బామ్మ - మాట్లాడే మొక్కలు
- Munipalle Vasundhara Rani

- 9 hours ago
- 3 min read
#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #BammaMatlademokkalu, #బామ్మమాట్లాడేమొక్కలు, #బామ్మకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

బామ్మ కథలు - 3
Bamma Matlade mokkalu - New Telugu Story Written By Vasundhara Rani Munipalle Published In manatelugukathalu.com On 27/12/2025
బామ్మ - మాట్లాడే మొక్కలు - తెలుగు కథ
రచన: వసుంధర రాణి మునిపల్లె
పల్లెటూరిలో మా బామ్మ ఇంటి పెరడు అంటే ఒక చిన్నపాటి అడవిలా ఉంటుంది. అక్కడ లేని మొక్క లేదు. పింక్ కలర్ మందారాలు, గుత్తులు గుత్తులుగా కాసే నందివర్ధనాలు, ఘుమఘుమలాడే జాజి పూలు.. ఇలా ఎన్నెన్నో! బామ్మకి ఆ మొక్కలంటే పంచప్రాణాలు. పొద్దున్నే లేవగానే కాఫీ కూడా తాగకుండా పెరట్లోకి వెళ్లి, ప్రతి మొక్క దగ్గరా నిలబడి ముచ్చట్లు చెబుతుంటుంది. ఏమ్మా మందారమ్మ! ఈ రోజు అలకనా? ఒక్క పువ్వు కూడా పూయలేదు? అని ఒకదాన్ని అడిగితే, తులసి తల్లి! నీ ఆకులు ఎందుకు వాడిపోయాయి? నీళ్లు సరిపోలేదా? అని ఇంకో మొక్కతో మాట్లాడుతుంది. మళ్ళీ గోళ్లు పెరిగినట్టున్నాయి అంటూ మల్లె తీగకి ఎండిన ఆకులని తీసేస్తుంది.
బామ్మ ఇంట్లో ఎవరికీ మొక్కల సంరక్షణ బాధ్యత ఇచ్చేది కాదు. స్వయంగా తానే వాటికి మడులు కట్టడం, నీళ్లు పోయడం చేసేది. ఏదైనా చీడ వస్తే రసాయన మందులు వాడకుండా, ఇంటి చిట్కాలతో మూలికల మందు తయారు చేసి మొక్కలకి వేసేది. పిల్లలకి బయట ఆహారం పడక అనారోగ్యం వచ్చినట్టే, మొక్కలకి కూడా బయట ఎరువులు మంచివి కావని నమ్ముతుంది. అందుకే ఎప్పుడూ స్వయంగా సేంద్రియ ఎరువులని తయారు చేసి వాటిని బలంగా పెరిగేటట్టు చూసేది. ముఖ్యంగా ఆ వనమంతటినీ ఒక తల్లిలా ఆప్యాయంగా చూసుకునేది.
సెలవులకు వచ్చిన మనవరాలు నీలిమ ఇదంతా చూసి, తన స్నేహితులతో మా "బామ్మకి మొక్కలతో మాట్లాడే వింత అలవాటు ఉంది! అని నవ్వుతుండేది. మొక్కలు కూడా మనుషులలాగే స్పందిస్తాయని తను అస్సలు నమ్మేది కాదు. ఒకరోజు బామ్మ ఊరిలో జరిగే ఏదో ఫంక్షన్ కి వెళ్లాల్సి వచ్చింది. వెళ్తూ వెళ్తూ నీలిమను పిలిచి, 'కన్నా! నేను తప్పని పరిస్థితుల్లో ఈ ఫంక్షన్ కి వెళ్లాల్సి వస్తోంది. ఇంట్లో అందరికీ పనులుంటాయి, నువ్వైతే ఖాళీగా ఉంటావు కదా.. అందుకే నేను వచ్చేదాకా నా పిల్లలని జాగ్రత్తగా చూసుకో. వాటికి దప్పిక వేయకుండా నీళ్లు పోయి. మొక్కలకి, చెట్లకి చిన్న పిల్లలంటే చాలా ప్రేమ. అవి నీతో మాట్లాడాలని చూస్తాయి, కొంచెం ఓపికగా విను'"అని చెప్పి వెళ్ళింది. నీలిమకు విసుగ్గా అనిపించినా సరే అని తలూపింది.
బామ్మ వెళ్ళిన రెండో రోజే పక్కింటి రంగారావు గారు పెరటి గోడ దగ్గరకు వచ్చారు. ఆయనకి ఆ పెరట్లో ఉన్న పెద్ద మామిడి చెట్టు మీద కన్ను పడింది. ఆ చెట్టు కొమ్మలు తన ఇంటి వైపు వస్తున్నాయని, ఆ చెట్టును కొట్టేస్తే అక్కడ తన కారు పార్కింగ్ చేసుకోవచ్చని ఆయన ప్లాన్. నీలిమను పిలిచి, "అమ్మాయి! ఈ చెట్టు వల్ల మాకు ఇబ్బందిగా ఉంది, రేపు మనుషుల్ని పిలిపించి దీన్ని నరికించేస్తాను. ఇంట్లో పెద్దవాళ్లకి చెప్పు" అని కొంచెం గట్టిగా చెప్పారు.
నాకూ ఆ చెట్టు ఆకులు ఏరడం కష్టంగానే ఉంది, దీన్ని కొట్టేయటమే బెటర్ అని నీలిమ లోపల అనుకుంది. కానీ ఆ తర్వాత వేరే ధ్యాసలో పడి ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పడం మర్చిపోయింది.
ఆ రాత్రి నీలిమకు వింత అనుభవం ఎదురైంది. నిద్రలో ఉండగా కిటికీ బయట నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు, గుసగుసలాడుతున్నట్టు శబ్దాలు వినిపించాయి. తను కళ్ళు నలుపుకుంటూ పెరట్లోకి వెళ్ళింది. అక్కడ చంద్రుని వెలుగులో మామిడి చెట్టు కొమ్మలు ఒకదానికొకటి రాసుకుంటూ, మమ్మల్ని నరికేస్తారంట! మన బామ్మ ఉంటే ఇలా జరగనిచ్చేది కాదు కదా? అని బాధగా మూలుగుతున్నట్టు అనిపించింది. పక్కనే ఉన్న మల్లె తీగ కూడా మేము బామ్మ కోసం ఎన్ని పూలు పూయాలి అనుకున్నాం.. ఇప్పుడు మేము ఉండమా? అని వణికిపోతుంటే.. ఆ మాటలు విన్న మందారాలు, గులాబీలు కూడా అవును మేము కూడా అదే అనుకున్నాము అంటూ భయంతో వణికిపోతున్నట్టు కనిపించింది.
నీలిమకు ఒక్కసారిగా మనసు కలిచివేసింది. మొక్కలు నిజంగానే మాట్లాడుతున్నాయి! బామ్మ చెప్పింది అబద్ధం కాదు. మరుసటి రోజు ఉదయం రంగారావు గారు గొడ్డళ్లతో మనుషుల్ని తీసుకుని రాగానే, నీలిమ అడ్డుగా వెళ్లి నిలబడింది. "అంకుల్! ఈ చెట్టును నరకడానికి వీల్లేదు. మా పెద్దవాళ్లు కూడా వీల్లేదన్నారు. ప్రాణం ఉన్న ఈ చెట్టును చంపనివ్వను" అని ఖరాఖండీగా చెప్పేసింది. రంగారావు గారు ఆ చిన్నపిల్ల పట్టుదల చూసి వెనక్కి వెళ్ళిపోయారు.
ఆ సాయంత్రం బామ్మ ఊరి నుంచి రాగానే, నీలిమ పరుగెత్తుకుంటూ వెళ్లి బామ్మను హత్తుకుంది. పెరట్లో జరిగిన విషయమంతా చెప్పి, "బామ్మ! ఈ మామిడి చెట్టు కొమ్మలు పక్కింటి వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నాయట. నువ్వు భయపడకు, ఆ కొమ్మలను నేను జాగ్రత్తగా కత్తిరిస్తాను, కానీ చెట్టును మాత్రం ఎవరినీ తాకనివ్వను" అని బామ్మతో అంది. బామ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి. నీలిమలోని మార్పు చూసి మురిసిపోయిన బామ్మ, నీలిమను అక్కున చేర్చుకుంది. ఆ రోజు నుంచి నీలిమ కూడా బామ్మతో కలిసి మొక్కలకి ఆత్మీయ స్నేహితురాలిగా మారిపోయింది.
***
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.




Comments