖ రచయిత పుస్తకాలు చదువుతుంటే నాన్న, "ఆ పుస్తకాలు చదవకు, ఆడాళ్లకి స్వేచ్ఛ ఎక్కువ అయిపోతుంది, మాట వినరు" అని ఆ పుస్తకం చింపేశారు. అప్పుడు నువ్వు, "నాన్న అంతా నీ మంచి కోసమే చేస్తారు!" అని నాకు సర్దిచెప్పావు.
"న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి".
స్త్రీలకి స్వేచ్ఛ ఉండకూడదు కానీ, వాళ్లు సంపాదించిన డబ్బు మాత్రం కావాలి.
నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నెల జీతం అంతా నాన్నకే ఇచ్చేదాన్ని. నాకు పెళ్లి కూడా ఎప్పటికో కానీ చేయలేదు. అప్పటికే నా ఫ్రెండ్స్ అందరి పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరైనా అడిగితే, "మా అమ్మాయి ఇప్పుడే పెళ్లి వద్దంటోంది" అనేవారు నాన్న.
ఎప్పుడైనా "నువ్వు పెళ్లి చేసుకుంటావా? నీకు వయసు వస్తోంది కదా!" అని నన్ను అడిగారా?
ఆఖరికి నాకు 30 ఏళ్లు వచ్చిన తర్వాతే పెళ్లి చేశారు.
పెళ్లిళ్లలో చిన్న చిన్న గొడవలు అవడం సహజం. మర్యాదలు, పెట్టిపోతలు తక్కువయ్యాయని మగపెళ్లివారు అలగడం సహజం. దాన్ని బూచిగా చూపించి విడాకుల వరకు తీసుకొచ్చారు నాన్న.
మీ పెద్దవాళ్ల పట్టింపులకి మేము బలైపోయాం. ఇవన్నీ "నా మంచికేనా"!? పెళ్లివాళ్లకు సర్దిచెప్పాల్సింది పోయి, నాన్నే పట్టుదలకు పోయి విడాకుల వరకు తీసుకొచ్చారు. పైగా నాతో ఏమన్నారు?
"ఆ అబ్బాయికి నీతో కాపురం ఇష్టం లేదుట, విడాకులు కావాలంటున్నాడు" అని నాతో చెప్పారు.
అదృష్టవశాత్తు నాకు ఆయన గుళ్లో కనిపించి ఎంతో బాధపడ్డారు. "మీ నాన్నగారి వల్లే ఇంతవరకు వచ్చింది. నువ్వు వచ్చేయ్, మన ఇంటికి వెళ్లిపోదాం!" అన్నారు.
నేను అదే విషయం మీతో చెబితే, "సిగ్గు లేకపోతే సరి! వాళ్లు ఛీ అన్న తర్వాత వాళ్ల గుమ్మం తొక్కుతావా?" అన్నారు.
"ఇవన్నీ కూడా నా మంచికేనా"!? చెప్పమ్మా!
ఆ రాత్రి రోజూలాగే నువ్వు నాన్నగారి గదికి వెళ్లావు. అప్పుడు నాన్నగారి మాటలు విన్నాను. "అది వెళ్లిపోతే ఇల్లు ఎలా గడుస్తుంది? తర్వాతి పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఉన్నాయి" అన్నారు.
"అయితే ఎందుకు దానికి పెళ్లి చేసినట్టు?" అని నువ్వు అడిగితే, "నోర్ముయ్! నోరు లేస్తోంది!" అని నిన్ను తిట్టారు.
మీరు రోజూ సంసార సౌఖ్యం అనుభవించవచ్చు... నేను మాత్రం భర్త ఉండి, మోడులా ఉండిపోవాలా? ఇది ఎంతవరకు సమంజసం?
నేను ధైర్యం చేసి మా అత్తారింటికి వెళ్లిపోతే నన్ను ఎన్ని మాటలు అన్నారు!
నాకు పిల్లలు పుట్టారని కబురు చేసినా రాలేదు. పట్టుదలలు, మొండితనాలతో బతుకుతున్నారు.
ఇవన్నీ నాన్న "నా మంచి కోసమే" చేశారా? ఎంత పురుషాహంకారం!
నా కొడుకు "రామశేఖర్" ఉపనయనం ఉంది. వాడిని ఆశీర్వదించడానికి వస్తారని తలుస్తున్నాను.
వాడికి నాన్నగారి పేరే పెట్టాను. ఎంత చెడ్డా ఆయన నా తండ్రి కదా!
నా పెంపకంలో వాడిని ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దాను. నన్ను నువ్వు తప్పుగా అనుకోకూడదు అని ఇవన్నీ రాశాను.
నేను పడ్డ మానసికక్షోభ నీకు తెలియాలి కదా! నిన్ను బాధపెడితే క్షమించు.
నమస్కారములతో,
లక్ష్మి.
***
మయూఖ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
మయూఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :
63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పరిచయ వాక్యాలు:
నా పేరు శారద
విద్యార్హతలు: ఎమ్.ఎ
నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.
నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.
తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.
నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.
ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి
మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.









Comments