top of page
Original.png

సృష్టి విరుద్ధ కలలు వ్యర్థమవుతాయి


చిత్రపటం నుండి బయటకు వస్తున్న మాయా రాజకుమారుడిని చూసి ఆశ్చర్యపోతున్న అవంతి రాజకుమారి చిత్రలేఖ డిజిటల్ పెయింటింగ్.

Srushti Viruddha Kalalu Vyardhamavutayi- Telugu Moral Story | Bhattu Venkata Rao

సృష్టి విరుద్ధ కలలు వ్యర్థమవుతాయి తెలుగు నీతి కథ | భట్టు వెంకటరావు

Published in manatelugukathalu.com on 12/08/2026


మన ఊహలు, కలలు ఎంత అందంగా ఉన్నప్పటికీ, అవి సృష్టి ధర్మానికి మరియు నైసర్గిక సూత్రాలకు లోబడి ఉండాలి. సృష్టి విరుద్ధమైన కోరికలు, కలలు ఎన్నటికీ నెరవేరవు; ఒకవేళ నెరవేరినట్లు కనిపించినా అవి తాత్కాలికమే అని నిరూపించే కథే "సృష్టి విరుద్ధ కలలు వ్యర్థమవుతాయి". ప్రముఖ రచయిత భట్టు వెంకటరావు గారు రచించిన ఈ జానపద/ఫాంటసీ కథలో, అవంతి నగరపు రాజకుమారి చిత్రలేఖ తన ఊహాచిత్రానికి ప్రాణం పోయించుకోవడం కోసం బేతాళుడితో ఒక షరతుకు అంగీకరిస్తుంది. శక్తులు పెరిగి శృతి మించిన బేతాళుడిని బ్రహ్మదేవుడు తన లీల ద్వారా ఎలా అణచివేశాడు? రాజకుమారి విచక్షణ కోల్పోయి చేసిన తప్పుకు ఎలాంటి మూల్యం చెల్లించుకుంది? అనే అంశాలను ఈ కథ ద్వారా ఆసక్తికరంగా తెలుసుకుందాం.


అవంతి నగరపు రాజకుమారి చిత్రలేఖ మంచి అందగత్తెయే కాక, పేరుకు తగినట్లుగా మంచి చిత్రకారిణి కూడా!


యౌవన దశకు చేరుకోగానే తన కలల రూపమైన రాజకుమారుడిని, నిలువెత్తు చిత్రపటంలో లిఖించి తన గదిలో దాచి ఉంచింది.


ఆమె చెలికత్తెల ద్వారా ఆ విషయం తెలుసుకున్న చిత్రలేఖ తల్లిదండ్రులు 'ఇదేమిటి?' అని ప్రశ్నించగా, ఆ చిత్రపటంలోని రాజకుమారుడిని తప్ప మరొకరిని పెళ్ళాడనని తన నిశ్చయంగా వాళ్ళకు చెప్పింది.


ఎంత వెతికించినా చుట్టుపక్కల రాజ్యాలలో ఎక్కడా ఆ చిత్రపటంలోని అందాల రాజకుమారుడు వాళ్ళకు కనపడలేదు. అతడిని తప్ప మరొకరిని పెండ్లాడనని చిత్రలేఖ భీష్మించుకుని కూర్చోవడంతో, ఆమె తల్లిదండ్రులు ఆస్థాన జ్యోతిష్కులను సంప్రదించారు.


జన్మకుండలి వేసి నిశితంగా పరిశీలించిన ఆ జ్యోతిష్కులు, రాజకుమారి జాతకంలో కించిదసాధారణ సంఘటనలు జరిగే యోగం ఒకటి కనపడుతూ ఉన్నదనీ, దైవఘటనలను ఎదిరించడం మానవ సాధ్యం కాదు గనుక, ప్రస్తుతం రాజదంపతులు చేయగలిగినది ఏమీ లేదనీ, వేచి ఉండడమే మంచిదని చెప్పారు.


అలా రోజులు గడుస్తుండగా, ఈ సంగతిని పసిగట్టిన బేతాళుడొకడు ఒక గొప్ప ముని రూపంలో ఒకనాడు రాజకుమారి ముందు ప్రత్యక్షమై, చిత్రపటంలోని ఆ రాజకుమారుడి బొమ్మకు తాను ప్రాణం పోస్తానన్నాడు.


ఆ మాటలు విన్న చిత్రలేఖ ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతుండగా, దానికి ప్రతిగా చిత్రలేఖ అతిలోకమైన చిత్రలేఖన ప్రావీణ్యాన్ని తనకు ధారాదత్తం చేయాలని షరతు పెట్టాడు. తన కలల రాజకుమారుడు ప్రాణంతో వస్తే చాలని తలపోసిన చిత్రలేఖ, అందుకు అంగీకరించింది.


వెంటనే చిత్రంలోని రాజకుమారుడికి ప్రాణం పోసి, చిత్రలేఖ కుడిచేతిని స్పృశించి క్షణకాలంలో ఆమెలోని చిత్రలేఖన ప్రావీణ్యాన్ని గ్రహించి, అక్కడి నుండి వెళ్ళిపోయాడు బేతాళుడు. చిత్రపటం నుంచి ప్రాణం పోసుకున్న తన కలల రాజకుమారుడి కౌగిలిలో వాలిపోయింది చిత్రలేఖ.


అక్కడి నుండి వెళ్ళిపోయిన బేతాళుడు ఒక కొండ గుహలో చేరి తదేక ధ్యానంతో ఒక అతిలోక సుందరి చిత్రాన్ని, చిత్రలేఖ నుండి గ్రహించిన శక్తితో చిత్రించాడు. ఆ చిత్రంలోని సుందరి సౌందర్యం ముందు రంభ, ఊర్వశి, మేనకల సౌందర్యం వెలవెలపోతూండడం చూసిన ఇంద్రుడు, వెంటనే వెళ్ళి బ్రహ్మదేవుడికి ఆ వైపరీత్యాన్ని విన్నవించి, తరుణోపాయాన్ని యోచించమని ప్రార్థించాడు.

"బొమ్మే కదా!" అన్నాడు బ్రహ్మ.


"కాదు బ్రహ్మదేవా! వాడి దగ్గర అపారమైన శక్తులు ఉన్నాయి. ఆ బొమ్మకు ప్రాణం పోయగలడు వాడు!" అన్నాడు కంగారుగా ఇంద్రుడు.


"సరే!" అని క్షణకాలం కనులు మూసి తెరిచాడు బ్రహ్మ. గుహలో బేతాళుడు ఆ ప్రయత్నంలోనే ఉండడం గమనించాడు. ఇలా శృతి మించడాన్ని ఆపకపోతే అనర్థం అని నిశ్చయించుకుని, ఆ సంగతిని తనకొదిలెయ్యమని ఇంద్రుడికి అభయమిచ్చి పంపించేశాడు.


అలా అక్కడ ఇంద్రుడు నిశ్చింతగా ఇంద్రలోకానికి బయలుదేరగానే, ఇక్కడ బేతాళుడి గుహ ముందు ఒక పండు ముదుసలి ప్రత్యక్షమై, "దాహం వేస్తున్నది. కాసిని మంచి నీళ్ళు ఇవ్వు నాయనా!" అని బేతాళుడిని అడిగాడు.


సరిగ్గా సమయానికి అడ్డుతగిలిన వృద్ధుడిపై ఆపుకోలేనంత కోపం వచ్చింది బేతాళుడికి. అయితే ఆ సమయంలో ఆగ్రహం ప్రదర్శించడం వలన ప్రయోజనం ఉండబోదని గ్రహించిన బేతాళుడు, గుహ పక్కనే ఒక సరస్సును సృష్టించి, ఆ సరస్సులోని నీటితో ఆ వృద్ధుడిని దాహం తీర్చుకోమన్నాడు.


"పండు ముసలివాడిని. సాయంపట్టి ఆ సరస్సు వద్దకు చేర్చి పుణ్యం కట్టుకో నాయనా!" అని అడిగాడు వృద్ధుడు.


అలాగే చేశాడు బేతాళుడు.

"ఎలాగూ ఇక్కడికి చేర్చావు. వొంగలేను. సరస్సులో నీటిని దోసిలితో పట్టి నా దోసిలిలో పోయి. తాగుతాను!" అన్నాడు ఆ వృద్ధుడు.


అలా మూడు సార్లు దోసిలితో సరస్సులోని నీటిని బేతాళుడి చేత పట్టించి తన దోసిలిలో పోయించుకున్న తరువాత, "చాలు. వచ్చిన పని అయిపోయింది. ఇక పోయి నీ పని చూసుకో!" అన్నాడు వృద్ధుడు.


బేతాళుడు తన గుహలోకి వెళ్ళాడు. వెళ్ళినంత వేగంగా ఒక నిమిషం తరువాత పరిగెత్తుకుంటూ వచ్చి, ఇంకా ఆ సరస్సు చెంతనే కూర్చుని ఉన్న వృద్ధుడి భుజాలను పట్టుకుని కుదుపుతూ, కోపంగా "ఏయ్ ముసలీ! ఏం చేశావు? నా శక్తులన్నిటినీ హరించావు. ఎవరు నువ్వు?" అని అరిచాడు.


"సృష్టి విరుద్ధమైన కలలు వ్యర్థమే అవుతాయి బేతాళా! ఊపిరి పోసుకోవు. అటువంటి ప్రయత్నాలు ఆపి, హద్దులెరిగి వర్తించు!" అని చెప్పి అదృశ్యమయ్యాడు బ్రహ్మ.


ఇక్కడ ఇలా వృద్ధుడు అదృశ్యమవడంతోనే, అక్కడ రాజకుమారి శయన మందిరంలో నిద్రిస్తున్న రాజకుమారుడు కూడా అదృశ్యమయ్యాడు. ఆ హఠాత్పరిణామానికి ఆశ్చర్యపడింది చిత్రలేఖ.


ఎవరో మోసగాడి చేతిలో మోసపోయానని గ్రహించింది. పుట్టుకతో దైవదత్తంగా వచ్చిన అసమాన్యమైన విద్యను, విచక్షణను కోల్పోయి వృథాగా పోగొట్టుకున్నందుకు అంతులేని విచారంలో మునిగిపోయింది.



             ***


భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: భట్టు వెంకటరావు


భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.

కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని. 

సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను. 


నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.


ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!

నమస్కారములతో,


భట్టు వెంకటరావు,

హైదరాబాదు. 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page