top of page
Original.png

బంధాల సరిహద్దులు

#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #BandhalaSarihaddulu, #బంధాలసరిహద్దులు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Bandhala Sarihaddulu - New Telugu Story Written By Vasundhara Rani Munipalle Published in manatelugukathalu.com on 11/02/2026

బంధాల సరిహద్దులు తెలుగు కథ

రచన: వసుంధర రాణి మునిపల్లె 


రాజుగారికి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి శ్వేత ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొదట్లో అబ్బాయి వాళ్ల ఇంట్లో చిన్నచిన్న ఇబ్బందులు ఎదురైనా, భర్త అండగా నిలవడంతో ఇప్పుడు వాళ్లది బెంగళూరులో ఒక అందమైన కుటుంబం. వారికి మూడేళ్ల కొడుకు ఆర్యన్. శ్వేత భర్త సునీల్ చాలా మంచివాడు, ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ వారాంతాల్లో సరదాగా గడుపుతూ ఉండేవారు.


రెండో కూతురు రమ్య పెళ్లి విషయంలో రాజుగారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నో సంబంధాలు చూసి,  ఒక మంచి సంబంధం అని ఘనంగా పెళ్లి చేశారు. కానీ, బయటకు కనిపించేవన్నీ నిజాలు కావని రమ్యకు పెళ్లయ్యాక తెలిసింది. ఆమె భర్త కిరణ్ అందరికీ మంచివాడే కానీ, భార్య దగ్గరకు వచ్చేసరికి ఒక సాడిస్ట్. ఆమె ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, తను అనుకున్నది అనుకున్నట్లు జరగాల్సిందే. రమ్యను ఒక మనిషిలా కాకుండా యంత్రంలా చూసేవాడు.


భరించలేక రమ్య పుట్టింటికి వచ్చేసింది. ఖాళీగా ఉండటం ఇష్టం లేక బెంగళూరులో ఉద్యోగం సంపాదించి, శ్వేత వాళ్ల ఇంటికి దగ్గర్లో ఒక పీజీలో చేరింది.


అక్కడి నుండి సమస్య మొదలైంది. రమ్య ప్రతి శని, ఆదివారాలు శ్వేత ఇంటికి వచ్చేసేది. వారం అంతా ఒంటరిగా ఉండి బోర్ కొట్టడం వల్ల, అక్క కొడుకు ఆర్యన్‌తో ఆడుకోవడం ఆమెకు ఒక అలవాటుగా మారింది. ఆ మూడేళ్ల పిల్లాడితో గడపడం ఆమెకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చేది.


అయితే, శ్వేతకు మరియు సునీల్‌కు ఆ రెండు రోజులే సెలవు. అంతకుముందు ఆ రోజుల్లో వాళ్లు ప్రశాంతంగా గడపడమో లేదా ఎక్కడికైనా వెళ్లడమో చేసేవారు. ఇప్పుడు రమ్య రాకతో వాళ్ల ఏకాంతం దెబ్బతింటోంది.


అంతేకాకుండా, ఇంట్లో వాళ్లు తమలో తాము నవ్వుకుంటూ ఫ్రీగా ఉంటే, అది చూసి రమ్య తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను తలచుకుని ఎక్కడ తక్కువగా ఫీల్ అవుతుందోనన్న భయం శ్వేత దంపతులను వెంటాడేది. ఆమె ముందు మనస్ఫూర్తిగా నవ్వాలన్నా, ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకోవాలన్నా ఏదో తెలియని సంకోచం. రమ్య ఎక్కడ ఒంటరితనంతో కుంగిపోతుందోనని వాళ్లు తమ సంతోషాన్ని కూడా అణచుకోవాల్సి వచ్చేది. బయటకు వెళ్దామంటే రమ్యను వదిలి వెళ్లలేరు, తనని తీసుకెళ్దామంటే వాళ్ల ఏకాంతం ఉండదు.


ఒక ఆదివారం సాయంత్రం.. రమ్య ఆర్యన్‌తో ఆడుకుంటూ నవ్వుతోంది. శ్వేత కిచెన్‌లో కాఫీ కలుపుతూ కిటికీలోంచి వాళ్లను చూస్తోంది. సునీల్ పక్క గదిలో ల్యాప్‌టాప్ ముందు కూర్చుని ఉన్నాడు కానీ పని మీద ధ్యాస లేదు.


శ్వేత కాఫీ తీసుకుని సునీల్ దగ్గరకు వెళ్ళింది. సునీల్ నిట్టూర్పు విడిచి, "శ్వేతా! రమ్య పడుతున్న ఇబ్బంది నాకు అర్థమవుతోంది. కానీ నిజం చెప్పనా? ఈ రెండు రోజులు మన ముగ్గురం ప్రశాంతంగా గడపాలనిపిస్తుంది. మనం ఫ్రీగా ఉంటే తను తన జీవితం గురించి బాధపడుతూ ఎక్కడ లోగా ఫీల్ అవుతుందో అన్న టెన్షన్ తో మనం కూడా మనలా ఉండలేకపోతున్నాం. దీనివల్ల మన పర్సనల్ స్పేస్ మొత్తం పోయినట్లు ఉంది" అన్నాడు.


శ్వేతకు రమ్య అంటే ప్రాణం. కానీ భర్త చెబుతున్నది కూడా నిజమే. రమ్య తన బాధలో ఉండి, అక్కాబావలకు కలుగుతున్న ఇబ్బందిని గమనించే స్థితిలో లేదు. సునీల్ కొనసాగిస్తూ, రమ్య మన మీద ఆధారపడటంలా కాకుండా, తను తన సొంత జీవితాన్ని వెతుక్కునేలా ప్రోత్సహించాలి అని సున్నితంగా చెప్పాడు.


శ్వేత ఒక ప్లాన్ ఆలోచించి, మరుసటి వారం రమ్య రాగానే ప్రేమగా తన పక్కన కూర్చోబెట్టుకుంది. "రమ్య! ఈ వీకెండ్ సునీల్ కి నాకోసం, ఆర్యన్ కోసం కొంచెం పర్సనల్ టైమ్ కావాలని అడుగుతున్నాడు. అందుకే మేము బయటకు వెళ్తున్నాం" అంది.


రమ్య ముఖం చిన్నబోయింది. శ్వేత నెమ్మదిగా రమ్య చేయి పట్టుకుని, "చూడు రమ్య! నువ్వు మా ప్రాణం. కానీ నువ్వు కేవలం మా చుట్టూనే నీ ప్రపంచాన్ని నిర్మించుకుంటున్నావు. దీనివల్ల నీకు కొత్త స్నేహితులు దొరకడం లేదు. మన బంధం బాగుండాలంటే మనం ఎప్పుడూ కలిసి ఉండక్కర్లేదు, ఒకరి స్పేస్‌ని ఒకరం గౌరవించుకున్నప్పుడే ఆ బంధానికి విలువ ఉంటుంది. ఈ రెండు రోజులు నువ్వు నీ పీజీలోని స్నేహితులతో గడపడం నేర్చుకో" అంది.


రమ్యకి మొదట కొంచెం బాధ అనిపించినా, అక్క చెప్పిన దానిలో ఉన్న అంతరార్థం అర్థమైంది. తను పరోక్షంగా అక్కాబావల ఏకాంతానికి అడ్డు పడుతున్నానని, తన ఉనికి వల్ల వాళ్లు సంకోచిస్తున్నారని గ్రహించింది. "సారీ అక్కా.. నేను నా బాధలో ఉండి మీ గురించి ఆలోచించలేదు. నువ్వు చెప్పింది నిజమే, నేను నాకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకోవాలి" అని చిరునవ్వుతో చెప్పి పీజీకి వెళ్ళిపోయింది.


ఆ రోజు సునీల్ శ్వేతతో అన్నాడు, "శ్వేతా! నువ్వు రమ్యని బాధపెట్టకుండానే తనకి జీవిత సత్యాన్ని నేర్పావు. ఇప్పుడు మనకి ప్రశాంతత దొరికింది, రమ్యకి ఆత్మవిశ్వాసం దొరుకుతుంది."


ప్రేమ అంటే కేవలం దగ్గరగా ఉండటం మాత్రమే కాదు, ఎదుటివారి ఎదుగుదల కోసం అవసరమైనప్పుడు కొంచెం దూరాన్ని పాటించడం కూడా అని ఆ కుటుంబం గ్రహించింది.


*** 

సమాప్తం. 

వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె


నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.


నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.

ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.

bottom of page