మట్టి వాసన
- Gorthi Vani

- Apr 14
- 6 min read

Matti Vasana - Telugu Emotional Story | Gorthi VaniSrinivas
మట్టి వాసన - తెలుగు భావోద్వేగ కథ | గొర్తి వాణిశ్రీనివాస్ | ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 14/04/2026
విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న యువత…దేశం విలువ ఎప్పుడూ అర్థం చేసుకుంటారు?
“మట్టి వాసన” కథలో ఒక యువతి అనుభవించిన యుద్ధ భయానక దృశ్యాలు, జీవితం మీద కొత్త అర్థం, మరియు చివరికి స్వదేశం పట్ల కలిగిన ప్రేమ—మనసును కదిలించేలా ఉంటాయి.
“దేశాన్ని తిట్టొద్దు…”
అంటూ, దెబ్బలు తిన్నా అదే మాట చెప్పిన ఆమె ఎవరు?
గొర్తి వాణిశ్రీనివాస్ గారి మట్టి వాసన కథ మీ గుండెను కదిలిస్తుంది…
తూర్పు వెలుతురు మెల్లగా నగరంపై పరుచుకుంటోంది.
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన బస్సు నగరంవైపు దూసుకుపోతోంది. విమానం దిగిన ప్రయాణీకుల ముఖాల్లో అలసట కనిపిస్తోంది. కొందరు స్నేహితులకు సెండ్ ఆఫ్ ఇచ్చి బయల్దేరిన యువకులున్నారు. కిటికీ బయట తెల్లవారుతున్న ఆకాశాన్ని చూస్తున్నారు. మరికొందరు నిద్రలేమితో కళ్లుమూసుకుని కూర్చున్నారు.
కానీ బస్సు మధ్యలో కూర్చున్న కొందరు యువకులు మాత్రం ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు.
“కెనడా వెళ్లేందుకు వీసా వచ్చేసిందిరా! ఇంకొన్ని రోజుల్లో ఈ దేశం నుంచి బయటపడిపోతాం. ఈ దేశంలో ఉండటంకన్నా ఉరేసుకుని చావడమే మంచిది. పేదరికానికి పెట్టింది పేరు ఈ దేశం!”
అన్నాడు ఒక కుర్రాడు నవ్వుతూ.
అతని మాటలు కత్తికన్నా పదునుగా ఒకరి మనసుని చీల్చాయి.
ఒక్కసారిగా… ఒక చెయ్యి విసురుగా లేచి అతని చెంపపై చెళ్లున పడింది.
కుర్రాడు తూలిపోయాడు. కళ్ళజోడు కిందపడింది. పైపెదవి చిట్లి రక్తం కారింది.
“ఎవడ్రా కొట్టింది!” అంటూ అతని స్నేహితులు ఆవేశంగా లేచారు. బలమైన ఆ కుర్రాడిని అంత గట్టిగా కొట్టేంత శక్తి వున్నవాళ్ళు ఎవరూ అక్కడ లేరు.
వాళ్ళ ఎదురుగా పీలగా, శరీరం కృశించిన మనిషి ఉన్నాడు. బోడిగుండు. ఎముకల గూడులా కనిపించే శరీరం. అతను కొట్టే అవకాశం లేదు. కానీ అతను తప్ప ఎక్కడెవరూ లేరు.
“మావాడ్ని నువ్వే కొట్టావా?!” అడిగాడు యువకులు.
“హా…అవును” అంటూ ఆ గొంతు నీరసంగా పలికింది.
“మావాడ్నే కొడతావా? చూడ్డానికి పుల్లలా ఉన్నావు. ఎంతధైర్యం.” అంటూ అతన్ని కిందపడేశారు. తన్నడం మొదలుపెట్టారు.
ఆ వ్యక్తి గొంతులో నుంచి ఒక మాట మాత్రమే బయటపడింది.
“దేశాన్ని… తిట్టొద్దు…”
బస్సులోని ప్రయాణీకులు చూస్తున్నారు. ఏదో మూములు గొడవలే అనుకున్నారు. ఆ వ్యక్తిని కసిగా కొట్టడం, ఏ మాత్రం శక్తి లేని శరీరం రాడ్డుకి తగిలి కింద పడటం చూసిన ఒక మహిళ లేచింది.
“ఆగండి… ఆపండి! ఎందుకలా కొడుతున్నారు?” అని వారిని వారిస్తూ ముందుకు వచ్చింది.
ఆమె పేరు నాదిరా బేగం.
ఆమె కిందపడి మూలుగుతున్న ఆ మనిషిని లేపి సీట్లో కూర్చోబెట్టింది. తాగేందుకు నీళ్లు ఇచ్చింది.
“ఇంతమంది కలిసి ఒకరిని కొడితే ఎలా?” అని ఆమె గట్టిగా అడిగింది.
యువకులు మౌనంగా నిలబడ్డారు.
ఆ మనిషి నోటివెంట మాత్రం మళ్లీ అదే మాట.
“దేశాన్ని… తిట్టొద్దు…”
దెబ్బలు తింటూ కూడా అదే మాట. ఎవరైవుంటారు? కరుడుగట్టిన దేశభక్తుడా? యుద్ధంలో గాయపడ్డ జవానా? ఎవరు?! ఆ వ్యక్తి లేచి అతికష్టంమీద నిలబడి, పడిపోయిన సంచి తీసుకుని దులిపి ఒళ్ళో పెట్టుకుంటుంటే,
సంచిలోంచి ఒక ఫోటో జారి పడింది.
అది పదహారేళ్ళ అందమైన అమ్మాయి ఫోటో. సౌందర్యవతిలా ఉంది.
అది తీసి చూస్తూ.
“అబ్బ, ఎంత అందమైన అమ్మాయి ఫోటో. ఇది ఎవరు?” అని ఒక యువకుడు అడిగాడు.
ఆ వ్యక్తి ఫోటోని లాక్కుని,దగ్గరగా పొదువుకుని సంచిలో పెట్టబోతుంటే
నాదిరా బేగం తన పక్కన సీట్లో కూర్చోపెట్టుకుని
“ఈ అందమైన అమ్మాయి ఎవరు? నీ కూతురా?” అని అడిగింది.
చటుక్కున తలెత్తి చూసిన ఆ వ్యక్తి కళ్లలో నీళ్ళు తళుక్కున మెరిసాయి. …
మెల్లగా పెదవులు కదులుతూ…
“అది… నేనే…” అంది.
బస్సులో ఒక్కసారిగా నిశ్శబ్దం.
ఆ అందమైన అమ్మాయి… ఈ కృశించిన మనిషా?
ఆమె స్త్రీ గొంతు వినగానే అందరూ ఒక్కసారిగా ఒకరిమొఖాలు ఒకరు చూసుకున్నారు. అంతవరకూ ఆ వ్యక్తిని మగవాడనుకున్నారు. గొంతుబట్టి స్త్రీగా గుర్తించి ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు.
నాదిరా బేగం అడిగింది.
“నీ పేరు?”
“దుర్గ…”
“ఏమైంది నీకు? పోల్చుకోలేకుండా అయిపోయావెందుకు? నీకొచ్చిన ఆపద ఏంటి చెప్పు” అని లాలనగా అడిగింది.
దుర్గ కళ్లలో నీళ్లు చిప్పిల్లుతుండగా
ఆమె కథ మెల్లగా చెప్పుకొచ్చింది.
తల్లి చిన్నప్పుడే చనిపోయింది.
తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు.
పద్దెనిమిదేళ్ల వయసు. కాలేజీలో జరిగిన చిన్న గొడవ కారణంగా, చదువు మాన్పించి దుర్గని ఇంటికి తీసుకొచ్చాడు తండ్రి.
"నేను చదువుకుంటాను నాన్నా" అంది దుర్గ.
పరువు కోసం ఆలోచించి పెళ్లిచేయాలనుకున్నాడు. ఆ పెళ్ళి దుర్గకి ఇష్టంలేదు.
“కన్నతల్లి ఉంటే ఇలా చేయనిచ్చేదా?”
“వయసులో పెద్దవాడితో పెళ్ళా?”
అంటూ ఎన్నో మాటలు అన్నారు గ్రామస్తులు.
చిలుక, గుడ్లగూబ జంటగా ఉన్నారని స్నేహితురాళ్ళు అనడంతో దుర్గ మనసు విరిగిపోయింది. బాగా ఆలోచించి ఆ రాత్రి ఆమె పారిపోయింది.
ఊరి కుమ్మరి కొడుకు శ్యామ్ ఆమెకు సహాయం చేశాడు.
ఓ చీకటి రాత్రి రైల్వేస్టేషన్ కి వచ్చేసింది. రైలెక్కే క్షణంలో గ్రామస్తులు వెంబడించారు.
ఒక ఇనపరాడ్డు గాల్లో ఎగిరింది.
శ్యామ్ తలకు తగిలింది.
“అమ్మా…” అంటూ పట్టాల మీద కూలిపోయాడు.
రైలు తలుపు దగ్గర నిలబడి దుర్గ కేక వేసింది.
“శ్యామ్! త్వరగా రా..” అంటూ చేయి చాచి పిలిచింది.
అప్పటికే శ్యామ్ కిందపడిపోయాడు. రక్తం పట్టాల మీద చిమ్మింది.
అతను చివరిసారి తలెత్తి ఆమెను చూస్తూ.
“నువ్వు… దిగకు దుర్గా… వెళ్ళిపో……”
అని చెప్పి కళ్లుమూశాడు.
రైలు వేగంగా ముందుకు వెళ్లిపోయింది.
అక్కడి నుంచి దుర్గ జీవితం గాలిలో ఎగిరే ఆకులా మారిపోయింది.
నగరానికిచేరుకుంది…
దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న ఆమెను వెంబదించారు అల్లరి మూకలు. ఆమె తప్పించుకునేందుకు పారిపోయింది. ఓ అపరిచితురాలు తన ఇంటికి తీసుకువెళ్ళి ఆశ్రయమిచ్చింది…
ఆమె ఒక మార్వాడీ. పేరు సంజన. దుర్గ చెప్పినదంతా విని, ఆమె పరిస్థితికి సానుభూతి చూపించింది. ఆమెకు తన ఇంట్లో ఆశ్రయమిచ్చింది.
ఆ ఇంట్లో ఒక చిన్న పాప ఉంది.
ఆ పాప నవ్వు దుర్గకి కొత్త జీవితాన్ని ఇచ్చింది.
ఆమెను తన బిడ్డలా ప్రేమించింది. ఆలనా పాలనా చూస్తూ రోజులు గడుస్తున్నాయి. తనకొక దారి దొరికిందని దుర్గ సంతోషించేలోగా సంజన పెద్దకూతురు విదేశాలనుంచి ఫోన్ చేసింది.
“అమ్మా! నేను నెలతప్పాను. పనులు చేసుకోలేకుండా ఉన్నాను. ఎవరైనా సహాయానికి పంపవా” అని అడిగింది.
అప్పుడు దుర్గను కూతురి దగ్గరకు వెళ్ళమని బతిమలాడింది సంజన. దుర్గ ఒప్పుకుంది. అన్ని ఏర్పాట్లు వాళ్లే చూసి, ఆమెను విదేశాలకు పంపారు. ఒక సమస్యనుంచి మరో సమస్యలోకి సాగించే ప్రయాణమే జీవితం అని దర్గకు అప్పుడు తెలీదు. వెళ్ళిన కొద్దిరోజులదాగా అంతా కొత్తగా ఉంది.
దుర్గ మెల్లిమెల్లిగా ఆ వాతావరణానికి అలవాటు పడుతోంది.
ఒకరోజు…
ఆకాశం రెండుగా చీలిపోయిందా అన్నట్టుగా భీకర శబ్దం.
పేలుళ్ల శబ్దాలు నగరాన్ని కుదిపేశాయి.
ఇళ్లు నేలమట్టమయ్యాయి.
ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు.
లక్షలమంది ఒక్కసారిగా నిరాశ్రయులయ్యారు. ఏమైందో తెలీదు. దీనికి కారకులెవరో, ఎవరుబాధ్యత వహిస్తారో అర్థంకాని అయోమయం.
ఆ నరకంలో దుర్గ ఎన్నో అమాయక ప్రాణాలు కళ్లముందే కాలి పోవడం చూసింది.
సంజన కూతురి కుటుంబం మంటల్లో చిక్కుకుంది. బాలింతరాలి హాహాకారాలు విని, మిగిలినవాళ్ళు వద్దని వారిస్తున్నా మంటల్లోకి పరిగెత్తింది. వృద్ధురాలిని, తల్లీ బిడ్డలను రక్షించిబయటకు తెచ్చే క్రమంలో ఆమె ఒళ్ళు కాలింది. గాయాలకు చికిత్సకూడా అందని పరిస్థితి. ఒక ప్రత్యేక విమానం బయల్దేరింది. అందులో సంజన కూతురు కుటుంబం సురక్షితంగా తమ దేశం చేరుకుంది.
దుర్గ గాయాలతో అక్కడే ఉండిపోయింది. తనకు ఆశ్రయం ఇచ్చిన ఆ కుటుంబాన్ని రక్షించాననే తృప్తి కలిగింది.
ఆ కళ్ళతో ఎన్నో దారుణాల్ని చూసింది. తిండిలేక అలమటించిన పసివాళ్ళ మరణాలు, భయం గుప్పెట్లో ఎక్కువసేపు బ్రతకలేక బిడ్డల చేతుల్లో కన్నుమూసిన తల్లులు. శవాల గుట్టలు. వాటిమధ్య తానొక జీవచ్ఛవంలా మిగిలింది. బహుశా అక్కడ మిగిలిన మనిషి తనే కావచ్చు.
మారణహోమాన్ని చూసిన మనసు మోడైంది. యుద్ధం వలన ఎవరికి ప్రయోజనం? విషం చిమ్మే అశాంతి ఎవరి మనసులో పుట్టిందో. ఎన్నో ఏళ్ల పాటు నిర్మించుకున్న ఎత్తైన భవనాలు కూలిపోయాయి. వాటికింద సమాధైన జీవితాలకు సమాధానం ఎవరు చెబుతారు. కాలిపోయిన కారు వెనకాల తానొక బూడిదైన మానులా పడుంది దుర్గ.
కన్నీళ్ళను ఆవిరి చేసే దట్టమైన పొగనుంచి తప్పించుకుంటూ కొన్నిరోజులు గడిపింది. చివరకు ఒక నిర్ణయానికొచ్చింది. మరణం మనచేతిలో లేనిది.
కానీ చనిపోయేంతవరకూ జీవించాలి. ఇలా కాదు. తన శవానికి కూడా ఆత్మ గౌరవాన్ని కల్పించాలి. ఎలాగైనా తన ఊరు చేరుకోవాలి. ఆ క్రమంలో ఆమె తన అందమైన రూపాన్ని నాశనం చేసుకుంది.
జుట్టు నున్నగా గీసుకుంది.
ఎవరూ గుర్తుపట్టకుండా కనుబొమ్మలు తీసేసుకుంది.
మట్టి ఒళ్ళంతా పూసుకుంది. స్త్రీ రూపాన్ని గుర్తుపట్టలేనంతగా మార్చుకుంది.
మనిషి అనే గుర్తే లేకుండా మారిపోయింది.
చివరికి ఏదోలా అక్కడి నుంచి బయటపడింది.
దేశానికి తిరిగి వచ్చే ఒక విమానంలో చేరింది. పుట్టిన గడ్డమీద తుదిశ్వాస విడిచినా అది గర్వకారణమే అనుకుంటూ ఒక్కక్క మజిలీ దాటుకుంటూ సొంత దేశం చేరింది.
ఆమె చెప్పింది విన్నాక బస్సులో నిశ్శబ్దం అలుముకుంది.
ఇంతసేపూ నవ్విన యువకుల కళ్లలో ఇప్పుడు నీళ్లు వచ్చాయి. సౌకర్యాలన్నీ ఉన్నప్పుడు బతుకు విలువ తెలీదు. ఉనికే ప్రశ్నార్థకమైనప్పుడు ఊరి గాలి ఊపిరిలో
కొట్టుకుంటున్నప్పుడు, మన అనే భావన అన్నిటికన్నా గొప్పదనిపిస్తుంది.
బస్సు ఆగింది.
చాందినీ చౌక్.
నాదిరా బేగం దుర్గ చేతిని పట్టుకుంది.
“వచ్చేశావు దుర్గా….స్వేచ్చా భూమి మీదికి ఎగిరి వచ్చేసావు. ఇక నువ్వు ఒంటరిదానివి కాదు. ఇది నీ దేశం. మనమందరం సహోదరులం. ఒకరికొకరం కలసికట్టుగా ఉందాం ”
దుర్గ చెయ్యి పట్టుకుని అంది ఉద్వేగంగా
దుర్గ మెల్లగా బస్సు దిగింది.
రోడ్డుపక్కన ఆగి కిందకు వంగింది.
మట్టిని తీసుకుంది.
నుదుటికి పూసుకుంది.
ఎన్నాళ్ళ తర్వాత ఆ మట్టి వాసన ఆమె గుండెనిండా పీల్చుకుంది.
ఆమె కళ్లలో కన్నీళ్లు ఉప్పొంగి వచ్చాయి.
దూరంగా నాదిరా బేగం ఆమెను చూస్తోంది.
ఆ చూపులో మతం లేదు.
మనసే ఉంది. దుర్గ వైపు ఆప్యాయంగా చూస్తోంది.
“యుద్ధం మనిషిని జంతువుగా మారుస్తుంది…
మానవత్వమే అన్నింటికంటే గొప్పది…”
గాలిలో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది.
ఆ పతాకాన్ని చూశాక
చాన్నాళ్ళ తర్వాత దుర్గ కళ్లలో
బతకాలని ఆశ మళ్లీ కలిగింది.
మట్టి సుగంధాన్ని ఆస్వాదిస్తూ యువకులు కూడా ఆమె పక్కనే నిలబడ్డారు. విదేశాలకు వెళ్లాలనే వాళ్ళ ఆలోచనలు పరిపరి విధాల సాగాయి.
విదేశాలకు వెళ్లాలనే ఆలోచనతో నవ్విన యువకులు ఇప్పుడు నిశ్శబ్దంగా నిలబడ్డారు.
“వాళ్ళు వెళ్లాలనుకున్న దేశం… ప్రాణాల కోసం పరుగులు తీస్తున్న వాళ్ళ దేశమే అయి ఉంటే?”
తమ దేశాన్ని విడిచిపోవడం ఎంత సులభమో… తిరిగి చేరుకోవడం అంత సులభం కాదని వాళ్లకు ఇప్పుడు అర్థమైంది.
నాదిరా బేగం, యువకులు కలిసి దుర్గను వాళ్ళ ఊరికి చేర్చారు.
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కూతుర్ని చూసిన తండ్రి బావురుమని ఆమెను గట్టిగా హత్తుకున్నాడు.
చదువుకుంటున్న తన బిడ్డకు పెళ్లి చేయాలనుకున్న తన తొందరపాటు ఆలోచనను విరమించుకుంటున్నానని చెప్పాడు.
“నాన్నా, ఇంత దూరం తీసుకొచ్చింది వీళ్లే” అంది దుర్గ కృతజ్ఞతతో.
యుద్ధ వార్తలు విన్న గ్రామస్తులు దుర్గ దగ్గరకు చేరుకున్నారు. ఆమె పడిన కష్టాన్ని విని చలించిపోయారు.
“మనుషులమధ్య అడ్డుగోడలు కట్టేది మనుషులే… వాటిని కూల్చాల్సింది కూడా మనుషులే.” అన్నాడు ఒక యువకుడు.
ఆ మాటలు విన్న ఊరి పెద్ద శ్యామ్ మరణాన్ని తల్చుకుని నిట్టూర్చాడు. “క్రోధం ఎంత పనైనా చేయిస్తుంది. శాంతంగా ఆలోచించి ఉంటే శ్యామ్ బతికుండేవాడు. ఆవేశమే అనర్ధాలకు హేతువు.”అని బాధపడ్డాడు.
“సామరస్య వాతావరణంలో చర్చలు జరిగి, ఇకనైనా యుద్ధం ఆపేస్తే బాగుండు. మిగిలిన వాళ్ళన్నా ప్రశాంతంగా ఉంటారు. సరిహద్దులు దేశాలను విడదీస్తాయి… కానీ బాధ మనుషులను కలుపుతుంది.”అన్నారు యువకులు.
“యుద్ధాలు గెలిచిన దేశాలు ఎన్నో ఉన్నాయి…
కానీ మానవత్వం గెలిచిన రోజే ప్రపంచం నిజంగా గెలుస్తుంది” అని నిట్టూర్చాడు గ్రామ పెద్ద.
………………. శుభం ………
గొర్తి వాణిశ్రీనివాస్ గారి మరికొన్ని రచనలు:
గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)
నా పేరు గొర్తివాణి
మావారు గొర్తి శ్రీనివాస్
మాది విశాఖపట్నం
నాకు ఇద్దరు పిల్లలు
కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది
అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
రచనల మీద ఎంతో మక్కువతో
కవితలు, కథలు రాస్తున్నాను.
విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,
ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు
ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.
మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ
గొర్తివాణిశ్రీనివాస్
విశాఖపట్నం
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.








@SureshS-pp9sl
• 1 day ago
అద్భుతమైన కథ ఎంతగానో ఆకట్టుకుంది యుద్ధం ఒక ఉన్మాదం ప్రేమికులకు ఒక ఇరుకు గది సరిపోతుంది కానీ విరోధులకు ఈ ప్రపంచం సరిపోదు అన్న గుంటూరు శేషంద్ర శర్మ కవితా వచనం గుర్తుకొస్తుంది చాలా బాగుంది ఈ కథ
@SrinivasRella-f2o
• 1 day ago
మట్టి వాసన కథ చాలా బాగుంది మనసును కదిలించి మనిషిలో మానవత్వాన్ని మేల్కొల్పేలా మానవ హితం కోరేలా
@govindhu-z5i
•3 hours ago
అద్భుతం మేడం చాలా బాగుంది కళ్ళకి కట్టినట్లుగా ఉండదండి ధన్యవాదాలు 🫡🙏
@ChariSattenapali
•7 hours ago
చాలా బాగుంది మేడం గారు.. 🙏🙏💐💐
@venkaatvv1284
• 18 minutes ago
Vasthavaniki daggaraga sahajathvam tho kallaku kattinatluga rachinchina Gorthi Vani garu abhinandaneeyulu.